మనసు భాషకి అతనే నిఘంటువు!

ఆర్. దమయంతి 

 

damayanthi‘తాగితే మరచిపోగలను.  తాగనివ్వదు.

మరచిపోతే తాగ గలను – మరవనివ్వదు.’

హు! – అంటూ  ప్రేక్షకుల చేత  కన్నీళ్ళు తాగించిన కవి! ప్రేమపూదోటమాలి.

మనసు మీద మాయని ఒక తీపి గాయం

వలపెరిగిన వారి ఎద మీద పచ్చ బొట్టయిన చందం

– ఆ అక్షరం!

వెనక జన్మ బాసలకి

వెన్నెల విషాదాలకీ కన్నీటి సాక్ష్యం.

తేటతేట తెనుగు పదాల భాండాగారం

సినీ గీతాల మకుటం.

అందరకీ  – ఒక మనసైన సంతకం.

ఆత్రేయ – పేరంటేనే సదా సంతసం.

******

 ఒక మగాడు – స్త్రీ కోసం కన్నీరవడం ఎంత రసవత్తరం గా వుంటుందో, ఆ విషాదపు రుచి ఎలా వుంటుందో చవి చూపించిన కవి ఎవరని అడిగితే, నాకు చప్పున – ఆత్రేయ గారే గుర్తొస్తారు. కథానాయిక దూరమైపోతున్నప్పుడో, లేదా విడిచి వెళ్లిపోతున్నప్పుడో, ఇక దక్కదని తెలుసుకున్నప్పుడో –  అప్పుడు, ఆ నాయకుడు విలవిల్లాడిపోతూ విలపిస్తుంటే..గుండె గాయాలని గీతాలు గా చేసి ఆలపిస్తుంటే..అబ్బ!మనిషన్న వాడి గుండె నొక్కుకు పోతుంది. ఉద్వేగ భారంతో గొంతు పట్టుకుపోతుంది. మరి మనల్ని అంతగా కదిలించిన కవి ఎంత గా కదలి పోయుండాలి. కాదు ఎంతగ  కడలి అయిపోయుండాలి కదూ!

చదివి రాసిందానికీ, జ్వలించి రాసిన అక్షరానికి అగ్గి పుల్లకు, అగ్ని గుండానికీ వున్నంత తేడా వుంటుంది. ఏ కవికైనా, రైటర్ కైనా స్వానుభవం తో తెలుస్తుంది.

బాలూ గారు  ఒక సారి మాటల్లో ఈ కవిని గుర్తు చేసుకుంటూ చెప్పారు.

‘నేనొక ప్రేమ పిపాసిని’ అనే  పాటని పాడమని అడిగేవారట. పాట వింటూ భోరున విలపించారట.

ఇది వినంగానే  బాధగా తలొంచుకున్నాను. ఆయన మీద ఎనలేని జాలి కలిగిన హృదయంతో.

కళ్ళల్లో వున్నదేదో కళ్ళకి తెలుస్తుంది. గుండెలో వున్న గాయాలు ఎందరికి తెలుస్తాయని. ఆయన మాటల్లో నే చెప్పాలంటే – పూల దండలో  దారం దాగుంటుందని తెలుస్తుంది. కాని, పాల గుండెలో ఏం దాగుందో ఎవరికైనా ఎలా తెలవడం?

ఇంకా  చెప్పాలంటే – ప్రేమంత మధురం గా వుండదు  ప్రియురాలు. పై పెచ్చు కఠినం కూడ.

కొండను ఢీ కొన్న అల

శిలను తాకిన ఎద

రెండూ విరిగి పోయేవే.

కాకుంటే,

– ఒకటి శబ్దిస్తూ..మరొకటి నిశ్సబ్దిస్తూ.

మనసూ, అద్దం ఒకటే. పగిలితే అతకదు. అతికించే ప్రయత్నం చేసినా అది వృధా యత్నమే.

ఆఫ్ట్రాల్ హృదయం అని కొట్టేపారేయకు… నీకేం తెలుసోయ్! దాని విలువ?-  రక్తమెంతగ ధార పోస్తే   మాత్రం దొరుకుతుందా మళ్ళా హృదయం? వేస్ట్. ఉత్తి వేస్ట్. మనసు లేని బ్రతుకొక నరకం  అని బోధించిన మనసాత్మ – ఆత్రేయ.

ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అతను ఆమెకి దూరం గా జరుగుతాడే కాని వ్యధ నించి తప్పించుకోలేకపోతాడు. ఆ పై విలపిస్తాడు. తిరిగి తనని తానే ఓదార్చుకుంటాడు. ‘పోనియి. విడిచి వుండలేనా ఏం లే. మరచిపోలేనా ఆమాత్రం? అని సరిపుచ్చుకుంటాడు.ఎలా అంటే, ఇలా-

వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా

మనసిచ్చినదే నిజమైతే ,మన్నించుటయే రుజువు కదా? అని ధీరోదాత్తను ప్రదర్శిస్తాడు.

వింటుంటే ఎంత నీరౌతుందనీ గుండె! ప్రేమిచిన ఆ బేల హృదయం పని ఎంత కరుణ కలుగుతుందనీ!! ఆత్రేయ అక్షరం లోని ఆర్ద్రత మాటలకందనిది. మడిసి తోటి ఏలా కోలం ఆడుకుంటే బావుంటాది కాని, మనసు తోటి ఆడకు మావ, పగిలిపోతె అతకదు మల్లా..’ మనసుని ఒక్క కుదుపు కుదిపి వొదిలేసే మాటలు కావు మరి!

అయినా, ఈ లోకంలో ఎన్ని అగాధ ప్రేమ గాధలున్నాయో మీకు తెలుసా? అవిఎన్నేసి విలాపాల విందు కావించుకున్నయో చెబుతారుచూడండి. ఆ ఎడబాసిన జంటలను చూద్దం – వీరి పద బింబాలలో. ప్రతిబింబాలలో.

‘ఎదురు చూపులు ఎదను పిండగ యేళ్ళు గడిపెను శకుంతల

విరహ బాధను మరచిపోవగా నిదుర పోయెను ఊర్మిళ..’

అహా! ఎంత ఓదార్పు మాటలవి !

అయినా, అసలు ప్రేమేమిటీ, ఈ మాయేమిటీ? అసలు మనసేవిటీ? ఈ మరచిపోలేని అవస్థేమిటయ్యా, ఆత్రేయా? అని అడిగితే..ఆత్రేయ నవ్వుతారు వేదాంతిలా!- తనకు మాత్రమేం తెలుసనట్టు, మౌనమైపోతారు.   ‘ ఎందుకు వలచేవొ ఎందుకు వగచేవో…ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో.. ‘ అంటూ మనసు భాష మాత్రం మౌనం అంటూ నిర్వచిస్తారు.

మరొక డౌట్ కూడా వెలిబుచ్చుతారు. మనసు లేని దేవుడు మనిషికెందుకు మనసిచ్చాడూ అంటూ కూడా వాపోతారు. అంతే కాదు, మనసు లేని బ్రతుకూ బ్రతుకు కాదు. నరకం అని తేల్చి చెప్పేస్తారు.

నిజానికి మనసంటే అర్ధం ఇదీ అనే ఒక నిజమూ వివరించారు. ఇందులో పదాలు చిన్నవే. అర్ధాలే పెద్దవి. చాలా చాలా పెద్దవి.

ఒకరికిస్తే మరలి రాదు

ఓడిపోతే మరచి పోదు

గాయమైతె మాసిపోదు

పగిలిపోతె అతుకు పడదు – ఇదీ మనసు గతి.

ప్రతి మాట వెనక ఒక సముద్ర రోదనా హృదయం వినిపిస్తుంది.

ప్రతి పదమూ –  కాసిన్ని కన్నీళ్లతో కలిపిన గంధం వోలే – ఓ విషాదం పరిమళిస్తుంది. వెరసి ఆత్రేయ హృదయం అద్దమౌతుంది. అక్షరాల అద్దకమౌతుంది. అది మనసున్న మనిషికే అర్ధమౌతుంది. గుండెకి హత్తుకుని వుంటుంది. అందుకే ఆయనతో తెలుగు వాని అనుబంధం జనమజనమకది గట్టి పడతది.

ఈయన్ని దీక్ష గా వింటుంటే అనిపిస్తుంది..వలచి వైఫల్యం పొంది, జీవితమంతా వగపు లోనే మిగిలిపోవడంలో-  ఇంత గొప్ప మాధుర్యం వుంటుందా అనే ఆలోచనకి ఆశ్చర్యమౌతుంది. కాదు అబ్బురమౌతుంది. కాదు కాదు విరహ కావ్యమౌతుంది.

ఎన్ని మౌన దుఃఖాల యెక్కిళ్ళు విన్న మనసో – ఆయన హృది కదా అనిపిస్తూ వుంటుంది నాకు. లేకపోతే? ఇంత అద్భుతం గా మనసుకి అద్దమెలా పట్టారు? కన్నీటి వూసుల్నెలా గుండెకి పూస గుచ్చారూ అనిపిస్తుంది మనసుకి.

 

అవునూ,  మనిషికి అన్నేసి కన్నీళ్ళెలా వస్తాయి?

మనసు ఇచ్చినందుకా, తిరస్కరించినందుకా ?

విరిగినందుకా? విరక్తి చెందినందుకా?

ఏ మిష వల్ల కళ్ళు కన్నీటి వాకిళ్ళౌతాయి?

‘తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు

కల్లలు కాగానే కన్నీరౌతావు..’ జస్ట్ అంతే.

అదీ, ఆత్రేయ చెప్పిన కన్నీటి వెనక గల రహస్యం. వెరీ సింపుల్ ఫాక్ట్ లా దోత్యమౌతుంది కానీ, ఎన్ని జీవితానుభవాల మూటలు విప్పిన మాటల సత్యాలు కదా ఇవి అని అర్ధమౌతుంది.

మన నించి మాయమైన మనసు జాడ తెలీని మనిషికి  నిదురెలా వస్తుంది. కానీ అంటారు ఆత్రేయ –

‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది..కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది ‘అంటూ జో పుచ్చుతారు. పాట తీయగానే వుంటుంది. వింటుంటేనే – మనసు చేదౌతుంది.  ఏ కాలమూ, అదొక ఇష్టమైన బాధ గా వింటం అలవాటౌతుంది. అందమన అలవాటు గా అయిపోతుంది.

ఎలా ..ఎలా వచ్చి చేరాయి, ఆ అక్షరాలలోకి ఆ అమృతపు జాలు?  వెన్నెలమడుగుల విషాదాలు? మనసుని మెలి పెట్టి, మైమరపించే గీతాలు? కన్నీట హర్షాలు?

‘ మరు జన్మ వున్నదో లేదో..ఈ మమతలప్పుడేమౌతాయో..’అనుకుంటూ వెళ్ళిపోయిన కవి, ‘మనసు లేని దేవుడు మనిషి కెందుకు మనసిచ్చాడని’ ప్రశ్నిస్తూ మళ్ళీ ఎప్పుడు రావడం?

పిచ్చి ప్రశ్న! అస్తమయం -రవికి కాని, కవికెక్కడుంది?

ప్రతిరోజూ జన్మదినోత్సవమే కాదా!

హాపీ బర్త్ డే టు యూ – ఆత్రేయ గారు!

మీకివే నా సుమాంజలి.

(మే 7  మన కవి, మన సుకవి –  ఆత్రేయ గారి జయంతి సందర్భంగా..)

మీ మాటలు

 1. Dr. Vijaya Babu,Koganti says:

  “ఒక మగాడు – స్త్రీ కోసం కన్నీరవడం ఎంత రసవత్తరం గా వుంటుందో, ఆ విషాదపు రుచి ఎలా వుంటుందో చవి చూపించిన కవి ఎవరని అడిగితే, నాకు చప్పున – ఆత్రేయ గారే గుర్తొస్తారు.” అంటూ మొదలై “పిచ్చి ప్రశ్న! అస్తమయం -రవికి కాని, కవికెక్కడుంది?” అంటూ …చాలా బాగుంది దమయంతిగారు.

  • ఆర్.దమయంతి. says:

   “ఒక మగాడు – స్త్రీ కోసం కన్నీరవడం ఎంత రసవత్తరం గా వుంటుందో,.. చాలా బాగుంది దమయంతిగారు.’
   * :-) నిజమండీ ఆత్రేయ గారి మీద నా మనసులోని భావం ఇది. లేకపోతే, కథానాయకుడు తాను బిచ్చగాణ్నంటూ, తనకిప్రేమ బిక్ష పెట్టమంటూ..నాలుగు నిమిషాల పాటు ఏక ధాటిగా రోదిస్తున్నా, – చూసే ప్రేక్షకునికి ఆ నాయక లక్షణం పై ఏపాటి గౌరవం తగ్గకపోగా..ఇంకా పెరిగిందంటే అదంతా ఆత్రేయ పాట పుణ్యమే! ఆ పదాల మహిమ – మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
   ఇదిగో ఈ పాటలో చూద్దాం ఆ కవి హృదయాన్ని.

 2. Saradhi Motamarri says:

  వేరి నైస్ పోస్ట్ అండి.

  మై ఫేస్బుక్ పోస్ట్ టుడే:

  Thu 07-May-2015: The Birthday of two great writers:
  1. Rabindranath Tagore, a Nobel Prize Winner in literature; and
  2. Acharya Athreya who won noble hearts.

  Hope one day the AP Government will erect a memorable statue for Athreya.

  I want to share an audio clip (Telugu and English) on my feelings about one of the everlasting song of Athreya from ‘Moogamanasulu’, ‘paaduta teeyaga callagaa’.

  Dropbox Link for the clip:
  https://www.dropbox.com/s/m2pf2vrq274es9q/11%20Saradhi%20Motamarri%20Paduta%20Teeyaga%20Sallaga.mp3?dl=0

  I bow my head to these inspirational writers, ever indebted to them.

  • ఆర్.దమయంతి. says:

   శ్రీధర్ గారు,
   ఎంత చెప్పినా తక్కువే ఈ మనసు సునామీ కవి గురించి.
   స్త్రీ ని ఇంత గొప్ప గా ప్రేమించడం, సున్నితంగా బంతిపూల భాషలో వ్యక్తపరచడం.. (ఊహలో అయినా) చాలా చాలా అద్భుతం గా తోస్తుంది.
   మీ లింక్ ఓపెన్ కావడం లేదు?..
   ధన్యవాదాలండి.

 3. Suryam Ganti says:

  మనసు కవి గురించి మనసుకు హత్తుకు పోయే వ్యాసం , ధన్యవాదములు దమయంతి గారు

  సూర్యం గంటి

  • ఆర్.దమయంతి. says:

   మనసు విలువ తెలిసిన మంచి మనసున్న కవి. కదండీ? తెలుగు వారి తపస్సు కొద్దీ దొరికిన మన సుకవి.
   ధన్యవాదాలు సూర్యం గారు!

 4. paresh n doshi says:

  వొక పట్టాన పాట వ్రాసే వారు కాదు. అయినా నిర్మాతలు వోపికగా యెదురు చూసేవారు.గుండెల్ని పిండి సారాన్ని పాటలో వొంపి గాని యిచ్చేవారు కాదట, యెంత సమయం పట్టినా. అందుకే అనిపిస్తుంది ఆయన పాటలు మనలని అట్లా కట్టి పడేశాయి.

 5. దేవరకొండ says:

  మనసే ముడి సరుకుగా మనసుతో మనస్పూర్తిగా రాసిన కవితలను సినిమా పాటలుగా సృష్టించి మనసందరికీ ఉన్నా అది ఇది అని చెప్పుకోలేనివాళ్లన్దరికీ తానే మనసై దాని మాట కూడా తనే అయి తన మనసైన వారిని వెతుక్కుంటూ ఏ దూర తీరాలకో వెళ్లిపోయిన ఆచార్య ఆత్రేయ కు అద్భుతమైన నివాళి దమయంతి గారివ్వడం చాలా బాగుంది.

  • ఆర్.దమయంతి. says:

   ‘మనసే ముడి సరుకుగా మనసుతో మనస్పూర్తిగా రాసిన కవితలను ..’
   నేనీ ఆర్టికల్ లో కేవలం మనసు మీదే ద్రష్టి పెట్టి రాసాను. ఆత్రేయ అంటేనే మనసు కి అధిపతి అని. కానీ చిత్రం. కొన్ని పాటల్లో ఆయన భావ జాలం, పద ప్రవాహం చూస్తె ‘అయ్ బాబోయ్..ఈయనే?!’ అని అబ్బురమౌతుంది. అలాటి పాటొకటి ఇక్కడ ఇస్తున్నాను చూడండి. జస్ట్ మచ్చుకకి.
   మీ స్పందనకి నా ధన్యవాదాలు దేవరకొండ గారు.

   • Saradhi Motamarri says:

    Damayanti garu, similar to Gudigantalu, there is another powerful song in ‘Mallepvuvu’, ”emi lokam, emi swardham, ekkadunnadi maanavatvam.’

 6. కర్లపాలెం హనుమంత రావు says:

  సినిమా అంటేనే సదాశివబ్రహ్మంగారు కనిపెట్టినట్లు ఒక అసాధారణ సాధారాణ జనమాద్యమం.. వట్టి మేధస్సుతో గట్టెక్కేది కాదు చలనచిత్రాల వ్యవహారం. గడుసుదనం చాలా అవసరం. వట్టి గడుసుదనమే చూపిస్తే రెండో సినిమాకి అవకాశమే రాదు. మేధస్సుని గడుసుదనంతో తగుపాళ్ళలో రంగరించి వాడితేనే ఎన్నటికీ వసివాడని కుసుమాలవంటి మంచి పాటలు పుట్టుకొచ్చేది.. ఆత్రేయగారు ఎన్ జి ఓ లాంటి సంచలన నాటకాలు ఎన్ని సృష్టించినా రానంత గొప్ప పేరు కేవలం సినిమా పాటలతో కొట్టేసారు. జయంతి సందర్భంగా ఆత్రేయగారికి ఇవాళ ఇస్తున్న నివాళుల్లో రచయిత/త్రులు చాలామంది కేవలం ఆయన సినిమా పాటల్నిగురించి మాత్రమే ముచ్చటించడం గమనార్హం. అలతి అలతి పదాలతో అతిగంభీరమైన భావాలను పాటల్లో పొదిగే శిల్పానికి ఆత్రేయగారే మొదటివాడు కాకపోయినా జనంనాడిని బాగా పట్టుకున్న మొనగాడన్నమాట మాత్రం నిజం. 1950ల నాటి కమ్యూనిస్టులమీద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిర్భంధాలనుంచి తప్పించుకొనే దారిలో చాలామంది అభ్యుదయ కళాకారులు చెన్నపట్నం- చలనచిత్రంరంగంలో అశ్రయం పొందారు. అందులో ఆత్రేయగారూ ఒకళ్ళు. విషయమూ.. జనపరిచయమూ విశేషంగా ఉన్న ఇటువంటి కళాకారుల వల్లే అప్పటి చిత్రసీమకు.. ఎంతో మేలు జరిగింది. అర్థశతాబ్దం దాటిపోయినా మనమింకా ఆ ’50-’60 ల నాటి సినిమాలను, పాటలనుగురించే చెప్పుకొని మురుసుకుంటున్నామంటే అదంతా ఆత్రేయగారివంటి ఎందరో ఉత్తమ కళాకారుల చలవవల్లే!

  • ఆర్.దమయంతి. says:

   మీరు చెప్పింది నిజమేనండి హనుమంత రావు గారు.
   డాక్టర్ ఆత్రేయ గారు10 నాటకాలు రాసినట్టు తెలుస్తోంది.
   ఆయన గొప్ప ఆలోచనా పరుడు. తన రచనల ద్వారా సమాజానికి సందేశాన్నిచ్చే ప్రయత్నం చేసిన ఉత్తమ నాటక కథా రచయిత. చాలా చిత్రాలకు మాటలు కూడా సమకూర్చారు. డైలాగ్స్ లో ఆణిముత్యాల వంటి మాటల్నెన్నో గుప్పించారు.
   ఇదిగో – మన సారంగ పాఠకులకోసం ఇక్కడ ఆయన రాసిన నాటిక లింక్ ని ఇస్తున్నాను.
   మీ విలువైన సమాచారాన్ని ఇక్కడ తెలియచేసినందుకు ధన్యవాదాలు.
   https://archive.org/details/antyarpananatika018042mbp

 7. Chimata Rajendra Prasad says:

  అయన రాయక నిర్మాతలను రాసి ప్రేక్షకులను ఏడిపించే వారని చెప్పుకొనే వారు

  • ఆర్.దమయంతి. says:

   అవునట. ఈయన పాట చేతిలోంచి ఎప్పుడు ఊడిపడుతుందా అని నిర్మాతలు తలలు పట్టుకునే వారని కూడా విన్నాను. హృదయ మథనం కదండి. మరందుకే గీత సాహిత్యం అమృతమ్ లా వుంటుంది.

 8. దేవరకొండ says:

  దమయంతి గారూ మీరిచ్చిన గుడిగంటలు సినిమాలోని పాటను రాసింది అనిసెట్టి గారని విన్నాను. మీరు ఆత్రేయ గారికి ఆ పాటను ఆపాదిస్తున్నరేమోనని చిన్న అనుమానం. నా అనుమానాన్ని తొలగించ గోర్తాను.

  • ఆర్.దమయంతి. says:

   సారీ!
   తోడికోడళ్ళు సినిమాలో గీత సాహిత్యం! – కారులో షికారుకెళ్ళే..పాట గురించి.
   ‘గీత రచన – ఆత్రేయ’ అని రేడియో లో వినిపిస్తే అనౌన్సర్ పొరబాట్న చెబుతోంది అని అనుకున్నా అప్పట్లో.
   గుడిగంటల్లో – ఎవరికి వారౌ స్వార్ధం లో పాట ఆయన రాసిందే.
   అవీ ఇవీ అన్నీ ఒకేసారి వింటూ ఆ పాట లింక్ ఇచ్చేసాను. పొరబాట్న.
   :-)
   నా పరధ్యానానికి సారీ. పొరబాటుని గుర్తుచేసినందుకు మీకు థాంక్స్.
   ఇవిగో ఆ 2 పాటలు మీకందచేస్తున్నాను.
   1. https://www.youtube.com/watch?v=fdLkmwmzIxI
   2. https://www.youtube.com/watch?v=0Pwl-3Us0kA

Leave a Reply to ఆర్.దమయంతి. Cancel reply

*