అమ్మల దినం కమ్మని కావ్యం

సుధా శ్రీనాథ్

sudha“అమ్మా! కొరియన్ భాషలో కూడా అమ్మని ‘అమ్మా’ అనే అంటారట!” పాప స్కూల్నుంచి వస్తున్నట్టేచెప్పింది. తన క్లాస్‍లో ఉన్న కొరియన్ అమ్మాయి చెప్పగా వాళ్ళు కూడా మనలా కన్న తల్లిని‘అమ్మా’ అనే పిలుస్తారని అ రోజే తెల్సిందట. ఆ రోజు శుక్రవారం. ఇంక రెండ్రోజులకే మదర్స్ డే.అందుకే స్కూల్లో మదర్స్ డే గురించే ఎక్కువ మాటలు నడుస్తుంటాయి. ఆ మాటల్లో ఈ విషయంతెలిసి పాపకు చాలా ఆశ్చర్యమయ్యిందట. నాక్కూడా చాలా ఆశ్చర్యమయ్యింది. చిన్న పిల్లలతో ఆర్ట్క్లాస్‌లో అమ్మలకని మదర్స్ డే కార్డ్ చేయించేటప్పుడు పిల్లల మాటల్లో బయట పడిన విషయమిది.కొత్త విషయలేం తెల్సినా ఆ రోజే నాకు చెప్పే అలవాటు పాపకు. పాప నా కోసం చేస్తున్న మదర్స్ డేకార్డ్ గురించి కూడా చెప్పింది. నా ఇటాలియన్ స్నేహితురాలు అమ్మను ‘మమ్మా’ అనిపిల్చినప్పుడు అది అమ్మా అనే మాదిరే ఉందనుకొని సంతోషించాను నేను. అయితే అచ్చ తెలుగుపదమనుకొన్న అమ్మ అనే పదాన్ని అదే అర్థంతో వాడే ఇంకో దేశముందన్న విషయం తెలిసిమహదానందమయ్యింది.

 నిజం చెప్పాలంటే నాకు ఈ అమ్మల దినం గురించి తెల్సింది అమేరికాకొచ్చిన తర్వాతే. మొదట్లోతమాషాగా అనిపించినా నా స్నేహితుల్లోని అమ్మలందరినీ అభినందిస్తానా రోజు. అమ్మాయికి అమ్మపట్టం దొరికేది మొదటి బిడ్డకు జన్మనిచ్చిన రోజే. అందువల్ల మొదటి శిశువు పుట్టిన రోజే అమ్మపుట్టిన రోజు. అందుకే పాప పుట్టిన రోజే నాకు మదర్స్ డే అనేదాన్ని. ఈ సారైతే అది సరిగ్గా పాపపుట్టిన రోజే రావడం మళ్ళీ విశేషం.

 ఆ రోజు కోవెల్లో మా తేనె తెలుగు క్లాసులో కూడా అమ్మల దినం గురించే మాటలు. జన్మనిచ్చినావిడేజనని, అమ్మ అని టీచర్ అంటున్నట్టే “In seahorses, the male seahorse delivers the babies. So, father is the mother.” చిన్నారి నితిన్ తుంటరి నవ్వులతో అపరూపమైన ఈసత్యాన్ని తెలియజేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవడమే కాదు, వారి ప్రశంసలకుపాత్రుడయ్యాడు. అమ్మ నాన్నలిద్దరూ ప్రేమ స్వరూపులే అనేందుకిదొక చక్కటి ఉదాహరణమనిటీచరిచ్చిన బదులు తన సమయస్ఫూర్తిని చూపింది.

ప్రతియొక్కరూ లేచి నిలబడి అమ్మ గురించి తమ భావాలను వెల్లడించ సాగారు. చిన్న పిల్లలు తమబాల భాషలో అమ్మ తమకిష్టమైనవి వండి పెడుతుందని కృతజ్ఞతలను తెలిపితే, ఇంచు మించుపదేళ్ళ వయస్సున్న వారు కొందరు అమ్మ తమ కోసం చేసే ఎన్నో పనులను లిస్ట్ చేస్తూధన్యవాదాలు తెలిపారు.

అమ్మ ప్రతి రోజూ అందరికన్న ముందే లేచి అందరికీ అన్నీ సమయానికి సరిగ్గా సమకూర్చేందుకుకృషి చేస్తుందని ప్రతియొక్కరూ గుర్తు చేసి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేసారు. “While she tells she isn’t working, she is the one who works seven days a week.” అమ్మ గురించి ఓపాప చెప్పిన ఈ మాట అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. అమ్మ పనులకు ఆదివారం కూడా సెలవుదొరకదు. అయితే ఇంత చిన్ని పాపలే అంతగా ఆలోచిస్తున్నారనేది విశేషం.

తమ తప్పులు తిద్దేటప్పుడు కసిరినా కూడా అమ్మ అన్ని వేళల్లోనూ సహాయం చేస్తుందన్నారుకొందరు పిల్లలు. కొందరు తమ కృషికి తగ్గ ప్రతిఫలం దొరకనప్పుడు తమకు సహానుభూతి చూపించితమ మనోబలాన్ని పెంచే పని కూడా అమ్మ చేసిందని చెప్పారు. పిల్లల్ని మంచి నాగరికులుగాతీర్చిదిద్ది సమాజానికి సమర్పించే పుణ్య కార్యంలో అమ్మల పాత్ర అతి ముఖ్యం. అదేంసామాన్యమైన పని కాదు. దాని కోసం ప్రతి దినం, ప్రతి క్షణం, శ్రమించే అమ్మలకు అందరూఅంజలీబద్ధులై నమస్కరించారు.

యా దెవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

సకల జీవరాసుల్లోనూ మాతృ రూపంలో ఉండి మాతృ భావనలను పెంపొందించే జగన్మాతకి నమస్సుమాంజలి. ఇంకో అమ్మని సిద్దం చేసే శక్తి అమ్మకే ఉంది. తన అమ్మాయిలకు పిల్లల్ని సహృదయ నాగరికుల్లా తీర్చిదిద్దడానికి కావలిసిన మౌల్యాలను, కౌశల్యాలను, సహనాశక్తిని కూడా దారబోసి పెంచగలిగింది అమ్మొక్కతే.

‘అమ్మా’ అనే రెండక్షరాల మంత్రం అన్ని సమయాల్లోనూ శక్తినిచ్చే మంత్రం. ఏదైనా నొప్పి పెట్టినప్పుడు పలికే పదం ‘అమ్మా’ అని. వింతలు విడ్డూరాలు చూసినప్పుడు ‘అమ్మా’ అంటాం. ఆకలైతే ‘అమ్మా’ అంటాం. కష్ట సుఖాల్లో హాయినిచ్చే మంత్రమే అమ్మ. అమ్మ అనే బంధం అత్యమూల్యమని, అమ్మ అంటే ఆప్యాయతకు మరో రూపమని, తల్లిని మించిన దైవం లేదని అందరూ ఏకగ్రీవంగా అనుమోదించారు. కొందరు ఊర్లో ఉన్న అమ్మను తల్చుకొని కంట తడి పెడ్తే ఇంకొందరు పోగొట్టుకొన్న అమ్మను తల్చుకొని అశ్రుతర్పణమిచ్చారు. ఆ రోజు అందర్నీ నిజంగా భావుకుల్ని చేసింది.

అతి సులభంగా రాయగలిగే తల్లీ పాపల చిత్రాన్ని బోర్డ్‍పై రాసిందో చిన్నారి. అమ్మో! ‘అ’ అక్షరాన్ని మూడు ముక్కలు చేసి రాసినట్టు కనపడే ఆ చిత్రం అచ్చం అమ్మ ఒడిలో పడుకొన్న పాపలా అగుపడింది. ఇంకో చిన్నారి బోర్డ్‌పైన ‘MOM’ రాసి, దాన్ని తల క్రిందులుగా చూస్తే ‘WOW’ అని చెబుతూ వాళ్ళమ్మను కౌగలించుకొంది. రెండూ అందరికీ ఎంత నచ్చాయంటే అందరం రెంటినీ నోట్ బుక్‌లో రాసుకొన్నాం.

అడగందే అమ్మైనా పెట్టదనే సామెతని గుర్తుచేశారొకరు. “That’s not a nice thing to say.”అంటూ తనకి అదస్సలిష్టం కాలేదంటూ అమ్మ వైపు చూసి బుంగమూతి పెట్టాడో చిన్నారి. “అమ్మ అని ఇంగ్లిష్‌లో రాసినప్పుడు a.m.m.a. is a palindrome because it reads the same from both sides. అమ్మ అనే పదమే చాలా స్పెషల్.” అంటూ తాను కనిపెట్టిన సత్యాన్ని సంతోషంతో చెప్పుకొనిందో చిన్ని పాపడు. Necessity is the mother of invention అని మదర్ పదం ఉన్నటువంటి ఇంగ్లిష్ ఉక్తిని చెప్పింది ఇంకో చిన్నారి. తల్లిని మించిన దైవం లేదన్నారింకొకరు.మొత్తానికి అందరి మాటలూ అమ్మ గురించే.

తెలుగు మాట్లాడే మనమందరం తెలుగు తల్లి పిల్లలం. ఆ తల్లి ఆశీర్వాదం మనకెప్పుడూ ఉంటుందన్నారు టీచర్ క్లాస్ ముగిస్తూ. తక్షణమే సప్తస్వరాల్లాగ ఏడు మంది పిల్లలు లేచి నిలబడి ఇంకో పది నిమిషాలు అందరూ అక్కడే ఉండాలని మనవి చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రంగు దుస్తుల్లో,వేర్వేరే రంగులు కాబట్టి ఆ ఏడుగురు ఇంద్రధనుస్సులా కనపడ్డారు.  వరుసగా నిలబడి ఏంజెల్స్‌లాగ చిరునవ్వులు చిందిస్తూ ‘అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా’ అంటూ అత్యంత మధురంగా పాడ సాగారు! అమ్మలు తమ చిన్నారుల కోసం చేసినట్టు ఈ చిన్నారులేడుగురు కలిసి అమ్మలందరికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. పాప ఈ మిగతా ఆరుగురితో కలిసి ఇదెప్పుడు నేర్చుకొనిందా అని ఆశ్చర్యపడ్డం నా వంతయ్యింది. అమేరికాంధ్ర పిల్లల్లా కాదు, అచ్చ తెలుగు పిల్లల్లా స్పష్టంగా వారు పాడిన ఆ పాట అందర్నీ తన్మయులై వినేట్టు చేసింది.

అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా

అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా

అమ్మ అన్న పదం సుస్వరాల వేదం

అమ్మ అన్న పదం సదా ప్రణవ నాదం

అమ్మ అన్న పదం సృష్టికి మూలాధారం

అమ్మ అన్న పదం సమదృష్టికి కొలమానం

పాట ముగుస్తున్నట్టే ఒకటే చప్పట్లు! పూర్వ సిద్ధత లేకుండా ఇంత మంచిగా పాడటం అసాధ్యం.పిల్లలీ పాటను ఎక్కడ, ఎప్పుడు నేర్చుకొన్నారనేదే అందరి ప్రశ్న. యూ ట్యూబ్లో గీతా మాధురి విడియోల ద్వారా తాము ఒక్కొక్కరే తమ ఇంట్లో మళ్ళీ మళ్ళీ వినిపించుకొని ఎవ్వరి సహాయమూ లేకుండానే నేర్చుకొన్నారట. ఒక్కే ఒక సారి కూడా జతగూడి పాడక పోయినా పర్ఫెక్ట్‌గా సింక్రొనైజ్ చేసి మా ముందుకు తీసుకొచ్చారు. మాకెవ్వరికీ పిల్లల ఈ ప్లాన్ గురించి మచ్చుకైనా అనుమానం రాలేదు. అంటే అంత బాగా రహస్యం కాపాడుకొచ్చారన్నమాట.

అమ్మను గురించి అమ్మ భాషలోనే ఒక పాటని యూట్యూబ్లో వెదుక్కొని, నేర్చుకొని, పాడి అమ్మను సంతోషపరచాలనే ఆ చిన్నారుల అంతరంగ భావనకు అమ్మలందరం అమితానందంతో ఊగిపోయాం.ఆ పది నిమిషాలను సక్రమంగా వినియోగించుకొని దీనికో అనుబంధం కూడా ప్లాన్ చేశారు పిల్లలు.అమ్మల దినోత్సవానికని ఆ రోజు కోవెల్లో స్వయంసేవకులు విశేషంగా తయారు చేసిన మహా ప్రసాదాన్ని తామే పట్టుకొచ్చి అమ్మలకు అమ్మ ప్రేమతో వడ్డించినారు. పిల్లలందరి ముఖాల్లో తాము కన్న కల సాకారమైన సంతోషం ఉట్టి పడుతోంది. అది కృషి చేసి లక్ష్యం సాధించిన సంతోషం. వారి మొహాలు సంతోషంతో మెరుస్తూ వుంటే ఒక్కొక్కరూ ఆణి ముత్యంలా అగుపించారు. అభం శుభం ఎరుగని చిన్నారులు ఎంతగా ఎదిగారనిపించింది. ఆ చిన్నారుల ప్రేమ అందరి కళ్ళలో ఆనంద బాష్పాలను తెచ్చింది.

Mother Nature is taken for granted. As a result, we are facing global warming. For a healthy, happy living we need to protect Mother Nature. మనమందరం ప్రకృతి మాత బిడ్డలం. ఈ మధ్య భూమి, నీరు, గాలి అన్నీ కలుషితమై పోతున్నాయి. తల్లిని ఆదరించినట్టే మనం ప్రకృతిని, పరిసరాలను ఆదరించాలి. అంటే పర్యావరణ రక్షణ కూడా మన నిత్య జీవితాల్లో ఒక ముఖ్య భాగం చేసుకోవాలన్నారు ఒక పెద్దావిడ. ఆ దిశలో మేమేం చేయగలమనే పిల్లల ప్రశ్నకు ఆవిడే బదులిచ్చారు. ముఖ్యంగా మూడు సూత్రాలను పిల్లలందరూ పాటించగలరని. ఒకటి: నీళ్ళు వృథా చేయకూడదు. రెండు: ఆహారం వృథా చేయకూడదు. మూడు: ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ఈ మూడింటిని పాటిస్తామని పిల్లలావిడకు మాటివ్వడం అమ్మలకే కాదు అందరికీ సంతోషాన్నిచ్చింది.

ఇటీవలి పదేళ్ళలో ఇండియాలో కూడా అమ్మల దినోత్సవం జరుపుకోవడం జనప్రియమవుతూందనేది ఒక శుభ సూచన. Taken for granted అనే భావన ఎవరికీ రాకూడదనే ప్రయత్నాలలో ఇదో ముందడుగు. అమ్మల సేవలు ప్రత్యేకంగా ఆదరింపబడి, పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని స్వస్థ కుటుంబం కోసమని తను చేసే త్యాగాలు గుర్తింపబడి గౌరవింపబడుతున్నాయి. ఏడాదికొక రోజు అమ్మకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రతి రోజూ తను మనందరి కోసం చేసే పనుల్లో పాలు పంచుకోవడమే పెద్ద గౌరవమన్నారు ఇంకో పెద్దాయన. దానికి అంగీకరించి తలూపనివారు లేరు. అందరికీ ఆ రోజు మాతృభూమియైన తెలుగుగడ్డపై ఉన్నట్టనిపించింది. అమ్మలకు తమ అమ్మతో ఉన్న అనుభూతినిచ్చి, చాలా హాయనిపించి, ఈ వేడుక ఒక కమ్మని కావ్యంలా మదిలో మెదులుతూనే ఉంది.

మీ మాటలు

  1. అబ్బా! చిన్న చిన్న అందమైన పదాల్లో అమ్మ గురించి ఎంత బాగా చెప్పారో !! చాలా బాగుందండీ

  2. Bharadwaj Godavarthi says:

    సుధా శ్రీధర్ గారు చాల అందంగా రాసారు …ఇది చదివాకా నేను మా అమ్మ గురించి నేను రాసిన నాలుగు అక్షరాలూ మీతో పంచుకోవాలనిపించింది

    ఎందుకో ప్రపంచం ఎంత విశాలంగా వున్నా, నా ప్రపంచం నాకు ఎప్పడు చిన్నదిగానే కనపడుతుంది,
    కాని ఆ ప్రపంచంలో ఒక వ్యక్తి మాత్రం నాకు ఎప్పుడు అర్ధం కాదు,
    ఏంటో ఆ వ్యక్తికి
    ఆకలి నా కడుపుకు తెలికముందే, తన మనసుకు తెలిసేది
    నా నిద్ర కోసం, తను కునుకుపాట్లు పడేది,
    నన్ను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం, తన ప్రపంచానికి దూరంగా నడిచేది,
    పొగరుతో విసిరికోట్టిన కంచంలో ప్రేమతో భోజనం పెట్టేది,
    నా గెలుపులో తన సంతోషాన్ని, నా ఓటమిలో తన భాదని వెతుకునేది,
    నన్ను అందంగా ప్రపంచానికి పరిచయం చేయడానికి తన మిత్రుడు అద్దంతో కూడా వైరానికి దిగేది,
    నన్ను AC గదిలో కూర్చోపెట్టడానికి,తను 30 ఏళ్ళు వంటగదికె పరిమితం అయ్యేది
    చివరకి తన చిరునవ్వుని తను ఇంక ఎప్పటికి చూసుకోలేను అని తనకు తెలిసినా, నా చిరునవ్వు గురించే ఆలోచిస్తూ వుంటుంది
    ఎంటో ఆ వ్యక్తి ఎప్పటికి నాకు అర్ధంకాదు, ఆ వ్యక్తి పలికించే భావం అర్ధం కాదు
    కాని తన పేరు మాత్రం తెలుసు……అమ్మ

  3. Sudha Srinath says:

    మీ అభిమానానికి థ్యాంకండి భరద్వాజ్ గారూ! మీ మాటలు నన్నేడిపించాయి పాతికేళ్ళ క్రితమే దేహం నుండి దూరమయిన అమ్మను మళ్ళీ తలచుకొని.

  4. Vidya Tejas says:

    మీ లేఖనం భలే బావుందండి.

  5. Bharadwaj Godavarthi says:

    జ్ఞాపకంగా మిగిలిపోయిన అమ్మని కన్నిలలో కరగనియకండి ….ఎందుకంటే ఆ నిటి బింధువ విలువ నేర్పింది కూడా అమ్మే కదా

  6. vasavi pydi says:

    అమ్మ గురించి ఎంత చెప్పిన కమ్మగా ఉంటుంది ఇక అమ్మకు పిల్లలు పండగ చేస్తే అది అందరికి కన్నుల పండగే మీ కావ్యం కూడా అలాగే ఉంది పిల్లలకు వారి ని అంత బాగా పెంచిన అమ్మలకు అందరికి అభినందనలు

  7. ఎంత అందమైన భాషలో వుందో ఈ ‘.. కమ్మని కావ్యం’ ! తెలుస్తోంది ఈ మాటల్లోనే, ఆ చిన్నారి ఆణిముత్యాల ప్రేమను మీరు ఎంత సుతారంగా హత్తుకున్నారో !! చిట్టి బంగారులందరికీ బోలెడు ఆశీస్సులు , మీకు మరోసారి అభినందనలు హృదయపూర్వకంగా :)

  8. ఆచంట హైమవతి says:

    మీ పత్రికలో ప్రచురణ కోసం నా రచనలు పంపాలని నా ప్రయత్నం ! అది ఇంతవరకు ఫలించలేదు. సారంగ
    వారపత్రిక చాలా సార్లే చదివాను . త్వరలో పాల్గొనాలనే కుతూహలంతో మల్లి ప్రయత్నిస్తున్నాను. మీ పత్రిక అంటే
    చాలా ఇష్టం !

మీ మాటలు

*