చెమట చుక్కే సముద్రం!

Reviewer

డా. నారాయణ గరిమెళ్ళ

 

మనలో చాలా మంది కి సముద్రమంటే వల్లమాలిన ఇష్టం, తెలియని ఆహ్లాదం, అంతులేని పరవశం. గంగ పుత్రులకు సముద్రమంటే బతుకు తెరువు. నావికులకు అదొక ప్రయాణ మార్గం. ఇంకా అనేకమందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంతులేని అనంతమైన కడలితో తప్పని లేదా తప్పించుకోలేని ఏదో సంబంధం  నిత్యం ‘వంటల్లో వేసుకునే ఉప్పులా’ ఉంటూనే వుంటుంది.

ఉప్పగా వుండే సాగర స్వభావాన్ని కేవలం ఉప్పునీరుగా దర్శిస్తే  గొప్పేముంది!?  చెమట చుక్క గా  దర్శించడం లోనే గొప్పతనమంతా దాగి ఉంది. అక్కడే కవిత్వం ఉంది. ఏ అరమరికలూ లేకుండా ఖరా-ఖండీగా ‘ నేను శ్రామికజన  పక్షపాత కవిని ‘ అని  చెప్పగలిగే ధైర్యం ఉంది.

శ్రామిక జీవుల చెమటతో పాటు అనేకమంది ఆర్తుల జీవిత వ్యధలలో చిలికే కన్నీటి బొట్ల  వెతలను కూడా పొందిగ్గా పట్టుకుని ఈ కవి నిజంగానే ఒక కవితా సముద్రాన్నిసృష్టించి మనముందు కు తీసుకొచ్చారు.

మొయిద శ్రీనివాసరావు వ్రాసిన  నలభై కవితల సమాహారం ‘సముద్రమంత చెమట చుక్క’. మనకు పరిచయమున్న దారుల్లో కొంత సేపు నడిపించి, మరికొంత సేపు పరిగెత్తించి పరిచయం లేని వాస్తవాలను సైతం చూసే దృష్టిని ప్రసాదించారు. పరిమాణం దృష్ట్యా అల్పమైన వాక్యాలలో అనల్పమైన అర్ధాలను ఆవిష్కరించడం ద్వారా  ఈ బాధ్యతను నిర్వహించారు.

విజయనగరం జిల్లా లోని నెల్లిమర్ల గ్రామానికి చెందిన కవి, అక్కడి జ్యూట్-మిల్ కార్మికుల మీద జరిగిన కాల్పులకు తల్లడిల్లినప్పుడు, ఆ కార్మికుల త్యాగాలకు ప్రణమిల్లినప్పుడు,  ఆ ఉద్యమానికి ముందూ వెనుకా ఉన్న మూలాల్లో తన కుటుంబమూ ఒక పిడికిలిగా అంతర్భాగమైనప్పుడు ఆ ఉద్యమం తనపై చూపిన ప్రభావాన్ని, కల్గించిన భావావేశాన్ని తదనంతరకాలంలో చిమ్మిన కవిత్వానికి  నాంది లేదా పునాది గా మలచుకున్న విధానం పటిష్టంగా కనిపించే గొప్ప విషయం. ఆ పరిధి విస్తృతమై ఏ ఏ జీవితాలను, వాటి నేపధ్యాలనూ, సాగర మధనం చేసిందో తెలుసుకోవాలంటే ఈ సంకలనం లోని కవితలలోకి ప్రయాణించాలి.

‘నెల్లిమర్ల’ అనే ఊరి పేరే శీర్షికైన మొదటి కవిత లో, నిన్నటి ఆ ఊరి గురించి కవి తెలుసుకోవడానికి చేసిన ప్రయాణం ఆ ఊరి ప్రజలను మరియు నైసర్గిక స్వరూపాలను తడుముకుంటూ సాగుతుంది. తెలిసినట్టనిపించిన సామాన్య విషయాలతో ప్రారంభం అవుతుంది. అందువలన పాఠకుడి కి ఈ కవిత్వం చదవడం ఎంతమాత్రం అసౌకర్యంగా అనిపించక పోగా, చదవాలన్న  ఉత్సుకత  ఏర్పడి చకచకా చదివిస్తుంది.

నిన్నటి నా ఊరు గూర్చి

తెలుసుకోవాలన్న ఆలోచన

నా బుర్ర తొర్రలోకి

వడ్రంగి పిట్టై వచ్చి వాలింది

ఆ ఊరు గురించి నలుగురు పెద్దమనుషులను మాత్రమే అడిగి ఊరుకోకుండా, కాలం కాలికిందపడి నలిగిన ఖాళీ అగ్గి-పెట్టె లా ఉన్న ఆ ఊరి ప్రక్కనున్న కొండమీది కోటను, ఊరిని ఆనుకుని ప్రవహించే ఏరునూ కూడా అడగటం బాగుంటుంది. తెలిసిన చరిత్రని మృదువుగా ప్రేమగా మనకు పరిచయం చేస్తూ ఇష్టాన్ని, ఆసక్తినీ కల్గిస్తుంది. నెల్లిమర్లకు సరైన నిర్వచనం, నారమిల్లు కవి కి ఇచ్చిన సమాధానం లో బహిర్గతమౌతుంది.  కాలే కడుపులు కాగే డప్పులుగా మారిన వైనాన్ని వివరిస్తుంది. కార్మిక కండచీమల తెగువును నినదిస్తుంది.

నలు దిక్కులా నలుగురి నాలుకలపై

నా ఊరెలా నిలిచిపోయిందో విన్నాక

నా ఊరి పేరునే

నా ఇంటి పేరుగా మార్చుకోవాలనుంది.”

అనడం తో కవి ఆ ఉద్యమాన్నుంచి ఎంతటి స్ఫూర్తి పొందాడో మనకి అర్ధమౌతుంది.  బుర్రని తొర్ర గా మార్చి వడ్రంగి పిట్ట అనే తపన తో పొడిచి వెదికే పక్షి కి ఇవ్వడం ఉదారత కాదు. తనకు మాత్రమే సొంతమైన తాత్వికత.

నేతులు తాగిన తాతల మూతుల గురించి, కులం గురించి, వంశాల వారసత్వం గురించి పాకులాడే మామూలు మనుషులు మధ్య, రక్తం చిందించిన శ్రామిక వీరుల విప్లవ జెండాకు నమస్కరిస్తూ నిలబడ్డ ఈ కవి  దృష్టి ఠీవిగా కనబడుతుంది.

 

తూటాలకు సైతం వెరవని కార్మికుల పోరాటం గురించి వారి త్యాగాల వలన ఆ ఊరు చారిత్రాత్మకమైన విధానం గురించి ‘ఔరా’ అని అబ్బుర పడుతుండగానే, మరొక కవిత ‘మంటల జెండా’ లో ‘వీచే పడమటి గాలులకు నేటి రైతు అరటి చెట్టు కూలినట్టు తాత్కాలికంగా కూలినా, రేపు ఫ్యాక్టరీ పొగగొట్టం లోంచి పొద్దయి పొడుచుకు రాక మానడు!’ అంటారు.ఒక సిధ్ధాంతానికి ప్రతీకగా చెప్పడానికి  జెండాతో పోల్చడం సాహితీకారులకు పరిపాటి. అయితే ఈ సంకలనంలోవాడిన పదచిత్రాలు, ఆయా కవితల ఆత్మలను కళ్ళకు కడతాయి.

‘పోరుపిట్ట’ లో శ్రమైక జీవన నాదాన్ని ధ్వనించే కాకిని ‘పోరుపిట్ట’గా ఎత్తి చూపించడం ఎంత మాత్రం అసహజమనిపించక పోగా మనకి ఆ పక్షి లాంటి శ్రమ జీవనాన్ని సాగించే వారి మీద తెలియని గౌరవాన్ని నేర్పుతుంది.

ఎర్రని ఎండలో

పురుగో పుట్రో ఏరి తెచ్చి

కళ్ళు తరవని పిల్లల నోటిలో

ఉషోదయానికి ఊపిరిలూదిన మాతృమూర్తి

కోకిల గుడ్లను కూడా తనే ప్రేమగా పొదిగే కాకి, ఎర్రని ఎండలో కూడా తన పని లేదా బాధ్యతను తను నిర్వహించడాన్ని కవి సునిశితంగా పట్టించుకోవడం ఆసక్తి ని రేపుతుంది. అది కవితంతా కనిపిస్తుంది.

కరెంటు దెబ్బకు రెండు పిట్టలు నేలరాలితే

గుంపు మొత్తంతో కలసి

గాలిలో గింగుర్లు కొడుతూ

సమర సన్నాయినూదిన చైతన్యదీప్తి

శ్రీశ్రీ గారన్న ‘కష్ట జీవికి రెండు వైపులా కాపలా కాసే వాడే కవి’ నిర్వచనం ఈ కవికి అక్షరాలా వర్తిస్తుందనిపిస్తుంది.

‘ఇనుప కౌగిలి’ లో అందరికీ ఏడాది చివరిలో అనుభవమయ్యే చలి కాలాన్ని, ఒక నాటి రాత్రి నేపధ్యంలో భయం దుప్పటి వదలమనే సంకేతంతో చెబుతారు. కుంపటిలో నిప్పు రాజేసుకున్న గుడిసెలోని ఆమె, నోటిలో చుట్ట అనే నిప్పు కత్తితో పొలిమేర పొలం లోని అతడు,  చలిని ఎదుర్కొన్న విధానాన్ని ఊలు దుస్తులు కప్పుకుని గుడిసెల లో నుండి చూసే పిల్లల దృష్టితో చూపించారు. ఈ కవిత ఇంతటితో ఆగిపోతే పెద్దగా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఆఖరిలో ఇలా అంటారు.

తెల్లారేసరికి

వారి తెగువకు అది (చలి) కాస్తా తల ఒగ్గేది

…………………………..

………………………….

తరువాత తెలుసుకునే వాళ్లం

భయపడితేనే ఏదైనా

ఇనుప కౌగిలిలో బంధించగలదని!

అగ్నిశిఖల్లా కలబడితే పారిపోతాయి

ఆఖరికి చలైనాపులైనా అని!!

Poet Photoనిప్పుని, భయాన్ని ఎదుర్కొనే పనిముట్టుగా చూపించారు. ఒకేలా అనిపించినా కూడా నిప్పులా కలియబడటానికీ, కొవ్వొత్తిలా వెలగడానికీ మధ్య చాలా అంతరం ఉందని నెత్తుటి పూలు కవిత చదివాక మాత్రమే తెలుస్తుంది. ఢిల్లీలో నిర్భయ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ వ్రాసినది  ఇది.

కబంద హస్తాల కింద

పూలు నలగడం మూగగా రోదించడం

ఇక్కడ కొత్తేమీ కాదు

…….

రాలిన పూలకై

నెత్తిన నిప్పుకత్తులు ధరించిన కొవ్వొత్తులై

కన్నీరు కారిస్తే

కమ్ముకొస్తున్న పొగమంచు తొలిగిపోదు

………

పూలన్నీ ముళ్ళై కదిలితేనే

నిర్బంధ హస్తాల నుంచి

సరికొత్త సూర్యోదయం సాక్షాత్కరిస్తుంది!”

ఈ రకంగా చలిని నిప్పు బెదిరించగలదు అని ‘ఇనుప కౌగిలి’ లో చెప్పిన కలం తోనే, అత్యాచారం తరువాతి కొవ్వొత్తుల నిరసనలు మాత్రం కంటి తుడుపు చర్యలు మాత్రమే కాగలవని ఉద్భోద చేశారు.

కలియ బడాలి, మాట్లాడాలి, పోట్లాడాలి లాంటి సూచనలన్నీ ఎప్పుడన్నదే కదా ప్రశ్న? ఎందుకు మాట్లాడాలో ‘మౌనం మంచిది కాదు’ లో,

దీపమై మాట్లాడితే కదా

చీకటి చెదిరి

నిజం నలుదిశలా విస్తరించేది!

అంటారు.

మాట్లాడాలి అని అర్ధమయ్యాక, మాట్లాడితే ఎలా ఉండాలి అన్న ప్రశ్న కూడా సహజం. ‘మాట’కు గొప్ప నిర్వచనాన్ని మరొక కవితలో ఏకంగా చూడవచ్చు.

 

మాట ఎలా ఉండాలని

పొగచూరిన పొయ్యిలా ఉన్న

మా అమ్మనడిగాను

ఎండుపుల్ల విరిగినట్టు ఉండాలన్నది

ముఖం చెల్లని రూపాయి కాసులా ఉన్న

మా నాన్నని అడిగాను

 అడిగే ప్రతి మనిషి కీ ఒక సహజ వాతావరణం ఉంటుంది. దానికి లోబడే ఆ మనిషి మాటకు నిర్వచనం చెబుతాడు. అది వారి వ్యక్తిగత నిర్వచనం మాత్రమే అని బయటకు మనకు అనిపించినా, అందులో తొంగి చూసే సార్వజనీనత ఆశ్చర్యపరుస్తుంది. కవిత్వం వ్రాయడమెలాగో తెలియక పట్టువదలని ప్రయత్నాలు చేసే విద్యార్ధులకు ఈ కవిత మంచి పాఠం లా ఉంటుంది. సాధారణమైన విషయాల పరంగా మాట అంటే ఎలా ఉండాలో చెప్పిన తీరు అబ్బుర పరుస్తుంది.

ప్రశ్నిస్తూ, మాట్లాడుతూ, చొరవగా చొచ్చుకుపొమ్మని నిర్దేశించిన కలం, నిరసన జ్వాల గా మాత్రం అర్ధాంతరం గా జీవితాన్ని ఆర్పేసుకుని బుగ్గి కావద్దని హెచ్చరిస్తుంది. సెల్ టవర్లు ఎక్కి బెదిరించడం, వంటిపై కిరోసిన్ పోసుకుని దహించుకోవడం ఇవి పచ్చనైన ఒక్క జీవితాన్ని మాత్రమే బలి తీసుకోవు, ముందూ వెనుకా అనేక ఆశల్నీ జీవితాలానూ కూడా సమూలంగా నాశనం చేసేస్తాయి.

‘పొద్దు తిరగని పువ్వు’ లో బతుకులు రోడ్డున పడటం మరియు రోడ్డు దారి పట్టడం వెనుక ఉన్న నిరాదరణ ను పట్టి చూపించి ప్రస్తావిస్తుంది. ఆ నిరాదరణ అలాగే కొనసాగుతూ ఉంటే, అనాధల బతుకులు ఎప్పటికీ విరబూయక ముడుచుకు పోతున్న పొద్దు తిరగని పువ్వులౌతాయని  దైన్యంగా చెబుతుంది.

  నిరాదరణ

చెట్టు నుండి

నేలరాలిన పుష్పమో?

ఫుట్పాత్ పై ఆకలిమంటతో

ఒంటిని వెచ్చబెట్టుకుంటూ

విసిరేసిన ఆకాశపుటాకులో

మిగిలిన ఎంగిలి ముద్దకై

ఆశగా చూస్తూ

నిత్యం నిద్దట్లో

చిల్లర చుక్కలను కలగంటుంది

అవసరం, అవకాశం, తప్పని సరి జీవితం, తప్పించుకోలేని పరిస్థితులు ఇవన్నీ పలు చట్రాలుగా మనిషిని బంధీని చేస్తున్న తీరు కవితలలో ఏదో ఒక మూల ముల్లులా గుచ్చి మన ఆలోచనలలో ప్రశ్నలను రేకెత్తిస్తాయి.

పెట్టుబడి దారుల కబంధ హస్తాలలో మగ్గిపోతున్న బాల్యాన్ని, చదువు సంధ్యలనూ రూప విక్రయం రూపంలో లార్వా నుండి సీతాకోక చిలుక దశల పరంగా చెప్పారు.

 

సెల్ఫోన్ ను ‘మాటల పిట్ట’ గా ముచ్చటించి సరదాగా సాగే కవిత ప్రారంభం లో:

నా చెమటచుక్కలకు రాలిన

పది పచ్చరూకలు పోసి

మాయాబజారులో

ఒకనాడు

మాటలపిట్టను పట్టుకొన్నాను

అని సెల్-ఫోన్ తనను చేరిన సాధారణ విధానాన్ని సామాన్యంగా ప్రారంభిస్తారు. కవిత అంతానికి తెలిసొస్తుంది దాని మాయజాలం మనిషిని ఎంతలా దాసోహం చేసుకుంటోందో.

అది నా పంచేంద్రియాలను జయించిన

ఆరో ఇంద్రియమై

నన్నుతన ముక్కున కరచుకొని

నిదానంగా నడిచిపోతోంది!

ది మనుషులను ఎంత చాకచక్యంగా వ్యసన పరులని చేస్తోందో చెప్పి వాపోతారు. ఇలాంటి మాటల పిట్టల వలన అనుకోని సౌలభ్యం ఎంతో అందుబాటులోకి వచ్చి అబ్బురపరుస్తున్నట్టనిపించినా, అది కూల్చేస్తున్న లేదా తృణీకరించేస్తున్న సహజ సంబంధ బాంధవ్యాల ప్రస్తావనే  కవికి ఇక్కడ ముఖ్య విషయం.

ఈ సంకలనం లోని మొత్తం కవితలన్నీ వర్తమానం ఆటుపోట్లకి గురవ్వడానికి గత, భవిష్యత్ కి సంబంధించిన అంశాలు ఎలా కారణభూతులౌతున్నాయో  అంతర్లీనంగా నొక్కి చెబుతాయి. ఐతే, వాటిని ఎదుర్కోడానికి కావల్సిన శక్తి యుక్తులూ, ముందు చూపు, చొరవ, పరత్యజించాల్సిన అలవాట్లు, కాపాడుకోవలసిన సంపద లాంటి బంధాలు అన్నీ కూడా ఈ కవితల లోనే కనిపించి పరిష్కార మార్గాలను కూడా సహజంగా నేర్పుతుంటాయి. మాటల పిట్ట లాంటి కవితలను తెలుగు వాచకం పుస్తకాలలో చేర్చితే విద్యార్ధులకు కవిత్వం, భాష మరియు సాహిత్యం పట్ల ఇష్టం కల్గించడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా పలు ఇతర కవితలను తెలుగు సాహిత్యం తలకెత్తుకుని కాపాడు కోవడం చాలా అవసరమనిపిస్తుంది.

జీవితం లోంచి సహజంగా వచ్చిన వాక్యాలు, సామాజిక ప్రయోజనాన్ని ఆశించి మన ముందు నిలబడితే ఎంత అర్ధవంతంగా ఉంటాయో చూడాలంటె మొయిద శ్రీనివాసరావు గారి సముద్రమంత చెమటచుక్క లోని కవితలను తప్పక చదవాలి.

ఈ పుస్తకం చదివాక, ‘మాట’ కవిత లో లా ‘వందనం’ అంటే ఎలా ఉండాలి అని అడిగితే..

స్వేదానికి చేసే నమస్కారంలా

ఉన్నత విలువలకు కట్టే పట్టంలా

సముద్రమంత చెమట చుక్కలా

అని మనస్పూర్తిగా చెప్పాలనిపిస్తుంది. అదే ఈ చక్కని చిక్కని కవితలలో సమ్మిళితమైన అంతస్సూత్రం.

ప్రతులకు సంప్రదించండి.

Email: moidasrinivasarao@gmail.com

 

మీ మాటలు

  1. రెడ్డి రామకృష్ణ says:

    నారాయణగారూ!,మీ సమీక్ష చాలా బాగుంది.కవి ఆత్మని పట్టి చూపించేరు.ఒక మంచి కవితా సంపుటిని పరిచయం చేసినందుకు మీకు అభినందనలు.ఈ కవితాసంపుటిని యింతకు ముందే చదివి వుండడం వలన నేనీమాట చెప్పగలుగుతున్నాను.

    “నేటి రైతు అరటి చెట్టు కూలినట్టు తాత్కాలికంగా కూలినా, రేపు ఫ్యాక్టరీ పొగగొట్టం లోంచి పొద్దయి పొడుచుకు రాక మానడు!” వర్తమానస్థితిని చక్కగా చెప్పినవాక్యమనిపించిన్ది.మారుతున్న పరిస్థితులలో గ్రామాలనుంచి పట్టణాలకు పోతున్న వలసలు ఈవిషయాన్ని రూఢి పరుస్తున్నాయి.వలసపోయినరైతు పట్టణ కార్మికుడిగా మారక తప్పని స్థితి ప్రస్తుతం మనకు కనపడుతున్న యదార్ధం.
    మేనిఫెస్టో రచయితలు కూడా యిది అనివార్యమనే చెప్పారు.
    విప్లవ కవిత్వము కూడా ఫేషన్ గా మారిపోయిన (మార్చబడిన) కాలంలో ఒక మంచి పుస్తకంగా ఈ “సముద్రమంత చెమటిచుక్క”ను నేనభిమానిస్తాను.కవికి మీకు మరో మారు అభినందనలు.

  2. vasavi pydi says:

    అనంతాన్ని అవలీలగా పుక్కిట పట్టినట్లు సముద్రమంత చెమట చుక్కవెనకాల ఎంత శ్రమ దాగి ఉందొ మంచి పుస్తకం పరిచయం చేసారు

  3. srinivasarao says:

    నారాయణ గారు పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  4. Samudram chemata chukka
    ADBHUTAM .manchi parichayam

  5. balasudhakarmouli says:

    నారాయణ గారూ.. వ్యాసం బాగా రాశారు.

  6. Garimella Nageswararao says:

    నారాయణ గారూ సమీక్ష చాలా బాగుంది శ్రీనివాస్ లాంటి కవులు వర్తమాన సాహిత్యా నికి చాలా అవసరం

  7. పాయల says:

    నారాయణ గారు పుస్తక పరిచయం గొప్ప గా వుంది . మిత్రుడు మొయిద కు శుభాకాంక్షలు

  8. srinivasarao says:

    Thanks for all

  9. Narayana says:

    రామకృష్ణ గారు, వాసవి గారు, శ్రీనివాసరావు గారు, మధు గారు, బాలసుధాకరమౌళి గారు, నాగేశ్వరరావు గారు మరియు పాయల గారు,

    మీ మీ విలువైన అభిప్రాయాలను తెలియజేసినందుకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

    నారాయణ.

  10. Narayana says:

    రామకృష్ణ గారు,

    మీ సూచనలు, సలహాలు, అభినందనలతో రచనలను,కవులను, రచయితలనూ ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నారు.

    దీని వలన మరింత ఇష్టంగా, బాధ్యతాయుతంగా రచనలు చెయ్యడానికి, వాటి నాణ్యతను మెరుగు పరచుకోడానికీ అవకాశం దొరుకుతోంది.

    ధన్యవాదాలు,
    నారాయణ.

Leave a Reply to srinivasarao Cancel reply

*