జై భీమ్‌ డ్రమ్‌..రిథమ్ ఆఫ్ బహుజన్స్‌!

ఒమ్మి రమేష్‌బాబు

 

1. ఒక అద్భుతం..

2015 మే 3వ తేదీ రాత్రి. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆర్ట్స్‌ కాలేజీ మైదానం బాగమతి తారామతి ప్రాంగణంగా పేరు మార్చుకుంది. భీమ్‌ డ్రమ్‌ అనే వినూత్న ఆర్కెష్ట్రాకి వేదికగా మారింది. రిథమ్ ఆఫ్ బహుజన్స్‌ అన్నది ఆ కార్యక్రమ ట్యాగ్‌లైన్‌. అదే ఇప్పుడు ప్రత్యామ్నాయ సాంస్కృతిక, రాజకీయాలకు దారిచూపబోతున్న టార్చిలైట్‌.

రిధమ్ ఆఫ్ బహుజన్స్‌ అనేది ఒక కొత్త ప్రకటన. నవీన భావావేశపు వెల్లువ. ఉద్విగ్నభరిత సంబరం. అగ్రకులేతర అసంఖ్యక సమూహాల పాదాల జడి. లబ్‌డబ్‌లబ్‌డబ్‌ చప్పుడుగా మారిన డప్పుల పెనుప్రకంపన. చాతీలో వేడిపుట్టించిన గిటార్ వైబ్రేషన్. కదంతొక్కించిన కీబోర్డ్‌ హోహోహోరు. నరాల తంత్రుల్లోకి చిమ్మిన నల్లని నెత్తుటి కేరింత. ఆ రాత్రి ఆ గానాబజానా దళితం దళితం దళితం అని దళిత శతకోటిని దద్దరిల్లేలా ధ్వనించింది. యువతని దరువేయించింది. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య వంటి మేధావినే హైలయ్యగా మార్చి ఆడీ పాడించింది.

అవును.. ఆ రాత్రి ఓయూ ప్రాంగణం కొత్త ఉద్యమానికి తెరతీసింది. కొత్త అజెండాకి పల్లవిగా మారింది. కొత్త దర్శనానికి చూపుని పదునెక్కింది. ఆ రాత్రి… చీకటి కూడా తన నలుపుని చూసుకుని మరొక్కసారి మనసారా మురిసిపోయింది. నిశి మెరుపుల ఆకాశాన్ని ప్రశంసిస్తూ నేలతల్లి ఉరిమింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక నల్ల తటాకంగా మారారు. వారి మనస్సుల్లో నల్లకలువలు విరబూశాయి. బ్లాక్ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అని ఐలయ్య నినదిస్తే అక్కడ చేరిన గొంతులన్నీ ఏకమై ఆ నినాదాన్ని అందిపుచ్చుకున్నాయి. ఆ రేయి ఒకానొక జాగృదావస్థకి పీఠికగా మారింది.

ఇదంతా 3వ తేదీ సాయంత్రం నుంచి నడి రాత్రి వరకూ సాగిన భీమ్‌ డ్రమ్‌ మహిమ. నలిగంటి శరత్ అనే ఒక బక్కపల్చని కారునల్లాటి యువకుడు చేసిన మాయ. ఉన్నదున్నట్టు చెప్పాలంటే- ఉస్మానియానే “శరత్‌ మానియా”గా మార్చేశాడు. ప్రత్యామ్నాయ సాంస్కృతిక, సామాజిక, విద్యా, రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వాగ్గేయకారులను, అతిథులను, బహుజన నేతలను రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌ కార్యక్రమంలో ఏకం చేశాడు. విభిన్న సంస్థల ప్రతినిధులతోపాటు పలు విద్యార్థి సంఘాల నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఆర్కెష్ట్రాతో గొంతు కలిపారు. భిన్నత్వం ఉన్నప్పటికీ బహుజనతత్వం ముందు ఐక్యసంఘటన సాధ్యమేనని దీనిద్వారా శరత్‌ నిరూపించాడు. సంఘ పరివర్తన ద్వారా బహుజన రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడమే నిజమైన వాగ్గేయకారుడి లక్ష్యం అని ప్రకటించాడు. ఇందుకు స్ఫూర్తినిచ్చేలా డయాస్‌ని డికరేట్‌ చేశాడు. గౌతమ బుద్దుడు, పెరియార్‌ రామస్వామి, జ్యోతిరావ్‌ పూలే, సావిత్రీబాయ్‌ పూలే, అంబేద్కర్‌, కెజీ సత్యమూర్తి అలియాస్‌ శివసాగర్, కాన్షీరామ్‌, మైకేల్ జాక్సన్‌, మారోజు వీరన్న, బెల్లి లలిత తదితర స్ఫూర్తిప్రదాతలు ఫ్లెక్సీ మీద ఆశీనులై ఆద్యంతం ఆ కార్యక్రమాన్ని తిలకించి పులకించిపోయారు.
2 నేపథ్య స్వరం…

ఓయూ క్యాంపస్‌లో జరిగిన భీమ్‌ డ్రమ్‌ని కట్టెకొట్టెతెచ్చే చందంగా చెప్పడం అంటే కుట్రతో సమానం. ఎందుకంటే అది ఒక చారిత్రక సందర్భం. ఒక మార్పుకి సంకేతంగా నిలవబోతున్న నూతన కూర్పు. ఆ కార్యక్రమానికి కర్త కర్మక్రియ నలిగంటి శరత్‌. చాలామందికి ఆ యువరక్తపు నవతేజం పరిచయమే అయినా రెండు ముక్కల్లో మళ్లీ చెప్తాను. నలిగంటి శరత్‌ చమర్‌ అనే ఆ యువకుడు దళిత్‌ బహుజన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ఉద్యమకారుడిగా, రచయితగా బాగా పాపులర్‌ అయ్యాడు. సాంసృతిక సైనికుడి అవతరించాడు. అతనిదొక విలక్షణ స్వరం. మెరిసే నల్లని మేనిచ్ఛాయతో సంధించిన విల్లులా ఉంటుంది రూపం.

ఉస్మానియాలో బీఫ్‌ ఫెస్టివల్‌ జరిగినా, ఇఫ్తార్‌ పాటతో హిందూ- ముస్లింలతో అలాయి బలాయి పాడించినా… అది అతనికే చెల్లింది. ‘బీఫ్‌ ఈజ్‌ సీక్రెట్‌ ఆఫ్‌ మై నాలెడ్జి’ అనే అతని గీతం ఇతర రాష్ట్రాలకు కూడా పాకిపోయింది. నలిగంటి శరత్‌కి స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉంది. తన వర్ణం, వర్గం గురించిన స్ఫృహ కూడా కావలసినంత ఉంది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఎంఐఎం శరత్‌కి తమ పార్టీ టిక్కెట్‌ ఇచ్చి అంబర్‌పేట అభ్యర్థిగా పోటీలో నిలిపింది. అంబర్‌పేట నియోజకవర్గం జనరల్‌ సీటు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పోటీచేసిన స్థానం. నలిగంటి శరత్‌ దళితుడు. అప్పటికి శరత్‌ ఓయూలో పరిశోధక విద్యార్థిగా ఉన్నాడు. ఆ ఎన్నికల్లో కిషన్‌రెడ్డికి చుక్కలు కనిపించిన మాట వాస్తవం. నలిగంటి శరత్‌ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితేనేం… తన సత్తా ఏమిటో చాటుకున్నాడు. ఇది జరిగిన కొద్ది నెలలకే అంటే గత సెప్టెంబర్‌ మాసంలో శరత్‌ రూముపై దాడి జరిగింది. అతని పుస్తకాలు, బట్టలు, సర్టిఫికెట్లు సహా అన్నింటినీ తగులబెట్టారు. పగలనకా రేయనకా ఎంతో శ్రమపడి పిహెచ్‌డి కోసం అతను తయారుచేసుకున్న రాతప్రతి కూడా ఆ ఘటనలో కాలి బూడిదయ్యింది.

ఈ దుర్మార్గాన్ని ఎవరు చేసి ఉంటారో విడమరిచి చెప్పాల్సిన పని లేదు. శరత్‌ కట్టుబట్టలతో మిగిలాడు. సహజంగా ఇలాంటి సంఘటనలు జరిగితే.. పిల్లలు కుంగిపోతారు. నిరాశకి గురవుతారు. ధైర్యం కోల్పోతారు. కానీ శరత్‌ నిలబడ్డాడు. అదే క్యాంపస్‌లో నిలబడ్డాడు. భయపడితే బతుకెక్కడ…? అందుకే మరింత బలంగా, మనోనిబ్బరమే శిఖరంగా మారినట్టు నిలబడ్డాడు. అతనికి మేథావులు, అధ్యాపకులు, విద్యార్థులు అండగా నిలిచారు. అప్పుడెప్పుడో జార్జిరెడ్డి… ఇదిగో మళ్లీ ఇప్పుడు శరత్‌ అనిపించుకున్నాడు. (జార్జిరెడ్డిని భౌతికంగా అంతం చేయగలిగారు కానీ అతని భావాలను మాత్రం అంతంచేయలేకపోయారు) అతనికి చెడు చేయాలనుకున్న వారు మాత్రం కలుగుల్లో దాక్కున్నారు. భీమ్‌ డ్రమ్‌ కార్యక్రమం ద్వారా శరత్‌ తన శక్తి ఏమిటో చాటుకున్నాడు. దళిత, బహుజన, ఆదివాసీ, ముస్లిం, మహిళల రాజకీయాధికార లక్ష్య ప్రకటన చేశాడు. దాని సాంస్కృతిక అభివ్యక్తే భీమ్‌ డ్రమ్‌..!

sarat1

3. దళిత సాంస్కృతిక దర్శనం

భీమ్‌ డ్రమ్‌ ఒక విలక్షణ ప్రయోగం. అభ్యుదయ, విప్లవ, జానపద, తాత్వగీత, కవ్వాలీ రాగాల సమ్మేళనం. బహుభాషలలో సాగిన స్వరమాలిక. ఈ సందర్భంగా పాడిన పాటలు, ఆలపించిన రాగాలు, దరువుకి తగ్గట్టుగా విద్యార్థి బృందం లయబద్ధంగా వేసిన అడుగులు… ఒకదానికొకటి చేర్పుగా ఒక కూర్పుగా మారాయి. మరొక్కసారి మరొక్క పాట అని అడిగిమరీ పాడించుకున్నారు ఆహూతుల చేత. బీఫ్‌ యేంతమ్‌, బఫెల్లో సోల్జర్‌ గీతాలు “రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌” కాన్సెప్టుని ప్రతిఫలించాయి. గొడ్డు మాంసం తిన్న బుద్ధుడు, జీసస్‌, ఐన్‌స్టీన్‌, కారల్‌ మార్క్స్‌, అంబేద్కర్‌లే ఈ ప్రపంచాన్ని మార్చగలిగారనీ, వారే తమకు ఆదర్శప్రాయులనీ కంచ ఐలయ్య ఈ వేదిక మీదనుంచి విస్పష్ట ప్రకటన చేశారు.

అక్షరాలు ఉన్న చోట ఆలయాలా అని హేళనగా ప్రశ్నించారు. ఇకపై దళిత, బహుజనుల కళాకారులు నిండు వస్త్రధారణతోనే ప్రదర్శనలు ఇవ్వాలని ఐలయ్య పిలుపునిచ్చారు. ఇంగ్లీష్‌ చదువుల అభ్యాసం, దేశ విముక్తి అనే లక్ష్యం తమ ముందున్న కర్తవ్యాలని చెప్పారు. ఫ్యూడల్‌, మతోన్మాదశక్తులను ఎదుర్కొంటూ ఈ ఆశయ సాధన కోసం పునరంకితమవుతామని అన్నారు. ఉత్పత్తి కులాలు ఏకమైతే అధికారం తమదే అన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కొద్ది మాటలు కూడా ఆటపాటల మధ్య ఆటవిడుపుగా చెప్పినవే. ప్రధాన వక్తలుగా వచ్చిన కొద్దిమంది మినహా మిగతా అందరూ పాటలతోనే తాము చెప్పదలుచుకున్నది చెప్పారు.

భీమ్‌ డ్రమ్‌ జరుగుతుందని తెలిసి… ఇందులో పాల్గొనడానికి పలు సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా వచ్చారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి నుంచి మార్పు కళామండలి వ్యవస్థాపకులు ప్రత్యేకంగా విచ్చేసి అంబేద్కర్‌, ఫులేలపై పాటలు పాడారు. తన పాటతో అంబేద్కర్‌ని జయరాజ్‌ అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న మరోసారి దళిత చిందేశాడు. భీమ్‌ డ్రమ్‌ ఈవెంట్‌ కోసమే కామ్రేడ్‌ మిత్ర రాసిన గీతాన్ని విమలక్క బృందం గానం చేసింది. ధీమ్‌ సాంగ్‌గా స్కైబాబా రాసిన కవ్వాలీ ఓయూ క్యాంపస్‌లో అలాయి బలాయిని మళ్లీ ఆడించింది. భీమ్‌ బోలోరె మీమ్‌ కొ లేకే మీమ్‌ బోలోరె భీమ్‌ || భీమ్‌ || ఖాందా మిలాలే – దిల్‌ సె లగాలే || ఖాందా || బోలోరె బోలో భీమ్‌ భీమ్‌ భీమ్‌ || అంటూ సాగిన ఆ గీతానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ కోరస్‌ ఇచ్చారు. జిలుకర శ్రీనివాస్‌, కోట శ్రీనివాసగౌడ్‌, పసునూరి రవీందర్‌, గుర్రం సీతారాములు,సూరేపల్లి సుజాత వంటి దళిత థింకర్స్‌, రైటర్స్‌ కార్యక్రమంలో హుషారుగా పాల్గొని ఊపునిచ్చారు. కొత్త చూపుని అందించారు.

ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే… ఓయూ సాక్షిగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇంతటితో ఆగబోవడం లేదు. ఇదే తరహా కార్యక్రమాలను తెలంగాణలోను, ఇతర రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల్లో కూడా నిర్వహించాలని నలిగంటి శరత్‌ ప్రభృతుల ఆలోచన. విద్యార్థి, యువజనుల ముందు తమ ప్రణాళికను ఉంచాలనీ, కవిగాయక బృందాలను కదిలించి రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌లో కలుపుకు రావాలనీ వారి తాపత్రయం. తదనంతర కాలంలో దీనినొక రాజకీయ అభివ్యక్తిగా తీర్చిదిద్దాలన్నది వారి సంకల్పం. శరత్‌ అనే మొండిఘటానికి, ఐలయ్య అనే జగమెరిగిన దళిత మేధావి తోడవడంతో సమీప భవిష్యత్‌లోనే ఇందుకు వారు ఉద్యుక్తులు అవుతారన్న నమ్మకం కలుగుతోంది. ఇదీ మొత్తంగా భీమ్‌ డ్రమ్‌ అనే సాంస్కృతిక మహాప్రదర్శన తాలూకు అంతస్సారం…!

2009లో ఉస్మానియా విద్యార్థుల గర్జన తెలంగాణ ఉద్యమాన్ని ఏ మలుపు తిప్పిందో చూశాం. 2015 మే 3న కూడా ఉస్మానియాలో రిథమ్‌ ఆప్‌ బహుజన్స్‌ పేరుతో విద్యార్థులు గర్జించారు. దీన పరిణామ ప్రభావాలను ముందు రోజుల్లో చూడబోతాం.

*

మీ మాటలు

 1. డా.పసునూరి రవీందర్‌ says:

  అరుదైన చారిత్రక సందర్భాన్ని అక్షరీకరించిన ఈ కలానికి సలాం. మూడువేల యేండ్లుగా మా చరిత్ర అంతా కప్పిపెట్టబడ్డదే. ఇప్పుడిప్పుడే మళ్లీ మేం శక్తినంతా కూడగట్టుకొని నిలబడుతున్నాం. నిజానికి ఇదొక ఎదురీత. ఈ ఎదురీతకు ఒమ్మి రమేష్‌బాబన్న వంటి రచయితలు, యాక్టివిస్టులు అండగా నిలబడితే, మాకు మరింత బలమొస్తది. భీం డ్రమ్‌ కార్యక్రమానికి వచ్చి, మా అందరినీ ప్రోత్సహిస్తూ ఇలా అక్షరబద్ధం చేసినందుకు రమేషన్నకు నా తరుపున, నలిగంటి శరత్‌ తరుపున వెయ్యిన్నొక జైభీంలు! మీ కలను నిజం చేస్తాం..మరో ఉద్యమానికి మేమే సారథులై నిలబడుతాం.. Its Promise..
  -మీ పసునూరి రవీందర్‌

 2. chandh-thulasi says:

  మొదట శరత్ కి అభినందనలు. పాట ఆయుధంగా మారి ….చరిత్ర గతిని మార్చిన సందర్భాలు అనేకం. ఈ భీం డ్రమ్ ఆరంభ శూరత్వంలా కాక నిలకడగా మనుగడ సాగించి దళిత బహుజనోద్యమాన్ని ….ముందుకు తీసుకెళ్ళాల్సి ఉంది.
  – ఇక ఈ భీం డ్రం గురించి ఉద్విగ్న భరితంగా వర్ణించిన రమేశ్ గారి రాతలో ఆప్యాయత ఉంది. దళిత-బహుజనోద్యమం మరింత ముందుకు వెళ్ళాలన్న ఆకాంక్ష ఉంది. రవీందర్ చెప్పినట్టు…మరింతమంది రచయితలు ఉద్యమానికి అండగా నిలవాల్సి ఉంది.

 3. matta srinivas says:

  Prof.kanche Ilaiah+ sharath naliganti chamar….the new energy for the .dalit …bahujan politics in telangana.but you forgotten to write the main thing ….sharath statement …to stop singing the revolutionary songs and telangana songs ….only ambrdkarite bahujan songs….on bheem drum ….this is the new turn in dalit bahujan …..the actual aim of bheem drum is …to turm from communist to ambedkarism ….long live dalit bahujan unity…..jai bheem …..jai bheem drum

 4. saakya maharaj says:

  ఒమ్మి రమేశ్ బాబు గారు, అద్భుతంగా రాశారు. నిజమే, శరత్ పెద్ద మొండి. అందరం సహకరిద్దాం. మనం అనుకున్నది నిజం చేద్దాం.

 5. Dayakar Rao Muthyala says:

  Ramesh gari text is very Dynamic & heart touching …all the best to him in future also..may he might do miracles.

 6. మట్టా శ్రీనివాస్ గారు communist to ambedkarism అంటున్నారు .మన ప్రయాణం ముందుకా వెనక్కా

 7. Thirupalu says:

  సర్, ముందడుగు అనుకుంటున్న వెనక వాళ్లు. కులం లోనే అణగారిన వర్గాలను అణగ దొక్కాలనుకునే అధికార వర్గ తాబే దార్లు.

మీ మాటలు

*