అట్టలూ పోయాయి!

పి.మోహన్

 

P Mohanపదేళ్లకు మించిన అపురూప బంధం.. ఎన్నెన్ని సంభాషణలు, ఎన్నెన్ని స్పర్శలు! అసలు వియోగమనేది ఎప్పుడుందని? కడుపులోని బిడ్డకు తల్లి పేగులోంచి జీవాధారాలు అందినట్లు నిరంతరం నా బుర్రకు జ్ఞానధారను అందించిన నేస్తం. ఒక ఊరి నుంచి ఒక ఊరికి, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడల్లా బస్సుల్లో, లారీల్లో పసికూనలా తీసుకొచ్చి దాచుకోవడం.. ఏ నిధీ లేకున్నా అదే తరగని నిధి అని గర్వపడడం.. నిధి చాల సుఖమా, జ్ఞాననిధి చాల సుఖమా అని పాడుకోవడం.. అంతా ఒక వెర్రి ఆనందం!

ఇంటి నిర్మాణంలో ఒక భాగంగా అమరినట్లుండే నా ప్రియ నేస్తం శాశ్వతంగా దూరమైంది. నా ‘ఫంక్ అండ్ వాగ్నల్స్’ ఎన్ సైక్లోపీడియా ఇక కనిపించదు! మబ్బులు పట్టిన వేళ మిలమిల మెరిసే గిల్ట్ అక్షరాలతో ఇంటినీ, కళ్లనూ వెలిగించిన ఆ అనురాగ బంధం తెగిపోయింది. గత నెల నేను ఇంట్లో లేని ఒక శుభముహూర్తంలో మా ఆవిడ దాన్ని పాతపుస్తకాల వాడి తక్కెడతో పుటుక్కున తెంచేయించింది. వాడు కేజీల్లెక్కన  కొనేసి ఓ వంద మా ఆవిడ చేతుల్లో పెట్టిపోయాడు. పోతూపోతూ జ్ఞాపకంగా దాచుకొమ్మనేనేమో అట్టలను మాత్రం వదిలేసి వెళ్లాడు. అవి అమ్ముడుబోవట. ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక.. చాలా సేపటి తర్వాత.. ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించి, అదెక్కడా అని నేను కోపాన్ని అణచుకుంటూ శాంతంగా అడిగితే మా ఆవిడ సర్రున కోపం, చిరాకు, అక్కసు, వెటకారం, ఎత్తిపొడుపు వంటి సవాలక్ష రసాలతో ఇచ్చిన సమాధానం..

‘అమ్మి పారేసిన! కొంప ముందుగానే ఇరుకు. బోకులుబొచ్చెలకే గూళ్లు సరిపోవడం లేదు. ఇంక బుక్కులేడ పెట్టేది? చెమ్మకు రెండు పుస్తకాలకు చెదలు పట్టినాయి. అన్నిదాన్లకూ ఎక్కుతున్నాయి. అయినా నువ్విప్పుడు దాన్లను సదువుతున్నావా అంట! సదవనప్పుడు ఇంట్లో ఎందుకూ దండగ.. ! అందుకే అమ్మేసిన.. ఆ అటకబండపైన ఉన్న పుస్తకాలు కూడా ఎప్పుడో ఒకతూరి నీ నెత్తిపైనే పడతాయి.. దాన్లను కూడా ఎప్పుడో ఒకతూరి నువ్వు ఇంట్లో లేనప్పుడు అమ్మిపారెక్కుతా. అంతగా అయితే నువ్వు సొంత ఇండ్లు కట్టినాక కొనుక్కో ఆ బండపుస్తకాలను..’

తిరిగిరాని దాని కోసం కోపాలు, సంజాయిషీలు ఎందుకు. పైగా ఉన్నవాటినైనా కాపాడుకోవాలి కదా. అయినా అందులో ఆమె తప్పేముంది? పీత కష్టాలు పీతవి. ఇంటి సర్దుడులో ఆమెకవి శనిగ్రహాల్లా కనిపించి బెదరగొట్టేవి. అప్పటికి చాలాసార్లు విసుగుతో బెదిరించింది. ‘కోపమొస్తే దీన్లను ఎప్పుడో ఒకతూరి అమ్మిపారెక్కుతా’ అని. ‘చస్తా, చస్తా అన్న సవతే కానీ చచ్చిన నా సవితి లేద’న్న సామెతను గుడ్డిగా నమ్మి పట్టించుకోలేదు. అయినా ప్రియమైన వాటిని పోగొట్టుకోవడం కొత్త కనుకనా. అందుకే సోనియా గాంధీ ముందు మన్మోహన్ సింగు, మోడీ ముందు అద్వానీ దాల్చే మౌనముని అవతారం దాల్చేశా. బంధం తెగిపోతే పోయిందిలే, దాని ఆనవాళ్లుగా అట్టలయినా మిగిలాయిలే అనుకుని పిచ్చిగా సంతోషపడ్డాను.

3. maa avida mechin kalakhandalu

కానీ ఆ ఆనవాళ్లనూ మా ఆవిడ మొన్న పిచ్చి ఐదు రూపాయల బిళ్లకు అమ్మేసింది. ఈ సారి కొన్నవాడు మరీ పాతపాత పుస్తకాలవాడు అయ్యుంటాడు. అయినా ఇప్పుడు వగచి ఏం లాభం! అట్టలలైనా అలా పడుండనివ్వవే అని చెప్పకపోవడం నా తప్పే కదా ! జీవితంలో వస్తున్న అవాంఛనీయ, అనివార్య మార్పుల్లో భాగంగా గత నెల అప్పు చేసి ఓ కెమెరా ఫోన్ కొనుక్కున్నా. దాంతో నా ఎన్ సైక్లోపీడియాను ఫొటో తీసుకుని ఉంటే ఎంత బావుండేది! పోనీ, ఆ పుస్తకాలు అమ్మేసిన తర్వాత మిగిలిన అట్టలలైనా ఫొటో తీసుకునే ఉంటే ఆ జ్ఞాపకం నిలిచిపోయేది కదా. ఆ తెలివి లేకపోయింది నాకు(నాకు అసలు తెలివనేది ఉందా అని మా ఆవిడకు నిత్య అనుమానం. తెలివిగల వాళ్లు పుస్తకాలు చదవరని, వ్యాపారాలు చేసి బాగా సంపాదిస్తూ ఇళ్లు, కార్లు, బంగారం, చాటడంత సెల్ ఫోన్లు, పెళ్లాలకు పట్టుచీరలు కొంటుంటారని.. ఊటీ, కాశ్మీర్లకు తీసుకెళ్తుంటారని ఆమె ప్రగాఢ విశ్వాసం).

కెమెరా ఫోన్ అంటే నా తొలి కెమెరా ఫోన్ గుర్తుకొస్తోంది. నేను పుట్టిన కడప జిల్లా ప్రొద్దుటూరిలోని హోమస్ పేటలో ఉన్న ‘మా’ ఇంటి ఫోటోను పదేళ్ల కిందట డొక్కు కెమెరా ఫోన్ తో ఫొటో తీసుకున్నాను. ఐదారు కుటుంబాలు కాపురం చేసేంత పెద్ద ఇల్లు అది. 1980లలో దాన్ని మా పెదనాన్న తన తండ్రి, తమ్ముళ్లపై సామదానభేదదండోపాయాలు ప్రయోగించి తన పేర రాయించుకుని కొన్నాళ్ల తర్వాత లక్షలకు అమ్మేశాడు. కనీసం జ్ఞాపకంగానైనా ఉంటుంది కదా అని ఆ ఇంటి ముందు భాగాన్ని ఫొటో తీసుకున్నాను. 1950లలో కట్టిన ఆ ఇంటి వసారాలో రెండు పెద్ద బర్మాటేకు స్తంభాలుండేవి. వాటికి మా నాయనమ్మ నారమ్మ ఊయల కట్టి, అందులో నన్ను పడుకోబెట్టి ఊపుతూ  ‘రార.. రార సన్నోడా..’ అని పాడుతుండేదట. దూలాల్లాంటి ఇంటి అరుగుపైన మా తాత నాకు బిస్కెట్లు, తాటిముంజెలు, మెత్తని మాంసం ముక్కలూ తినిపిస్తుండేవాడట.

నేను తీసిన ఫొటోలో ఆ స్తంభాలు, అరుగులు కూడా పడ్డాయి. ఆ ఇల్లు మాకు దూరమైనట్టే ఆ ఇంటి ఫొటో ఉన్న కెమెరా కూడా దూరమైపోయింది. దాన్ని 2008లో హైదరాబాద్ సిటీ బస్సులో దొంగ ఎవడో కొట్టేశాడు. ఆ ఇంటిని కొన్నవాళ్లు దాన్ని కూల్చేసి, పెద్ద భవనం, కాంప్లెక్సు కట్టారని ఇటీవల తెలిసింది. దోగాడి, పాకి, పసుపుకొమ్ముల్లాంటి మా అమ్మ చేతులు, నల్లరేగు పళ్లలాంటి మా మేనత్త చేతులు పట్టుకుని ఆడుకున్న ఆ కడప బండరాళ్ల ఇంటి జ్ఞాపకం అట్లా శిథిలమైపోయింది.

2. atakekkin art pustakaalu

అలాంటి ప్రేమాస్పద దృశ్య జ్ఞాపకాలెన్నో తడిచూపుల మధ్య చెరిగిపోయాయి. బతుకు పోరాటంలో మా అమ్మ కోల్పోయిన చిన్నపాటి నగలు, కోపతాపాలతో ఇంట్లో వాళ్లూ, బంధువులూ పోటీలు పడి కాల్చేసుకున్న ఆత్మీయుల వస్తువులూ, అపురూపమైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలూ, పదో తరగతిలో సంస్కృతంలో స్కూలు ఫస్ట్ వచ్చినందుకు ఓ కోమటాయన బహుమానంగా ఇచ్చిన ఐదొందలను బట్టలు కొనుక్కోకుండా ఇంటర్ పుస్తకాల కోసం ఖర్చుపెట్టిన దయనీయ సాయంత్రమూ.. ఇంకా ఇంటర్ గట్టెక్కలేక అవమానాలు భరించలేక ఉరేసుకున్న కుంటి మిత్రుడు రామ్మోహనూ, ఇంటి గొడవలతో 22 దాటకుండానే పురుగుమందు తాగిన ఆప్తమిత్రుడు నాగేశుతో దిగిన ఫొటోలూ.. చచ్చిపోయిన పెంపుడు కుక్కలూ, నల్లపిల్లులూ, తాబేళ్లూ, చిలుకలూ..

అయినా  కోల్పోయింది కేవలం దృశ్యాత్మక జ్ఞాపకాలనేనా? ఉద్యమోత్సాహంలో పచ్చగా కళకళలాడే అడవుల్లో, సెలయేళ్ల మధ్య అనుభూతించిన ఆత్మీయ ఆలింగనాలు, వెచ్చని బలమైన కరచాలనాలు, గుప్పుమని వీచే అడవి మల్లెల పరిమళాల వేళ కన్నీళ్లు లేని లోకం కలగంటూ రేయింబవళ్లు ఎడతెగకుండా జరిపిన ఎర్రెర్రని చర్చలు, మళ్లీ కలుసుకోలేమోనన్న భయంతో చివరిసారి అన్నట్లు మహాప్రేమతో కళ్లారా చూసుకుంటూ లాల్ సలామ్ అంటూ ఇచ్చిపుచ్చుకున్న తడిచూపుల వీడ్కోళ్లు..

ఇప్పుడవన్నీ ఎండమావులు. గతమంతా మసకమసక పగుళ్లు. యాదృచ్ఛికంగా తారసపడినా అంతా భ్రాంతియేనా అన్న భావన. గుర్తుకు వచ్చీ రాని పేర్లు, ముఖాలు, ఊళ్లు, బాటలు, ఎన్ కౌంటరయిపోయి నెత్తురు మడుగు కట్టిన స్మృతుల పరంపర. కాలం పాతగాయాలనే కాదు, అజాగ్రత్తగా ఉంటే మరపురాని జ్ఞాపకాలనూ మానుపుతుందేమో!

ఎన్ సైక్లోపీడియా నుంచి దారి తప్పి ఎక్కడికో వచ్చాను. ఇలా శాఖాచంక్రమణాలు చేయొద్దని ఎన్నిసార్లో అనుకుంటాను కానీ సాధ్యం కాదు. పన్నెండేళ్ల కిందట.. అప్పటికింకా ఇంటర్నెట్ ఇళ్లలోకి, ఫోన్లలోకి అంతగా చొచ్చుకురాని కాలం. ఏదైనా అవసరమొస్తే ఇంటర్నెట్ సెంటర్ కో, పబ్లిక్, యూనివర్సిటీల లైబ్రరీలకో వెళ్లి తెలుసుకునే కాలం. 2004లో పనిపై హైదరాబాద్ లో కొన్ని నెలలు ఉన్నప్పుడు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా అబిడ్స్ కు వెళ్తుండేవాడిని. చాలా వరకు ఆర్ట్ పుస్తకాలనే కొనేవాడిని. ఒకసారి ఫంక్ అండ్ వాగ్నల్స్ న్యూ ఎన్ సైక్లో పీడియా 1991 ఎడిషన్ 29 వ్యాల్యూములూ దొరికాయి. బతిమాలి, బామాలి 1,600 రూపాయలకు కొన్నట్లు గుర్తు. వాటిని పెద్ద అట్టపెట్టెలో ఆటోలో రూమ్ కు తీసుకొచ్చాను. కొన్నాళ్లు ప్రతి వ్యాల్యూమునూ తడిమితడిమి చూసుకుంటూ ఉబ్బుతబ్బిబ్బయ్యాను. ఏ టు జెడ్ జ్ఞానం కదా.

ముఖ్యంగా ఆర్టిస్టుల బయాగ్రఫీలు, పెయింటింగులు చూస్తూ, చదువుతూ నిద్రాహారాలు మరచిపోయేవాడిని. అలా కొన్నాళ్లు గడిపాక, ఒక అనివార్యత వల్ల రూమ్ ఖాళీ చేసి, అనంతపురంలోని అక్కలాంటి, అమ్మలాంటి శశికళ ఇంటికి పంపాను, మా ఇంటికి పంపలేక.  కొన్నాళ్ల తర్వాత తిరిగి అనంతపురం వెళ్లాక వాటితో కుస్తీ పడుతూ గడిపాను. రాసుకున్న కవితలకు, ‘అడవి చిట్టీల’కు, ఉత్తరాలకు, పదీపరకా డబ్బులకు ఆ పుస్తకాలు భద్రస్థలాలు. డోంట్ కేర్ గా బతికిన కాలమది. కానీ కాలం లెక్కలు కాలానికుంటాయి. మనం లెక్కచేయకున్నా మనల్ని లెక్కచేసే దొంగనాయాళ్లు వేయికళ్లతో, లాఠీలు, తుపాకులతో కాచుకుని ఉంటారు. వాళ్ల బారిన పడి మనోదేహాలు ఛిద్రమయ్యాక అనంతపురాన్ని వీడి ఇంటికెళ్లాను, ఎన్ సైక్లోపీడియాను వెంటబెట్టుకుని.

బతుకులో అటూ ఇటో తేల్చుకోవాల్సిన కాలమది. కమ్చీ దెబ్బలు తిన్నవాడికి, తినని వాడికి చాలా తేడా ఉంటుంది. పైగా దెబ్బమీద దెబ్బ తినగలిగేవాళ్లు అతికొద్దిమందే ఉంటారు. నేను ఆ కొందరి కోవకు చెందని వాడిని కనుక మిత్రులు దెప్పుతున్నట్లు ‘సేఫ్’ సైడ్ ను ఎంచుకున్నాను. సామాన్యులకు సేఫ్ అనేది ఎప్పుడూ సాపేక్షికం, ఎన్ సైక్లోపీడియాలో ఎన్నిసార్లు చదివినా అర్థం కాని సాపేక్ష సిద్ధాంతంలా! కష్టం తప్ప ఏ సిద్ధాంతమూ కూడు పెట్టదని జ్ఞానోదయమయ్యాక పొట్ట చేతపట్టుకుని తిరిగి భాగ్యనగరానికి వచ్చాను. కాస్త సాపేక్షికంగా నా కాళ్లపై నేను నిలబడి, పెళ్లి చేసుకున్నాక నా ఎన్ సైక్లోపీడియాను తిరిగి తెచ్చుకున్నాను. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నా ఊరకే దాన్ని అప్పుడప్పుడూ తిప్పుతుండడం అలవాటుగా ఉండేది. ఇటీవల కొన్నాళ్లుగా అది తప్పింది. అందుకే ఒక గూటిలో సర్దుకుపోకుండా మరో గూటిని ఆక్రమించే ఆ పుస్తక సంచయం మా ఆవిడకు అక్కర్లేని పెను భూతమైపోయింది. అట్లా హైదరాబాద్ లో కొనుక్కున్న నా జ్ఞానభాండం ఎంతో భద్రంగా ఊళ్లు తిరిగి తిరిగి చివరికి ‘విధిరాత’లా మళ్లీ హైదరాబాద్ చేరి, అట్టలు వొలిపించుకుని బద్దలైపోయింది.

అరచేతిలో ఇంటర్నెట్ ఒదిగిన ఈ కాలంలో బోడి పాతికేళ్ల కిందట అచ్చయిన, డొక్కు, ఔట్ డేటెడ్, దండగమారి, అక్కర్లేని, చదలు పట్టిన ఎన్ సైక్లోపీడియా కోసం అంతగా వగస్తావెందుకు అంటున్నారు మిత్రులు. అన్నీ ఇంటర్నెట్ లో దొరుకుతాయని వాళ్ల భ్రాంతి(పోనీ నా భ్రాంతి కూడా అనుకోండి!) అక్కర సాపేక్షికం. పనికిరావని పారేసుకున్న వాటి అసలు విలువ ఏమిటో తెలిసినప్పుడు గుండె పట్టేస్తుంది. కళ్లు సజలమవుతాయి. దుఃఖపు ఉప్పెన జపాన్ అమర కళావేత్త హొకుసాయ్ వేసిన ‘కనాగవా మహాకెరటం’ చిత్రంలా వేయి పడగలతో విరుచుకుపడుతుంది. అల విరగిపడ్డాక బోల్తాపడిన శూన్యపు పడవల్లా మిగిలిపోతాయి కళ్లు.

1. funk and wagnalls

ఇప్పటికి మూడొందలకు పైగా పుస్తకాలు కొనుంటాను. అడుక్కున్నవీ, మళ్లీ ఇస్తానని తెచ్చుకుని ఇవ్వనివీ మరో రెండు వందలుంటాయి. నేను నా మిత్రులకిచ్చినవీ, వాళ్లు నా దగ్గర పుచ్చుకుని తిరిగివ్వనివీ అంతే సంఖ్యలో ఉంటాయి. స్థలం చాలక చాలా వాటిని మూటలు కట్టిపెట్టాను. తరచూ అవసరయ్యేవాటిని అటకెక్కించాను. ఈ అటక విద్య నాకంటే మా ఆవిడకు మరింత బాగా తెలుసు. ఇల్లు ఇరుకని గోలచేసే ఆమె తను మహా కళాఖండాలుగా భావించే బాతు, కుక్క, కొంగ, కోడి బొమ్మలను మాత్రం షోకేస్ లో చక్కగా విశాలంగా సర్దుతుంది. వారానికోసారి జాగ్రత్తగా తుడుస్తుంది. సంక్రాంతికి సంక్రాంతికి సబ్బెట్టి తోమితోమి స్నానాలు కూడా చేయిస్తుంది. నా పుస్తకాలను మాత్రం పనికిరాని చెండ్లలా అటకపైకి విసిరిపారేస్తుంది. ఎదుటివాళ్ల అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్యం. ఈ వింత ప్రజాస్వామ్యంలో నాకు ఏదైనా పుస్తకం అవసరమైతే మంచాలూ, కుర్చీలూ ఎక్కి ఆ అటకపైని పద్మవ్యూహంలోకి చొరబడి వెతుక్కోవడం. చాలాసార్లు అభిమన్యుడి చావులే.

కొన్నిసార్లు కొన్నిపుస్తకాలు కనిపించవు. ఆవిడకేసి చూస్తాను. ఆమె మౌనయోగినిలా చూసి పక్కగదిలోకి వెళ్లిపోతుంది. ఆ చూపులకు సవాలక్ష అర్థాలు! కనిపించని పుస్తకాలు ఒక్కోసారి విఠలాచార్య సినిమాల్లో దెయ్యాల మాదిరి అటకెక్కిన పాత కుక్కర్లో, పాతచీరల మధ్యలో, పాతసామాన్ల మూటల్లో, ఇంకా ఊహించశక్యం కాని నానాస్థలాల్లో దర్శనమిస్తాయి. అసలు కనిపించకుండా పోవడం కంటే ఎక్కడో ఒక చోట పడుంటే మేలు కదా. ఇంట్లో ఎన్ని పుస్తకాలున్నా ఎన్ సైక్లోపీడియానే చుక్కల్లో చందమామలా కొట్టొచ్చినట్టు కనపడేది 1,2,3…. 29 నంబర్లతో వరుసగా ఎర్రని అట్టలపై బంగారువన్నె అక్షరాలతో, యూనిఫామ్ లో వరుసగా నిల్చున్న బడిపిల్లల్లా.

ప్రతి ఇష్టానికీ కారణం లేకపోవచ్చు కాని, ప్రతి వియోగానికీ ఒక కారణముంటుంది. సామాన్యులకు ఎదురయ్యే వియోగాల కారణాల్లో చాలా తక్కువ మాత్రమే స్వయంకృతాలు, మిగతాన్నీ అన్యకృతాలు. బోడి పుస్తకాల కోసం ఇంత వలపోత ఎందుకని పాఠకులకు అనిపిస్తుండొచ్చు. ఒక నిర్దిష్ట కాలపు వ్యక్తుల సామూహిక  ఈతిబాధలు సహజంగానే చరిత్రలో భాగం అవుతాయని అంటారు కదా, అందుకని. అలాగని నా గోస చరిత్రకెక్కాలన్న తపనేం నాకు లేదు కానీ, రాసుకోకుంటే చాలా జ్ఞాపకాలను మరచిపోతాం కనుక ఇలా రాతకెక్కించడం.

గూళ్లు లేని ఇరుకు ఇల్లు, చదలు పట్టడం, కొన్నాళ్లుగా ముట్టకపోవడం వగైరాలు.. ఎన్ సైక్లోపీడియాతో నా అనుబంధం తెగడానికి కారణాలని మరోసారి సరిపెట్టుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్ పాత పుస్తకాల షాపుల్లో ఫంక్ అండ్ వాగ్నల్స్ ను మించిన బ్రిటానికా, మ్యాక్ మిలన్ వంటి ఎన్ సైక్లోపీడియాలు పది, పదిహేను వేలకు వస్తాయి. బేరమాడితే ఇంకా తక్కువకు. కానీ.. కలం, కాగితం అక్కర్లేకుండా తయారైన ఈ వ్యాసాన్ని జీమెయిల్ లో ‘సారంగ’కు పంపుతున్న నాలో.. గూళ్లకు సరిపడే ఆ జ్ఞానభాండాగారాలను కొనాలన్న అభిలాష ఇంకా మిగిలి ఉందా అని?

*

 

 

మీ మాటలు

 1. VENUGOPALA NAIDU KANDYANA says:

  kaasta atuituga na swayam anubhavam Mohan Garu.

 2. ఎన్ వేణుగోపాల్ says:

  చాల బాగుంది మోహన్ కన్నీటి తడి లాగ, గుండెను మెలిపెట్టే పురాస్మృతి లాగ…

 3. m.viswanadhareddy says:

  నాకు అసలు తెలివనేది ఉందా అని మా ఆవిడకు నిత్య అనుమానం. తెలివిగల వాళ్లు పుస్తకాలు చదవరని, వ్యాపారాలు చేసి బాగా సంపాదిస్తూ ఇళ్లు, కార్లు, బంగారం, చాటడంత సెల్ ఫోన్లు, పెళ్లాలకు పట్టుచీరలు కొంటుంటారని.. ఊటీ, కాశ్మీర్లకు తీసుకెళ్తుంటారని ఆమె ప్రగాఢ విశ్వాసం) ఈ స్టేట్మెంట్ చదివినాక గుర్తోచ్చ్చిన సంఘటన .
  .నా చిన్ననాటి మిత్రుడికి 20 ఏళ్ల తర్వాత కనిపించాను”” . ఏరా..! నువ్వు ఏమీ మారలేదు .అట్లాగే వున్నావ్ ” అన్నాడు . ఎందుకు మారలేదు .. జుట్టు రాలిపోయింది .. సన్నబడి పోయాను .షుగర్ సంపాయించుకున్నాను.
  కళ్ళకి అద్దాలు చేరినాయ్ .. ఇంకా ఎమి మారాలిరా .. నేను మారినట్లు కనిపించలేదా ..! అన్నాను .. “”అదికాదురా .. ఆ చేతిలో పుస్తకం …ఇంకా వదల్లేదా “.. ఒక వెకిలి నవ్వు నవ్వాడు . దానర్థం నేనింకా బాగుపడలేదు అని .. అదేంట్రా .. అలా నవ్వుతావ్ పుస్తకం చేతిలో వుండటం మంచి లక్షణమే కదా అన్నాను . నువ్వు బొత్తిగా మారలేదు ..అది సరే కాని నాకు బస్సుకు టైమైంది వుంటా .. అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు . బహుశా వాడికి నాతో మాట్లాడటం కూడా టైం వేస్టు అనుకున్నట్టు వున్నాడు

 4. P Mohan says:

  నాయుడు, వేణు గోపాల్, విశ్వనాథ రెడ్డి గార్లకు థ్యాంక్స్.
  రెడ్డి గారూ.. మీకు ఎదురైనా అనుభవాల్లాంటివి నాకూ చాలానే వున్నాయి. అందుకు బాధ లేదు కానీ కేవలం సంపాదనలో తేడా వల్ల అలనాటి స్వచ్చమైన స్నేహాలు పోతున్నాయన్న దుఃఖం.

 5. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ ఎన్నో సారూప్యతలు. కాకుంటే నేను కాస్త ఇనప రాక్ లు రెండు కొనుక్కొని వాటిలో పుస్తకాలు పెట్టుకోగలిగాను మా ఆవిడకు అడ్డం రాకుండా! పుస్తకాలు దాచుకొనే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది మీ జ్ఞాపకాల్లోని తడి. చాలా బావుంది.

 6. కల్లూరి భాస్కరం says:

  అందరం ఒక గూటి పక్షులమే మోహన్ గారూ..ఒకరికొకరు సానుభూతి తెలుపుకోవలసిందే. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక కథ రాసి టేబుల్ మీద కాగితాల్లో పెట్టి కాలేజీకి వెడితే, నా దగ్గరి బంధువు ఒకామె చిత్తు కాగితాలతోపాటు ఆ కాగితాల్ని కూడా అమ్మేసింది. ఎన్ని రోజులు బాధపడ్డానో!

 7. పోలీస్ దెబ్బలకంటే ఈరకమైన దెబ్బలు రోజూ బాధపెడుతూ ఉంటాయి.ఇంట్లోవాళ్ళకు ఈ విషయం తెలిసేటట్లు చేయకపోతే ఇలాగే దెబ్బలు ………….

 8. rajaram.t says:

  పుస్తకాలు చదువాలనే తపన వాటిని కాపాడుకోవాలనే చింతన ఇల్లు మారినప్పుడల్లా వాటిని భద్రంగా తీసుకెళ్ళే ఓర్పు ఇవన్నీ కాక ఇల్లాలి అసంతృప్తి ఆ పుస్తకాలపై.. ఒక నిజం అద్భుతంగా చెప్పావు మోహన్ గారు..

 9. నాదీ ఇంచుమించు అదే అనుభవం. ఆడువారి మనస్తత్వం కూడా అవగతం కావాలి.హార్మనీ లేకపోతె ఎంత కష్టం ఎంత కష్టం

 10. N.RAJANI says:

  మోహన్ గారు పుస్తకాలతో మీ అనుబంధాన్ని పంచుకున్న విధం బాగుంది .కాని ఆవిడలను జనరలైజ్
  చేయకండి. అంతే కాదు మీ పుస్తకాల ప్రేమను మీరు ఆమెతో పంచుకోగలిగితే ఇంకా బాగుండేది.

 11. యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ భలేగా చెప్పారు…బాధాతప్త హృదయం తో …ఓ పుస్తక నేస్తం.

 12. P Mohan says:

  పిన్నమనేని, భాస్కరం, రవిబాబు, రాజారం, మురళి, రజని, అనిల్ గార్లకు ధన్యవాదాలు.
  రజని గారూ,
  నేను ఆవిడలను జనరలైజ్ చేయలేదు. ఇల్లు కాస్త పెద్దగా ఉండి(సొంత ఇల్లయితే మరీ మంచిది) ఉంటే మా ఆవిడ ఎన్సైక్లోపీడియాను అమ్మకుండా ఉండేది. తరచూ ఇళ్లు మారడం, చోటు లేకపోవడం వల్లే చాల పుస్తకాలు పోతుంటాయి. ఇది నా అనుభవమే కాదు చాల మంది మిత్రుల అనుభవం కూడా.

 13. Hi Mohan garu,
  మీ కాలమ్ చదువుతున్నంత సేపు నేను కూడా నోస్తాల్హియా బాగా ఫీల్ అయ్యాను. మన ఇద్దరికీ రెండు సారుప్యతలు …..ఒకటి – నా జన్మ స్థలం కూడా మీ హోమ్స్ పేట లోని….కాంపుల ఆస్పత్రి…
  రెండు…..ఒక చోట స్థిరం గా లేని కారణం గా , చాలా పుస్తకాలూ పోగొట్టుకున్న….అనుభవాలు..
  ఒక విధం గా నేను అదృష్ట వంతుడి నే….ఎందుకంటే ” మా ఆవిడ” నా పుస్తకాలను చాలా జగ్రత్హగా చూస్తుంది…
  మీరు రాసిన విధానం చాలా బాగుంది….
  ఫర్ ఫుర్థెర్ చొంప్లిమెంత్స్ అండ్ ఇంటరాక్షన్ ప్లీజ్ కాల్ మే
  09445954078

 14. చాలా సహజంగా పుస్తక ప్రియులందరి వేదన ఆ తడి అంతరంగాన్ని తడిమారు మోహన్. ఇది అందరికి స్వానుభవమె. అయినా ఒకసారి మరల రాతలలో చదువుకోవడము మనల్ని మనం తడుముకున్నట్టు ఉంటుంది. ఇంకా జీవితంలో దెబ్బలంటారా అవి ఒక్కొక్కరిని ఒక్కోల నిలబెడతాయి. ఏది ఇక్కడ ఇప్పుడు భద్రం కాదు కదా. మూడు పంటలు పండించి తలపాగా చుట్టి మీసం మెలేసే కోస్తా రైతు రోడ్డున పడ్డట్టు ఎవరి బతుకులు సాఫీగా సాగవు అటు ఇటు కొంత తేడా కావచ్చు ఆలస్యం కావచ్చు. ఇలా మీతో మాతాదినట్టు రాసుకొనే అవకాసం ఇచ్చిన సారంగకు ధన్యవాదాలు.

మీ మాటలు

*