మైదానంలో వొంటరి రాజేశ్వరి!

నామాడి శ్రీధర్

sri1​శివలెంక రాజేశ్వరీదేవి. జన్మత: ఓ అద్భుతమైన కవిత. మనమధ్యన ఒంటరిగా జీవించిన అమాయక బాలిక. శరత్‌, చలం, చండీదాస్‌ రచనల్లోంచి రెక్కలు కట్టుకువచ్చిన దయాళువైన వనిత. ఎల్లల్లేని స్వేచ్ఛలోకి అశ్రుబిందువై హరించుకపోయిన ముక్త.

ఆమెది జననంతో ప్రాప్తించిన ఏకాకితనం. దివాస్వప్నం లో కరిగిన యవ్వనం. ప్రత్యుత్తరం లేని ప్రేమలేఖనం. పీటలమీద ఆగిపోయిన కళ్యాణం. ఒక్క గదిలో కొనసాగిన ప్రపంచయానం. సాహిత్యం, సంగీతం తోడునీడలుగా తనలో తాను మాట్లాడుకొన్న శూన్యావరణం. ఎదురెదురుపడే నిరాదరణంతో తలపడే దినదినం. ఏ ఒక్క సంతోషరేణువునో గుప్పెట బంధించాలన్న జాగరణం. ఆ అరవయ్యేళ్ల నిష్ఫలపరంపరకు ముగింపుగా ఆఖరికి ఆదరించినది మరణం.

* * *

1984-94 మధ్య రాజమండ్రిలో నా విద్యాభ్యాసం. ఉద్యమకాలం. అంతరాంతరం నవచైతన్యంతో వికసిస్తోన్న యవ్వన ప్రాయం. కవిత్వమొక తీరని దాహమైన దేశదిమ్మరితనం. అప్పుడొక పత్రికలో రాజేశ్వరీదేవి కవిత కనబడింది. ఎంత బావుందీ కవిత, ఎవరీ కవయిత్రీ అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఆనాటి నుంచి ఇవాళ్టికీ ఆమె కవితని అపురూపంగానే భావించాను. మిత్రు లతో ‘కంజిర’ (1990-95) ప్రారంభించాక, కవిత కోసం పోస్ట్‌కార్డ్‌ రాశాను. ‘టెలిఫోన్‌టాక్‌’ పంపించింది. నాల్గవ బులిటెన్‌లో అచ్చు వేశాం. అటుపిమ్మట హైదరాబాద్‌ ‘వార్త’ రోజుల్లో (1995-98) కూడ సాహిత్యం పేజీ, సండే మ్యాగజైన్‌లలో కొన్ని కవితలు ప్రచురించాం.

నేను ఉద్యోగం వదలివేశాను. స్వస్థలం చేరుకొన్నాను. ఓ రోజు ఒమ్మి రమేష్‌బాబు వచ్చేడు. మా కబుర్లలో… సి.వి.ఎస్‌. మహేష్‌, కవులూరి గోపీచంద్‌, టి.వి.ఎస్‌.రామన్‌, కలేకూరి ప్రసాద్‌, శివలెంక రాజేశ్వరీదేవి ఇత్యాది వుల పుస్తకాలు రావడంలేదు. మనం పూనుకోవడం మంచిదనుకున్నాం. ఆ తర్వాత రాజేశ్వరీదేవికి ఫోన్‌ చేశాను. ‘మీ కవిత్వమంటే మాకిష్టం, పుస్తకం వేయండి. లేదా, కవితలన్నీ మాకివ్వండి. పుస్తకం తీసుకొస్తాం’ అని సంభాషణ ప్రారంభించేను. ఆమె ఏ కొంచెం కూడ ఉబ్బితబ్బివ్వలేదు. ఇప్పుడెందుకులే అన్నట్టు మాటమార్చింది. ఆ ప్రథమ పరిచయంలోనే ఒక ముఖ్యమైన సంగతి చెప్పింది…’శ్రీధర్‌, నీ తల్లి అకాలమరణంతో నువ్వెంతగా దుఖ్ఖించావో విన్నాను. ఆ బాధ నేనెరుగుదును. ఆమె తిరిగిరాదు. ఇక నేనే నీకు అమ్మనని…ఆ రోజుల్లో ఉత్తరం రాశాను. నాన్నా!  అది పోస్టుచేయలేదు.’ అప్పటినుంచి ఆమె నాకు అమ్మతో సమానం.

అయితే, అక్కడితో నేను ఆగిపోలేదు. నా దగ్గరున్న పత్రిక లు, ప్రత్యేక సంచికలు, సంకలనాలు వెతకసాగాను. స్నేహితులనీ వాకబు చేశాను. పది కవితలు వెలికితీశాను. తెలుగు కవిత్వంలో ఆమెది ఓ ప్రత్యేక తరహా. మధ్యేమధ్యే అందం కోసం రంగుల పూసలవలె ఆంగ్లపదాల్ని గుచ్చుతుంది. పాత సినిమా పాటల్లో చరణాల్ని చేర్చుతుంది. స్వతంత్ర భావం, ఇంపైన పరిభాష. ప్రభాత పవనం, నిర్మలమైన నీరెండ కలగలిసి మనని స్పృశిస్తోన్న అనుభూతి కలుగుతోంది. ఏ కవిత పనిగట్టుకొని రాసినట్టుండదు. అసలు ఆ అవసరమే లేదామెకు. కవనం కొండవాగుమల్లే  స్వచ్ఛంగా సాగు తోంది. వాక్యం స్వేచ్ఛగా సంచరిస్తోంది. పగిలిన అద్దంలో, కవితాత్మ కత, ఒంగిన గగనం, ద్వైతం, రంగులు వెలసి రాగాలు వినిపించని వేళ, ఇక శెలవా మరి…ఇలా కొన్నిటిని సేకరించాను. ఇవిగో మీ కవితలని కొరియర్‌లో పంపాను. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆలస్యంగా తెలిసిన నిజమేమిటంటే, ఇంట్లోని పాత న్యూస్‌పేపర్స్‌లో కలిసిపోయిన ఆ కవితల కాగితాలూ తూకానికి వేసేశారని.

raj1

* * *

కొత్తలో ప్రతిరోజు ఎడతెగని మాటలు. కాలక్రమంలో ముక్తసరి సంభాషణలు. నేను పనిలో పడి రెండ్రోజులు ఉలుకూ పలుకూ లేకుంటే ఎదురుచూపులు. ఉమ్మడి మిత్రులెవరికైనా ఫోన్‌ చేసేది. నా కుశలం తెలుసుకొన్నాక స్థిమితపడేది.

రాజేశ్వరీదేవికి నిరంతరం సాహిత్యమే. సాహిత్యమే సర్వ స్వం. బుద్ధిపూర్వకంగా సాహిత్యం మినహా ఇతరేతర చిల్లర విష యాలు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. శరత్‌, చలం, చండీదాస్‌, ఆలూరి బైరాగి, శేషేంద్రశర్మ, మోహన్‌ప్రసాద్‌, చినవీరభద్రుడు అంటే ఆమెకు అపరిమితమైన మక్కువ. ఆ అక్షరాలంటే అపార మైన సమ్మోహం. ఆమె హృదయంలో ఇంకిపోయిన, రుధిరంలో సంలీనమైన రచనలవి. ఆ కథలు, నవలల్లోని పాత్రలు ఆమెకు చిరపరిచితమైన వ్యక్తులు, నేస్తాలూను. కొన్ని సంభాషణలు కంఠో  పాఠం. కవిత్వ చరణాలనేకం అవలీలగా ఉదహరించేది. బాలసర స్వతి పాటలు, శారదాశ్రీనివాసన్‌ మాటలు మరిమరి చెప్పేది. శేషేంద్ర, చండీదాస్‌ మరణించినప్పుడయితే రోజులకి రోజులు బాధపడిపోయేం, ఇరువురం అదేపనిగా చర్చించుకున్నాం. పురాణం సుబ్రహ్మణ్యశర్మ, నండూరి రామ్మోహనరావు, ఎబీకే ప్రసాద్‌, ఇంద్ర గంటి శ్రీకాంతశర్మ, కె.శ్రీనివాస్‌, అఫ్సర్‌, ఆర్టిస్ట్‌ మోహన్‌ రచనల గురించి ఇష్టపూర్వకంగా ముచ్చటించేది.

* * *

రాత్రి నడిజాము దాటే దాకా చదువుకోవడం, పొద్దెక్కేక లేవడం, కాఫీ తాగడం, నాలుగు న్యూస్‌పేపర్లు చూడడం, ఎడిట్‌ పేజీల్లో చదవవలసినవి పక్కనపెట్టడం, ఇష్టమైన పుస్తకం పట్టుకుని కూర్చోవడం, అప్పుడప్పుడు టీవీ, సాయంకాలం వాహ్యాళి.ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మిత్రుల్ని ఫోన్‌లో పలుకరించడం, సాహిత్యం పేజీల్లో, సండేమ్యాగజైన్లలో వచ్చిన కవితలు, కథలు, వ్యాసాల గురించి మాట్లాడం, హిందీ, బెంగాలీ, తెలుగు ఆర్ట్‌ సినిమాలని గుర్తుచేయడం, పాతపాటలని తలచుకోవడం. ఏడాదికోసారి విజయవాడ పుస్తకోత్సంలో కొత్త పుస్తకాలు కొనడం…ఇంతే జీవిత పర్యంతం. ఆమె కాలాతీత వ్యక్తి. ఇరవైనాలుగు గంటల్లో ఏ క్షణమైనా ఫోన్‌ చేసేది. ఊరకనే పలుకరించేది. బదులు లేకపోతే, గుడ్‌నైట్‌ లేదా గుడ్‌మోర్నింగ్‌ మైడియర్‌ బాయ్‌ అనే మెసేజ్‌. కిందన ‘మా’ అని రాసేది.

ఆమె ఎంచుకున్న స్నేహితులు తక్కువ. ఒమ్మి రమేష్‌బాబు, గుడిపాటి, కుప్పిలి పద్మ, జుగాష్‌విలి, ఎమ్మెస్‌ నాయుడు, ఆర్టిస్ట్‌ అన్వర్‌, జూలూరి గౌరీశంకర్‌, ఎమ్మెస్‌ సూర్యనారాయణ, భాస్కర్‌ జోగేష్‌, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, ఘంటశాల నిర్మల, మరో ఇద్దరు ముగ్గురు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో కవిత్వ పఠనం కోసం తొలినాళ్ల రాకపోకల్లో కొన్ని పరిచయాలు, కొందరు మిత్రు లు. అన్నీ నెమ్మదిగా చెల్లాచెదిరిపోయిన స్మృతులు.

* * *

రాజేశ్వరీదేవికి అంకెలు,లెక్కలంటే భయం. అహం ప్రదర్మిం చే తెలివితేటలంటే అసహ్యం. నానాటికీ డబ్బు ఊబిలో కూరుకు పోతున్న అవివేక సమాజమంటే ఛీత్కారం. వేళకి భోజనం అలవాటు లేదు. ఒక్కతే రోడ్డు దాటడమనేది తనవల్లకాని పని. ప్రయాణమంటే మహా హైరానా. ఎన్నడూ సర్వసాధారణమైన సౌఖ్యాలవేపు మొగ్గ లేదు. మానవీయ విలువల కోసం అన్వేషణ ఆ గొంతులో ధ్వనిం చేది. ఆమెది సంపూర్ణంగా హృదయసంబంధం. పేదరికమంటే చలించి, తలకు మించిన సాయంచేసే కనికరం. ఇవన్నీ ఇంటా బయటా ఆమెకు కష్టం కలిగిస్తుందన్న ఎరుక లేకపోలేదు. అయినా సరే మనుషుల్ని ప్రేమించడమే ఆమె బలమూ, బలహీనత అయింది.

ఇన్నేళ్లలో ఆమెని ఒకేఒక్క పర్యాయం చూడగలిగాను. 2008లో కాబోలు, కేంద్రసాహిత్య అకాడెమీ రాజమండ్రిలో సదస్సు నిర్వహించింది. అందులో నేను పాల్గొంటున్నానని తెలిసి, ఎంతో దూరం నుంచి నన్ను చూడవచ్చింది. ఓ తెల్లని పారదర్శకమైన గాజుబొమ్మమల్లే అనిపించింది. అలా తాకగానే చిట్లిపోతోందేమో అన్నంత సున్నితంగా కనిపించింది.

* * *

‘మా ఇంటిలో ఇమడలేపోతున్నాను. నాకు ఎవ్వరున్నా రని, ఎక్కడికని వెళ్లను?’ అన్నది అనేకసార్లు. కోనసీమకు రండి. మా ఇంట, మాతో బాటు ఉండండి. అనేక పుస్తకాలు, నలువైపులా నీరు, వరిచేలు, కొబ్బరితోటలు, ఒంటరితనంనుంచి ఒకింత బయట పడే కొత్తవాతావరణంలోకి ఆహ్వానించాను. మీ కవితలన్నీ తీసుకు రండి. నేను పుస్తకం వేస్తాను. నలుగురూ చదువుతారు. మీతో మాట్లాడతారు. అది ఉత్సాహకారకంగా ఉంటుందనీ అభ్యర్థించాను.

ఆద్యంతం, ఆమెకు ఈ రెండేరెండు మాటలు చెప్పుకొచ్చాను. ఒక్కటీ లక్ష్యపెట్టలేదు. ఆమెకు ఇష్టంలేక కాదు. ఏనాడో ఆ సాంప్రదాయక కుటుంబం, రాజేశ్వరీదేవి అనే ఇంద్రధనుస్సుని ఒక గుంజకి కట్టిపడేసింది. అరవయ్యేళ్ల పెనుగులాటలో దేహం మాత్రమేనా అలసిపోయింది. ఏ తెగువ చేయలేని మనిషీ నిలువెల్లా విసిగిపోయింది. కడకు కోకిలవంటి హృదయం సైతం నిశ్చలన మయింది. లేకపోతే, తొలుత ఆమె హాయిగా బతుకుతుండేది. సాహిత్యలోకంలో వైభవోపేతమైన కవిత్వ సంపుటమూ నిలిచేది. ఇప్పుడు తెగిపోయిన ఆ హరివిల్లు అదృశ్యతీరానికి తరలి పోయింది.

నా చిన్నతనంలో శరత్‌నీ, చండీదాస్‌నీ, డాక్టర్‌ కేశవరెడ్డినీ పరిచయం చేసింది నన్ను కన్నతల్లి. విచిత్రంగా ఆ రచనల గురించి పదేపదే చర్చించిన అమ్మ రాజేశ్వరీదేవి. ఇరువురూ, నా ఎడల అవ్యాజప్రేమని చూపారు, నా శ్రేయస్సుని కోరుకున్నారు. ‘ఆకుపచ్చ లోయ’ని శిశువువలె అక్కున జేర్చుకొన్నారొకరు. ‘బంధనఛాయ’ని అభిమానించి మురిసిపోయారు మరొకరు. అయితే నాకు ఒక్కమాట మాత్రం చెప్పకుండానే, ఇద్దరూ హఠాత్తుగా అదృశ్యమైనారు.

.

రాజేశ్వరీదేవి కవిత

ద్వైతం

నేనసలే గంగను కదా

నాకు పర్వతమూ ఇష్టమే పొలమూ ఇష్టమే

గండశిలల్నించి కరిగి కిందికొచ్చినందుకే

ఈ మునిగిపోయిన పేదపల్లెల కన్నీళ్లు ఇష్టం.

రాళ్లు పగిలితేనే గానీ కన్ను చెమ్మగిలదు

మీరేదో అనుకుంటారు ఆ గుండె ఆగాధమని

కానీ ఎంతనొప్పో ప్రథమ శిశువుకి పాలు తాపేప్పుడు

ఆ తీయని బాధలో మృత్యువుని జయించిన లోయలకేక

కాశీ వారణాసి బెనారస్‌లో చూడండి నన్ను

నా దేహంమీద కాలీకాలని ఎన్ని కళేబరాలో

కానీ ప్రేమ హర్మా ్యల్లోంచి మీరంతా రిక్తహస్తాలతోనే కదా

ఈ నా పుణ్యక్షేత్రానికి చేరుకునేది!

కేదారనాధ్‌ బదరీనాధ్‌ అమరనాధ్‌ అన్నీ నేనే

ఏనాటి వాడో ఆదిశంకరాచార్యుడ్ని తల్చుకుని

మీ పాపాల చేతుల్నీ పాదాల్నీ కడిగేసుకుంటున్నామనుకుంటున్నారో

కానీ అదంతా హిమాలయాలపైకి మీ ఒట్టి ఎగశ్వాస, దిగశ్వాస

ఎండమావినీ నేనే, తొలకరి మబ్బునీ నేనే

కలకత్తా కాళికనీ నేనే, సలాం బాంబేనీ నేనే

మదర్‌ థెరిసానీ నేనే, ‘బీస్ట్‌ అండ్‌ బ్యూటీ’ని నేనే

పుట్టిన కేకనీ నేనే, ఆఖరి కౌగిలినీ నేనే.

(కవిత్వం ప్రచురణలు. 1990లో వెలువరించిన ‘గురిచూసి పాడేపాట’ పుస్తకం నుంచి)

*

మీ మాటలు

 1. paresh n doshi says:

  ఇద్దరితో ప్రేమలో పడ్డానిప్పుడే. రాజేశ్వరిదేవి గారి కవితలు నేను చదివింది తక్కువే. ఆమె గురించి ఫేస్ బుక్ లో వాడ్రేవు చినవీరభద్రుడు వ్రాసిన పోస్ట్ చూసి కొంచెం కుతూహలంతో కూడిన ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మీరు వ్రాసింది చదివాక ఆ మనిషి పట్ల ప్రేమే కలిగింది. అంతేనా? మీ చూపో? కవిత్వాన్ని ప్రేమించినట్లే కవిని కూడా ప్రేమించడం అందిరికీ సాధ్యమా? వొకసారి గంగలో మునక వేసిన అనుభూతి, ఆనందం.

 2. rajaram says:

  మీ రచన చదువుతున్నంత సేపు కవయిత్రి శివలెంక రాజేశ్వరి గారి కవిత్వంలోని విశిష్టత
  ఆవిడ జీవిత ప్రత్యేకత ఒకింతా ఆనందాన్ని ఇచ్చింది . కానీ ఎంతో దుఃఖం కూడా కలిగింది ఆవిడా మాటల్లోనే కాళ్ళకింద గాజు పెంకులు గుచ్చుకున్న బాధ

 3. ‘మా ఇంటిలో ఇమడలేపోతున్నాను. నాకు ఎవ్వరున్నా రని, ఎక్కడికని వెళ్లను?’

 4. ns murty says:

  శ్రీధర్ గారూ,

  చాలా చక్కని పరిచయం ఇచ్చారు. కాలం ఒక్కోసారి మరీ క్రూరంగా ఉంటుందనుకుంటాను. జీవితాన్ని కవిత్వంలా బ్రతికిన కొందరు వాళ్ళు వెళ్లి పోయేదాకా పరిచయం అవరు.

  అభివాదములతో

 5. కూర్మనాథ్ says:

  చక్కటి ట్రిబ్యూట్, శ్రీధర్

 6. badugu basks. jogesh says:

  Jananamto praptinchina ekakitanam to. Ontariga jeevinchina amayakabalika rajeswaridevigari kavitvajeevitalanu entasajalamga akshareekarincharu Koragani busylo ame phone liftcheyalenibhadhe ajanmanthamu ventadutundi

 7. knvmvarma says:

  ధన్యవాదాలు అన్నా

 8. m s naidu says:

  శ్రీధర్.
  అకాల మరణమో సకాల మృత్యువో ఏదీ కాని కారణశాపమో అనాదరణమోక్షమో ప్రతి స్త్రీకీ, తల్లికీ, బిడ్డకీ. ఇక్కడ. ఇక్కడ్నే. భయమేస్తోంది బతకాలంటే ఈ కాస్త తెలిసిన కొద్ది జీవితంలో. ఏదో ఓ రోజు మనమూ ఓ గుర్తుతెలియని శావాలమేగా. అందరూ కలిసి ఆవిడ కవితల్ని సేకరించి,త్వరగా పుస్తకరూపంలో తెస్తే అంతకన్నా మించిన నివాళి యేమివ్వగలమ్. ఏ అర్థరాత్రో, అపరాత్రో ఆవిడ పలకరింతల్ని మళ్ళీ వింటావేమో. తొందర తొందరగా ఫోనులో బాలన్సు లేకుండా ఇంకెంతకాలం మాట్లాడుకోవాలి.

 9. Vijaya Babu,Koganti says:

  A very heart touching, warm poetic tribute. Congrats!!!

 10. దేవరకొండ says:

  ఈ తల్లి గురించి చదువుతుంటే సూరి నాగమ్మ గారిని తలచుకోకుండా ఉండలేం. ఎంతో మంది సంస్కారులున్న (ఇప్పటికీ!) మన చిన్ని సమాజంలో కూడా ఇలాంటి తల్లులు ఇలా ఎందుకు ఇంత బాధ పడవలసి వస్తోందో ఎవరిని అడగాలో కూడా తెలియదు!

 11. bhuvanachandra says:

  ఓ మౌన పర్వతం కరిగి ఆవిరయింది ……ఆమె ఆత్మకి శాంతి లభించు గాక …..

 12. ఎన్ వేణుగోపాల్ says:

  శ్రీధర్

  చాల చాల బాగుంది. ఒక అపురూపమైన కవికి ఒక ఆర్ద్రమైన నివాళి. రాజేశ్వరీదేవి గారి కవితలు భారతి లో కూడ చాలనే వచ్చాయి. ఇప్పటికైనా ఒక పుస్తకం తేగలిగితే బాగుంటుంది…

 13. bhuvanachandra says:

  శ్రీధర్ గారూ ….ఓ జీవితాన్ని ఆవిష్కరించారు …ఆయుష్మాన్ భవ

 14. ఆర్.దమయంతి. says:

  *మనుషుల్ని ప్రేమించడమే ఆమె బలమూ, బలహీనత అయింది.
  * అహం ప్రదర్మిం చే తెలివితేటలంటే అసహ్యం.
  – మీ మాటల్లో ఆమెని అక్షరాలా చూసానండి. కోటికొక్కరు వుంటారు ఇలా.
  ఫేస్ బుక్ లో అఫ్సర్ గారి పోస్ట్ చూసి ఇటొచ్చి చదివాను.
  శ్రీధర్ గారూ, మీ నివాళి మనసుని కదిలించింది.
  మల్లె – మట్టిన రాలినా ..పరిమళాలే వెదజల్లుతుంది.
  మంచి వాళ్ళు మనల్ని వీడి వెళ్ళినా మనసులో నే వుండిపోతారు.
  అంజలి ఘటిస్తూ..

 15. గుడ్ ట్రిబ్యూట్ తొరా జెస్వరి ని ఆవిష్కరించారు శ్రీదర్ కి అబినంద నలు

 16. ఆవిడ గురించీ ఆవిడ కవితల గురించీ ఏమీ తెలీకపోయినా చూడగానే ఇంట్లో మనిషేమో అనిపించేలా ఉన్నారు . ఒక స్త్రీకి ఇంతటి గౌరవాన్ని ఇచ్చి ఇంత చక్కని పరిచయాన్ని అందించినందుకు ధన్యవాదాలు సర్

 17. Vamsykrishna says:

  శ్రీధర్
  నీ నివాళి బావుంది. నివాళి బావుంది అంటే రాజేశ్వరీ దేవి నవ్వేస్తుంది. మరణం మనుషులను దూరం చేయగలదు
  జ్ఞాపకం మనుషులను కలిపి ఉంచుతుంది. మనుషులు
  మరణించాక జ్ఞాపకాలు గా మారి మనలో నిండి పోతారు. రాజేశ్వరీ దేవి ఇవాళ ఒక గాఢమైన జ్ఞాపకం
  వంశీ

 18. B.KRISHNA KUMARI says:

  మీ నివాళి చదివాక రాజేశ్వరి గారి పట్ల గౌరవం కలిగింది. ఒక విషయం షేర్ చేసుకోవాలని కూడా అనిపించింది. ‘సంప్రదాయక కుటుంబం ,, గుంజకి కట్టేసింది’ అని రాసారు. కానీ ఆమె స్నేహితులంతా (మీరు రాసిన పేర్లు చదివాను) రక రకాల రంగాల్లో లబ్ధ ప్రతిష్టులు. చిన వీరభద్రుడు గారు అయితే 30 సంవత్సరాలుగా స్నేహితుడు. సాంప్రదాయక కుటుంబం గుంజకి కట్టేస్తే, ఈ స్నేహాలు, తనకి ఇష్టమయిన పుస్తకాలు చదవటం, కవిత్వాలు రాయటం, వివిధ భాషల సినిమాలు చూడటం, విశ్లేషిస్తూ స్నేహితులతో మాట్లాడటం వగయిరా సాధ్యమేనా! అనిపించింది. సింగల్ గా ఉండటం అనేది ఆమె ఆప్షన్ అవునో, కాదో నాకు అర్థం కాలేదు కాని, బతికినంతలో తన ఇష్టాలకు అనుగుణంగా (చాలా వరకు) బతికారు అనిపించింది. ఆవిడ మిత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ…

 19. Kuppili Padma says:

  కవిత్వాన్నే కాదు, శ్రీధర్ నువ్వు ఆ కవిత్వం రాసేవారిని బాధ్యతగా ఆత్మీయం గా పట్టించుకుంటావ్ అనేక పనుల మధ్య కూడ. నువ్వు, రమేష్ ఆమె కవిత్వాన్ని పుస్తకం గా తీసుకురావాలనే ప్రయత్నం తన వల్ల యెలా ముందుకు సాగాలేదో ఆమె మురిపంగా ముచ్చటిస్తుంటే మాటకి మాటకి మధ్యన నిరాసక్తం వూపిరిగా వినిపిస్తుంటుంది. మాటలకి నిషేధాన్ని డిక్లైర్ చేసే వొకానొక సందర్భాన్ని లేదా సమయాన్ని కూడా ఆమె అంతే మృదువుగా కలబోసుకోనేవారు అప్పుడు ఆమె సన్నని స్వరంలో మాటకి మాటకి నడుమ ఆశ్చర్యం. ‘నీ దగ్గర కొన్నాళ్ళు వుంటానమ్మా… నీ యింట్లో పూసే పువ్వులని చూడాలి ‘ అనేవారు వెంటనే ‘పొరుగునే వున్న శ్రీధర్ దగ్గరకే వెళ్ళ లేకపోతున్నాను’ అనేవారు. యిక్కడికి వచ్చి శ్రీధర్ దగ్గరకి వెళ్ళండి లేదా శ్రీధర్ దగ్గర నుంచి యిక్కడికి రండి అంటే యెలా బయలుదేరాలి అనేవారు. అవును ఆమెకి ప్రయాణాలంటే హైరానా… బంధన ఛాయ నుంచి మరో బంధన ఛాయలోకి… శ్రీధర్, తనయుని మనసుని, కవిత్వపు హృదయాన్ని పరిచావ్.

 20. mercy margaret says:

  రాజేశ్వరి గారి గురించి తెలుసుకోవడం బాగుంది ..
  -“. ఏనాడో ఆ సాంప్రదాయక కుటుంబం, రాజేశ్వరీదేవి అనే ఇంద్రధనుస్సుని ఒక గుంజకి కట్టిపడేసింది. అరవయ్యేళ్ల పెనుగులాటలో దేహం మాత్రమేనా అలసిపోయింది. ఏ తెగువ చేయలేని మనిషీ నిలువెల్లా విసిగిపోయింది. కడకు కోకిలవంటి హృదయం సైతం నిశ్చలన మయింది. లేకపోతే, తొలుత ఆమె హాయిగా బతుకుతుండేది. సాహిత్యలోకంలో వైభవోపేతమైన కవిత్వ సంపుటమూ నిలిచేది. ఇప్పుడు తెగిపోయిన ఆ హరివిల్లు అదృశ్యతీరానికి తరలి పోయింది” ఈ మాటలు బాధకలిగించాయి

 21. bhagavantham says:

  మైదానంలో ఒంటరిగా జీవిస్తేనేం శ్రీధర్ …. ఆమె జీవితాదర్శం కూడా శాంతే … ఇప్పుడు ఆ శాంతిని ఆమె ఆత్మ అనుభవిస్తోంది ….

 22. కె.కె. రామయ్య says:

  “ నేను రాయలేకపోయిన వాక్యాలు, నామాడి శ్రీధర్ రాసాడు, నేనింకా చదువుతూనే ఉన్నాను, మీరు కూడా చదువుతారని… “ ~ వాడ్రేవు చిన వీరభద్రుడు

  ఒక అభిశప్తురాలికి శిలువలాంటి జీవితం నుంచి మృత్యువు విముక్తినిచ్చిందని సంతోషించనా? లేకపోతే ఇంత అపారమైన వసంత సంతోషాన్ని నిలువెల్లా పీల్చుకుంటూ, కేవలం కవిత్వాన్ని మాత్రమే తిని, తాగి,ఊపిరి తీసి బతికే ఒక యథార్థ కవిత్వ ప్రేమికురాల్ని పోగొట్టుకుని నేనూ, ఈ లోకమూ కూడా పేదవాళ్ళమైపోయామని విలపించనా? ~ వాడ్రేవు చిన వీరభద్రుడు ( https://www.facebook.com/chinaveera?fref=తస్ )

 23. gnana prasuna mamanduru says:

  ఓ వ్యక్తి మరణించాక అనేక రకాలుగా బాధపడడం కన్నా, బ్రతికివున్నప్పుడు కాస్త ప్రేమాభిమానాలను, చేయూతను, ధైర్యాన్ని ఇవ్వండి ప్రియ మిత్రులారా….!

 24. Jhansi Papudesi says:

  అద్భుతమైైన కవిత. Nice tribute. Naamadi gaari poems iteevale chadivanu Arunsagar chesina parichayam tho. Ika Rajeswari garini chadavaali.

 25. D Subrahmanyam says:

  ఒక అరుదయిన గొప్ప స్త్రీ ని చాల అద్రంగా పరిచయం చేసారు శ్రీధర్ గారూ. ఆవిడ కవిత చాల బావుంది. జ్ఞానప్రసున గారూ మీరు భావించినట్టు చేయూతనివ్వడం వల్లే కదా శ్రీధర్ ను ఆవిడ ఆప్యాయంగా అమ్మ అని పిలవమన్నారు

 26. లాలస says:

  నేను చాలా గట్టిగా నమ్మే విషయం ఒకటుంది.రాసే కవిత్వం వేరే.మనిషిలో కవిత్వం వేరే. రెండు ఒక చోట కలిసి ఉండాలని నియమం లేదు. రెండూ ఒక చోట కలిసిన మనుషులుండటం చాలా అరుదు. ఆవిడ అదే కోవకు చెందిన వ్యక్తి అని చాలా గాఢంగా తలుచుకుంటూ రాశారు శ్రీధర్ . బావుంది

 27. Buchireddy gangula says:

  Excellent .tribute Sridhar గారు
  ————————————-
  Buchi reddy gangula

 28. Dr.Banala says:

  Excellent tribute to such a great poet.Quite heart touching.

 29. S.Radhakrishnamoorthy says:

  నేను ఈమె పేరు వినడం ఇదే మొదటి సారి. తప్పే. ఇలా ఎంతమంది తప్పుకున్నారో. ఆమె అరుదైన కవిత రాయగలిగినది. ఎంత రాసిందో తెలియదు.’కాశీ వారణాసి బెనారస్‌లో చూడండి నన్ను’.కాళప్రవాహాన్ని ప్రభావాన్ని దాచిన ఈ పాదంలో ,ఆమె కవితా చాతురిలో,ఆమెను చూస్తున్నా. చాలా ఆలస్యంగా చూచాను. అరుదైన వ్యక్తీ అయ్యుంటారు. అసలే గంగ. ఆమెకు అశ్రుతర్పణమా! ధన్యవాదాలు, శ్రీధర్ గారు.

మీ మాటలు

*