భావం నుంచి బాహ్యంలోకి ప్రయాణం..

 జయశ్రీ నాయుడు 
jayasriఒక కవిత రూపు దిద్దుకునే క్షణాలు బహు చిత్రమైనవి. ఒక ఘటన లేదా అనుభూతి, ఒక ఆలోచన — అతి సూక్ష్మ తరంగం గా మనసులో స్థిరపడి, మర్రి విత్తు మహా వృక్షమైనట్టు బాహ్యాంతరంగాలను ఆక్రమిస్తుంది.దాని పరిధిని అధిగమించలేని నిస్సహాయత కొంత, అందులోని ఆనందమో, అవేదనో, ఆత్మార్పణో, భావ పరమావధిని తెలుసుకొమ్మన్న అంతర్గత వేధింపో, ఇక తెల్ల కాగితమ్మీద అక్షరాలుగా అనువదించుకోవలసిందే.  కోడూరి విజయ కుమార్ గారి ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటం లోని ** తిరిగి జన్మిస్తావు** కవితని ఆయన సిగ్నేచర్ కవితగా తీసుకోవచ్చు.
 
 ఒక కవిత రాసే ముందు ఆయన మనసు పడే తపన, చేసే తపస్సుని వర్ణించారిక్కడ. భావాన్ని పైపైన తేలికగా మోసుకొచ్చే పదాలకీ, అంతరంగాన్ని చీల్చి, తన్ను తాను నిక్కచ్చిగా ఆవిష్కరించుకునే కవితా వేశానికీ – గీతానికి, భగవద్గీతానికి వున్నంత వ్యత్యాసముంటుంది. విషాదం నుంచే మహోన్నత కళావిష్కరణలు జరిగేది. అక్షరాల్లోని ఆవేదనే కవి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే తరుణం, తనలో తానుగా కనుగొనే సత్యం. అదే కవితా తపస్సు.
 ఇక మనం చర్చించుకునే *తిరిగి జన్మిస్తావు*కవిత విషయానికొస్తే…
 “బాధ” అనే  మన: స్థితి ఎప్పుడూ వర్ణనకు అందనిదే. గాయాలు ఎవరు చేసినా తొలి గాయం కవికి తనకు దొరకని ప్రేమని చెప్పుకుంటాడు . తల్లిదండ్రులు,  భార్య , రక్త సంబంధీకులు,  ఎవరు చేసిన గాయమైన తన తొలినాళ్ళ ప్రేమ వైఫల్యపు గాయం తరువాతే.
  ” ఇంతకీ నిన్ను చిద్రం చేస్తూ
బాధ బయటపడే ఆ చిత్రమైన సందర్భం లో ఎలా వుంటావు…”
అని అతని అంతరాత్మే ప్రశ్నించినపుడు…
అతని ఎదురుగా వున్న తెల్ల కాగితం లోతైన బావిలా అనిపిస్తుంది
వేళ్ళ నడుమ వున్న పెన్ను కవిని ముక్కలుగా ఖండించి లోలోని బాధను పెకలించే ఖడ్గంలా వుంటుంది
ఇక యేళ్ళ తరబడి కూడబెట్టుకున్న పద సంపద (కవులకు అవే కదా సంపదలు), బాధని పద్యం చెయ్యగలనన్న అహంకారం నీరవుతుంది.
 ** ఇక అప్పుడేం చేస్తావు నువ్వు?
అన్న ప్రశ్న అంతరాత్మలో సవాల్ చేస్తుంది
“ఇపుడిపుడే భాషని నేర్చుకునే వాడిలా
ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తూ….”
తనని తాను అనువదించుకుంటాడు, తనను వేధిస్తున్న బాధనుండి విముక్తుడవుతాడు.
అక్కడితో వృత్తం పూర్తి కాదు. భావాలన్నవి విశ్వజనీనమైనవి కొన్ని వున్నాయి. కవిత్వంగా  అల్లుకునే ఉదాత్త భావాలు కవి లో పుట్టాక, కవిత గా అనువాదమయ్యాక, పఠిత కళ్ళలోనుండి మెదడుకో మనసుకో అనుసంధానం ఐనపుడు ఆ పదావిష్కరణకు పరిపూర్ణత. అదెలా జరుగుతుందో కూడా విజయ కుమార్ గారిలా చెప్తారు..
నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
నీవు తిరిగి జన్మిస్తావు.
ఒక కవి – భావం నుంచి భాహ్యం లో ప్రయాణించి, మళ్ళీ మరో భావం గా లీనమవ్వడంతో ఆ కవిత ఒక సార్థకతని సాధించుకున్నట్టే.
 పూర్తి కవిత ఇక్కడ…
శీర్షిక: తిరిగి జన్మిస్తావు
కవి: కోడూరి విజయకుమార్
ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటి నుంచి
 
ఒక్కో సారి నీ స్థితి బహు చిత్రంగా మారిపోతుంది
లోపల సుడులు తిరుగుతోన్న బాధ ఒకటి
ఇంకా లోపలే వుండలేక బయటపడే ప్రయత్నంలో
నిన్ను చిద్రం చేస్తూ వుంటుంది
 
 
బాధ ఏదయితేనేం?
గాయం ఎప్పటిదైతేనేం?
 
***
 
బహుశా, కవిత్వం లోకమైన వాళ్ళ తొట్ట తొలి గాయం
దొరకని ప్రేమ చేసినదే కావొచ్చు
ఇక ఆ తదనంతర గాయాలంటావా…
అవి నీ తలిదండ్రులకు నీవు చేసిన  గాయాలు కావొచ్చు
 లేక, నీ తోడబుట్టిన వాళ్ళకో, నీవు కట్టుకున్న స్త్రీకో, నీ పిల్లలకో
నీవు చేసిన గాయాలు కావొచ్చు
కొన్నిసార్లు వాళ్ళు నీకు చేసిన గాయాలు కూడా…
ఇంతకీ నిన్ను చిద్రం చేస్తూ
బాధ బయటపడే ఆ చిత్రమైన సందర్భంలో ఎలా వుంటావు?
 
 
ఎదురుగా వున్న తెల్ల కాగితం
నువ్వు దూకితే మింగి వేసే లోతైన బావిలా వుంటుంది
వేళ్ళ నడుమ వున్న పెన్ను
నిన్ను ముక్కలుగా ఖండించి
లోన వున్న బాధని పెకిలించే ఖడ్గంలా వుంటుంది
 
 మరీ దయనీయ స్థితి ఏమిటంటే
నీవు యేళ్ళుగా నేర్చుకున్న అక్షరాలు
నీ భాష, నీ పద సంపద, నీ అలంకారాలు
బాధని పద్యం చేయగలనన్న నీ అహంకారాలూ
అన్నీ అన్నీ
నిన్నొక అనాథని చేసి వెళ్ళిపోతాయి
 
అయినా సరే
లోన మెలిపెడుతోన్న బాధ జాలి పడి
ఇక అప్పటికి నిన్ను వొదిలేసి వెళ్ళదు కదా
జోలెలో గుప్పెడు గింజలు వేసేదాకా వొదలక
గుమ్మం ముందు నిలబడి, వొంటిని కొరడా దెబ్బలతో
గాయ పర్చుకునే పెద్దమ్మల వాడి లాగా
నిన్ను కట్టడి చేస్తుంది కదా
 
ఇక అపుడేం చేస్తావు నువ్వు?
ఇపుడిపుడే భాషని నేర్చుకునే వాడిలా
ఒక్కొక్క అక్షరాన్నే కూడబలుక్కుంటూ
ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తూ
ఒక్కొక్క ముక్కగా నిన్ను నీవు ఖండించుకుంటూ
అలా ఆ లోతైన బావిలోకి మునిగిపోయి
ఇక ఈ రాత్రికి ఈ బాధ నుండి విముక్తమౌతావు
 
నీలాంటి ఒకడు
నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
నీవు తిరిగి జన్మిస్తావు
~~

మీ మాటలు

 1. ఆర్.దమయంతి. says:

  ‘నీలాంటి ఒకడు
  నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
  నీవు తిరిగి జన్మిస్తావు’
  నిజంగా చాలా బావున్నాయి ఈ వాక్యాలు. ఏ కవికైనా ఇది అనుభవైద్యకమే కాదు? కవి కి అభినందనలు.
  కవితా పరిచయం, విశ్లేషణ చాలా బావుంది జై. మళ్లీ మళ్లీ చదవేంత అందంగా వుంది.
  నీకూ శుభాభినందనలు.
  ఇలానే తరచూ రాయకూడదూ సమీక్షలని?
  :-)
  అల్ ద బెస్ట్.

 2. mythili abbaraju says:

  చాలా చాలా అందమైన విశ్లేషణ జయశ్రీ గారూ…

 3. c.v.suresh says:

  అబిన౦దనలు… కవి గొప్పతన౦ సహజ౦. అయితే, ఆ కవి రాసిన కవిత లోకి ప్రవేశి౦చి…. కవి జారవిడిచిన అనుభూతులు… కన్నీల్ళు.. కష్టాలు.. అనుభవాలు.. స్ప౦దనలు వెతికి వెతికి .. వాటికి అక్షరాలను కుట్టి.. కవి మనసు దొర్లిన ప్రతి చీకటిలో..ప్రతి వెలుగులో విశ్లేషకులుగా విహరి౦చి విశ్లేషి౦చి రాయడ౦ .. తో.. ఆ కవి గొప్పతన౦.. ఆ కవిత లోని ఆ౦తర్య౦ మరి౦త అద్భుత౦గా బయటపడుతు౦ది. కవి నిజ౦గా స౦తోషి౦చే రోజు.. చాలా బాగా రాశారు.. ! ఒక కవిగా కోడూరు విజయ కుమార్ గారి మనసు నిజ౦ చెప్పాల౦టే తుళ్ళి పడే రోజు..! క౦గ్రాట్స్.. Jayashree Naidu గారు…!

 4. kalyani vutukuri says:

  కవిత ఎంత బావుంది .. మనసుకి చాల దగ్గరగా అనిపించింది ముఖ్యం గా ఆ చివరి వాక్యం ..నీలాంటి ఒకడు
  నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు నీవు తిరిగి జన్మిస్తావు.. ఎంత బావుందో తెలుసా .. అలసిపోయి పరిగేడుతున్నప్పుడు… నిన్ను అదాటున హత్తుక్కున్నట్టు . ఏమి కావాలి ఇంతకన్నా , రోజు కో కవిత దాన్ని పంచుకునే మనుషులు తప్ప .కవి అంతరంగం లోకి పరకాయ ప్రవేశం చేసి .. ఆ అనుభవాన్ని విశ్లేషించి , నలుగురుకి ఆ రుచి ని చూపిస్తున్న మీ’ అద్దం లో నెలవంక ‘ ప్రతి వారం ఒకో నేలవంకని ముచ్చటగా చూపిస్తుంది అచ్చగా మాకు నచ్చిన విధం లో కాకుండా దగ్గరవుండి మీ మాటల అద్దం లో నించి చూపించడం మరింత ఆహ్లాదం గ ఉంది .

 5. dasaraju ramarao says:

  కోడూరి అన్తర్ముఖీన ,సత్యశోదిత కవి. నిక్కచ్చి కవితావేశపరుడు. సరిగ్గా చెప్పారు , జయశ్రీ గారు … ఇద్దరికీ అభినందనలు..

 6. కోడూరి విజయకుమార్ says:

  జయశ్రీ గారు …
  బాధని కవిత్వం చేయడం సంగతేమో గానీ
  ఒక్కోసారి పట్టరాని సంతోషాన్ని ఒకట్రెండు వచన వాక్యాలలోకి అనువదించడం కూడా కష్టమే !
  నా మరొక కవిత పైన మీరు రాసిన ఈ వ్యాసం చదివేక నా మనః స్థితి ఇది !
  ముఖ్యంగా, ఈ కవితని నా సిగ్నేచర్ కవిత అనడం నాకు మరింత ముచ్చటగా వుంది –
  మంచి సాహిత్య అభిరుచి వున్న మీ లాంటి వారు ఇట్లా నా కవిత్వం గురుంచి రాయడం నా అదృష్టం ….
  మరొక మారు మీకు నా కృతజ్ఞతలు !!

 7. Kcube Varma says:

  నీలాంటి ఒకడు
  నీ పద్యాన్ని ప్రేమతో హత్తుకున్నపుడు
  నీవు తిరిగి జన్మిస్తావు.

  ఈ వాక్యం చాలుకదా కవికి . మీ విశ్లేషణ ఆత్మీయంగా హత్తుకుంది మాడం. ఇరువురికి అభినందనలు.

 8. m.viswanadhareddy says:

  గట్టు పై నుంచి ఎంత లొపలకి తొంగి చూసినా భావి లోతు తెలియదు . మునగాలి . ఊపిరి ఆడనంతగా అందులో
  గిలగిల కొట్టుకోవాలి గట్టు పైకి వచ్చి లోకాన్ని తేరిపార చూసినప్పుడు .ఒక భయం కలగాలి .ఒక దైర్యం పుట్టాలి . ఒక వెలుగు కనిపించాలి అలాంటి వెలుగు మీ కవితలో పురుడు పోసుకుంది .అగ్ని కణం వికసించాలంటే అంత యాతన పడాలి మరి . ఖండనలోనే విముక్తి .అభినందనలు

 9. vani koratamaddi says:

  అద్భుతమైన కవిత, మీ విశ్లేషణలో మరింత అద్భుతంగా ఆవిష్కరించారు జయశ్రీ నాయుడు గారు

మీ మాటలు

*