నాలుగో సహస్రాబ్ది స్పేస్ ఒపేరా “కుజుడి కోసం”

కొల్లూరి సోమ శంకర్

 

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమశంకర్

ఆకాశం’ మనిషికి ఎప్పుడూ ఉత్తేజాన్నిస్తుంది. మాములు జనాలకి నీలి ఆకాశం ప్రశాంతతని అందిస్తే, జిజ్ఞాసువులలో ఎన్నో ప్రశ్నలు రేక్తెత్తిస్తుంది. నాలో ఏముందో తెలుసుకోండంటూ సవాలు విసురుతుంది.  శూన్యం తప్ప అక్కడేం లేదని తెలిసినా మనిషి అన్వేషణ ఆగదు. శూన్యంలో భూమికి పైన ఎంతో ఎత్తులో ఉండే అంతరిక్షం పట్ల కుతూహలం అంతరించదు. మొదట చందమామ, ఆ తర్వాత ఇతర గ్రహాల పరిశోధన కొనసాగిస్తున్నారు. చంద్రుడి తర్వాత, ఖగోళంలో మనిషిని ఎక్కువగా ఆకర్షించింది కుజ గ్రహమేననడంలో ఎటువంటి అనుమానం లేదు.

శాస్త్రవేత్తలు శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తూ, అన్వేషణలు జరుపుతుంటే రచయితలు ఫిక్షన్ ద్వారా సైన్సు పట్ల పాఠకులలో ఆసక్తిని పెంచుతారు. సైన్సు ఫిక్షన్‌లో రచయితలు ఊహించిన కల్పనలెన్నో తరువాతి కాలంలో నిజమయ్యాయి. గత శతాబ్దంలో సైన్స్ ఫాంటసీలనుకున్న ఎన్నో కల్పనలు ఈ శతాబ్దంలో ఫాక్ట్స్ అయిన సంగతి అందరికీ తెలిసినదే.

ప్రముఖ వైద్యులు డా. చిత్తర్వు మధు వైద్యం నేపధ్యంతో ‘ఐసిసియు‘, ‘బై బై పోలోనియా‘, ‘ది ఎపిడమిక్‘ వంటి నవలలు రాసారు. తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాసే అతి కొద్ది మంది రచయితల్లో మధు గారు ఒకరు. ఏలియన్స్,  గ్రహాంతర ప్రయాణాలు, రోబోలు, కాలంలో ప్రయాణం… వంటి ఇతివృత్తాలతో రచన చేసి పాఠకులను మెప్పించడం అంత సులువు కాదు. ఖగోళశాస్త్రంపై ఎంతో ఆసక్తి, అవగాహన ఉన్న మధు గారు శాస్త్ర విజ్ఞానాన్ని, ఊహని మిళితం చేసి “కుజుడి కోసం” అనే సై.ఫి రాసారు. స్థూలంగా ఈ నవల కథ ఇది:

కథాకాలం నాలుగో సహస్రాబ్ది 3260. అణుయుద్ధాలూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమిలో చాలా భాగం నశించి మనుషులు ఇతర గ్రహాలకి వలస వెళ్ళి అంతర్‌గ్రహ నాగరకత విలసిల్లుతున్న రోజులు. వెనకబడిన భూమి నుంచి  గ్రహాలకి వలసపోయే ప్రజలూ, స్పేస్ ప్లాట్‌ఫారంలూ, వివిధ జాతుల మానవులూ, మానవులని పోలిన హ్యుమనాయిడ్స్…. అది ఒక సరికొత్త విశ్వం! భూగ్రహంలోనూ అంతర్‌గ్రహ యానాలు, సమాచార వ్యవస్థా, వైద్య రంగాల్లో  మానవులు ఎంతో ప్రగతిని సాధించారు. ఇంటర్ గెలాక్టిక్ ఫోన్లు, సెవెన్త్ జనరేషన్ రోబోలు, ఇంటర్‌ గలాక్టిక్ నెట్, కాంతివేగంతో ప్రయాణించే అంతరిక్ష నౌకలూ…. ఇలా ఎంతో అభివృద్ధి చెందినా మనిషి భావాలు, ఆలోచనలూ, వ్యక్తిత్వమూ మాత్రం పెద్దగా మారలేదు.

అసలు ఈ నాలుగో సహస్రాబ్ది చాలా వింతైన కాలం. ఒకపక్క అద్భుత విజ్ఞాన సాంకేతిక ప్రగతి. మరొకపక్క ఆధ్యాత్మిక మంత్రశక్తులు. ఇదివరకు విజ్ఞాన శాస్త్రంలో తెలియని విశ్వశక్తిని మనుష్యుడు మేధస్సుతో వశపర్చుకోవడం – రెండూ అద్భుతమైన మార్పులే! విశ్వశక్తి (Universal Force) అనేది ఈ నాలుగో సహస్రాబ్దిలోని ఒక అద్భుతమైన, అర్ధంకాని పరిణామం. విద్యుదయస్కాంతశక్తీ, భూమ్యాకర్షణశక్తీ, అణుశక్తీ తర్వాత, ఈ విశ్వశక్తి అనేది కొత్తగా కనిపెట్టబడి, మాంత్రికులచేత స్వాధీనంలోకి తెచ్చుకోబడింది. ఈ శక్తి భూమిలో విజ్ఞాన శాస్రవేత్తలకి ఎవరికీ తెలియదు.

కథా నాయకుడు హనీ మధ్య ఆసియాలోని ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి సయోనీ అనే అందమైన కుజ యువతి కలలోకి వస్తుంటుంది. ఆమెని చూడాలనే కోరికతో కుజగ్రహం చేరుకున్న అతని జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. సయోనీ అద్భుత శక్తులున్న ముసలి మంత్రగత్తె అనీ, ఒక పిచ్చి అన్వేషణలో తనను కుజ గ్రహానికి రప్పించగలిగిందని హనీ గ్రహిస్తాడు. తన తండ్రికీ, తనకి అమరత్వం సాధించాలనే కోరిక తీర్చుకోడానికి హనీని ఉపయోగించుకోవాలనుకోవాలనుకుని అతడిని కుజగ్రహానికి వచ్చేలా చేస్తుంది.

Dr.ChittarvuMadhu2

హనీకి విశ్వాంతరాళపు విశ్వశక్తిని అదుపులోకి తెచ్చుకోగలిగే ప్రత్యేకమైన శక్తులు వున్నాయనీ, అతనికి తెలియకుండనే అతనికి కాస్మిక్‌ ఎనర్జీ, దానికి ప్రతిస్పందించగలిగిన ప్రకంపనలు అతని మెదడులో, శరీరంలో వున్నాయనీ, తను మాత్రమే ఆ అమరత్వ శక్తిని సంపాందిచగలడని ఒత్తిడి చేస్తుంది. ఆమె తండ్రి, అరుణభూముల చక్రవర్తి సమూర హనీని బెదిరిస్తాడు. షాక్‌ తిన్న హనీ – చక్రవర్తి ఆశయసాధనలో తానేం చేయాలో అడుగుతాడు.  బదులుగా చక్రవర్తి – ”హనీ! నువ్వొక గొప్ప శాస్త్రవేత్తవి. మంత్రశక్తులు కలిగిన గొప్ప మానవుడివి. అయితే నీ శక్తి నీకే తెలియదు! నీకు ఇంకా మంత్రశక్తిని సాధించే శిక్షణ ఇచ్చి ఒక ముఖ్యమైన లక్ష్యసాధన కోసం పంపుతాను. భూమి, గురుగ్రహం, శని ఉపగ్రహం టైటాన్‌, కుజుని మానవ కాలనీ – ఇంకా అరుణ భూముల నుంచి ఎన్నుకుని, వాళ్ళ మనసులని ప్రభావితం చేసి ఇక్కడికి తీసుకువచ్చిన కొందరి వ్యక్తులకి నువ్వు నాయకత్వం వహించాలి. వాళ్ళందరూ కూడ నీ వలెనే అద్భుత శక్తులు కలిగివున్నవాళ్ళు. అయితే నువ్వు నాకు, సయోనీకి విశ్వాసపాత్రుడిగా వుండాలి. విశ్వశక్తిని వశపర్చుకుని ఉపయోగించే నేర్పు సంపాదించుకోవాలి నువ్వు. మా కోసం అమరత్వం ప్రసాదించే మహా ఔషధం తీసుకుని రావాలి! ఆ విషయంలో తప్పక కృతకృత్యుడిని కావాలి!” అని చెబుతాడు.

గత్యంతరం లేక, అందుకు అంగీకరించి, విశ్వశక్తి అనబడే ఆ మంత్రవిద్యలో కొంత పట్టు సాధిస్తాడు హనీ. రకరకాల ఇబ్బందులు ఎదుర్కుని ఒలంపస్ శిఖరంపై దాచబడ్డ అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని సంపాదిస్తాడు. ఇదే సమయంలో కుజునిలో నివసిస్తున్న మానవ కాలనీకీ, అదే గ్రహంలో అరుణ భూముల రాజ్యంలో ఉన్న మాంత్రికులకీ ఎప్పటినుంచో ఉన్న ఆధిపత్య పోరు మళ్ళీ రగులుకుని ఓ మహా యుద్ధంగా మారుతుంది.

ఏ సహస్రాబ్దిలోనైనా యుద్ధం భయంకరమైనదీ, మానవత్వానికి వ్యతిరేకమైనదే! మనిషి మనిషిని చంపుకోవడం – దానికోసం వివిధ రకాల సిద్ధాంతాలు, సంజాయిషీలు చెప్పుకోవడం, అనేక విధాల ఆయుధాలు వాడటం – ఇది అప్పటికీ, ఇప్పటికీ ఎప్పుడూ జరుగుతున్నదే! అసలు యుద్దమే ఒక నేరం! మాంత్రికులు ఎంత క్రూరులో మానవులు కూడా అంతే క్రూరులు, చెడ్డవారు. చిత్రహింసలు, జైలు… మళ్లీ గొప్పగా, నిబంధనలు పాటిస్తున్నట్లు మాట్లాడటం. ఎన్ని యుగాలు, సహస్రాబ్దులు గడచిపోయినా, యుద్ధాలలో ఈ ప్రవర్తనలన్నీ మారనే లేదు.

నాలుగో సహస్రాబ్దిలో కుజునిలో మానవులకీ, మాంత్రికులకీ జరిగిన ఈ యుద్ధం కూడా అలాంటిదే! అయితే ఈ సహస్రాబ్దిలో యుద్ధాలలో కొన్ని విశేషాలున్నాయి. మానవుల దగ్గర ఇదివరకటిలాగానే అణ్వాయుధాలున్నా వాటిని ఆఖరి ఆయుధాలుగానే వాడుతున్నారు. దానివల్ల గలిగే ప్రాణనష్టం, రేడియో ధార్మిక శక్తివల్ల వచ్చే అపాయాలూ అనేకం! మానవులు యుద్ధాల్లో ప్రాణనష్టం జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దీనికి ఒక పద్ధతి ఏమిటంటే సైనికుల స్ధానంలో రోబోలని వాడటం. వాటిని రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేయించడం! కానీ మానవుల హైటెక్‌ యుద్ధం చేసే యంత్రాంగమంతా, ఎవరికీ తెలియని విశ్వశక్తి అనే మాంత్రికుల శక్తి ముందు ఓడిపోతుంది. అదే సమయంలో నానా తిప్పలు పడి హనీ, ఆ ఔషధాన్ని సమూరికి అందజేస్తాడు. అయితే ఆ ఔషధం తాగిన వారికి మంత్రశక్తులన్నీ నశిస్తాయన్న నిజం దాచిపెడతాడు. ఆ ఔషధం తాగిన సమూరా, తన ప్రత్యర్థి కుజుడి మీది మానవుల కాలనీ అధ్యక్షుడైన కాన్‌స్టాన్‌టైన్‌‌ని వెక్కిరిస్తాడు.

బదులుగా, మంత్రశక్తులు ఉపయోగించకుండా తనతో ద్వంద్వయుద్ధం చేసి ఓడించమని సమూరాని రెచ్చగొడతాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. ఆ ఔషధం తాగిన ప్రభావంతో సమూరా మంత్రశక్తులు క్షీణించి, ద్వంద్వయుద్ధంలో పరాజితుడై పారిపోతాడు సమూరా. కుజుడి మీద మానవులు, మాంత్రికుల మధ్య సంధి కుదురుస్తాడు హనీ. అరుణభూములకు రాజుగా తన మిత్రుడయిన మీరోస్‌ని ప్రతిపాదిస్తాడు. అందరూ ఆ ప్రతిపాదనకి అంగీకరిస్తారు. హనీ గౌరవార్థం  గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. హనీకి కానుకగా – అమృత ఔషధం కోసం ఒలంపస్ పర్వత శిఖరానికి వెళ్ళిన బృందంలోని రోబోని కానుకగా ఇస్తాడు కాన్‌స్టాన్‌టైన్‌‌. కుజుడి లోని మానవ కాలనీ సైన్యాధ్యక్షుడైన గ్యాని ఆన్‌ గారక్‌ పశుశాలలో జంతురూపంలో బందీలుగా ఉన్న ఏనిమాయిడ్‌, డిమిట్రీ, పోసయిడన్‌‌లను విడిపించే క్రమంలో జనరల్ గ్యాని సైనికులతో పోరాడుతాడు హనీ. ఎలాగొలా సైనికులను తప్పించుకుని అంతర్‌గ్రహ కౌన్సిల్‌ మరియు అంతర్‌ గెలాక్టిక్‌ కౌన్సిల్ శరణు పొందుతారు. ఆయా గ్రహాల అధికారుల సహాయంతో ఏనిమాయిడ్‌ని గురుగ్రహపు ఉపగ్రహమైన గ్వానిమెడ్‌కి; డిమిట్రీ, పోసయిడన్‌‌లను శనిగ్రహపు ఉపగ్రహమైన టైటన్‌కి పంపే ఏర్పాట్లు చేస్తాడు హనీ. అలాగే, భూ గ్రహనికి చెందిన అధికారులు కూడా హనీ నేరస్తుడు కాదనీ, శరణార్థి అని నిర్ధారించి భూమికి పంపుతారు.

ప్రేమ కోసం బయలుదేరిన హనీ తన గురించి కొత్త విషయాలు తెలుసుకోడం, అద్భుత శక్తులు సంపాదించడం, కొత్త లక్ష్యంతో భూమికి తిరిగి రావడంతో కథ ముగుస్తుంది. కథాక్రమంలో కుజగ్రహం గురించి ఎన్నో శాస్త్రీయ వివరాలు అందించారు రచయిత.

పాఠకుల చేత ఔరా అనిపించుకున్న ఈ కథకి కొనసాగింపు (సీక్వెల్) ”నీలీ ఆకుపచ్చ భూమికి తిరిగిరాకకినిగె పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతోంది. తాజా ఎపిసోడ్‌ని ఈ లింక్‌లో చదవచ్చు.

వాహిని బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన “కుజుడి కోసం” ప్రింట్ పుస్తకం నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ వారి వద్ద, రచయిత వద్ద, కినిగెలోనూ లభిస్తుంది. 228 పేజీల ఈ పుస్తకం వెల రూ. 150/-. ఈ-బుక్ కినిగెలో లభ్యం.

 

 

Dr. C. MADHU, M.D.

Consultant Physician & Cardiologist

Vijaya Medical & Heart Clinic

2-2-23/2, SBH Colony,

Behind CTI, Bagh Amberpet,

Hyderabad – 500 013

e-mail : madhuchittarvu@yahoo.com

 

మీ మాటలు

  1. Madhu Chittarvu says:

    రాసిన నవల కి మంచి విశ్లేషణ దొరకడం మహదానందం ఏ రచయిత కైనా! పూర్తి గా చదివి బాగా అర్ధం చేసుకుని రాసిన రివ్యూ ఇది.కొల్లూరి సోమశంకర్ మంచి కథా నవలా రచయిత ,ఇంకా గొప్ప అనువాదకుడు .అతని నుంచి నా “కుజుడి కోసం ” స్పేస్ ఓపెరా అనబడే సైన్స్ ఫిక్షన్ ప్రక్రియ లాగా రాసిన నవలకి మంచి పరిచయం దొరకడం ఎంతో సంతోషం గా ఉంది.అతని కి ధన్య వాదాలు. దీనికి కొనసాగింపు “నీలీ ఆకుపచ్చ”కినిగే అంతర్జాల పత్రిక లో 18 వారాలు గా ప్రచురితం అవుతోంది. తెలుగు లో సైన్స్ ఫిక్షన్ అంతరిక్ష సాహిత్యం భారతీయ నేపధ్యం తో రాయాలనే తపన తో రాసిన నవలలు ఇవి. కాని తెలుగు వారికి సైన్స్ ఫిక్షన్ అంతగా నచ్చదేమో!లేదా అది నా వైఫల్యమో !
    దీనికి ఆఖరి ముగింపు నవల “డార్క్ అవుట్ పోస్ట్స్ ” తో ఈ సైన్స్ ఫిక్షన్ అంతరిక్ష నవలా త్రయాని కి ముగింపు పలుకుతాను .అప్పుడు కాని నాకు ఈ అంతరిక్ష సాహిత్య “పిచ్చి ” వదలదు. నేను కూడా అందరి లాగా ప్రేమ అనుభూతీ సాంఘిక వాస్తవాలు అస్తిత్వం కలిసిన చిన్న కధలు రాసుకుంటాను….అవకాశం ఉంటే !

  2. Bhavani says:

    మీతో పోల్చుకోలేను గానీ , ఎంతో శ్రద్ధతో ఆసక్తితో వ్రాస్తున్నప్పుడు సరైన స్పందన లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు సర్ , సై ఫై కథలు నాకు చాలా ఇష్టం . ఆ రంగంలో ఇంత విస్తృతంగా వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు

  3. Madhu Chittarvu says:

    చాలా థాంక్స్ భవాని గారూ !

  4. కీప్ రైటింగ్ – తెలుగు లో మీరేనేమో ఈ జెనెరే లో వ్రాస్తున్నది

మీ మాటలు

*