మరుపు కోసం

 

bhavani-phani.అతనికి ఒక్కసారిగా కనుపాపల్లోపల మెరుపేదో మెరిసినట్టయింది . ఓ నవోత్తేజం నరనరానా నిండిన అనుభూతి కలిగింది . ఎన్నో ఏళ్ళుగా కలిసి ఉన్న కనురెప్పలు ఇక ఆగలేనట్టుగా  తెరుచుకున్నాయి . ఎదురుగా ఏ దేవతా రూపమూ ప్రత్యక్షం కాలేదు . అశరీరవాణేదీ తన సందేశాన్నీ వినిపించలేదు . కానీ అతనికి అర్థం అయింది . తన కోరిక నెరవేరింది . తన తపస్సు ఫలించింది . ఇప్పుడు తన దగ్గర ఒక అసాధారణ శక్తి ఉంది . అతని మనసంతా ఆనందంతో నిండిపోయింది .

ఇక తపస్సు కొనసాగించే అవసరం లేకపోవడం వల్ల  ఉద్వేగం నిండిన మనసుతో  ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు .  కొంతసేపటికి వచ్చిన ఆ మనిషి యధాలాపంగా స్వామి వంక చూసి ఉలికిపడ్డాడు . ఎప్పుడూ కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండే స్వామి, ఈ రోజు తనవైపు చిరునవ్వుతో చూస్తుండడంవల్లనేమో భయంతో ఒక అడుగు వెనక్కి వేసాడు .
“రావయ్యా రా కంగారు పడకు . వచ్చి ఇలా కూర్చో ” అన్నాడు స్వామి నవ్వుతూ .
ఇన్నేళ్ళుగా నోరు తెరిచి ఒక్క మాటా మాట్లాడని స్వామి ఆ రోజు అంత నోటి నిండుగా పలకరించేసరికి పులకరించిపోయిన ఆ ముసలి ప్రాణి, నోట మాట రానట్టుగా రెండు చేతులూ జోడించి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు .

” చూడు పెద్దాయనా , నీ పేరేమిటో నాకు తెలీదు . కానీ ఇన్ని సంవత్సరాలూ పళ్ళు ఫలాలు తెచ్చిస్తూ  నా మంచి చెడ్డలు చూసేందుకు నువ్వు పడిన తపన నేను గమనించాను . నా తపస్సు పూర్తయింది . నాకు ఒక అపూర్వ శక్తి లభించింది . నువ్వు చేసిన సేవకి ప్రతిఫలంగా నా శక్తితో ముందుగా నీకే లాభం చేకూర్చాలని అనుకుంటున్నాను . చెప్పు, నువ్వు మరచిపోవాలనుకునే మనిషి గానీ , విషయం గానీ ఉంటే చెప్పు . ఇక వాళ్ళకి చెందిన ఏ ఆలోచనా నిన్ను బాధపెట్టదు . ”
ఆ ముసలి వ్యక్తి అయోమయంగా చూసి ఓసారి బుర్ర గోక్కున్నాడు .
“స్వామీ , నువ్వనేదేంటో నాకు అర్థం కావట్లేదు . ఎవరైనా విషయాలు ఇంకా బాగా గుర్తు పెట్టుకోవాలనుకుంటారు గానీ మరచిపోవాలని ఎందుకనుకుంటారు! ”
స్వామి విశాలంగా నవ్వాడు  .
“నీకు తెలీదులే . అలా మరుపుని కోరుకునే వాళ్ళు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు . వాళ్లకి నా సహాయం అవసరం . నేను వెంటనే బయలుదేరాలి . అవకాశం వచ్చినప్పుడు నీ ఋణం తప్పక తీర్చుకుంటాను “అంటూ అతని వద్ద సెలవు తీసుకున్నాడు . తపస్సు ప్రారంభించే ముందు ఒక చెట్టుతొర్రలో  దాచిన తన పాత దుస్తులు ,కొద్ది పాటు డబ్బు జాగ్రత్త చేసుకుని జన జీవన స్రవంతిలోకి  అడుగు పెట్టాడు .

కానీ అతని ప్రయాణం మొదలైనంత సజావుగా సాగలేదు . ఎవరికి తన సహాయం అవసరమో , ఎవరు మరుపుని కోరుకుంటున్నారో స్వామికి అర్థం కాలేదు .మనుషుల మనసు చదివే శక్తి కోసం కూడా తపస్సులో కోరుకుని ఉండాల్సింది  అనుకున్నాడు . మళ్ళీ అంతలోనే అటువంటి ఆలోచన వచ్చినందుకు తనని తానే నిందించుకున్నాడు . సామాన్య ప్రజానీకంలా తను కూడా ఉన్నదానితో తృప్తి పడకపోతే ఎలా! కష్టపడనిదే ఏదీ సాధించలేమన్న విషయం తనకంటే ఎవరికి బాగా తెలుస్తుంది? తన అవసరం ఉన్న వాళ్ళని తనే వెతుక్కుంటూ వెళ్ళాలి అనుకుంటూ  మళ్ళీ తన ప్రయాణం కొనసాగించాడు . అలా ప్రయాణం చేస్తూ చేస్తూ జమ్మూ, అక్కడనించి కట్రా చేరుకున్నాడు .తను సరైన ప్రదేశానికే వచ్చాడు . భగవంతుడి దగ్గరకి కష్టాల్లో ఉన్నవారే ఎక్కువగా వస్తారు . వైష్ణో దేవి దర్శనం జరిగే  లోపుగా తన సహాయం అవసరమైన వాళ్ళు తప్పక తనకి తారసపడతారు అని సంతోషిస్తూ ఉత్సాహంగా కొండ ఎక్కడం ప్రారంభించాడు . పరిశీలనగా అందరి వైపూ చూస్తూ , ఎవరు ఎటువంటి కష్టాల్లో ఉన్నారో అంచనా వేస్తూ నడవసాగాడు

అప్పుడు కనిపించాడా యువకుడు ఒంటరిగా. పచ్చని ఛాయతో మెరిసిపోతున్నాడతను.  చెయ్యెత్తు మనిషైనా ముఖంలో  ఉన్న సౌకుమార్యం అతని వయసు లేతదనాన్ని చెప్పకనే చెబుతోంది . భారమైన అడుగులు , భుజాల భంగిమ అతను పెద్ద కష్టంలో ఉన్నాడని సూచిస్తున్నాయి . స్వామి మెల్లగా అతని పక్కగా  వెళ్లి అన్నాడు .
“నీ ఉత్సాహానికి స్నేహితులంతా వెనకబడ్డారా భాయీ ”
ఆ యువకుడు ఆశ్చర్యంగా తల తిప్పి చూసాడు . “లేదు భయ్యా , ఒక్కడినే వచ్చాను . అయినా నన్ను చూస్తే అంత ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తున్నానా  మీకు ?” కొంచెం పంజాబీ యాస కలిసిన హిందీలో అన్నాడా అబ్బాయి .
“ఇంత చిన్న వయసులో ఎందుకంత నైరాశ్యం తమ్ముడూ , ఇష్టమైతే నీ కష్టమేమిటో నాతో చెప్పుకోవచ్చు ” స్వామి రోడ్డు పైనే దృష్టి నిలిపి చెప్పాడు .
ఆ యువకుడు నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు . ఏవో పదునైన వాక్యాలు అనేందుకు సిద్ధమై అంతలోనే విరమించుకున్నట్టుగా మళ్ళీ విషాదంలోకి తనని తాను ఒంపుకుంటూ  నడక మొదలుపెట్టాడు .
స్వామి వదిలిపెట్టలేదు
“సరే, నువ్వేమీ చెప్పద్దు , నేనే ముందు నా కథ చెబుతాను . నీకు నా మీద నమ్మకం కలిగితేనే మాట్లాడు “
ఆ యువకుడు అభ్యంతరం లేనట్టుగా భుజాలెగరేసాడు .
స్వామి నడక వేగం తగ్గించి మెల్లగా చెప్పడం మొదలు పెట్టాడు .
afsar-marupu
“ఇంచుమించు  పది సంవత్సరాల క్రితం నేను ప్రేమలో విఫలమయ్యాను . కోరుకున్న అమ్మాయిని దక్కించుకోలేక , అలాగని మరిచిపోనూ లేక ఎంతో విలవిలలాడిపోయాను . పిచ్చి పట్టినట్టుగా అయి దేశాటన ప్రారంభించాను . దక్షిణ భారతానికి చెందిన నేను , అలా తిరుగుతూ తిరుగుతూ ఈ పరిసర ప్రాంతాలకి చేరుకున్నాను . అప్పుడే నాకో ఆలోచన కలిగింది . మనకి  బాధ కలిగించే మనిషినీ, ఆ మనిషి తాలుకూ ఆలోచనల్నీ పూర్తిగా మరచిపోగలిగితే, మరిచిపోయేలా చేయగలిగితే ఎంత బాగుంటుంది అనిపించింది . అనుకున్నదే తడువుగా ఓ అనువైన స్థలం చూసుకుని తపస్సు ప్రారంభించాను . తపస్సు అంటే ఏ దేవుడి నామస్మరణో కాదు . కేవలం నా సంకల్పాన్నే పదే పదే మనసులో జపించసాగాను . ఎంతో కఠోర దీక్షతో చేసిన నా తపస్సు ఇప్పటికి ఫలించింది . నేను కోరుకున్న శక్తి నాకు లభించింది .” అంతవరకు చెప్పి ఆగాడు స్వామి .
ఆ యువకుడు స్వామి ముఖంలోకి పరిశీలనగా చూసాడు . “అయితే మీ లవర్ ని మీరు మర్చిపోయారా ?”
స్వామి  చిన్నగా నవ్వాడు . “నేను ఎందుకు ఇంత కష్టపడ్డానో నేనే మర్చిపోతే ఇతరులకి ఎలా సహాయం చేస్తాను? ఎవరైనా ఎవరి జ్ఞాపకాల్నైనా పోగొట్టుకోవాలని అనుకుంటే నేను వాటిని అంతం చెయ్యగలను ” అన్నాడు. తన శక్తి తన మీద పని చెయ్యలేదనీ, అయినా నిజానికి ఇప్పుడా అవసరం కూడా లేదనీ చెప్పడం ఇష్టం లేక .
ఆ యువకుడికి స్వామి మీద నమ్మకం కలిగినట్టుంది . ఇంకేమీ ప్రశ్నలు వెయ్యకుండా నేరుగా తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు .”నేనూ,ప్రకృతీ  చిన్నప్పటి నుండీ క్లాస్మేట్స్ . ఎయిత్ క్లాస్ కి వచ్చేసరికి మా స్నేహం మరింత బలపడింది . అప్పట్లో స్కూల్ ఎంతో సందడిగా ఉండేది . అప్పుడప్పుడే అడుగుపెడుతున్న యవ్వనం వల్ల ఎటు చూసినా జంట కోసం వెతుక్కునే స్నేహితులే. నేనూ , ప్రకృతీ కలిసి అటువంటి జంటల్ని కలిపే పని మొదలుపెట్టాం . ఆ పని మాకెంతో సంతోషం కలిగించేది . ఓ రోజు ఉన్నట్టుండి ప్రకృతి అడిగింది ” మనోజ్ , నీకెవరైనా ఇష్టమైతే చెప్పు . నేను వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడతాను ” అంది .
ఊహించని ఆ ప్రశ్నకి వెంటనే ఎలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు . కొంచెం ధైర్యం చేసి నాకిష్టమైన అమ్మాయివి నువ్వే అనేసాను . తను ఏ మాత్రం ఆలోచించకుండా నాకిష్టమే అంది .

అలా మొదలైంది మా ప్రేమ ప్రయాణం . నా పదమూడో పుట్టిన రోజుకి అమ్మా నాన్నా గిఫ్ట్ గా ఇచ్చిన మొబైల్ లో రోజూ అందరూ నిద్రపోయాక మొదలుపెట్టి తెల్లవార్లూ మాట్లాడుకునేవాళ్ళం . తను కూడా ఇంట్లో ఒకే అమ్మాయి కావడంతో  బోలెడంత గారం, ప్రైవసీ ఉండేవి . ఈ విషయం ఇంట్లో తెలీకుండా మాత్రం జాగ్రత్తపడేవాళ్ళం . ఎప్పుడైనా ఒక రోజో , రెండు రోజులో నాతో మాట్లాడటం కుదరదనుకుంటే గంటల తరబడి ఏడ్చేది . తన బాధ చూస్తే నాక్కూడా  ఏడుపొచ్చేది ” వింటున్నాడా లేదా అన్నట్టు ఆ యువకుడు ఓ సారి ఆగి స్వామి వైపు చూసాడు .స్వామి ముఖంలో ఆసక్తికి సంతృప్తి చెందినట్టుగా మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు .”టెన్త్ లోకి వచ్చేసరికి నా ఆలోచన మారిపోయింది . నా మనసు కొత్త కొత్త పరిచయాల కోసం తహతహలాడింది . కొందరు అమ్మాయిల్లా ప్రకృతి నాకు స్వేచ్ఛనిచ్చేది కాదు . ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేది . అందరు లవర్స్ లా ఎంజాయ్ చెయ్యడానికి సహకరించేది కాదు . ఎక్కువగా కలిసేది కాదు .ఫోన్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది . ఆ అసంతృప్తితో నేను కొత్త స్నేహాలు వెతుక్కునేవాడ్ని . ఆకర్షణీయమైన నా రూపం  వల్ల అమ్మాయిలు సులువుగానే నాకు ఎట్రాక్ట్ అయ్యేవారు . కొందరు వాళ్ళంతట వాళ్ళే వచ్చేవారు . అలా ఒకేసారి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ని మెయిన్ టైన్ చేసేవాడ్ని . ప్రకృతికి మాత్రం తెలియనిచ్చేవాడిని కాదు . కొన్ని రోజుల స్నేహంతోనే చాలామంది అమ్మాయిలంటే నాకు బోర్ కొట్టేది. కానీ ప్రకృతితో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడ్ని .

మెల్లగా మా మధ్య పోట్లాటలు మొదలయ్యాయి . ఎప్పడూ తనతోనే మాట్లాడుతూ కూర్చుంటే నాకు వేరే పని ఉండదా అని నాకు కోపం వచ్చేది . అసలే కోపం ఎక్కువ కావడం వల్ల అలాంటప్పుడు నోటి కొచ్చినట్టు తిట్టేవాడ్ని . కొన్ని రోజులు మాట్లాడటం మానేసినా మళ్ళీ తనే పలకరించేది. బ్రతిమలేది . తనంటే నాకు కూడా  చెప్పలేనంత ఇష్టం . అలా అని తనతో నిజాయితీగా ఉండలేక పోయేవాడిని . వేరే స్నేహాల సంగతి ఎలా ఉన్నా, పెళ్లి మాత్రం తననే చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను . ఎనిమిదేళ్ళు మా ప్రేమ అలా ఒడిదుడుకుల మధ్య కొనసాగింది . నాకు ఎం బి ఏ కూడా పూర్తి కావచ్చింది. తనని మెల్లగా నిర్లక్ష్యం చెయ్యడం మొదలు పెట్టాను . ఓ రోజు ఆ విషయం తను గట్టిగా అడిగి గొడవ చేసేసరికి కోపం వచ్చి, విడిపోదామని చెప్పి , బాగా తిట్టి ఫోన్ పెట్టేసాను . ” అపరాధ భావం వల్లనేమో అతను ఎటో చూస్తూ చెప్పసాగాడు .”ఒక నెల రోజులు బాగానే ఉన్నాను . అలా ఒక్కోసారి పది పదిహేను రోజులు మాట్లాడుకోకుండా ఉండటం మాకు అలవాటే . ఈసారి తను ఎంతకీ పలకరించకపోయేసరికి నేనే ఫోన్ చేసాను . అంతే, నాకు పెద్ద షాక్ తగిలింది . తను నన్ను మరిచిపోయిందనీ, నన్ను కూడా తనని మరిచిపోయి ముందుకు సాగమనీ చెప్పేసింది . ఇక చూడండి . అప్పుడు మొదలైంది నా బాధ . ఫేస్బుక్ లో , వాట్స్యాప్  లో , ఫోన్లో అన్ని చోట్లా నన్ను బ్లాక్ చేసేసింది . తన కజిన్స్ తో, మా కామన్ ఫ్రెండ్స్ తో ఎన్నో మెసేజ్ లు పంపాను . చివరికి బాగా జబ్బు పడ్డానని కూడా చెప్పించాను . అయినా తను లొంగలేదు . ఒక్క సారి మాత్రం ఫోన్ లో మాట్లాడింది .
నాతో పోట్లాడి పోట్లాడి అలిసిపోయానంది . నావల్ల తన ఎనిమిది సంవత్సరాలు నాశనం అయిపోయాయని చెప్పింది . నాతో మాట్లాడాలని ఎదురు చూస్తూ , నా నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక చాలా నలిగిపోయాననీ , ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉందనీ చెప్పింది . ఇప్పుడు తనకి నా మీద జాలి మాత్రమే కలుగుతోందనీ , ఏ మాత్రం ప్రేమ భావం లేదనీ , ఇక ఎప్పుడూ మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దన్నీ చాలా గట్టిగా చెప్పేసింది . నాలో గిల్టీ ఫీలింగ్ అప్పుడు మొదలయింది . నేను తనతో పాటుగా ఎందఱో అమ్మాయిల్ని ఏడిపించాను . ఈ ఎనిమిదేళ్ళ లో దాదాపు ముప్ఫై మంది అమ్మాయిల్ని ప్రేమిస్తున్నాని చెప్పి , కొన్నాళ్ళకి బోర్ కొట్టగానే వదిలేసాను  . ఒక్కో అమ్మాయితో బ్రేక్ అప్ అయినప్పుడల్లా వాళ్ళెంతో ఏడుస్తూ తిడుతూ నాకు దూరమయ్యేవారు . ఆ పాపాలన్నీ నన్నిప్పుడు ఇలా వెంటాడి వేధిస్తున్నాయనిపిస్తోంది . ప్రతి నిమిషం అదే ఆలోచన . తనతో మాట్లాడాలనీ , మునుపటిలా ఉండాలనీ తీవ్రమైన కోరిక . తిండీ , నిద్రా కూడా తగ్గిపోయాయి . మనసు తేలిక పరచుకోవడం కోసం , నా పాపాలకి పరిహారం చేసుకోవడం కోసం ఇలా వచ్చాను . ఇప్పుడు నాకింకేమీ వద్దు . మళ్ళీ తను నా జీవితంలోకి వస్తే చాలు . కానీ ఇక తను రాదని నాకు తెలుసు . ” ఆ యువకుడి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి  .” చూడు భాయీ , నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు . మళ్ళీ అటువంటి పొరపాటు చెయ్యకు . ఆ అమ్మాయి వెనక్కి తిరిగి రాదని తెలిసినప్పుడు ఇంకా బాధ పడటం వల్ల ఏం ప్రయోజనం? మన ఆత్మనైనా సరే హింస పెట్టే హక్కు మనకి లేదు . నువ్వు కూడా ఆ అమ్మాయిని మర్చిపోవడం ఒక్కటే సరైన మార్గం ” అన్నాడు స్వామి అనునయంగా అతని భుజం మీద చెయ్యి వేస్తూ .
ఆ యువకుడు అదేమీ పట్టించుకోనట్టుగా మళ్ళీ చెప్పసాగాడు .”ఇప్పుడు నన్ను నిలువెల్లా దహించివేస్తున్న సందేహం ఒక్కటే . అసలు ఇన్నేళ్ళ ప్రేమ ఎలా అంతమైపోయింది? తను నన్ను ఎలా మరిచి పోగలిగింది! అసలు అలా మరఛిపోవడం సాధ్యమా? ఒక్కసారి కూడా మా మధ్య జరిగిన మంచి సంఘటనలు తనకి గుర్తు రావా ? నాతో మాట్లాడాలని అనిపించదా ? అసలు అదెలా కుదురుతుంది!! ఈ ఆలోచనలతో నేను సతమతమైపోతున్నాను . దయచేసి సమాధానాలు చెప్పండి భయ్యా ”  అతను కళ్ళలోంచి నీళ్ళు కారిపోతుంటే బిక్కమొహం వేసుకుని చిన్నపిల్లాడిలా అడిగాడు  .స్వామి ఒక్క నిమిషం అలోచించి చెప్పాడు.  ” తమ్ముడూ , మనిషి మనసు ఓ మహేంద్రజాలం . ఎప్పుడు ఎవర్ని ఎలా స్వీకరిస్తుందో మనం అంచనా వెయ్యలేం . దానితో పాటుగా సాగిపోవడమే తప్ప ఎదురుతిరిగి ప్రశ్నించే ప్రయత్నం చెయ్యకూడదు . ప్రపంచంలో ప్రేమ విషయంలో ఏ ఇద్దరి అనుభవాలూ ఒకేలా ఉండవు . ఆ సందేహాలన్నీ పక్కన పెట్టు . ఇప్పుడు నేను ఆ అమ్మాయి తాలుకూ ఆలోచనలన్నీ నీ మనసులోంచి తొలగిస్తాను . అప్పుడు నీకీ వేదన ఉండదు . “ఆ అబ్బాయి కొంతసేపు దీర్ఘాలోచనలో పడినట్టుగా ఉండిపోయాడు . తర్వాత అన్నాడు .” వద్దు భయ్యా , నేను తనని మరిచిపోతే నా జీవితానికి అర్థమే లేదు . ఎప్పటికైనా తను వెనక్కి తిరిగి చూస్తుందనే ఆశతో బ్రతికేస్తాను . కనీసం క్షమించినా చాలు . అయినా నేను ఇదంతా మరిచిపోతే మళ్ళీ నా కథ మొదటికే వస్తుంది .  చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చెయ్యడం నాకిష్టం లేదు. ఈ జీవితానికి నాకీ బాధ చాలు . “ అంటూ ఇక స్వామితో మాట్లాడటం ఇష్టం లేనట్టుగా వడివడిగా అడుగులేస్తూ అతను ముందుకు వెళ్ళిపోయాడు .స్వామికి ఆ అబ్బాయిని వెనక్కి పిలవాలనిపించింది . మరుపు అనేది మనిషికి సహజంగా లభించిన వరమనీ , ఆ అమ్మాయి తిరిగి చూసినా, చూడకపోయినా ఇప్పుడున్నంత బాధ కొద్ది రోజుల తర్వాత ఉండదనీ, అప్పటివరకూ పొరపాటు నిర్ణయాలేవీ తీసుకోకుండా ఓపికపడితే చాలనీ చెప్పాలనిపించింది. కానీ ఆ అర్హత తనకి ఉందా? తపస్సు పేరుతో తను పోగొట్టుకున్న సమయం గురించీ, తద్వారా లభించిన శక్తి వల్ల ఒనగూడే ప్రయోజనం గురించీ, తన భవిష్యత్తు గురించీ ఆలోచిస్తూ స్వామి అక్కడే నిలబడిపోయాడు.

***

మీ మాటలు

  1. Sujatha says:

    భవాని గారూ, కథ బావుందండీ!

  2. ధన్యవాదాలు సుజాత గారూ

  3. Dhanunjay says:

    మీ రచన చాల బాగుంది.

  4. ధన్యవాదాలు ధనుంజయ్ గారు

మీ మాటలు

*