లైఫ్ ల కొద్దిగ పాజిటివ్ టర్న్…

అల్లం వంశీ

 

“నువ్వు కథలెందుకు రాస్తున్నవ్??”
ఉట్టిగనే.. రాస్తుంటే మంచిగనిపిస్తుంది కాబట్టి రాస్తున్నా..

మంచిగనిపించుడంటే?
ఓ కథ రాస్తా.. అది ఎన్లనో ఒక దాన్ల పబ్లిష్ ఐతది.. అది చదివి ఓ నలుగురు ఫోన్ చేసి మంచిగున్నది అంటరు.. ఇంకొందరు అక్కడికి ఆగకుంట “నీ కథల, మమ్మల్ని మేం చూస్కున్నం.. అదంత చదివినంక మావోళ్లు మతికస్తున్నరు. మా ఇల్లు మనాది సలుపుతున్నది, పొయి రావాలె.. మాక్కొద్దిగ మారాల్ననిపిస్తున్నది..” అని ఇంకో రెండు మూడు ముక్కలు ఎక్కువ మాట్లాడుతరు.. బస్… అది చాలు.. దిల్ ఖుష్.. అందుకే మంచిగనిపిస్తది అంటున్న..

గంతేనా? ఇంకేం లేదా??
లేదా అంటే మా ఉన్నదికని అందంత చెప్తే క్లాస్ పీకినట్టు ఉంటదని చెప్తలేను..

పర్వాలేదు చెప్పు..
చదువుకుంటె మనిషి సంస్కారవంతుడైతడు అంటరుకదా, అది వంద శాతం నిజం.. కాకపోతే “ఏం” చదువుకుంటే సంస్కారవంతుడైతడనేది చానమందికి తెలువకపోవుడే అసలు సమస్య..
న్యూటన్ గమన నియమాలు బట్టీకొడితెనో, మైటోకాండ్రియా నిర్మాణం పొల్లుపోకుండ యాదుంచుకుంటెనో, మొఘల్ చక్రవర్తుల వంశ వృక్షం మక్కీకి మక్కి అప్పజెప్పగలిగెతెనో కుప్పలు తెప్పలుగా సంస్కారం వచ్చిపడుతది అనుకుంటరు చానమంది!

అంటె? చదువుకు సంస్కారానికి సంబంధంలేదనా నీ ఉద్దేశ్యం?
అరే.. మొత్తం వినూ.. అదే చెప్తున్నా… ఇంతకుముందు చెప్పినయన్ని చదువుతె ఆ సబ్జెక్టుల నాలెడ్జీ పెరుతది కావచ్చు కని దునియాల మంచీ చెడుల గురించి ఏం తెలుస్తది చెప్పు??
ఇక్కడ నీకో చిన్న ఉదాహరణ చెప్తె మంచిగ సమజైతదికావచ్చు! నూట యాభై దేశాల రాజధానులూ + వాటి కరెన్సీలు టకా టక్ అప్పజెప్పే పదేండ్ల పిలగాడొకడు నాకు తెల్సు.. (మా సైడ్ బాగ ఫేమస్, “మస్తు తెలివిగల్లోడు” అని)… ఆ పిలగాడు మొన్నోసారి వాళ్ల కుక్క తోకకు సుతిల్ బాంబు కట్టి పేల్చిండు, పాపం దాని తోక తెగిపొయి, తొడలు మొత్తం కాలి పుండై రక్తం కారుతుండే.. అట్ల చేసినందుకు వాళ్ల అమ్మనాన (ఇద్దరూ గవర్నమెంట్ టీచర్స్) పిలగాన్ని ఏమనకపోంగా ఆ కుక్కను మా కుక్క కానే కాదన్నట్టు ఊరవుతల ఇడ్శిపెట్టచ్చి చేతులు కడుక్కున్నరు.
ఇక్కడ పిలగాడు చదువుకున్నోడే, వాళ్ల అమ్మనానలూ చదువుకున్నోళ్లే! మరి అందరు మంచోళ్లే అయినంక ఆ కుక్క బతుకు నిజంగనే “కుక్క బతుకెందుకైతది” చెప్పు…?

ఎందుకైందంటవ్ మరి?
వాళ్లు చదువుకున్నోళ్లే కనీ, సంస్కారం లేనోల్లు కనుక అట్లైందన్నట్టు..

నువ్ రాసే కథల గురించి నేనడుగుతుంటే, నువ్వింకేదో పిట్టకథల్ చెప్తున్నవ్??
పిట్టకథల్ కాదు భై.. మంచి సాహిత్యానికీ మనిషి వ్యక్తిత్వానికి సంబంధం ఉంటదని చెప్తున్నా.. “మనిషి మనిషి లెక్కనే ప్రవర్తించాలంటే” రెండే రెండు దారులుంటయ్.. ఒకటి మంచోళ్ల సోపతి, ఇంకోటి మంచి పుస్తకాలతోని దోస్తాని..
నీకు తెల్సో తెల్వదో కని, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ప్రపంచం.. ఒక్కో కథ ఒక్కో జీవితం.. అందుకే ఎంత చదివితే మన “ఆలోచనలకు” అంత మంచిది..

అచ్చా.. సమజైంది.. ఇంతకు నువ్వెందుకు రాశుడు షురూ చేష్నవో చెప్పలే..
ఈ రాశుడు సెవెంత్ క్లాస్ ల షురూ అయ్యి ఇక్కడిదాంక వచ్చింది.. అప్పుడు వార్త పేపర్లో “మొగ్గ” అని చిన్న పిల్లల పేజి ఒకటి వస్తుండే, దానికి పోస్టుకార్డు మీద కథలు రాసి పంపుతె ఓ రెండు మూడు సార్లు వాళ్లు పబ్లిష్ చేశిన్లు, అప్పుడు చూడాలె మా స్కూల్ల నా ఫెయితూ.. కథా కార్ఖానా.. అగో అప్పుడు షురూ అయి, నా కథ ఇక్కడి దాంక వచ్చింది..

అప్పటికీ ఇప్పటికీ ఏమన్న తేడా ఉన్నదా లేదా మరి?
అప్పుడు చిన్నగున్నప్పుడు కథ పడకపోయినా పర్వాలేదుకని పేపర్లో మన పేరు కనపడాలె, అది చూశి అందరు మస్తు పొగడాలె అని ఉండేది.. ఇప్పుడు మాత్రం రివర్స్ ల నా పేరు వెయ్యకపొయిన మంచిదే కని కథ మాత్రం బాగ మందికి రీచ్ కావాలె అనిపిస్తుంది.. ఇదికూడా కొంతవరకు స్వార్థపు ఆలోచనే కావచ్చుగని.. నిజాయితిగ చెప్తున్న, నాకైతె అట్లనే అనిపిస్తున్నది, చానమంది చదవాలె అని..
చదివి అందులో వాళ్లను వాళ్లు పోల్చుకోని లైఫ్ ల కొద్దిగ పాజిటివ్ టర్న్ తీసుకుంటె చాలు.. ఖుష్..

vamsi

 

వాళ్ల లైఫ్ పాజిటివ్ టర్న్ తీసుకుంటే నీకెందుకు ఖుష్? (నీకేంది లాభం?)
ఇంత పిచ్చి ప్రశ్న నా జిందగీల ఇంకోటి విన్లే.. ఇది చదువుతున్న వాళ్లల్లో చానామందికి దీనికి జవాబు ఎరికేగనీ.. ఇంకేమన్న అడుగవోయ్..

ఓకే.. ఓకే.. సినిమాలకు పనిచేసినట్టున్నవ్.. దాని గురించి కొంచం..
సినిమా రైటర్ ప్రస్థానం మస్తు పెద్ద కథ..
రెండేండ్లల్ల మూడున్నర సినిమాలు రాసిన.. (రెండున్నర వాటికి కథలూ+మాటలు, ఒక దానికి ఉట్టి మాటలు).. వాటిల్లో ఏ ఒక్కటీ కూడా ఇంకా రిలీస్ కాలే.. ఒకటి షూటింగు ఐందని తెలుసు, మిగిలిన రెండున్నర అసల్ సెట్ల మీదికి ఎక్కినయా/ఎక్కుతయా లేదా అన్నది నాకింక డౌటే.. “ఆ ప్రపంచం” మంచిగనే ఉంటది కని రచయితకు వంద “బార్డర్లు” గీసి మద్యల నిల్చోపెడ్తరు… బడ్జెట్ అనీ, భాష అని.. వంద ఉంటయ్..

 

బార్డర్లంటే?? కొంచం క్లియర్ గ చెప్పరాదు..
ఒకరు బూతు జోకులుండాలంటే, ఇంకొకరు పంచు డైలాగులు పడాలంటరు.. ఒకరు లాజిక్స్ లేకున్న పర్వాలేదుకని ఫ్రేము ఫ్రేముకీ ఫిమేల్సు కనిపించాలంటే, ఇంకొకరు నువ్వేం చేస్తవో నాకు తెల్వదు సాంగ్ అయిపోయిన వెంటనే గన్ ఫైర్ జరిగి స్క్రీన్ అంత రక్తం కారిపోవాలె అంటరు!!
తలకాయి తోక ఉండొద్దుకని గొర్రెను గియ్యమంటరు.. ముక్కూ చెవులు ఉండకున్నా మొహం అందంగా రావాలంటరు.. అదే సినిమా ప్రపంచం.. (అందరు అసొంటోళ్లు ఉంటరని కాదు.. కొందరు కత్తిలాంటి మహేషన్నలు, మంచి మహేందరన్నలు కూడా ఉంటరు.. కాని మస్తు అరుదు).. అందుకే అవన్ని నాతోటి కావనిపించి, ఆ ఫీల్డులో మనుషులు నాకు నచ్చినా, “ఆ సిస్టం” నచ్చక వదిలేష్నా..
ఇంక ఆ టాపిక్ లైట్.. వేరే ఏమన్న మాట్లాడుదాం..

ఓకే.. ఓకే.. ఇందాక సాహిత్యం అనుకున్నం కదా మరి సాహిత్యంలో కథా, కవిత, నవల, పాట, పద్యం.. ఇట్ల ఎన్నో ప్రక్రియలు ఉండంగ నువ్వు కథనే ఎందుకు ఎన్నుకున్నవ్?
ఇక్కడ చిన్న థియరీ చెప్పాలె.. “కడుపు నిండుగా తిన్నా కానీ, నోట్లో ఇంకా ఆకలవడం” అన్న కాన్సెప్టు నువ్వెప్పుడన్న విన్నవా?

అహా విన్లే..
చెప్త విను.. – నాకు చిన్నప్పటి నుంచి ఆకలైనపుడు ఎన్నిరకాల ఓల్డ్ స్టైల్ టిఫిన్లు(అంటే ఫర్ ఎక్సాంపుల్ రొట్టె/పూరీ/ గారె/ దోశే లాంటివి) తిన్నా, ఎన్నిరకాల లేటెష్ట్ వెరైటీలు (లైక్- పిజ్జా/బర్గర్/ నూడిల్స్ గీడుల్స్ లాంటివి) తిన్నా.. నా కడుపైతె మస్తుగ నిండుతది కని ఆకలి మాత్రం అస్సల్ తీరదు.. ఇంకా “ఏదో” తక్కువైన ఫీలింగ్ ఉంటది.. చిన్నప్పుడు మా అమ్మకు అదే చెప్పేటోన్ని- “కడుపైతె నిండిందికని నోట్లో ఇంకా ఆకలైతుందమ్మా” అని.. (వాస్తవానికి అది నోట్లో ఆకలవడం కాదుగాని, “తిన్న ఫీలింగ్” రాకపోవడం అన్నట్టు.. దాన్నే తెలుగుల “తృప్తిగా భోంచెయ్యడం” అంటరనుకుంట!) అప్పుడు మా అమ్మ ఆ టిఫిన్లు పక్కకు పెట్టి, ఇంతంత అన్నంలో కూరో చారో కలిపి తినిపించేది.. అదేం విచిత్రమోకాని ఒక్క రెండు బుక్కల అన్నం తిన్నా చాలు టక్కున ఆకలి తీరిపొయ్యేది.. ఇప్పటికి తిండి విషయంలో నాదదే థియరీ, “అన్నం” ఒక్కటే నా ఆకలి తీరుస్తదీ అనీ..
ఈ కథంతా ఇప్పుడెందుకు చెప్తున్నా అంటే- అన్నం ఎట్లైతె నా ఆకలి తీరుస్తదో, “కథ” కూడ సేం అట్లనే రాయాలన్న నా “కూతి”ని తీరుస్తది..

ఏం “కూతో” ఏందో.. ఇంత వెరైటీ పోలిక నేనైతె ఇప్పటిదాంక విన్లే!!
థాంక్యూ..

రకరకాల టిఫిన్లు ట్రై చేసినట్టు, సాహిత్యంలో కూడా అన్ని రకాలు ట్రై చేసే ఉంటరు కదా?
కావల్సినన్ని ట్రై చేశ్నా… కవితలూ, వ్యాసాలు, పాటలు, మాటలు(సినిమాలకు), కాలేజీల కామెడీ స్కిట్లూ + సగం రాసి విడిచి పెట్టిన నవలలూ…. నేన్ చెయ్యని ప్రయోగంలేదు..

మరి వాటిని ఎందుకు విడిచి పెట్టినట్టు??
నేను వాటిని విడిచి పెట్టుడుకాదుగనీ, అవే నన్ను విడిచి పెట్టినయ్… కథొక్కటే నన్ను పట్టుకోని ఉన్నది పాపం..

అట్లకాదు, కరెక్ట్ కారణం చెప్పు..
ఒక్కటని ఏం చెప్పను..! కవితలను, రాసిన నేను తప్ప ఇంకొకరు చదవకపోవడం కావచ్చు.. పేపర్లకు రాసి పంపిన వ్యాసంలో పావో, సగమో తప్ప మిగిలినదాన్ని వాళ్లు “ఎడిటింగు” చేసి నేన్ రాసినట్టు కాకుండా వాళ్లకు కావల్సినట్టు మార్చడం కావచ్చు, పాటల రికార్డింగు ఖర్చుతో కూడుకున్నదని కావచ్చు, నవలరాస్తుంటే ఒళ్లు బద్దకమవుడు కావచ్చు, స్కిట్ లు రాద్దామంటే ఇప్పుడు నేను కాలేజీలో లేకపోవడం కావచ్చు.. సవాలక్ష కారణాలు..

ఒక్కటడుగుతె ఇన్ని చెప్తున్నవ్? సరే సరే మళ్లీ “కథలోకి” వద్దాం.. ఇంకా చెప్పు కథలెందుకు ఇష్టం..
ఒకటే ప్రశ్నను మార్చి మార్చి ఎన్నిసార్లు అడుగుతవ్ చెప్పు..!

నువ్వు మంచి సాలిడ్ & వ్యాలిడ్ రీజన్ చెప్తలెవ్వు.. అందుకే మళ్ల మళ్ల అడుగుతున్నా ..
కవిత రాస్తే నాకు నేనే(ఎవరో ఒక్కరే) మాట్లాడుకున్నట్టు ఉంటది, మహా ఐతె ఇంకొకర్ని చొప్పించచ్చు కావచ్చు..
కాని కథల అట్లకాదు ఎంతమందిని కావాల్నంటే అంతమందితోని మాట్లాడిపియ్యొచ్చు…

కథలో-“మనకు నచ్చిన విషయం- నచ్చిన పాత్రతోటి- నచ్చిన సంధర్భంలో- నచ్చిన పద్ధతిలో- నచ్చిన చోట- నచ్చిన టైముకు- నచ్చిన భాషలో- నచ్చిన యాసలో- నచ్చిన పదజాలంతోని చెప్పే అద్భుతమైన సౌలత్ ఉంటది”.. (ఇవన్ని నచ్చకపోతే, రచయితగా మనం కూడా ఆ కథా సన్నివేశంలోకి దూరి మరీ మనమేం చెప్పాలనుకున్నమో చెప్పవచ్చు).. “కథ”ల ఇన్ని సౌలత్ లు ఉంటయి కాబట్టే నాకు మిగిలినవాటికన్నా “కథలు” రాశుడంటెనే ఎక్కువ ఇష్టం..

అంత సాలిడ్ గ లేదు కని, కొంచం వ్యాలీడ్ గనే ఉంది కాబట్టి ఈసారికి వదిలేస్తున్నా…
అవునా.. థ్యాంక్స్..

ఇంకా.. నువ్వు రాసిన కథలకు సంబంధించి హ్యాపీగ అనిపించిన సంధర్భాలు??
చాన్నే ఉన్నయ్.. చదివిన వాళ్లు ఫోన్ చేసి “చదివినం, మంచిగుంది” అన్న ప్రతీసారి నాకు పండుగే.. ఇంకా మస్తు మంచిగనిపించె విషయమేందంటే చాన మంది సీనియర్ రచయితలు కూడా ఎక్కడో ఓకాడ నా కథ ఏదో ఒకటి చదివి, గుర్తుపెట్టుకోని మరీ కాలో, మెసేజో చేస్తున్నరు.. అటువంటివాళ్లు మంచిగుందన్నా, మాములుగ ఉన్నదన్నా నాకానందమే… చదవనైతె చదివిన్లు కాబట్టి..
ఇక్కడ అఫ్సరన్న కు ప్రత్యేకంగ కృతఙ్ఞతలు చెప్పుకోవాలే, ఎందుకంటే ఆన్ లైన్ మ్యాగజైన్ అనే మాధ్యమం తోని మస్తుమంది కొత్తవాళ్లను మస్తు ఎంకరేజ్ చేస్తున్నందుకు.. (ఈ విషయంల అఫ్సరన్న తర్వాతనే ఇంకెవరైనా..)
ఈ ఆన్ లైన్ మ్యాగజైన్స్ గొప్పతనం ఒకటున్నది, అదికూడ ఈ సంధర్భంల చెప్పుకోవాలె…

అదేందంటే… 24X7, 365 రోజులూ దునియాల అందరికీ ఇవి అందుబాటుల ఉంటయ్.. వీక్లీ పేపర్ల అచ్చైనవైతే ఆదివారం దాటితే మళ్ల మనకంటికి కనపడవు, కానీ ఆన్ లైన్ లో పబ్లిష్ అయినవాటిని ఇవ్వాల కాదుకదా ఇంకో పదేండ్లకు కావాల్నన్నా మనకు ఒక్క క్లిక్కు దూరంలనే ఉంటయి.. నాకందుకే ఈ పద్దతి మస్తు నచ్చింది..
(అఫ్సరన్న & టీం తోని పాటూ మిగిలిన ఆన్ లైన్ మ్యాగజైన్స్ నిర్వాహకులందరికీ మళ్లొక్కసారి కృతఙ్ఞతలు..)

ఔను కరెక్టే.. నేనూ అట్లనే అనుకుంటా… సో… ఇంకా?? మరి బాధనిపించిన సంధర్భాలు ఏమన్న ఉన్నయా? (కథలకు సంబంధించి)
ఆ.. అవికూడ కొన్నున్నయ్.. నా దగ్గరి దోస్తులల్ల చానమందికి తెలుగు చదువుడురాదు.. చదువరాదంటే మొత్తానికి రాదని కాదుగని, బస్ మీద “హైదరాబాద్” అనో “వరంగల్” అనో బోర్డు చదవటానికే వాళ్లకు అర నిమిషం పడ్తది.. ఇగ “కండక్టర్ కు సరిపడ చిల్లర………..” చదవటానికైతే సగం జర్నీ ఐపోతది..
అసొంటోళ్లు ఒక కథను చదవాల్నంటే కనీసం ఒక నెలో నెలన్నరో పడ్తది, అందుకే వాళ్లు చదవరు!!! (నా దోస్తులనే కాదు, ఇప్పుడు “బిలో థర్టీ” ఉన్నోళ్లు చానమంది అందుకే తెలుగు పుస్తకాలు చదువుతలేరు) అదొక బాధ.. పోనీ వాళ్లకు సమజయ్యేటట్టు నేనే ఇంగ్లీషులో రాద్దామంటే, రాయస్తలేదు.. అందుకు ఇంకో బాధ..

అబో.. మంచిది.. మంచిది! చివరగా.. ఇంకా నీకున్న ఆశలూ – ఆశయాలూ??
పెద్దగ ఏం లెవ్వు కానీ..
వల్డ్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ ల కనీసం నాయొక ఆరేడు పుస్తకాలన్న పట్టేటట్టు చెయ్యాలె.. ఇంకా..
కుడి చేతిలో నోబెల్ ప్రైజూ, ఎడమ చేతిలో ఆస్కార్ అవార్డూ..
బ్యాగ్రౌండ్ లో జన గణ మన..
ఫ్రంట్ రో లో అమ్మా నానా అన్నా..
మనశ్శాంతీ…..
ప్రపంచ శాంతీ… …. …… ………

అరేయ్.. లే.. వంశీ.. అరేయ్ వంశీ.. లే రా..
ఆ?? ఏందీ?? ఏందిరా??
ఏందో శాంతీ శాంతి అని కలవరిస్తున్నవ్? ఏంది కతా?? ఆ?? లే.. లేశి ఇన్నన్ని మంచినీళ్లు తాగు..
ఏందీ!! కలవరిస్తున్ననా??… షిట్..!! ఇదంత కలనా ఐతే?
(కొన్ని మంచినీళ్లుతాగి మళ్ల పడుకున్నంక సందీప్ గాడు మెల్లగ అడుగుడు బెట్టిండు)-

ఏం కలచ్చింది మామా?? శాంతెవర్రా??
శాంతిలేదు గీంతిలేదు.. అదేదో కలచ్చిందిరా..
ఏం కల రా??
అదేదో ఇంటర్వ్యూ మామా.. నన్నెవరో ఇంటర్వ్యూ చేస్తుండే..

ఇంటర్వ్యూనా? మంచిగ చెప్పినవా మరి? జాబ్ అచ్చిందా రాలేదా??
ఏ…. జాబ్ ఇంటర్వ్యూ కాద్ బే.. అదేదో “కథ”లకు సంబందించింది..

అచ్చా అదా… ఏమడిగిండేంది..?
అదే యాదికస్తలేద్రా.. కొద్దిగ ముక్కల్ ముక్కల్ మతికస్తుందంతే..

ఆ ముక్కలే చెప్పుమంటున్న..
ఆ.. ఆ.. ముందుగాల ముందుగాల ఓ కొచ్చనైతె అడిగిండురా నాకు బాగ మతికున్నది..
ఏం కొచ్చను??

“నువ్వు కథలెందుకు రాస్తున్నవ్??”

*

మీ మాటలు

 1. rakesh jukuri says:

  good narration మామా.. నీ కల నిజం కావాలని కోరుకుంటున్నా.. ఐతది పో..

 2. ANKARI PRAKASH says:

  సూపర్ వంశీ.. చాలా బాగుంది..

 3. Sandeep says:

  మస్తున్దిరా… సూపర్ లైక్..

 4. Srinivas Meesala says:

  వేరి గుడ్ వంశీ. చాల బాగున్ది

 5. రెడ్డి రామకృష్ణ says:

  శానా బాగుంది బావూ!మాక్కూడా యింతే ఈ నాలుగైదుకోరికలే ఉన్నాయి. అయ్యన్ని నీకే వొచ్చీత్తే మరి మామందరం ఏటయ్యిపోవాలా…!మాము శానా మందిమి ఆటే సూస్తన్నాము గాదా! కావాలంటే మొదటిది నువ్ తీసుకో రెండోది నాకోదిలీ…..

  .
  వల్డ్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్ ల కనీసం నాయొక ఆరేడు పుస్తకాలన్న పట్టేటట్టు చెయ్యాలె.. ఇంకా..
  కుడి చేతిలో నోబెల్ ప్రైజూ, ఎడమ చేతిలో ఆస్కార్ అవార్డూ..
  బ్యాగ్రౌండ్ లో జన గణ మన..
  ఫ్రంట్ రో లో అమ్మా నానా అన్నా..
  మనశ్శాంతీ…..
  ప్రపంచ శాంతీ… …. …… …

  చాలా బాగుందిసార్ ,అభినందనలు.

  • Allam Krishna Vamshi says:

   అనడరికి సరిపడినన్ని ఉన్నాయ్ సారచానా చానా థ్యాంక్స్ మేడం.. ఫుల్ హ్యాపీ :)

  • Allam Vamshi says:

   అన్దరికీ సరిపడినన్ని ఉన్నాయ్ సార్, నొ ప్రాబ్లం.. తలా ఒకటి తీస్కుందాం…
   చానా చాన ధన్యవాదాలు సర్ మస్త ఖుష్..
   (ఇందాకటిది, నెఅను టైప్ చేస్తుండగానే పొరపాటున ప్రెస్ అయి పొస్ట్ ఐంది, సారీ)

 6. samanya says:

  వంశీ పొద్దున్నే మీ మాటలు చదివి మస్తు ఎక్సయిట్ అయ్యి ఆ జోష్ లో మొదటి కామెంట్ నేనే పెట్టాను ,కానీ ఎందుకో అచ్చవలేదు . ఏం రాసానంటే గీ పోరగాడు నోబెల్ బహుమతి తెచ్చుకునే దిమాక్ గిట్ట ఉన్నోడే .. పెద్దమ్మ తల్లీ జర జల్దోచ్చేట్టు జెయ్ టాగోర్ తర్వాత ఎవ్వరూ గింత మంచిగా థింక్ జేశ్నోల్లు లేరనీ ,ఇంకా ఫ్రేము ఫ్రేముకీ ఫీమేల్స్ కావాలనే ప్రపంచాన్ని క్విట్ చేసి భలే చేసారనీ ఇలా చాలా చాలా రాశాను ఇప్పుడు మర్చిపోయాను . వంశీ సమకాలీన సమాజం మీద బలే సెటైర్లు వేస్తారు మీరు . .. ఇంకా ఎక్కువగా , ఇంకా శ్రద్ధగా రాయాలని కోరుకుంటున్నా … నా విష్ ఏంటంటే ప్రతి ప్రాతినిధ్యలో మీ కథ ఉండేట్లు …

 7. Varun Komma says:

  ఈ మధ్యకాలంలో ఇంతమంచి ఇంటర్వ్యూ చదవలేదు. :)
  మంచి మాండలికం, అంతకి మించిన మంచి వచనం. కంగ్రాట్స్ వంశి. నీ ఆలోచనలు అద్భుతం.

 8. Allam Krishna Vamshi says:

  చానా చానా ఖుషీగ ఉంది… ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు… మీరు చూపించిన అభిమానానికి నిజంగ అసల్ నాకియ్యాల ఆకలే ఐతలెదు… అంత ఖుషీగ ఉంది… చానా చాన థ్యాంక్స్ అందరికీ..

  సామాన్య మేడం గారూ, మీరిచ్చే కరేజ్ ఎప్పటికీ మరిచిపోలేను.. రుణపడుతున్నట్టున్నా మీకు నిజంగా.. :)
  & మీ ప్రాతినిధ్య లో చోటు దొరకడం అంటె “లిట్రల్లీ” ఆ యేడాది మన లోకల్లో నోబుల్ కొట్టినట్టే అండీ..

 9. Praveena says:

  మస్తుగుంది :)

 10. vamshi krishna madishetty says:

  allam… allam tea antha bagundhi ra…
  nice ra.. aa pilagadu and dog story baagundi..

 11. బాగుంది వంశీ గారూ… కథల పిచ్చి ఉన్న మా లాంటి వాళ్ళకి భలే నచ్చిన వాక్యం – “కడుపు నిండుగా తిన్నా కానీ, నోట్లో ఇంకా ఆకలవడం” అన్న కాన్సెప్టు నువ్వెప్పుడన్న విన్నవా?” :)

  • Allam Krishna Vamshi says:

   చానా చానా థ్యాంక్స్ మేడం.. ఫుల్ హ్యాపీ :)

 12. చందు తులసి says:

  వంశీ గారు మీ రచనా శైలి సూపర్ . మీ లాంటి కొత్త తరం రచయితలు రావడం సంతోషం . ఇంకో యాభై ఏళ్ళు తెలుగు కథకు ఢోకా లేదనిపిస్తోంది. నేను మీ ఐస్ క్యూబ్ ఎన్ని సార్లు చదివినా కరిగిపోవడం లేదు. ….

  • Allam Vamshi says:

   కొత్త రచయితలపై మీ అభిమానానికి మనస్పూర్థిగా ధన్యవాదాలు చందు తులసి గారు.
   ఐతే, ఐస్ క్యూబ్ కథ రాసింది నెఅనుకాదు, తను వమ్శీధర్ రెడ్డి గారు.. మీరు చెప్పినట్టుగా చానా మంచి రచయిత…

 13. D Uday Bhanu says:

  వంశీ కిరాక్ రాశ్నవ్పో . రాసుడు మస్తుగ రాస్తరు గని గిట్ల రాయాలె బై. తెలుగుల ఒక పెక్యులర్ టోన్ నీది. భవిష్యత్కు భరోసానిస్తున్నవ్ పో. బై. ఉంట. ఉదయ్, హెచ్.సీ.యూ.

  • Allam Vamshi says:

   అన్నా.. పనిగట్టుకొఅని చదివి, ఇంట మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చినవ్.. దిల్ ఖుష్ అన్నా…థ్యాంక్యూ… :)

 14. P Mohan says:

  మస్తుగ రాసినవ్పో బిడ్డ. ఇంత కమ్మగ, పావురంగ రాసుడు గీ నడుమ సూల్లె.

  • Allam Vamshi says:

   ఎంత తియ్యని మాట అన్నారు సార్.. కడుపు నిండిపోయింది.. థ్యాంక్యూ సర్..

 15. srinivasarao says:

  బావుంది వంశీగారు మీ రాత నాచే చదివించింది.

 16. Dr. Vani Devulapally says:

  మాండలికం బావుంది వంశీ గారు! అభినందనలు !

 17. వంశి బాగున్నావా? నీ అభిప్రాయాలూ చదివాను .బాగున్నాయి .అల్లం రాజన్న కు కథలో నీవు కొనసాగింపు కావాలని ప్రజల ఆశ .

  • Allam Krishna Vamshi says:

   నమస్తె సార్… నేను మంచిగున్న, మీరెట్లున్నరు?

   మీలాంటివాళ్లు ఇట్ల ప్రోత్సహించాలెకని ఏదైన సాధ్యమే సర్. :)
   బహొత్ బహొత్ షుఖ్రియా..

 18. అద్భుతం… కధ మన తో మనం మాట్లాడుకున్నట్లు వుంటుంది … మనసు లాగేసావు తమ్ముడూ …..దీర్గాయురస్తూ … నీకు …. నీ కధ కు ….

 19. మమత కొడిదెల says:

  భలె. చదువుతున్నంత సేపు, ఇది రాస్తున్నప్పుడూ చిర్నవ్వుతూనే వున్నా. It was fun and thought provoking at the same time – మీ కథలన్నింటిలాగే.

మీ మాటలు

*