నవ్వే లేకపోతే…

 లక్ష్మీ శైలజ
ఎలానూ నవ్వలేకపోతే

నీ జీవితం పువ్వులెరుగని ఖాళీ వనం
ఉండుండీ ఓసారైనా నవ్వులు కురవకపోతే
నీ ఉనికి, వెన్నెల లేని వొట్టి చంద్ర బింబం
చుక్కలు చుక్కలుగా  వెలుగును చిమ్ముతూ
ఉదయాంతరాల్లోంచి  నవ్వుతుంది నిండైన ఆకాశం
కొమ్మ కొమ్మపై నించి గమ్మత్తుగా రాలిపడుతూ
తెల్లగా  నవ్వులు పూస్తుంది  తుంటరి పారిజాతం
వంకర టింకర నడకతో
వడి వడిగా నవ్వుతాయి వెండి జలపాతాలు
వెదురు పుల్లల వెన్ను చరిచి
గాలి నవ్వులు విసురుతాయి ఇంకొన్ని సంధ్య వేళలు
ప్రకృతి ఒడిలో ప్రతి యేడూ జన్మిస్తూ
నవ్వే పచ్చని పసి పాపలు  వసంతాలు
పాదాల కింద గల గలా నలిగి
నవ్వయిపోతున్నవి ఎండుటాకుల శిశిరాలు
కడలి కొమ్మల్లో ఉయ్యాలలూగే
అలుపెరుగని అల్లరి పిట్టలు అవిగో ఆ  అలలు
బంగారు ఇసుకని మీటుతూ
వినిపిస్తున్నాయి తడి నవ్వుల కూని రాగాలు
ఎర్రని  పెదవుల రెప్పల్ని విడదీసి
పళ్ళ కనుపాపలతో ప్రపంచాన్ని చూడు
నీ చూపుల నవ్వుల గుండా
నీలోకి చేరేవి ఎన్నెన్ని సంతోషాలో !!!
lakshmeesailaja

మీ మాటలు

  1. వాసుదేవ్ says:

    గుప్పెడు అక్షరాల్లోనూ ఇక నవ్వలేకపోతే ఎలా అంటు మొదలయిన ఈ కవితావేశపు భావావేశం రెండు పార్శ్వాల్లో భలే నడిచింది…. సున్నితత్వమూనూ, కరకుశత్వమూనూ ఒకే వాక్యం లోనో లేక ఒకే భావంలోనో మీరు అలవోకగా అందించిన శైలి చదవాల్సిందే శైలజ గారూ..ఒకటి కాదు పది సార్లు చదవాల్సిన రచన ఇది…

  2. Wilson Sudhakar Thullimalli says:

    నిజమే. ” జీవితం పువ్వులెరుగని ఖాళీ వనం “. బాగుంది.కంగ్రాట్స్.

Leave a Reply to Wilson Sudhakar Thullimalli Cancel reply

*