మనలో ఒకడు

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshసామాన్యుడా? అసామాన్యుడా?
కాదు, సాధారణుడు.

రెండు రాష్టాల ఉమ్మడి రాజధాని తాలూకు అసెంబ్లీ భవనం సాక్షిగా, మహాత్మాగాంధీ విగ్రహం సాక్షిగా ఒక వ్యక్తి దిసమొలతో అలా నడుస్తూ వెళుతున్న ఈ చిత్రం ‘గాంధీ తెచ్చిన స్వాతంత్ర్యం ఏమైంది’ అని ప్రశ్నిస్తుందా? చట్టసభలు, రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హామీలు ఏమైనాయని మాట్లాడుతుందా? ఏమో!

కానీ, నాకైతే ఇలాంటి ప్రశ్నలు వద్దు. వాటి గురించి నేను చర్చించను.
ఎందుకంటే, ఈ చిత్రానికి అసెంబ్లీ వల్లో గాంధీ వల్లో ప్రాముఖ్యత పెరగకూడదని నా అభిలాష. అలా కాకుండా చూడాలని మనవి.

చుట్టూ పరిగెడుతున్న వాహనదారులనూ గమనించండి.ఒక బస్సు. ఒక కారు, ఆటో ట్రాలీ, ఆటో, మోపెడ్ చివరకు లూనా. అవును. ఆ లూనా మీద తన జీవన వ్యాపారాన్ని సాఫీగా సాగించుకునే క్రమంలో భర్త తన ముందర భార్యను కూచోబెట్టుకుని వెళ్లడమూ ఉన్నది. అవన్నీ ఉండగా జీవితం అలా వివిధాలుగా ఒక వైపు ప్రవహిస్తూ ఉండగా ఒకే ఒక్కడు వారందరి గమనానికి  భిన్నంగా ఒక ఎదురీతలా నడిచి వెళుతున్నాడేమిటి? అదీ దృశ్యం లేదా దృశ్యాదృశ్యం.

ఇప్పుడు చూడండి చిత్రాన్ని.
అందరితో అతడిని చూడండి, ప్లీజ్.
మా నాయినమ్మ కట్టుకునేది. కాళ్లు నొయ్యకుండా కట్టుకుంటారే ఆ కట్టు! అదీ ఉందాయనకు. అలాగే, నగ్నత్వాన్ని దాయగలిగేది ఇంకా ఏదైనా ఉన్నదీ అంటే మొలదారానికి ఆ గోచి. దిసమొల. అదొక్కటే వస్త్రం అతడికి. అది కూడా వస్త్రం కాదు, ఒక పాలిథిన్ కవర్. దాన్ని అచ్చాదనగా కట్టుకున్నాడాయన.  అట్లా వెళుతున్నాడాయన. బరివాతల, చెప్పులు లేకుండా అతడు సరాసరి నడిచి వెళుతూ ఉన్నాడు. ఒక మ్యాన్ హోల్ దాటి నడిచాడు కూడా…ఎక్కడికి?ఏమో!

చూసే దృశ్యంలో అలవాటైన దృశ్యం చూడకుండా, చాలా ప్రామిసింగ్ గా కనిపించే దృశ్యం మాత్రమే చూడకుండా ఉండాలనే ఈ నాలుగు మాటలు. అతడ్నో అసెంబ్లీ- మహాత్ముడినో కాకుండా మనల్ని కూడా ఈ ఫొటోలో దించాననే నేను భావిస్తున్నాను. అవును. మొత్తం ఒక వ్యక్తి స్థితికీ గతికీ మొత్తం దృశ్యం కారణం అవుతుందిగానీ మహాత్ముడి శిలా విగ్రహమో, చట్ట సభో కాదని చెప్పాలనే ఈ మాత్రం అక్షరాల్లో విడమరచి చూపాల్సి వస్తోంది..

ఒక వ్యక్తి రోడ్డుమీద జీవిస్తున్నాడంటే, ఫుట్ పాత్ పై జీవిస్తున్నాడంటే అందుకు మనందరం బాధ్యులం.
లేదా మనందరి బాధ్యాతారాహిత్యమే అతడినలా స్వతంత్రంగా నడిపిస్తున్నదనడం కరక్టా కాదా తెలియదు. కానీ, చిత్రంలో అవన్నీ ఉన్నాయనే నా భావన.

ఐతే, అతడ్ని అలా చూసినప్పుడు నాకెటువంటి ఆశ్చర్యమూ కలగక పోవడానికి కారణం నా హార్డ్ డిస్క్ లో మీరూహించనైనా ఊహించని మరింత నగ్నత్వం, మన బాధ్యతా రాహిత్యానికి పరాకాష్టగా చెప్పుకోదగ్గ అభాగ్యుల చిత్రాలు బోలెడు ఉన్నయ్. కానీ, ఇదొక్కటి చాలు. ఇందులో చాలా ముమెంట్స్ ఉన్నాయి. మూవ్ అవడానికి స్కోప్ ఎక్కువ వుంది. అలా అని ఇదొక్కటే కాదు, ప్రతి చోటా చూడండి. ఒక ఎదురీత ఉంది. ఒక వ్యక్తి అడ్డంగా మన భద్ర జీవితాన్ని ఖండిస్తూ వెళ్లిపోతూనే ఉన్నాడు. గమనిస్తే, ప్రతి చోటా ఒక గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం లభించకపోతే గిట్లే పిచ్చి పట్టినట్టు తిరిగేవాడనీ అర్థమౌతుంది. అందుకే, ఈ చిత్రం మహాత్ముడి గురించి కాదు, అసెంబ్లీ గురించి కాదు. ప్రవహించే మన జీవితం గురించి. మనలో ఒకరి గురించి.

థాంక్స్.

మీ మాటలు

 1. narsan b says:

  Touching photo and impressive and owned angle of presentation. ఇంత దయలేని భాగ్యనగరంలో నేనూ ఒకడినే కదా ! అక్కడ పోయింది ఆ ఒక్కడి మానమేనా , నాది కూడా!

  • kandukuri ramesh babu says:

   థాంక్ యు ఫర్ యువర్ కామెంట్ అన్న.

 2. Doctor Nalini says:

  తరతమ బేధాలు , వ్యత్యాసాలు – మన సమాజపు కుష్టు రోగం . ఆకాశ హర్మ్యాల పక్కన పూరి గుడిసెలు , విందువినోదాల పక్కన కాలే కడుపులు , లక్షల జీతం పక్కన కుంగదీసే నిరుద్యోగం , కుదబలిసిన సంపద పక్కన దుర్భర పేదరికం – ఇవన్నీ చూడాలంటే మీ లాంటి కన్ను వుండాలిసిందే ! పరిష్కారాలు వెతకవలసిందే .

  • kandukuri ramesh babu says:

   బాధ్యత పెంచే మీ అభినందనకు థాంక్స్ ప్లీజ్.

 3. mallikarjun says:

  ప్రవహించే జీవితాల్ని ఫొటోల్లో బందించి, బంధీలైన మనసుల్ని కదిలిస్తున్నారు. చాలా బావుంది సార్ దృశ్యాదృశ్యం. hats off sir

 4. rachakonda srinivasu says:

  ఆణువణువూ సృజించారు. సృహ పెంచారు .

 5. ఈ బొమ్మ చూపించేది సమాజపు నగ్నత్వం. మనల్నే నగ్నంగా చూపిస్తోంది. ఇప్పుడే డాన్ (http://www.dawn.com/news/1187579/cobblers-adding-to-the-list-of-skilled-labour-in-india) లో చెప్పులు కుట్టే వృత్తివారి మీద ఒక ఫోటో ఫీచర్ చూసి వస్తున్నా. ఎందుకు మన దిన పత్రికలు ఈ జీవితాన్ని చూపించవు అని. ఎనబై శాతపు జీవితాన్ని చూపకుండా పది శాతపు జీవితానికి పత్రికల్లో ఎనబై శాతపు చిత్రీకరణ.
  మీ పోటో చూశాక హమ్మయ్యా మనకూ ఒక సారంగ వుంది అన్న తృప్తి కలిగింది.

మీ మాటలు

*