నేల కంపిస్తుందని తెలియని నీకు…

అఫ్సర్ 

1.

నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టి, లేదూ  కాస్తయినా జారిపోలేదు కాబట్టీ,  నీకు యింకా చాలా తెలియవ్. నిజానికి ఈ వివర్ణ ముఖాల నగరపు చలి  తప్ప యింకే జీవన్మరణ ప్రకంపనలూ తెలియవు కాబట్టి నీకు నువ్వో ఆ అవతలి ఇంకొక ముఖమో తెలియనే తెలియదు.

చలిలో ఎండాకాలాన్నీ, ఎండలో చలికాలాన్నీ అందంగా పునఃసృష్టించుకునే తెలివో తేటదనమో నీకు ఉండనే వుంది కాబట్టి అసలే జీవితం ఎలా తెల్లారుతుందో, అంత హటాత్తుగానే ఏ మరణం ఎందుకు దాపురిస్తుందో నీకు యెప్పటికీ తెలియకనే పోవచ్చు.

కాని, అసలవేవీ జీవితమే కాదంటావే, అదిగో అక్కడే నీ రహస్యం అంతా నిద్రపోతూ వుంటుంది, వొళ్ళూపై  లేకుండా!

 

2.

యెప్పటి నించి ఆలోచించడం మొదలు పెట్టావో నువ్వు, యెప్పటి నించి దేన్ని యెలా అనుభవించడం మొదలెట్టావో నువ్వు, వొక బాధలో యింకో వొంటరితనంలో మరింకో చావు కన్నా పీడలాంటి బతుకులో యేది యెందుకు యెలా కమ్ముకొస్తుందో యెవరిని యే క్షణం యెలా కుమ్మేస్తూ పోతుందో ఏదీ ఏదీ  నీ వూహకి కూడా అందదు.

నువ్వొక అద్దాల గదిలోపల గదిలో సమాధి తవ్వుకుంటూ వుంటావ్! దాన్ని  తెరిచే సూర్యకిరణపు తాళం చేయిని యెక్కడో పారేసుకుని వుంటావ్!

నువ్వు పడుకున్న గదిలో కాస్త చలిగా వుందనో, నీ పక్కన పడుకున్న దేహంలో కొంత  వెచ్చదనం చచ్చిపోయిందనో, నువ్వు ఎక్కాల్సిన మెట్టు చూస్తూ చూస్తూ వుండగానే చప్పున జారిపోయిందనో రాత్రీ పగలూ గుండెలు బాదుకొని యేడుస్తూ వుండిపోతావ్ తప్ప, యింకో గుండెలోకి  ప్రవేశించి అక్కడి గాయాన్ని పలకరించి రాలేవ్ నువ్వు.

వొక కోరిక నించి యింకో కోరికలోకి వలసెళ్ళే ఏమరుపాటులో తొందరపాటులో కూడా అన్ని స్థలాలూ, కాలాలూ, వూహలూ చెక్కుచెదరని అందమైన అమరిక  నీకు.

మహా బలిదానాలే చేయక్కర్లేదు, కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు.

 

3

ఇవాళ నేలా వణికి పోతుంది గజగజ.

రేపు ఆకాశమూ తొణికిపోతుంది వానచుక్కలా.

యీ సూర్యుడూ యీ చంద్రుడూ యింకేవీ నిలబడవ్ యింత ఠీవిగా యిప్పటిలాగానే.

జీవితం కొన్ని చేతుల్లోంచి యెట్లా పట్టుతప్పి పోతుందో

అలాగే కచ్చితంగా అలాగే ఇవన్నీ నెలవు తప్పి ఎటేటో రాలిపోతాయి,

నీకేమీ చెప్పకుండానే.

 

4.

నిజంగా

నీకు యింకా చాలా జీవితం తెలియనే తెలియదు,

నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టే!

*

 

మీ మాటలు

 1. తిలక్ బొమ్మరాజు says:

  అఫ్సర్ గారు మీ కవిత్వమెప్పుడు యెందుకిలా నచ్చేస్తుందో చెప్పలేను.ఏదో వొక తెలియని సున్నితత్వం యెప్పుడు మీ పదాల్లో తొణికిసలాడుతుంది.వృధా ప్రయత్నం కాని వో కవిత్వానికి జీవం పోస్తారు ఎల్లప్పుడూ.అలా వొక్కసారి హత్తుకుని వుండిపోయే కవిత్వం మీది.

 2. నిశీధి says:

  మెత్తటి కత్తేదో గుండెలో దిగబడి గడ్డ కట్టిన హిమమంతా నీళ్ళై కారిపోతునట్లు నిజంగానే ఎదో కదిలింది. ఇది చూడండి మహా బలిదానాలే చేయక్కర్లేదు, కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు. ఆ ఒక్క లైన్ చాలు ఇంక మళ్ళీ బ్రతికెలా ఉండాలో నెర్చుకోవడానికి

 3. Jayashree Naidu says:

  మహా బలిదానాలే చేయక్కర్లేదు, కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు.
  భీకరమైన భూకంపానికి ఆవేదనా సున్నితత్వం అద్ది మానవత్వాన్ని ఓపికగా బోధించే బుద్ధుడు మాట్లాడినట్టుంది.
  మనస్తత్వంలో అన్ని కోణాలనీ బంధిస్తూ బుజ్జగిస్తూ వివరిస్తూ ….
  ఎప్పటిలానే ఒకటికి రెండు మూడు నాలుగు… అలా మరీ మరీ చదివిస్తారు

 4. Thirupalu says:

  /నిజంగా
  నీకు యింకా చాలా జీవితం తెలియనే తెలియదు,
  నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టే! /
  అవును తన దాక వస్తే కదా ! అప్పుడు దాకా హృధయాలు ద్రవిమ్చనే ద్రవిమ్చనే ధ్రవిమ్చవు- దేవుని హృదయం లాగే!
  నా హృదయం ద్రవింపిమ్చిమ్ది అప్సర్ జీ ! ధన్య వాదాలు.

 5. Mythili abbaraju says:

  అదిగో అక్కడే నీ రహస్యం అంతా నిద్రపోతూ వుంటుంది, వొళ్ళూపై లేకుండా!…ఎంత కచ్చగా, అక్కరగా అన్న మాటలు….

 6. తన దాకా వస్తే గానీ దుఃఖాన్ని అనుభవించలేకపోవడం మనిషి నైజమన్న నిజాన్ని మృదువైన పదాల్లో పరిచి చూపించారు . ఎక్కడో యుగానికి ఒకరో ఇద్దరో కలిగి ఉంటారు ఎవరి కష్టాన్నో చూసి కదిలిపోగల దయార్థ్ర హృదయాన్నీ, కదిలించి చూపగల భావ నైపుణ్యాన్నీ. చాలా బాగుంది సర్ .

 7. మణి వడ్లమాని says:

  చాలా బాగా రాసారు అఫ్సర్ జీ

  నిజంగా

  నీకు యింకా చాలా జీవితం తెలియనే తెలియదు,

  నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టే!”

  అవును, అమ్మ పొత్తిళ్ళలో హాయిగా నిదురించే బాబు ,వణికిన భూమి తో జారి మట్టి పెల్లమధ్య ఊపిరి బిగబెట్టి ఏడవడనికి కూడా ఓపిక లేక ఉన్నాడని నిజంగా నీకు తెలియదు.

 8. Raajasekhar Gudibandi says:

  “అసలవేవీ జీవితమే కాదంటావే, అదిగో అక్కడే నీ రహస్యం అంతా నిద్రపోతూ వుంటుంది, వొళ్ళూపై లేకుండా!”

  “మహా బలిదానాలే చేయక్కర్లేదు, కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు.”….
  ఎంతటి ఆర్ద్రత నింపే వాక్యాలు…బుద్ధదేవుని దయ , ఆగ్రహం,బాధ ఈవేళ మీ అక్షరాల్లోనే..
  కవిత్వం విలువని పెంచే కవితల్లో ఇదీ ఒకటి…

 9. కోడూరి విజయకుమార్ says:

  నిజమే అఫ్సర్ … ‘కాళ్ళ కింద భూమి వోనికిపోవడం ‘ తెలిసిన వాళ్ళకే జీవితం విలువ అర్థమయ్యేది …..

 10. Abdul hafeez says:

  జీవితం అంచు మీద నిలబడి బ్రతుకు పూర్తి చిత్రాన్ని చూడగలిగిన కవికి మాత్రమె కాళ్ళ కింద నేల నిత్యం కంపిస్తుంది, ఇలాంటి కవిత చెప్పిస్తుంది……..Its అఫ్సర్ again .

 11. అదిగో అక్కడే నీ రహస్యం అంతా నిద్రపోతూ వుంటుంది, వొళ్ళూపై లేకుండా!
  ****
  వొక కోరిక నించి యింకో కోరికలోకి వలసెళ్ళే ఏమరుపాటులో తొందరపాటులో కూడా అన్ని స్థలాలూ, కాలాలూ, వూహలూ చెక్కుచెదరని అందమైన అమరిక నీకు.
  ****
  ఇవన్నీ నెలవు తప్పి ఎటేటో రాలిపోతాయి,
  నీకేమీ చెప్పకుండానే.
  ****
  నీకు యింకా చాలా జీవితం తెలియనే తెలియదు,
  నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టే!

  _/\_ _/\_ _/\_

 12. P Mohan says:

  జీవితం చేతుల్లోంచి పట్టు తప్పిపోవద్దనే కదా అందరి తండ్లాట… రంగులే కాదు, హృదయగతమైనవి, కల్మశం లేనివి ఏవీ లేని రిక్తలోకంలో మీరన్నట్టు నింగీ నేలానే కాదు పాంచభౌతికాలన్నీ ప్రతిక్షణం నెలవు తప్పుతున్నాయి సర్. తలకిందుల బతుకుల్లో మనసు స్కేలుపై కోటానుకోట్ల తీవ్రతతో నిత్యం వస్తున్న, రప్పించబడుతున్న కంపనాల ముందు ఈ భూకంపాలు ఎంత?

 13. నారాయణస్వామి says:

  చాలా బాగుంది అఫ్సర్! వ్యక్తిగతాన్ని సార్వజనీనం చేయడం తద్వారా తాత్వికం చేయడం – మూడవ ప్రపంచ ప్రజల దుఃఖానికి కారణమవుతున్న పాలకుల దేశంలో బతుకుతూ మానవీయ విలువలని, చివరకు సహజాతాలని కూడా కోల్పోతూ, తమకు తెల్సిందే చరిత్రా తామనుభవించిందే జీవితమూ అనుకుంటూ అద్దాల సమాధిలో ఘనీభవించుకుపోయిన పాశ్చాత్య జీవన నేపథ్యంలోంచి పలికిన పద్యం – గొప్పగా ఉంది!

  యెంతమంది చాంస్కీలు చెర్నాకోలలై చెళ్ళున చరవాలో ?

 14. ఎ. కె. ప్రభాకర్ says:

  ఇంకో గుండెలోకి ప్రవేశించి అక్కడి గాయాన్ని తడిమి మలాం పూసే విద్య ఏదో ఈ కవికి తెల్సు.

 15. ఎన్ వేణుగోపాల్ says:

  చాల చాల బాగుంది అఫ్సర్ …. అయినా చెప్పనక్కరలేదనుకో….

  మనిషి సాపేక్ష సిద్ధాంతాన్ని అణువణువునా, అన్ని రంగాల్లో, అన్ని స్థలాల్లో అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుండునో అని ఎప్పుడూ అనిపిస్తుంటుంది. నీ కవిత తర్వాత మరింత అనిపించింది…

 16. మెర్సీ మార్గరెట్ says:

  ఎంత బాగుందో అని చెప్పమంటారా ?, ఎంత తెలియదో ఎలా తెలుసుకోవడం అని ప్రశ్నించుకోమంటారా ?
  ” నువ్వొక అద్దాల గదిలోపల గదిలో సమాధి తవ్వుకుంటూ వుంటావ్! దాన్ని తెరిచే సూర్యకిరణపు తాళం చేయిని యెక్కడో పారేసుకుని వుంటావ్!” అన్న మాటల గురించి పదే పదే ఆలోచిస్తున్నాను
  -” నిజంగా యింకా చాలా జీవితం తెలియనే తెలియదు,
  కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టే! “

 17. vani koratamaddi says:

  మహా బలిదానాలే చేయక్కర్లేదు, కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు.

 18. moidasrinivasarao says:

  అఫ్సర్ గారు మంచిగా రాసారు.

 19. నిజమే గురూజీ. నా కాళ్ల కింద భూమి ఇంకా వణికిపోలేదు కాబట్టి నా జీవితం గురించి నాకింకా తెలీదు. నా జీవితం నాకు తెలీదనే సంగతి నాకు తెలిపినందుకు, తమ జీవితం వాళ్లకు తెలీదనే సంగతి అనేకమందికి తెలిపినందుకు అందుకోండి అభినందనలు.

 20. balasudhakarmouli says:

  ఒక సందర్భంలోంచి కవి వూహలు రెక్కలు కట్టుకుంటాయి. వూహలకు వొక పునాధి వున్నప్పుడు కవిత పుట్టుక, కదలిక వొక కొత్త దిశగా పయనిస్తుంది. ఆ సందర్భం లోపల ఎప్పటి నుంచో ఉన్న మరో సందర్భాన్ని కదిలిస్తుంది. ఈ కవిత చదివినప్పుడు అలానే అనిపించింది. కవిత చదవడం బాగుంటుంది.. కానీ ఈ రకమైన వ్యక్తీకరణ ఉన్న కవిత్వానికి వెనునెంటనే వొక సమీక్షలాంటిది వొస్తే కూడా చదవాలనిపిస్తుంది. కానీ కవిత యిచ్చే అనుభూతే వేరు. అనుభూతిని మనం ఏ పాళ్లలో మనలోకి లోపలకి వొంపుకున్నాం ! ఎంతగా ఆ కవిత యిచ్చిన అనుభూతితో అంతరంగంలో దేవులాడుకుంటున్నాం ! జవాబును అదే కవితాత్మస్థాయిలో వూహించుకుందామని వుంటుంది. కవిత అంటే కదిలిస్తుంది మరి. కదిలించే, ఆలోచింపచేసే కవిత్వాన్ని బాగా ఇష్టపడ్డమే.

 21. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  ఇవాళ నేలా వణికి పోతుంది గజగజ.
  రేపు ఆకాశమూ తొణికిపోతుంది వానచుక్కలా.
  యీ సూర్యుడూ యీ చంద్రుడూ యింకేవీ నిలబడవ్ యింత ఠీవిగా యిప్పటిలాగానే.
  జీవితం కొన్ని చేతుల్లోంచి యెట్లా పట్టుతప్పి పోతుందో
  అలాగే కచ్చితంగా అలాగే ఇవన్నీ నెలవు తప్పి ఎటేటో రాలిపోతాయి,
  నీకేమీ చెప్పకుండానే.

  ఈ ప్రోఫేసీ నిజం కాకూడదని కోరుకుందాం. అవుతుందనే భయం అనునిత్యం వెంటాడితేనే మనిషికి జాగ్రత్త పెరుగుతుంది. కాళ్ళ కింద నేల వణికితేనే జీవితం తెలుస్తుంది.

 22. shariffvempalli says:

  చాల గొప్ప కవిత. ధన్యవాదాలు

 23. “మహా బలిదానాలే చేయక్కర్లేదు, కాని కనీసం వొక అరచుక్క కంట తడిని ఎవరికోసమూ రాల్చలేవు కదా నువ్వు.”— ఇది అర్థమయ్యేసరికి జీవితం గడిచిపోతుంది.

 24. cv suresh says:

  భయానకమైన ఆ భూక౦ప దృశ్యాలను చూసినప్పుడు నిర్వేదక్షణమొకటి మన ఎదుటే ముక్కలు ముక్కలై రాలి పడి జాలిగా మనల్ని చూసి౦ది. శిధిలాల క్రి౦దట తటిల్లిన ఓ పసికూన ఆర్థనాద౦ ఎక్కడో గు౦డెలోతుల్లో తన లేలేత పసి చేతులతో తడుమినట్లనిపి౦చి౦ది. తెలియని అశక్తత మానవాళిలో ఓ క్షణ౦ పాటు శూన్యాన్ని ని౦పి౦ది. క్షణభ౦గుర జీవితమి౦తేకదా అని అనిపి౦చి౦ది. అక్కడితో సగటు మనిషి ఆగిపోతాడు. కాఫీనో టీనో తాగి భార౦గా మళ్ళీ బ్రతుకు సమర౦లోకి….వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తాడు..

  కానీ, ఒక సృజనాత్మకత కలిగిన కవి.. అ౦తటితో ఆగడు..
  అతని మెదడు పొరల్లో అలజడి అప్పుడు మొదలవుతు౦ది. విపత్తునొకవైపు…. మనిషి పయనాన్నొకవైపు తనలోనే బేరీజు వేసుకొ౦టాడు. మౌనాన్ని చేదిస్తాడు. అలా౦టి సృజనాత్మక కవే అఫ్సర్..!!

  మనిషి చుట్టూ పరచుకొన్న వలయాలలోనే ఎలా కొట్టుమిట్టాడుతున్నాడో..వాడిదె౦త చిన్న ప్రప౦చమో … వాడి కుత్సిత స్వభావమేమిటో….వాడి ము౦దున్న ప్రాధాన్యతా౦శాలు ఎ౦త అనల్పమైనవో … జీవితమె౦త స౦కుచితమో… అసలు వాడికి జీవితమ౦టే ఏ౦ తెలుసు అన్న ఒక నిర్థిష్టమైన.. సాహసోపేతమైన వాఖ్యాలతో ముగుస్తు౦ది ఈ కవిత… !

  “నీకు యింకా చాలా జీవితం తెలియనే తెలియదు,
  నీ కాళ్ళ కింద భూమి ఎప్పుడూ వణికి పోలేదు కాబట్టే!”

  @@@@

  “నువ్వు పడుకున్న గదిలో కాస్త చలిగా వుందనో, నీ పక్కన పడుకున్న దేహంలో కొంత వెచ్చదనం చచ్చిపోయిందనో, నువ్వు ఎక్కాల్సిన మెట్టు చూస్తూ చూస్తూ వుండగానే చప్పున జారిపోయిందనో రాత్రీ పగలూ గుండెలు బాదుకొని యేడుస్తూ వుండిపోతావ్ తప్ప, యింకో గుండెలోకి ప్రవేశించి అక్కడి గాయాన్ని పలకరించి రాలేవ్ నువ్వు”

  వాహ్! ఆ వాఖ్యాల్లో ఎ౦తటి స్పష్టత ఉ౦ది.అఫ్సర్ గారు….! మనిషిలోని అర్భకత్వము బట్టబయలు చేసి, ఒక రకమైన ఆత్మన్యూనతాభావ౦లోకి పడెశారు. శైలి.. వస్తువు…పదాల ఎ౦పిక ఇవన్నీ ఈ కవిత లో అడుగడుగునా అ౦ద౦గా అగుపిస్తాయి. సృజనాత్మకత , స్ప౦ది౦చే తీరు ఈ కవితలో యువకవులకు ఒక కరదీపిక గా కనిపిస్తాయి..!
  హాట్సాఫ్ Afsar Afsar gaaru… ! ఈ కవిత గురి౦చి మరో పది పేజీలు రాయాలనిపి౦చి౦ది.. కానీ నిడివి చదువరలను చదివి౦చేలా ఉ౦డాలి…!అ౦దుకే ఇ౦తటితో ముగిస్తున్నాను… సార్…ఈ కవిత మరో అద్భుత కవిత మీ కల౦ ను౦డి!!!

 25. vasavi pydi says:

  కవి హృదయం లోంచి పొంగి పొరలే భావాలకుకన్నీళ్ళ కలాపి చల్లి శిధిలమైన మనసుని పుడమి ముంగిట పూడ్చి పెడితే ఆ భావ ప్రకంపనల కు ప్రాణమున్న ప్రతి హృదయం కంపించదా !

 26. Vijaya Karra says:

  Touching !!!

 27. బలమైన భావాలూ, అంతే బలమైన వ్యక్తీకరణ. మళ్ళీ మళ్ళీ చదివించి, ఆలోచింపజేసిన కవిత్వం, అఫ్సర్ గారూ. ఎత్తుగడలోనే వ్యక్తిగత అనుభవాన్ని పరిథికి మించిన సత్యంతో ముడిపెడుతూ ఈ వాక్యాలు ఎక్కడ ఆగనున్నాయో చెప్పకుండానే చెప్పారు. అట్లాగే స్థిరమైన ముగింపునీ ఇచ్చారు.
  .థాంక్యూ వెరీ మచ్.

 28. విలాసాగరం రవీందర్ says:

  అసలే జీవితం ఎలా తెల్లారుతుందో, అంత హటాత్తుగానే ఏ మరణం ఎందుకు దాపురిస్తుందో నీకు యెప్పటికీ తెలియకనే పోవచ్చు…..
  భూకంపాన్ని గురించి ఎంత బాగా రాసారు .

  అద్భుతమైన కవిత… నిజమే ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేమా

 29. Dr. Vijaya Babu, Koganti says:

  ముందు ఆ ‘అద్దాల గది’ విడిచి బయటకు రావాలి కదా!
  మానసిక వైకల్యాన్ని విడవాల్సిన అవసరాన్ని తెలిపే కవిత.
  చాలా బాగుంది అఫ్సర్ జి!
  అభినందనలు.

 30. N.RAJANI says:

  చాల చాల బాగుంది అఫ్సర్

 31. అవును జీవితం మనకు తెలిసిందే చాలా అనుకోవడం ఎప్పుడు విస్మయమే. ముస్లిం దేశాలపై జరిగే బాంబింగ్ వాళ్ళను ఎంతల అతలాకుతలం చేస్తుందో ఎవరికీ అర్ధం కాదు. అడపా దడపా జరిగే బాంబు దాడులే (ఇవీ జరగాలని కాదు) మనల్ని భయపెడతాయి. ఊళ్ళకు ఉళ్లు ఆసుపత్రులు నాశనం చేస్తూ చిద్విలాసంగా నవ్వే పెద్దన్న చంక నాకడమే మనకి గొప్ప. అలా ఈ భూకంపాలు సునామీలు అనుభవంలోకి వచ్చిన వారికేనేమో జీవితం ఇంత తేలికైన విషయం అని అవగాతమవుతున్దనుకుంటా. ఎప్పట్లా మీ కవిత చాలా సాంద్రతగా ఆర్థ్రత నిండి ఉంటుంది.

 32. ఈ కవితపై వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ షుక్రియా. మీ వ్యాఖ్యలు ఇంకా కొన్ని కొత్త కోణాల్ని నాకు చూపించాయి.

మీ మాటలు

*