పలచని చెమటల బాహుమూలముల…

అవినేని భాస్కర్

 

Avineni Bhaskarజానపద శైలిలో, పామరుల వాడుక భాషలో, అచ్చ తెలుగులో అన్నమయ్య పలు కీర్తనలు రాశాడు. దంపుడు పాటలు, గొబ్బిళ్ళ పాటలు, జాజర పాటలు, వసంతాలాటల పాటలు (పసుపు నీళ్ళు చల్లుకునే పండుగ – హోలీ వంటిది), వెన్నెల్లో నృత్యం చేసుకుంటూ పాడే పాటలు, పెళ్ళి పాటలు, జలక్రీడా పాటలు ఇలా ఎన్నెన్నో జానపదాలు రచించాడు.

వెన్నెల్లో యువతీ యువకులు కోలాటం చేస్తూ పాడుకునే జానపదంగా “నెయ్యములు అల్లో నేరేళ్ళో” పాటని భావించవచ్చు. 

శ్రీవేంకటేశ్వరుడు-అలమేలుమంగలే యువతీ యువకులై నృత్యం చేస్తూ పాడుతున్నట్టు అన్వయించుకోవచ్చు. లేదా కోలాటం ఆడుతున్నవాళ్ళు పద్మావతి-పెరుమాళ్ళ సంగమాన్ని కీర్తిస్తున్నట్టూ అన్వయించుకోవచ్చు.
 
విరహంతో వేచి విభుణ్ణి చేరుకుంది తరుణి. ఆ దివ్య దంపతుల ప్రియసంగమమే ఈ కీర్తనలో పొందుపరిచిన భావం. ప్రణయ మూర్తులైన పద్మావతీ శ్రీవేంకటేశుల కలయికలో మనసులను మురిపించే ప్రేమ విలాసములు, తనువుల తపనలను తీర్చే శృంగార కేళీలు ఉన్నాయి. 
 
 
పల్లవి
నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో
 
చరణాలు
పలచని చెమటల బాహుమూలముల-
చెలమలలోనాఁ జెలువములే
థళథళమను ముత్యపుఁ జెఱగు సురటి
దులిపేటి నీళ్ళతుంపిళ్ళో
 
తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి పొటి యలుకల చిరునగవే
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో
 
గరగరికల వేంకటపతి కౌఁగిట
పరిమళములలో బచ్చనలు(లే)
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాఁకులినుప గుగ్గిళ్ళో


తాత్పర్యం (Meaning):
అలమేలుమంగా-శ్రీనివాసుల పొందిక అల్లో నేరేడుపళ్ళలా తీయనిదా? “అబ్బా ఎంత అన్యోన్యమైన జంట!” అని ఉవ్వుళ్ళు ఊరించేటువంటిదా?
 
విరహంతో వేచియున్న ఆమె మేను చెమరించింది. అమె చంకలనుండి పలుచని చెమటలు కారిపోతున్నాయి. చెమటల ఊటలనిండిన ఆమె బాహుమూలములు కొలనులవలే అందంగా ఉన్నాయి. పైటంచులో ముత్యాలు పొదిగిన చీర కట్టుకుని ఉంది ఆమె. ఆ చీరచెంగుని తీసి విసనకర్రలా పట్టుకుని విసురుకుంది. చెంగులోని ముత్యాలు తళతళ మెరుస్తున్నాయి. విసిరిన జోరుకి చెమట చుక్కలు చిరుజల్లుల్లా రాలుతున్నాయి.
 
స్వామి వచ్చాడన్న తన్మయత్వంలో ఆమె కన్నులనుండి బాష్పాలు ఫళఫళమని రాలాయి. అప్పుడామె చిలిపి అలకలలు నటిస్తూ, పెదవుల్లో చిరునవ్వులు చిందిస్తూ ఉంది. మర్రిపళ్ళలా ఎర్రగా ఉన్న ఆమె పెదవులు కవ్విస్తున్నాయి. అధరామృతం పంచే ఆ పెదవులు అతనిని గుటకలు వేయిస్తున్నాయి.
 
నానావిధ పరిమళములతో సింగారములొలికే శ్రీవేంకటేశుడి కౌగిలిలో కలిసిపోయింది ఆ శ్రీమహాలక్ష్మి. తాళలేని విరహాన్ని ఆ విభుని కలయిక చల్లారుస్తుంది. ఆ జంటయొక్క మోహం ఎంత తీవ్రస్థాయికి చేరుకుందంటే… ఆ తాపవేళలో మోహానికి అధిపతియైన మన్మథుడు తన చెరకు విల్లునుండి వారి మీదకి పువ్వుల బాణాలు సంధించాడా లేక ఇనపగుగ్గిళ్ళు విసిరాడా అని సందేహం కలుగుతోంది. ఇనుపగుగ్గిళ్ళు విసిరాడా అన్న సందేహం ఎందుకు కలిగిందంటారా?  వారి నఖములూ, దంతములూ ఇరువురిమేనా చేస్తున్న గాయాలటువంటివి మరి?
 
విశ్లేషణ :
నెయ్యములల్లో నేరేళ్ళో = నెయ్యములు + అల్లో నేరేళ్ళు అని పదాలను అర్థం చేసుకోవాలి.
వెన్నెల రాత్రులెంత ఆహ్లాదకరమో అంత ఆహ్లాదకరం ఈ “అల్లోనేరేళ్ళో” అన్న నుడి. అంతకంటే ఆనందం పద్మావతీ-శ్రీనివాసులు ప్రణయం.
 
చమటలూరిన చంకలు అందంగా ఉన్నాయని వర్ణించడం ఏంటి అనిపించవచ్చు! మామూలుగా చెమట ఇంపైనది కాకపోయినా కోరికలవశమై మన్మథకేళికి సిద్ధమైనవేళ చంకల్లో కారే చెమటల్లో ఆకర్షించే పరిమళముంటుందట. అలసినప్పుడు ఒంటిపై కారే చెమటకీ, కామవశమైనప్పుడు చెమర్చే చమటకీ తేడాలుంటాయని నేటి పరిశోధనలు కూడా చెప్తున్నాయి. అన్నమయ్య కీర్తనల్లో పలుచోట్ల చంకల గురించి, చెమట గురించి వర్ణించబడియుంది. అన్నమయ్యే కాదు, మరి కొందరు కవులుకూడా చంకల చెమట గురించి అందంగా వర్ణించిన సందర్భాలున్నాయి. చంకల పరిమళాన్నిబట్టే హస్తిణి, చిత్తిణి, శంకిణి, పద్మిణి అని స్త్రీనలను గుర్తించేవారట. అన్నమయ్యే మరొక కీర్తనలో “కప్పులు తేరేటి కస్తూరి చంకల కొప్పెర గుబ్బల గొల్లెత” అని రాశాడు.
 
ఆమె విసనకర్రతో విసురుకుంది అని రాస్తే కవిత్వం ఎక్కడుంటుంది? పైట చెంగుతో విసురుకున్నట్టు రాయడంలోనే కవిహృదయం ఉంది. ఆ రోజుల్లో కూడా మగువలు “వర్క్ చీరలు” కట్టేవారు అన్నది మనం గమనించాలి.
 
ప్రణయంలో భావావేశాలు, మనోవికారాలూ, అలుకలూ, చిరుకోపాలూ, నవ్వులూ సహజం కదా? విరహంతో వేచి విసిగిపోయి ఉన్న నాయిక నాయకుని రాకతో వెంటనే ఆనందంలోకి జారిపోదు కదా? కోపం చూపుతుంది, నిందిస్తుంది, ఏడుస్తుంది, అలుగుతుంది. అతను ఆమె అలుక తీరిస్తేగానీ మనసు సహజ స్థితికి చేరుకోదు కదా?
 
శ్రీవేంకటేశుడు అలంకార ప్రియుడు. “గరగరికల వేంకటపతి” అట! వారి రతిలోని తీవ్రతని “మన్మథుడి పువ్వుల బాణాలు వారిని ఇనుప గుగ్గిళ్ళులా తాకాయి” అని సమర్థిస్తున్నాడు అన్నమయ్య.
 
ఈ కీర్తనని ఒకానొక సినిమాలో వాడుకున్నారు. బాలు పాడారు. స్వరపరచిన తీరువల్ల విన్నవారికి మరొక అర్థం స్ఫురించవచ్చు. కాబట్టి పైన ఇచ్చిన ఆడియోలు వినమని మనవి.
 
కొన్ని పదాలకు అర్థాలు (Meaning) :
నెయ్యము = స్నేహము, ప్రియము
అల్లోనేరేళ్ళో = ఆడపిల్లలు వెన్నెల రాత్రుల్లో ఆడుకునే ఒక ఆట, స్త్రీలుపాడే పాట (జానపదం)
ఒయ్యన = తిన్నగ, మెల్లగ, Gently, Softly
ఉవ్విళ్ళూ = తపనలు, తహతహలు, eagerness
 
పలచని చెమట = లేత చెమట, సన్నని చెమట
బాహుమూలములు = చంకలు, కక్షములు
చెలమలు = గుంటలు, pit, కొలనులు, పల్లము
చెలువము = అందము, సౌందర్యము
థళథళ = తళతళ
ముత్యపు = ముత్యాల
చెఱగు = చెంగు, చీర కొంగు, పైట
సురటి = విసనకఱ్ఱ
దులుపేటి = దులుపుతున్న
నీళ్ళా తుంపిళ్ళో = తుంపరలు, వాన చినుకులు
 
తొటతొట కన్నుల తొరిగేటి నీళ్ళు = అదురుతున్న కళ్ళనుండి రాలేటి కన్నీరు
(తొరిగేటి = రాలేటి)
చిటిపొటి యలుకలు = చిన్న చిన్న గొడవలు, చిలిపితగాదా, అల్పమైన , silly fights
చిరునగవే = చిరునవ్వులే
వటఫలంబు = మర్రిపండు
వన్నెల = సొభగు
మోవి = పెదవి
గుటక = ఒక్కసారి మింగగల
గుక్కిళ్ళు = గుటక మింగు శబ్ధము
 
గరగరికల = సింగారమైన, అలంకారములుగల, చక్కదనాలుగల
బచ్చనలు = కలయికలు, కూటములు, ఒదిగిపోవడము
మరునివింటి = మన్మథుడి చెరకు విల్లు
కమ్మని = కమ్మనైన
అంప విరులు = పువ్వుల బాణాలు / బాణాల పువ్వులు(!?)
గురి = లక్ష్యం
తాకు = తాకేటి
గుగ్గిళ్ళు = ఉడకబెట్టిన శనగలు

మీ మాటలు

*