ఏం బతుకులో ఏమో!!!

సడ్లపల్లె చిదంబర రెడ్డి 
 
     కండ్లతో సూస్తావున్నట్లే యాబై యేండ్లలో ఈ జనాలు యంత నాజూగ్గా తయారయ్యిండారో నాకయితే నమ్మ బుద్దే అయితా వుండ్లేదు!!
     అపుడు నేనింకా సన్న పిల్లోడు!! మా బాయికి రెండు జతల ఎద్దులు కట్టి కపిల (మోట) తోల్తావుండ్రి. ఎద్దుల శర్మంతో కుట్టిండే కపిల బాన, గిలక మింద నుండి బాయిలోనికి ఇడిస్తే నీళ్లతో నిండుతుంది. దాన్ని ఎద్దుల మెడమీదుండే కాడిమానుకు కట్టిండే పెద్ద మోకు మింద కూకోని మనిషి ఎద్దుల్ని బారి లోనికి తోలల్ల(ఏటవాలుగా బావికి సమాంతరంగా ఉండే గుంతలాంటిదాన్ని బారి అంటారు) ఆ పని మా అప్పప్ప (అప్ప-నాన్న- తర్వాత అప్పలాంటి వాడు=అప్పప్ప)సేస్తావుండె. శ్యాద్యాలు సేసే జనాలకి తలమింద టువ్వాలు,ఒంటిమింద మిసీన్లొ కుట్టిన బనీను, కింద జాండుపొడువుండే సల్లడము!!(షెడ్డీ లాంటిది) అవే వాల్ల బట్లు. యండ పొద్దులో కష్టం సేసే టవుడు శమటకి నాని సినిగి   పోతావని, బనీను గూడా ఇప్పేసి ఉత్త పొయ్యితోనే పన్లు సేస్తా వుండ్రి.
 
    యాపొద్దన్నా సుట్టాలూరికో, జాత్తర్లకో పోవలిసొస్తే, ఉతికి గుడవలో దాసి పెట్టిండే అంగీని బుజం మీద ఏసుకోని ఆ ఊరి పొలిమేరదంకా పొయ్యి ఆడ తొడుక్కోని  పోతావుంద్రి.
    ఇంగ ఆడోల్ల బతుకు మరీ అద్దువాన్నము. అంతో ఇంతో బూములుందే కాపుదనమోల్ల(రెడ్డ్ల) ఆడోళ్లు మాత్రమే రవికెలు తొడుక్కోని, కింద పాదాల వొరుకూ సీర కట్టుకొంటా వుండ్రి. బీదా సాదా కూలిజనాలు మాత్రం మా ఊర్లో మాలోల్లు నేసిండే బారెడు పొడువు సీర గుడ్డనే శరీరానికంతా సుట్టుకొంటా వుండ్రి.(అట్లా జనాల్ని మీరు ఇవుడు టి.వి.ల్లో ఆఫిరికా దేశాల్లో సూడొచ్చు) ఇంగ పిల్లోల్లు ఏడెనిమిదేండ్ల వొరుకూ ఉత్తబెత్తలే తిరుగుతా వుండ్రి.
    బెంగళూరు నుంచి ఇందూపురానికి ఒచ్చే రోడ్లో,పెన్నేటి గట్లో వుండే మా ఊరికతే ఇంత మాత్రం ఉంటే?? మూలతట్టు తావుల్లో బూమీ ఆకాశమూ కల్సుకొనే సోటుండే జనాలు ఇంగ యంత అద్దువాన్నముగా వుండ్రో కదా అనిపిస్తుంది!!
    ఒగ దినం రాజా స్టేట్ నుంచి( అపుడు కర్నాటక ను రాజా స్టేట్ అని,మైసూర్ స్టేట్ అని పిల్చే వారు)మా మేన మామ అంజినప్ప వొచ్చిండాడు. అవుడు మా సిన్నాయన మోకుమింద   కూకోని కపిలి తోల్తా వుండాడు. తోలే తవుడ ఆయప్ప పిర్రని, మోకుకి ఆనిచ్చి కూకోందానికి అదంతా రాపిడికి రాసుకుపొయ్యి పుండయ్యింది. రగతము కారుతాఉంది. దాన్ని ఆడుండే కానగాకుల్తో తుడిసేసుకోని, రవ్వన్ని రెమ్మల్ని మోక్కీ పిర్రల్కీ మద్య ఇరికిచ్చుకోని మొండోని మాదిరీ ఎద్దుల్ని సైగజేసి కపిల తోల్తా వుండాడు.
     దాన్ని మా సిన్నమామ సూసి, “థూ థూ తు ఏం బతుకు బావా నీది!? పిర్రల మిందుండాల్సిన సల్లడాన్ని పైనికి మడిసిపెట్టి, పుందుమింద పుట్ర అన్నట్ల రగతాన్ని సేతులకి,కపిల మోక్కీ పూసుకొంటా మురుగుం పన్లు సేస్తా వుండావు?? ఆ సల్లడాన్ని తొడలకానా దిగబీక్కోనేకి అయ్యెల్లేదా??” అని బేజారు సేసుకోనె.
    దానికి మా సిన్నాయన” ఒరే నీకేమిరా!! సేనిలో వొరుకూ ఏటి నీళ్లొస్తాయి. మీరు మా మాదిరీ యముకులు ఇరగ్గొట్టుకోకుండా పంట్లు పండిస్తారు.మాకి అట్ల యాడ కుదురు తుందప్పా?? నాకుండేది ఒగ సల్లడము. అది సినిగి పోతే ఎవురు తెచ్చిస్తారు? తిరగ ఉగాది పండగ దంకా వీట్నే కాపాడుకోవల్ల!! పిర్రలకి గాయ మైతె ఏం జేస్తుంది!!గుంట గరగము,పసుపు కొమ్ము నూరి రొన్నాళ్లు పూసుకొంటే మేలయ్యి కొత్త శర్మం ఒస్తుంది” అన్సెప్పె.
     దానికి మా మామ ” ఆ పుడగోశెలుపు సల్లడం కోసరము ఉగాది పండగ ఒరుకూ కాసుకో వల్లో?? ఎవరికీ తెలీకుండా రెండు గంపలు జొన్నలో, రాగులో, కొర్రలో అంగడికి సాగిచ్చేకి గూడా నీకి శాతగాదో??” అనె.
    “నా గింజలకి నేనే దొంగ కావల్ల అని సెబుతావేమ్రా బాడ్కావ్! ఈ మాట్లు ఎవరన్న కాపుదన మోళ్లు ఇంటే- పాత సెప్పు తీసుకోని పునక(నెత్తి)మింద యంటికిలు ఊడిపొయ్యేదంకా తపా తపా అని కొడతారు. ఆ మాటనేకి నీకి సిగ్గి లేదేమిరా” అనె సిన్నగా నవ్వుకొంటూనే.
  “మీ ఏడుపు మీరు ఏడ్సండి నాకి యాల” అని మామ ఎల్లి పాయ.(ఈయప్ప కతలు శానా  ఉండివి మేము వాళ్లూరికి వలస పోయినంక అవన్నీ సెబుతా)
    ఈడ అసలైన సంగతి ఏమంటే…. ఆ కాలములో అన్ని పల్లెల్లో, అన్ని ఇండ్లల్లో ఏమి   జరుగుతా ఉండిందో దాన్నే మా మామ సెప్పిండాడు!!  అపుడు జనాలకి దుడ్లు పుట్టే మార్గాల్లేవు. శలామణీలో ఉండే రవ్వన్ని రూపాయలు గూడా తెలివైన జనాలుండే పట్నాలూ, నగరాల్లోనే–గూటానికి కట్టేసి మేపే జంతువుల మాదిరీ– నిల్సి పొయ్యిండివి!!
    అయినా మనిషి ఆశల పుట్ట!! కొత్తగా కనిపించేవి కొనల్ల. నోటికి రుసిగా వుండేవి తినల్ల. అందరికంట్లో పడేరకంగా బాగుండల్ల…అనే రకరకాల కోరికలు యంటాడతానే ఉంటాయిగదా!! ఊరిదేవర సేయల్లంటే, దేవునికి పెండ్లి సేయల్లంటే, జాత్రలకి పోవల్లంటే దుడ్లు కావల్ల గదా!!
   ఇట్ల దుడ్ల పనులన్నీ గొర్రెలు మేపే వొళ్లే ముందర పడి సేస్తావుండ్రి. యాలంటే పుట్టిన గొర్రి పిల్లల్లో పొట్లి పిల్లల్ని ఆర్నెల్ల కొగతూరి సంతలో అమ్మి దుడ్లు మొకము సూస్తావుండ్రి. మామూలు జనాలకి రూపాయలల్ని సూసే అవకాశమే ఉంటావుండ్లేదు. గుడిలో దేవినికి ఒగ గుడ్డి కాసు ఆరతి పళ్లెంలో ఏసేకి గూడా బగలాటమే!! ఎవుర్నడగల్ల? యట్ల సంపాదన సేయల్ల??
   ఈ దుడ్ల కోసరం కత్తిరింపులు యట్ల  జరుగుతా వున్నో సెప్పుతా సదవండి.
   ఒగ ఇంటి యజమాని గురించి ఒద్దు. సంపాదన సంసారమూ ఆయప్ప యేటుకి ఎదురుండేది కాదు. దాని జతకి ఉమ్మడి కుటుంబాలు. ఒగొగ కొంపలో ఇరవై నుంచి యాబై మంది దంకా జనాలు. ఒగొగుర్ది ఒగో లోకము!!
   ఆ ఇంటికొచ్చిన కోడల్లకి గాజులు,పొవుడౌర్లు,జాకీట్లు,తల నూనెలు, వక్క, ఆకు, కడ్లపొడి,ఇండ్లదగ్గరికి మోసుకొచ్చే పకోడాలట్లా సిరు తిండ్లు…శానా వాటిమింద ఆశ!! ఇట్లా ఆశల జనాలు ఇంట్లో ఒగరికి తెలీకుందా ఒగరు గింజలు, బెల్లము,గడ్డి గట్రా మారకం సేసి తీసుకొంటా వుండ్రి.(అప్పుడెక్కువగా వస్తుమారకం ఉండేది
   ఇంకా కొంద్రు సుట్టాల ఇండ్లలో గొర్రెలు, మేకలు, కోల్లు పాలకు మేపిచ్చి సంపాదన సేస్తా వుండ్రి.
   ఇంగ మగ జనాలకి బీడీలు,సిగరెట్లు,సినీమాలు, ఓటలు తిండ్లు(హోటలు తిండికి అలవాటు పడి మా ఊల్లో రెండు మూడు కుటుంబాలు ఆస్తులు మొత్తం పోగొట్తుకొన్న సంఘటనలున్నాయి) దుద్లు కావల్ల. వాళ్లు కల్లం నుండి గింజలు,  గానుగ నుండి బెల్లము ఇండ్లకి మోసేటవుడే పనులు సేసే జీతగాల్లకి సెప్పి దార్లు మాల్లించి అంగళ్లకు సేరుస్తా వుండ్రి. ఇంగొగు పక్క జీతగాల్లు రాతిరి పొద్దు కాయగూర్లు, టెంకాయలు, సేన్లకి సల్లే ఎరువులు దాసిపెట్టి దుడ్లు సేసుకొంటా వుండ్రి. ఈ దొంగ సరుకులు రూపాయికి పావళా గూడా బాళుతా వుండ్లేదు.
    ఇట్లా యవ్వారము దగ్గర దగ్గర  1980 వొరుకూ ఉమ్మడి కొంపలు ఇడిపొయ్యేదంకా జరిగి యాపారస్తులు బాగా బలిసి పొయ్యిరి.
   ఆ ఇరుమొయిలు తరువాత జనాల మద్య రూపాయల శలామణీ ఎక్కువాయ. రూపాయలు ఒడ్డీలకు ఇచ్చేది, దళ్లాళి యాపారము,లంచాలు రకరకాల గిలీటు యాపారాలు మొదలయ్యి, శమట కారిచ్చి కష్టం సేయకుండ దుడ్లు తోనే దుడ్లు సంపాదన సేసే యవ్వారం మొదలాయ!!
    ఇంగ పాత కాలములో మాల మాదిగోళ్ల బతుకు సెప్పేకి మాటలు సాలవు.
    నీల్లు కావలిస్తే ఊరిముందర సేద బాయి దగ్గరికి కుండలు తెసుకోనొచ్చి అంత దూరములో నిలబడతా వుండ్రి. “అమ్మా నీల్లు పోయండి  ఇంట్లో బిడ్దేడుస్తా ఉంది. అయ్యా నీళ్లు పొయ్యండి కూలికి పొయ్యేకి యాలవుతుంది.” అని అందర్నీ బంగ పోతావుండ్రి.వాళ్ళ  సేన్లలో పనులు సేసే వాళ్లకయితే రవ్వన్ని పోస్తా వుండ్రి గాని, లేకుంటే వాళ్ల మొకమే సూస్తా వుండ్లేదు.
    ఒగొగు దినము అదే పొద్దుకి– దురిబిచ్చంలో అదిక మాసం — అన్నట్లు గుడి పూజారి సాములోరు నీళ్లకొస్తే శూద్రోళ్లు కూడా వాళ్లు సేదే శేత్తాడు కూడా బాయి గిలకమింద నుంచి తీసుకోని దూరం పోవాల్సిందే!!
     ఆ సామి తాను తెచ్చిన తాడు గిలక్కి తగిలిచ్చి ఒగ బిందెడు నీల్లు సేత్తా వుండె. మొదటి బిందెతో అంతవరకూ శూద్రోళ్లు సేదిన గిలకని,బాయి అరుగునీ కడిగి ఆడే స్నానం సేస్తావుండె. అంటే గాదు ఆయప్ప తాడు బాయిమిందేసి గుడిలోనికి పొయ్యి మంత్రాలు సదువుకొంటా దేవునికి అలంకారము సేసిన పూలు,తులసీ ఆకులు తెచ్చి బాయిలోకే ఏస్తావుండె. యాలంటే దేవుడు అంటిన పూలు శానా పవిత్రం అయ్యినవంట. వాట్ని యాడజిక్కితే ఆడ పారేయగూడదంట!!
    అప్పుడు శానా పుణ్యాత్తుములు ఉండేవోల్లు. ఇంట్లో ఎనుము గాని ఆవుగాని ఈనితే దండిగా పుణ్యం రావల్లని మురబాలని బాయి లోకే పోస్తావుండ్రి.(అట్లయితే ఊర్లో అందరికీ దానం సేసినట్లేనంట!!). బాపనోళ్లకి కమసలి ఆశార్లకి ఇస్తావుండ్రి.
    పూజల పూలు,మురబాలు కల్సిన నీళ్లు తాగి రోగాలొస్తే ఊరి   ద్యావర్లూ,కలిశపూజలూ, దీపాలూ సేసి పాకు కాలుస్తా వుండ్రి.(పట్టుతో ప్రత్యేకంగా నేయించిన పాగా ను ఆవు నేతితో బాగా తడిపి ఇత్తడి పళ్లెంలో దేవుని ముందు నైవేద్యంగా వుంచి కాల్చి, కాలగా మిగిలిన కందెనవంటి దాన్ని నుదుటిమీద బొట్టుగా ధరించడం). దండిగా ముడుపులు కట్టుకొంటా వుండ్రి.
     దాన్నట్లిడిసి మాదిగ మాలోళ్ల కతలు సూస్తాము!!
     ఈళ్లు నీల్లకి నిలబడి నిలబడి ఎవరన్న దయతల్సి పోస్తే ఇంటికి మోసుకు పోతా వుండ్రి. ల్యాకుంటే వంకల్లోనో వాగుల్లోనో నించుకొస్తావుండ్రి.(నాకి ఇరవై ఏండ్లు వయసొచ్చే సరికి ఊరికి ఆనుకోని ఒగ బాయి తవ్వి కరెంటు మోటారు బిగిచ్చిరి.ఈ శేదబాయి దగ్గర జనాల్తో అడుక్కోనే దేమని ఒగరిద్దరు మాల మాదిగోల్లు ఆ బాయి దగ్గర తొట్టీలో తీసుకుపొయ్యేది మొదలు పెట్ట్రి.దాన్ని సూసిన యజమాని రెడ్దెమ్మకు కడుపుమండి తొట్టీని పేడతో నింపేది మొదలుపెట్టె– సూస్త్రేమన్నా !! మనుషుల బుద్దులు యంత బాగుంటాయో??)
     ముందే సెప్పింటిగదా? మేము కొత్తగా కొనుక్కొన్న ఇంటి ముందర తార్రోడ్డుకు తూరుపు దిక్కులోనే మాదిగ నారాయణప్ప గుడిశె అని! ఆయప్ప కొడుకే అశ్వత్తుడు. అశ్వత్తుడు పుడుతూనే వాళ్లమ్మ సచ్చిపొయ్యిండె. వానికి అవ్వుండె.ఆయమ్మ పేరేమో ఎవ్వురికీ తెలీదు. అందరూ నల్లమ్మ అనే పిలుస్తా వుండ్రి.
     ఊర్లో ఏడిదయినా రగడ జరిగితే సాలు– ఈ నల్లమ నల్ల గాన్నే అడ్దం పెట్టి తిడతావుండ్రి.నీళ్లకి ఈల్లు పడే అవస్తలు సూసి అస్వత్తునితో నేను అంటావుంటి “ఒరే నేను తాడు బకీటు తెస్తాను. రాతిరిపూట అందరూ నిద్దర పొయ్యినంక నీళ్లు సేది మీ ఇంటి నింద పోస్తాము” అని.
    దానికి వాడు ఒప్పుకొంటావుండ్లేదు. మా ఇంట్లో ఎవురూ లేనవుడు గడపదాటి లోపలికి రారా ఏమయితుందో సూస్తాము అన్నాగూడా వాడొస్తావుండ్లేదు. దానికి ఒగ పెద్ద కత సెప్పుతా వుండె!!
    ” మేము ఈ బూముకి మూల వాసులు. అందుకే మాజనాన్ని ఆది ఆంద్రులు అని పిలుస్తావుండ్రి.తాజకీయం ఆయప్పగారు మమ్మలి మేము మర్సిపోవల్లని”అరిజనులు” అనే పేరుపెట్టి నాటకాలు ఆడతావుండారు.
   పూర్వకాలంలో ఒగాయప్ప ఉన్నంట! ఆయప్పకి ఇద్దరు పెండ్లాములంట. పెద్దపెండ్లాముకి ఇద్దరు కొడుకులంట.వాల్లలో పెద్దోడు మాదిగోడంట! సన్నోడు మాలోడంట!! అపుడింకా జనాలకి బూములు దున్ని పంటలుపండిచ్చేది తెలీదంట. ఈ మాల మాదిగపిల్లోల్లది జీవాలు మేపే పనంట.
   పిరికి జనాలయితే బయంతో గుంపులు గుంపులుగా వుంటావుండ్రంటకదా. ఈల్లయితే శానా దైర్యమయినోళ్లంట. కష్టజీవులంట.అందుకే ఒగరిజత ఒగరు పట్టకుండ వాల్లకి ఇష్టమైన దిక్కికి పశువులు తోలుకు పొయ్యి మేపుకొస్తా వుండ్రంట.
   సిన్న పెండ్లాముకి శానా ఏండ్లకి ఒగ కొడుకు పుట్నంట. ఆయమ్మకి ఆ పిల్లోడంటే శానా ప్రాణమంట. వాన్ని మాల మాలమాదిగ పిల్లోల్ల మాదిరీ పుశువులెంట పంపగూడదు, నీడలో కూకోని సుకుంగా బతికే ఉపాయము ఎదకల్ల అని అనుకొన్నంట.
     ఒగదినము ఎవరూ లేంది సూసి,ఒగ గడ్డం స్వామిని పిలిపిచ్చి ఒగ ఆవుదూడని పట్టిచ్చి మనసులోని మాట సెప్పినంట. ఆ స్వామి కండ్లు మూసుకోని శానాపొద్దు ఆలోశన సేసి ఆయమ్మ సెవిలో గుసగుసా అని ఉపదేసికం సేసినంట.
   ఉన్నట్లుండి ఆయమ్మ మొగునికి ఆరోగ్యం సెడిపాయనంట. కండ్లు తెరీకుండ,నోటిమాట రాకుండ, కాళ్లూ సేతులూ కదిలిచ్చుకుండా అయిపాయనంత. అవుడు సిన్న పెండ్లాము,ఆయమ్మ బిడ్డ నెత్తీ నోరూ బాదుకొంటా గొళో అని ఏడ్సబట్రంట. పెద్దపెండ్లాము గాబిరి పడి సెయ్యీ కాలాడక రవ్వంతసేపు నిలబడి, కడాకి గడ్డము స్వామిని పిల్సుకొచ్చినంట.
    ఆయప్ప నాడీ పట్టి,యదమింద సెయ్యేసి,తితులూ వారాలూ నచ్చత్తరాలూ లెక్కబెట్టి, పెద్దపెండ్లామును దగ్గరికి పిల్సి సేయాల్సిన పనంతా పూస గుచ్చినట్ల సెప్పినంట. అపుడు పెద్ద పెండ్లాము తన కొడుకుల్ని పిల్సి ….” ఒరే నా బిడ్దల్లారా!! మీ నాయనికి ఆరోగ్యం సెదిపొయ్యింది. అది గ్రహాలు సేసిన సెడుపంట. దాన్ని అంతం సేసేకి నేను మన ఇంటికి ఉత్తరం వాకిలి తెర్సి నెట్టగా ఏడు ఆమడలు దూరం పోతాను. ఆడ ఏడు వంకలు అడ్డమొస్తాయి. వాట్ని దాటినంక ఏడు మర్రిమానులుంటాయి. వాట్నెక్కి కొమ్మలమిందే పోతే దెబ్బయ్యి అడుగుల గుట్ట సిక్కుతుంది. దాని ముందర ఒగ గుడి. గుడుముందర ఒగ కోనేరు. దాంట్లో గ్రాచారాలు కడిగే నీళ్లుంటాయి. ఆ నీళ్లలో ఏడు సార్లు మునిగి ఒంటిమింద నూలు పోగుకూడాల్యాకుండా బయటికొచ్చి, గుడిలో వుండే దేవతని ఏడుసార్లు ప్రదచ్చిన సేయల్ల. ఆ తల్లి సేతిలో ఒగ బంగారు బరిణె వుంటుంది. దాంట్లో ఈబూతి తీసుకోనొచ్చి మీ నాయిన శరీరానికి రాస్తే రోగము నయమవుతుంది. దీన్నంతా నేను దిగంబ్ర శరీరముతో సేస్తాను. ఇది ముగిసేవొరుకూ మీరు మన ఇంట్లేకే కాదు ఊరిలోపలికి గూడా అడుగు పెట్టగూడదు. అన్నీ సక్కబడినంక నేనే మిమ్మల్ని పిలుస్తాను ” అని సెప్పి పొయ్యింది.
      మాయమ్మ సెప్పిన మాటకి కట్టుబడి మేము ఊరికి బయటే నిల్సిపోతిమి. ఉత్తరానికి పోయిన మాయమ్మ ఒచ్చిందో రాలేదో మాకి తెలీదు. మా నాయిన సచ్చినాడో బతికినాడో తెలిసేకి మాకి వూర్లోకి ప్రవేశము లేదు. మా సిన్నమ్మ కొడుకులు మాత్రం పెరిగి కోమటోల్లయినారంట. వాళ్లే అందరికన్నా శ్రేష్టులు అని సాటుకోని నీడలో కూకోని అంగళ్లు పెట్టుకోని కడుపులోని సల్ల కదలకుండ యాపారాలు సేసుకోని బతుకుతా ఉండారంట.” అని సెప్పె అస్వత్త.
   అపుడు నా వయస్సు 8–9 మద్య ఉండొచ్చు. ఆయప్ప నాకన్న మూడు నాలుగేండ్లు పెద్దోడు. ఆయప్ప సెప్పిందంతా యిని నేను పకా పకా నగితి. “యంత యెర్రిజనాలప్పా మీరు!! ఇదంతా నిజమే అనుకోని ఇన్నేండ్లనుండి ఊర్లకి దూరమయ్యి బంగారట్లా బతుకుని నాశనం సేసుకో నుండారు” అని అంటి.
  ” ఏమన్నా అట్లంటావు?? ఎవురు యంతకి బతికినా బంగార్ని పుటం పెట్టుకోని తినరు. మేము సచ్చిన జీవాల నంజిరిని తినేదీ బతికేకే! మీరు సంగటిముద్దలు గతికేదీ బతికేకే!! ఈ బతుకులు ఆరినంక కడాకి అందరూ సేరాల్సింది మూడడుగుల గుంతకే!!!”
    “మా నాయన్ని బతికించల్ల, అని నిజమైన ఆలోశనతో పోయిన మాయమ్మ యాపొద్దుటికైనా తిరిగొస్తుంది. మమ్మల్ని జనాల మద్యాకి పిలుస్తుంది. మాయమ్మ పేరు సత్తెక్క. సత్తెక్కంటే సత్యము. సత్యానికి సావు లేదు!!” అని గంటకొట్టినట్ల సెప్పుతావుండె.
     ఈ జనాలవి  ఏం బతుకులో ఏమో?? నాకయితే సీమంత గూడా అర్తమయితా వుండ్లేదు!!

మీ మాటలు

 1. ఇంచుమించు ఇలాంటి కథలే మా వూరివీను. ఫరవాలేదు చాలా దూరమే వచ్చామనిపిస్తుంది.
  “అమ్మా నీల్లు పోయండి ఇంట్లో బిడ్దేడుస్తా ఉంది. అయ్యా నీళ్లు పొయ్యండి కూలికి పొయ్యేకి యాలవుతుంది.” అని అందర్నీ బంగ పోతావుండ్రి.” ఇంచుమించు ఇలాగే వుండేది మా వూర్లో పరిస్థితి. అయితే ఈ మధ్య మా అమ్మ చెప్పింది వింటే నాకు నవ్వాగలేదు.

  గత ముడేళ్ళనుండి వర్షాలు లేక మా వూరి చేదబావి, బోరు బావులు చివరికి ఎప్పుడూ ఎండని వ్యవసాయ బావులు కూడా ఎండిపోయాయి. చిత్రంగా మాదిగపల్లెలో వేసిన బోరులో మాత్రం నీళ్ళు వస్తున్నాయట. మా వూరి శూద్రులు మంచి నీళ్ళకు అక్కడికి వెళుతుంటే వాళ్ళు వీళ్ళని తిడుతున్నారట!

  అందుకే నాకు అప్పటి రామరాజ్యం కంటె ఇప్పటి ప్రజారాజ్యమే ముద్దు.

  అప్పటి ఈ కథలు ఇంకా ఇంకా రాయన్నా.

 2. ప్రసాద్ చరసాల గారు భయంకరమైన గతాన్ని ఇప్పటి తరానికి చెబుదామని క్రమ పరిణామాన్ని వివరిద్దామని!! మీ స్పందనకు ధన్యవాదాలు.

 3. ధన్యవాదాలండి ప్రసాద చరసాలగారు

 4. నిశీధి says:

  బ్రతుకు విషాదాలని ఇంత అందంగా చెప్పడం మీకే సాధ్యం .

  • నిశీధి గారూ రాసేటప్పుడు ఏమి అనిపించదు కానీ రాసి చదివేటప్పుడు నాకే తెలియకుండా కళ్ళలో నీరు కారుతాయి.మీ అవగాహనకు ధన్యవదు.

  • ధన్యవాదాలండి నిశీధి గారు ,విశ్వనాథ రెడ్డిగారు

 5. m.viswanadhareddy says:

  నేను కపిలి తోల్తిన సా .. మా చుట్టుపక్కల ఎద్దులు పట్టే దాన్లో మేపే దాన్లో మా నాయనే పుడింగి .. మోట .. మా నాయన ..తోల్తా వుంటే .. అది చూస్తా మైమర్సి పోయేవాడ్ని.. ఎప్పుడు మా యమ్మ బాయికాడికి సద్ది ఎత్త కోస్తాదా .. మోట దిగి సద్దికి నాయన గుంత కుసోపోతడా .. పిర్ర మోకు పైన .. పెట్టి మోట తోల్దామా .అని ఎదురు చూసివాడ్ని.. ఇప్పుడైతే .. కాన్వెంట్ నా మనవరాలికి .. మనవడికి … మోట కపిలి బాయి మోకు జాతి
  ములుకర్ర … బాన.. బారి .. వడ్లు .. తొలిక .. కోడివిలి… రోకలి ఇసుర్రు రాయి …గురించి చెప్ప పొతే .. ఏంది గ్రాండ్ పా .. నీ సోది .. సెల్లులు చెవుల్లో పెట్టుకొని ఆడు ఒక మూల ఈ పాప ఒక మూల … వాళ్ళ ఒంటరి … స్వర్గంలోకి దూరి పోయిరి .. ఏమి సెద్దామ్ సా …

 6. m.viswanadhareddy says:

  మన్నించాలి .. జాతి కాదు జాటి (ఎద్దులని అదిలించడానికి వాడే కర్ర )

 7. విశ్వనాథ అన్నా నీతో మాండలికంలో మాట్లాడాలని అయినా ఇక్కడ సాధ్యపడ్డం లేదు. అయిన మనం గతాన్ని నెమరు వేసుకోవడంలో తప్పులేడుకడ!! మరల కలుద్దాం.

మీ మాటలు

*