దాశరథి రంగాచార్య – తెలంగాణ సమాజపు మోదుగుపువ్వు

  • ఎన్ వేణుగోపాల్

 

దాశరథి రంగాచార్య (1928-2015) మరణంతో తెలంగాణ సాహిత్య ప్రపంచం, తెలుగు మేధో ప్రపంచం ఒక బహుముఖ ప్రజ్ఞాశాలినీ ఆలోచనాపరుణ్నీ ప్రజాజీవితాన్ని అద్భుతంగా చిత్రించిన రచయితనూ కోల్పోయింది. ఎనబై ఏడు సంవత్సరాల నిండు జీవితంలో, డెబ్బై సంవత్సరాలకు మించిన సామాజిక జీవితంలో, కనీసం ఆరు దశాబ్దాల రచనలతో ఆయన తెలంగాణ సామాజిక జీవితానికీ, తెలుగు సాహిత్యానికీ అసాధారణమైన సేవలందించారు. చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, మాయజలతారు, రానున్నది ఏది నిజం, పావని, నల్లనాగు, అమృతంగమయ నవలలు, ఉమ్రావ్ జాన్ వంటి నవలల అనువాదం, కథల అనువాదం, కవిత్వం, వ్యాసాలు లాంటి రచనలు, జీవనయానం ఆత్మకథ, బుద్ధుడి జీవితచరిత్ర మాత్రమే కాక, రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తులు, వేదాలు అన్నిటినీ ఒంటి చేత్తో తేటతెలుగులో రాసి, పదహారు వేల పేజీల పైన రచనలు చేసిన రంగాచార్య ఏ కోణం నుంచి చూసినా విశిష్టమైన రచయిత. ముఖ్యంగా నవలా ప్రక్రియ ద్వారా ఇరవయో శతాబ్ది తెలంగాణ జనజీవనానికి, అప్పటి ప్రజా పోరాటాలకు అద్దంపట్టిన మహా రచయిత ఆయన.

అంతటి విస్తారమైన జీవితానుభవం, ఆచరణ ఉండి కూడ దాశరథి రంగాచార్య రెండు విరుద్ధ ప్రకృతుల సమ్మేళనం అనిపిస్తుంది. ఆలోచనలలోనూ ఆచరణలోనూ చివరికి ఆహార్యంలోనూ కూడ ఆధ్యాత్మిక, ఆస్తిక, మత భావనలు ఒకవైపు. తనను తాను మార్క్సిస్టుగా చెప్పుకుంటూ, మార్క్సిజం ప్రేరణతో, కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో సాగిన ప్రజా ఉద్యమాన్ని నిజాయితీగా అక్షరబద్ధం చేయడం, ఏ రాజ్య వ్యతిరేక ప్రజా ఉద్యమానికైనా తన మద్దతు ఇవ్వడం మరొకవైపు. అది వైరుధ్యమా, విరుద్ధ భావాల మధ్య సమన్వయమా? ఆయనే చెప్పుకున్నట్టు మనిషి, మానవత్వం, సమానత్వం తన ప్రాథమిక లక్ష్యాలుగా మతం, ఆధ్యాత్మికత, ప్రత్యేకించి వేదాలు కూడ సమానత్వాన్నే బోధించాయని నమ్మినందువల్ల, ఆ నమ్మకాన్ని నిరూపించడానికి ప్రయత్నించారా? తాను ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిని కాదని అంటూనే, తాను మార్క్సిస్టునని, మార్క్స్ మహర్షి అని అనడం ఆయనలో వైచిత్రికి నిదర్శనాలు.

పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత ఖమ్మం జిల్లా చిన్నగూడూరులో శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టిన దాశరథి రంగాచార్య పన్నెండో ఏట ఖమ్మంలో పాఠశాల విద్యార్థిగా నిజాం వ్యతిరేక ఉద్యమంలో భాగంగా సమ్మె చేయించి, పాఠశాల నుంచి బహిష్కృతులయ్యారు. హైదరాబాదు రాజ్యంలో మరెక్కడా పాఠశాలల్లో చేర్చుకోగూడదని ఉత్తర్వులతో ఆయన చదువు ఆగిపోయింది. “నాకు పాఠశాల విద్య లేదు. గురువుల వద్ద చదవలేదు” అని ఆయనే చెప్పుకున్నారు. ఈ రాజకీయాభిప్రాయాలను సహించని తండ్రి ఆయనను ఇంటి నుంచి గెంటేశారు. ఒకరకంగా గోర్కీ లాగ ప్రజాజీవితమే, ప్రజాఉద్యమ భాగస్వామ్యమే రంగాచార్య మేధాశక్తికీ సృజనశక్తికీ పదును పెట్టాయి. అన్న, ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య (1925-1987) అనుచరుడిగా రంగాచార్య నిజాం వ్యతిరేక ప్రజాఉద్యమంలో కార్యకర్తగా మారారు. వేరువేరు కారణాలతోనైనా, వేరువేరు భావజాలాలు గల కమ్యూనిస్టు పార్టీ, స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజం నిజాం వ్యతిరేక ప్రజా ఉద్యమంలో భాగస్వాములైనందువల్ల ఆ ఉద్యమ కార్యకర్తలలో కూడ కొన్ని ప్రగతిశీల, ప్రజాస్వామిక భావాలు, కొన్ని మతవాద, అప్రజాస్వామిక భావాలు కలగలిశాయి. ఆంధ్ర మహాసభ చీలిక (1944) తర్వాత ఆయా కార్యకర్తల భావజాలాలలో కొంత స్పష్టత వచ్చినప్పటికీ, కొంత గందరగోళం తదనంతర పరిణామాలలో కూడ కనిపిస్తుంది. ముస్లింలు భారతీయులేననీ, భారతీయ కళా సంస్కృతులకు వారు ఎంతో దోహదం చేశారనీ, ఒక ముస్లిం రాజు ప్రజల మీద సాగించిన తప్పుడు పనులను వెయ్యి సంవత్సరాల ముస్లిం పాలనకు అంటగట్టగూడదనీ చాల సమన్వయపూరితమైన వ్యాఖ్యలు చేస్తూనే, తమ పోరాటం “తురక రాజుకు వ్యతిరేకంగా”నని రంగాచార్య రాయడం ఈ గందరగోళం ఫలితమే. నిజాం ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కొద్దికాలంలోనే పోరాట నాయకత్వం పట్ల కూడ ఆయనకు విశ్వాసం సన్నగిల్లింది. ఆయనే చెప్పుకున్నట్టు “ఈ వ్యవస్థలో త్యాగానికి స్థానం లేదని తేల్చుకుని” “స్వయంకృషితో రెండు డిగ్రీలూ రెండు డిప్లొమాలూ సాధించి” హైదరాబాద్ మునిసిపల్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరి 1988లో పదవీ విరమణ చేశారు.

పోరాట కాలంలో భారతీయ సాహిత్యమంతా పనికిరానిదని ఈసడించుకున్నామనీ, కాని పోరాట అనంతరం ఆ సాహిత్యాన్ని చదవడం ప్రారంభించి ఆకర్షితుడినయ్యాననీ ఆయన రాశారు. ఈ సమయంలోనే 1960ల మొదట్లో వచన రామాయణం, వచన భాగవతం రాశారు. 1966 తర్వాత నవలలు, కథలు, వ్యాసాలు రాయడం, అనువాదాలు చేయడం ప్రారంభించారు. వచన మహా భారత రచనను 1962లో ప్రారంభించి 1993లో పూర్తి చేశారు. వేదాలను తెలుగులోకి తీసుకురావాలనే కోరికతో 1995లో రుగ్వేదంతో ప్రారంభించి 2008 నాటికి చతుర్వేదాలనూ తెలుగులోకి తెచ్చారు. ఈ మధ్యలో ఉపనిషత్తులను కూడ తెలుగు చేశారు. బహుశా రామాయణం, మహాభారతం, భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు అన్నిటినీ అనువదించిన/రాసిన ఏకైక రచయిత ఆయనే కావచ్చు.

ఆ ఆధ్యాత్మిక రచనల కోసం, అందులో ఆయన ప్రచారం చేసిన హేతువిరుద్ధ భావాల కోసమూ ఆయనను గౌరవించేవాళ్లు కూడ ఉండవచ్చు గాని, 1930ల నుంచి 1950ల దాకా తన జీవితాన్ని యథాతథంగా, కళాత్మకంగా చిత్రించినందుకు తెలంగాణ సమాజం ఆయనను గుర్తు పెట్టుకుంటుంది. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రారంభించి అసంపూర్ణంగా వదిలిన తెలంగాణ సంక్షుభిత జనజీవన చిత్రణను ఆయన కొనసాగించారు. ముఖ్యంగా చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, మాయజలతారు నవలల్లో ఆయన గడీల దౌర్జన్యాలను, రైతు కూలీల మీద, ఆడబాపలమీద, సబ్బండవర్ణాల మీద దొరల దుర్మార్గాలను, రజాకార్ల దాడులను, నిజాం నిరంకుశత్వాన్ని, ప్రజల పోరాటాలను అత్యద్భుతంగా చిత్రించారు.  తెలంగాణ నుడికారపు సొగసును తెలుగు పాఠకుల అనుభవానికి తెచ్చారు. మానవ స్పందనలను, ఉద్వేగాలను స్వచ్ఛంగా, స్పష్టంగా పట్టుకున్నారు.

1940లో ప్రారంభమైన రాజ్య వ్యతిరేకతనూ, ఆధిపత్యం మీద ధిక్కారాన్ని చివరివరకూ నిలుపుకున్నారు. 1990ల మధ్య నుంచి దాదాపు 2010 దాకా హైదరాబాదులోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రభుత్వ అక్రమాలకు వ్యతిరేకంగా సాగిన ప్రతి ఆందోళనలో ఆయన సంతకం ఉంది.

దాశరథి కృష్ణమాచార్య లాగ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించకపోయినా, ఈ ఉద్యమం వల్ల ప్రజా తెలంగాణ ఏర్పడబోదని, అధికారం ఒక పాలకవర్గ ముఠా చేతినుంచి మరొక ముఠా చేతికి మారుతుందని ఆయన పదే పదే అన్నారు. ఫజలలీ కమిషన్ సూచనను పాటించి 1956లోనే తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసి ఉండగూడదని, తెలంగాణకు అన్యాయం జరిగిందని అంటూనే, ఆ అన్యాయంలో “రెండు వైపుల వాళ్ల బద్మాషీ ఉంది” అని రెండు ప్రాంతాల పాలకవర్గాలనూ తప్పు పట్టారు. కేంద్ర పాలన నడుస్తున్నప్పుడు, ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఏం చేయగలుగుతుందని అన్నారు.

ఆయనలో, ఆయన రచనలో ప్రశ్నించవలసినవీ, చర్చించవలసినవీ, బహుశా తిరస్కరించవలసినవీ కూడ ఉండవచ్చు గాని, ఆయన తెలంగాణ సమాజం పూచిన మోదుగుపువ్వు. దానికి నల్లని తొడిమా ఉంది, ఎర్రెర్రని పూవూ ఉంది. వసంతోత్సవ వేళ సమాజం మొత్తాన్నీ రంగుల్లో ముంచెత్తే శక్తీ ఉంది.

 

మీ మాటలు

  1. కన్నెగంటి అనసూయ says:

    దాశరధి వంటి మహా మనీషి గురించి తెలియని ఎన్నో విషయాలను తెలియపరిచారు వేణుగోపాల్ గారు..ధన్యవాదములు..కన్నెగంటి అనసూయ

  2. Dr.Vijaya Babu, Koganti says:

    ఒక అసాధారణ ప్రజ్ఞా శీలి . మహా మేధావి మహా మనిషి కి మన్సస్ఫూర్తి యైన నివాళి . మీతో పాటు మా అందరిదీ కూడా.

  3. Thirupalu says:

    ఒక తెలుగు కవి, పండితుని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  4. చందు తులసి says:

    మహాకవికి సరైన నివాళి….తెలంగాణ సమాజం కోసం….తెలుగు భాష కోసం పరితపించిన సాహితీ యోధుడు.

  5. ఆర్.దమయంతి. says:

    మా తెలుగు మహా పండితునికివే నా నివాళులు.

  6. uma bharathi says:

    దాశరధి గారి నవల ‘చిల్లరదేవుళ్ళు’ సినిమాగా రూపొందించే సమయంలో, కాకతీయ పిక్చర్స్ వారితో, అయన మాఇంటికి వచ్చారు… ఆ నవలలోని కథానాయకి దొరబిడ్డ ‘మంజరి’ పాత్ర వేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. ఆయన్ని అలా కలవడం కూడా అదృష్టమే…. ఆ మహాకవి, అంతటి గొప్ప పండితునికి ఇదే నా నివాళి….
    కోసూరి ఉమాభారతి

  7. Saradhi Motamarri says:

    Venugopal garu, to my view, he has been a living legend. Whether he is talking about Vedas, scriptures or political views, he is sincere and not influenced by any personal benefits.

    He hasn’t given priority to literary technique, but he himself put them as sociological novels. Unfortunately, many current generations didn’t read to understand the political climate under the Nizam rule and how the people have suffered. Unless someone twists the history, the coastal districts escaped from this tyrant rule as the Nizam gave that part of his regime to the British.

    Presenting him as just a Telugu writer or Telangana, it is an understatement. He is much more. Just read his ‘vedam jeevana nadam,’ to understand his under currents. Of course, some of his later works suffered with typos, as a person, he tremendously contributed.

    While translating, I believe, I tried to convey the original as close as possible, and in case he wants to say his interpretation, he used to write under, ‘aalochanamrutam.’

    In my view, he is a man of the world. My heartiest tributes to him.

  8. johnson choragudi says:

    వర్తమాన తెలుగు సృజనకారుల్లో దాశరధి రంగాచార్య – సంపూర్ణ మానవుడు. ఆయన జీవితంలో కాలం ఒక వర్తులం (సర్కిల్) గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళలో చాల మంది (మి) అర-సున్నాలే! – జాన్సన్ చోరగుడి

  9. దేవరకొండ says:

    “….ప్రజా తెలంగాణ ఏర్పడబోదని, అధికారం ఒక పాలకవర్గ ముఠా చేతినుంచి మరొక ముఠా చేతికి మారుతుందని ఆయన పదే పదే అన్నారు”… ఇది అక్షర సత్యం. దాశరధి రంగాచార్య స్మృతికి కమనీయమైన నివాళిని అందించిన వేణుగోపాల్ గార్కి కృతజ్ఞతలు.

  10. rajaramt says:

    వేణుగోపాల్ గారు మీ రచన ఆ మహా రచయిత భావజాల ఆలోచన విధానాన్ని దర్శింప చేసింది

  11. Dr. Vani Devulapally says:

    వేణుగోపాల్ గారు ! దాశరధి గారికి మీ నివాళి బావుంది ! తెలంగాణా వైతాలికుడికి మా హృదయపూర్వక నివాళి!

  12. vasavi pydi says:

    మహానుభావులు శ్రీ దాశరధి గారికి నివాళి .

  13. N Venugopal says:

    చిన్నగూడూరు ఖమ్మం జిల్లాలో ఉందని పొరపాటున రాశాను. ఎందువల్లనో నా మనసులో అలా జ్ఞాపకం ఉండిపోయింది. కాని చిన్నగూడూరు ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని మరిపెడ మండలంలో ఉంది. దాశరథి రంగాచార్య గారు పుట్టేనాటికి ఖమ్మం జిల్లా కాలేదు, అది వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. దాశరథి సోదరులిద్దరూ చదువుకు ఖమ్మం వెళ్లినందువల్ల నా మనసులో అలా నిలిచిపోయినట్టుంది. సమాచారంలో పొరపాటు చేసినందుకు క్షమించండి.

    • పవన్ సంతోష్ says:

      చదవుకు ఖమ్మానికి వెళ్ళడమే కాదు వారి పూర్వీకులు(బహుశా తల్లిదండ్రుల తరమేననుకుంటా) ఖమ్మంలోని భద్రాచలం రామాలయంలో పనిచేసేవారు. ఆ తన పూర్వీకుల్లో ఒకరి గురించి వేదం-జీవన నాదంలోనూ, జీవనయానంలోనూ కూడా రాసుకున్నారు. అలా పదే పదే ఖమ్మం ప్రస్తావనలు రావడంతో ఈ పొరబాటు దొర్లివుంటుంది.

  14. madabhushi Sridhar says:

    విశ్లేషణ అద్భుతం వేణూ చాలా బాగా రాసినావు. అభినందనలు. ఆ మహనీయునికి అక్షర నివాళి. మాడభూషి శ్రీధర్

  15. dr.kasula lingareddy says:

    ఎంత గొప్ప రచయితో అంత తిరోగామనవాది.

  16. buchanna says:

    తెలంగాణ భాష…అదీ ఉత్పత్తి కులాల ప్రజల భాషను రాసిన అరుదైన రచయిత దాశరథి. సంప్రదాయాన్ని సాహిత్యంపై పడనీయలేదు. జన భాషకు పట్టం కట్టిన గొప్ప రచయిత. జీవితాంతం విలువలతోనే బతికారు. ఈ ప్రాంతం ఆత్మను పట్టుకుని సాహిత్యాన్ని అల్లిన నేర్పరి దాశరథి రాంగాచార్య…. ఆయన లేని లోటు తెలుగు సాహిత్యానికి పూడ్చలేనిది. నిజంగానే దాశరథి మోదుగుపువ్వే…..

  17. కల్లూరి భాస్కరం says:

    “అంతటి విస్తారమైన జీవితానుభవం, ఆచరణ ఉండి కూడ దాశరథి రంగాచార్య రెండు విరుద్ధ ప్రకృతుల సమ్మేళనం అనిపిస్తుంది.”
    –ఆ విరుద్ధ ప్రకృతులు రెండింటినీ స్పృశిస్తూ సమతూకంతో ఈ నివాళి వ్యాసం రాసినందుకు అభినందనలు వేణుగోపాల్ గారూ… ఆయన కాలానికీ, కొంత ముందు కాలానికీ చెందిన కవి, పండితులు ఎందరిలోనో ఈ విరుద్ధ ప్రకృతుల సమ్మేళనం కనిపిస్తుంది. ఇంకా వెనక్కి వెడితే వీరశైవానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యులలోనూ ఇది కనిపిస్తుంది.

  18. m.viswanadhareddy says:

    ఈ ఉద్యమం వల్ల ప్రజా తెలంగాణ ఏర్పడబోదని, అధికారం ఒక పాలకవర్గ ముఠా చేతినుంచి మరొక ముఠా చేతికి మారుతుందని ఆయన పదే పదే అన్నారు. ఇప్పటి కవిసైన్యం వేదన కూడా అదేకదా …!

  19. raamaa chandramouli says:

    వేణూ..ఇది ఒక మంచి వ్యాసం..అభినందనలు.

    – రామా చంద్రమౌళి

  20. వ్యాసం చాలా బావుంది వేణుగోపాల్ గారూ… “ఉపనిషత్తులు, వేదాలు అన్నిటినీ ఒంటి చేత్తో తేటతెలుగులో రాసి, పదహారు వేల పేజీల పైన రచనలు చేసిన రంగాచార్య ఏ కోణం నుంచి చూసినా విశిష్టమైన రచయిత” – వేదాలు రాశావంటే చనిపోతావు అని ఈయనని బెదిరించారట కదా వేణుగోపాల్ గారూ? నేను ఎవరో అంటే విన్నాను. నిజమేనా?

Leave a Reply to కన్నెగంటి అనసూయ Cancel reply

*