మట్టి తడిని తట్టిలేపే కవిత..

జయశ్రీ నాయుడు 

 

jayasriశివారెడ్డి గారి కవిత “ఏదో ఒక మొక్క”చదివాక మనసులో మట్టి తడి మేల్కొంది. తడి మట్టి సుగంధం తలపుకి వచ్చింది. అరచేతుల్లోకి తడి మట్టిని తీసుకుని, కళ్ళుమూసి, తన్మయత్వంగా ఆ స్పర్శని అనుభవించి ఎన్ని ఋతువులయ్యింది…? మొక్క వేర్లకీ, నీటి తడికీ మద్య మట్టి రేణువుల మౌన సంభాషణ మరిచిపోయానా…?

ఒక్క క్షణమైనా పచ్చదనం వైపు తల తిప్పనివ్వనంతగా కృత్రిమ జీవిత నాగరికతకు నగర జీవనం మనల్ని బానిసని చేసిందా… అవునేమో … లేకపోతే ఈ ప్లాస్టిక్ పువ్వులూ, ఆర్టిఫిషియల్ మొక్కలూ అమ్మే దుకాణాల రాజపోషకులెవరు??? మనమేగా అని ఒక నిష్టూరపు నిట్టూర్పు గుండెని ఎగదన్నుకు వచ్చిన క్షణాలవి.

మనలో అందరూ ప్రకృతి హరితానికి మిత్రులే. కానీ నగర నాగరికత విస్తీర్ణానికి మొదట అడ్డు అనిపించేవి మొక్కలే, మహా వృక్షాలుగా విస్తరించిన హరిత ఛాయలే. అల్లిబిల్లిగా అల్లుకునే తంత్రీ విస్తీర్ణానికి నిర్దాక్షిణ్యంగా ఎన్ని వృక్షాలు అశువులు బాసాయో.. వేర్లు విస్తరిస్తాయని ఎన్ని మామిడి , వేప, పున్నాగ, రావి చెట్లు గొడ్డలి వేటుకు తలవంచాయో లెక్కలేదు. కవి కె. శివారెడ్డి గారి “పొసగనివన్నీ….” కవితా సంపుటిలోంచి ఈ వారం మనం చర్చించుకుంటున్న కవిత “ఏదో ఒక మొక్క” — నగర నాగరికతకీ, ప్రకృతి పచ్చదనానికి మధ్య సంఘర్షణనీ , మొక్కలకీ మనిషికీ మధ్య ఒక అంతస్సూత్రాన్ని స్పృశిస్తూ సాగుతుంది.

ఇంటి ముందో ఇంటి మీదో
ఎక్కడో ఒక చోట ఒక మొక్క-
పొద్దున్నే పచ్చని ;మొక్కని చూస్తే పాపాలు పోతాయి
ప్రాణాలు లేచి వస్తాయి.”

నగర జీవికి మొక్కని చూస్తే భయం. అది రాగి మొక్కో వేపమొక్కో తనకనవసరం. దాని వేర్లు తన కాంక్రీట్ గోడల్ని బద్దలు చేస్తుందనే భయంతో, మొక్క గానే వేర్లు పట్టుకుని పీకెయ్యడానికి కూడా వెనుదీయడు.
” మొక్కలేకపోతే, బయట మొక్క లేకపోతే
లోపల మొక్క లేకపోతే
మనిషి వేసే చిగురులేముంటాయి
పూసే పూలేముంటాయి…”
అని కవి సూటి గా ప్రశ్నిస్తాడు.

చెమట పట్టని గదుల్లో, అన్ని వైపులా మూసేసిన గదుల్లో జీవించే మనిషికి ప్రకృతి సంగీతం ఎలా వినిపిస్తుందీ?

“కళ్ళమ్మటి కురుస్తున్న వానలున్నాయా
వంటి మీద జారుతున్న చెమటలున్నాయా?”

ఈ ప్రశ్నలు రెండూ మానవ సహజాతాలైన స్పందనా చైతన్యాన్ని గుర్తు చేస్తున్నాయి. తోటి మనిషి కష్టానికో, కృతజ్ఞతా పూర్వకంగానో కన్నీరు పెట్టుకుంటాడు. శరీరం ప్రకృతి తో మమేకమై శ్రమించినపుడు అది వెద జల్లే సుగంధం చెమట. ఈ రెండూ లేని మనిషి అసలు మనిషేనా… మన హడావిడి దైనందిన చర్యలకు సూటిగా ఢీకొనే ప్రశ్నలివి.

మొక్కల కేసి తదేకంగా చూస్తున్నపుడు లోకాంతర లోకాల నుంచి సంగీతం వినపడుతుంది. చిన్నపిల్లల కేరింతలు వినబడతాయి. మొక్కల మధ్య కూర్చున్న కవికి బాల్యం , పూల మధ్య శయనించినపుడు యవ్వనం తప్ప మరోటి లేవు. ఇంతకన్న రీ ఛార్జ్ అయ్యేందుకు మరో మార్గముందా మనకు?

కవిత ముగింపు వాక్యాలివి…

“ఏ పక్కకి వత్తిగిలినా
నీకో మొక్క తగలాలి
తడి తడి గా నువ్వు బతకాలి”
మొక్కల్ని ప్రేమించనిదే మట్టి తడి తెలియదు, మనసు తడీ తెలియదు. అందుకే బైటా లోపలా మనం ఎటు వత్తిగిలినా ఒక మొక్క తగలాలి, కన్ను తడి మనసులో చెమ్మ అవ్వాలి. అవే మనిషి మూలాలు, మనసు లోని తడి ఆనవాళ్ళూ. అవే ప్రకృతి తో మనం మమేకం అవ్వగలిగే అపురూప క్షణాలవుతాయి.

**** ****** ****

పూర్తి కవిత ఇక్కడ…

కవి : కె. శివారెడ్డి
కవితా సంకలనం: పొసగనివన్నీ…
కవిత శీర్షిక: ఏదో ఒక మొక్క

 

ఏదో ఒక మొక్క
రాగి మొక్కో, మర్రిమొక్కో, వేపమొక్కో
గోడ పక్కనో, గోడ మీదనో
ఇంటి ముందో, ఇంటి మీదో
ఎక్కడో ఒకచోట ఒక మొక్క-
పొద్దున్నే పచ్చని మొక్కని చూస్తే పాపాలు పోతాయి
ప్రాణాలు లేచి వస్తాయి-
ఎక్కడ ఇంకిపోయిందో మొలకనవ్వు బయటికొస్తుంది,
ఏమిటీ గోడ పగుల్తుందా
ఇల్లు కూలుతుందా
గోడ పగలనీ, ఇల్లు కూలనీ
మనిషి చుట్టూ అల్లుకున్న రాతిబంధాలన్నీ
బద్దలు బద్దలు కానీ
******

మొక్క లేకపోతే, బయట మొక్క లేకపోతే
లోపల మొక్క లేకపోతే
మనిషి వేసేచిగురులేముంటాయి
పూసే పూలేముంటాయి
అంతా బోసిగా, శూన్యం రాజ్యమేలుతున్నట్టు-
మనుషులున్నారా? మనసులున్నాయా?
కళ్ళమ్మటి కుతుస్తున్న వానలున్నాయా
వంటి మీద జారుతున్న చెమటలున్నాయా-?

చెమట పట్టని గదుల్లో
అన్ని వైపులా మూసేసిన గదుల్లో
ఏం కనబడుతుంది
ఏం వినబడుతుంది,
గదిలో బంధించబడ్డ మనిషి
గదే తానయిన మనిషి

పొద్దున్నే పైనుంచి రాలుతున్న ఆకుని చూళ్ళేడు
గాలిలో తేలుతున్న పావురాయి ఈకను చూళ్ళేడు
కళ్ళ ముందు విరుస్తున్న నెమలి పింఛం
పొద్దుటిపూట నృత్యాన్ని చూడలేడు
తదేకంగా మొక్క కేసి చూడు
అది తొడుగుతున్న కొత్త చివురుకేసి చూడు
చిన్నపిల్లల కేరింతలు వినబడటం లేదూ

ఏదో ఒక మొక్క
బతకనీ, బతకనీ,
మొక్కల మధ్యన కూర్చున్న నాకు
బాల్యం తప్ప మరోటి లేదు
పూల మధ్య శయనించిన నాకు
యౌవనం తప్ప మరోటి లేదు

మొక్క వేళ్ళు గోడలోకే కాదు
నీలోకీ, నాలోకీ జొరబడతాయి
గోడల జాడల్ని, చీకటి నీడల్నీ
బద్దలు చేస్తాయి
ఏ పక్కకి వత్తిగిలినా
నీకో మొక్క తగలాలి
తడితడిగా నువు బతకాలి

**

మీ మాటలు

  1. కోల్పోతున్నదెమిటో గురువు గారు బాగా చెప్పారు. మీ విశ్లేషణలో అది మరింత చేరువయ్యింది.. అభినందనలతో

    • Jayashree Naidu says:

      థాంక్యూ వర్మ గారు
      ఆలస్యం గా ధన్యవాదాలు చెబుతున్నా, స్పందనలు ఏ కాలానికైనా ఉత్సాహాన్ని నింపేవే.
      కొన్ని కవితల తీరు తెన్నులు అంతే, ఎన్ని నాళ్ళైనా ఆ భావనా వాహిని నుంచి ఎన్ని దృశ్యాంకురాలైనా మొలకెత్తుతాయి. అదీ ఆ కవిత్వం గొప్పతనం.

  2. ఆర్.దమయంతి. says:

    ‘ఏ పక్కకి వత్తిగిలినా
    నీకో మొక్క తగలాలి..’ – కవి మాటల్లో ఎంత లోతైన భావం వుమ్దో కదూ?!
    నా బాల్యమంతా ఆకుపచ్చని మొక్కల మధ్యే నడిచింది. పెద్ద పెద్ద వృక్ష చాయల ఒడిలో ఊయలలోగిమ్ది.
    పెద్దబచ్చలి తీగ పందిరి కింద – చందమామ చదువుకుంటూ నవ్వుకున్న క్షణాలే నాకెంతో అద్భుతమైన ఆకుపచ్చని జ్ఞాపకాలు.
    ఇటు ఇంటి వాకిటెదురుగా బొగడపోల వృక్షాలు, అటు వంటింటి గుమ్మం ఎదురుగా మందారాలు తురుముకున్న తులసి పొదలు , పెరటి లో కూర మొక్కల మళ్ళు గుంపులు గుంపుల్ మొలకలే మొలకలు. మనిషి ఆశల్లా. లేటు చివురాకుపచ్చటి గుంపులు. ముద్దొచ్చేస్తో..
    బడి కెళ్తే గోడ మీదకె గ బాకిన బఠానీ తీవెలు, కొబ్బరి చెట్లని చుట్టుకుని నీలి రంగు పూలు..గుడికెళ్తే.. రావి చెట్టు కొమ్మలనూగు గాలులు..శ్రావ్యంగా వినొస్తూ పత్రాల గాన స్వరాలూ..
    ఎంత హాయిగా వుమ్డేదీ?
    అమ్మమ్మ ఇంటి ముందు పేద్ద పెద్ద వేప చెట్లు. దాని నీడలో నవారు మంచం. తాతయ్య పద్యం. వింటూ..పరవశాన విసురుతూ హరితవాయులీనమ్.
    అందుకే అన్నారేమో కవి, ‘తడితడిగా నువు బతకాలి’ అని. దానికంటే ముందు – చెట్టు వేరు తడవాలి. మేను తడవాలి. వృక్ష శరీరం అప్పుడిక తడుస్తూ పచ్చగా నే బ్రతుకుతుంది. నిన్నూ, నన్నూ ..మనల్నమ్దర్నీ బ్రతికిస్తుంది.
    హో!
    అద్భుతం గా వుంది జై. ఇలా నీతో కవిత్వం చర్చిస్తుంటే నాకూ కవిత్వం వచ్చేస్తోమ్ది.
    గొప్ప రెవ్యూ ఇచ్చావు.
    మన కవి – శ్రీ శివా రెడ్డి గారికి నా హృదయపూ ర్వక అభినన్దనలు.
    నీకు నా – చాలా చాలా ధన్యవాదాలు.
    ‘మొక్కలకీ మనిషికీ మధ్య ఒక అంతస్సూత్రాన్ని స్పృశిస్తూ సాగుతుంది.’ అన్న నీ మాటలని మరో సారి మననం చేసుకుంటూ వెళ్తున్నా.
    ఆల్ ద బెస్ట్ డియర్.
    బై మరి.

    • Jayashree Naidu says:

      థాంక్యూ డియర్
      అంతా బాగుంటుంది కానీ అప్పుడప్పుడూ నువ్వు అదృశ్యం ఐపోయి అయోమయం లోకి తోసెయ్యడమే…. అస్సలు బాగోదు.. నీ ఎంకరేజ్ మెంట్ మిస్స్ అవుతుంటా..

  3. balasudhakar says:

    కవికి కవితని దొరకపుచ్చుకునే వొడుపు తెలియాలంటారు – గురువు గారు.. కనిపించే ప్రతీది కవితై కళ్ల ముందు తేలడం కవిత్వంలో నిరంతరం స్నానం చేస్తున్నవాళ్లకే సాధ్యం. కవి విరామం లేకుండా రాయాలంటారు – అభ్యాసం ముఖ్యమని అంటారు – అప్పుడే కవిత మెరుపుదేరుతుంది – అని అంటారు – చివరకి కవిత్వమే జీవితం, జీవితమే కవిత్వం అవ్వాలంటారు… మనల్ని అలా బతకమంటారు. బతుకుదాం.

    • Jayashree Naidu says:

      నిజమే సుధాకర్ గారు. ఆయన కవితలు ఆ విషయాలన్నిటికీ నిలువెత్తు ఉదాహరణలు.

  4. renuka ayola says:

    “ఏదో ఒక మొక్క” — నగర నాగరికతకీ, ప్రకృతి పచ్చదనానికి మధ్య సంఘర్షణనీ , మొక్కలకీ మనిషికీ మధ్య ఒక అంతస్సూత్రాన్ని స్పృశిస్తూ సాగుతుంది. Bagundi jaya

  5. vasavi pydi says:

    మొక్కకి ఎక్కడైనా కాస్త చోటిస్తే చాలు తిరిగి అది మనకిచ్చేవెన్నో లేక్కకందనివి అవి ఫలమో ,పత్రమో ,సేదతీరే వూయలో, కవిగారన్నట్లురాతిబంధాలను బద్దలు కొట్టే గొడ్డలి అయితే ఇక కాంక్రీట్ జంగిల్ కు తావేది

  6. పాయల says:

    గురువు గారి కవిత మళ్ళీ చదివింప చేసినందుకు ధన్యవాదాలు. ఆయన కవిత్వం మనలో ఏ మూలనో వాలి పోతున్న కవన వనానికి జీవమౌతుంది కొత్త చివుళ్ల కి ప్రేరణౌతుంది

    • Jayashree Naidu says:

      థాంక్యూ పాయల గారు
      కవిత్వాన్ని జీవింప జేసేది కవిత్వమే కదా…

  7. నిశీధి says:

    Beautiful poem and equally beautiful words

  8. కోడూరి విజయకుమార్ says:

    జయశ్రీ గారు …. కవి ఒక వస్తువు కేంద్రంగా ఒక కవితని సృజించాడు అంటే, కేవలం ఆ వస్తువు గురించి మాత్రమె చెప్పాడని కాదు …. ఆ మాటకొస్తే మనకు కవితలో పైకి కనిపించే వస్తువు ఒక అందమైన శిల్పం పై వేసిన ఒక పల్చటి వస్త్రం లాంటిది మాత్రమె ! మట్టి పైన వుండే మొక్క మనకు కనిపిస్తుంది గానీ లోపలి తడి పైకి కనిపించదు కదా …. కవితలో కూడా, కవి గుండె గొంతుకలోన కొట్టుకులాడే ఒక ఆర్తి వుంటుంది …. మానవ సంబంధాల పైన శివారెడ్డి గారు రాసిన చాలా కవితలలో మనకు ఈ ఆర్తి కనిపిస్తుంది …. మీరు ఈ వ్యాసంలో కవి ఆర్తిని చాలా బాగా పట్టుకున్నారు …. అభినందనలు !

    • Jayashree Naidu says:

      థాంక్యూ విజయ్ గారు.. వివరణతో మీరు అక్షరీకరించిన స్పందన చదివాక, బాగా చదివి పరీక్ష రాసిన స్టూడెంట్ కి కలిగే సంతోషం లా వుంది. ఎన్ని సార్లు ఎన్ని విషయాలు రాసినా రచయితకి అదే మొదటి సారి అని అనిపించడం సహజమేమో…

Leave a Reply to Jayashree Naidu Cancel reply

*