అవసరమే కథల్ని పుట్టిస్తుంది:గంటేడ గౌరునాయుడు

బాలసుధాకర్ మౌళి

 

ఇన్నాళ్లూ ఉత్తరాంధ్ర కథ ఏం మాట్లాడిందంటే మట్టి భాష మాట్లాడింది – మనుషుల వెతలను ప్రపంచం ముందుకు తీసుకొని వచ్చింది. పోరాట ఆవశ్యకతను చాటిచెప్పింది. సాహిత్యం ఏం చేస్తుంది ? మనుషులను చైతన్యవంతం చేస్తుంది. ఉత్తరాంధ్రా కథ ఆ కర్తవ్యాన్నే నెరవేర్చింది – నెరవేర్చుతుంది. అటు పాటల రచయితగా, కవిగా ; ఇటు కథా రచయితగా – ఏం చేసినా ప్రజా చైతన్యమే పునాధిగా ; అవసరార్థమే కథ రాశాను – రాస్తున్నాను అని చెబుతున్న ‘గంటేడ గౌరునాయుడు’ మాస్టారు ఆలోచనలు, అభిప్రాయాలు ఇవి. సూక్ష్మంగా ఆయన అంతరంగ అన్వేషణ.

గంటేడ గౌరునాయుడు మాస్టారు – ‘స్నేహకళాసాహితి’ అనే సాహితీ సంస్థని స్థాపించి చాలా మంది యువకవులకు, కథా రచయితలకు వొక వేదికనందించారు అని అనడం కంటే యువతరంతో కలిసి సాహితీసేద్యం చేస్తున్నారు అంటేనే ఆయనకు ఎంతో ఇష్టమౌతుంది.
‘ప్రియభారతి జననీ.. ‘ పాటలు; ‘నాగేటి చాలుకు నమస్కారం – నాగలి’ దీర్ఘ కవితలు; ‘కళింగోర’ పేరుతో కాలమ్ నిర్వహణ; ‘నదిని దానం చేశాక’ కవిత్వసంపుటి; ‘ఏటిపాట – ఒక రాత్రి.. రెండు స్వప్నాలు’ కథాసంకలనాలు; ఈ మధ్య వచ్చిన ‘ఎగిరిపోతున్న పిట్టల కోసం’ కవిత్వం – ఈయన సాహిత్య ఉత్పత్తులు. ‘ఇది నా ఊరేనా ! ‘ పేరుతో పాటల సి.డి వొకటి విడుదల చేశారు. తొలి రోజుల్లో ‘ పోడు మంటలు ‘ అనే నృత్య నాటకం రాసి చాలా ప్రదర్శనలిచ్చారు. ఈ మధ్య ‘ఒక రాత్రి.. రెండు స్వప్నాలు’ తర్వాత వచ్చిన ఆయన ఏడు కథలు చాలా చర్చనీయాంశాలను చెప్పాయి. ‘మాయ, పొద్దు ములిగిపోయింది’ ఈ రెండు కథలు – ముంపు నేపథ్యంలోంచి; ‘ఇండియాగాడి టి.సి, సంధ్య’ కథలు – ట్రైబల్ విద్య నేపథ్యంలోంచిమాట్లాడుతాయి. ‘మూడు దృశ్యాలు’ కథ – ప్రభుత్వపథకాలు ఎవరికి లాభం చేకూర్చుతున్నాయో చెబితే, ‘ఒక ఊరి కథ’ – పెట్టుబడిదారి విధానం మీద పూర్తిగా ఆధారపడిన తర్వాత రైతు పరిస్థితి ఏమిటి ? అనే విషయాన్ని చర్చిస్తుంది. గౌరునాయుడు మాస్టారి కొత్త కథ ‘అల్పపీడనం’ లక్ష్మిం పేట నేపథ్యంలోది. అదింకా ప్రచురితం కావాల్సి ఉంది.

1. మీ నేపథ్యం చెప్పండి?
నేను పుట్టిన ఊరు – దళాయి పేట, కొమరాడ మండలం, విజయనగరం జిల్లా. వ్యవసాయ కుటుంబం. నా చదువు పార్వతీపురంలో సాగింది. ఉద్యోగమూ ఈ పరిసరప్రాంతాల్లోనే.

2. కథా సాహిత్యంలోకి ఎలా వచ్చారు?
నా బాల్యస్నేహితుడు, కథా రచయత ‘అట్టాడ అప్పలనాయుడు’ కథా సంపుటి – ‘పోడు పోరు’ నన్ను కథా సాహిత్యంలోకి లాక్కొచ్చింది. అంతకు ముందూ కథలు రాసేవాణ్ణి కానీ అప్పలనాయుడు కథలు చదివాక కథ రాయడం మీద బాధ్యత పెరిగింది. కారా, భూషణం, చాసో, తిలక్ కథలు ఇష్టంగా చదివాను.

3. మిమ్మల్ని ప్రభావితం చేసిన కథకులు – కథలు ఏవి?
కారా – చావు, చాసో – వాయులీనం, తిలక్ – ఊరి చివర ఇల్లు, రావిశాస్త్రి – తప్పు కథలు నన్ను బాగా ప్రభావితం చేశాయి.

4. కథ, పాట, కవిత ఈ మూడింటినీ మీరు నిర్వహించారు. నిర్వహిస్తున్నారు ఈ మూడింటిని ఎలా సమన్వయం చేయగలిగారు ?
పాటతో బయలుదేరాను. కవిత్వాన్ని ఇష్టపడ్డాను. కథ అవసరం కనుక రాస్తున్నాను. కవిత ద్వారా, పాట ద్వారా చెప్పలేని విషయాన్ని కథ ద్వారా విస్తారంగా చెప్పడం సులువు. అందుకే కథనే ప్రధానంగా నా భావప్రసారానికి మాధ్యమంగా ఎన్నుకున్నాను.

IMG_20150428_100723

5. పాట మీ కథల్లోకి ఎలా ప్రవేశించింది?
పాట నాకు ఇష్టం కాబట్టి మొదట నేను పాటతో బయలుదేరాను. పాట కథాగమనానికి దోహదపడుతుందని అనుకున్నప్పుడే అక్కడక్కడ నా కథల్లో ఉపయోగించాను. అయితే శృతి మించిన కవిత్వం కథాగమనాన్ని నాశనం చేస్తుందని నా అభిప్రాయం.

6. మీరు రైతు, వ్యవసాయం ప్రధానంగా కథలు రాస్తారు కదా.. మీ ముందు తరం కథా సాహిత్యంలో రైతు జీవితం ఏమేరకు చిత్రితమయ్యింది ?
నిజానికి కథా సాహిత్యంలోకి రైతు ప్రధాన పాత్రగా ప్రవేశించింది మా తరం కధకులు కథా సాహిత్యంలోకి వచ్చిన తర్వాతే అనిపిస్తుంది. గురజాడ, ఆచంట
సాంఖ్యాయన శర్మ కథలు రాస్తున్న కాలం.. రైతులు ఎన్నో పోరాటాలు చేస్తున్న కాలం. నానా హింసలు పడుతున్న కాలం. అయినా గానీ ఏ కారణం గానో ( బహుశా
సంస్కరణోద్యమ ప్రభావం కావొచ్చు ) రైతు జీవితం కథల్లోకి రాలేదు. అయితే రైతు గురించిన ప్రసక్తి కా.రా మాస్టారు కథ ‘కీర్తి కాముడు’ 1949లో ఉంది.
రైతులు పితృ పితామహార్జితమైన ఆస్తిని దానధర్మాలనీ, పరువు ప్రతిష్టలనీ, పంతాలు పట్టింపులనీ, పౌరుషాలకు పోయి.. హారతి కర్పూరంలా హరాయింప చేసినట్టు
చెప్తారు. 1951 లో అవసరాల సూర్యారావు రాసిన ‘ఊరేగింపు’ కథలో జమిందార్లు వేసే పన్నులు కట్టలేక వారి వేధింపులు తట్టుకోలేక.. రైతులు తిరుగుబాటు
చేసిన వైనాన్ని చిత్రిస్తారు. నాకు తెలిసి ఇవి తప్ప రైతును గురించిన చిత్రణ ఉత్తరాంధ్రా కథా సాహిత్యంలో కనిపించదు. మళ్లీ కా.రా, భూషణం, శ్రీపతి కథల్లో ఉద్యమ చిత్రణ జరిగింది గానీ, రైతు ప్రధాన పాత్ర గాదు. వీరి కథల్లో పాలేర్లపై నాయుళ్ల పెత్తనం ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తరువాత మా తరం సాహిత్యరంగంలోకి ప్రవేశించాక మరీ ముఖ్యంగా రైతు కుటుంబాల్లోంచి వచ్చాక.. రైతు జీవితం చిత్రించబడిందని నేననుకుంటాను.
ఇక్కడొకటి గమనించాలి.. రైతు అనగానే అతడొక భూస్వామిలాగ భావిస్తే పొరపాటు. ఏడాదంతా కష్టపడినా.. నేలబుగ్గినెత్తుకున్నా.. అప్పుల ఊబిలోనే కూరుకుపోయే అతి చిన్న, సన్నకారు రైతులూ వున్నారు. వారే మా కథల్లో ప్రధాన పాత్రధారులు. నేను మాట్లాడేది ఆ రైతుల గురించే.
7. మీ కథల్లో ‘నోష్టాల్జియా’ గురించి మాట్లాడుతున్నారని ఒక విమర్శ ఉంది. మీరేమంటారు ?
   ‘నోష్టాల్జియా’ అంటే గతమంతా వైభవంగా ఉందని.. ఆ వైభవం ఇప్పుడు లేదనీ నేనంటున్నట్టా ? నా కథల్లో ఏ రైతూ ఎప్పుడూ సుఖంగా ఉన్నట్టు గానీ, భోగ
భాగ్యాలు అనుభవిస్తున్నట్టు గానీ రాసానా ? నా కథల్లోని రైతులు పండిన పంట అప్పులూ, పాయిదాలూ తీర్చడానికీ.. కళ్లం గట్టునే అన్నీ కొలిచి ఇంకా తీరని
అప్పులతో, ఖాళీ చేతుల్తో మిగిలిపోయిన వాళ్లే. ఆ జీవితమే బాగుందనీ, అలాగే ఉండిపోవాలనీ నా కథలు చెప్తున్నాయా ? అలా అన్న వాళ్లు నా కథలు
చదివారనుకోవాలా ?
8. ‘నాగలి’ దీర్ఘకావ్యం రాసారు కదా.. యంత్రానికి మీరు వ్యతిరేకమా ?
వ్యతిరేకమని ఎందుకనుకుంటారు ? నాగలి రైతుకు దొరికినంత సులువుగా, సౌకర్యంగా ట్రాక్టరు కూడా అందుబాటులోకొస్తే ఎవరు కాదంటారు ? ట్రాక్టరుని
నమ్మి నాగళ్లని దూరం చేసుకున్నాక ట్రాక్టరు యజమాని కాళ్ల దగ్గర పడిగాపులు పడే రైతుల దుస్థితి చూస్తే అర్ధమవుతుంది… దిగువ మధ్యతరగతి రైతు వేదన.
9. ” మార్క్సీయ భావజాలంతో జీవితాన్ని ఎంత వాస్తవికంగా అర్ధం చేసుకోవచ్చునో మీ కథలు రుజువు చేస్తున్నాయని” వొకరు, ”మార్క్సీయ భావజాలమే’ అంటే నమ్మశక్యం కాదనీ” మరొకరూ అన్నారు. మీరేమంటారు ?
ఎవరు ఏమనడానికైనా కథకుడి కంటే కథే ప్రధానం. అటువంటప్పుడు మార్క్సీయ భావజాలం ఒకరికి కనిపించి, మరొకరికి కనిపించకపోవడానికి కారణమేమైయుంటుంది ?
కథంతా వదిలేసి.. మధ్యలో ఏదో వొక వాక్యాన్ని పట్టుకుని, అదీ సరిగా అర్ధం చేసుకోకుండా భావజాలాన్ని నిర్ణయించడం సరైంది కాదని నా అభిప్రా

10. పాట, కవిత, కథ రాశారు. నవల?
నవల రాయాలని బలమైన కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వలన, ఆరోగ్య కారణాల వలన అనుకున్న పని చెయ్యలేకపోతున్నాను. అదీకాక కథ రాయడానికే నేను చాలా సమయాన్ని తీసుకుంటాను. నవల అంటే మరి ఎక్కువ సమయం
పడుతుంది. కానీ రాస్తాను.

11. ఇప్పటి ఉత్తరాంధ్రా కథాసాహిత్యాన్ని మీరెలా నిర్వచిస్తారు?
వర్తమాన కథ అస్తిత్వ మూలాన్ని అన్వే స్తుంది. ఈ విషయాన్ని అట్టాడ అప్పలనాయుడు కథ ‘షా’ బలంగా మాట్లాడింది. క్షతగాత్రగానం, శిలకోల, వరద ఘోష మరికొన్ని. ఇక్కడి కథా రచయితలు ఈ నేలకే ప్రత్యేకమైన కథలు రాస్తున్నారు. స్థానీయత వుంటేనే సార్వజనీనత వుంటుందని నిరూపిస్తున్నారు.

12. రేపటి ఉత్తరాంధ్రా కథ ఎలా ఉండాలనుకుంటున్నారు?
సాగరతీర గంగ పుత్రుల కథలు రాలేదు. మందస జీడితోటల కథలు రావాలి. స్త్రీ, దళితవాద కథలు యిక్కడ రావాల్సినంతంగా రాలేదు. కాబట్టి ఈ అన్ని మూలాల నుంచి కథలు రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడయినా, ఏ కాలంలోనైనా కథ వొక సామాజిక
అవసరం. సామాజిక ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది.

13. సమాజపు అన్ని మూలాల నుంచి ఆయా కథలు రాకపోవడానికి కారణమేమంటారు?
ఒకటి కళింగాంధ్రాలో దళిత, స్త్రీవాద కథకులు లేరు. దళితుల నుంచి కథకులు రావాలి. ఎవరి జీవిత అనుభవాల్లోంచి, వాళ్ల వాళ్ల అనుభవసారాన్నుంచి వచ్చేవే అసలైన కథలు అవుతాయని నా నమ్మకం. నేను రాసిన ‘నాణెం కింద చీమ’ దళిత సానుభూతి కథ – కానీ స్వీయానుభవం నుంచి వచ్చిన కథైతే బలంగా వస్తువును ప్రకటిస్తుంది.

14. తెలంగాణాను, ఉత్తరాంధ్రాను సామాజికగా, సాంస్కృతికంగా ఎలా ముడికడతారు?
ముడి పెట్టడం కాదు గానీ అక్కడ జరిగిన ఉద్యమాన్ని యిక్కడ సాహిత్యం ప్రభావితం చేసింది. భూషణం కొండగాలిలో అదే చెప్పారు.
సంస్కృతి విషయానికొస్తే ఎవరి సంస్కృతి వాళ్లదే. ఆయా సంస్కృతుల నుంచి గొప్ప కథలు వచ్చాయి. ఉద్యమ సంబంధమైన కథలొచ్చాయి. కాబట్టే ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని యిక్కడి సాహిత్యకారులు సమర్ధించారు.

15. ఈనాటి సామాజిక నిర్మాణంలో ఉత్తరాంధ్రా కథాసాహిత్యం ఏ మేరకు తన పాత్రని నిర్వహించాలి?
ఏ ప్రాంత సాహిత్యానికయినా సామాజిక పరిణామంలో గొప్ప పాత్ర వుంటుంది. ఉత్తరాంధ్రాకే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయా ప్రాంతాల
నిర్ధిష్టతల్లోంచి.. సాహిత్యం సామాజిక వికాసానికి దోహదపడుతుంది.

16. ఉత్తరాంధ్రా కథా రచయితలు కథానిర్మాణంలో కొన్ని కొత్త పోకడలు పోయినా మరీ వినూత్న పోకడలు పోకపోవడానికి కారణమేమిటి ? పోవాల్సిన అవసరం ఉందా ?
ఇక్కడి రచయితలకు ముఖ్యంగా జీవితం, జీవితంలో వ్యధ ముఖ్యం. ప్రయోగం కన్నా ప్రయోజనం ముఖ్యం అని నమ్మడం ఒక కారణమైతే, ఆంగ్ల సాహిత్యంతో అంత ఎక్కువగా సంబంధం లేకపోవడం కూడా కారణమే. రాయలసీమ నుంచి తెలంగాణా నుంచి సీరియస్ గా సాహిత్యాన్ని సృష్టిస్తున్న రచయితలకూ ఇదే వర్తిస్తుందనుకుంటాను. ప్రయోగాలు ప్రతిభని చెప్పడానికే తప్ప చెప్పాల్సిన విధంగా జీవితాన్ని చెప్పవని నేను అనుకుంటున్నాను. అయితే ఏ ప్రయోగాలైనా కథా గమనానికే దోహదపడాలి గానీ ఆటంకం కాకూడదు. స్వానుభవ గ్రామీణ నేపథ్యంలోంచి వచ్చిన ప్రయోగాలు మన సాహిత్యంలో వున్నాయనీ నేను నమ్ముతున్నాను.

17. మేజిక్ రియలిజం గురించి మీ అభిప్రాయం చెప్పండి?
భారతీయ ప్రాచీన సాహిత్యంలో మ్యాజిక్ రియలిజం ఉంది. ఇది మన సాహిత్యంలోకి కొత్తగా వచ్చింది కాదని నా అభిప్రాయం.

18. ఉత్తమ సాహిత్యానికి నిర్వచనం ఇవ్వండి?
ఒకేసారి – ఒక అర్థాన్నిస్తూ, అనేక అర్థాలను స్ఫురింపజేయాలి.

19. ఉత్తరాంధ్రా యువరచయితల గురించి రెండు విషయాలు చెప్పండి?
వర్తమాన సమస్యల మీద స్పందన, వ్యక్తీకరణ బాగుంది. కానీ సాహిత్య సృజన వొక దగ్గరే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి కారణం – ప్రధానంగా అధ్యయన లోపం . పూర్వ రచయితల సాహిత్యం విశృంకలంగా చదవాలి. కవిత్వం రాసేవాళ్లు – కారా, చాసో లాంటి కథకుల కథలని చదవటలేదు – సాహిత్యం మొత్తాన్ని చదవాలి. గొప్ప కవులు, గొప్ప కథకులు అనదగినవారు సాహిత్యప్రక్రియలన్నీ చెయ్యకపోయినా, చదివారు. అదే దోవలో యువరచయితలూ వెళ్లాలి. సాహిత్యతరాలలో ఖాళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వుంది –
ప్రతీ తరానికి. ఇక్కడి రచయితలంతా సార్వజనీనమైన మానవ జీవన వికాసాన్ని చెప్పే ప్రయత్నంలో యింకా చాలా చెయ్యాల్సి ఉంది.

20. ఇప్పుడు తక్షణం ఉత్తరాంధ్రా సామాజిక సాంస్కృతిక నిర్మాణం కోసం.. ఏం చేస్తే బాగుంటుంది?
సంస్కృతిని నిలబెట్టడానికి, సామాజిక పునర్వికాసానికి కవులు, కథకులు వొకే వేదిక మీదకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ వొక వేదిక మీద నుంచే వొకే గొంతుకగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అప్పుడు జరిగే చర్చ – సమాజానికి ఎక్కువ లభ్యతని చేకూర్చుతుంది.

21. విమర్శని మీరెలా తీసుకుంటారు?
నిర్మాణాత్మక విమర్శ ఎప్పుడూ ఉండాలి. రచయతకి విమర్శ సహాయకారి అవ్వాలి – దారి దీపం కావాలి అంతేగానీ ప్రత్యేకంగా పనికట్టుకొని వ్యంగ్యం విమర్శలోకొస్తే విమర్శకుడు కథకుని మీద ఆధిక్యతని ప్రదర్శించినట్టే. విమర్శకుడు స్నేహితుడిలా ఉండాలి. వైరిపక్షం కాకూడదు. జ్ఞానంతో పాటూ విమర్శకునికి సంయమనం ఉండాలి. అనుకోకుండా దుర్విమర్శ  రచయిత మీద చెడు ప్రభావాన్ని చూపిస్తే అది సాహిత్యలోకానికి చాలా నష్టమవుతుంది.

22. నేటి పత్రికలలో ఉత్తరాంధ్ర కథకి ప్రోత్సాహం ఎలా వుందనుకుంటున్నారు?
కొన్ని పత్రికలు – పేజీలు యిన్ని రాయాలి అని ; మాండలికం వుండకూడదు అని పెట్టే కొన్ని నిబంధనలు – నిరుత్సాహకరంగా కనిపిస్తున్నాయి.

23. ఉత్తరాంధ్రా ప్రాంతం నుంచి కొత్తగా వస్తున్న ప్రచురణ సంస్థల (ఉదాహరణకు – ‘సిక్కోలు బుక్ ట్రస్ట్’ ) గురించి మీ అభిప్రాయం?
ప్రచురణ సంస్థలు అవసరమే. ఉండాలి. ఎన్ని వుంటే అంత మంచింది. ఉత్తరాంధ్రా గొంతును బలంగా ప్రకటించడానికి పత్రికల అవసరమూ ఉంది.

ఇదీ గంటేడ గౌరునాయుడు మాస్టారు అంతరంగం. సాహిత్యం – మనిషి వొక్కటైనప్పుడు అంతరంగం సువిశాలమౌతుంది. గౌరునాయుడు మాస్టారు అంటే నాగావళి అలల ఘోష . ఆయన కథల నిండా ఉత్తరాంధ్రా. ఉత్తరాంధ్రా అంటే దానివైన కొన్ని ప్రత్యేక లక్షణాలు వున్నా ఈ ప్రపంచంలో ఎక్కడయినా వుండే వొక ప్రాంతం మాత్రమే. కథలు – అమ్మమ్మ చెప్పేవైనా, యిప్పుడు ముద్రణలోకి వచ్చినవైనా కథల్లో వొక జీవనాడి వుంటుంది. ఉత్తరాంధ్రా జీవనాడిని వ్యక్తం చేసినవే ఉత్తరాంధ్ర కథలు. మా గౌరునాయుడు మాస్టారు కథలు.

మీ మాటలు

  1. kcube varma says:

    గౌర్నాయుడు మాస్టారి అంతరంగాన్ని బాగానే ఆవిష్కరించారు మౌళి. మాస్టారు ఆశించినట్లుగా ఈ ప్రాంత గొంతు మరింత బలంగా ఐక్యంగా వినిపించాల్సిన అవసరమెంతైనా వుంది.

  2. నేను చాలా రోజుల క్రితం ‘ఏటి పాట’ కథా సంకలనం చదివాను , విజయనగరం శ్రీకాకుళం పల్లె జీవితాలు కళ్ళకికట్టినట్టు కనిపిస్తాయి. తెలంగాణ, రాయలసీమ ప్రాంతం వాళ్ళకి మొదటి రెండు మూడు కథల వరకూ ఉత్తరాంధ్ర యాస అర్ధం చేసుకోడానికి కాస్త ఓపిగ్గా చదివితే పుస్తకం పూర్తయ్యేవరకు వదలబుద్ధి కాదు.

  3. srinivasarao says:

    మౌళి బావుని బాగా ఇంటర్వ్యూ చేసావు

  4. jagadeesh mallipuram says:

    బాల సుధాకర్ మౌళీ … ఇంటర్వు బాగుంది . ఉత్తరాంధ్ర సాహిత్య అవసరం ఏమిటో మాష్టారు తెలియ చెప్పారు. నిజమే … అన్ని గొంతుకలు ఒకే వేదిక మీదకు రావాల్సిన అవసరం ఎంతైన వుంది. కవి గా, కధకుడిగా , గాయకుడిగా , పాటల రచయిత గా … అన్ని సాహిత్య ప్రక్రియలకి మార్గ దర్శకునిగా నిలిచిన మాష్టారి అంతరంగం బాగా ఆవిష్కృత మైంది. అభినందనలు .” సారంగ” కు ధన్య వాదాలు.

  5. రెడ్డి రామకృష్ణ says:

    గౌరునాయుడుగారి కథలు ఏమి మాట్లాడతాయో ,గౌరు నాయుడుగారు కూడా అదే మాట్లాడారు. బాగుంది.మౌళి మీ సాహసాన్ని అభినందిస్తున్నాను.కానీ కొన్ని ఖాళీలు ఉండిపోయాయి.

    ప్రస్తుత వాతావరణంలో ‘అల్పపీడనం’ తొందరగావస్తే బాగుంటుంది.

  6. Dr.Vijaya Babu,Koganti says:

    MauLi గారు ఒక రచయితను పలుకోణాల్లో ఆవిష్కరించగల మంచి ఇంటర్వ్యూ.
    అభినందనలు.

  7. balasudhakar says:

    1. ఉత్తరాంధ్రా కథ గురించి మాట్లాడిన అందరికీ ధన్యవాదాలు. మల్లిపురం అన్నకి ధన్యవాదాలు. ఇంటర్వ్యూ చెయ్యడం సాహసం అని అనుకోవట్లేదు.. ఒక ప్రజా రచయిత అంతరంగ ఆవిష్కరణను సాహసం అనుకోవట్లేదు. గౌరునాయుడు మాస్టారి కథలాగే మాటా సరళం. ఆయన కథలు నాకు కవిత్వంలో ప్రేరణనిచ్చాయి.
    2.ఖాళీలు ఎప్పుడూ వుంటూనే వుంటాయి.. మళ్లీ మళ్లీ పూరించుకోవాలి.

  8. balasudhakar says:

    కథా, కథా రచయిత రెండూ వొక్కటే. నిజమైన కథకుడి ప్రతిరూపమే అతని కథ.

  9. balasudhakarmouli says:

    1. ఉత్తరాంధ్రా కథ మీద మాట్లాడిన అందరికీ ధన్యవాదాలు. మల్లిపురం అన్నకి ధన్యవాదాలు.
    2. గౌరునాయుడు మాస్టారి కథలాగే.. మాటా సరళం. నేను సాహసం అని అనుకోవట్లేదు. ఇంకా సాహసానికి చాలా అర్ధాలుండొచ్చు. నాకు అవన్నీ తెలియవు. ఖాళీలు ఎప్పుడూ వుంటాయి. మళ్లీ మళ్లీ పూరించాలి.

  10. రెడ్డి రామకృష్ణ says:

    మౌళి గారూ!
    ఏ వ్యక్తైనామరో వ్యక్తి అంతరంగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడుగానీ ఆవిశ్కరించలేడు.నిజానికి ఏవ్యక్తి కూడా తనని తానూ (పూర్తిగా) ఆవిష్కరించు కోలేడు.రచయితలుఅయితే అది మరీను. మొదట్లో మీరన్న “సూక్ష్మంగా ఆయన అంతరంగ అన్వేషణ.” అన్నమాట సరైనది.యిక్కడికొచ్చీసరికి ‘ఆవిష్కరణ ‘అయిపొయింది.

    ఇక ‘సాహసం’గురించి…మీరొక పాఠకుడిగా ఒకరచయితను తెలుసుకున్నారు.ఐతె ఆ రచయిత కథలు రాసే నాటి కాలానికి సంబంధించి,ఆనాటి సాంఘిక ఆర్ధిక రాజకీయ పరిస్థితులు(మెత్తంగా నాటి సమాజ స్వరూపం)మీకు తెలియవు.తెలిసే అవకాశం లేదు.ఇంచు మించు సమవయస్కులైతే తప్ప.ఎందుకంటే గౌరునాయుడు గారు రచనారంగము వైపు ఆశక్తి కనపరిచినప్పటికి బహుశా మీరు పుట్టి వుండకపోవచ్చు.

    ఏవ్యక్తైనా రచయితైనా ప్రశ్నను బట్టే జవాబు చెప్తాడు.ఎక్కడపుట్టేరు ?ఎప్పుడు పుట్టెరు లాంటి రొటీన్ ప్రశ్నలకు రొటీన్ సమాధానలే వస్తాయి. అంతకు మించి ఆరచయితనుంచి ఎంత ఎక్కువ ఆశిస్తే మన ప్రశ్నలు అంత ఎక్కువస్థాయిలో వుండాలి.దానికి ఆరచయితను క్షున్నంగా చదివినవారు,సాహిత్యాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించివారైతే ఎక్కువ లాభం ఉంటుందన్నది నా అభిప్రాయం. మీ వయస్సు దృష్ట్యా అది సాహసమే.

    “ఖాళీలు ఎప్పుడూ వుంటూనే వుంటాయి.. మళ్లీ మళ్లీ పూరించుకోవాలి”అంటున్నారు మీరు. ఎలా? ఎప్పుడూ వుంటే మళ్ళీ మళ్ళీ వుంటూనే వుంటాయిగా.క్రమేపు తగ్గించుకుంటూ వెళ్లాలి.ఎప్పుడూ వుంటాయి అనుకుంటే చేసే పని వృధా అవుతుంది.

    చివరగా ఒకమాట.యిది నేను సాహసించి అంటున్నాను.చాలమందికి కోపం రావచ్చు.అయినప్పటికీ అనక తప్పటం లేదు.

    ఇటీవల చాలా మందికి ‘ఉత్తరాంధ్రా’ వ్యాధి సోకింది. నిన్నటి ఉత్తరాంధ్ర రేపటి ఉత్తరాంధ్ర.ఏమిటిదంతా…. ‘ప్రజారచయితకు ‘ ప్రాంతము,దేశమూ,అనే సరిహద్దులుంటాయా…..గౌరునాయుడుగారిని ఉత్తరాంధ్రాకే పరిమితం చేయదలచుకున్నారా!

  11. balasudhakarmouli says:

    ఏ చిన్న ప్రయత్నమైనా అది ఆవిష్కరణే.. అని నేనైతే అంటాను. అన్వేషణలోనే జరిగే ఆవిష్కరణ మూలాలుంటాయి. కాబట్టి ఆవిష్కరణ అన్వేషణ మూలం మీద నిలబడుతుంది. కథలు చదవడం – చదివి అనుభవిస్తాను కానీ నేనా కాలంలో బతకలేదు నిజమే. నాటి సాంఘిక ఆర్ధిక పరిస్థితి ఈ తరానికి తెలియడానికి.. కళ వొక మాధ్యమంగా మాత్రం వుంది. కానీ ఈ కథ నేటి కథ కూడా.
    ఎక్కడ పుట్టారు ? ఎప్పుడు పుట్టారు ? లాంటి ప్రశ్నలు అందరు కోసం కాదు. సాహిత్యంలో చేసే ఏ పనీ వృధా కాదు అని నమ్మకం.
    ఉత్తరాంధ్రా అని అనడం ఈ ప్రాంతంలోనే వుండడం మూలాన అన్నదే. అదే స్ప్రుహతో నేనడం జరిగింది. ప్రస్తుత వాతావరణంలో ఎవరైనా అలానే అంటారని నా అభిప్రాయం. ఉత్తరాంధ్రా లేదా రాయలసీమ లేదా తెలంగాణా ఈ భూమ్మీద ఎక్కడయినా వుండే ప్రాంతాలు మాత్రమే. మన ప్రాంతాల లక్షణాలు మనుసులుండే ఎక్కడయినా వుండొచ్చు – అదే స్ప్రుహ.
    మాటలు ఆలోచనను మెరుగుపరుస్తాయని రుజువౌతుంది నాకు.

  12. పాయల says:

    మౌళీ మంచి ప్రయత్నం. మాస్టారిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా బహుముఖీన పని చేస్తూ సాహిత్యం పట్ల నీకున్న నిబద్ధత. నిరుపించుకుంటున్నావ్

  13. రామకృష్ణ బావు !! బాగా రాసినావు…నాకు తెలీక అడుగు తున్నాను . ..చింతా దీక్షితులు కథల గురించి మాట్లాదాలంటే అతనంత వయసున్దాలన్నమాట .చింత అప్పలనాయుడు మాట్లాడ్కూదదన్నమాట . బాగుందిబావ్ ..నిన్నటి కథలగురించి ఇప్పుడోలు మాట్లాద కూడదన్న మాట .. సరే అలాగే . ఇలగని తెలీక సాగరం బావు యజ్ఞం మీద వ్యాసం రాసీసుంతాడు.

  14. రెడ్డి రామకృష్ణ says:

    బాబూ చింతోలబొట్టిడా!

    యజ్ణం కధ చర్చ(సాగర్ దాక ఎందుకు) సందర్భంలో రెడ్డి ఆదిత్య యిదే ప్రశ్న రామతీర్ధగారిని అడిగీనట్టు నేను చదివినట్టు జ్ఞాపకం.
    రామాయణాన్ని పరిచయం చేయాలన్నా లేదా విమర్శించాలన్నా రామాయణ కాలములో పుట్టనక్కరలేదు.కానీ రామాయణం గురించి క్షున్నంగా తెలుసుకొనివుండాలి.అదే సందర్భములో ఆకాలము నాటిసమాజ స్వరూపము,చెల్లుబడైన నీతి,నాటిప్రజల జీవనవిధానము,తిరుగుబాటు తత్వము మొదలైన అనేకవిషయాల పట్ల అవగాహన వుండి శాస్త్రీయమైన ఆలోచనతో చేస్తే అది సమగ్రంగావుంటుంది.

    విషయముపట్ల మనకున్న అనుభవము ఆవిషయాన్ని మరింత ఉద్దీపింపజేస్తుందనే అభిప్రాయంతప్ప చేయకూడదనిగాని చేయవద్దనిగాని ఎవరూ అనరు.ఒకవేళ అలా అంటే అది ఆవ్యక్తి మేలుకోరినవారే తప్ప మరొకరై వుండరని మీలాంటి అనుభవజ్ఞులు గ్రహించగలుగుతారు.

    యిక్కడ నేనన్నది కూడా అదే.పిల్లలవిషయములో మనకోసామెతుంది.పెద్దకుండలకి ఎసరు పెట్టొద్దు, అని అంటే పెద్దకుండ ఎత్తగలిగినవయసొచ్చినపుడు ఎసరు పెట్టొచ్చు,కుండ ఎత్తావచ్చు,దించావచ్చు లేకపోతే కాలు కాలిపోతాయి సుమా అనే హెచ్చరకె అందులో ఉంటుంది. లేదు… నేను పుట్టుకతోనే నలున్ని భీమున్ని అనుకుంటే నాకేమీ అభ్యంతరములేదు.

    నాకామెంట్లను మరొక్కసారి చదవమని మాత్రం మనవి చేయగలను…అనుభవసాలురు గనక ఇంటర్వూ చేస్తే మరికొన్ని మంచి ప్రశ్నలు వస్తే మరికొన్ని మంచి జవాబులు వస్తాయని,అది ఆరచయితకు పాఠకులకూ కూడామేలు చేస్తుందనే నా అభిప్రాయము.
    (యిక్కడ వున్న 23 ప్రశ్నలులో 9 ప్రశ్నలు ఉత్తరాంధ్ర గురించేవున్నాయి.గౌరునాయుడుగారు మొత్తం తెలుగు సాహిత్యానికి చెందినవారా లేక ఉత్తరాంధ్రకే పరిమితమైనవారా,అని చిన్నసందేహమొచ్చింది).

    అనుభవజ్ణుడైన వ్యక్తే అయితే మొత్తం తెలుగు కధ ను గురించి ,వస్తువులోనూ శిల్పములోనూ అది ఏఏ దశాబ్దాలలో ఎలాంటి ప్రగతిని సాధించింది లేకపోతే ఎందుకు వెనకబడింది మొదలైన అనేక విశేషాలగురించిన,ప్రశ్నలు వచ్చేవి వాటికి సమాధానాలు వచ్చేవి అవి పాఠకులకు ఉపయోగకరంగా వుండేవి

    యింతకు మించి నేనేమి మాట్లాడ దలచుకోలేదు.మాట్లాడను.యింకా మాట్లాడితే బహుసా కామెంత్ల సంఖ్య పెరుగుతుంది తప్ప, ప్రయోజనము లేదన్నది స్పష్టం.
    కనుక సెలవ్

  15. లక్ష్మణరావు says:

    మౌళీ గారు. ప్రయత్నం బాగుంది. ఒక జర్నలిస్టుగా మీ ప్రయత్నానికి అభినందనలు. గౌరనాయుడు బావుని ఇంటర్వ్యూ చేయడం సాహసంగా భావించనక్కర్లేదు. ఒక్క బావునే కాదు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలని అనుకోవడం, ఆ దిశగా అడుగులు వేయడం మంచి ప్రయత్నం. భవిష్యత్ లో కూడా ఈ ప్రక్రియను కొనసాగించండి. ఇది మీతో పాటు మాకు కూడా ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూ ని ఇంటర్వ్యూలా చేయకుండా సహజ సంభాషణ ద్వారా అసలు విషయాల్లోకి తీసుకునివెళ్లేందుకు చేసేందుకు మీరు ప్రయత్నించారన్నది ఈ ఇంటర్వ్యూ చదివిన తరువాత అర్ధమయ్యింది. ఇదే సరైన విధానం కూడా. మా సీనియర్లు మాకు చెప్పిన విషయం కూడా. అయితే, ఓ జర్నలిస్లుగా నా అనుభవంలోంచి, మా సీనియర్ల వద్ద నేర్చుకున్న విషయాల్లోంచి ఓ సూచన. ఎప్పుడైనా ఒక రచయతను ఇంటర్వ్యూ చేసేటప్పుడు హోం వర్కు చేయడం అవసరం. భవిష్యత్ లో చేసే ఇటువంటి ప్రయత్నానికి ఏ రచయతనైతే మనం ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటామో, ఖచ్చితంగా ఆ సాహిత్య పరామర్శ కొనసాగాలి. ఆ కథల్లోంచి విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మంచి ఇంటర్వ్యూని చేసిన వారవుతారు. అది పదికాలాలపాటు నిలుస్తుంది. మీరు ఇంటర్వ్యూ చేసే వారి వ్యక్తిత్వం, హాబీలు, ప్రేరణలు, ప్రోత్సహకాలు, కథా సారాంశాలు, పాత్రల చిత్రణలో ఒడుపులు వంటి విషయాలు తెలుసుకుని తగిన సమయంలో వేరేవాళ్లు ఎవరైనా మంచి వ్యాసం రాయడానికి ప్రేరణగా, వస్తువుగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇలాంటి ప్రయత్నాన్ని మరింత లోతుగా, మరింత పదునుగా, కొత్తవాళ్లకి నిఘంటవుగా, కొత్త చూపుగా ఉండేటట్లు, ఆ దశగా మీ ఇంటర్వ్యూని కొనసాగించాలని మనసారా కోరుతున్నారు. ఈ ప్రయత్నాన్ని ఇక్కడకే పరిమితం చేయవద్దని సూచిస్తున్నాను.

    ఇక, మీరు రామక్రిష్ణ గారికి బదులిస్తూ రాసిన విషయంలో కొంత లోపం ఉన్నట్లు భావిస్తున్నాను. ప్రాంతమంటే కొన్నింటి సముదాయమే తప్పా స్వయంభూవి కాదన్నది నా ఆలోచన. సముదాయకమైన ఆలోచనలను మరింత విశాలత దిశగా కొనసాగించాలి తప్పా తన ఉన్న స్థానం మరింతగా కిందకి, మరి కిందకి జారిపోకూడదు. అది వ్యక్తి స్థాయి ఆలోచనా స్థాయికి చేర్చుతుంది. కాబట్టి ఈ విషయంలో ఒక సారి పరిశీలించగలరు.

    రామక్రిష్ణ గారికి ఓ మాట. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వయస్సుతో పనిలేదు. చేసిన వ్యక్తి తాను ఇంటర్వ్యూ కోసం నిర్ధేశించుకున్న ఎజెండా ప్రకారం చేయవచ్చు. అదే అంతిమమని అని అనుకుంటే తప్పుపట్టవచ్చు. ఇంటర్వ్యూని ఉన్నంత లో సమగ్రంగా చేయాలని భావించినప్పుడు ఖచ్చితంగా కాలాన్ని, ఆ కాలంలో వచ్చిన మార్పులను, ఆ మార్పులకి తగిన ప్రాధాన్యత సదరు రచయత ఇచ్చారా లేదా అన్న అంశాలు చర్చకు వస్తాయి. ఈ ఇంటర్వ్యూ కేవలం సహజ సంభాషణగానే, అదే సమయంలో కొంత మేర కొత్తగా పరిచయం చేయాలనుకునే ప్రయత్నంగానే చూడాలని నేను అనుకుంటున్నాను.

  16. balasudhakarmouli says:

    సాహిత్యకారుల సాహిత్యంతో మరింతగా మమేకం కావాలని.. వాళ్ల నుంచి ప్రత్యక్షంగా వీలైనంత వినాలని.. దాని వలన తెలుసుకోవాల్సిన లోతులు యింకా తెలుస్తాయని.. వొక కాంక్షతో ‘ ఒక రాత్రి రెండు స్వప్నాలు, ఏటిపాట, తతిమా కవిత్వం ‘ – వొక సాహిత్యకారుని ఆత్మ ఏదైతే వుందో దాన్ని అందుకుంటున్నాననే భావనతో ఇంటర్వ్యూ ( అసంపూర్ణం ) చేసిన తర్వాత.. చాలా మంది ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం ( ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు ) నుంచి ప్రతిస్పందించారు. ధన్యవాదాలు.
    అయితే నాదొక విన్నపం : సారంగలో వచ్చిన మిగిలిన ఇంటర్వ్యూలను, వ్యాసాలను, కవితలను, కథలను కూడా చదివి.. స్పందించొచ్చు కదా ! మరింత ఉపయోగకరంగా వుంటుంది. ( విజయనగరం, విశాఖపట్నం – ఈ రెండు జిల్లాల నుంచి వచ్చిన వాటికి మాత్రమే మీరు స్పందిస్తున్నారు )
    మరొక మాట ( చాలా మంది మాటే అనుకుంటున్నాను ) : విమర్శకుల కొరత వుంది ( ఆంధ్రప్రదేశ్ లో ) – తెలుగు భాషలో కవులు, కథకులు వున్నంత ఎక్కువగా విమర్శకులు లేరు ( … అని చాలా చోట్ల చదివితే నాకు తెలిసింది ) . మీ విలువైన విమర్శలతో నాలాంటి పిల్లలకు మీలాంటి పెద్దలు నిజమైన దారిదీపాలవుతారని కోరుకుంటున్నాను. ( ఎవరైనా సరే. )
    ఇంకో విషయం గౌరునాయుడు మాస్టారి కథల మీద యిక్కడ చర్చ చేసి ఇంటర్వ్యూని సంపూర్ణం చేయొచ్చు కదా ! ఖాళీలను పూరించొచ్చు కదా ! అదేమి ఆలోచించటలేదు. ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇంటర్వ్యూలోని లోపాన్ని సరిదిద్దొచ్చు కదా ! తప్పనిసరిగా మీరీ పని చెయ్యాలి. కాదు అనకండి. కచ్చితంగా మీ మీద యిప్పుడు ఆ బాధ్యత వుంది. అవకాశం లేకపోతే అనొచ్చు. అవకాశం యిక్కడ వుంది. ( వెబ్ మ్యాగజైన్ లో ఎంత చర్చకైనా స్పేష్ వుంటుంది. ) మీ దగ్గర నుంచి విషయం తెలుసుకోవాలని నా ఆశ. రిక్వెస్ట్ చేస్తున్నాను.
    నాకు బాగా తెలుసుకోవాలని వుంది. అంతేకాక చాలా మందికి ఉపయోగపడుతుంది కదండీ.
    పరిశీలించగలరు.

    సార్ ! రామక్రిష్ణ గారూ… ఇంతకీ మీరు ఈ ఇంటర్వ్యూ మీద… ( చివరికొచ్చీసరికి.. ) నాకు సలహాలు ఇచ్చారా ! హెచ్చరిక చేశారా ! అర్ధం కావట్లేదు.
    ( హెచ్చరిక అయితే.. సలహా కన్నా నా ఆలోచనని మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుంది. అంతే.. )

    లక్ష్మణ రావు గారూ ! ధన్యవాదాలు.. మీరిచ్చిన సూచనలూ, సలహాలు స్వీకరిస్తున్నాను. నాకు చాలా ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. కానీ ప్రాంతం గురించి మీరనుకుంటున్న అర్ధంలో నేను అనలేదు. అది మీ ఆలోచన అనే చెప్పారు. కథలని చర్చలోకి తెస్తారని ఆకాంక్షస్తున్నాను. పరిశీలించగలరు.
    *
    ( వీలైతే.. నా కామెంట్స్ ని మరొక్కసారి చదవమని మనవి ( నిమ్మళంగా ). ప్రత్యేకంగా ఎవరో అని కాదు. ఎవరైనా. )

  17. Garimella Nageswararao says:

    ఇంటర్వ్యు బాగుంది ..ఒక్క సారే అన్ని విషయాలనూ కవర్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.అనంతమైన అంతరంగంలో అందినంత పట్టుకొని అందించిన తీరు బాగుంది ..అభినందనలు.

  18. balasudhakarmouli says:

    గౌరునాయుడు మాస్టారి కథల పాత్రలు, నేను :
    ( సంపూర్ణం కాదు )

    గౌరునాయుడు మాస్టారి కథల్లో పాత్రలతో నా అనుభవమిది.
    మాస్టారివి – 1997 లో ‘ఏటిపాట’, 2006 లో ‘ఒక రాత్రి.. రెండు స్వప్నాలు’ – కథాసంకలనాలు వచ్చాయి. ఈ కాలానికి సంబంధించిన కథలివి. ఈ కథల్లో అభివృద్ధి ముసుగులో ప్రజలు ఎంత అన్యాయానికి గురికాబడుతున్నారు – వాళ్ల దిగుళ్లు, దుఃఖాలు వ్యక్తం చేయబడ్డాయి. నాకు ఆ కథల ద్వారా కర్తవ్యం బోధపడింది. నేను బహుశా వల్లంపాటి – ‘ కథాశిల్పం’ లోనే చదివాననుకుంటున్నాను లేదా యింకెక్కడో – సామాజిక ప్రయోజనాన్ని ఆశించే కథ తన కర్తవ్యాన్ని కథలో చెప్పేయకూడదూ.. వొక స్పృహనిస్తే పాఠకుడే కథాగమ్యాన్ని అందుకుంటాడూ అని. సరిగ్గా మాస్టారి కథలు నాకు అలాగే అనిపించాయి. నిష్కల్మశంగా చెప్పారనిపించింది. ఏదైనా నమ్మకం ప్రధానం అని నమ్ముతున్నవాడిని నేను.
    1990 నుంచి నా వూరు నా కళ్ల ముందు మెదులుతుంది. నా జ్ఞాపకాలన్నీ చాలా మూలల నుంచి యింకా తడిగానే వున్నాయి. అవేవీ మరిచిపోను నేను. మా వూరి ప్రెసిడెంట్ ఆయన చేసిన అరాచక చర్యలు బహిరంగం. భూస్వామి. వూరిలో అధికార పెత్తనం చెలాయించారు. ప్రెసిడెంట్ తగువులు చెప్పినప్పుడు నేను పందిట్లోకి వెళ్లి ఆసక్తిగా చూసేవాడిని – నా ఈడోళ్లతో పాటూ. కొన్నిసార్లు చాలా నిరంకుశం అనిపించింది. ఆయనకి ఎదురుతిరిగేవారు లేరు. యిప్పటికీ ఆయన దర్పం పోలేదు. కాలువలకి వచ్చిన డబ్బులు దోచుకుని యిల్లు కట్టుకున్నారు. రోడ్డులకు వచ్చిన డబ్బులతో యింటికి అద్దాలు వేయించుకున్నారు. నెమ్మదిగా మార్పులు కళ్ల ముందు దొర్లాయి. డబ్బు పై స్థానాన్ని ఆక్రమించడం. డబ్బున్నోడికి విలువ యివ్వడం. ఆ కాలం మీదే ఈ కాలం నిలుచుంది కాబట్టి ఇప్పటి కాలంతో సంబధం వుండే ఈ కథలు ఇప్పుడు మనగలుగుతున్నాయి. పుస్తకాల రూపంలో ఆవిష్కరించబడ్డాయీ. ఆనాడు రైతు స్థితి ఈనాటి రైతు స్థితి కళ్ల ముందే కనిపిస్తుంది. రైతు ఎంత కుదేలయిపోయాడో కళ్ల ముందే చూశాను – ‘వూరి అనుభవాలు ఎవరికైనా యిలాగే వుంటాయి’. నాది రైతు కుటుంబం కాకపోయినా .. మాక్కాస్తా పొలం వుంది. తొలిదశలో నా తండ్రి కొన్నాళ్లు వ్యవసాయం చేశారు. తాత – అందులోనూ వున్నారు. ఆ కష్టనష్టాలను అనుభవించారు. ఇటీవల అంటే నాలుగైదేళ్ల కిందట మాకున్న ఆ కాస్తా పొలాన్ని డబ్బున్న కమ్మ వాళ్లు కొనడానికి మధ్యవర్తిత్వం నడిపారు. మా పొలం చుట్టూ పక్కల పొలాల వారు ఆ డబ్బున్న కమ్మ వాళ్లకి అమ్మీసి.. వలస ఎలిపోయిన స్థితి తెలుసు. మధ్యవర్తి మోసకారి గుణం తెలుసు. చాలా మంది రైతుల భూములన్నింటినీ కొని సుగంధ గడ్డి పెంచి, విపరీతమైన లాభార్జన చేసిన కార్యం మా వూళ్లోనూ జరిగింది. గౌరునాయుడు మాస్టారి కథల వస్తువు నాలాంటి సాహిత్యాన్ని అభిమానించేవాళ్లకి ఆ కాసింతైనా అనుభవంలోనే వుండడం వలన ఆయన కథలు ఏం చెప్తున్నాయో అర్థం చేసుకున్నాను. ఆ విషయాలు నా వూర్లో నా ఈడోలందరి అనుభవంలో వున్నివే. ‘ఆసరసాల’ కథ చదివాక.. నేను నాలుగైదు సంవత్సరాల కిందట మాస్టారికి ఫోన్ చే్శాను.. మా వూర్లోనూ అంతేనండీ.. అని. గౌరునాయుడు మాస్టారి అన్ని కథా పాత్రలతో మా వూరిని, మా వూరి మనుషులను , నాకు ఎదురైన మనుషులతో పోలిక కట్టుకున్నాను. పాఠకుని అనుభవంలోనిదైన కథ అయితే.. దాని మీద ప్రేమ పెరుగుతుందనడానికి నేనొక ఉదాహరణగా నాకు నేను కనిపిస్తున్నాను.
    కథల్లో వృత్తులు పోయి ప్రజలు దిగులు వలయాలను చుట్టుకున్న పాత్రలుంటాయి. మా వూర్లో మనుషులూ వాటికి ప్రతిబింబాలే అని గురించాను. దాన్ని ఏ కాస్తా అయినా చెప్పడానికి ‘మానిగంప’ అని వొక కథ రాసుకున్నాను.. ఒక ప్రత్యేక సందర్భంలో రాజకీయ మతలబుపై ‘గొంతెండిపోతుంది’ కథ వొకటి రాసుకున్నాను. మాస్టారికి చూపించాను కూడా – కొన్ని సలహాలు యిచ్చారు.
    మాస్టారి కథలతో నా అనుభవాలు యివి కొన్ని మాత్రమే.
    ఏదైనా మాస్టారి కథా వస్తువు – ‘సమాజం’…… అని నేను చెప్పక్కర్లెద్దు. ప్రపంచంలో ఎక్కడయినా వుండే కథలే యివి కూడా.

    కచ్చితంగా గౌరునాయుడు మాస్టారి కథలు సాహిత్యసమాజ ప్రేమికులందరూ చదివి మన నేలని గురించి తెలుసుకుంటారని కోరుతున్నాను. బాధ్యతతో వొక కథ రాసినా, దానికి చాలా విలువుంటుందని నా నమ్మకం. అలాంటిది నా ఎదుట విలువైన కథలు చాలా వున్నాయి.

    సారంగ సంపాదకులకు, సారంగ పాఠకులకు నమస్కారం !

  19. లక్ష్మణరావు says:

    మౌళీ గారు. మీ వ్యాసం చదివాను. నా కొంత వివరణ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇంతకీ మీది ఏ ఊరు? ఏ సుగుంద ద్రవ్యాల గడ్డి పండించారో చెప్పగలరు? ఎందుకంటే మీరు రాసినట్లు ఇది నాలుగైదేళ్ల పరిణామం కావడం. మన జిల్లాలోనే అయితే మాకు ఒక వార్త అందించిన వారవుతారు. దయచేసి ఆ వివరాలు అందివ్వగలరు.

    మీ ఇంటర్వ్యూలో గౌరినాయుడు బావు అప్పుడు రైతేమీ (సన్న, చిన్నకారు రైతు) సుఖంగా బతికినట్లుగాని, భోగ భాగ్యాలు అనుభవించినట్లు తానెన్నడూ రాయలేదని చెప్పారు.మీ వ్యాసంలో నాటి రైతుకి, నేటి రైతుకి అని ఒక చిన్న తేడాని చూపారు.దీనిని ఎలా చూడాలంటారు?

    కష్టాలను అనుభవించిన రైతు ( మీ ఇంటి కథ) తన పొలాన్ని కొనగలిగినవాడికే అమ్ముతాడు. సరిగ్గా మీ తండ్రిగారు కూడా అదే పనిచేశారు.అక్కడి రేటుని పరిగణనలోనికి తీసుకుని కాస్త రూపాయి అటో ఇటో వేసుకుని వదిలించుకుంటారు. అదే రీతిగా విక్రయించారు కూడా. అంటే కొనుగోలు చేయగల శక్తి ఉన్నవాడికి భూమి అమ్మడమనేది సహజం.అక్కడ కులం చూసి అమ్మారని నేను అనుకోలేను. కథా ప్రభావంతో మన గ్రామానికి కూడా అదే రీతిన వ్యాఖ్యానం చేయడం సరికాదేమోనని అనిపిస్తుంది.ఈ విషయంలో మీ తండ్రిగారిని ఇంటర్వ్యూ చేసి చెబితే బాగుంటుంది.

    మిత్రమా. గౌరినాయుడు మాష్టారు తాను తిరిగాడిన నేలను ఒకటికి రెండు సార్లు పరిశీలించారు. సామాజికంగా వచ్చిన మార్పులను కథలు చదవడం ద్వారానే కాదు..ప్రత్యక్ష పరిశీలన ద్వారా కూడా అన్నది గుర్తెరగాలి. డబ్బు ఒక్క ఈ నేలనే కాదు…సర్వత్రా కమ్ముతుంది. కుమ్ముతుంది. దాని భయానిక రూపాన్ని రైతు కోణంలో అన్ని ప్రాంతాల రైతు జీవితాలను ప్రతిబింబించే విధంగా మా బావు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంత యాసలో కథ రాసినంత మాత్రాన ఆ కథ ఈ ప్రాంతం వారిది అన్నట్లుగా భావించడం సరికాదు. ఈ కథలు ఏమి చెప్పాయో…ఇప్పుడు గోదావరి జిల్లాలో కూడా సన్నచిన్నకారు రైతు జీవన స్థితి అలానే ఉంది. ఆ క్రమంలోనే ధనిక రైతుకి ఆ భూమి దఖలుపడుతుంది. ఆ బాధను రైతు గొంతుతో చెబుతుంటే మీరు ఆ గొంతుకి సరిహద్దులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదేమో అన్నది నా భావన. రైతు జీవితం గురించి, గ్రామీణ జీవన చిత్ర గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే గౌరునాయుడు కథ చదవాలని సూచిస్తేనే సబబు.

    మీరు ఉత్తరాంధ్రా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ మీరు వేసిన ప్రశ్నకి గౌరునాయుడు బావు ఇచ్చిన సమాదానంలోనే మిమ్మల్ని మీరు సరిచేసుకునే జవాబు ఉందని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే “ఇక్కడి రచయితలంతా సార్వజనీనమైన మానవ జీవన వికాసాన్ని చెప్పే ప్రయత్నంలో” యింకా చాలా చెయ్యాల్సి ఉంది. ఆ దిశగా మీ రచనలు, మీ ఇంటర్వ్యూలు సాగాలని, మీ కవిత్వం సాగాలని, గ్రామాల మీద జరుగుతున్న దాడిని కులం కళ్లద్దాల్లోంచి చూడకుండా ఆ దాడికి శక్తినిస్తున్న విషయాల మీద వర్గ దృష్టితో చూడాలని మా గంటేడు బావు చెప్పిన విషయాన్ని గుర్తెరిగి మీ వ్యాఖ్యలు, మీ వ్యాసాంగాలను కొనసాగిస్తారని ఓ మిత్రుడుగా నా సూచన. నా ప్రశ్నలకి బదులిస్తారని ఆశిస్తున్నాను.

  20. balasudhakarmouli says:

    స్వారీ ! మీ కోసం నేను రాయలేదు. అన్నీ అలాంటివి వుండవు. ఆయన కథలతో నా అనుభవం రాశాను. నన్ను నేను అన్వేసించుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కూడా నాకు నమ్మకం లేదు. తప్పించుకుంటున్నానని.. లేదా యింకేవో యింకేవో మీ నచ్చినట్టు అనుకోవచ్చు. యింకా ఎన్నైనా మీరు రాసుకోవచ్చు. వూహించుకోవచ్చు. అన్నీ వొకేలా వుండవు.

  21. balasudhakarmouli says:

    మిత్రమా ! నేను అనుకోనివి, భావించనవి, లేనివి నా అభిప్రాయాలు కానివి మీకు నచ్చినట్టు ఆపాదిస్తున్నారు. మీ భావాలను నా భావాలుగా మార్చే ఆలోచన చేస్తున్నారు. అసలు యిలా ఎలా చేయగలుగుతున్నారు మిత్రమా ? ఏవేవో వూహించుకుని నా ఆలోచనల్లో, అభిప్రాయాల్లో లేనివాటిని కూడా తీసుకొచ్చి అడ్డదిడ్డంగా పెడుతున్నారు. ఒకరు రాసిన అభిప్రాయాలను కూడా సరిగ్గా చదవకుండా, అభిప్రాయాల వెనుక స్పష్టంగా కనిపిస్తున్న కారణాలను కూడా చూడకుండా మీకు ఎలా తోస్తే అలా రాసేస్తున్నారు మిత్రమా. నేను అడిగిన ? మార్కులకు మీ దగ్గర నుంచి జవాబు రాదు. మళ్లీ కొత్త కొత్త సలహాలు ఇస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారో అర్ధం కాలేదంటే ఎక్కడ లోపముందో చూసుకోండి మిత్రమా. ఖాళీలు వున్నాయంటారు పూరించే పని మీరేనా చెయ్యండి అని అంటే.. అది మాత్రం చెయ్యరు. మాస్టారు కథలు కూడా మీకు సరిగ్గా అర్ధంకాలేదనుకుంటాను మిత్రమా. అవిచ్చే స్ఫూర్తిని కూడా మీరు అస్సలు అందుకోరని తెలుస్తుంది మిత్రమా. ‘కవిత్వం వద్దు. కవిత్వం రాయొద్దు.. ‘ అని వొకసారి నాకు సలహో ! సూచనో ఇచ్చిన మీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు మిత్రమా. మీ ఫేస్ బుక్ వాల్ మీద మాత్రం చూస్తే మీరు రాసిన కవిత వుంటుంది. మళ్లీ యిప్పుడు ‘మీ కవిత్వం సాగాలని.. ‘ ఎలా అనగలిగారు మిత్రమా ?! లోపాలు మాత్రం బాగా వెతుకుతారు. మళ్లీ పరిణామక్రమం గురించి మాత్రం మాట్లాడుతారు. మళ్లీ పెద్ద పెద్ద సలహాలు మాత్రం ఎలా ఇవ్వగలుగుతున్నారో అర్ధమవటలేదు మిత్రమా. మీ ఉద్దేశం ఏమిటో తికమకగా వుంది మిత్రమా. మీ మీద నాకు అసలు నమ్మకం లేదు మిత్రమా !

    *

    ( టయిం వ్రుధా అవుతున్న ఇలాంటి వ్యాఖ్యల నుంచి తప్పుకోవడం మంచిదని, ఈ కాలాన్ని సాహిత్యానికి వుపయోగించమని కొంతమంది సారంగ పాఠకుల సూచనను గౌరవిస్తూ, పాటిస్తూ.. ముగిస్తున్నాను )

  22. రెడ్డి రామకృష్ణ says:

    అదేమండీ మౌళిగారూ!
    మీకు తెలిసి విషయమేగదా లక్ష్మణరావుగారు అడిగేరు.చెప్పొచ్చుగదా!,మీరు పాఠకులకోసం కాకపోతే యిక్కడెందుకు రాసారు.మిమ్మల్ని మీరు అన్వేషించుకుంటూ వుంటే మీ డైరీలో రాసుకుంటే సరిపోయేదిగదా! ఎవరూ అడగరుగదా!.పత్రికలో రాసి నాకోసం అనుకుంటే కుదురుతుందా!
    మీరు ఈచర్చలో పాల్గొన్నవారందరికి బోలేడు క్వస్చనీరు విడుదలచేసేరు.వాటన్నిటికి మమ్మల్ని సమాధాలు(సంజాయిషీలు) అడిగేరు.
    ఈ విషయములో నేనుకాస్తా అలస్యమయ్యాను.అంతలోనే బోలెడన్ని హితోపదేసాలు,విజ్ఞానప్రదర్శన కావించేరు.
    మీరు నిన్న నన్నడీగి ప్రశ్నలకు నాసమాధానం వినండి
    1.నా కామేంటు మీకు ఎలా అర్ధమైతే అలాగే తీసుకోండి. మొదలు పెట్టేటప్పుడు ఒకలాగా ‘చివరకొచ్చీసరికి’ ఒకలాగా …వుండదు అభిప్రాయము అభిప్రాయమే.
    2.మీరు విజయనగరం ,విశాఖపట్నం నుంచి వచ్చినవాటికే స్పందిస్తున్నారు అని అన్నారు.ఎవరిమాట ఎలావున్నా నేను స్పందించినది,చాలా తక్కువలో తక్కువ,అది ఈ జిల్లాలనుంచి వచ్చినవాటికీ మాత్రమే నేను స్పందించి కామెంట్లు పెట్టడం లేదు. మిగతాచోట్ల నేను పెట్టిన కామెంట్లు ఉన్నాయి మీరు చూడాలనుకుంటే.మీరు చూడకపోతే అది మాతప్పుగాడు.కోడూరు విజయకుమార్ గారు,జి.యస్ .రామ్మోహన్ గారి రచనల పై గతంలో నేను కామెంట్లు పెట్టాను. వారు మీరన్న ఈజిల్లాలవారు కాదనుకుంటాను. తాజా ఉదాహరణ ఈసంచికలోనే అల్లం వంశీ గారి కథానికమీద నాకమేంటు ఉంటుంది.ఆయన ఈజిల్లాలవారేనా,మీర్ చూసుకోవచ్చు.ఈసంచికలో అసలు మీ ఇంటర్వూ చూడకముందే మొదటగా దానినే చుసాను.బావుందనిపించి ఆమాటే చెప్పాను.
    మీరు అవుట్సోర్సెస్ ఉప్యోగించుకోండి ,మాకభ్యంతరములేదు కానీ అనేముందు నిజానిజాలు గమనించండి.

    3.విమర్శగురించి..సలహాయిచ్చారు.మీరన్నట్టే తెలుగు సాహిత్యము లో విమర్శ లేదు నిజమే ఎందుకులేదు!ఒక్కసారి ఆలోచిద్దాం. మీబోటి నాబోటి కవులు/రచయితలు పెన్ను పట్టుకున్న మరునాడే ఒక దుడ్డుకర్ర పక్కనపెట్టుకుంటున్నారు.మరి విమర్శ ఎలావస్తాది.తనకి నచ్చకపోతే, అది అవతలవాడి అజ్ఞానమని కనీసం క్షమించలేకపోతున్నారే,వారు, వారితోబాటు వారి మిత్రబృందము కౌంటర్లకు దిగుతున్నారే,మరి విమర్స ఎలావస్తుంది.సరే అది అందరికి సంబంధించినవిషయం.
    మనదగ్గరికి వద్దం నేను మొదటగా చేసినకామెంటేమిటి.
    ‘మౌళి మీ సాహసాన్ని అభినందిస్తున్నాను.కానీ కొన్ని ఖాళీలు ఉండిపోయాయి.’
    ఇది మీమీద అభిమానపూర్వకంగానే రాసానని ఎందుకనుకోలేదు ఇందులో మిమ్మల్ని వ్యతిరేకించే అంశమేముంది.మీకు అది వ్యతిరేకంగా కనపడింది అంటే మీదృష్టిలోనే ఏదో దోషముంది.దానికి మమ్మల్ని అనుకుంటే లాభమేమిటి.సాహసంచేయకుండా గొప్ప పనులేవీసాధ్యం కావు.సాహసాలు చెయ్యమనే ప్రోత్సహిస్తారు,ఎవరైనా,..

    మీరు అది చెయ్యవచ్చుగదా! యిది చెయ్యవచ్చుగదా!అన్నారు,ఒకరు చెపితే ఎవరూ ఏదీ చెయ్యరు.వారి వారి అవకాశాలను బట్టి శక్తిని బట్టి చేస్తారు. నాశక్తి మేరకు నేను చేయ్యగలుగుతాను. నేనైతే ఎవరో ఎదో అంటారని భయపడి పారిపోను.కాకపోతే మీకున్నంత వెసులు బాటు నాకుండదు.నాటైమంతా ట్రైన్ కోసం చూసే ఎదురు చూపులోనే ప్లాట్ ఫారాలమీదేగడిచి పోతుంది.

    చివరగా ఒక, మాట యింతవరకూ నాకు తెలుగు వచ్చనే నేననుకుంటున్నాను.కానీ నా అభిప్రాయాలు మీలాంటి పాఠకులకు అర్ధం కావడం లేదంటే నాలో లోపమున్నట్టే, చెక్ చేసుకుంటాను.సెలవ్

  23. లక్ష్మణరావు says:

    మిత్రులు మౌళీ గారికి. కృతజ్ఈతులు. నా అజ్ఈానాన్ని నాకు గుర్తి చేసినందుకు. ఖచ్చితంగా మాష్టారు కథలు అర్ధంచేసుకోవడానికి మీరిచ్చిన సూచనలు విధిగా పాటిస్తాను. మీ కోణంలో ఆ కథలను చదివేందుకు తగిన మార్గాన్ని నిర్ధేశించినందుకు అభినందనలు. నేనేమీ మీలా కవినిగాను, సాహిత్యకారుడిని అంతకన్నా కాదు. ఏదో అప్పుడప్పుడు తెలుసుకోవాలన్న తపనతో ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రశ్నించకుండా ఉన్న సమాజాన్ని జీవంలేనిదిగా మీలాంటి సాహిత్య కారులు ఉపదేశాలు విని, ప్రశ్నించడం ద్వారా వికాసం ఉంటుందని పెద్దలు మాటలు పట్టించుకుని అవగాహనా రాహిత్యంతో ఏదొకటి ప్రశ్నలు వేసి, సందేహాలు తీర్చుకోవాలన్న యావ మాది. ఖచ్చితంగా మీ వద్ద సాహిత్య అధ్యయనానికి సంబంధించి కొన్ని సూచనలు తెలుసుకుంటాను. ఇక పోతే నేనేమీ పెద్దపెద్ద సలహాలు ఇచ్చేటంత పేరుమోసిన సాహిత్య వేత్తని కాదు. ఏదో కలం కూలీని మాత్రమే. ఒక వేళ మీ లాంటి చేయి తిరిగిన సాహిత్యకారులకు సలహాలు ఇచ్చి ఉంటే పెద్దమనసు చేసుకుని క్షమించాలని కోరుకుంటున్నాను.

    పోతే నా మూడు ప్రశ్నలకి మీ వద్ద నుంచి బదులను మరోసారి కోరుతున్నాను.

    1) మీ ఊరు ఎక్కడ. ఏ జిల్లా. ఏ మండలం?

    2) కమ్మవాళ్లకి మీ తండ్రి గారు భూమిని ఎందుకు అమ్మారు? వారు మాయ చేసి మీ భూమిని కొనుగోలు చేశారా లేక ఆ భూమి బతుక్కి భరోసా ఇవ్వక అమ్మేసారా ?

    3) అభివృద్ధికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

    ఈ ప్రశ్నలకి ఖచ్చితంగా మీరు బదిలివ్వాలని ఓ స్టూడెంట్ గా అడుగుతున్నాను. ఓ పాఠకుడిగా ప్రశ్నిస్తున్నాను. తద్వారా ఆ గ్రామాని వెళ్లి పొట్టకూటికి ఓ వార్తను తెచ్చుకుంటాను. సుగంద ద్రవ్యాల గడ్డితో లక్షల్లో లాబార్జన సాగిస్తున్న వారి మీద నా వృత్తిపరంగా వార్తలను మలుచుకుంటాను.ఆ విధంగా నా వృత్తి జీవితానికి సహకరిస్తారని ప్రాధేయపడుతున్నాను. ఎంతో విలువైన మీ సాహిత్య సేవా కాలాన్ని ఓ విద్యార్ధి కోసం పది నిమిషాలు కేటాయించి, వివరాలు అందివ్వగలరని, మమ్మల్ని సాహిత్య అధ్యయనం వైపు వేలుపట్టి నడిపించగలరని కోరుకుంటున్నాను. మరొక మాట…నమ్మకంల మీద బదులు ఉండవు. ప్రశ్నల ఆధారంగానే సమాధానాలు ఉంటాయని అనుకుంటున్నాను. ఓ ఉపాధ్యాయుడుగా నా కన్నా మీకే అన్ని విధాలా తెలుసు. మీ బదులు కోసం ఎదరుచూస్తూ…

  24. Thirupalu says:

    అవును, అవసరం సృజనకు తల్లి వంటిది. తనకు కావాలిసినపుడు లావల్సినది సృష్టించు కో గలదు. బాగుంది.

  25. balasudhakar says:

    తప్పక చివరి మాట : సాహసం, ఖాళీలు అనే రెండు పదాల మీద ( నేను ఏమైనా చెప్పుకోవాలి అని అనిపించినవి ) నా అభిప్రాయం చెప్పాను తప్ప, అందులో మీకు వ్యతిరేకంగా ఏమి కనిపించింది ! చెడ్డగా చెప్పినట్టు అందులో ఏముంది ! సాహసానికి చాలా అర్ధాలుండొచ్చు – అని అన్నది.. ఈ కోవలోనే. నా అభిప్రాయరూపమది. నా మాటని స్టేట్ మెంట్ రూపంలో చెప్పడం నా అలవాటు. నా అభిప్రాయ వ్యక్తీకరణ – ఎక్కువ చోట్ల అలాగే, ఆ కోణంలోనే వుంటుంది. మీరు ఎక్కడయినా గమనించండి. ఇప్పటికి గతంలో ఫేస్ బుక్ కామెంట్స్ కూడా చూడండి. ఈ విషయమే నా కామెంట్ లలో 5th కామెంట్ చివర ‘ఎవరైనా నిమ్మళంగా చదవండి ‘ అని నేనన్నది. నేనందుకే చాలాసార్లు చాలా మందితో అంటుంటాను, పేస్ బుక్ లో వున్నవాళ్లతో కూడా – ‘ఏదైనా ఎదురెదురుగా మాట్లాడుకుంటేనే అస్పష్టతలు వుండవు’ అని.
    నేను ఇప్పటికి కూడా సాహసం అనుకోవట్లేదు – ఇది నా అభిప్రాయం. అభిప్రాయాన్నే నేను చెప్పాను – వ్యతిరేకంగా అన్నది కాదు.

  26. లక్ష్మణరావు says:

    మౌళీ గారికి, నమస్సులు. సార్, నా ప్రశ్నలకు బదులిస్తారని ఎదురుచూస్తున్నాను. దయచేసి చెప్పగలరు.

  27. అయ్యా ఉత్తరాంధ్ర సాహిత్య మిత్రులు మీరు ఒక కుర్రాడు ఏదో ప్రేమగా ఇంటర్వ్యూ చేస్తే దానిని పీకి పాకం పెట్టి మీకున్న సాహిత్య పాతవమన్తా రంగరించి ఆయనను మరల ఇలాంటి ప్రయత్నం చేయకుండా చేసే పనికట్టుకున్నట్టున్నారు. మీకున్న సందేహాలను ఆయన మీ పక్కనుండే వాడే కాబట్టి అడిగి తెలుసుకోవచ్చు ఇలా దొరికింది కదా అని ఆన్లైన్ లో చెడా మడా వాయిన్చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా మితి మీరి చెప్తే అది ఆయనలోని సృజనను చంపేస్తుంది. మీకున్న పాటవాన్ని ఆయనకు తెలియచేప్పలనుకుంటే ఒకరోజు గుమ్చీ దగ్గరకు పిలిచి చెప్పొచ్చు. అంతేగాని ఇలా మీ ప్రజ్ఞా పాటవాన్ని నిరూపించుకొవదానికి ఈ వేదికను వాడుకొని ఆయనలోని సృజనను ఆపే ప్రయత్నం చేయొద్దని నా విన్నపం, ఈ ఇంటర్వ్యూ పరిధి మేరకు బాగుంది. మీరాసిన్చినంత ఎవరు చేయలేరు ఆ పని మీరే చేయోచ్చు ఎందుకంటె మీకు మాకు ఓ గంటన్నర ప్రయాణమే కాబట్టి మీరు కోరుకున్న నమూనా ప్రశ్నలతో మాస్టారిని పలకరించండి. మౌలిని మమ్మల్ని మన్నించి వదిలేయండి.

  28. Koteswara Rao says:

    మౌళీ గారి ఇంటర్వ్యు చదివాను. బాగుంది. గౌరు నాయుడు గారి లాంటి సీనియర్ రచయిత యొక్క అభిప్రాయలు నా లాంటి సాధారణ పాఠకులకి చాల అవసరం. కామెంట్లు కుడా చూసాను. నాయుడు గారి సాహిత్యం మీద కాకుండా ఇంకెక్కడికో వెళ్తోంది… వాదన. (వాదనే అంటున్నాను. చర్చ అనలేక పోతున్నాను)
    రెడ్డి రామకృష్ణ గారు ”ఇటీవల చాలా మందికి ఉత్తరాంధ్రా వ్యాధి సోకింది. నిన్నటి ఉత్తరాంధ్ర,రేపటి ఉత్తారాంధ్ర… ఏమిటిదంతా…? ప్రజా రచయితకు ప్రాంతమూ, దేశమూ అనే సరిహద్దులుంటాయా? గవురునాయుడు గారిని ఉత్తరాంధ్రకే పరిమితం చేయదలచు కున్నారా” అని అన్నారు.
    ఒక రచయితని పరిమితం చేయడం గురించిన బాధ వరకూ పర్వాలేదు గానీ ఉత్తరాంధ్ర మీద మాట్లాడడాన్ని ఒక వ్యాధిగా వర్ణించడం ఎంత వరకు సబబో నన్ను ఆలోచనలో పడేసింది. ఒక ప్రజా రచయితను ఎవరో ఏదో అనడం ద్వారా పరిమితమై పోతారా?
    నాకు తెలిసి రామ కృష్ణ గారు కూడా ఉత్తరాంధ్ర వారేనని అనుకుంటున్నాను. ఆయన ఉత్తారాంధ్ర జీవితాన్నే సాహిత్యీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఆ నేల గురించి మాట్లాడడాన్ని వ్యాధితో ఎందుకు పోల్చాల్సి వచ్చిందో తెలుసుకోవాలను కుంటున్నాను. ఆయన రచనల్లో మాట్లాడుతున్నది ఉత్తారాంధ్రా గురించి కాదా? అతనన్నట్టు అది వ్యాధి అనుకుంటె అతను కూడా ఆ వ్యాధి బాధితుడే కాదా?
    నన్నడిగితే .. అది వ్యాధే అయితే… ఆ వ్యాధి ప్రతి రచయితకూ వుండాల్సిందే.
    ఒక సృజన కారుడు తన నేలని ప్రేమిస్తే తప్ప ఒక సృజన చేయలేడు. తన రచన లో స్థానీయత కనిపించ కుండా రాయలేడు. ఆ రచన నిబద్ధతతో కూడి, నిర్మాణాత్మకం గా వున్నపుడు అది సార్వత్రికమూ, సార్వజనీనమూ అవుతుంది..అది వేరే విషయం. మరలాంటప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడడం వ్యాధి ఎలా అవుతుందో చెపితే బావుంటుంది.
    తెలంగాణా గురించి మాట్లాడకుంటె ఆ రాష్ట్రం ఏర్పడేదా? అక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేరేదా? ఆ ఉద్యమం లో మాట్లాడిన వారికి ”తెలంగాణా వ్యాధి’’ సోకిందని అనగలరా? అని చూడండి. రాయల సీమ కరువు, వలసలు, పేదరికం, ఫేక్షనిజమ్ కోరల్లో ఎలా నలిగి పోతున్నదీ అక్కడి రచనల ద్వార తెలుసుకుంటున్నాము. ఆ రచయితలకి రాయల సీమ వ్యాధి సోకిందని రామకృష్ణ గారు అనగలరా? ??? అని చూడండి.
    గతంలో తెలంగాణ గురించి మట్లాడిన వారికి ”తెలంగాణ వ్యాధి” సోకిందనీ, రాయల సీమ గురించి మట్లాడుతున్న వారికి ”సీమ వ్యాధి” సోకిందని అన్నారా? ఉత్తారాంధ్ర కే ఆ వ్యాధి ని ఎందుకు అంటిస్తున్నారు?
    స్థానిక, అస్తిత్వ చైతన్య వర్తమాన నేపద్యంలో ఈ ”వ్యాధి” గోలేమిటో నాకైతే అర్ధం కావడం లేదు. ఇదంతా చూస్తుంటే ఆయనే ఏదో తెలియని వ్యాధి తో బాధ పడుతున్నట్టు లేదూ???

  29. లక్ష్మణరావు says:

    మిత్రలు వర్మ గారికి, నమస్సులు. మీరు సరిగ్గా నా కామెంట్ చదివినట్లు లేరన్నది మీ వ్యాఖ్య బట్టి అర్ధమవుతోంది. మౌళీ చేసిన ఇంటర్వ్యూ చూసి నేనెంతో పొంగిపోయాను. మంచి ప్రయత్నం చేశారని కూడా మా మిత్రులకి కూడా చెప్పాను. మా తోటి జర్నలిస్టు మిత్రులు ఇద్దరితో పంచుకున్నాను కూడా. నా ఆనందాన్ని నా తొలి కామెంట్ లోనే చెప్పాను. ఒకరు అధైర్యపరిస్తే మరొకరు అధైర్యపడిపోరు. నేను ఎక్కడా చెడామడా వాయించలేదు. ఒక వేళ నా రాతలో అలాంటివి ఏమైనా ధ్వనిస్తే నేను సరిదిద్దుకోవడానికి ఏమాత్రం వెనకాడను. నేను వేసినవి మూడే మూడు ప్రశ్నలు. ఆ మూడు ప్రశ్నలు వేయడం నా ప్రజ్ఈ పాటవాన్ని చాటుకోవడంగా మీరు భావిస్తే నేను చేసేది ఏమీ లేదు. నేను ఎంతో ఆసక్తితో వేసిన ప్రశ్నలివి. ఎందుకంటే ఓ సాహిత్యకారుడు, అందునా తన గ్రామానికి సంబంధించి పరిశీలించి బావు రాసిన కథతో సరిపోయే స్థితిగతులు ఉన్నాయని చెప్పారు. అందుకే ఆ గ్రామానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్న ఆతృతే నాది. ఇది అడగడం మితిమీరిన వ్యవహారంగా మీరు చూస్తే నాది తప్పు అయిపోయిందని మీకు చెప్పదలుచుకున్నాను.

  30. రెడ్డి రామకృష్ణ says:

    కోటేశ్వరరావుగారికి నమస్తే;
    మీ వంటి ‘సాధారణ పాఠకులు’ మా ‘వాదన ‘లవైపు తొంగి చూసినందుకు ఆనందముగా వుంది.
    ఒంటి చేత్తో చప్పట్లు కొట్టడం,ఒక్క నోటితో వాదన చేయడం సాధ్యము కాదని మీవంటి విజ్ఞులైన పాఠకులకు తెలియనిదికాదు.
    “ఒక ప్రజా రచయితను ఎవరో ఏదో అనడం ద్వారా పరిమితమై పోతారా?”అని ప్రశ్నించినమీరే ఎవడో ఒక రామకృష్ణ “ఇటీవల చాలా మందికి ఉత్తరాంధ్రా వ్యాధి సోకింది”అన్నంతలో ఏదో అయిపోతోందని ఎందుకంత యిబ్బంది పడుతున్నారో అర్ధం కావటం లేదు.
    “తెలంగాణా గురించి మాట్లాడకుంటె ఆ రాష్ట్రం ఏర్పడేదా? అక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేరేదా!” అని అడిగేరు. బాగనేవుంది. “అని చూడండ “ని తొడకొడుతున్నారు.( పొరపాటున వాళ్ళేమీ పట్టించుకోకపోయినా మీరు వూరుకొనేటట్టులేరు).అన్నిటికీ భయపడే వాడు తనలో తనే బందీ అయిపోతాడు.రెండవది -ఏఅభిప్రాయమైనా తనకు తాను ఒంటరిది కాదు.ఎదో మేరకు తనలాంటి సమూహాన్ని అది కలిగి ఉంటుంది. కనుక నాకెప్పుడూ భయం లేదు.
    యిక అసలవిషయానికొస్తాను.తెలంగాణా రాయలసీమలతో ఉత్తరాంధ్రాని ఎలా పోల్చగలుగుతున్నారో నాకర్ధంకావడం లేదు.తెలంగా ణాకు మొదటినుంచి ఒక ప్రత్యేక అస్థిత్వమున్నది. ఒకరాజ్యంగా వుండి ఆంధ్రాలో కలపబడింది. కనుక అది అక్కడి ప్రజలను నాయకులను ఏకం చేయగలిగింది.
    అక్కడ రాజకీయ ఉద్యమాలున్నాయి.అలాఉద్యమాలున్నప్పుడు ఉద్యమాలకు రచయితలు తమరచనలద్వారా ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా ఉద్యమాలని బలోపేతం చేయగలుగుతారు.చేసారు. రాయలసీమలో సైతం పరిరక్షణ సముతులు ఆప్రాంత గొంతుకను బలంగా వినిపించేయి.రాజకీయ చైతన్యముంది.
    ఉత్తరాంధ్రలో రాజకీయ వుద్యమం ఉన్నదా! అసలు ఉత్తరాంధ్రని ఎలా నిర్వచించగలరు,మీరు ఉత్తరాంధ్రా అంటారు.కొందరు కళింగాంధ్రా అంటారు.(దాని విస్తృతి మీకు చెప్పనక్కరలేదనుకుంటాను). విశాఖలో స్థానికులు కొందరు (సగటు మనుషులు) ఉత్తరాంధ్రని ఒప్పుకోవటం లేదు.అన్ని అవకాశాలున్నమాజిల్లాను వెనకబడిన మీజిల్లాలతో కలపడమేమిటని ఉద్యోగులు,చదువుకున్నవారు ప్రశ్నిస్తున్న సందర్బాలను నేనువిన్నాను, చూసాను,వాదించాను కూడా, అప్పటి నా అవగాహనతో. మీరు దేనినిస్థానికవాదం గా గుర్తిస్తారు. ఏసూత్రాల ద్వారా మూడుజిల్లాలను ఒకటిగా ఏకం చేయగలమనుకుంటున్నారు. స్థానికతకు నిర్వచణమేమిటి.నాకు మాజిల్లా,అందులోనూ మామండలం అందులో మావూరు,మావీధి చాలాగొప్పవనే భావము నాకుంది.నా స్థానికత నాది.
    నాకు తెలిసి ఉత్తరాంధ్రా అనేది రచయితల ఆలోచనల్లోనే వుంది.మరి రచయితలు రాజకీయ ఉద్యమాలను సృష్టించగలుగుతారా!
    ఈ ప్రాంతపు రచయితల లక్ష్యమేమిటి.ఏలక్ష్యం కోసం పనిచేయాలనుకుంటున్నారు.ఆక్లారిటీ యిక్కడి రచయితలకు ఉన్నదా!

    ఏప్రాంతములోనైనా దేశములోనైనా రచయితలు తమ చుట్టు వున్న సమాజాన్నే చిత్రిస్తారు,ఐతే అది ఆప్రాంత సాహిత్యమే అవుతుందా!
    “స్థానిక, అస్తిత్వ చైతన్య వర్తమాన నేపద్యంలో…” అంటున్నారు. ఈ స్థానిక, అస్తిత్వ ఉద్యమాలు సాధించినదిఎంత?వాటిస్థితి ఇవాళ ఏమిటి?
    అవి బహు ముఖీనంగా సాగి ఒకానొక దశవరకు అవి గొప్ప ప్రాభవం కలిగి,ప్రభావాన్ని కలుగజేయగలవేమో గానీ,శ్రామికవర్గ దృక్పధం లేకుండా చివరంటా అస్తిత్వ ఉద్యమాలుగా కొనసాగలేవని అనుకుంటాను. (కేవల అస్తిత్వ ఉద్యమాలుకొంతమంది వ్యక్తులకు గుర్తింపు తెచ్చిపెట్టగలవేమో… పదవులను,అవార్డులను …) తప్ప ఏకోన్ముఖంగా సాగిన శ్రామిక వాద ఉద్యమాలను మించిన ఫలితాలను సాధించలేవనేది నా అవగాహణ.అలాగని ఆయాఉద్యమాలను వ్యతిరేకించనక్కరలేదు.ఏమేరకు అవి శ్రామిక ప్రజా ఉద్యమాలకు దోహదపడగలవనుకుంటే ఆమేరకు వాటినిబలపరచవచ్చనుకుంటాను.

    కొంతమంది రచయితలు ఇక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉందని తాము భ్రమపడుతూ అదేపనిగా మరికొంతమందిని భ్రమలకు గురిచేస్తున్నారు.ఇదొక వ్యాధనే నేననుకుంటున్నాను. కాదంటారా! యిబ్బందేమీ లేదు.అలాకాకుండా అది వ్యాధే అయి
    మీరన్నట్టు ఒకవేళ ఆవ్యాధి నాలోనే వుంటే మీకొచ్చిన యిబ్బందేమి లేదు.కనుక అప్పుడూ మీరు,మీ వంటివారు భయపడనక్కరలేదు.

  31. రామక్రిష్ణ గారు ఒక మంచి ప్రశ్న వేశారు… “… భూమిని ఎందుకు అమ్మారు ? వారు మాయచేసి మీ భూమిని కొనుగోలు చేశారా ,లేక ఆ భూమి బతుక్కి భరోసా ఇవ్వలేక అమ్మేశారా ? ” ఇది సందర్భం కాకపోయినా ఒక విషయం మాట్లాడుకోవాలి. ప్రభుత్వపరంగా ఏవిధమయిన సహాయ , సహకారాలు లేకపోవడంతో రైతులు భూమిని తెగనమ్ముకోవలసి వచ్చిందనేది నగ్నసత్యం. పెట్టుబడి పెట్టగలిగిన రైతులు భూములను కొని , అభివ్రుధ్ధి చేసుకొని సంపాదించుకున్నారు. అలాటి వారిని ఆక్రమణదారులు , కబ్జాదారులు అనవచ్చా ?
    తిరుపతిలో ` తెలుగు సాహిత్యంలో రైతు కథలు ‘ గురించి జరిగిన సమావేశంలో ఒకరు ` ఆంధ్రప్రాంతానికి చెందిన ఒక కులం వారు మా భూములను కారుచౌకగా కొని , సంపాదించుకొని , మా రైతులను కూలీలుగా మార్చి , మా సంస్క్రుతిని చిన్నాభిన్నం చేశారు ‘ అని అన్నారు. తెలంగాణా ప్రాంతంలో కూడా ఇలాటి అభిప్రాయాలే వ్యక్తమైనాయి. ఇలా భావించడం సమంజసమేనా ?
    మరి మనవాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్ళి , ఉద్యోగాలు , వ్యాపారాలు చేసుకుంటూ , అక్కడే స్థిరపడి ఇళ్ళు , ఆస్థులు సంపాదించుకుంటున్నారు గదా ! వారినేమనాలి ?
    ఇలాటి వాదనలన్నీ మనుషుల మధ్య విభేదాలు స్రుష్టించడానికే గాని , వారిని చైతన్యపరిచి , సమస్యలమీద గళం విప్పి , పోరాడే స్థితికి తీసుకు వచ్చేవిధంగా చేయడానికి పనికిరావని గుర్తించాలనుకుంటాను. కాదంటారా ?

  32. క్షమించాలి. ఆ ప్రశ్న లక్ష్మణరావుగారు అడిగారు.

  33. రెడ్డి రామకృష్ణ says:

    జయప్రకాశ రాజుగారు,
    మీ సందేహాలు అనండి లేదా ప్రశ్నలు అనండి అవి సమంజసమైనవిగానే నేను భావిస్తున్నాను.మనలో చాలామందికి లక్ష్యమోకవైపున్టే గురి మరొకవైపు ఉంటుంది. దానివలన గందరగోళంలో పడుతున్నాము. ఎప్పుడు ఎక్కడ గురిపెట్టాలో అర్ధంకాక అయోమయంలో పడుతున్నాము .
    పెట్టుబడికి,జ్ఞానానికి సరిహద్దులుండవు.ఎక్కడైన ఎప్పుడైనా అవినిర్వహించే పాత్రలు ఒక్కలాగానే వుంటాయి.అంటే దీనర్ధం ఆధిపత్య కులాలకుండే అహంకారం వుండదనికాదు.కులహంకారాన్ని ప్రదర్శించే సమయములో ఖచ్చితంగా దానిని ఖండించాలి.ఎదుర్కోవాలి.ఐతే భూములు కొనుగోళ్ళ విషయం లో మనం చూడవలసిందికులం పాత్రకాదు.ధనం పాత్రని.అదే పెట్టుబడిగామారుతుంది.
    యిది నా అభిప్రాయము,లక్ష్మణరావుగారు ఎలా స్పందిస్తారో చూద్దాం.

  34. లక్ష్మణరావు says:

    మౌళీ గారు. మీ ఊరు పేరు చెప్పండి అంటే మౌనం వహిస్తే ఎలా సార్. కనీసం “మమ్మల్ని వదిలేయండి” అన్న వర్మగారైనా మౌళీ గారి స్వగ్రామం పేరు చెబితే మాకొక వార్తను అందించిన వారవుతారు. అయిదేళ్లలో సంభవించిన భూ బదలాయింపు పరిణామం మీద ఖచ్చితంగా మంచి వార్త అవుతుందన్న ఆశతో అడుగుతున్నాను. దయచేసి చెప్పగలరు. మీ బదులు కోసం ఎదురుచూస్తూ…

Leave a Reply to chinta Cancel reply

*