చట్టం అను ఒక దేవతా వస్త్రం!

వై.వి.రమణ

 

ramana‘చుండూరు హత్యల కేసులో క్రింది కోర్టులో శిక్ష. కొన్నేళ్ళకి హైకోర్టులో కేసు కొట్టివేత.’

‘బాలీవుడ్ సూపర్ స్టార్‌కి క్రింది కోర్టులో జైలుశిక్ష. నిమిషాల్లో హైకోర్టు బెయిల్ మంజూరు. రెండ్రోజుల తరవాత అదే కోర్టు శిక్షని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.’

‘తమిళనాడు ముఖ్యమంత్రిపై క్రింది కోర్టులో జైలుశిక్ష. కొన్నాళ్ళకి హైకోర్టులో అవినీతి కేసు కొట్టివేత.’

‘చట్టం కొందరికి చుట్టం’ – ఇటీవల కోర్టు తీర్పుల తరవాత ఈ సత్యం అందరికీ అర్ధమైపోయింది. ఒకప్పుడు ఈ సత్యానికి పట్టు వస్త్రం కప్పబడి సామాన్యులకి కనబడేది కాదు. ఆ తరవాత ఆ వస్త్రం పల్చటి సిల్కు వస్త్రంలా మారి కనబడీ కనబడనట్లుగా కనబడసాగింది. ఇవ్వాళ ఆ పల్చటి వస్త్రం దేవతా వస్త్రంగా మారిపోయింది! ఇకముందు ఎవరికీ ఎటువంటి భ్రమలూ వుండబోవు. ఇదీ ఒకరకంగా మంచిదే. ఈ వ్యవస్థలో సామాన్యుడిగా మనం ఎక్కడున్నామో, మన స్థాయేంటో స్పష్టంగా తెలిసిపోయింది.

శ్రీమతి ముత్యాలమ్మగారు నాకు జ్ఞానోదయం కలిగించే వరకూ – నేనూ “చట్టం ముందు అంతా సమానులే” అనే చిలక పలుకులు పలికిన మధ్యతరగతి బుద్ధిజీవినే. ముత్యాలమ్మగారు నారిమాన్, పాల్కీవాలాల్లాగా న్యాయకోవిదురాలు కాదు. ఆవిడ దొంగసారా వ్యాపారం చేస్తుంటారు, ఒక కేసులో నిందితురాలు. నేర పరిశోధన, న్యాయ విచారణలోని లొసుగుల గూర్చి – రావిశాస్త్రి అనే రచయిత ద్వారా ‘మాయ’ అనే కథలో విడమర్చి చెప్పారు. ‘ఆరు సారా కథలు’  చదివాక అప్పటిదాకా నాకున్న అజ్ఞానానికి మిక్కిలి సిగ్గుపడ్డాను.

క్రింది కోర్టుల్లో శిక్ష పడటం, పై కోర్టులు ఆ కేసుల్ని కొట్టెయ్యడం.. ఈ కేసుల్లో ఒక పేటర్న్ కనిపిస్తుంది కదూ? ‘మన న్యాయవ్యవస్థ పకడ్బందీగా లేకపోతే క్రింది కోర్టుల్లో శిక్షెలా పడుతుంది?’ అని విజ్ఞులు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకి నా దగ్గర శాస్త్రీయమైన, సాంకేతికమైన సమాధానం లేదు. ఒక వ్యక్తి ఏ విషయాన్నైనా తనకున్న పరిమితులకి లోబడే ఆలోచించగలడు. నేను వృత్తిరీత్యా డాక్టర్ని కాబట్టి, వైద్యం వెలుపల విషయాల పట్ల కూడా డాక్టర్లాగే ఆలోచిస్తుంటాను, అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటాను. ఇది నా పరిమితి, ఆక్యుపేషనల్ హజార్డ్!

ఇప్పుడు కొద్దిసేపు హాస్పిటల్స్‌కి సంబంధించిన కబుర్లు –

ఆనేకమంది డాక్టర్లు చిన్నపట్టణాల్లో సొంత నర్సింగ్ హోములు నిర్వహిస్తుంటారు. వీరికి అనేక ఎమర్జన్సీ కేసులు వస్తుంటయ్. అప్పుడు డాక్టర్లు రెండు రకాల రిస్కుల్ని బేరీజు వేసుకుంటారు. ఒకటి పేషంట్ కండిషన్, రెండు పేషంట్‌తో పాటు తోడుగా వచ్చిన వ్యక్తుల సమూహం. సాధారణంగా డాక్టర్లకి దూరప్రాంతం నుండి తక్కువమందితో వచ్చే పేషంట్‌కి వైద్యం చెయ్యడం హాయిగా వుంటుంది. వెంటనే ఎడ్మిట్ చేసుకుని వైద్యం మొదలెడతారు.

అదే కేసు ఆ హాస్పిటల్ వున్న పట్టణంలోంచి పదిమంది బంధువుల్తో వచ్చిందనుకుందాం. అప్పుడు పేషంటు కన్నా డాక్టర్లకే ఎక్కువ రిస్క్! ఎలా? విపరీతంగా విజిటర్స్ వస్తుంటారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి.. ఒకటే ఫోన్లు, ఎంక్వైరీలు. తమ నియోజక వర్గ ప్రజల రోగాల బారి పడ్డప్పుడు వైద్యులకి ఫోన్ చేసి ‘గట్టిగా’ వైద్యం చెయ్యమని ఆదేశించడం రాజకీయ నాయకులకి రోజువారీ కార్యక్రమం అయిపొయింది. అందరికీ సమాధానం చెప్పుకోడంతో పాటు డాక్టర్లకి కేస్ గూర్చి టెన్షన్ ఎక్కువవుతుంది.

పొరబాటున కేస్ పోతే – పేషంట్‌తో పాటు వచ్చిన ఆ పదిమంది కాస్తా క్షణాల్లో వెయ్యిమందై పోతారు. పిమ్మట హాస్పిటల్ ఫర్నిచర్ పగిలిపోతుంది. డాక్టర్ల టైమ్ బాగోకపొతే వాళ్ళక్కూడా ఓ నాలుగు తగుల్తయ్. పిమ్మట బాధితుల తరఫున ‘చర్చలు’ జరిగి సెటిల్మెంట్ జరుగుతుంది. అంచేత డాక్టర్లకి క్రిటికల్ కండిషన్లో వచ్చే లోకల్ కేసులు డీల్ చెయ్యాలంటే భయం. అందుకే వారీ కేసుల్లో వున్న రిస్క్‌ని ఎక్కువచేసి చెబుతారు. ‘మెరుగైన వైద్యం’ పెద్ద సెంటర్లోనే సాధ్యం, అంత పెద్ద రోగానికి ఇక్కడున్న సాధారణ వైద్యం సరిపోదని కన్విన్స్ చేస్తారు (కేసు వదిలించుకుంటారు). ఆ విధంగా వైద్యం చేసే బాధ్యతని ‘పైస్థాయి’ ఆస్పత్రులకి నెట్టేస్తారు.

మహా నగరాలకి కాంప్లికేటెడ్ కేసులు అనేకం వస్తుంటాయి. డాక్టర్లు హాయిగా వైద్యం చేసుకుంటారు. కేసు పోయినా – ఎలాగూ బ్యాడ్ కేసే అని పేషంట్ తరఫున వారికి తెలుసు కాబట్టి వాళ్ళ హడావుడి వుండదు. ఎవరన్నా ఔత్సాహికులు గొడవ చేద్దామన్నా, ఆ కార్పోరేట్ ఆస్పత్రికి ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయి వారి అండ ఉన్నందున ‘శాంతిభద్రతలు’ కాపాడే నిమిత్తం పోలీసులు ఆ గుంపుని వెంటనే చెదరగొట్టేస్తారు. అంచేత పేషంట్ బంధువులు ‘ఖర్మ! మనోడి ఆయువు తీరింది.’ అని సరిపెట్టుకుని కిక్కురు మనకుండా బిల్లు చెల్లించి బయటపడతారు.

వైద్యవృత్తి వెలుపల వున్నవాళ్ళకి నే రాసింది ఆశ్చర్యం కలిగించవచ్చును గానీ, ఇది రోజువారీగా జరిగే పరమ రొటీన్ అంశం. ఇందులో సైకలాజికల్ ఇష్యూస్ కూడా వున్నాయి. పెద్ద కేసుల్ని పెద్దవాళ్ళే డీల్ చెయ్యాలి. దుర్వార్తల్ని చెప్పాల్సినవాడే చెప్పాలి. రాజు నోట ఎంత అప్రియమైనా తీర్పు భరింపక తప్పదు. అదే తీర్పు గ్రామపెద్ద చెబితే ఒప్పుకోరు, వూరుకోరు. ఈ హాస్పిటళ్ళ గోలకి నే రాస్తున్న టాపిక్‌తో కల సంబంధం ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమయ్యే వుంటుంది.

“బూర్జువా రాజ్యంగ యంత్రం నేరాన్ని సంపూర్ణంగా అరికట్టదు (అది దానికి అవసరమూ కాదు, శ్రేయస్కరమూ కాదు), అలాగని నేరాన్ని పనికట్టుకుని పోషించనూ పోషించదు. అది నేరాన్ని రెగ్యులేట్ చేస్తుందంతే.” అంటాడు బాలగోపాల్. (‘రూపం – సారం’ 47 పేజి – ‘రావిశాస్త్రి రచనల్లో రాజ్యంగా యంత్రం’). ఈ పాయింటుని ప్రస్తుత సందర్భానికి నేనిలా అన్వయించుకుంటాను – కొన్ని కేసుల్లో బాధితులు పేదవారు, అణగారిన వర్గాలవారు. వారిపట్ల ప్రజలు కూడా సానుభూతి కలిగి వుంటారు. బాధితుల్ని కఠినంగా ఆణిచేస్తే ప్రజల్లో ప్రభుత్వాల పట్ల నమ్మకం తగ్గే ప్రమాదం వుంది. అందువల్ల కొన్నిసార్లు (రాజ్యానికి) కేసులు పెట్టకుండా వుండలేని స్థితి వస్తుంది. శిక్షలు విధించకుండా వుండలేని స్థితీ వస్తుంది. అందుకే మధ్యే మార్గంగా క్రింది కోర్టుల శిక్షలు, పై కోర్టుల కొట్టివేతలు!

చిన్నపాటి హాస్పిటల్స్‌కి వున్నట్లే – కింది కోర్టుల్లో కొన్ని ఇబ్బందులున్నాయి. అక్కడ న్యాయమూర్తులు శిక్ష వెయ్యడానికి కొద్దిపాటి ఆధారాల కోసం చూస్తారు. శిక్ష వెయ్యకపోతే బాధితులు ఆందోళన చెయ్యొచ్చు, తద్వారా తాము కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావొచ్చు. ఆపై ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. క్రింది కోర్టుల్లో ముద్దాయిలకి శిక్ష వెయ్యకపోతే ఇబ్బంది గానీ, వేస్తే ఎటువంటి ఇబ్బందీ వుండదు! అందువల్ల కేసు కొట్టేసే బాధ్యతని ఉన్నత స్థానాలకి నెట్టేస్తారు! హైకోర్టులో మాత్రం కేసుల పరిశీలన పూర్తిగా టెక్నికాలిటీస్ మీద ఆధారపడి జరుగుతుంది. వారిపై ఎటువంటి వొత్తిళ్ళూ వుండవు. శిక్ష ఖరారు చెయ్యడానికి ఉన్నత న్యాయస్థానం వారికి కేసు పటిష్టంగా, పకడ్బందీగా వుండాలి. తప్పించుకోడానికే పెట్టిన కేసులు తొర్రల్తోనే వుంటాయి కాబట్టి సహజంగానే ఉన్నత న్యాయస్థానంవారు కొట్టేస్తారు.

ఇక్కడితో నే చెప్పదల్చుకున్న పాయింట్ అయిపొయింది. కింది కోర్టుల్లో శిక్ష పడ్డాక, ఆ శిక్ష ఉన్నత న్యాయస్థానాల్లో ఖరారు కాకపోవడానికి ఎన్నో కారణాలు వుండొచ్చు. నాకు తోచిన కారణం రాశాను. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే. నా ఆలోచన పూర్తిగా తప్పనీ, నాకు న్యాయవ్యవస్థపై కొంచెం కూడా అవగాహన లేకపోవడం మూలాన అపోహలతో ఏదేదో రాశానని ఎవరైనా అభిప్రాయ పడితే – ఆ అభిప్రాయాన్ని ఒప్పేసుకోడానికి సిద్ధంగా వున్నాను. ఎందుకంటే – నేను ముందే చెప్పినట్లు నాది ‘వైద్యవృత్తి’ అనే రంగుటద్దాలు ధరించి లోకాన్ని అర్ధం చేసుకునే పరిమిత జ్ఞానం కాబట్టి!

మీ మాటలు

  1. Dr. Rajendra prasad Chimata says:

    డాక్టర్ల బాధలను గురించి మీరు రాసింది అక్షర సత్యం .
    డాక్టర్లు కేసు వదిలించుకోడానికి, కోర్టుల్లో కేసుల తీర్పులకు పోలిక చాలా బాగుంది. శిక్ష వెయ్యడం వల్ల కింద కోర్టు జడ్జికి నష్టమేమీ ఉండదు, పైగా చట్టం మీద మామూలు ప్రజలకున్న భ్రమలు కొనసాగుతూనే ఉంటాయి. పై కోర్టుల్లో ఖరీదైన లాయర్లు, సరైన చోట సరైన పధ్దతిలో డబ్బులు వెదజల్లి, సరైన లొసుగులు న్యాయమూర్తులకు చూపించి ఎంత పెద్ద నేరస్తులనైనా చట్ట పరిధిలోనే నిర్దోషులుగా నిరూపించ గలరు.

    • Ramana Yadavalli says:

      థాంక్యూ!

      నాక్కొందరు లాయర్ మిత్రులున్నారు. వాళ్ళు ‘ఇది పెద్ద కేసు. సెషన్స్ కోర్టులో శిక్ష పడుతుంది. హైకోర్టులో కొట్టేస్తారు!’ అనుకుంటుంటే ఆశ్చర్యపొయ్యేవాణ్ని. కారణం తరవాత తెలిసింది. :)

  2. Thirupalu says:

    అసలు ముందు మనకు అధికార ముద్ర కావాలన్న మాట!- అంటే రాజముద్ర. ఆ ముద్ర పడిన తర్వాత ఎవరు ఏ ప్రశ్న వెయ్య టానికి లేదు. — ఇది అందరికి తెలుస్తున్నదే గాని. తెలియనిది ఏమిటంటే ముద్రలు వేయడం అతి సహజాతి సహజం అయిన తర్వాత, ఆ రాజముద్ర వేపిమ్చు కోవడానికి మనము కూడా క్యూ లో నించో క తప్పదు అన్న దోరణి ప్రభలి పోయింది . రావి శాస్త్రీ
    గారి నిజం నాటకం చదివేమ్థ వరకు రాజ కీయ నాయకు గొప్ప పరోప కారులన్న భామ నాకు ఉండేవి. అది చదివినతరువాత భ్రమలు కాస్త పటా పంచలయి కోటా సత్యాన్ని నేనే కానీ పెట్టినంత సంతోషం. సమయోచితంగా ఉన్న మీ వ్యాసం బాగుండి.

    • Ramana Yadavalli says:

      థాంక్యూ!

      అవును. వాస్తవానికి రావిశాస్త్రి ‘నిజం’తో ఈ వ్యాసానికి ఎక్కువ సంబంధం వుంది. కాకపోతే నాకు ముత్యాలమ్మ అంటే ఇష్టం లేండి. :)

  3. chandh-thulasi says:

    రవణ గారూ..మీ కున్న పరిమిత అవగాహనతోనే( !) అటు చట్టం కట్టుకున్న దేవతా వస్త్రాలని చూపించి వైద్య వ్యవస్థ తీరును బట్టలు విప్పి చూపించారు. చట్టమైనా, వైద్యమైనా, విద్యా వ్యవస్థ ఐనా అన్నీ సమాజంలో భాగాలే కదా. సమాజంలోని అవలక్షణాలన్నీ ఆయా వ్యవస్థల్లొ కనిపిస్తాయి. మనమేదో కోర్టులు ….అన్నిటికీ అతీతం అని భ్రమ పడతాం. మన తెలుగు వాళ్ళ అదృష్టం …గురజాడ, రావిశాస్త్రి, పతంజలి లాంటి వాళ్ళు ‘లా’ రహస్యాలు విప్పి చెప్పారు. మీ కలంలో వ్యంగం తగ్గి ఆవేదన పెరుగుతోంది…సంతోషం

    • Y.V.Ramana says:

      థాంక్యూ!

      >>మన తెలుగు వాళ్ళ అదృష్టం …గురజాడ, రావిశాస్త్రి, పతంజలి లాంటి వాళ్ళు ‘లా’ రహస్యాలు విప్పి చెప్పారు.<<

      అవును. ఈ రచయితల్ని చదివితే 'రహస్యాలు' చాలా తెలుస్తాయి. కానీ – ఇవ్వాళ ఎంతమంది వీరిని చదువుతున్నారన్నదే అనుమానం. :)

  4. ‘ఇది పెద్ద కేసు. సెషన్స్ కోర్టులో శిక్ష పడుతుంది. హైకోర్టులో కొట్టేస్తారు!’

    అలాంటప్పుడు పెద్ద కేసులని సరాసరి హైకోర్టుకే పంపేస్తే కింది కోర్టుల సమయం, కక్షిదారుల సమయం ఆదా అవుతుంది కదా.

    • Y.V.Ramana says:

      అవును. బోల్డంత సమయం ఆదా అవుతుంది. కానీ – అలా కుదర్దు! :)

  5. Phoenix says:

    మీరిలా భారత ప్రజల భ్రమలను బ్రద్దలు చేయడం ఏమీబాగాలేదు.

    న్యాయ వ్యవస్థ is a Kaiser’s wife. మీరు ప్రధాని విధానాలనైనా విమర్శించవచ్చునుగానీ జడ్జిలను విమర్శించరాదు – ఎందుకనగా మనదేశంలో ఆర్మీ మరియు న్యాయవ్యవస్థలు పవిత్ర గోముఖమ్ములు (holy cows). మీరు ఏకంగా హైకోర్టుతీర్పుమీద బాణ్ణాన్నెక్కుపెట్టారు. Law is the mistress of the power.

  6. చందు తులసి says:

    భయపడకండి రవణ గారూ ….పై కోర్టులో నిర్దోషిగా విడుదల చేయించే పూచీ నాది..!

  7. Thirupalu says:

    చందు తులసి గారు, అది వర్గాన్ని భట్టి ఉంటుంది అని మరిచి పోతే అలా? రవణ గారు ఎవర్గం వారు?

  8. దేవరకొండ says:

    ఇద్దరు సామాన్యులు లేదా బక్క రైతులు కోర్టు కెడితే ఓడిన వాడు ఎలాగూ ఏడుస్తాడు;గెల్చిన వాడు పైకి నవ్వుతూ లోపల ఏడుస్తాడు…ఇద్దరి ఆస్తులూ హరించుకు పోతాయి కాబట్టి. (ధన)బలవంతుడితో బక్క వాడి పోరాటమైతే బక్క వాడు సర్వనాశనం అయితేనే అటు న్యాయ వ్యవస్థ ఇటు కక్షిదారుడు శాన్తిస్తారు. ప్రభుత్వానికి (ధన)బలవంతుడికి మధ్య ఓ బక్కవాడి (రి) కి న్యాయం చేయవలసిన అగత్యం ఏర్పడిన కేసులో అయితే దశాబ్దాలు సాగి, తరాలు మారి పోయాక ఎలాంటి తీర్పు వచ్చినా ఎవరూ ఏమి అడగని ఓ తరుణంలో ఒక హాస్యాస్పద తీర్పుతో సర్వం ముగిసిపోతుంది. కనుక సర్వులు ఈ దిగువ సూచనలను పాటించడం మంచిది.
    1. దోపిడీ వ్యవస్థల్లో పేద వారికి న్యాయం జరగ దని గుర్తించాలి.
    2. ధనం/కులం తక్కువ్వాళ్ళు కోర్టులూ న్యాయాలు అంటూ ఉన్న కాస్త కాలాన్ని ధనాన్ని వృధా చేసుకోరాదు.
    3. అన్యాయాలు జరగడం సహజం అని సదా గుర్తెరిగి న్యాయ పోరాటాల్లాంటి పిచ్చి వేషాలు మానుకోవాలి.
    4. నాటకాన్ని నాటకంగా ఆస్వాదించడం నేర్చుకోవాలి. న్యాయవాదో న్యాయమూర్తో బాగా నటిస్తున్నాడు కదాని అదంతా నిజమే నని నమ్మి ఆవేశ పడితే ఆఖర్న నష్టపోయేది సామాన్యుడేనని తెలుసు కోవాలి.
    5. ఇష్టదైవ ప్రార్ధన మానరాదు.

  9. దేవరకొండ గారు ! చాల బాగా చెప్పారండి. బల(ధన)వంతుడి చుట్టమే చట్టమని ఇప్పుడు వస్తున్న తీర్పులను చూస్తే అనిపిస్తుంది.

Leave a Reply to Thirupalu Cancel reply

*