రచన వ్యక్తపరిచే తాత్వికతే రచయిత!

సామాన్య  

 ” రచయితని ” అని నాకు నేను ట్యాగ్ చేసుకునేంత విస్తృతంగా రాయలేదు నేను . ఎవరన్నా అలా పిలిచినా నాకేవిటో కొత్తగా, భయంగా వుంటుంది . కానీ ఆ కారణం చేత మాత్రమె ”కథన రంగం” కిరాయకుండా ఇన్ని రోజులూ  ఆగలేదు . అది కూడా ఒక కారణమైనప్పటికీ …ఇంకో కారణమేమిటంటే నా వరకు నాకు రచయిత , రచన వేర్వేరు . రోలాండ్ బార్ట్ ”డెత్ అఫ్ ది ఆథర్ ” తో నేను ఏకీభవిస్తాను .

రచనకి మించి రచయిత తో సంభాషించడమూ , రచనకిమించి పాఠకులు, రచయిత జీవితాలలోకి వెళ్ళడమూ రచనని అర్థం చేసుకోవడానికి ఏ విధంగా సహాయ పడతాయి అని నాకో మీమాంస . అస్తిత్వ వాదాలని గౌరవించినప్పటికీ రచయితకి పరిధి ఉండటాన్ని ,ఒకే అస్తిత్వంలో ఆగిపోవడాన్ని  నేను అంగీకరించను . రచన చెయగలగడమనేది జెనటికల్ గా వచ్చిన ఒక ప్రత్యేక సామర్ధ్యమనీ , ఆ సామర్ధ్యం చేత రచయిత ఇతరుల అంతరంగాలను శోధించగలద/డనీ, ఇతరులకు అర్థంకాని విషయాలను అర్థం చేసుకోగలద/డనీ నేను నమ్ముతాను .

ఈ రోజు ఉదయం నన్ను పలకరించిన ”కేర్లీ రే జెప్సిన్”పాట నన్ను ముచ్చట పరిచింది ” i know this isn’t love ,but i need to tell you something / i really really really really really like you ” అని విన్నపుడు నాకు భలే అనిపించింది కానీ దానికోసంనేను జెప్సిన్ ఈ  వాక్యాలని ఎలా రాసింది ?అసలు జెప్సిన్ ఎవరు ?ఇది ఆమె అనుభవమేనా అని వెతకను . రచయిత ఇతరుల అనుభవాలని తన అనుభవాలుగా చేసుకోగలదనీ ,సామాన్య అనుకున్నదిజెప్సిన్ రాయగలదని నమ్ముతాను . ”మన మనసులోక్కటి అయితే మాయ పెళ్లి ఏటికి చల్ మోహన రంగా /మంగళ సూత్రమేటికి ”అన్న చల్ మోహన రంగ గీత రచయిత ఇంటర్వ్యూ చదవకపోవడం వల్లఆ భావానికి ఏమయినా లోపమొచ్చిందా అని ఒక ఆలోచన .

”పుష్పవర్ణ మాసం” వచ్చినపుడు ఒక స్నేహితుడు అనేక ఏళ్ళ తరువాత ఆ కథనో సందర్భం చేసుకుని   పలకరిస్తూ   నన్ను ”వీణాధరీ” అని సంభోధించాడు . అందులో నేను వీణాధరినని అతనికి ఎందుకు అనిపించింది ?రచయితలం తప్పకుండా రచనలో ఎక్కడో ఓ చోట వుంటాం కానీ నేను వీణాధరినే ఎందుకయ్యాను ?”విషాద కామరూప ”లోకథా నాయకుడు ఇంద్రజిత్ ని తానేనని చెప్తుంది రచయిత్రి ఇందిరా గోస్వామి ,ఏం … నేను పుష్పవర్ణ మాసం లో గదిలో గూడు కట్టుకుని ఆకుపచ్చటి పాటతో ఆ అమ్మాయి ప్రేమను అతనికి చెప్పినకోయిలని అయి ఉండొచ్చు కదా … ”ఏరియల్ ”ని అర్థం  చేసుకోవడానికి ”సిల్వియ ప్లేత్” ఆత్మహత్య చేసుకుందని తెలుసుకొని తీరాలా…  ఇవన్నీ రచయితగా ఇది రాయాలనుకున్నపుడు నన్ను ఇబ్బందిపెట్టిన  ఆలోచనలు . ఇదంతా ఎందుకంటె రచయిత మనస్థత్వమో, నేపధ్యమోమొ  , మతమో ,  పాఠకులకు  దగ్గరగా తెలియడం వల్ల పాటకులు రచనని ఆస్వాధించడంలోనో ,అర్థం చేసుకోవడంలోనో తమకుతెలియకుండా కొన్ని పరిమితులకు లోబడి పోతారు ,చాలా సార్లు రచన అంతరార్థం బిట్వీన్ లైన్స్ కూడా వుంటుంది బహుశా రచయిత పరిచయం పాటకులలోని ఈ ఆలోచనావిస్తరణ యొక్క సామర్ధ్యాన్నిదెబ్బ తీస్తుందనీ అనుకుంటాను .

ఇలాటి భావాలతోనే రచయితగా ఎక్కడయినా పరిచయం కావాలన్నా, మాట్లాడాలన్నా నాకు అయిష్టం. అయినా ఇది ఎందుకు రాసానంటే కొన్ని స్నేహాలు , ప్రేమలూ మనసిద్ధాంతాల కంటే విలువైనవీ , లెక్కింపదగినవీ గా భావిస్తాను గనుక రాసాను .

అదలా ఉంచితే ఇప్పుడు ఈ క్షణంలో ఆలోచిస్తున్నాను రచయితగా నేనేమిటీ అని ? మూడు అంశాలు తట్టాయి . నేను ఎందుకు రాస్తాను ?ఏం రాస్తాను ?ఎలా రాస్తాను ?అని  .అసలు నేను ఎందుకు రాస్తానుఅని ఆలోచిస్తే ఆశ్చర్యమేసింది , నాకు ఏడుపొచ్చినప్పుడు నేను రాస్తున్నాను  . ఏడ్చి ఏడ్చి చాలా ఏడ్చాక గుండెలో ఏదో నొప్పిలాంటిది వస్తుంది నాకు అది  భరించలేక రాస్తున్నాననుకుంటా బహుశా .కిషన్ జీ ని గమనిస్తూ వుండేదాన్ని ఎప్పుడూ … ఎన్కౌంటర్ జరిగాక ”కబీర్ సుమన్ ” ఒక పాట  రాసి పాడాడు ”బీర్ మొరె   బీరేర్ మతో బీర్ మొరె  ఏకా …”[వీరుడు వీరుడిలా మరణిస్తాడు ,వీరుడువొంటిగా మరణిస్తాడు ]అని అది విన్నపుడు నాకు నన్ను నేను అదుపులో వుంచుకోలేనంత ఏడుపొచ్చింది .

 

సామాన్యఇంట్లో వాళ్ళు ఓపికగా ఓదార్చి దాన్ని చానలైజ్ చేయించినపుడు రాసిన కవిత ”జనగణ్ ”అలాగే2007 నుండి మహిత శవాన్ని గుండెల మీద మోసుకు తిరిగి తిరిగీ ఇక తిరగలేక రాసిన కథ మహిత , అంతరాల సమాజం  ఆత్మాభిమానపు అనితను నా ముందు ఏడ్చేలా చేసినపుడు  సిగ్గుతో నాకుఏడుపు వచ్చి రాసిన కథ ”అనిత పాడిన పాట ”.. అలా నేను రాసిన లేదా రాయబోయే కథలైనా  లేదా కవితలైనా  ఎందుకు రాస్తానంటే నా దుక్కాన్ని ఏం చెయ్యాలో తెలియక ,రాయడమనేది అయాచితంగావచ్చింది కనుక ఆ రూపంలోకి నా కన్నీటిని ఒంపేసి వదిలించుకోనే సౌకర్యం వుంది కనుక వదిలించుకోవడానికి రాస్తాను . అందుకని రాస్తాను .

ఏం  రాస్తానంటే .. నాది చాలా చిన్న ప్రపంచం , ఏకాంత ప్రపంచం . నా జీవితంలో అత్యధిక భాగాన్ని నేను ఏకాంతపు గదులలో గడిపాను ,గడుపుతూ వుంటాను . ఆ గదిలోకి ఆత్మీయులు వస్తూ  వెళ్తూవుంటారు .అంతర్బాహిరాలలో నన్ను పెనవేసుకుపోయి వున్న  ఏకాంతాన్ని చిద్రం చేయడానికి రకరకాల కాల్పనిక మనుష్యులను నా గదులలోకి , హృదయంలోకి తెచ్చుకోవడం నేర్చుకున్నాను చాలాచిన్నపుడే . అలా మొదలయింది చదవడం .

నాకు పుస్తక జ్ఞానం అంతో ఇంతో వుంటుంది కానీ ప్రాపంచిక జ్ఞానం చాలా తక్కువ . ప్రాపంచిక జ్ఞాన శూన్యురాలనయిన నా దగ్గరికి పిల్లల కోసం మేత తెచ్చేఅమ్మలా బయటి ప్రపంచాన్ని మోసుకోస్తారు  నా తమ్ముళ్ళు ఉదయ చైతన్య ,శ్రీకాంత్ నా సహచరుడు కిరణ్ .  ఆ మేత పెట్టడమే కాదు ,నాతో చర్చించి  నా హృదయంలో…  అవును మెదడులో కాదుహృదయంలో ఎలా ఆలోచించాలనే  విధానాన్ని ఓపికగా పొదుగుతాడు కిరణ్ . అలాగే ”వినయ” లాటి నా స్నేహితులు స్త్రీ అంతరంగాన్ని ,మోస్తున్న భరువులని,వారి   దుక్కాలకి సంబంధించిన పిక్టోగ్రాఫ్ నినా హృదయం పై పరుస్తారు . నాకోచ్చే సందేహాలని నేను వ్యక్త పరుస్తాను ,వెదుక్కుంటాను ,చదువుకుంటాను ,ఆలోచించుకుంటాను .

దుక్కమనిపిస్తే సంగీతమనే డ్రగ్ ని హృదయం లోకి ఇంజెక్ట్ చేసుకునిదుక్కాన్ని వదిలించుకుంటాను ,లేదంటే ”మిల్స్ అండ్ బూన్”లోకి పారిపోయి ప్రపంచమంతా భలే రొమాంటిక్ గా ఉందనీ కాసేపు భ్రమ పెట్టుకుంటాను . ఇంకా .. మరీ రాయాలని చాలా అనిపిస్తే రాస్తాను . నాఆదిమ సహజాతం ఏంటంటే నాకు ఎవరైనా ఇంకోరి మీద పెత్తనం చేస్తే నచ్చదు ,కొందరు ఒదిగి వుండటం ,కొందరు చాతీ విరుచుకుని వుండటం అసహ్యం . అసూయ, ద్వేషం ,దురాశ…  బైబిల్ లో చెప్పినసైతాన్  అంటే వీటి కలయికే   అని నమ్ముతాను . ఈవిల్ అంటే అసహ్యం నాకు . వీటన్నిటి గురించి రాయాలని ,అంత పరిణతి రావాలని తాపత్రయ పడతాను. ”ఎంత జ్ఞాన విహీనమయినది మానవహృదయం !భ్రాంతి అనేది ఒక పట్టాన తొలగి పోదు .యుక్థి , వివేచన ఎంతో ఆలశ్యంగా ప్రవేసిస్తాయి మనస్సులో ..”అంటూ రత్న గురించి రాసిన టాగోర్ లాగా  ,”  మొపాసా లాగా   ,హెన్రీ లాగా  ,గోగోల్ లాగా ,”తిరగేసి కొట్టు అనే వ్యూహాత్మక సిద్ధాంతాన్ని ”తెలియ చెప్పిన పతంజలిలలాగా .. ఇలా అత్యద్భుత ప్రతిభా సంపన్నులయిన రచయితలని చూసి దిగ్భ్రమ చెంది వారి లాగా  రాయాలని ఆశ పడతాను.

నాకు అంత ప్రతిభ లేదు కనుక నేను రాసినవి తిరిగి చూసుకోవడం కూడా నాకు అసహ్యం . నాకు నచ్చవు . అందుకని రాసినవన్నీ అచ్చుకివ్వను . అచ్చయిన వాటి మొహం కూడా చూడను . ఇంకా అత్యంత రహస్యం  ఏంటంటే నా హృదయంలో విన్సెంట్ వాంగో ,కాఫ్కా .. అఫ్ కోర్స్ చండీ దాస్ వంటి వాళ్ళు ఇల్లు కట్టుకుని వున్నారు .చాలా ఏళ్ళుగా వాల్లిక్కడ  రెసిడెంట్స్  . నా పిచ్చితో వాళ్ళు ,వాళ్ళమేజిక్ తో తో నేను ,మా మూడ్ స్వింగ్స్ తో కిరణూ సహజీవనం చేస్తుంటాం . నా రాతనీ ముఖ్యంగా జీవితాన్ని ఇలాటి వాళ్ళందరూ లీడ్ చేస్తుంటారు . కిరణ్ పాపం మార్క్స్ ని ,మావో ని, బుద్ధుడ్నీ ,అంబేద్కర్ ని తోడు పెటుకుని నా తిక్కకి మందులు నూరుతుంటాడు   .  నేను రాసే రాతలో ఆత్మ కిరణ్ అక్షరం నేను . చేసే పనిలో ఆలోచన కిరణ్ ఆచరణ నేను .

ఎలా రాస్తాను అనేది శైలీ శిల్పాలకి సంబంధించిన విషయం కదా .. . నేనేమనుకుంటానంటే వస్తువు దాని శిల్పాన్ని అదే వెతుక్కుంటుందీ అని . రాయడమనేది” రివర్ కోర్స్” లాటిది అనుకుంటా  . మనంకలం పట్టుకుంటాం అంతే . మన నిమిత్త మాత్రత్వంతో రక్తమాంస భరితమయిన పాత్రలు నది లాగే ఊహించని రీతిలో వాటి గమనాన్ని అవే నిర్దేసించుకుంటూ సాగుతాయి . కాకపోతే రచయితహృదయంలోని సౌజన్యం ,సౌశీల్యత ,సహన శీలత,ధీరత  రచనలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ వుంటుంది . ముగింపుని అదే  నిర్దేశిస్తుందనుకుంటా . రచన వ్యక్త పరిచే తాత్వికతే రచయిత .

మనిషిగా నాకు రిజిడిటీ అంటే అయిష్టం ,సరళత అంటే ప్రేమ . ఎరాక్లితోస్ చెప్పినట్లు ”There is nothing permanent except change..” [ఇంక్లూడింగ్ మై అబౌవ్ వోర్డ్స్ ]

 

 

మీ మాటలు

  1. చాలా బాగా చెప్పారు . మంచి రచన చేయగలగడం, నలుగురితో ఆ రచన మంచిదని అనిపించుకోగలగడం నిజంగా అదృష్టమే

  2. ఆర్.దమయంతి. says:

    ‘నేను రాసినవి తిరిగి చూసుకోవడం కూడా నాకు అసహ్యం . నాకు నచ్చవు . అందుకని రాసినవన్నీ అచ్చుకివ్వను . అచ్చయిన వాటి మొహం కూడా చూడను . ‘
    :-) హమ్మయ్యా!
    మీరు చెప్పాలని చెప్పకున్నా, చాలా విషయాలు తెలియచేసారు.
    బావుంది. చక్కని లేఖలా వుంది.
    కిరణ్ గారికీ, మీకూ కూడా నా అభినందనలు.

  3. రక్త మాంసాలున్న పాత్రలు నది లాంటివి . వాటికవే దారి వెతుక్కొంటాయి …!! బాగా చెప్పారం. మీ రచనలు బాగుంటాయి.

  4. Pasunoori Ravinder says:

    రచయిత్రి సామాన్యగారి కథనరంగ అంతరంగం బాగుంది.
    వారి కథలు బాగుంటాయి. నేను కొన్ని చదివాను.
    కానీ, పై విశ్లేషణలో నేను వారి ఒక అభిప్రాయంతో విభేదిస్తున్నాను..
    “రచన చెయగలగడమనేది జెనటికల్ గా వచ్చిన ఒక ప్రత్యేక సామర్ధ్యమనీ , ఆ సామర్ధ్యం చేత రచయిత ఇతరుల అంతరంగాలను శోధించగలద/డనీ, ఇతరులకు అర్థంకాని విషయాలను అర్థం చేసుకోగలద/డనీ నేను నమ్ముతాను”
    అనడం బ్రాహ్మణులు పెట్టి పుట్టాలనడంలాంటిదే..కర్మసిద్ధాంతం…

  5. P Mohan says:

    రవీందర్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సామాన్య గారు ఏదో ఉద్వేగంలో రాశారేమో.

  6. anjaiah says:

    SOME ANIMALS ARE MORE EQUAL THAN OTHERS IRRESPECTIVE OF CASTE CREED AND RELIGION

  7. Mythili abbaraju says:

    మీరలా అన్నారేగాని, మీకూ మీరు రాసేవాటికీ అంతరం బాగా తక్కువని , అందుకు అవి అంట సహజమైన నిజాయితీ తో ఉంటాయని ..మొన్నా మధ్యన నేనూ సాంత్వనా అనుకున్నాం. ధన్యవాదాలు..ఈ అంతరంగ చిత్రణ కి కూడా .

  8. Mythili abbaraju says:

    మీరలా అన్నారుగానీ మీకూ మీరు రాసేవాటికీ అంతరం బాగా తక్కువ అనీ, అందుకు వాటిలో అంత సహజమైన నిజాయితీ ఉంటుందనీ కనిపెట్టాము మేము. ధన్యవాదాలు..మీ మనసులోపలి మాటల కోసం కూడా.

  9. amarendra dasari says:

    బావుంది

  10. Allam Krishna Vamshi says:

    “నా మాట శిలాశాసనం, నేనెప్పుడు ఒకేలాగా ఉంటాను, ఒక్కమాటకు కమిట్ ఐతె మారే ముచ్చటేలేదు” లాంటి మాటలకు పిచ్చి క్రేజ్ ఉన్న ప్రెసెంట్ దునియాల…
    “చేంజ్” గురించి
    ” [ఇంక్లూడింగ్ మై అబౌవ్ వోర్డ్స్ ] ” అని చెప్పడానికి మెచురిటీతోని పాటు మస్త్ ధైర్యం కూడ ఉండాలి… సూపర్ మేడం..

  11. m.viswanadhareddy says:

    దుక్ఖాన్ని ఏమి చేయాలో తెలీకుండా రాస్తాను . గుండె లోపల తడి అక్షరంగా మారినట్టు అనిపించింది ఆ మాటతో ..కానీ రాసినదాన్ని మళ్లీ చూడను . చూడాలన్న చదవాలన్న నాకు అసహ్యం అన్న మాట మీరు ఏ అర్థంలో వాడిన చాల బాధనిపించింది . ఎందుకంటే మీ వ్యాసం తాత్వికతే రచయిత చాలాసార్లు చదవాలనిపిస్తున్నది.

  12. “ఇదంతా ఎందుకంటె రచయిత మనస్థత్వమో, నేపధ్యమోమొ, మతమో, పాఠకులకు దగ్గరగా తెలియడం వల్ల పాటకులు రచనని ఆస్వాధించడంలోనో, అర్థం చేసుకోవడంలోనో తమకుతెలియకుండా కొన్ని పరిమితులకు లోబడి పోతారు. చాలా సార్లు రచన అంతరార్థం బిట్వీన్ లైన్స్ కూడా వుంటుంది బహుశా రచయిత పరిచయం పాటకులలోని ఈ ఆలోచనావిస్తరణ యొక్క సామర్ధ్యాన్నిదెబ్బ తీస్తుందనీ అనుకుంటాను. ఇలాటి భావాలతోనే రచయితగా ఎక్కడయినా పరిచయం కావాలన్నా, మాట్లాడాలన్నా నాకు అయిష్టం. ”

    “నాకు పుస్తక జ్ఞానం అంతో ఇంతో వుంటుంది కానీ ప్రాపంచిక జ్ఞానం చాలా తక్కువ . ప్రాపంచిక జ్ఞాన శూన్యురాలనయిన నా దగ్గరికి పిల్లల కోసం మేత తెచ్చేఅమ్మలా బయటి ప్రపంచాన్ని మోసుకోస్తారు నా తమ్ముళ్ళు ..”
    చాలా బాగా రాశారు సామాన్యా!

  13. sasi kala says:

    …… సామాన్య గారు ఈ రెండు కోట్స్ ఇలాగే నేను కూడా మనసులో అనుకుంటూ ఉంటాను . అభినందనలు

  14. చాలా చక్కటి భావ ప్రకటన.. సామాన్య గారు……మీరేమిటో……చాలా చక్కగా….అద్దం ముందు నుంచుని చూసినట్లు….తేటగా ….కదలిక లేని సరసులో మిమ్మల్ని చూసినట్లు ఉంది….నిజమే మీరు చెప్పింది..రాయాలన్న అసలైన ఆర్తి…ఉన్నవారికి..అలాగే అనిపిస్తుందేమో..మళ్ళీ చూడాలనిపించకపోవడం మీరు రాసినవి మీరే….మీలోని బలహీనతలేవో…బలాలేవో….మీరు చక్కగా హృదయం లోకి వెళ్లే పదాల సంకెలలు గుండెకి వేసేశారు….సో నైస్…

  15. Vanaja Tatineni says:

    ఆలస్యంగా చూసాను . చాలా సార్లు చదివాను . రచనలో నాకు తెలిసిన సామాన్య వేరు . వ్యక్తిగతంగా నాకు తెలిసిన ( తెలిసిన అని నేను అనుకుంటున్నాను ) సామాన్య వేరు . :) వ్రాసిన ప్రతి రచనతోనూ మృదువుగా పాఠకుడి హృదిని చేరి అనేకానేక ఆలోచనలని కల్గిస్తాయి. జాగ్రతావస్థ లోకి జారండి అని హెచ్చరిస్తున్నట్లు ఉంటాయి మరి .

    మీరేమో చాలా బోల్డ్ గా, సహజంగా, సున్నితంగా మీరేమిటో, కథనరంగంలో దూకిన మీ చేతిలోని ఆయుధమేమిటో చెప్పేశారు .

    రచయిత/రచయిత్రి ప్రపంచానికి బాగా తెలియకపోవడమే మంచిది అని నాకనిపిస్తూ ఉంటుంది . ఎందుకంటే రచయిత మనస్థత్వమో, నేపధ్యమోమొ, మతమో, పాఠకులకు దగ్గరగా తెలియడం వల్ల పాటకులు రచనని ఆస్వాధించడంలోనో, అర్థం చేసుకోవడంలోనో తమకుతెలియకుండా కొన్ని పరిమితులకు లోబడి పోతారు. ప్రతి రచనలోనూ రచయిత/రచయిత్రి ని వెదకడం మొదలెడతారు అది రచయిత ముందు ముందు చేసే రచనలకి ప్రతిబంధకమవుతుంది. స్వేచ్చగా వ్రాయలేనప్పుడు రచయిత/రచయిత్రి ఇతరులకి నచ్చే విధంగా వ్రాయడం మొదలెడతారు . అప్పుడు రచనలో ఆత్మ దెబ్బతింటుంది. లబ్ధప్రతిష్ట పొందిన రచనలలో రచనకి ప్రయోజనం కానవస్తుంది కానీ అందులో నాటకీయత ఉంటుంది . ఇక్కడ సందర్భం కాకపోయినా నేను ఎందుకు చెపుతున్నాను అంటే .. రచయిత వ్రాసిన కథలని మార్చి పాఠకులకి నచ్చే విధంగా వ్రాయించిన కథలు ఉంటాయని తెలుసు కాబట్టి .

    మీ మహిత కథ ఎన్నో ఏళ్ళు దుఖాన్ని మోసుకుంటూ తిరిగిన మీకు తెలుసు . అలాంటి పరిస్థితులే ఇప్పుడు లేవన్న ఆధునిక పాఠకులు నిరసనగా చూసిన కథ. అలాంటి కథలు ఎన్నో మనమధ్య ఉండనే ఉన్నాయి . కల్పన, అలాగే అనిత పాడిన పాట. నిజమైన ప్రయోజనాన్ని ఆశించిన కథలు మీ కలం నుండి రావడం లేదు. మేజిక్ రియాలిజం వైపు మొగ్గు చూపారనిపిస్తుంది , మీరు వ్రాసిన కథలని దాచుకోకుండా మీ బ్లాగ్ లో పోస్ట్ చేయండి .. ప్లీజ్ ! ఆ కథలలోనూ పాఠకులకి నచ్చే కథలు ఉంటాయి కదా !

    బాహ్యప్రపంచాపు జ్ఞానాన్ని మీ వద్దకు మోసుకువస్తున్న మువ్వురికి కూడా ధన్యవాదాలు చెపుతూ .. మీ నుంచి మరిన్ని కథలని ఆశిస్తూ…

  16. “మనంకలం పట్టుకుంటాం అంతే . మన నిమిత్త మాత్రత్వంతో రక్తమాంస భరితమయిన పాత్రలు నది లాగే ఊహించని రీతిలో వాటి గమనాన్ని అవే నిర్దేసించుకుంటూ సాగుతాయి . కాకపోతే రచయితహృదయంలోని సౌజన్యం ,సౌశీల్యత ,సహన శీలత,ధీరత రచనలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ వుంటుంది ” – దీనితో పూర్తి ఏకీభావం ఉంది, ఈ ‘నిమిత్తమాత్ర’ భావనతో రచనలు చేసేవారు తాము దర్శిస్తున్న జీవిత శకలాలను అతి తక్కువ జోక్యం తో పాఠకులకు అందించగలుగుతారు. రచనలే ముఖ్యం రచయితల కన్నాఅనే భావన నాది, కానీ ‘సామాన్య’ గారి విషయం లో అది తిరగబడింది. ఆమె ఇంటర్వ్యూ నిన్న చదివి ఆమె ఆలోచనల పట్ల ఒక కుతూహలం కలిగింది, ఈ రోజు ఈ వ్యాసం చదివి మరింత గౌరవం కలిగింది, ఆమె రచనలు చదవాలని ఆసక్తి కలిగింది.

  17. ఒక రచయిత్రిగా మీ భావాలు చక్కగా చెప్పారు. మీ అంతరాంతరాల విశ్లేషణ వల్ల, మీరు మంచి కథలు ఎలా రాయగలుగుతున్నారో అర్ధమయ్యింది. ధన్యవాదాలు.
    ….
    అయితే ఇందులో విన్సెంట్ వాంగో ,కాఫ్కా , చండీదాస్, మార్క్స్ ,మావో , బుద్ధుడ్నీ ,అంబేద్కర్ ని, కిషన్ జీ ని తెచ్చారు.

    అకాడమీల ఆధిపత్యాల మూర్ఖత్వానికి 37 ఏళ్ళ వయసులో తుపాకిగుండుతో కాల్చుకొని (ఆత్మ) హత్య చేయబడ్డ వాంగో, తన జీవితాంతం ఆధునికత రుద్దిన ఆధిపత్యాన్ని తిరస్కరించి బతికున్నంతకాలం తన రచనలు అచ్చువెసుకోని కాఫ్కా , తన స్వకీయ వేదనతో అందరికి దూరంగా జీవిత విరమణ చేసిన తెలుగు రచయిత చండీదాస్, ఇక మార్క్స్ ,మావో, బుద్దుడు ,అంబేద్కర్ , కిషన్ జీల గురించి చెప్పనక్కరలేదు.
    ఈ వరసలో వైయస్సార్ కాంగ్రెస్ అనే పార్టీ , దాని తరపున మీరు ఎంపీగా నిలబడటం అనేది ఏమాత్రం పొసగనిదీ, పాఠకులు జీర్ణించుకోలేనిదీ. మరిన్ని మంచి కథలు మీ నుంచి అశిస్తూ…

    -శశాంక

  18. BINDUSREE KOLLIKONDA says:

    మీ మహిత,పుష్పవర్ణ మాసం కధలు చదవాలనుంది సామాన్య గారు.లింక్ ఏదైనా ఉంటే తెలియచేయగలరు.

  19. కె.కె. రామయ్య says:

    బిందుశ్రీ గారు, సామాన్య గారి “పుష్పవర్ణ మాసం” కధ సారంగ లోనే ఈ లింకులో చూడగలరు. తప్పక చదవ వలసిన కధ “మహిత”.

    http://saarangabooks.com/retired/2013/03/02/%E0%B0%85%E0%B0%A4%E0%B0%A8%E0%B1%81-%E0%B0%86%E0%B0%AE%E0%B1%86-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%81-%E0%B0%92%E0%B0%95-%E0%B0%95%E0%B0%A5/

  20. BINDUSREE KOLLIKONDA says:

    ధన్యవాదములు రామయ్య గారు.

Leave a Reply to P Mohan Cancel reply

*