హేమంతం గోధుమ రంగు ఊహ

 
వసంత లక్ష్మి
 
హేమంతంలో ఆకులు 
నేలపై గోధుమ రంగు ఊహలా 
పరచుకుని ఉన్న రోజున 
సూది మొన లాంటి కర్ర పట్టుకుని 
ఒక్కో ఆకూ గుచ్చుతూ 
తోటమాలి  తిరుగుతూ ఉంటాడు …
 
కాలం అంతే నిర్దాక్షిణ్యం గా 
ఒక్కోక్షణంలో గుచ్చిగుచ్చి ఎన్నుకుంటుంది నిన్ను 
నా వంతు తప్పింది అని 
గుండెలపై చేయి వేసుకోవు నీవు 
ఏం జరుగుతోందో నీకు 
తెలియదు అంత అజ్ఞానివి నీవు .
 
ఆకుపచ్చగా 
పైలాపచ్చీసుగా గాలికి ఊగుతావు 
నీ కొమ్మన ఓ పూవు పూసిందని 
మురుస్తావు … పూలూ మాయం అయిపోతాయి 
అయినా ఆ బాధే లేదు నీకు 
 
కాండం నాకు అండ 
అని గర్వంగా ఎగురుతావు 
హేమంతం చెప్పాపెట్టకుండా తటాలున
ఆకు మొదలుని తుంచితే 
ప్రకటనలుండవు ..అంతా ప్రతీకార చర్యలే 
ఏ తప్పు చేసావో అని 
విచారణా ఉండదు , ఆకాశంతో ముచ్చట్లాడుతూ 
మరుక్షణంలో నేల మీద పడి ఉంటావు 
నీ ఆక్రోశం ఎండి గలగలమని 
ప్రతిధ్వనిస్తుంది . 
 
ఒక్క కణం అగ్ని చాలు 
ఖాండవ దహనానికి అన్నట్టు , 
నేల పడిన ఆకులని ఇంక 
మంట పెట్టాల్సిందే అని ఎవరో 
ఒకరు పిలుపు నిస్తారు ..
 
గోధుమ రంగుగా 
మారినప్పుడే నీ అంతం ప్రారంభం అయింది 
ఇంకా తెలుసుకోలేవా ? 
ఇంకా జవాబు కావాలా ? 
 
వసంతం అదిగోఆ మలుపునే 
ఆగి ఉంది  సమయం రానీ మరి ..
*
vasanta lakshmi

మీ మాటలు

  1. ఆర్.దమయంతి. says:

    ఆకాశంతో ముచ్చట్లాడుతూ
    మరుక్షణంలో నేల మీద పడి ఉంటావు
    నీ ఆక్రోశం ఎండి గలగలమని
    ప్రతిధ్వనిస్తుంది .
    expression చాలా బాగుంది వసంత. కానీ, ముచ్చట్లు అనే పదానికి బదులు ఇంకేమైనా వుంటేనో అనిపించింది నాకు. హేమంతం గోధుమ రంగు అనే పద ప్రయోగం సూపర్.
    మొత్తానికి కవిత్వం లో పట్టు సాదిం చాలనే మీ గొప్ప ప్రయత్నానికివే నా హృద్యపూర్వక అభినందనలు.

  2. చాల బాగుంది వసంత గారు.రాసిందంతా హేమంతం ను మృత్యువు తో మనిషి అనారోగ్యం తోనో వార్ధక్యం తోనో క్రుసించటం రాలటం ఆకూ ఎండి రాలటం తోనో పోలుస్థు రాసారు ..కానీ ఇదంతా వేరే విషయం..చివరిలో..జవాబు కావాలా..అగు మలుపు లో వసంతం దాగి వుంది సమయం రానీ అన్నారు..అప్పటికే క్రుంగి రాలిపోయిన ఆకూ కానీ మనిషి కానీ వసంతం కోసం చూసేదేముంటుంది ..ఒకవేళ మల్లి జన్మ నేతటంగురించి ఐతే చివురులు జన్మలు కోత్హవే అవతాయి తప్ప పాతవాటికి ఎండి రాలినవాటికి వసంతం రాదేమో ఇక.కదా..ఇది కేవలం న భావన మాత్రమే. ..వసంత గారు పోలిక బాగుంది ..

  3. బాగా వ్రాశారు వసంత లక్ష్మి గారు.

  4. దమయంతీ !

    ముందుగా ధన్యవాదాలు ..ఓపిక గా చదివి నా కవిత మీద మీ చక్కని అభిప్రాయం ,చెప్పినందుకు
    ముచ్చట్లు అని అలా పడి పోయింది ? ఎందుకో మరి ..గోధుమ రంగులోకి మారిన హేమంత ఆకులు ఎప్పుడో ముప్పై ఐదేళ్ల క్రితం సింహాచలం కొండ మీద ద చూసిన ఒక స్మృతి వెంటాడి ,ఈ కవిత గా రూపు దిద్దుకుంది .
    మీ అభినందనలు నాకెంత గొప్పగా స్ఫూర్తి నిచ్చాయో ..
    ధన్యవాదాలు మరొక పరి

    వసంత లక్ష్మి .

  5. సరళా !
    నీ సునిశిత పరిశీలనా అభిప్రాయ ప్రకటన బాగుంది .
    సృష్టి లో అన్నీ నశిస్తాయి .. ఆకులు ,పక్షులు ,జంతు జాలమూ ,మనమూ మనుషులం .
    ఏదో ఒక వరస అంటూ ఉండదు .రాండం సెలెక్షన్ ప్రాసెస్ ఈ అంతం
    ఐతే అదే ఆకు పుడుతుందని కాదు ఒక వేపు అంతం మరొక వేపు ఆరంభం ..రెండు నిరంతరం గా అలా జరిగిపోతూ ఉంటాయి అని నా ఉద్దేశం .అంతే.
    చక్కని నీ స్పందనకు ధన్యవాదాలు ,సరళా

    వసంత లక్ష్మి

  6. Mythili abbaraju says:

    చాలా చాలా పదునుగా సరిగ్గా చెప్పారండీ , ఇంతకన్నా బాగా చెప్పలేమన్నట్లుగా.

  7. నిజమే ఆకులకి గోధుమ రంగు, మనుషులకు పలితకేశాలు … హెచ్చరికలే! ఒక్క బలమైన గాలి చాలు ముగింపు పలకడానికి!
    చక్కగా చెప్పారు వసంతలక్ష్మి గారూ, అభినందనలు.

  8. ప్రసూన రవీంద్రన్‌ గారూ !

    ధన్యవాదాలు మీ ఆత్మీయ ప్రశంస కు

    వసంత లక్ష్మి .

  9. మైథిలీ అబ్బరాజూ !

    ధన్యవాదాలు , మైథిలీ , కవితాత్మని పట్టుకుని పరమార్శించారు మీరు .ఇంతకన్నా నేనూ మరి ఏమీ చెప్పలేను .

    వసంత లక్ష్మి

  10. శివరామ కృష్ణ వంకాయల గారూ !

    ధన్యవాదాలు నా కవిత మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గోధుమ రంగు రాని ఆకులు కూడా నేల రాలే తుఫానులు చూస్తున్నాం , కాలం కాని కాలం లో రాలే ఆకులని చూసినా ,అకాల మృత్యువు బారిన పడి మాయం అయి పోయిన వారిని చూసినా కలిగే బాధ అంతా ఇంతా కాదు ,
    ఏదో వేదాంతంలా అనిపించినా కటువైన నిజాలు ఇవే అని ఏవో ఆలోచనలతో రాసిన కవిత ఇది
    మీ స్పందన కు మరొక పరి ధన్యవాదాలు అండీ ..

    వసంత లక్ష్మి .

  11. కవితలన్నా,కవిత్వమన్నా పెద్దగా ఆసక్తి లేదు నాకు.కానీ కొన్ని కవితలు ఆలా వెంటాడుతూనే వుంటాయి.రోజు పేపర్ తెరవగానే కళ్ళబడే అకాల మరణ వార్తలు,ప్రతిరోజూ పొద్దున్నే బాల్కనీ తలుపు తెరవగానే కనబడే ఎదురుగావున్న షాపు మెట్లమీది ముసలాయిన రేపటినుంచీ మరిక కనబడడనే సత్యం ……ఇవన్నీ ఒక వేదాంతం లోకి నెట్టినా మరి క్షణం లో ఏదో ఆశ,రేపు భేషుగ్గా ఉంటుందని.తేలిక పదాలతో మీరేమి రాసినా నాకెంతో బావుంటుంది.ఇవ్వాళ ముసలాయిన మరణం తో కలతతో వున్నా నన్ను మీ కవిత చాలాసేపు వోదల్లేదు.

  12. ఇందిర గారూ !

    జాతస్య మరణం ధృవం అని చెపుతూనే ఉంటారు .అయినా మనం ఆ మాట మనకి వర్తించదు అని చాలా ఆశ పడతాం ..
    నాకు ప్రకృతి చెప్పే పాఠాలు వినడం చాలా ఇష్టం ..అలా ఒక లంకె దొరికింది ..ఎప్పుడో సింహాచలం కొండ పైన సంపంగి పూల వాసన , ఈ గోధుమ రంగు ఆకుల గల గల లు మిశ్రమై ..పుట్టుకొచ్చింది ఈకవిత ..ప్రతి జ్ఞాపకంకి ఒక గది, ఒక తాళం ఉంటాయి అని నమ్ముతాను నేను ..అలా తెరిచిన గదిలోని జ్ఞాపకమే ఈ కవిత .
    మీ మాటల పరిమళాన్ని దాచుకుంటాను ..మరొక గదిలో

    వసంత లక్ష్మి

  13. “వసంతం అదిగోఆ మలుపునే
    ఆగి ఉంది సమయం రానీ మరి” కొసమెరుపు లా ప్రాణం పోసినట్లు అనిపించింది. చాలా బాగుంది మామ్

  14. Sharada Sivapurapu says:

    చెట్టుకి అంటుకుని ఉన్నంత కాలం రాలిపోయి ఎండిన ఆకుల్ని చూసి, ఎం
    డి రాలిపోయిన ఆకుల్ని చూసి బాధ పడటం సహజం. అయితే ఆకులన్నీ రాలిపొక తప్పదన్న నిజం గట్టిగా అర్ధమయినప్పుడు బాధ కొంచం తగ్గుతుంది. జాతస్య మరణం ద్రవం . రాలి పోయిన ఆకుల్నన్నిటిని తగలబెట్టడం చాలా సింబాలిక్ గా ఉంది. మంచి కవిత లక్ష్మీ వసంత గారు

  15. సురేష్ !

    మంచి మాట గుర్తు చేసావు , కవిత్వం ఆశకు ఊపిరి పోయాలని నా ఆకాంక్ష ..

    ఏనాడో ఒక నాడు చూసిన దృశ్యం అది ..ఎండి పోయిన ఆకుల గలగలలు .

    థాంక్యూ సురేష్ ..

    వసంత లక్ష్మి

  16. శారదా శివపురపు ,
    నిపాత
    ధన్యవాదాలు , మీ అర్ధ వంతమైన స్పందన కవిత కి వన్నె తెచ్చింది ..

    అవును ,జాతస్య మరణం ధ్రువం అని వింటున్నా కానీ ,మనం ఎందుకో మరణాన్ని ఎన్నటికీ అంగీకరించలేము

    ప్రకృతి నేర్పించే పాఠాలు , ఎంత సున్నితం గా ఉంటాయి ,మనం అంది పుచ్చు్కోవాలే కానీ ..

    మరొక సారి ,ధన్యవాదాలు .

    వసంత లక్ష్మి

  17. అద్భుతంగా రాశారు వసంత లక్ష్మి గారు కవిత చాలా నచ్చింది

  18. వాణీ గారూ !

    ధన్యవాదాలు .

    కవిత మీకు అంత బాగా నచ్చినందుకు సంతోషం ..

    వసంత లక్ష్మి .

  19. చాలా బాగుంది వసంత గారు…

Leave a Reply to వసంత లక్ష్మి ,ఫి. Cancel reply

*