ఆకురాలు కాలం

                  సుధా కిరణ్

  • Sudha Kiran_Photo

 

 

 

 

ప్రలోభమై వచ్చిందో

ప్రహసనమై వచ్చిందో

అబద్ధపు చిరునవ్వై వచ్చిందో

ఆత్మీయ స్పర్శలేని కరచాలనమై వచ్చిందో

ఆకురాలు కాలం వచ్చింది

 

శిధిలాల మధ్య ఆకాశ హర్మ్యపు కలలా నేలకు దిగిందో

చితిమంటల కన్నీటిపై, సమాధుల పై నడుచుకుంటూ వచ్చిందో

చిగురుటాకులను చిదిమివేస్తూ, పత్రహరితాన్ని మెలమెల్లగా కబళిస్తూ వచ్చిందో

చెట్లని కుదిపి ఆకులని రాలుస్తూ, సుడిగాలిలా వడివడిగా పరుగులు పెడుతూ వచ్చిందో

ఆకురాలు కాలం వచ్చేసింది

 

రక్తసిక్తమైన చిమ్మచీకటి రాత్రిలా వచ్చిందో

రహస్యంగా పొంచి, చుట్టుముట్టిన వేకువజామున వచ్చిందో

ద్వేషపు తూటాలు కసితో పొట్టనబెట్టుకున్న పట్టపగలు వచ్చిందో

నెత్తురుకక్కుతూ, నిస్సహాయంగా వొరిగిపోయిన సంధ్య వేళలో వచ్చిందో

ఆకురాలు కాలం రానే వచ్చింది

 

సంకెళ్ళు తగిలించిన చేతులతో వచ్చిందో

శవాల చేతులలో దొరికిన ఆయుధమై వచ్చిందో

చెల్లాచెదురుగా పడిన కూలీల కళేబరాలతో వచ్చిందో

అడవిలో నరికిన మానులపై అంకెల సాక్ష్యమై వచ్చిందో

గుర్తుపట్టే లోపులోనే ఆకురాలు కాలం వచ్చేసింది

 

(ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత ‘ఏక్ దిన్ యూఁ ఖిజా ఆ గయీ’ కి కృతజ్ఞతలతో…ఆ కవితకి తెలుగు అనువాదం కూడా ఇక్కడ..)

 

 మూలం: ఫైజ్ అహ్మద్ ఫైజ్

అనువాదం: సుధా కిరణ్

 

ఒకానొక రోజున ఆకురాలు కాలం రానే వచ్చింది

పొరలుపొరలుగా బెరడు సైతం వూడిపోయి

నల్లని మోడులన్నీ నగ్నంగా వరుసలో నిలబడ్డాయి

రాలిపోయిన పసుపుపచ్చని పండుటాకుల హృదయాలు

దారిపొడవునా పరుచుకున్నాయి

రాలిన ఆకులని కాలరాసి  చిదిమి ఛిద్రం చేసినా

గొంతెత్తి అడిగే వాళ్ళు లేరు

 

కొమ్మలపై కలల్ని గానం చేసే పక్షుల

గొంతులకి వురితాడు బిగించి

పాటలని ప్రవాసంలోకి తరిమి వేశారు

రెక్కలు విరిగిన పక్షులన్నీ తమకుతామే నేలకూలాయి

వేటగాడు యింకా విల్లు ఎక్కుపెట్టనే లేదు

 

ప్రభూ! వసంతుడా, కనికరించు

పునర్జీవించనీ మరణించిన యీ దేహాలని

తిరిగి ప్రసరించనీ గడ్డకట్టిన గుండెలలో రక్తాన్ని

చిగురించనీ వొక మోడువారిన  చెట్టుని

గొంతెత్తి గానం చేయనీ వొక పక్షిని

(మూలం: ఏక్ దిన్ యూఁ ఖిజా ఆ గయీ)

 

 

 

మీ మాటలు

  1. Narayanaswamy says:

    బాగుంది కిరణ్ నీ పద్యమూ ఫైజ్ ప్దద్యానికి నీ అనువాదమూ – మొన్ననే కదూ కూలీలను ఎంకౌంటర్ చేసి వారి శవాలకు అంకెలు వేసింది రాజ్యం….

    సంకెళ్ళు తగిలించిన చేతులతో వచ్చిందో

    శవాల చేతులలో దొరికిన ఆయుధమై వచ్చిందో

    చెల్లాచెదురుగా పడిన కూలీల కళేబరాలతో వచ్చిందో

    అడవిలో నరికిన మానులపై అంకెల సాక్ష్యమై వచ్చిందో

    గుర్తుపట్టే లోపులోనే ఆకురాలు కాలం వచ్చేసింది

    బాగున్నాయి పై ముగింపు (ముగింపు ఉండదు కదా ) వాక్యాలు ….

  2. రెడ్డి రామకృష్ణ says:

    సుధా కిరణ్ గారు మీ కవిత బాగుంది.ఫైజ్ అహ్మద్ ఫైజ్ గారి కవిత అనువాదం యింకా బాగుంది.అభినందనలు.

  3. m.viswanadhareddy says:

    గుండె ఒక్కటే .. సన్నివేశాలు రెండు. అనువాదపు ఆత్మ పట్టుకున్న మీ కవిత పిండిన గుండె నుంచి రాలిన
    రక్తపు చుక్కల్లా వుంది .

  4. నిశీధి says:

    అద్బుతంగా వచ్చింది . ముఖ్యంగా ఈ లైన్స్ ఎంత రియాలిటీ కదా

    సంకెళ్ళు తగిలించిన చేతులతో వచ్చిందో

    శవాల చేతులలో దొరికిన ఆయుధమై వచ్చిందో

    చెల్లాచెదురుగా పడిన కూలీల కళేబరాలతో వచ్చిందో

    అడవిలో నరికిన మానులపై అంకెల సాక్ష్యమై వచ్చిందో

    గుర్తుపట్టే లోపులోనే ఆకురాలు కాలం వచ్చేసింది

  5. చాలా చాలా బాగుంది.

  6. Kuppili Padma says:

    ప్రలోభమై వచ్చిందో

    ప్రహసనమై వచ్చిందో

    అబద్ధపు చిరునవ్వై వచ్చిందో

    ఆత్మీయ స్పర్శలేని కరచాలనమై వచ్చిందో

    ఆకురాలు కాలం వచ్చింది… యిలా మొత్తం కవితని యిక్కడ తిరిగి రాయాలనిపించేంత అద్భుత్వం గా ,పవర్ ఫుల్ గా వుంది మీ కవిత సుధా కిరణ్ గారు. Thank you for the poem.

  7. Dr.Vijaya Babu, Koganti says:

    If winter comes can spring be far behind??

    Never!

    Excellent Work sir!

    Kudos!

  8. Dr. Vani Devulapally says:

    సుధా కిరణ్ గారు ! మీ కవిత , అనువాదం కూడా చాలా చాలా బావున్నాయి !

  9. N Venugopal says:

    కిరణ్

    చాల చాల బాగున్నాయి, రెండూ, నీ కవితా అనువాదమూ కూడ. నీ కవిత్వం పుస్తకం వెయ్యమని ఎప్పటినుంచో అడుగుతున్నాను. ఇప్పటికైనా ఆలోచించు.

    నువ్వూ నారాయణస్వామీ నాకు పరిచయమైన రోజుల గురించి కవిసంగమంలో నేను రాస్తున్న కవిత్వంతో ములాఖాత్ లో గతవారమే రాశాను (https://www.facebook.com/photo.php?fbid=10152921310481700&set=gm.968866783166074&type=1&pnref=story)

    వి.

  10. Sudha Kiran says:

    అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు – సుధా కిరణ్

  11. Narayanaswamy says:

    నేనూ అంటూ ఉన్నా చాన్నాళ్ల నుంచీ పుస్తకం వేయమని – ఈ సారి ప్రత్యేకంగా అదే పని మీద హైదరాబాదు రావాలేమో!

  12. Rama Krishna says:

    చిగురించనీ వొక మోడువారిన చెట్టుని

    గొంతెత్తి గానం చేయనీ వొక పక్షిని

    ఈ రెండు వాక్యాలు నాకు బాగా నచ్చాయి

మీ మాటలు

*