వేదాంతి బాగోతం

 

చిత్ర: ఒక వేశ్యకంచి: ఆమె స్నేహితురాలు, వేశ్య రామి: పనిమనిషి

కంచి:  ఐతే ఆ కుర్రాడు నీ ఇంటికి రావడం మానేశాడా ఏమిటే, ఈ మధ్య బొత్తిగా కనిపించడం లేదు!

చిత్ర:   అవునే, నన్ను చూడొద్దని వాళ్ళ యజమాని అతన్ని కట్టడి చేశాట్ట. గదిలో పెట్టి తాళం వేశాట్ట.

కంచి:  ఎవర్ని గురించి నువ్వు చెప్పేది? ఆ కుర్రాడి యజమానంటే ఆ వ్యాయామశాల ఉపాధ్యాయుడు వీరభద్రయ్యేనా? అతను నాకు మంచి స్నేహితుడు.

చిత్ర:   అతనైతే బాగానే ఉండేది. వీడు వేరు. రామదాసనీ, ఉత్త పనికిమాలిన వేదాంతి.

కంచి:  అంటే ఒంటె మొహం లాగా ఇంత పొడుగు మొహం, నెత్తిమీద అంత పొడుగు పిలక, పిల్లల్ని వెంటేసుకొని ఊళ్ళో తిరుగుతుంటాడూ…!?

చిత్ర:   ఆ, ఆ ఎదవే, వాడికి చావన్నా తొందరగా రాదు. యముడు మంచివాళ్ళని తొందరగా తీసుకు పోతాడు, ఇట్టాంటి ఎదవని పిలక పట్టుకొని ఎప్పుడు ఈడ్చుకు పోతాడో!

కంచి:  వాడుత్త దొంగ వేదాంతి. వాడి వలలో నీ ప్రియుడెలా పడ్డాడే!

చిత్ర:   తెలియదు. నా ప్రియుడు నా గుమ్మం తొక్కి మూడు రోజులైంది. చాలా దిగులుగా ఉందే కాంచీ!

ఆడదంటే ఏమిటో, దాని మాధుర్యమేమిటో వాడికి నేర్పిన తొలి గురువును నేనేనే! నాతో తొలిరేయి గడిపిన తర్వాత వాడు మరొక ఆడదాని మొహం కూడా చూడలేదంటే నమ్ము!

కంచి:  మగవాడి నాలుక ఎప్పుడే రుచి కోరుకుంటుందో ఎవరికీ తెలుసు? మనసు మరొక వైపు లాగుతుందేమోనే!?

చిత్ర:   నాకూ అలాంటి పాడు అనుమానమే వచ్చి సంగతేంటో ఆరా తియ్యమని పనిమనిషి రామిని పంపించాను. అదే చెప్పింది, వాడీ దొంగ వేదాంతితో కలిసి తిరుగుతున్నాడని. దూరాన్నుంచి సైగ చేస్తే చూసి కూడా చూడనట్టు తల తిప్పుకున్నాడట. రామి కూడా పట్టు వదలకుండా వెంతపడిందట కానీ నా ప్రియుడు దానికి ఒంటరిగా దొరకలేదట. చూసి చూసి అది చెవులు జాడించుకుంటూ వచ్చేసింది.

కంచి:  అంతకంటే అది మాత్రం ఏం చెయ్యగలదులే!

చిత్ర:   అంతేనంటే మరి అప్పటి నుంచీ నేనెంత బాధ పడుతున్నానో గమనించావా నువ్వు? వాడెందుకిలా నాకు దూరమయ్యాడో ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు. వాణ్ని నేను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాను. ఎవత్తైనా వాణ్ని వలలో వేసుకొని నామీది ప్రేమని ద్వేషంగా మార్చిందేమోనని భయపడి ఛస్తున్నాను.

కంచి:  అవునే నాతల్లీ, మనం కొద్దిగా ఏమారితే చాలు, మన విటుల్ని ఎగరేసుకుపోవడానికి ఎంతమంది కిలాడి ముండలు లేరు ఈ వాడలో!

చిత్ర:   ఒకవేళ వాళ్ళ నాన్నేమైనా వీన్ని నాదగ్గరకు రాకుండా ఆపాడేమో…

కంచి:  అలాంటి అనుమానమెందుకొచ్చిందే నాతల్లీ! బుద్ధున్న తండ్రెవరైనా పిల్లాణ్ణి వేశ్య దగ్గరికి పోకుండా ఆపుతాడా?

చిత్ర:   కదా! ఇట్లాంటి అనుమానాలతో నేను సతమతమవుతుంటే ఆ నాప్రియుడు ఇవాళ మధ్యాహ్నం పంపాడమ్మా….

కంచి:  (ఆత్రంగా) ఏం పంపాడేమిటీ!

చిత్ర:   ఇదిగో, ఈ ఉత్తరం పంపాడు. చదువు. (తీసిస్తుంది)

కంచి:  (విప్పుతూ) ఏం రాశాడో! (విప్పి చూసి) రాత కుదురుగా లేదు. ఏదో హడావిడిగా గిలికినట్టుంది. (చదువుతోంది..)

  • చిత్రా, నిన్నెంతో ప్రేమిస్తున్నాను. ముక్కోటి దేవతలలో ఏ ఒక్కరి నడిగినా నీమీద నా ప్రేమ ఏ స్థాయిలో ఉందొ చెబుతారు. నీనుంచి విడిపోవటం నీమీద ప్రేమ లేక కాదు, తప్పనిసరై మాత్రమేనని నువ్వు గ్రహించాలి. మా నాన్న వేదాంతం నేర్పమని రామదాసు గారికి నన్నప్పగించారు. గురువుగారు మన సంగతి పూర్తిగా తెలుసుకొని నాకు ముక్క చివాట్లు పెట్టారు. నేనొక వేశ్యతో పోతే అది మాకుటుంబగౌరవానికి భంగమని చెప్పారు. విద్య నేర్చుకోవాలిగానీ, వ్యభిచారం కాదని మరీ మరీ చెప్పారు.

చిత్ర:   చూడవే కంచీ, వయసులో ఉన్నకుర్రాడికి చెప్పాల్సిన మాటలేనా అవి? వాడికి వాటం కమ్మి చావ! వాడేం గురువే?

కంచి:  (చదువుతోంది)

  • అలా మా గురువుగారికి లొంగి పోవాల్సిన పరిస్థితి వచ్చిపడింది. ఆయన నేనెక్కడికి పోతే అక్కడికి వెంటబడి వస్తున్నాడు. ఏ ఆడదీ నన్ను పలకరించకుండా కాపలా కాస్తున్నాడు. ఆయన చెప్పినట్టు విని ఆయన నేర్పే విద్య నేర్చుకుంటే కొద్ది రోజుల్లోనే నేను చాలా గొప్పవాడినవుతానని మరీ మరీ చెప్తున్నాడు. ఈ ఉత్తరం చాలా హడావిడిగా ఎవరి కంటా పడకుండా రాస్తున్నాను.

నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, శాశ్వత వియోగంతో,

నీ గోపాలం.

చిత్ర:   అదీ సంగతి! ఈ ఉత్తరం మీద నీ అభిప్రాయమేంటో ఇప్పుడు చెప్పు!

కంచి:  కుర్రతనపు రాతలు! అయినా ఆ చివరి రెండు వాక్యాల్లో కొద్దిగా అవకాశం కన్పిస్తోంది. ఏదేమైనా నీ గోపాలం సరసం తెలియని మొద్దే చిత్రా!

చిత్ర:   ఆ మాట నిజమే గానీ, వాడి ప్రేమ కోసం నేను పది చస్తున్నానే! వాడు పిల్లికూన లాగా నాలోకి ఒదిగి పోతాడే! అసలా రామదాసు గాడు వట్టి వెధవటే! వాడికి అందమైన కుర్రాళ్ళంటే తగని మోజట. చదువు చెప్పే మిష మీద ఆ పిలకదాసరి గాడు అందమైన కుర్రాళ్ళని దగ్గరకు తీస్తా డట. ఇప్పటికే గోపాలంతో కూడా అలాంటి మార్మిక సంభాషణ నడిపాడట. నేనెప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నాలే!

కంచి:  అమ్మ దుర్మార్గుడు!? అది సరేనే చిత్రా, ఈ వివరాలన్నీ ఎలా తెలుసుకోగలిగావే?

చిత్ర:   నీకు చెప్పగూడనిదేముంది? గోపాలం నౌకరు రంగణ్ణి కాస్త డబ్బాశ చూపించి లోబరుచు కున్నానే!

కంచి:  నమ్మకంగా సమాచారం చెప్పేవాడికి ఎంతిచ్చినా తప్పులేదు. రంగడు ఇంకా ఏమి చెప్పాడేమిటి?

చిత్ర:   ముసలి వేదాంతులు పూర్వం తమ పడుచు శిష్యులతో నడిపిన ప్రేమకలాపాల గురించి ఆ దుర్మార్గుడు రామదాసు రకరకాలుగా వర్ణించి గోపాలానికి చెబుతున్నాడటే!

కంచి:  వాడి నోరుబడ! అయినా వాడు చెప్పాడే అనుకో, వినేవాడికైనా బుద్ధుండొద్దటే!

చిత్ర:   ఏముంటుంది? ఆడవాళ్ళతో గడిపితే మెచ్చడనీ, ఆ ప్రేమ కలాపమేదో తమ లాంటి ముసలి వేదాంతులతో జరిపితే భగవంతుడు మెచ్చి మేకతోలు కప్పుతాడనీ చెప్తున్నాడట!

కంచి:  దేవుడి పేరు చెప్పి ఎలాంటి పాపానికైనా ఒప్పిస్తారీ వేదాంతులు. మరి గోపాలం ఏమన్నాడట?

చిత్ర:   పాపం వాడు చిన్నవాడే! అట్లాంటి మాటలకెలా ఎదురు చెప్పాలో తెలిసే వయసా వాడిది? రంగడే పూనుకొని, అట్లాంటి మాటలు చెప్తే పెద్ద యజమానికి చెప్పి సంగతి తేలుస్తానని ఆ వేదాంతి గాణ్ణి బెదిరించాడట.

కంచి:  శభాష్! రంగడికి మంచి బహుమతి ఇవ్వాలే మనం!

చిత్ర:   నేనిప్పటికే వాడికి ఇచ్చేశాలే! ఏం బహుమతని మాత్రం అడక్కు. వాడికేవో చిన్న చిన్న మోజులుంటాయి కదా! వాడు మాత్రం మనకిప్పుడు గులాం!

కంచి:  అంతే, అంతేలే! ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. అంతా మంచి గానే జరుగుతుంది. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఒకటుంది. ఆ దొంగ వేదాంతి తన కొడుక్కి ఎలాంటి పాఠాలు నేర్పుతున్నాడో గోపాలం తండ్రికి తెలిసేలా చెయ్యాలి.

చిత్ర:   అదెలా!?

కంచి:  గోపాలం తండ్రి రోజూ ఊరిచివర వ్యాయామశాల గోడ పక్కనున్న దారిలో నడుస్తూ విహారానికి వెళ్తాడు. ఆ గోడ మీద ఈ దొంగ వేదాంతి బాగోతం గురించి రాస్తే మిగిలిన పని ఆయన చూసుకుంటాడు.

చిత్ర:   ఎవరూ చూడకుండా ఆపని చెయ్యడం ఎలాగే?

కంచి:  అదికూడా నేనే చెప్పాలా! రాత్రిపూట ఆ దారంతా నిర్మానుష్యంగా ఉంటుంది. చక్కగా ఈ రాత్రికే మనం వెళ్లి ఆ పని చేస్తే సరిపోతుంది.

చిత్ర:   ఇంత సాయం చేస్తున్నావు. నీ ఋణం తీర్చుకోలేనే కంచీ!

కంచి:  పిచ్చి పిల్లా, ఇది నీ ఒక్క దాని సమస్య కాదు. ఇలాంటి పిలక పంతుళ్ళు కుర్రాళ్ళని తప్పు దోవ పట్టిస్తుంటే మన వేశ్య జాతి చేతులు ముడుచుకు కూర్చుంటుందిటే!

 

 

 

 

మీ మాటలు

  1. దేవరకొండ says:

    ఈ మాట వాడుతున్నందుకు మన్నించాలి. ఈ ‘సంభాషణలు’ అంతా ‘సొల్లు’ తో నిండి వున్నాయి. రావు గారు తమ శక్తి యుక్తుల్ని మరొక మంచి విషయంపై ఎందుకు సద్విని యోగం చేయకూడదు?

Leave a Reply to దేవరకొండ Cancel reply

*