కడు చక్కనిది చిలికిన చల్ల!

 అవినేని భాస్కర్ 

Avineni Bhaskarకంటికి కనిపించిన ప్రతి దృశ్యమూ, చుట్టూ జరిగే వివిధ ఘటనలు, పచ్చిక బయళ్ళు, కొండలు, రాళ్ళు-రప్పలు, చెట్లు-పుట్టలు, ప్రాణులు, కనుమలు, గొడవలు, మనస్తాపాలు, దౌర్జన్యాలు, వేలాకోలాలు ఏవీ కీర్తనకి అనర్హం కాదన్నట్టు శ్రీవేంకటేశునికి అన్వయం చేసి పాడిన ఘనత అన్నమయ్యది.

విజ్ఞానులూ పండితులేకారు, పామరులూ చోరులూ అల్పులూ కూడా శ్రీవేంకటపతిరూపులే అన్న సర్వసమతా దృష్టి అన్నమయ్యది. కలవారింటి స్త్రీలేకారు, వారికి సేవలు చేసే దాదులనూ దాసీమణులనుకూడా అలమేలుమంగ రూపాలుగానే భావించి కీర్తనలు రాశాడు. ఒళ్ళు అలసిపోయేట్టు కష్టజీవనం చేసుకునే స్త్రీలనే కాదు, ఒళ్ళమ్ముకునే వేశ్యలుకూడా వేంకటపతి భక్తులేనని వారినీ తన కీర్తనల్లోకి ఎక్కించాడు.

అన్నమయ్యకున్న సామాజిక స్పృహ ఈ కీర్తనలో కనవచ్చు. ఇందులోని నాయిక(లు) మజ్జిగమ్ముకునే గొల్లభామ(లు). ఎంత సమయం అయినా సరే తీసుకెళ్ళిన మజ్జిగంతా అమ్మితేగానీ ఇంటికి తిరిగిరాలేదు. అమ్మి నాలుగురాళ్ళు తెచ్చుకుంటేగానీ జీవనం గడవదు మరి ఆ పేదరాలుకి. ఆమెను చూసి జాలిపడుతున్నాడు అన్నమయ్య. ఆమె అమ్ముతున్న మజ్జిగ గొప్పతనమేంటో ప్రకటిస్తూ జనాలచేత కొనిపించే ప్రయత్నం చేస్తున్నాడు కవి!

ఆమె పేదరాలే అయినప్పటికీ సౌందర్యంలో, సొగసులో మాత్రం చాలా ధనికురాలే. ఆమె అందాలను వర్ణిస్తూ, మజ్జిగను అమ్మించే యుక్తిని చూస్తుంటే నేటి advertising techniques అన్నిటికీ తాత అన్నమయ్య అనాలనిపిస్తుంది.

కొన్ని కీర్తనల్లో పైనపైన కనిపించే భావమొకటుంటుంది, అంతరార్థం మరోటి ఉంటుంది. ఈ కీర్తనలో మరో అంతరార్థం ఉంది. అదేమిటో చివర్లో చూద్దాం.

గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు అద్భుతంగా స్వరపరచి పాడిన ఈ కీర్తనని ఇక్కడ విన ఆస్వాదించండి.

AUDIO LINK : మూల మూలన అమ్ముడు చల్ల / mUlamUlana ammuDu challa

 

పల్లవి
మూలమూల నమ్ముడుఁజల్ల ఇది
రేలుఁ బగలుఁ గొనరే చల్ల

చరణాలు
పిక్కటిల్లు చన్నుల గుబ్బెత వొకతి కడుఁ –
జక్కనిది చిలికిన చల్ల
అక్కునఁ జెమటగార నమ్మీని యిది
యెక్కడఁ బుట్టదు గొనరే చల్ల

వడచల్లు మేని జవ్వని వొకతి కడు-
జడియుచుఁ జిలికిన చల్ల
తడఁబడు కమ్మనితావులది మీ –
రెడయకిపుడు గొనరే చల్ల

అంకులకరముల వొయ్యారొకతి కడు –
జంకెనలఁ జిలికిన చల్ల
వేంకటగిరిపతి వేడుకది
యింకానమ్మీఁ గొనరే చల్ల

కీర్తన మూలం : తితిదే అన్నమాచార్య సంకీర్తనల సంపుటం 5, పుట 231, రేకు 70, కీర్తన 229

తాత్పర్యం  :
వాడవాడకూ మూల మూలకూ, రాత్రనక పగలనక ఎత్తుకెళ్ళి అమ్మబడే మజ్జిగ ఇది, మీరందరు కొనుక్కుని తాగండి.

నిండైన చన్నులతో పసివయసులోనున్న అందమైన యువతి చిలికినది ఈ మజ్జిగని. ఎండలో వీధి వీధీ తిరుగడంవల్ల ఆ గొల్లభామ గుండెలపైన చెమటలు కారిపోతున్నాయి. ఈ మజ్జిగ వెనక ఇంత శ్రమ ఉంది. ఆలస్యం చేస్తే ఇలాంటి మజ్జిగ దొరకదు, త్వరపడి ఇప్పుడే కొనుక్కోండి.

తాపాన్ని వెదజల్లే అందమైన దేహంగల అందగత్తె ఒయ్యారంగా కదులుతు చిలికినది ఈ మజ్జిగని. దారిన వెళ్ళేవారిని తడబాటుకు లోనుచేసే కమ్మని సువాసనగల మజ్జిగ ఇది. దాటెళ్ళిపోకుండా కొనుక్కోండి.

చిగురుటాకులవంటి చేతులున్న వొయ్యారి భామ ఎంతో భయభక్తులతో చిలికినది ఈ మజ్జిగని. వేంకటగిరిపైనున్న స్వామిని పతిగా పొంది అతన్ని వేడుకలలో తేలించే యువతి ఇంకా అమ్ముతూ ఉంది. కాబట్టి జనులారా నమ్మి కొనుక్కోండి. (యింకానమ్మీ కొనరే చల్ల — ఇందులో నమ్మీ అన్నది శ్లేషగా తీసుకోవచ్చేమో)

నా విశ్లేషణ  :

మండేవేసవిలో దేహాన్ని చల్లార్చి ఎండకు ఉపశమనం కలిగించేందుకు ఈ రోజుల్లో పలు రకాల కూల్‌డ్రింకులు, వాటినమ్మే అంగళ్ళు అడుగడుగునా ఉన్నాయి. ఎవరి ప్రాడక్ట్ ను వారు అమ్ముకునేందుకు పోటీలు పడి వైవిద్యమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఇన్ని artificial drinks లేవు. పానీయాలను నిలవుంఛే, చల్లబరిచే టెక్నాలజీలు లేదు. ప్రకృతి సిద్ధమైన మజ్జిగ, కొబ్బరి నీళ్ళవంటివి మాత్రమే ఉండేవి. నేటి పానీయాలను ధనవంతులు తయారు చేస్తున్నారు. ఆ రోజుల్లో మామూలు మధ్యతరగతి వాళ్ళు మజ్జిగ చిలికి అమ్మేవారు. వారికి అదే జీవనాధారం. కష్టజీవులు. వారు పడే శ్రమ, మజ్జిగమ్మే తీరు అన్నమయ్యలో కలిగించిన ప్రభావంతో ఎన్నెన్నో “చల్ల”టి కీర్తనలో రాయించింది. గొల్లభామలు, రేపల్లె, పాలు, పెరుగు, నవనీతం, మజ్జిగ, శ్రీకృష్ణుడు – ఇంకేం కావాలి యే వైష్ణవకవికైనా?

“పిక్కటిల్లు చన్నుల గుబ్బెత ఒకతి, కడు చక్కనిది చిలికిన చల్ల” అమ్మే చోట చిలికిన వనిత చన్నుల చక్కదనం గురించి ప్రస్తావన తీసుకురావడం, అమ్ముతున్న స్త్రీని వర్ణించడం ఇవన్నీ వినియోగదారులను ఊరించే వ్యాపారయుక్తులు. నేడు మగవాళ్ళ షేవింగు క్రీముల ప్రకటనల్లో ఆడవాళ్ళని చూపిస్తున్నట్టయితే కాదు.

వడచల్లు మేని జవ్వని అని అన్నమయ్య అనడంలోని ప్రత్యేక భావం ఏంటి? మజ్జిగ ఎవరు చిలికితేనేం? చల్లగానే ఉంటుందిగా? ఈ గొల్లెత అమ్మే మజ్జిగ ఇంకాస్త ఎక్కువ చల్లగా ఉంటుంది అని నొక్కి చెప్పే ఉద్దేశంతోనే “వడచల్లు మేని జవ్వని” అని చిలికిన యువతిని వర్ణించాడు. వడచల్లు మేని అన్నప్రయోగానికి ‘తాపమును చిమ్మే దేహం’ అనీ, ‘చల్లని దేహం’ అనీ రెండు అర్థాలున్నాయి. పాఠకులు మీ భావుకతకి తగినట్టు అన్వయించుకోండి.

“నువ్వమ్మే మజ్జిగ వేడిన తగ్గించుతుంది, నీ అందమేమో తాపాగ్నిని రగిలిస్తుంది” అని మజ్జిగమ్మే గొల్లభామతో సరసమాడాడు “కాళమేఘం” అనే ఒక ప్రాచీన అరవ కవి.

తడబడు కమ్మనితావులది – అటువైపుగా వెళ్ళేవారిని కమ్మని సువాసన ద్వారా ఆపిమరీ ఆకర్షిస్తుందిట. ఆ సువాసన మజ్జిగదైనా కావచ్చు, పరిమళ కస్తూరిని మేన రాసుకునే ఆ గొల్లెతదైనా కావచ్చు అన్నది కవిచమత్కారం!

“జడియుచుఁ జిలికిన”, “జంకెనలఁ జిలికిన” – ఈ రెండు ప్రయోగాల్లోనూ భయపడుతూ, తికమకపడుతూ చిలికింది ఆ యువతి అని రాశాడు. ఎందుకు అలా రాశాడు? ఆలోచిస్తే జవాబు దొరుకుతుంది. పెరుగులో నీళ్ళు పోసి వెన్నకోసం కవ్వంతో చిలికితే మజ్జిగ మిగులుతుంది. నీళ్ళు పోసినకొద్ది మజ్జిగ మొత్తం(quantity) పెరుగుతుంది, అయితే పలచనైపోతుంది! నీళ్ళు తక్కువపోస్తే కుండ నిండదు. అందుకే ఆ వొయ్యారిభామ తికమకగా భయపడుతూ మజ్జిగ చిలుకుతుంది అని అన్నాడేమో అన్నమయ్య!

దైవకటాక్షం అనబడే మజ్జిగ రేయనక పగలనక, వాడవాడలా, మూలమూలలా వ్యాపించి ఉంది. శ్రీవేంకటేశ్వరుణ్ణి భక్తితో కొలిచి, మనస్పూర్తిగా నమ్మి మానవ జన్మ అనే మండుటెండనుండి ఉపశమనం పొందండి అని వైష్ణవులు ఈ కీర్తనని అన్వయించి తాత్విక అర్థం చెప్పవచ్చు. నేను మాత్రం అన్నమయ్య సామాజిక దృక్పథాన్నీ, కవి హృదయాన్ని చూస్తున్నాను ఈ కీర్తనలో!

కొన్నిపదాలకు అర్థాలు (Context based Meanings)

చల్ల = మజ్జిగ
రేలు = రాత్రి
పిక్కటిల్లు = పిగులు, ఉబుకు, పొంగు
చన్నులు = రొమ్ములు
గుబ్బెత = దిట్టమైన చన్నులున్న యువతి
అక్కున = రొమ్ములమీద, గుండెపైన
వడచల్లు మేను = తాపము చల్లేటి దేహం, చల్లని దేహం
జవ్వని = అందగత్తె
జడియు = కదులు, చలించు, భయపడు
కమ్మనితావు = కమ్మని సువాసన
నేడయక = వెళ్ళిపోకుండ, దూరమవ్వకుండ
అంకులకరములు = చిగురుపోలిన మెత్తని చేతులు, పల్లవపాణులు
జంకెన = భయపడుతు, తికమకపడుతు

*

మీ మాటలు

 1. Dr.Vijaya Babu Koganti says:

  “…అని వైష్ణవులు ఈ కీర్తనని అన్వయించి తాత్విక అర్థం చెప్పవచ్చు. నేను మాత్రం అన్నమయ్య సామాజిక దృక్పథాన్నీ, కవి హృదయాన్ని చూస్తున్నాను ఈ కీర్తనలో!”

  ఇలా చూడడం చాలా అవసరం భాస్కర్ గారు. విశ్లేషణ చాల బాగుంది.

 2. రవి says:

  ఎంత అలవోకగా, హాయిగా ఉంది ఈ పాట. పల్లెజీవితపు ఏ పార్శ్వం కూడా అన్నమయ్య కళ్ళ నుండి బహుశా తప్పించుకోలేదేమో.

 3. చాలా మంచి పాటకి చాలా మంచి విశ్లేషణ. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

 4. K Sree Ram Prasanna says:

  భాస్కర్ గారు,

  ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ షెడ్యూల్ లో భావం, అర్థం, భావుకత,,మీ విశ్లేషణ చాల బాగుంది. మరి కొన్ని సంకీత్తనలలో నాకు చాల సందేహాలు ఉన్నాయి. మీరు తీర్చ గలరని భావిస్తునాను. కొమ్మ సింగారములు కీర్తన కు మీ విశ్లేషణ మరి మరి అభినన్దనేయము.
  వీలు అయెతే, “పాడేము పరమాత్మ నిన్ను వేడుక ముప్పది రెండు వేల ల రాగాలను” అనే సంకీర్తన కి విశ్లేష ఇవ్వమని మనవి.

  కే శ్రీ Ram ప్రసన్న

 5. అజిత్ కుమార్ says:

  తడబడు కమ్మని తావులది = తావులది అంటే తాగే పానీయమని
  వేంకటగిరిపతి వేడుకది = అంటే పండుగనాడు తాగే పానీయము లాగా వెంకటగిరిపతి వేడుగగా చల్ల తాగుతాడని
  అర్ధము చెప్పుకుంటే బాగుంటుదని నా అభిప్రాయము.

మీ మాటలు

*