హలో…హలో..అలోహా!

 సత్యం మందపాటి

 

 satyam mandapati ఎన్నాళ్ళనించో చూడాలనుకుంటున్న ‘హవాయీ ద్వీపాలు’ చూసి రావటం కూడా కొన్నేళ్ళ క్రితమే జరిగింది.  పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా వారి ఎనిమిది ద్వీపాల సముదాయమే హవాయి. అమెరికాలోని  యాభై రాష్ట్రాల్లో ఒకటి. అక్కడ ఈ ఎనిమిది ద్వీపాలు పక్కపక్కనే వున్నా, ఎక్కువ జనాభా వున్నవీ, చాలామంది యాత్రీకులు వెళ్ళేవీ నాలుగు లేదా ఐదు ద్వీపాలు మాత్రమే.

అన్నిటిలోకి పెద్దది ‘బిగ్ ఐలండ్’. దాన్నే ‘హవాయి ద్వీపం’ అని కూడా అంటారు. తర్వాత ‘మావి’ (Maui),

‘ఉవాహు’ (Oahu), కవూయి (Kauai) పెద్దవి. దాని తర్వాత వైశాల్యంలో ‘మలోకా’, ‘లానా’, ‘నీహావ్’, ‘కహులావి’   ద్వీపాలు వున్నాయి. (ఉవాహు ద్వీపాన్ని ఉఆహు అని కూడా పలుకుతారు)

వీటన్నిటి మీదా కొంచెం పరిశోధన చేసి, చివరికి నాకూ శ్రీమతికీ రెండు వారాలే సెలవు దొరికింది కనుక, ఒక వారం ఉవాహులోనూ, ఇంకొక వారం మావిలోనూ సరదాగా, విశ్రాంతిగా గడుపుదామని నిర్ణయించుకున్నాం. ‘బిగ్ ఐలండ్’ కూడా వెడదామనుకున్నాం కానీ, తీరిగ్గా చూడటానికి రెండు ద్వీపాలు చాలనిపించింది. కొంతమంది మిత్రులు, విమానంలో ఉవాహు వెళ్లి, అక్కడినించీ ఏడు రోజుల క్రూజ్ తీసుకుని, అన్ని ద్వీపాలు చూసి వచ్చారు. కానీ, మాకు అదీ అంతగా నచ్చలేదు.

మేము ఆ రెండు ద్వీపాలనే ఎందుకు చూద్దామనుకున్నామో, ఆ ద్వీపాల గురించి చెబుతుంటే మీకే అర్ధం అవుతుంది. చిత్తగించండి.

౦                           ౦                           ౦

ఆస్టిన్ నించీ లాసేంజలిస్, అక్కడినించీ ఉవాహు ద్వీపం మీద వున్న ‘హానొలూలు’ నగరానికి విమాన ప్రయాణం చేసి, అక్కడే వైకీకి బీచ్ మీద వున్న ఒక హోటల్లో వారం రోజులు బస చేశాం.

మా గది కిటికీలోనించీ, వెన్నెల్లో సముద్రం, వెండి రంగులో మెరిసిపోతున్న సముద్ర తరంగాలు, ఎంతో అందంగా వున్నాయి. రోజుకి కనీసం ఒకటి రెండుసార్లన్నా, ఆ సముద్రం ఒడ్డున రెండు మూడు మైళ్ళు నడుస్తూనే వున్నాం.

చక్కటి సముద్రం, దానిపక్కనే ఎన్నో హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపులు, పెద్ద పెద్ద భవనాలూ, శుభ్రమైన రోడ్లతో హానలూలు నగరం, ఫ్లారిడాలోని మయామీలాగా వుంటుంది. మయామీ చూసేశాం కనుక, అక్కడికి ఎందుకు వెళ్ళామంటే, ముఖ్య కారణం రెండవ ప్రపంచ యుద్ధంలో అక్కడే జరిగిన ‘పెరల్ హార్బర్’ భీభత్సం. తర్వాత

ఎన్నో పాలినీషియన్ ద్వీపాల సంస్కృతి ఇక్కడ కనపడటం. ఎంతోఅందమైన హనౌమా బే, వైకీకి బీచ్ లాటి ఎన్నో అందమైన సముద్ర తీరాలు.. ఇలాటి చూడవలసిన ప్రదేశాలు ఇక్కడ ఎన్నో వున్నాయి. ఈ ద్వీపం ఇటు ప్రకృతి సౌందర్యానికి, అటు ఎంతో అందమైన కట్టడాలకి నెలవే కాకుండా, చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం వున్న ప్రదేశం. అందుకే ముందుగా “ఉవాహు” ద్వీపానికి వెళ్ళాం.

hawai1

హవాయి భాషలో ఉవాహు అంటే, ప్రజా సముదాయం కలిసే కూడలి అని అర్ధం. ఈరోజుల్లో ఇక్కడికి వచ్చే జనాన్ని చూస్తే, ఆ పేరు సార్ధక నామం అని తెలుస్తూనే వుంటుంది. రెండు అగ్ని పర్వతాల మీద నించీ వచ్చిన లావాతో ఏర్పడిన ద్వీపమిది. ఆరువందల చదరపు అడుగుల వైశాల్యంతో, ఒక మిలియన్ జనాభా వున్న ద్వీపం.

మొట్టమొదటగా బస్ టూర్ తీసుకుని, పెరల్ హార్బరుకి వెళ్ళాం. అక్కడే USS ఆరిజోనా మెమోరియల్ యుద్ధ నౌక వుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారి పేర్లతో పాటు, చరిత్ర మీద సరదా వున్న వారికి, ఇక్కడ చూడవలసినవి ఎన్నో వున్నాయి, సమాచారం ఎంతో వుంది.

తర్వాత పాలినీషియాన్ సాంస్కృతిక కేంద్రానికి వెళ్ళాం. హవాయి, తహితి, ఫిజి, టోంగా, సమోవ మొదలైన ద్వీపాల తెప్పల మీద వారి సంస్కృతిని తెలిపే నృత్యాలు చేస్తూ, రంగురంగుల దుస్తులతో పాటలు పాడుతూ, ఆడుతూ మనకి కన్నుల విందు చేసే ప్రదర్శన ఎంతో బాగుంటుంది.

 

అక్కడే కొబ్బరి చెట్లు గబగబా ఎక్కి, ఒక కొబ్బరిబొండాం కోసి, క్రిందికి దిగి వచ్చి దాన్ని ఎంత త్వరగా వలిస్తే వాళ్ళు గెలవటం, రకరకాల పాలినీషియాన్ నృత్యాలు చేసి చూపించటమే కాకుండా, మనకి కూడా నేర్పిస్తూ, వాళ్ళతో పాటూ మనమూ డాన్స్ చేయటం సరదాగానూ, చాల ఆకర్షనీయంగానూ వున్నాయి.

ఇంకా ఇక్కడ మాకు బాగా నచ్చింది హనౌమ బే.  పైన నీలి ఆకాశం, అందమైన సముద్రం, చుట్టూ పచ్చని చెట్లు, వాటికి ఎన్నో రంగురంగుల పూలు… ఎంతో సుందరమైన ప్రదేశం. ‘డోల్’ అనే కంపెనీ వారి పైనాపుల్ తోట బాగుంది. అప్పటికప్పుడు కోసిన పైనాపుల్ ముక్కల రుచి, మనం ఇక్కడ తినే వాటి కన్నా ఎంతో బాగుంటుంది. హవాయి ఆర్ట్ మ్యూసియం, అలోహా టవర్,  డైమండ్ హెడ్.. ఇలాటి ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు వున్నాయి.

వారం రోజులు వైకీకీ బీచ్ ఒడ్డున ఉవాహులో గడిపి, అక్కడి నించీ మావి ద్వీపానికి విమానంలో వెళ్ళాం.

హనొలూలు విమానాశ్రయంలో దిగుతున్నా, వెడుతున్నా ఎంతోమంది రంగురంగుల దుస్తులు వేసుకున్న అమ్మాయిలు ‘అలోహా’ అంటూ మన మెడలో పూలదండ (హవాయి భాషలో లై అంటారు) వేస్తారు. కలిసినప్పుడు వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు ‘అలోహా’ అంటారు. అంటే మన ‘నమస్తే’, ‘ఉంటామండీ’ లాగా అన్నమాట. అలోహా అనే మాటకు అసలు అర్ధం శాంతి, అనురాగం, దయ అని గూగులమ్మగారు చెబుతున్నారు.

మావి 730 చదరపు మైళ్ళ వైశాల్యంతో, దాదాపు లక్షన్నర జనాభా వున్న ద్వీపం. ఇది ఈ హవాయి పెద్ద ద్వీపాల సైజులో రెండవది. మావి ద్వీపానికీ, ఉవాహు ద్వీపానికీ వున్న పెద్ద తేడా, మావిలో కాంక్రీటు, స్టీలు కన్నా ప్రకృతి అందాలు ఎక్కువగా కనిపిస్తాయి. బీచ్ ఒడ్డున హోటల్ బిల్డింగులు కూడా అక్కడా ఇక్కడా కొన్ని తప్ప అన్నీ ఒకటి లేదా రెండు అంతస్తుల భవనాలే.

ఇక్కడ కూడా సముద్రం ఒడ్డునే ఒక రిసార్టులో గది తీసుకున్నాం. మా గది కిటికీలోనించీ సముద్రం, దానితో పాటు కొంచెం దూరంగా పక్కనే వున్న ఇంకొక ద్వీపం కూడా కనిపిస్తుండేవి.

ఇక్కడ చూడవలసిన వాటిలో ముఖ్యమైనది ‘హలేకలా నేషనల్ పార్క్’. ఇది సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తున, పర్వతాల మీద వున్నది, ఇది ఒక అగ్నిపర్వతం. ఇప్పుడు లావా బయటికి రావటం లేదు కానీ, అంతర్గతంగా ఇది అగ్ని పర్వతమే. ఎప్పుడు ఆ వేడి బ్రద్దలయి, అది బయటికి వస్తుందో తెలియదు. అక్కడికి వెళ్ళటానికి వున్న ఘాట్ రోడ్డు ఎన్నో మెలికలు తిరుగుతూ పైకి వెడుతుంది. అక్కడే ఒక పెద్ద క్రేటర్ కూడా వుంది. క్రేటర్ అంటే ఆకాశంలోనించీ Asteroids భూమి మీద పడ్డప్పుడు ఏర్పడే ఎంతో పెద్ద గుంట. క్రింద మేము చూసిన క్రేటర్ ఫోటో కూడా ఇస్తున్నాను.

hawa3

మేము కారు అద్దెకి తీసుకున్నా కూడా, ఈ ప్రదేశానికి టూరు బస్సులోనే వెళ్ళమని చెప్పింది మా హోటల్లో వున్న అందమైన రిసెప్షనిస్టు.

‘మీరు ఆ మెలికల రోడ్డులో డ్రైవింగ్ మీద దృష్టి పెడితే, అక్కడి ప్రకృతి అందాలను సరిగ్గా ఆస్వాదించలేరు’ అని మెలికలు తిరుగుతూ అందంగా చెప్పింది.

సరే ‘మావి పాప’ చెప్పింది కదా అని, అప్పటికి అలా కానిచ్చి టూర్ బుక్ చేసుకున్నాము. అది ప్రొద్దున వెడితే, ఇక చీకటి పడ్డాకే తిరిగి రావటం. ప్రొద్దున్నే సాండ్విచ్ పాక్ చేసుకుని వెళ్ళాం.

దారిలో ఎన్నో రకాల పూల చెట్లు. పచ్చటి వృక్షాలు, మామిడి, బొప్పాయి, అరటి, పైనాపుల్ లాటి ఎన్నో పళ్ళ చెట్లు. పక్కనే క్రింద సముద్రం.. పైన నీలాకాశం. మధ్యే మధ్యే చిన్న చిన్న జలపాతాలు, లోయలు, అక్కడక్కడా చిన్న చిన్న గుహలు. ఇక్కడో ఇల్లు, అక్కడో ఇల్లు. వాటి పక్కనే పళ్ళ తోటలు, పూల తోటలు. ఎన్నో ప్రకృతి అందాలు. ఆ అందాలను వర్ణించటం నాకు సాధ్యం కాదు.

మా గైడ్/డ్రైవర్ కూడా సరదాగా జోకులు వేస్తూ, ఆరోజుని మరువలేని రోజుగా మామీద ముద్ర వేశాడు.

 

hawa4

మావిలో మేము ఉత్సాహంగా చూసిన ఇంకొకటి – వేల్ వాచింగ్. అంటే సముద్రంలో తిమింగలాలను చూడటం.

ఒక బోటులో, పది మంది వుంటారేమో – రెండు గంటలసేపు తిమింగలాలను చూడటానికి వెళ్ళాం. అవి చటుక్కున బయటికి వచ్చి వెంటనే, ఒక పెద్ద కదులుతున్న ఆర్చిలా, వెంటనే నీళ్ళల్లోకి వెళ్లిపోయేవి. ఎవరికి అవి కనపడినా పెద్దగా అరుపులు, అందరూ కెమెరాలు అటు తిప్పి ఫోటోలు తీసేలోగా, అవి మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళిపోవటం. అదొక ఆటలా సరదాగా గడిపాం.

ఇంకా మావి ద్వీపంలో చూడాలనుకునేవి, చేయాలనుకునేవి చాల వున్నాయి. హెలికాప్టరులో ద్వీపం అంతా చుట్టి రావచ్చు. స్నోర్క్లింగ్ చేయవచ్చు. స్కూబా డైవింగ్ చేయవచ్చు. పైనాపుల్ గార్డెన్స్ టూర్ వెళ్ళచ్చు. సర్ఫింగ్ చేయవచ్చు. బొటానికల్ గార్డెన్స్ చూడవచ్చు. ఇవన్నీ చేయాలన్నా, చూడాలన్నా వారం రోజులు నిజంగా చాలవు.

మా ‘మావి’ ప్రయాణం ఈ హవాయి ట్రిప్పులో ముఖ్యాకర్షణ.

అవకాశం దొరికితే, మళ్ళీ వెడతామా?

తప్పకుండా!

౦                           ౦                           ౦

 

మీ మాటలు

*