మరీ రహస్యమేం కాదు గానీ…!

 మోహన తులసి 

 

 

మబ్బు పుట్టలేదనో, చినుకు రాలలేదనో,
ఆకు కదలలేదనో, నువు పలకరించలేదనో
చివరకి నీతో మిగిలే
ఒంటరి సాయంకాలం గురించనో
జీవితం బాధిస్తూనే ఉంటుంది
 

తన నుదుటి మీద
నెమలీకల్నో, నివురు కప్పిన క్షణాల్నో
ఘనీభవించిన మౌన ఘడియల్నో
నిర్ణయించుకోకుండానే కాలం వచ్చేస్తుందనుకుంటా
ఆనవాలు చూపించని వానలా.
 

గతం నీడలో గోడవ పడటం రోజూవారీ రివాజే
అయినా
వాడిపోయే పూల వెనకాల
దాటెళ్ళిపోయే వెన్నెలనీడల వెనకాల
జీవితం సాగిపోతూనే ఉంటుంది

 
జీవన రాగ రహస్యం తెలియాలంటే
ఒక్కోసారి గుండె తడయ్యేలా ఏడవాలి
ఒక్కోసారి పొర్లి ఏడ్చేంత నవ్వాలి
 

ఒక్కసారైనా చచ్చిబ్రతికినంత ప్రేమించాలి
 

ఒకే ఒక్కసారైనా
నీరెండ మెరుపులో ఉరికే వాగునీళ్ళల్లో
గులకరాళ్ళ నడుమ గుండెని విసిరేయాలి.

*

Painting: Anupam Pal

మీ మాటలు

 1. balasudhakar says:

  ఏం రాశారండి !
  ఇందులో కొన్ని వాక్యాలు గుండెని సలపరం పెడుతున్నాయి. ” ఒక్కోసారి గుండె తడయ్యేలా ఏడవాలి, ఒక్కసారైనా చచ్చిబ్రతికినంత ప్రేమించాలి ” -ఇవి ఈ వాక్యాలు -వీటికి ప్రాణం వుంది. కవితికి ఆర్ధ్రతని అద్దినవి ఈ వాక్యాలే అని అనుకుంటున్నాను. ముగింపు చెప్పక్కర్లెద్దు. చాలా అద్భుతంగా చెప్పారు. లోపల రగిలేదాన్ని సరిగ్గా బయటకు లాక్కొచ్చారు. ఇలాంటి వాక్యాలు చదివించినందుకు.. థాంక్యూ !

 2. ఒక్కసారైనా చచ్చిబ్రతికినంత ప్రేమించాలి… సూపర్ గా చెప్పారు

 3. భావోద్వేగం .. అక్షరాల్లో !! అద్భుతంగా వుంది తులసీ గారు

 4. అద్భుతం మోహన తులసీ…. ఆఖరి వాక్యం నిజంగా సూపర్ … ” గులకరాళ్ళ నడుమ గుండెని విసిరేయాలి” – వావ్!

 5. మౌని says:

  నిజమే… రహస్యం ఏముందీ..
  చివరికి చక్కా చెప్పేసావ్..
  అవును
  గుండె తడయ్యేలా ఏడ్వాలి
  పొర్లి ఏడ్చేంత నవ్వాలి

  ఒక్కసారైనా…
  చచ్చి బతికినంత ప్రేమించాలి

  అంతే…
  కాలానికేముంది తన మానాన తను పోతూనే ఉంది
  ఊగిసలాడేదీ.. ఉద్రేక పడేదీ.. ఉడుక్కుంటున్నదీ..
  బతుకే.. :)

 6. జీవితాన్ని ఎంత అధ్బుతంగా చిత్రించారు!

 7. vani koratamaddi says:

  జీవన రాగ రహస్యం తెలియాలంటే
  ఒక్కోసారి గుండె తడయ్యేలా ఏడవాలి
  ఒక్కోసారి పొర్లి ఏడ్చేంత నవ్వాలి
  ఒక్కసారైనా చచ్చిబ్రతికినంత ప్రేమించాలి
  ఒకే ఒక్కసారైనా
  నీరెండ మెరుపులో ఉరికే వాగునీళ్ళల్లో
  గులకరాళ్ళ నడుమ గుండెని విసిరేయాలి. ….అద్భుతంగా రాశారు మోహన తులసీ గారు

 8. ఏది నచ్చిందో చెప్పాలంటే మొత్తం కవితనే ఇక్కడ కోట్ చెయ్యాలి. బాణం సూటిగా గుండెల్లో దిగిపోయింది తులసీ.

 9. నిశీధి says:

  Lovely !

 10. నారాయణస్వామి says:

  బాగుంది పద్యం – కొన్నిఊహలు కొన్ని వాక్యాలు కట్టి పడేసేలా ఉన్నాయి

 11. Kalyani says:

  ఒక్కసారైనా చచిబ్రతికేంత ప్రేమించాలి …. అద్భుతంగా చెప్పావ్ తులసి …

 12. vijay kumar says:

  ఎప్పుడన్నా వెన్నెలను జేబులో నింపుకుని ఎంచక్కా గువ్వలతో కలిసి షికారు చేయాలనుకున్నప్పుడు …..ఈమె కవితలు చదివితే చాలు

 13. గతం నీడలో గోడవ పడటం రోజూవారీ రివాజే అయినా …
  వాడిపోతూ, దాటెళ్తూ జీవితం సాగిపోతూనే ఉంటుంది …

  మరీ రహస్యమేం కాదు గానీ…!
  బాగుందండి ప్రసూన గారూ…!

  • క్షమించాలి …
   మరీ రహస్యమేం కాదు గానీ…!
   బాగుందండి తులసి గారూ…!

 14. “జీవన రాగ రహస్యం తెలియాలంటే
  ఒక్కోసారి గుండె తడయ్యేలా ఏడవాలి
  ఒక్కోసారి పొర్లి ఏడ్చేంత నవ్వాలి

  ఒక్కసారైనా చచ్చిబ్రతికినంత ప్రేమించాలి” చాల బాగుంది అండి. its touching !

 15. కాజ సురేశ్ says:

  అందమైన కవిత. అభినందనలు మోహనతులసి గారు

 16. Dr. Vijaya Babu, Koganti says:

  “ఒకే ఒక్కసారైనా
  నీరెండ మెరుపులో ఉరికే వాగునీళ్ళల్లో
  గులకరాళ్ళ నడుమ గుండెని విసిరేయాలి.”
  నిజం .
  అభినందనలు

 17. ఆర్.దమయంతి. says:

  వాడిపోయే పూల వెనకాల
  దాటెళ్ళిపోయే వెన్నెలనీడల వెనకాల
  జీవితం సాగిపోతూనే ఉంటుంది..
  గొప్ప దృశ్యమ్ కదిలి వెలిగి మాయమైంది ఈ మాటల్లో..
  బావుంది. టైటిల్ ఇంకా బావుంది.

 18. vakada Rajarao says:

  Good depth

 19. ఎంత బాగుంది కవిత తులసి. ఒక్క కవితలో ఇన్నిన్ని భావనలు,పదాలు, పద చిత్రాలు .. ఇలా ఎలా?
  నీకు నీవే సాటిరా..

Leave a Reply to Rekha Jyothi Cancel reply

*