తెల్లటి నుదుటి మీద నల్లటి మచ్చ!

సత్యం మందపాటి 

 

  satyam mandapati    నాలుగేళ్ళ క్రితం ఇండియా వెళ్ళినప్పుడు ఢిల్లీ, జయపూర్, ఆగ్రాలతో పాటు, అమృత్సర్, వాఘ సరిహద్దులు కూడా చూశాం. ఈ శీర్షికలో ఢిల్లీ గురించి ఇంతకుముందే వ్రాశాను. జయపూర్, ఆగ్రాల గురించి కూడా త్వరలో వ్రాయాలని వుంది. ఈసారికి అమృత్సర్, వాఘ సరిహద్దుల గురించి మా అనుభవాలు వ్రాస్తాను.

మేము అమృత్సర్ వెళ్ళటానికి కారణం ఒకటి సిక్కుల హర్మందిర్ సాహిబ్ (బంగారు గుడి) చూడటం ఒకటయితే, మరో ముఖ్య కారణం, జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగిన చారిత్రాత్మక ప్రదేశం చూడటం.

భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి మరచిపోలేనంతగా స్పందించిన నాకు, ఆ విషయాల గురించి ఎన్నో పుస్తకాలు చదివిన నాకు, ఎన్నాళ్ళనించో ఆ ప్రదేశం చూడాలనే బలమైన కోరిక వుండేది. భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి చదివినప్పుడల్లా, నాకు ఒక గగుర్పాటు, ఒక మరువలేని అనుభూతి కలుగుతాయి. అందుకని ఇన్నాళ్ళకి ఆలస్యమయినా వదలకుండా అక్కడికి వెళ్ళాం. అంత దూరం వెళ్ళాం కనుక, దగ్గరలోనే వున్న వాఘ సరిహద్దులో భారత సైన్యం చేసే విన్యాసాలు కూడా చూశాం.

౦                           ౦                           ౦

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్, భారతదేశంలో ఈశాన్య దిశన, పాకిస్తాన్ ఇండియాల వాఘ సరిహద్దుకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరాన వుంది. సిక్కు గురు రాందాస్ పేరున, దీనికి రాందాస్ పూర్ అనే పేరు కూడా వుంది. ఇప్పుడు పన్నెండు లక్షల జనాభా వున్న నగరం.

అమృత్సర్లోనే ఒక హోటల్ తీసుకుని వున్నాం. అక్కడే ఉపాహారం చేసి, ప్రొద్దున్నే మేము దగ్గరలోనే వున్న,  ఎన్నాళ్ళనించో చూడాలనుకుంటున్న ‘జలియన్ వాలాబాగ్’ స్మృతిచిహ్నం చూడటానికి వెళ్ళాం.

ఈ చారిత్రాత్మక చిహ్నం గురించి మీకందరికీ తెలుసునని నాకు తెలుసు. అయినా నాలుగు మాటలు చెప్పాలని వుంది.

1919వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన, వైశాఖి పండగ రోజున, ‘ఖల్సా’ వార్షికోత్సవం రోజున, అక్కడ జరగరాని సంఘటన ఒకటి జరిగింది. మానవత్వానికి మసి పూసిన సంఘటన అది.

అది తెల్లవాడి నుదుటి మీద కలకాలం చెరగని, చెరిగిపోలేని నల్లటి మచ్చ.

అది జనరల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హారీ డైయ్యర్ అనే దురహంకారి వల్ల జరిగింది.

న్యూఢిల్లీలోని సిక్కుల గురుద్వార ‘రాకబ్ గంజ్’ గోడల్ని పగులుకొట్టిన బ్రిటిష్ సేనలకు నిరసనగా, మహాత్మా గాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటం ప్రోత్సాహంతో, ఎంతోమంది సిక్కు మతస్తులు సమ్మె చేశారు. ఆ ఏప్రిల్ పదవ తేదీన పాదయాత్ర చేస్తున్న యాభై వేల మంది సిక్కుల మీద బ్రిటిష్ సేనలు కాల్పులు జరిపి, శాంతియుతంగా సమ్మె చేస్తున్న ముఫై మందిని హతమార్చారు.

మూడు రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ పదమూడవ తేదీన, కొన్ని వేల మంది సిక్కులు, హిందువులు, ముస్లిమ్ మతస్తులు, ‘జలియన్ వాలా బాగ్’ తోటలో వైశాఖి పండగ జరుపుకోవటానికి వచ్చారు.

ఆరోజు కూడా మామూలుగా ప్రార్ధనలతో సాయంత్రం నాలుగున్నర గంటలకి కార్యక్రమం మొదలుపెట్టారు.

అప్పుడే అరవై ఐదు మంది గూర్ఖా, ఇరవై ఐదు మంది బలూచివారి  సైన్యంతో వచ్చాడు జనరల్ డయ్యర్.

ఎవరూ పారిపోకుండా, అక్కడున్న ఒకే ఒక్క  గేటుని మూయించాడు. ప్రార్ధన చేసుకుంటున్న వేల మంది భారతీయుల మీద, బులెట్ల వర్షం కురిపించాడు. ఏమీ ఆయుధాలు లేని ఆ అమాయకుల మీద, పది నిమిషాలు ఆగకుండా కాల్పులు జరిపాడు. పారిపోవటానికి ఎటూ దారిలేక ప్రాణాలు కోల్పోతుంటే, అక్కడ వున్న నూతిలోకి దూకారు చాలమంది పిల్లలు, స్త్రీలు, పురుషులు. వారిని కూడా వదలకుండా కాల్చి చంపాడు డయ్యర్. అంతా రక్త మయం, హాహాకారాలు, వాలిపోయిన అసహాయ ప్రాణాలు. డయ్యర్ పక్కన అతని కుడి భుజం ఆనాటి పంజాబ్ గవర్నర్ మైకేల్ ఒడియర్ నుంచుని, ఆ హత్యాకాండలో భాగస్వామి అయాడు.

ఆరోజున అక్కడ జరిగిన మారణహోమం, బ్రిటిష్ వారు చెప్పినట్టు మూడు వందల డెభై తొమ్మిది మంది ప్రజలకి కాదు, తెల్లవాడి మానవత్వానికి. ఆరోజున అక్కడ జరిగిన హత్యాకాండ, భారతీయ జాతీయ కాంగ్రెస్ చెప్పిన వెయ్యి మంది ప్రాణ త్యాగం చేసిన అమాయక ప్రజలకు కాదు, కొవ్వెక్కిన బ్రిటిష్ వారి విలువలకి.

అక్కడికి వెళ్ళిన మరుక్షణం నాకు గుర్తుకి వచ్చింది, రిఛర్డ్ అట్టిన్బరో గారు “గాంధీ” సినిమాలో కనులకు కట్టినట్టు తీసిన ఆ సంఘటన. అక్కడ గోడల మీద ఇంకా ఆరోజున బులెట్లు చేసిన రంధ్రాలు ఎన్నో వున్నాయి. పక్కనే ప్రాణ భయంతో ఎంతోమంది దూకిన నూయి కూడా ఆనాటి సంఘటనకి ఒక సాక్షిగా అలా నిలబడి వుంది. ఆ లోపలి వెళ్ళటానికి వున్న చిన్న ద్వారం చూస్తుంటే, అది మూసేసి డయ్యర్ కాల్పులు చేస్తుంటే, లోపల చిక్కుకు పోయిన వెయ్యిమంది, ప్రాణభీతితో ఎంతగా విలవిల్లాడివుంటారా అనిపించింది. ఆ నరక బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. అది మనమీనాడు ఏమాత్రం ఊహించలేనిది.

amrit1

 

ఇది జరిగిన ఎనిమిది సంవత్సరాలకి డైయ్యర్ మరణించాడు. కానీ ఆరోజున ఈ హత్యాకాండని ప్రత్యక్షంగా చూసి, అందులో దెబ్బతిన్న ఉద్దంసింగ్ మాత్రం నిద్రపోలేదు. దెబ్బ తీయటానికి అవకాశం కోసం చూస్తూనే వున్నాడు. ఆ అవకాశం ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత, అంటే 1940వ సంవత్సరంలో అతనికి లభించింది. భగత్సింగుకి కుడిభుజంగా పనిచేసి, స్వాతంత్ర పోరాటంలో జైలుకి కూడా వెళ్లాడు. ఉద్దంసింగ్ జైలు నించి విడుదల కాగానే లండన్ వెళ్ళాడు. కాక్స్టన్ హాలులో ఉపన్యాసం చేయబోతున్న డయ్యర్ కుడిభుజం మైకేల్ ఒడియార్ని, రెండు బులెట్లతో కాల్చి చంపేశాడు. ఉద్దంసింగ్ పారిపోవటానికి కూడా ప్రయత్నం చేయలేదు. తను చేయవలసిన పని పూర్తి చేసి, వారికి లొంగిపోయాడు. ఆ తర్వాత అతన్ని బ్రిటిష్ వారు ఉరి తీసి చంపేశారు.

ఇలాటి వివరాలు ఈనాటి భారతీయులకి తెలియటం ఎంతో అవసరం. అందుకే మిమ్మల్ని మన స్వాతంత్ర పోరాటం మీద వున్న ఎన్నో పుస్తకాలలో, కనీసం ఒకటో రెండో అయినా చదవమని కోరుతున్నాను.

మేము అమృత్సర్లో చూసిన ఇంకొక ముఖ్యమైనది సిక్కుల బంగారు దేవాలయం. దీనినే హర్మందిర్ సాహిబ్ అని కూడా అంటారు. సిక్కుల మత గ్రంధం ‘గురు గ్రంధ్ సాహిబ్’  ఇక్కడే వుంది.

ఎంతో అందమైన దేవాలయం. నాలుగు పక్కలా పెద్ద ప్రహరీ గోడలతో కూడిన భవంతుల మధ్య చక్కటి కట్టడం. లోపల గుడికి నాలుగు పక్కలా అందమైన సరోవరం. దానిమధ్యలో దేవాలయం. పూర్తిగా బంగారు కవచంతో నిర్మించబడింది. అక్కడికి వెళ్ళటానికి సరోవరం మధ్య నించీ సిమెంటుతో కట్టిన ప్రవేశ వారధి. దీని నిర్మాణం గురు రాందాస్ మొదలుపెడితే, గురు అర్జన్ పూర్తిచేసాడుట. 1604లో దీని నిర్మాణం పూర్తి అయింది.  ఈ బంగారు దేవాలయం చూడటానికి రోజుకి లక్ష మంది పైగా యాత్రీకులు వస్తారుట.

సిక్కు మతస్తుల సంప్రదాయం ప్రకారం, బయట కాళ్ళూ చేతులూ కడుక్కుని, తలని జేబు రుమాలతో కప్పుకుని, లోపలికి వెళ్ళాం.  అన్ని మతాల వాళ్ళూ ఆహ్య్వానితులే అని చెప్పటానికి, నాలుగు తలుపులు వున్నాయి. లోపల వారి పవిత్ర మత గ్రంధం వుంది. లోపలికి వెళ్ళటానికి కొంచెం ఎక్కువ సమయమే పట్టింది కానీ, నీళ్ళ మీద నించీ చల్లటి గాలి వీచటం వల్లా, పక్కనే జోకులు వేసే మేనల్లుడు వుండటం వల్లా బోరు కొట్టలేదు.

ఆ మధ్యాహ్నం మేము 32 కిలోమీటర్ల దూరంలో వున్న ఇండియా-పాకిస్థాన్ల వాఘ సరిహద్దుకి వెళ్ళాం. ఈ వాఘ సరిహద్దు పాకిస్థాన్ ఇండియాల మధ్య వున్న అన్ని సరిహద్దుల లాటిది కాదు. దానికి కారణం ఇక్కడ రోజూ సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు జరిగే  ‘సరిహద్దు కార్యక్రమం’. పాకిస్థాన్ వేపు రెండు మూడు వందల మంది అది చూడటానికి వస్తే, భారతదేశం వేపు ఎన్నో వేల మంది జనం వస్తారు.

మేము దానికి కొంచెం ముందుగానే వెళ్ళాం అక్కడికి. అక్కడ నాకు నచ్చనిది ఏమిటంటే, లోపలికి వెడుతున్నప్పుడు, ఆడవాళ్ళని ఒక పక్కకీ, మగవాళ్ళని ఒక పక్కకీ పంపించారు. అన్ని వేలమంది జనాభాలో ఎవరు ఎటు వెళ్ళారో కూడా తెలియని పరిస్థితి. సెల్ ఫోన్లు కూడా అక్కడ సరిగ్గా పనిచేయలేదు. ఆ కార్యక్రమం అయాక, మళ్ళీ మేము కలవటానికి కొంచెం సమయం అయినా, చివరికి కథ సుఖాంతం అయింది. అది వేరే విషయం అనుకోండి.

ఆరోజు కార్యక్రమంలో ముందుగా, మన దేశం వేపు, దేశభక్తి పాటలతో హోరెత్తించారు. మధ్యలో ఎంతోమంది లేచి, ఆ పాటలకి తగ్గట్టుగా డాన్సులు చేస్తుంటే, వాతావరణంలో ఎంతో దేశభక్తీ, ఒక విధమైన ప్రేమతో కూడిన ఉద్రేకం కనపడ్డాయి.

తర్వాత రెండు పక్కలా సైనికుల కవాతులు మొదలయాయి. పాకిస్థాన్ వేపు చాల మామూలుగానూ, మన వేపు వేలమంది జనం ఉత్సాహంగా అరుస్తుంటే ఎంతో సందడిగానూ వుంది. ఒక్కొక్క సిపాయి కాళ్ళు ఎంతో పైకెత్తి నడుస్తూ, సరిహద్దు గేటు దాకా వెళ్ళి వెనక్కి వస్తుంటే, అక్కడ వున్న జనంలో కోలహలం ఎక్కువ అవటం మొదలయింది.

amrit3

తర్వాత కొంతమంది సిపాయీలు కవాతు చేస్తూ, సరిహద్దు దాకా వెళ్ళి నుంచున్నారు. అప్పుడే సరిహద్దు గేట్లు, మన వేపూ, పాకిస్థాన్ వేపూ తెరుచుకున్నాయి. సిపాయీలు రెండు పక్కలనించీ మధ్యకు వెళ్ళి, ఒకళ్ళని ఒకళ్ళు స్నేహపూర్వకంగానే కవ్వించుకున్నారు. తర్వాత రెండు దేశాల జాతీయ గీతాలు ఆలాపిస్తుంటే, జాతీయ పతాకాలని క్రిందకి దించారు. వాటిని అందంగా మడిచి, సిపాయీలు అవి తీసుకుని, మళ్ళీ కవాతు చేస్తూ వెనక్కి వచ్చారు. రెండు దేశాలవారూ గేట్లు మూసేశారు. తర్వాత మళ్ళీ దేశభక్తి పాటలతో మార్మోగిపోయింది.

అంతటితో సరిహద్దు కార్యక్రమం సమాప్తం అయింది.

ఆరోజు రాత్రి ట్రైన్ ఎక్కటంతో మా అమృత్సర్ యాత్ర కూడా అలా విజయవంతంగా సమాప్తం అయింది.

౦                           ౦                           ౦

మీ మాటలు

  1. M V Ramana Rao says:

    చాల చక్కగా వివరించారు. ఇక జలియన్ వాలాబాగ్ విషయానికి వస్తే వళ్ళు చాలా మండిపోతుంది సార్.

  2. Satyam Mandapati says:

    రమణారావుగారు: అవును మన స్వాతంత్రోద్యమంలో, ఇలాటి ‘ఒళ్ళు మండిపోయే’ సంఘటనలు చాల జరిగాయి. అవన్నీ ఈనాటి తరానికి తెలియజేయటం అవసరం అని నా అభిప్రాయం. సమయం చసుకుని ఈ వ్యాసం చదివి, మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.

మీ మాటలు

*