ఓ కురుక్షేత్ర సైనికుడి డైరీ

 సిద్ధార్థ గౌతమ్

Gouthamఐదవ రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు –

 నేను మూడు, నాలుగు రోజులు గుడారం లోనే ఉండాలని మా సేనాని అన్నాడని నా గుడారం లో నాతో పాటు ఉన్న సైనికుడు చెప్పాడు. అప్పటికీ నేను కోలుకోలేకపోతే నన్ను ఇంటికి పంపించేస్తారని కూడా చెప్పాడట. నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి తను వెళ్ళిపోయాడు.

 ఎవరో వచ్చి నాకు తినటానికి తిండి, తాగటానికి నీళ్ళు ఇచ్చి వెళ్తున్నారు కాని, నా మనసంతా రణభూమి దగ్గరే ఉంది. లేచి నిలబడ్డాను. కాలు నొప్పిగా ఉంది. నాలుగు అడుగులు వేసాను. నొప్పి నాలుగింతలు అయ్యింది. అనవసరంగా లేచాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ నాలుగడుగులు వేయాలి. మళ్ళీ నొప్పి భరించాలి. ఎందుకొచ్చిన తలనొప్పని అక్కడే నేల మీద కూర్చున్నాను.

నేనొక సైనికుడిని. ఒక వైపు యుధ్ధం జరుగుతూ ఉంటే ఇలా గుడారం లో ఘడియలు లెక్కపెడుతూ ఉండటం చాలా బాధ కలిగిస్తోంది.

ఏదో చిన్న మూలుగు వినిపిస్తే అటు తిరిగి చూసాను. పక్క గుడారం బయట ఒకడు కింద కూర్చుని ఉన్నాడు. వాడి కాలుకీ కట్టు ఉంది.

“నువ్వూ నాలుగడుగులు వేసావా?” అనడిగాను.

“ఆరు..” అన్నాడు తన కాలు చూసుకుంటూ.

“నిన్న చనిపోయినా బావుండేది. ఇలా కదలకుండా గుడారానికి పరిమితమవ్వటం బాలేదు.” అన్నాను మాట కలపటానికి.

వాడు ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత నేనూ నిశ్శబ్దంగా ఉండి పోయాను. ఒక గంట సేపు అలానే కూర్చుని ఉన్నాను.

మా ఇంట్లోవాళ్ళు, మా ఊళ్ళో జనం..ఇప్పుడు ఏమి చేస్తూ ఉంటారో? అసలు వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న విధ్వంసం గురించి ఏమైనా తెలుసా? ఇంతటి మహాయుధ్ధం జరుగుతూ ఉంటే అందరూ ఇక్కడికి ఎందుకు రాలేదు? పక్క గుడారం బయట నేల మీద కూర్చుని ఉన్న వాడు ఎంత సేపటికి లోపలికి వెడతాడు? ఈ రోజు కౌరవులంతా హతమైపోతే రేపు అంతా సర్దుకుని ఇళ్ళకు వెళ్ళిపోవచ్చా? నేను గాయపడినందుకు మా సేనాని నా మీద కోపంగా ఉన్నాడా? ఏ ప్రశ్నకూ సమాధానం తోచట్లేదు.

బాగా దాహంగా ఉంది. కష్టంగా ఉన్నా..పైకి లేచి నిలబడ్డాను. నొప్పి భరిస్తూ నడిచాను. చెంబు లోని నీళ్ళు గొంతు లోకి దిగేసరికి ప్రాణం కాస్త కుదుట పడింది.

సూర్యాస్తమయం అయ్యింది. మా సైనికుల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. గుడారం లో నాతో ఉన్న సైనికుడు రాలేదు. పాపం ఏమయ్యిందో ఏమిటో. చాలా పొద్దు పోయాక వచ్చాడు. బానే నడుస్తూ ఉన్నాడు.

“ఇంత ఆలస్యమయ్యింది. ఏమి జరిగింది?” అనడిగాను వాడు లోపలికి రావటంతోటే.

“మన వాళ్ళు చాలా మంది పోయారు ఈ రోజు. భీష్ముల వారిని చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది. కృష్ణుడు ఏదో ఒకటి చేయకపోతే..పాండవులు ఇక ఎక్కువ కాలం పోరాడలేరు. మరోవైపు ద్రోణాచార్యులు సాత్యకి ని ఏ క్షణం లోనైనా చంపేలా ఉన్నారు. భీముడు రక్షించి ఉండకపోతే ఈ రోజు సాత్యకికి కూడా అంత్య క్రియలు జరిగేవి.” అన్నాడు..

నేను మారు మాట లేకుండా వింటూ ఉన్నాను.

“దుర్యోధనుడు పంపిన ఒక పెద్ద సమూహాన్ని అర్జునుడు హతమార్చేసాడు. మాకు కాస్త ధైర్యం వచ్చింది. లేకపోతే రేపు కౌరవులని ఎలా ఎదురుకుని ఉండేవాళ్ళమో ఏమిటో….నీకెలా ఉంది?” అనడిగాడు.

“నేను రేపు వచ్చేస్తాను. మన సేనానితో చెప్పు..” అన్నాను ఉద్వేగంగా

వాడు నా వైపు చూసి…”నువ్వే వెళ్ళి చెప్పి రా. ఆయన గుడారం దాకా నడిచి వెళ్ళి, తిరిగి రా..అప్పుడు చూద్దాం..” అన్నాడు.

ఉదయం జరిగిన నాలుగడుగుల ప్రయాణం గురించి చెప్పాను. తను లోపలికి వచ్చేటప్పుడు పక్క గుడారం బయట కూర్చుని ఉన్న సైనికుడిని లోపల కూర్చోబెట్టి వచ్చాను అని చెప్పాడు. ఇద్దరం నవ్వుకున్నాము. ఆ తరువాత పడుకునేదాకా మా కుటుంబాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము.

మరుసటి రోజు త్వరగా మెలకువొచ్చేసింది. నా కాలిగాయం ఎలా ఉందో చూసుకుని..మళ్ళీ పడుకోవటానికి ప్రయత్నించాను. నా పక్కనున్న సైనికుడు లేచి, యుధ్ధానికి వెళ్ళిపోయాడు.

మధ్యాహ్నం దాకా ఎలాగోలా గడిపాను. ఆ తరువాత నా వల్లకాలేదు. కాలు నొప్పిగా ఉన్నా లేచి నడుచుకుంటూ గుడారం బయటికొచ్చాను. ఒళ్ళంతా చమట పడుతోంది…ఐనా అలానే నడిచాను. ఒకసారి పక్క గుడారం వైపు నడిచాను. నిన్న బయట కనబడ్డవాడు లోపల పడుకుని ఉన్నాడు. పలకరిద్దామని వెళ్ళాను. నన్ను చూసాడు కాని, ఏమీ మాట్లాడలేదు.

“అలా ఉండకు.. నాకూ ఈ యుధ్ధం ఇష్టం లేదు. నాకూ ఇల్లు గుర్తొస్తోంది. ఇలా దిగులుగా కూర్చుని ఏమి లాభం చెప్పు. ఇలా చూడు..నాకూ గాయమయ్యింది.” అని నా కాలి గాయం చూపించాను.

“పద…ఇద్దరమూ కుంటుకుంటూ అలా తిరిగొద్దాం..” అని నవ్వించటానికి ప్రయత్నించాను..

వాడు తన కాళ్ళు చూపించాడు. పాపం…మూడు చోట్ల బాణాలు దిగాయి. నేను ఒక్క బాణానికే ఇంత కష్టమనుభవిస్తున్నానే..ఇంత బాధ ఎలా ఓర్చుకుంటున్నాడో ఏంటో..

“నాకాలికి బాణం దిగి..నేను కూలబడినప్పుడు…ఒక కౌరవ సైనికుడు నా కళ్ళ ముందు మా తమ్ముడిని కత్తితో పొడిచాడు. వాడిని కాపాడుకుందామని లేవటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎవరో నా కాళ్ళకి మరో రెండు బాణాలు వేసారు. నేను చూస్తూ ఉండగానే మా తమ్ముడు కుప్పకూలిపోయాడు.” అన్నాడు. నాకు నోట మాట రాలేదు. ఏమనాలో, వాడిని ఎలా ఓదార్చాలో తోచలేదు. సాయంత్రం దాకా వాడి పక్కన్నే కూర్చుని ఉన్నాను. కానీ ఏమీ మాట్లాడలేదు. వాడు నిద్రపోతున్నప్పుడు ఏడ్చాను. నా కాలి నొప్పి, నేను మనసులో పడుతున్న సంఘర్షణ చాలా చిన్నవిగా కనబడ్డాయి.

రాత్రికి నా గుడారం లో ఈ రోజు ఏమి జరిగిందో చెప్పాడు నా సహచరుడు. నిన్న భీష్ముల వారు చంపినట్టు ఈరోజు ద్రోణాచార్యులు చంపారట. పాండవ సైన్యం బాగా దెబ్బ తింటోంది.

“పాపం ఆ పక్క గుడారం వాడి తమ్ముడు పోయాడట. ఆ విషయం తెలియకుండా నిన్న వాడి గురించి మాట్లాడుకుని నవ్వుకున్నాము…పాపం..” అన్నాను..మళ్ళీ ఏడుపొచ్చింది.

రెండు క్షణాలాగి..పక్కగుడారానికి వెళ్ళి పలకరించి వచ్చాడు. పడుకునే ముందు నా గాయం గురించి అడిగాడు.

ఆ తరువాత రెండు రోజులూ పక్క గుడారం లోనే గడిపాను. రోజులో చాలా భాగం పడుకుని ఉండేవాడు. ఒక్కోసారి మాట్లాడేవాడు.

యుధ్ధం లో తొమ్మిదవ రోజు రాత్రి..నన్ను, పక్కగుడారం వాడిని కూర్చోబెట్టి ఆ రోజు విశేషాలు చెప్పాడు నా సహచరుడు. భీష్మ పితామహుడు పాండవ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాడేమో అనిపించి..కృష్ణ పరమాత్ముడు బరిలోకి దిగాడట.

“భలే” అని అరిచాను నేను.

“కృష్ణుడు ఒక రథచక్రాన్ని చేతిలోకి తీసుకుని భీష్ముడిని హతమార్చటానికి వెళ్ళటం చూసి…ఇక ఈ పూట తో యుధ్ధం అయిపోయింది అనుకున్నాను సోదరా..ఆయన్ని అలాంటి ఉగ్రరూపం లో ఎన్నడూ చూడలేదు. ఆయన తన వైపు రావటం చూసి భీష్ముల వారు తన అస్త్రాలను కింద పెట్టేసారు.” అన్నాడు

నాకు ఆనందం…ఉత్కంఠ..

“అర్జునుడు పరిగెట్టుకుంటూ వచ్చి..’యుధ్ధం లో అస్త్రాలను తాకను ‘ అన్న తన శపథాన్ని కృష్ణుడికి గుర్తు చేసాడు. అర్జునుడు రావటం ఒక్క క్షణం ఆలస్యమయ్యుంటే…”

నాలో ఏదో నూతనోత్సాహం. కాలి గాయం ఎలా ఉందో చూసుకోలేదు. నడుచుకుంటూ మా సేనాని దగ్గరికెళ్ళాను. పాండవుల గుడారాలలో ఏదో ముఖ్యమైన చర్చ జరుగుతోంది..చాలా మంది ఉన్నారు అక్కడ.

మా సేనాని నా వైపు చూసాడు.

“నేను రేపు యుధ్ధానికి సిధ్ధమండి..” అన్నాను. నా కాలు చూపించమన్నాడు. చూపించాను. పరిగెట్టి చూపించమన్నాడు. చూపించాను.

ఇంకా ఏమైనా చెబుతాడేమో అని ఎదురు చూసాను. నన్ను మళ్ళీ చూసి…”రేపు అర్జునుడి రథసారథి గా కృష్ణుడు రావట్లేదు.” అన్నాడు.

ఆ మాట వినగానే తల మీద పెద్ద బండరాయి పడ్డట్టయ్యింది.

“నాకు కాలు నొప్పి ఇంకా తగ్గలేదండి..నేను రేపు రాను..” అనేసాను వెంటనే.

“రేపు ఒక్క రోజు శిఖండి ని రథసారథి గా నియమించమని కృష్ణుడే చెప్పాడు. భీష్ముడిని ఆపటానికి అదొక్కటే మార్గం. మనము భయపడవలసిన పని లేదు. ఆయన మనల్ని కనిపెట్టుకునే ఉంటాడు. వెళ్ళి విశ్రాంతి తీసుకో.” అన్నాడు మా సేనాని.

“ఐతే నేను రేపు ఉదయమే తయారైపోతాను. నాకు ఏమైనా సూచనలుంటే చెప్పండి.” ఏ తడబాటూ లేకుండా చెప్పాను..

ఆయనని ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు. నేనూ నా గుడారానికి తిరిగి వచ్చేసాను.

రేపు పదవ రోజు. ఈ యుధ్ధం గమనాన్ని మార్చే సంఘటన ఏదో జరగబోతోందని బలంగా అనిపిస్తోంది. అది మాకు అనుకూలంగానా, ప్రతికూలంగానా అన్నది తెలియదు. నిద్రొస్తోంది.

*

మీ మాటలు

  1. నిశీధి says:

    సింపుల్గా చాలా బాగుంది . లాస్ట్ ఎపిసోడ్స్ వెతుక్కొని మరీ చదువుకున్నా

  2. పవన్ మల్లాది says:

    చాలా బావుంది..

మీ మాటలు

*