కలల దిక్కు

నారాయణ స్వామి వెంకట యోగితొలిపొద్దు కరస్పర్శకు
రెక్కల్ని విచ్చుకున్న
పిట్టల  కొత్త  రాగాల
పాటలు.

యుగాల  యెడబాటులోంచి

గరుకు కొమ్మల చేతులు చాచిన
ఫోర్సీథియా పసుపు పచ్చని పూల
మెత్తని కౌగిళ్ళు.

పచ్చని గడ్డి  వొడిన
వెచ్చగ నిలిచిన
నీటి బిందువుల
ఆత్మీయత.

నింగిన మెరిసే నెమలీకల
వెల్తురు పింఛాల నులివెచ్చని
వింజామరలు.
సుదీర్ఘ శీతల  రాత్రుల
కఠోర తపస్సు లోంచి

డాఫడిల్స్
తొలిపొద్దు గాలులపై వర్షించే
పరాగపు పెదవుల ముద్దులు.

వాకిట్లో
మొండి మంచు కరిగిపోయి,

పూలు విదిల్చిన మాగ్నోలియా
ఆనంద నృత్యం.

యెడతెరిపిలేకుండ  వొణికించిన  చలిలో
ఆపుకున్న యెన్నాళ్ల దుఃఖమో,
జుట్టు విరబోసుకున్న వీపింగ్ చెర్రీ
పూల శోకమై కలబోసుకునే
శతాబ్దాల ముచ్చట్లు.

అస్తి పంజరాల్లా భయపెట్టిన
చెట్ల చేతివేళ్ళకు చిగుర్లతో,
హృదయాల  కాలింగ్ బెల్ మోగిస్తుంది
వసంతకాలం.

పిట్టకూర్పులు వదిలించుకుని
రెక్కలు టపటపలాడించి
కొత్త కలలదిక్కుగా యెగిరిపోతుంది
యిల్లు.

*

swamy1

మీ మాటలు

 1. rajaram.t says:

  కొత్త కలల దిక్కుగా ఎగిరి పోతున్న అనేక రంగులతో హరివిల్లు లా అందంగా వుంది నారాయణస్వామి గారి కవిత

 2. ఆర్.దమయంతి. says:

  యుగాల యెడబాటులోంచి

  గరుకు కొమ్మల చేతులు చాచిన
  ఫోర్సీథియా పసుపు పచ్చని పూల
  మెత్తని కౌగిళ్ళు.
  కవిత బావుందండి. అభినందనలు.

 3. చాల బాగుంది. కొన్ని తెలుగు పుష్పాలు కూడా చేర్చండి మాస్టారు.

 4. Thirupalu says:

  మీ కవిత నిజంగా కొత్త కలల దిక్కు ఎగిరి పోతుంది !

 5. వాసుదేవ్ says:

  దాదాపు ప్రతీ ప్రదాన్నీ ప్రకృతితో మమైకం చేసి తేనెచుక్కలో వర్షాన్ని కలిపి మరీ తాగించారు స్వామీ…వెల్ డన్

 6. kcube varma says:

  కవిత కలల దిక్కుగా ఎగరేసుకు పోయింది సర్ ఇప్పటికీ మీ కలం ఆ తాజాదనాన్ని అందిస్తూ వుంది. నాకా ఆంగ్ల పదాలు బోధపడలేదన్న అసంతృప్తి ఒక్కటి తప్ప.

 7. Mythili abbaraju says:

  చాలా బావుందండీ

 8. srikanth says:

  నింగిన మెరిసే నెమలీకలు
  వెల్తురు పింఛాలు
  నులివెచ్చని వింజామరలు
  పరాగపు పెదవుల ముద్దులు..
  ప్రకృతిని పెనవేసుకున్న మీ కవితాగానం చాలా బావుంది సర్.. ఓ వసంత అనుభూతిని ఇంటికి మోసుకొచ్చినట్టు..

 9. renuka ayola says:

  వాకిట్లో
  మొండి మంచు కరిగిపోయి,

  పూలు విదిల్చిన మాగ్నోలియా
  ఆనంద నృత్యం. ,,,/ఈ లైన్లు నాకు చాలా నచ్చాయి

 10. RAMARAO K J says:

  అరుడైన అందాలూ ఆనందాలు దర్శిస్తే అరుదుగా వచ్చే కవిత .మంచి ఎక్స్ప్రెషన్ బాగుంది

 11. narayana sharma says:

  ధ్వనిని,స్పర్శను కవిత్వం చేయడానికి ఒక భావ చిత్రాన్నో,పదచిత్రాన్నో గీయడానికి తదేకమైన ధ్యానం ఒకటి కావాలి…సాధారణంగా కంటికి కనిపించే దృశ్యాన్ని భావచిత్రం చేయడం ఎక్కువగా కనిపిస్తుంది..వెంకటయోగిగారు ఈ పరిధినుంచి ఒకడుగు ముందుకేసారు. కవితా సౌందర్య సాధనకు ఒక పాఠాన్ని చెబుతున్నట్టుంది.

 12. Dr.Vijaya Babu Koganti says:

  Great Keatsian Images . Inspiring sir

 13. ఇందులో కవిత్వ సౌందర్యం కళ్ళకు కట్టించారు.

 14. నారాయణస్వామి says:

  కవిత నచ్చినందుకు, నచ్చి యెంతో ప్రేమతో విలువైన వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ హృదయపూర్వక నెనర్లు!

  ఈ సారి మా దగ్గర శీతాకాలం చాలా క్రూరంగా ఉండింది – దాదాపు నెల రోజుల పైగా వాతావరణం సున్నా సెల్సియస్ ను దాటలేదు. చాలా సుదీర్ఘమనిపించిన చలికాలపు మృత్యు శీతలత్వం నుండి యెట్టకేలకు వసంతకాలం పూల కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అందుకే నా చుట్టూ విరబూసిన పూల చెట్ల పేర్లే కవిత లో వచ్చినయి. Forsythia, Magnolia, Weeping Cherry, Daffodils ఇవీ మా చుట్టూ ఉండే కొన్ని పూలచెట్ల పేర్లు. గూగుల్ చేస్తే వీటి చిత్రాలు సులభంగానే దొరుకుతాయి.

 15. balasudhakar says:

  కవిత అభివ్యక్తి కొత్త రహస్యాన్ని చెప్పిన్నట్టనిపించింది. అక్కడ పూలు పేర్లు చెప్పడం వలన కవితకి కొత్తదనం వచ్చింది కూడా అని అనిపించింది. థాంక్యూ నారాయణస్వామి గారూ. హైద్రాబాద్ లో విగ్రహాలు కూలిన సందర్భంలో రాసిన కవితలాంటింది మళ్లీ చదవాలనుంది.

 16. Narayanaswamy says:

  బాలసుధాకర్ – పద్యం నచ్చినందుకు నెనర్లు –

  అయితే మీరు విగ్రహాలు పగులగొట్టడం గురించి నేను రాసిందన్న పద్యం హైదరాబాదు లో విగ్రహాల కూల్చివేత సందర్భంగా రాసింది కాదు

 17. పిట్టకూర్పులు వదిలించుకుని
  రెక్కలు టపటపలాడించి
  కొత్త కలలదిక్కుగా యెగిరిపోతుంది
  యిల్లు.

  *
  ఈ వసంతం నవ్యంగా దివ్యంగా ఉంది. అభినందనలు.

Leave a Reply to Thirupalu Cancel reply

*