సముద్ర తీరంలో..

 పి.మోహన్ 

P Mohan

 

 

 

 

 

సముద్రం నిన్ను అడిగింది

ఒడ్డున నన్నొక్కన్నే చూడ్డం బాగోలేదట

పిచ్చి అలలు ఘోష పెడుతున్నాయి

కన్నీటితో మరింత ఉప్పు చేయొద్దని!

 

సూర్యపుష్పమింకా వికసించలేదు

అంతా మసకమసక.. అర్థం కాని నీ చూపుల్లా

తెల్లారగట్ట తీరాన ఈ వెర్రి నడక

సౌందర్యారాధనా కాదూ, కాలక్షేపమూ కాదు

నిర్నిద్ర రాత్రిని ఇలాగైనా తప్పించుకుందామని

 

కాళ్లకు శంఖస్పర్శలు.. నీ మునివేళ్ల చిలిపి చేష్టల్లా

ఆనాడు ఇక్కడే కదా సరిగంగ స్నానాలూ, తనువుల తాడనాలూ

ఇసుక తడిలో, అలల నురగలో ఒదిగిన జ్ఞాపకాలూ..

వెర్రి సముద్రం.. అవన్నీ ఇప్పుడూ కావాలట!

 

అనాటిలా ఇసుక గూడెలా కట్టను

చేతుల్లో రవంతైనా నీ ప్రేమతడి లేదే!

మెత్తని తీరాన మన పేర్లెలా రాయను

చేతిలో ఒక్క ప్రణయాక్షరమూ లేదే!

 

మంచుతెరల్లో ఒక్కన్నీ కదలిపోవడం

తీరాన్ని ఈడ్చుకుపోతున్నంత బరువుగా ఉంది

 

లోకసాక్షి తూరుపు తలుపు నెడుతున్నాడు

బెస్తపల్లెలు నిద్రలేస్తున్నాయి

పీతలు బొరియల్లోకి వెళుతున్నాయి

 

ఒంటరి ప్రయాణం ఎక్కడో ఒకచోట ఆగాల్సిందే

ఆనాడు మనం కూర్చున్న నల్లపడవ పక్కన

ఇప్పుడిలా దిష్టిబొమ్మలా నిల్చున్నాక

వెనకేముందో తెలియదు

ముందు మాత్రం కళ్లు చెదిరే ప్రభాత బింబం

సూర్యుడి ముద్దుతో ఎర్రబారిన కడలి చెంప

అనంత జలరేఖపై పూచే తెరచాపలు

తీరం, కెరటాల కౌగిళ్లతో పోటెత్తిన సౌందర్యం

దిష్టి తగలొద్దు

ఇలాంటి చోట ఒకడు తోడు లేకుండా తిరిగాడని

ఎవరికీ తెలియొద్దు

తడి ఇసుకపై ఒంటరి పాదముద్రలు చెరిగిపోవాలి!

 

*

 

 

మీ మాటలు

  1. narsan b says:

    గుండెనింత వెచ్చని తడిలో ముంచిన కవిత్వం చదవక చాల రోజులైంది . అయ్యో ఇంతలోనే కవిత ఐపాయిందే అనిపించింది . మళ్ళీ సముద్రతీరానికి ఎప్పుడొస్తారో వేచిచూస్తుంటాను .

  2. Bhasker says:

    బావుంది కవిత! మనసు పొరల్ని తాకింది. తడి ఆరకుండా ఇంకా పచ్చిగానే ఉంది!
    –భాస్కర్ కూరపాటి.

  3. mahamood says:

    నీ కవిత ఇన్ని రోజుల తరవాత చాలా హాయిగా ఉంది మోహన్ నీలో కవిని మల్లి తట్టిలేపిన సముద్రానికి నా కృతజ్ఞతలు . . . నీ కవిత్వం గురించి నా కంటే బాగా తెలిసినవాడు ఉంటాడా..
    మహమూద్

  4. srinivasarao says:

    మంచి పోయెమ్ మోహన్ గారు

  5. చాలా బావుంది మీ కవిత మోహన్ గారు

  6. రెడ్డి రామకృష్ణ says:

    సూర్యుడి ముద్దుతో ఎర్రబారిన కడలి చెంప
    అనంత జలరేఖపై పూచే తెరచాపలు
    తీరం, కెరటాల కౌగిళ్లతో పోటెత్తిన సౌందర్యం

    ఇలాంటి చోట ఒకడు తోడు లేకుండా తిరిగాడని
    ఎవరికీ తెలియొద్దు
    తడి ఇసుకపై ఒంటరి పాదముద్రలు చెరిగిపోవాలి!
    బావుంది సర్

  7. P Mohan says:

    నర్సన్, భాస్కర్, మహమూద్, శ్రీనివాసరావు, ఎమేస్కే, రెడ్డి రామకృష్ణ గార్లకు థ్యాంక్స్.
    సముద్రంపై ఎవరు రాసినా గుండె తీరాన్ని ఒక అల మీటినట్టు ఉంటుంది.

  8. నిశీధి says:

    ఆర్ద్రంగా ఉంది

  9. పద చిత్రాలు ఎంతో బాగున్నాయి

  10. rachakonda srinivasu says:

    సముద్రమంత విశాలంగా వుంది . తడి అరదు. సజీవంగా వుంటుంది.

మీ మాటలు

*