ఐటెం సాంగ్స్…కెవ్వు కేక..మా టెల్గూ ఈవెంట్!

మధు పెమ్మరాజు 

madhu_picఓ ఆదివారం సాయంత్రం స్థానిక తెలుగు సాంస్కృతిక సమితి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు గుడి ఆడిటోరియంలో ఏర్పాటు చేసారు. అప్పుడప్పుడు తెలుగుదనాన్ని దగ్గరగా చూసే అవకాశం, పాత కొత్త పరిచయాల పలకరింపులు, e-పిలుపులో ‘ముప్పై రకాల పిండి వంటలని సంకేతాత్మకంగా నిండు అరిటాకు’ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు..బోలేడు ఊరించే ప్రయోజనాలు తట్టడంతో వేడుక స్థలానికి కాస్త కంగారుగా, అరగంట ముందుగా చేరుకున్నాను.

ఆడిటోరియం గుమ్మంపై తళ, తళా మెరుస్తున్న ‘తెలుగు సాంస్కృతిక సమితి సిల్వర్ జూబ్లీ’ బానరు, ప్రవేశ ద్వారం వద్ద తెలుగింటి ఆడపడుచులు, కుర్తా బ్రదర్లు సాంప్రదాయంగా ఆహ్వానిస్తున్నారు. అదే రోజు సమితి ఎన్నికలు కూడా ఉండడంతో నవ్వులు మామూలు కంటే కాస్త ఎక్కువగా పూస్తున్నాయి. టికెట్ కొని లోపలకి అడుగు పెట్టానో లేదో జిగేల్మనిపిస్తున్న స్టేజి అలంకరణ, పట్టు బట్టల పరుగులు, వేడుక కోలాహలం నా అంచనాలని అంచలంచలుగా పెంచేస్తుంటే కాస్త నిలదొక్కుకుని, ఓ పాత పరిచయం పక్కన సెటిలయ్యాను.

తెర దించగానే అందంగా ముస్తాబయిన, అందమైన యెమ్.సీ ప్రేక్షకులకి, స్పాన్సర్లకి, కార్యవర్గానికి ధన్యవాదాలు చెప్పి, రాబోయే అంశాలతో పాటు ఇండియా నుంచి విచ్చేసిన ఆహ్వానిత అతిధిని సభకి పరిచయం చేసింది. ప్రేక్షకుల మొహంలో “యెమ్.సీ అంతా బానే చెప్పింది కానీ భోజనాల బ్రేకెప్పుడో చెప్పలేదు” అన్న సందేహం కొట్టొచ్చినట్టు కనపడింది. మొట్టమొదట పిల్లల ప్రార్ధనా గీతం, సమితి ప్రెసిడెంట్ ప్రారంభ ఉపన్యాసంతో వేడుక పద్దతిగానే ప్రారంభమయ్యింది.

“మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న…” అని యెమ్.సీ ప్రకటించడం ఆలస్యం పది, పన్నెండేళ్ళ పిల్లలు స్టేజిని “సారొత్తారొత్తారా.. రొత్తారా.?” అని ప్రశ్నిస్తూ స్టేజీని దున్నేయడం మొదలుపెట్టారు. తల్లితండ్రులు మంత్ర ముగ్దులై, పిల్లల్ని గర్వంగా వీడియోలలో, ఫోటోలలో బంధిస్తున్నారు. ఆకాశం వంటి వెండి తెర స్టెప్పులని నేలపైకి తెచ్చిన బాల భగీరధుల నైపుణ్యానికి ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పాట పూర్తి కాగానే చప్పట్లతో ఆడిటోరియం పైకప్పు సగం లేచిపోయింది. తర్వాత సామాజిక స్పృహ నిండిన పాట “పువాయ్ పువాయ్యాంటాడు ఆటో అప్పారావు..స్కూటర్ సుబ్బారావు..“ అంటూ పదిహేనేళ్ళ పిల్లలు గురువులు నేర్పిన స్టెప్పులు వరుస తప్పకుండా వేస్తుంటే ప్రేక్షకుల టెంపో తారాస్థాయికి చేరి ఆడిటోరియం కప్పు లేని సాసర్లా మిగిలింది.

నా పక్కనే కూర్చున్న పరిచయాన్ని “సంస్కృతి అంటూ ఈ రికార్డింగ్ డాన్సులు ఏమిటి సార్?” అనడిగాను

“పాపం వాళ్ళు మాత్రం ఏమి చేస్తారండి? కల్చరంటూ హరికధలు, బుర్రకధలు, లలిత సంగీతం మొదలెడితే చేతకాని కార్యవర్గం అంటూ ఆ వచ్చే పది మంది కూడా రారు. ఏ అసోసిఏషనయినా జనాలని ఆకర్షించడం మొదటి ఉద్దేశ్యం కదండి?” అన్నారు.

“మరి ఈ ఐటెం సాంగ్స్ పెడితే పేరెంట్స్ కి అభ్యంతరంగా ఉండదా?”

ఆయన మొదటిసారి నా మొహంలోకి మొహం పెట్టి చూసారు, నేను మర్చిపోలేని చూపు “మీరు ఇప్పుడే పుట్టినట్టున్నారే.. ఒక్కసారి తెలుగు చానళ్ళు పెట్టి చూడండి, ఇండియా చక్కర్ కొట్టి రండి….కోచింగ్ సెంటర్లు పెట్టి మరీ పిల్లలకి నేర్పుతున్నారు” అని చిరాగ్గా తల తిప్పుకున్నారు.

ఈ లోపు భరత నాట్యం అని అనౌన్స్ చెయ్యగానే ఆ పాల్గొనే పిల్లల తల్లి, తండ్రులు సెల్ ఫోనులు పట్టుకుని స్టేజిపైకి దండయాత్రకి వెళ్లారు. మిగిలిన వారికి కాస్త ఆటవిడుపు లభించి పక్క వారి చీరలని, నగలని, మేకప్పుని ఆపాదమస్తకం స్కాన్ చేసే సరికి.. ఆ చూపులు మాటలుగా మారి గదంతా వ్యాపించాయి. ఇక మిగిలిన వారు… అంటే మగవారు.. ప్రాజెక్ట్ కష్టాలు, రాజకీయాలు, రియల్ ఎస్టేట్లంటూ తమ వంతు సాయం చేస్తూ డెసిబెల్ లెవెల్ రెట్టింపు చేసేసారు. ఇవేవీ పట్టని పిల్లలు డాన్స్ క్లాసుకొచ్చినట్టు తమ పని తాము సక్రమంగా పూర్తి చేసి ప్రశాంతంగా స్టేజి దిగిపోయారు.

అంతదాకా ముందు వరసలో ఉగ్గ బెట్టుకుని కూర్చున్న ఆహ్వానిత అతిధి, అదేనండి… ఇండియా నుండి విచ్చేసిన ప్రముఖ నేపధ్య గాయకుడికి తిక్క రేగింది. స్టేజి పైకొచ్చి పెద్ద గొంతుతో ప్రేక్షకులని గొంతు తగ్గించుకోమని… పిల్లల్ని, ముఖ్యంగా తనని ప్రోత్సహించమని హెచ్చరించాడు. ఆ తర్వాత ఆయన పాడినవన్నీ హిట్ సినిమా పాటలు అవ్వడంతో జనం పెద్ద మనసుతో క్షమించి, హుషారుగా హం చేసారు. ఊపొచ్చిన పెద్దలు ‘ఊకనే గూకోలేక’ స్టెప్స్ వేస్తూ స్టేజి పైదాకా వెళ్ళిపోయారు.

పాటలు, డాన్సులు మాత్రమేనా అని నిరుత్సాహ పడుతుంటే, యెమ్.సీ నాటకాలు రాబోతున్నాయని అనౌన్స్ చేసింది. “అబ్బో! ఇవి కూడా ఉన్నాయి, మరింకేం” అనుకుని ఓపిక అరువు తెచ్చుకున్నాను.

మొదటి నాటకం “వీడు ఆరడుగుల బుల్లెట్… “ తో మొదలు పెట్టారు, “అన్నానికి అరిటాకు..” అనే పాట రాగానే భోజనాల బ్రేకేమోనని అంతా భోజనశాల వైపు ఆశగా చూసారు. యెమ్.సీ “అమ్మా! ఆశ, దోశ … ” అని రెండవ నాటకం అనౌన్స్ చేసింది.

రెండవ నాటకంలో పెదరాయుడు గెటప్లో ఒక మోహన్బాబు, లయన్ గెటప్లో ఇంకో బాలకృష్ణ…. ఇలా వింత, వింత గెటప్పులతో మిగతా పాత్రధారులు స్టేజిపైకి వచ్చారు. “మీలో ఎవరు కోటీశ్వరుడు… “ అనే హిట్ టీవీ షోకి అనుకరణ. ఇందులో ప్రధానమయిన విశేషాలు విచిత్ర వేషాలు, ప్రీ-రికార్డు చేసిన మిమిక్రీ గొంతులు. జనాలు ఇవి నాటకాలా? అని డౌట్ పడకుండా సర్దుకుపోయి ఈలలు, చప్పట్లతో కేరింతలు కొట్టారు. .

“మీరేంటి సార్! అంత విసుక్కుంటూ చూస్తున్నారు, సినిమాలంటే మీకు అలెర్జీనా?”

“సినిమా అంటే అలెర్జీ ఏమీ లేదు సార్! ఈ వెండి తెర వ్యామోహం, అనుకరణ కాలుష్యం చూస్తుంటే స్టవ్ మీద కూర్చునట్టుంది. మనం సొంతంగా ఏమీ చెయ్యలేమా? మనకి వెన్నెముక లేదా? అనేది నా ప్రశ్న” అని జవాబు చెప్పాను.

“మీలా సీట్లలో సుఖంగా కూర్చుని ఆశించడం బానే ఉంటుంది, అక్కడ స్టేజిపై ఉన్న వారికి తెలుస్తుంది కష్టం. సొంతంగా చెయ్యడానికి వారు ప్రొఫెషనల్స్ కాదు. పోనీ కిందా, మీదా పడి చేద్దామన్నా అంత ఖాళీ సమయం ఎవ్వరికీ లేదు. అన్నిటి కంటే ముఖ్యంగా జనాలు సినిమాలకి ఇట్టే కనెక్ట్ అవుతారు” అన్నారు.

“బాగా చెప్పారు, కనెక్ట్ అవ్వాలంటే సినిమాలు తప్ప తెలుగు వారికి వేరే మార్గం లేదన్న మాట” అని బయటకి నడుస్తూ బానర్ కేసి మరోసారి పట్టి, పట్టి చూసాను “తెలుగు సాంస్కృతిక సమితి.. “ బానర్ మెరుస్తూ కనిపించింది.

సినిమా ఇంత బలంగా, లోతుగా మనలో ఎందుకు పాతుకుపోయిందని ఆలోచిస్తే- తెలుగు పత్రికలు, టీవీ చానళ్ళు, ఫేస్బుక్, వెబ్సైట్లు, ఆఖరికి మిత్రులతో పిచ్చాపాటీ… ఇలా ప్రతి ఇంటరాక్షన్ సినిమా ఓవర్ఆక్షన్తో నిండిపోయింది.

షాంపూని రూపాయి సాషేలలో అందించి ఘన విజయం సాధించినట్టు పత్రికలు, సినిమా వార్తలని తెలివిగా ప్రతి పేజిలో చిన్న డబ్బాలలో అందిస్తూ ఉంటారు- పలానా సినీ తార బాయ్ ఫ్రెండ్తో బ్రేక్ అప్ అయ్యింది- (పాపం ఇంత చిన్న వయసులో ఎంత కష్టమోచ్చిందో?), రజనీకాంత్ నిర్మాతకి డబ్బులు మళ్ళీ తిరిగిచ్చాడు- (పాపం ఎంత మంచివాడో), ఒక సూపర్ స్టార్ శరీరం తగ్గించుకుందుకు ఓట్ మీల్ తినడం మొదలు పెట్టాడు (ఇక అతని ఫాన్స్ కూడా సన్నపడతారు).

ముఖపుస్తకం (పేస్బుక్) తెరిచి చూడగానే ఒక సోషల్ నెట్వర్కింగ్ స్టార్, దేశంలో ఏ సమస్యా మిగలనట్టు సినిమాలు ఉద్దరించడానికి పూనుకున్నాడు. తనని, తాను ఫిల్మ్ ఆక్టివిస్ట్ అని ప్రమోట్ చేసుకుంటాడు. ప్రముఖ సినీ కుటుంబాలు పరిశ్రమని మొనోపలైజ్ చేసి చిన్న నిర్మాతలని, బుల్లి హీరోలని నల్లిలా నలిపేస్తున్నారు, టాలెంట్ని అణగదోక్కేస్తున్నారు అని ఫేస్బుక్లో అంతర్మధనం చెందుతూ ఉంటాడు. ఎలాగైనా సినిమాని కబంధ హస్తాల నుండి విడిపించడం ఇతని జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా ఫేస్బుక్ అనే మాధ్యమాన్ని వాడుకుంటూ, లెక్క లేనంత మంది సినీ వ్యసనపరుల్ని ఫాలోయర్స్ గా కూడ గట్టుకున్నాడు. ఈ మధ్యనే “మాడిన దోశ” అనే “క్రౌడ్ ఫండింగ్” సినిమాని (బిలో) మామూలు ఫార్ములాతో తీసి చేతులు….కాదు, కాదు.. వేరే వాళ్ళ వేళ్ళకి వాత పెట్టాడు.

ఈ కాలుష్యానికి కొత్త పార్శం ఆడియో ఫంక్షన్లు, ఒక్కొక్కటీ నాలుగ్గంటల నాణ్యమైన న్యూసెన్స్. పబ్లిక్ సొమ్ము దుర్వినియోగం చేస్తే చట్టం దాన్ని నేరంగా పరిగణిస్తుంది. మరి మన దేశ భవిష్యత్తు (యువతరం) విలువైన సమయాన్ని ధీమాగా వృధా చేయిస్తున్న మనుషలకి ఏ శిక్ష వేయాలి? ఇటువంటి దుస్థితి వేరే రాష్ట్రాలలో ఉందా? లేక తెలుగు వారికేనా ఈ శాపం? అని కొన్ని తెలివి తక్కువ ప్రశ్నలు మనం వేసుకోవాలి.

క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చూడడం అంటే అర్ధం పర్ధం ఉంది. ఇక సినీ తారలు, వారి పిల్లల వివాహాలని ప్రత్యక్షంగా చూపించడం ఏమిటో? పెళ్ళంటే ఒకరి వ్యక్తిగత వ్యవహారం దానిని వాణిజ్య ప్రకటనలు అమ్ముకునే వీధి బాగోతంగా ఎప్పుడు మారిందో? పెళ్ళికొచ్చిన వారి నగలు, చీరలు, హంగులని చూసే సగటు మనిషి కలల్లోకి జారిపోతాడు.

సామెతల స్థానంలో పంచ్ డైలాగ్లు వాడతాం. ‘చాలా బావుంది’ అనాలంటే ‘కెవ్వు కేక’ అంటాం, ‘అంత స్థోమత/అర్హత లేదు’ అనడానికి ‘అంత సీన్ లేదు’ అంటాం. సినీ సంభాషణలు తప్ప మనకి సొంత భావజాలం మిగల్లేదు.

అసలు వీళ్ళు ఎవరు? వారి మొహాన్న టికెట్ డబ్బులు పడేస్తే తెరపైకొచ్చి తైతక్కలాడి, రంజింపచేసి, నిష్క్రమించే మామూలు మనుషులు. సినిమా ఒక కొనుగోలుదారుడికి, నటనతో (వస్తే) వినోదాన్ని అమ్ముకునే విక్రేతకి మధ్య జరిగే లావాదేవి మాత్రమే. మన కళలని, బాషని, సాహిత్యాన్ని, సంగీతాన్ని ధ్వంసం చేసే అధికారం వారికి ఎవరిచ్చారు? అప్రమత్తంగా ఉండడం శ్రమతో కూడుకున్న పని, అందుకు సులువైన వినోదాన్ని, వెకిలితనాన్ని ఎంచుకుంటాం, వారికి సింహాసనంపై కూర్చోపెడతాం. ఈ passive, negligent encouragement వాడుకోవడం వాళ్ళకి తెలుసు కాబట్టి, వారు మనని పూర్తిగా ఆవహించారు.

వీరి లక్ష్యం ఒకటే- మన బుర్రలో ఒక శాశ్వతమైన గూడు కట్టుకోవాలి, ఆ గూడు సైజు పెంచుకుంటూ పోవాలి. తోచినా, తోచకున్నా, వేడుక జరుపుకున్నా, విషాదంలో మునిగి తేలుతున్నా సినిమా చూడాలి. సినిమా should be our only expression, culture, language, art…

జీవ నదులు సముద్రంలో కలిసి పనికిరాని ఉప్పు నీరుగా మారుతాయి. బాష, సంస్కృతి, సంగీతం సినిమా కాలుష్యంలో కలిసి అస్థిత్వాన్ని ఎప్పుడో కోల్పోయాయి. దశాబ్దాలుగా సినీ పరిశ్రమ ఇతర ఆలోచనలని ఎదగనివ్వకుండా ఉక్కు వేర్లతో పెనవేసి, గొంతు నొక్కేసిన మర్రి చెట్టు. ఆ నిజానికి దర్పణం నేను చూసిన “తెలుగు సాంస్కృతిక సమితి…” కార్యక్రమం.

*****

మీ మాటలు

  1. narsan b says:

    ఏంచేద్దాం ఇలా పాతాల ప్రయాణమే సుఖన్నిస్తున్నది . hum nahee sudhrenge.

  2. చందు తులసి says:

    ఇంకొన్నాళ్ళు పోతే పాట అంటేనే ఐటం సాంగ్ అనుకుంటారు కాబోలు. టీవీ పిల్లల పాట కార్యక్రమాలుకూడా అలాగే ఉంటున్నాయి.. ఆఖరికి మధ్యాహ్నం మహిళల కార్యక్రమం లోనూ
    కెవ్ కేక అని ఎగురుతున్నారు..అంతెందుకు రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన ఆందోళనల్లోనూ …ఐటం సాంగులు వేసుకుని డాన్సులు వేశారంటే అంతకన్నా దుస్థితి ఏముంది. భవిష్యత్ లో జోలపాటలు కూడా ఐటం సాంగులవుతాయని భయంగా ఉంది..! మధు గారూ.. చక్కగా వివరించారు

    • @చందు తులసి గారు- “భవిష్యత్ లో జోలపాటలు కూడా ఐటం సాంగులవుతాయని భయంగా ఉంది” అలానే అనిపిస్తోంది. చదివి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు!!

  3. చైతన్య అల్లం says:

    తెలుగు అభినవోద్దరణా సంఘమొకటి దసరా సంబరాలంటే ఒక సారి పోయిన. తెలుగు గానీ, దసరా కానీ, ఉద్దరణ కాని లేవు. అభినవానికి ఇచ్చిన నిర్వచనాన్ని చూసి ఆశ్చర్యపోయి, హతాశున్నయి భయపడిపోయిన. ఆ సంస్కృతిక వైతరిణీ ప్రవాహంలో కొట్టుకు పోయేవాల్లని రక్షించాలన్న యావ కూడా మరిచిపోయి ఎలాగోలా నన్ను నేను రక్షించుకుని బయటకి రాగలిగిన. ఆ ఫ్లయర్ లలో చిన్న గమనిక కూడా పెడితే బాగుండేది. “ఇక్కడ జరిగే పరిణామాలకు తట్టుకోగలిగే శక్తి, మానసిక స్థైర్యం ఉన్నవాళ్ళే హాజరు కాగలరు” అని.

    • చైతన్య గారు- సిగరెట్ డబ్బా హెచ్చరికలా ఫ్లయర్పై కూడా పెడితే బాగుంటుంది. మీ కామెంట్కి ధన్యవాదాలు!!

  4. Chandrika says:

    చాలా బాగా వ్రాసారు. పాత రోజుల్లో రికార్డు డాన్సులు కి ప్రత్యేకం గా డాన్సర్ లు ఉండేవారు. ఇప్పుడు తెలుగు సంస్కృతి అన్న పేరు పెట్టి చిన్న పిల్లలతో ఇలాంటివి చేయిస్తున్నారు. పెళ్ళి , పండగలు , పెళ్ళి రోజులు, పుట్టిన రోజులు ఏదైనా సరే ఉచితం గా దొరికేది పిల్లలే కాబట్టి ఇదొక సంస్కృతి లాగా తయారయింది. నేను ఇంకా గమనించింది ఏంటంటే అమెరికా లో ఏ కార్యక్రమానికైనా నలుగురు జనాలు రావాలి అంటే ఇదే చాలా సులువైన మార్గం . పది మంది పిల్లలతో డాన్సు చేయిస్తే పది కుటుంబాలు అన్ని పన్లు వదిలేసి వస్తారు కదా. సినిమా వెర్రి లోనుండి మన వాళ్ళు ఎప్పుడు బయట పడతారో !!

    • చంద్రిక గారు- మీ కామెంట్కి ధన్యవాదాలు!

  5. ప్రాయశ్చితం చెప్పండి

  6. “అరగంట ముందుగా చేరుకున్నాను.” — అబద్దాలు చెప్పకండి. అదే నిజమయితే మీరు తెలుగోడే కాదు పొమ్మంటా! :)

    • ప్రసాద్ గారు- అరిటాకు, ముప్పై పిండి వంటలు అని ముందే కారణం చెప్పాను కద! :-)

  7. “ముఖపుస్తకం (పేస్బుక్) తెరిచి చూడగానే ఒక సోషల్ నెట్వర్కింగ్ స్టార్, దేశంలో ఏ సమస్యా మిగలనట్టు సినిమాలు ఉద్దరించడానికి పూనుకున్నాడు. తనని, తాను ఫిల్మ్ ఆక్టివిస్ట్ అని ప్రమోట్ చేసుకుంటాడు. ప్రముఖ సినీ కుటుంబాలు పరిశ్రమని మొనోపలైజ్ చేసి చిన్న నిర్మాతలని, బుల్లి హీరోలని నల్లిలా నలిపేస్తున్నారు, టాలెంట్ని అణగదోక్కేస్తున్నారు అని ఫేస్బుక్లో అంతర్మధనం చెందుతూ ఉంటాడు. ఎలాగైనా సినిమాని కబంధ హస్తాల నుండి విడిపించడం ఇతని జీవిత లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా ఫేస్బుక్ అనే మాధ్యమాన్ని వాడుకుంటూ, లెక్క లేనంత మంది సినీ వ్యసనపరుల్ని ఫాలోయర్స్ గా కూడ గట్టుకున్నాడు. ఈ మధ్యనే “మాడిన దోశ” అనే “క్రౌడ్ ఫండింగ్” సినిమాని (బిలో) మామూలు ఫార్ములాతో తీసి చేతులు….కాదు, కాదు.. వేరే వాళ్ళ వేళ్ళకి వాత పెట్టాడు.”

    కేవలం ఒక వ్యక్తిని వుద్దేశించి ఒక పేరా రాయడం ఈ వ్యాస వుద్దేశానికి, గౌరవానికి అనుగుణంగా లేదు. మీ వ్యాసం మామూలు వ్యాసంగాల్లో వుండి సినిమా వ్యసనంలో పడిన వారి గురించి కదా. ఆయన సినిమా వాడు, సినిమాల గురించే మాట్లాడుతారు. ఇక్కడ మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలే అతనివీ అని నా నమ్మకం.

  8. మీరు ఈ టీవిలో డీ జూనియర్స్ చూడండి పిల్లలని ఎలా చెదగోతున్నారో తెలుస్తుంది

  9. Chimata Rajendra Prasad says:

    మీరు రాసిన వ్యాసంలోనే మీరు విమర్శించే పరిస్థితులకు కారణాలు ఉన్నాయి. టీవీ లేని రోజుల్లో నాటికలకు, కవితా పఠనాలకు, శాస్త్రీయ నృత్యాలకు ఎంతో కొంత ఆదరణ ఉండేది. టీవీ ఇంటింటినీ ఆక్రమించిన తర్వాత అది ఏకైక కాలక్షేపసాధనంగా మారిపోయింది. టీవీల వాళ్ళకు కూడా 24 గంటలు ప్రసారాలు కావాలంటే సినిమాల మీద ఆధార పడక తప్పటం లేదు. డాన్సులు కావాలంటే సినిమా పాటలు రెడిమేడ్ గా దొరుకుతున్నాయి. టీవీల ప్రభావాన్నించి, ప్రత్యేక కళాభిరుచి ఉండి వేరు వేరు కళారంగాల్లో ప్రవేశం ఉండి, వాటి ద్వారా రసాస్వదన చేయగల వాళ్ళు తప్ప, సాధారణ ప్రజానీకం తప్పించుకోలేరు. ఈ పరిస్థితి మారదు.

  10. buchi reddy gangula says:

    మధు గారు
    అమెరికా లో ఉన్న జాతీయ — లోకల్ తెలుగు సంగాలు అన్ని నడుపే విధానం — అంతా
    మీరు గుళ్ళో చూసిన భాగోతం లాగానే — నడుస్తున్నాయి —
    విరాళాలు యిచ్చే వాళ్ళు ఉన్నారు —ప్లస్ అన్ని సంగాలు ఒక్కలు –యిద్దరు పెత్తనాలతో
    ఆధిపత్యం తో —-ఏళ్ళ తరబడి — నడుస్తున్నాయి — పచ్చి నిజం
    చిరంజీవి 150 వ cinema పేజి 3 news– ప్రతి రోజు– అన్ని పత్రికల్లో — టి వి ల లో
    (కొంతకాలం )– 60 ఏళ్ళ నటుడు హీరో — రాజకీయాల్లో ఒనుమాలు తెలియని వాడు కేంద్ర మంత్రి ??? మనది ప్రజా సామ్య దేశం గా ???
    బన్నీ — రామ్ చరణ్ — బెస్ట్ ఆక్టర్ లు ???
    యి రోజు తెలుగు సినిమా ను ఏలుతున్నది — నాలుగు families….కాదా —
    నిజాలు రాయడానికి భయ 0 దేనికి ???
    వార సత్వం లేని దెక్కడ ??? Desha రాష్ట్ర రాజకియాల్లా గానే — సినీలోకం లో వారసత్వాలు లేక పోలే దు —-
    నార లోకేష్ next. c.m…..??? యీ రోజు వార్తల్లో లోకేష్ మకాం విజయవాడ లో వచ్చే వారం నుండి ?????? అది వార్త
    యింకో రోజు లోకేష్ మంత్రుల తో చర్చ ????న్యూస్ ///

    బాబు — — మొన్న Warangal లో — నేను లెటర్ యివ్వడం వల్లనే తెలంగాణా వచ్చింది —అంటూ upanyaasam– తెల్లారి Vijayawada లో —-విభజన రాజకీయ పార్టీ ల తో సంప్రదించక — చాల పొరపాట్లు జరిగాయంటూ ———–

    మధు గారు ——వవస్థ తిరు అంతే ——-సర్

    —————బుచ్చి రెడ్డి గంగుల ————————————

  11. Raja Rajeswari Kalaga says:

    చిన్న పిల్లలని వదలటం లేదు, టీన్ ఎజర్స్ ని వదలటం లేదు,యువతులని వదలటం లేదు,కనీసం మహిళలని వదలటం లేదు.అన్ని వయస్సులవారిని t v ఏదో ఒక చెత్త కార్యక్రమం లో పార్టి సిపెంట్ చేయించి ఎగిరిస్తున్నారు. ఆ చేసేవాళ్ళకి సిగ్గు లేదు చూసే వాళ్లకి సిగ్గులేదు.చూసేవాళ్ళకి ఉన్నా ఎం లాభం.ఎవడు పట్టించుకుంటాడు.నీ ఆలోచనలు పాతవి అంటున్నారు.సినిమా లో ఆ అమ్మాయి డబ్బులు తీసుకుని ఆ విధమైన బట్టలు వేసుకుంటుంది.బయట ఎక్కడైనా కనిపించాల్సి వస్తే నీట్ గ ఉంటుంది. ఈ ఆంకర్ లకి ఎం మాయరోగం?t v పెడితే చాలు, సగం బట్టలు వేసుకుని తయారు.మధు గారు, చాల బాగా రాసారు.సినిమా అనేది ఎంతో లోతు గా ఊబి లా మనుషులని లాగేస్తోంది.not a good thing

  12. m.viswanadhareddy says:

    సాం (స్క్చ్రుతకమ్) ఈ స్పెల్లింగ్ లాగే

  13. నా సావి రంగ, ఉతికి ఆరేశారుగా! ఆలమెరికా తెలుగు సాంస్కృతిక సమితుల తరపున నా మనోభావాలు తీవ్రంగా దెబ్బతినేసినాయి :) :) :)
    Well done. However, I agree with Charasala garu on that one point – that individual criticism did not fit in with the rest of the article.

  14. buchi reddy gangula says:

    individual.criticism…ఎవరి మీద /// చెపుతే తెలుస్తుందిగా —తెలువ కూడదా ???
    మధు గారు —-దాయకుండా చెప్పారు — బాగుంది

    ————————–బుచ్చి రెడ్డి గంగుల

  15. దేవరకొండ says:

    మంచి వ్యాసం అందించి నందుకు మధు గార్కి అభినందనలు.
    అలనాడు హీరో కృష్ణ గొప్ప జోస్యం చెప్పారు. టీవీలు ఊపందు కుంటున్న రోజుల్లో సినిమా ‘దెబ్బ’ తింటున్దేమోనని తెలుగు (సినిమా పిచ్చి) వాళ్ళు భయంతో చర్చించు కుంటున్నారు. టీవీలు కూడా సినిమాకే చాకిరి చేస్తాయని కృష్ణ జోస్యం చెప్పారు. అది అక్షరాలా నిజమైంది. సినిమా పిచ్చిలో తెలుగు వాళ్ళు (తెలంగాణా కాదు), తమిళం వాళ్ళు అన్న దమ్ములు. థియేటర్ లు కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనే రికార్డు స్థాయిలో వుంటాయి. టీవీ చానళ్ళు కూడా ఈ రెండు భాషలకే ఎక్కువని విన్నాను. ఒక జాతి సంస్కృతిని కళా రూపమైన సినిమా కొంత ప్రభావితం చేయడం సహజమే! కాని, ఆ జాతి సంస్క్రతే సినిమా అయిపోవడం విచారకరం. దాని ప్రభావం ఆ జాతి ఆలోచనా ధోరణిపై, అభివృద్ధిపై కూడా ఉంటుందని గుర్తించాలి. అభివృద్ది చెందుతున్న కుటుంబాల్ని దుర్వ్యసనాల పాలు చేసి పూర్వం గ్రామాల్లో సంపన్న వర్గాల వారు తమ చెప్పు చేతల్లో వుంచుకునే వారు. దోపిడీ వ్యవస్థలో కూడా అదే మార్గాన్ని సినిమా క్రికెట్టూ ఇతర వ్యసనాల ద్వారా అమలు చేయడం యాదృచ్చికం కాదు.
    ఇలా జాతి కళ్ళు తెరిపించే వ్యాసాలు మరెన్నో రావాలని కోరుకుంటూ,

    • చందుతులసి says:

      దేవరకొండ గారు. అసలు రహస్యం బట్టబయలు చేశారు.

    • దేవరకొండ గారు సరైన విషయం చెప్పారు- క్రికెట్(T20), సినిమాలు దోపీడీ వ్యవస్థకి మూల స్తంభాలు!

  16. చాల చక్కగా వ్రాసారు.ప్రస్తుత మన తెలుగు సమాజానికి మీలా చక్కగా వ్రాయగాలవారు ఒక చారిత్రక అవసరం.

    • @సుజాత గారు- మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

  17. Devulapalli Durgaprasad says:

    మధు గారు, మీ వ్యాసం చదివిన తరువాత తెలుగు సంస్కృతికి మళ్ళా మంచి రోజులు వస్తున్నై అనిపిస్తోంది.

  18. Anuradha Akella says:

    Madhugaru,
    . Dharmaniki nyayaniki madhyana sukshma rekha vunnatte truth is different from fact.

  19. buchireddy gangula says:

    దేవరకొండ గారు

    నిజాల ను చెప్పారు —సర్

    —————————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

Leave a Reply to S. Narayanaswamy Cancel reply

*