‘తప్పంతా వాళ్లదే!’

   ఆక్రోశ్

మన ఘనత వహించిన అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉద్దేశంతో కానీ, ఉద్దేశ రహితంగా కానీ చంపడం ఏమంత పెద్ద నేరం కాదని సల్మాన్ ఖాన్ కేసు తీర్పుతో మరోసారి తేలిపోయింది. సల్మాన్ తాగిన మైకంలో నిర్లక్ష్యంగా కారు నడపడంతో ‘కుక్క’ లాంటి ఒక మనిషి చచ్చిపోయి, ‘కుక్కల్లాంటి’ మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు కనుక కోర్టు ఐదేళ్ల శిక్షతో సరిపెట్టింది. దొంగలను, రేపిస్టులను పిట్టల్లా కాల్చేసి తక్షణ న్యాయం చేయాలని బాధ్యతగల పౌరులు డిమాండ్ చేస్తున్న వర్తమానంలో పదమూడేళ్లకు పైగా నడిచిన ఈ కేసులో.. చివరకు కాస్త శిక్షతోనే అయినా వచ్చిన ఈ తీర్పు ఆహ్వానించదగ్గదే.

సల్మాన్ హత్య చేయలేదు, నిజమే! కానీ తాగి కారు నడుపుతూ, ఫుట్ పాత్ పైకి దూసుకెళ్తే, అక్కడున్న జనం చస్తారని అతనికి తెలియదనుకోలేం. సినిమాల్లో డూపులు పెట్టుకునే ఆయనకు ఈ సంగతి ఇతరులకంటే మరింత బాగా తెలిసి ఉంటుంది. సినిమా కోర్టు సీన్లలో తిమ్మిని బమ్మిని చేసే వాదనలు, కూట సాక్ష్యాలు కూడా బాగా తెలిసిన ఆయన తాను కారు నడపలేదని నిన్న కూడా కోర్టులో చెప్పాడు. అప్పుడు కారు నడిపింది తన డ్రైవర్ అశోక్ సింగ్ అని కేసు చివరి దశలో చెప్పిన సల్మాన్ ఆ ముక్క 13 ఏళ్ల కిందటే ఎందుకు చెప్పలేదని ప్రాసిక్యూషన్ మంచి ప్రశ్నే వేసింది. చచ్చిన మనిషి  కారు కింద పడి చనిపోలేదని, ప్రమాదం తర్వాత కారును క్రేన్ తో ఎత్తుతుండగా కారు కిందపడ్డంతో చనిపోయాడని లాయర్ తో మరో సినిమా కథ చెప్పించాడు సల్మాన్.

ప్రమాదం తర్వాత తన నుంచి సేకరించిన రక్తంలో ఆల్కహాల్ ఉందని ఫోరెన్సిక్ నిపుణుడు ఇచ్చిన సాక్ష్యం కూడా చెల్లదన్నాడు ఆయన. ఆ నిపుణుడికి అసలు రక్తం సేకరించడమే తెలియదన్నాడు. ఇలాంటి తైతక్కలెన్నో ఆడాడు. కోర్టు ఇవేవీ నమ్మలేదు. ఇవన్నీ లా పాయింట్లు. బాధ్యతగల పౌరులకు అక్కర్లేదు. వాళ్లకు కావాల్సింది తక్షణ న్యాయం. అది 2012లో జరగలేదు. 2015లో కాసింత తక్షణంగా జరిగింది. హత్య కేసులే కాదు, సామూహిక ఊచకోత కేసులు కూడా దశాబ్దాల తరబడి నడుస్తున్న, పేలపిండిలా తేలిపోతున్న ఈ దేశంలో ఇది పెద్ద విశేషమేమీకాదు కనుక దీని గురించి చర్చ అనవసరం. కానీ ఈ కేసు తీర్పు తర్వాత సల్మాన్ కు మద్దతుగా కొందరు బాధ్యతగల సినీప్రముఖులు  చేసిన వ్యాఖ్యలు చూశాక చర్చ అవసరమనిపించింది.

‘కుక్క రోడ్డుపై పడుకుంటే కుక్క చావు చస్తుంది. రోడ్లు పేదల సొత్తు కాదు. రోడ్లున్నది కార్లకోసం. ముంబై ఫుట్ పాత్ లు అలగాజనం పడుకోవడానికా? ఫుట్ పాత్ నిద్ర ఆత్మహత్యలాంటి నేరమే.  సల్మాన్ కు అండగా నిలబడండి’ అని బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య ట్విటర్లో రాశాడు. తళుకెబెళుకుల జ్యుయెలరీ డిజైనర్ ఫరా ఖాన్ వంతపాడుతూ, ‘ఫుట్ పాత్ ల మీద పడుకునేవాళ్లు వాహనాల కిందపడి చావడానికి సిద్ధంగా ఉండాలి. మందు, డైవర్ను నిందించకూడదు. వేరే దేశంలో అయితే సల్మాన్ కారు మనుషులమీదికి పోయేదు కాదు. ఒకడు పట్టాలు దాటుతూ రైలు కింద పడి చనిపోతే రైలు డ్రైవర్ ను శిక్షించినట్లు ఉంది, సల్మాన్ కు వేసిన శిక్ష’ అంది(అందుకే ఈమెకు ఎవరో ‘ఇండియా మేరీ ఆంటోనెట్’ అనే బిరుదు కట్టబెట్టారు. ఈమెకు ఆంటోనెట్ గతి పట్టకుండుగాక).

సల్మాన్ అమాయకుడని కొందరు, ఏదో తెలీక చేస్తే ఇంత కఠిన శిక్షవేస్తారా అని కొందరు, అతడు దానవీరశూరకర్ణుడు, అపర గౌతమబుద్ధుడు కనుక వదిలేయాలని కొందరు వత్తాసు పలికారు. సారాంశం ఏమంటే.. సల్మాన్ ను శిక్షించకుండా వదిలేసి ఉండాల్సిందని, లేకపోపోతే నెలో, రెండు నెలలో ’అత్తగారింటికి‘ పంపి ఉండాల్సిందనీ. సల్మాన్ వీళ్లకు స్నేహితుడో, సాటి సినీ జీవో, బంధువో, గింధువో, అతనితో కోట్లు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాతలో కావొచ్చు కనుక మద్దతు పలకడం సహజమే. సల్మాన్ బ్యాడ్ బాయ్ చేష్టలు, జింకలవేటలు, అతిలోకసుందరుల కోసం తోటి హీరోలతో చేసిన బాహాబాహీలన్నీ కన్వీనియంట్ గా మరచిపోయిన వీళ్ల వాదనతో బీదాబిక్కీకే కాదు, జనసామాన్యానికంతా పెద్ద ప్రమాదముంది. వీళ్ల మహత్తర ‘అభిప్రాయాలపై కాస్త ఆలోచించాలేమో, వీళ్లంటున్నది సమంజసమేనేమో’ అని మధ్యతరగతి బుర్రలు కూడా అప్పుడే ట్వీట్లు కొట్టేస్తున్నాయి. అసలే మనది సినిమాల వాళ్ల, రాజకీయ నాయకుల మాటలను వేదవాక్యంలా భావించే అమాయక చైతన్యవంతులున్న దేశమాయె! కార్లు, లారీలు రోడ్లపై వెళ్తాయో, పుట్ పాత్ లపై వెళ్తాయో తెలిసిన మహాజ్ఞానుల దేశమాయె!

‘తీర్పు ఇంత ఆలస్యంగా వస్తే ఏం ప్రయోజనం? నా కాలు పోయింది. బతుకు తెరువు పోయింది. జీవచ్ఛవంలా పడున్నా. వచ్చిన 3 లక్షల పరిహారంలో ఒకటిన్నర లక్ష లాయర్ ఫీజుకింద పోయింది..’ అని ఒక క్షతగాత్రుడు.., ‘నా తొడ చితికిపోయింది. వచ్చిన రూ. ఒకటిన్నర లక్ష చికిత్సకే సరిపోలేదు. ఇప్పుడు సల్మాన్ దోషిగా తేలితే మాత్రం నా కడుపు నిండుతుందా?’ అని మరో క్షతగాత్రుడు వెళ్లబుచ్చిన ఆక్రోశం మాత్రం సోషల్ మీడియా ప్రేమికుల చెవుల్లోకి ఎక్కలేదు. రోడ్లపై పడుకునోళ్లను చంపితే నేరం కాదు, పేదవాళ్ల కారణంగానే సల్మాన్ పాపం జైలుకెళ్లాల్సి వచ్చింది( సల్మాన్ ఇంకా జైలుకెళ్లలేదు, బెయిలు పుచ్చేసుకుని ఇంటికెళ్లాడు) అని బెంగటిల్లుతున్న సల్మాన్ అభిమానుల వాదనకే ఈ మీడియాలో, మామూలు మీడియాలో విపరీత ప్రచారం లభించింది.

వీళ్ల వాదన శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలను పిట్టల్లా  చంపేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల, ఆ రాష్ట్ర మంత్రుల వాదనలా, ఆలేరులో ఐదుగురు తీవ్రవాద నిందితులను చంపేసిన తెలంగాణ పోలీసుల వాదనలా ఉంది(దొంగలు గతంలో అటవీ అధికారులను చంపడం, తీవ్రవాద నిందితులు పోలీసులు చంపడం నిజమే అయినా). దొంగతనంగా చెట్లు కొట్టేస్తే(మమ్మల్ని చంపితే, కాల్చితే ఊరుకుంటామా?) అని ఆ పోలీసులు చెప్పినట్లే.. ఫుట్ పాత్ లపై ఆదమరచి పడుకుంటే తాగినోళ్లు కార్లతో గుద్ది చంపకుండా పోతారా అన్నట్లుంది మహానటకుడి సమర్థకుల వాదన.

ఢిల్లీలో ‘నిర్భయ’పై పైశాచికానికి పాల్పడిన ముఖేశ్ సింగ్ కూడా బీబీసీ ఇంటర్వ్యూలో ఇలాంటి మాటలే అన్నాడు. ‘పరువున్నఆడపిల్ల రాత్రి 9 గంటకు బయట తిరగకూడదు. రేప్ కు మగాడు కాదు, ఆడదే కారణం. ఆడాళ్లకు ఇంటిపనే తగింది. డిస్కోలకు, బార్లకు వెళ్లకూడదు. చెడు పనులు చేయకూడదు(మగాళ్లు చేయొచ్చు!), ఒళ్లు కనిపించే బట్టలు వేసుకోవద్దు. ఆమె(నిర్భయ) మేం రేప్ చేస్తుంటే ప్రతిఘటించకుండా మౌనంగా భరించి ఉండాల్సింది. మా పని అయిపోయాక ఆమె స్నేహితుడిని కొట్టి, ఆమెను చంపకుండా వదిలేసి ఉండేవాళ్లం’ అని అన్నాడు.

ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు అడుగుతున్న, గుంజుకుంటున్న పాలకులు కూడా వాచ్యంగా ఇలా బరితెగించి చెప్పకున్నా ధ్వనిగానైనా ఇలాంటి వాదనలే చేస్తున్నారు, ‘రైతులకు భూములున్నది మాకివ్వడానికి కాక మరెందుకు? భూములు కలిగుండడమే వాళ్ల తప్పు. అవి లేకపోతే మా పని సులభమయ్యేది కదా’ అని.

ముస్లిం, క్రైస్తవులు తతిమ్మా హైందవేతరులందూ హిందూమతం పుచ్చుకోవాలని బెదిరిస్తున్న సంఘ్ పరివార్ కూడా ఇలాగే అంటోంది కదా, ‘ముస్లింలతో హిందూ జనాభాకు ముప్పు ఏర్పడింది. వాళ్లు ఎక్కువ మంది కనేస్తున్నారు. హిందువులూ ఎక్కువ మందిని కనాలి. ఈ దేశంలోని సమస్యలన్నింటికీ మూలం లౌకికవాదులే. వాళ్లు లేకుంటే సమస్యలే లేవు. హైందవేతరులే ఈ దేశానికి పీడ. అందరూ హిందువులైతే సమస్యలే ఉండవు..’

‘తప్పంతా ప్రేక్షకులదే. హింస, బూతు, రక్తపాతాలను ఎగబడి చూస్తున్నారు. అందుకే అలాంటి సినిమాలే తీస్తున్నాం. మమ్మల్ని తప్పుబడితే ఎలా?’

‘వాళ్లకు ఓట్లేసి గెలిపించారు కదా, మరో ఐదేళ్లు అనుభవించండి. అదే నన్ను గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్ కాదు స్వర్గం చేసేసి ఉందును.. గెలిపించలేదు కనుక తప్పంతా మీదే’

‘మేం పాఠాలు బాగానే చెప్పాం. తప్పంతా పిల్లలదే. క్రికెట్ మ్యాచ్ అనీ, సినిమాలనీ సరిగ్గా చదవకుండా ఫెయిలయ్యారు. అయినా గవర్నమెంట్ స్కూళ్లకు వచ్చే పిల్లలకు చదువెలా వస్తుందిలెండి?’

‘లక్షలు పోసి చదివించాం పిల్లలను. ఎందుకూ పనికిరాకుండా పోయారు. తప్పు వాళ్లదే..’

‘లంచాలివ్వకుంటే పనులు జరుగుతాయా? ఆ మాత్రం తెలియకపోతే ఎలా?’

‘తప్పంతా పాఠకులదే.. మేం రాసేవి మంచిపుస్తకాలు కాకపోవచ్చు. కానీ వాళ్లు అలాంటివే చదువుతున్నారు కనుక అవే రాస్తున్నాం’

‘మేం కమ్యూనిస్టులం. కానీ మా షాపుల్లో భారతరామాయణాలు, భగవద్గీతలు, భాగవతాలు, హస్తసాముద్రిక పుస్తకాలు.. ఇంకా కమ్యూనిజానికి బద్ధవ్యతిరేకమైనవన్నీ అమ్ముతాం. పాఠకులు వాటిని కొంటున్నారు కనుక. తప్పు మాది కాదు, వాళ్లదే’

‘…………………………………….’

‘…………………………………….’

‘…………………………………….’

నేరమేదైనా సరే బాధితులదే తప్పు! బాధితులు, పీడితులు లేకపోతే ఏ సమస్యా లేదని సూత్రీకరణ! పేదలు, అబలలు, అనాథలు, అభాగ్యులు లేని లోకం కోసం యమ పరితపించిపోతున్న ఈ దయామయుల, సమసమాజ స్వాప్నికుల, సున్నిత మనస్కుల ఆశయాలను నెరవేర్చడానికి బాధితులారా కదలండి! కదం తొక్కుతూ, పదం పాడుతూ కార్లకిందా, రైళ్లకిందా పడి చావండి! కామపిశాచాల అత్యాచారాలకు సహకరించండి! భూబకాసురుల ఆకలి తీర్చి గంగలో దూకండి! ఈ కరుణామయుల కలల సాకారానికి ఎన్నెన్ని రకాలుగా చావాలో, అన్నన్ని రకాలుగా చావండి!. ఛస్తే పోయేదేమీ లేదు, లోకం బాధలు తప్ప! !

*

 

 

మీ మాటలు

  1. buchi reddy gangula says:

    నేటి మన దోపిడీ వ్యవస్థ —–కుల తత్వం తో —మత పిచ్చి తో —దుర్వ్యసనాల తో
    అ శాస్త్రీయ బావా ల తో — ఆటవిక సాంప్రదాయాల తో —-చాదస్తాల తో —- అ జ్యానం తో —
    ఒక క్రమశిక్షన లేని — నిర్మాణం లేని —
    family పాలనల తో —-భారతదేశం వెలిగి పోతుంది ????
    రాహుల్ ప్రధాని — లోకేష్ ముఖ్యమంత్రి కావాలి —అపుడు దేశం –రాష్ట్రం మూడు పూలు
    ఆరు కాయల్లా ????మన పిచ్చి జనం — మన ప్రజా సామ్యం — మొన్న
    చదువుకున్న దద్దమ్మ లు అమెరికా లో లోకేష్ కు Ghana స్వాగతం — ??
    దొరల పాలన లు పోయే దే ప్పుడు ???

    ఎంత భాగా చెప్పాలో — చాల చక్కగా చెప్పారు sir—

    సంజయ్ దతె — సల్మాన —-ఎవరు అయినా not. above.the.law….

    అయినా డబ్బు — డబ్బు తో ఏది అయినా కొనుక్కోవచ్చు — అమెరికా అయినా –అమలాపురం అయినా —————-
    —————————————బుచ్చి రెడ్డి గంగుల

  2. నిశీధి says:

    సూపర్బ్ అనాలిసిస్ , అన్ని వర్గాల వాళ్ళు నేరం మాది కాదు మాకున్న ధనదాహనిది , అది తెచ్చిపెట్టే టెంపరరీ సుఖాలది పైపెచ్చు ఆ ఫలానా సుఖాలు మా వర్గానికి మాత్రమే కావాలి పక్కోడు ఇల్లు కాలి ఏడ్చినా కడుపు కాలి ఏడ్చినా మాకనవసరం అని తేల్చే చెప్పే స్తేటేమేంట్స్ అవన్నీ , నిజానికి ఒకో స్తేటేమేంట్ కి ఒకో ఉద్గ్రంథాన్ని రచించి ఇదుగో బాబు మన జీవితాలు ఇలా కాలుతున్నాయి అని విడమర్చి చెప్పినా వ్యవస్థలో ఒకరికొకరు పింప్ వర్క్ చేస్తూ బ్రతికేస్తున్న శవాలకి అర్ధం అవుతుందా ఈ ఆక్రోశం . ?

  3. దేవరకొండ says:

    ఇంతకాలం సా……..గి ఇప్పటికైనా ఆగిన ఈ ‘దిక్కుమాలిన’ కేసు, తీర్పు … ఎలా స్పందించాలో తెలియక అనేక సందర్భాల్లోలా మౌనంగా వున్న ఎందరికో గొంతు నిచ్చిన ‘ఆక్రోష్’ కి కృతజ్ఞతాభిన0దనలు! కులం, మతం, వగైరాలన్నీ ‘వర్గం’ తర్వాతే అనిపించట్లేదు?

  4. Kcube Varma says:

    మీ ఆవేదనా ఆక్రోశం ఈ బుద్ధజీవుల చెవికెక్కుతుందా? ఇవన్నీ తెలిసినా తెలియనట్టు తప్పించుకు తిరుగువారే ఎక్కువ. నిజానికి నాకైతే అనిపిస్తుంది ఒక్కోసారి భూకంపాలు సునామీలూ పార్లమెంంటులు అసెంబ్లీలు కింద అంబానీలు అదానీల భవంతుల కింద రావెందుకు అని. ఎందుకంటే తిరుపతి హుండీలో డబ్బులేసారనా? స్వచ్చభారత్ అక్కడినుంచిమొదలు కావాలి గురూజీ. నెలకో భూకపం ఆర్నెళ్ళకో సునామీ రావాలని కోరుకుంటూ సెలవ్.

    • తిరుపతి హుండీలో డబ్బులు వేసినా పాపాలు పోవు.
      సాక్షాత్తు దేవుడికే వజ్రకిరీటం చేయించినవాళ్ళు ఏమయ్యారో మనకు తెలుసు.

  5. RamaKrishna Mangipudi says:

    నేటి సమాజం లో “భయం” అనేది సామాన్య జనానికే తప్ప , ఈ జనాలే వల్లే “సెలబ్రిటీ” గ మారిన ప్రబుద్దులు కి చీమ కుట్టినట్టుగా కూడా వుండదు . ఒక నేరం చేస్తేనే గుర్తుంపు వస్తుంది అనుకొనే “బడ” నాయకులు ఎంత మందో.

    మనం కొనే “10”,”50″,”100″ రూపాయలతో ధనవంతుడు గ మారిన “యాచకలు”. మనం వేసిన బిక్షే ఈ రోజు వాళ్ళకి శిక్ష లేకుండా చేస్తుంది. బెయిల్ అనే చిన్న మార్గం ద్వార ఎంత పెద్ద నేరస్తుడైన బయట పడకలడు . లాలు,రాజ,కనిమోలి ,జగన్ ,గాలి …… ఇంకెక్కడి శిక్ష .. కొన్ని కోట్లు వృధా అవుతున్నాయి తీర్పు అన్న నెపం తో.
    మన న్యాయ వ్యవస్థ లో మార్పు వచ్చే వరకు ఇలనాటి ఘోరాలు చూడాల్సిందే.

    కాని ఒక్క విషయం – “తప్పు వాళ్ళది కాదు” మనదే . ఎంత మంది కలిసి పోరాడుతున్నం వీటి కోసం.
    మనకు ఎందుకు లే అన్న ధీమా వాళ్ళని అలా మారుస్తుంది. ఒక్క సారి గ మనం మారితే ఈ “సెలబ్రిటీస్” ఎమవ్వాలి.

    కాని – “తప్పు వాళ్ళది కాదు” మనదే . మనం ఎంచుకొన్న MLA ,MP ల ప్రజా”స్వారి” రాచరికం కి మనమే ముఖ్య పాత్రులం .
    మనలో ఎంత మంది “అవినీతి” కి బీజం వేస్తుంది ? “టైం” లేదు అన్న చిన్న నెపం తో బ్రోకర్స్ కి డబ్బులు ఇచి మేపుతున్నాము.
    మార్పు మనలో రావాలి.. ఆచరణ లో రావాలి… తిట్టుకొంటూ వదిలేయలేని దేశం నా దేశం..ఘన చరిత్ర వున్న గొప్ప భూమి.

    ఈ మార్పు “ఇంటి” నుండి,”గల్లి” నుండి,”ఊరి” నుండి,”జిల్లా” నుండి వస్తే – దేశం మారదా ? తప్పకుండ మారుతుంది.

    రోజు లో పది నిముషాలు దేశం కోసం అలోచించి ఆచరించు ..మార్పు అంటే ఇదే అని చాటు .

    మీ,
    రామ

  6. buchi reddy gangula says:

    ఫ్రెండ్స్

    దేవుడు కూడా రాజకీయ నాయకుడే —-కాదా
    యీ రోజుల్లో
    యీ గాంధీజీ పుట్టిన దేశం లో —ధనిక నీతి వేరు –పేద నీతి వేరు
    ధనిక న్యాయం వేరు —– పేద న్యాయం వేరు
    సోనియా దేవత — బాబు దేవుడు — అంటూ వ్యక్తి పూజలు — we. are.with.you… అంటూ
    జై కొడుతూ —అటు అమలాపురం లో — యిటు అమెరికా లో అదే తంతు —అదే నడవడి —
    మారింది –ఎక్కడ ??????గుడ్డి నమ్మకాలు ??? చదువు ఎందు కు ??
    ఒక మెట్టు ఎక్కాలన్నా
    నాలుగు రాళ్ళు సంపాది0.చు కో వాలన్నా
    పదవుల ఆశల తో
    ఆధిపత్యం చేయడం కోసం —
    గుర్తింపు కోసం —
    వ్యక్తి పూజలు చేస్తూ —-meet.. greet. లు –అమెరికా లో దొరల వ్యవహారాలూ — చూస్తున్న నిజాలు —
    ఆర్థిక వత్యాసాలు —కుల మత పట్టింపులు పోనంత కాలం — దేశం లో మార్పు
    వస్తుందనుకోవడం — గాలి లో దీపం ?????
    మనది ధనికులు ఉన్న పేద దేశం — స్వాతంత్రం వచ్చింది వాళ్ళకే ??
    దేశం లో న్యాయం — ధర్మం — నీతి — చెరచ బడుతుంది
    ఫ్రెండ్స్ — మనం ఎన్ని రాసుకున్నా ?????????

    ————————-బుచ్చి రెడ్డి గంగుల

  7. akrosh says:

    స్పందించిన వారికి థ్యాంక్స్. ఈ రోజు బాంబే హైకోర్టు నిర్వాకం చూశారా. సల్మాన్ కు ఆఘమేఘాలపైన బెయిలిచ్చింది. రేపటి నుంచి హైకోర్టుకు సెలవంట. ఈ రోజు సల్మాన్ న్యాయవాది కోర్టులో చెప్పింది మాట మన న్యాయవ్యవస్థ గుడ్డితనానికి పరాకాష్ట. కారు నడిపింది తాను కానని, తన డ్రైవర్ అశోక్ సింగ్ అని సల్మాన్ సెషన్స్ కోర్టులో ఇదివరకు చెప్పాడు. ఇప్పుడు అదే సల్మాన్ లాయర్ అమిత్ దేశాయ్ మాత్రం తన కక్షిదారు మాటను తానే కాదంటూ.. కారు నడిపింది అల్తాఫ్ అనే మనిషి అని హైకోర్టులో చెప్పాడు. పిచ్చి కోర్టు నమ్మేసినట్లే ఉంది. సల్మాన్ కారు నడిపాడా లేదా అన్నదాన్ని కాసేపు పక్కన పెట్టండి. కారు సల్మాన్ నడపకా, అశోకూ నడపకా, అల్తాఫూ నడపక.. కనిపించని మనిషో, దెయ్యమేదో నడిపింది…. రేపు సుప్రీం కోర్టులో సల్మాన్ లాయర్ ఈ మాటే అంటాడు.
    సల్మాన్ 13 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నాడు, పారిపోలేదు కనుక ఆయనకు బెయిలివ్వొచ్చని హైకోర్టు అంది. అంటే నేరం చేసి, ఎక్కడికీ పారిపోకుండా బెయిల్ పై హాయిగా తిరగొచ్చన్నమాట(సల్మాన్ రేడో, రేపో, షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్తున్నాడు). దీనికి సమర్థనగా ఏవో లా పాయింట్లు ఉన్నాయనుకోండి. సల్మాన్ కారు నడిపాడని నిజం చెప్పి లోకనీతికి బలైన రవీంద్ర పాటిల్ గురించి ఈ కోర్టులు, న్యాయవాదులు పట్టించుకోరు. బ్రిటన్లో ఉన్న మరో సాక్షిని రప్పించే శక్తీ వీళ్లకు ‘లేదు’.

    మళ్లీ ఫుట్ పాత్ ల వద్దకు వద్దాం. అభిజిత్ తన నీచ కామెంట్లను సమర్థనగా ముంబై రోడ్లపై పడుకున్న వాళ్ల ఫొటోలు పెట్టాడు. కాస్త దూరంలో వాహనాలు వస్తున్నాయి. అంటే అవి ఫుట్ పాత్ పై పడుకున్న జనాలపై వెళ్తే తప్పు వాటిది కాదు, వాళ్లదే అని చెప్పడం. సరదా కోసం ఫుట్ పాత్ లపై కార్లు పోనిచ్చి జనాన్ని చంపే వారుంటారు కానీ, సరదా కోసం పుట్ పాత్ లపై పడుకునే వారుంటారా? మన చిరంజీవి కూడా సల్మాన్ కు వత్తాసుపలికినట్టున్నాడు. చిరంజీవి తనయుడు బంజారాహిల్స్ లో రోడ్డుపై తన కారుకు అడ్డమొచ్చాడని ఓ సామాన్యుడిపై జులుం చేశాడు. రోడ్లున్నది సినిమావాళ్ల కోసమనా వీళ్ల వాదనా?
    జనానికి ప్రభుత్వాలు ఇళ్లు కట్టివ్వలేదు కనుకే జనం పుట్ పాత్ లపై పడుకుంటున్నారని, చచ్చిపోతున్నారని సల్మాన్ అభిమానులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ మాట సల్మాన్ కోర్టులో చెప్పి ఉంటే చాలా బావుండేది. ప్రభుత్వం కట్టివ్వలేదు సరే, కోట్ల పోగుచేసే బాలీవుడ్ ఎందుకు కట్టివ్వలేదు(కనీసం ముంబైలో). అలా చేస్తే తమ హీరోలు ఎవర్నీ చంపకుండా అడ్డంగా దూసుకెళ్తారు కదా…
    సల్మాన్ సెలబ్రిటీ అయ్యాడు కనుకే కోర్టు శిక్షకు గురికావాల్సి వచ్చిందని, లేకపోతే కోట్లు పోసి తప్పించుకేవాడని మరికొందరి అడ్డగోలు వాదన. సల్మాన్ సామన్య మానవుడిగా ఉంటే, అతనికి ల్యాండ్ క్రూయిజ్ కారు ఉండేది కాదు. డబ్బుతో ఏదైనాసరే మేనేజ్ చేసుకునే వాడు కాదు, 13 ఏళ్లుగా బెయిల్ పై తిరిగేవాడు కాదు.
    మన సమాజం, న్యాయ వ్యవస్థలు .. ఎంత కుళ్లపోయాయో చెప్పడానికి సల్మాన్ కేసు చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంత కంఠశోష ఎందుకంటే, నిలవనీడ లేక, బిచ్చమెత్తుకుంటూ, బొమ్మలో, ఏవో అమ్ముకుంటూ, మోసాలు దగాలు చేయకుండా బతుకుతూ.. ఫుట్ పాత్ లపై కలత నిదురలు పోతున్న అభాగ్యుల బతుకులు… నిలువెల్లా మోసాలు, దగాలతో కొవ్వెక్కి
    కొట్టుకుంటున్న నరరూప జంతువుల ఖరీదైన కార్ల కింద చితికిపోవద్దని… తోటి మానవులను కాపాడలేకపోతున్నా.. కనీసం వాళ్ల మానాన వాళ్లను బతకనిద్దామని..

  8. akrosh says:

    స్పందించిన వారికి థ్యాంక్స్. ఈ రోజు బాంబే హైకోర్టు నిర్వాకం చూశారా. సల్మాన్ కు సెషన్స్ కోర్టు వేసిన ఐదేళ్ల శిక్షను ఆఘమేఘాలపైన సస్పెండ్ చేసి బెయిలిచ్చింది. రేపటి నుంచి హైకోర్టుకు సెలవంట. ఈ రోజు సల్మాన్ న్యాయవాది కోర్టులో చెప్పింది మాట మన న్యాయవ్యవస్థ గుడ్డితనానికి పరాకాష్ట. కారు నడిపింది తాను కానని, తన డ్రైవర్ అశోక్ సింగ్ అని సల్మాన్ సెషన్స్ కోర్టులో ఇదివరకు చెప్పాడు. ఇప్పుడు అదే సల్మాన్ లాయర్ అమిత్ దేశాయ్ మాత్రం తన కక్షిదారు మాటను తానే కాదంటూ.. కారు నడిపింది అల్తాఫ్ అనే మనిషి అని హైకోర్టులో చెప్పాడు. పిచ్చి కోర్టు నమ్మేసినట్లే ఉంది. సల్మాన్ కారు నడిపాడా లేదా అన్నదాన్ని కాసేపు పక్కన పెట్టండి. కారు సల్మాన్ నడపకా, అశోకూ నడపకా, అల్తాఫూ నడపక.. కనిపించని మనిషో, దెయ్యమేదో నడిపింది…. రేపు సుప్రీం కోర్టులో సల్మాన్ లాయర్ ఈ మాటే అంటాడు.
    సల్మాన్ 13 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నాడు, పారిపోలేదు కనుక ఆయనకు బెయిలివ్వొచ్చని హైకోర్టు అంది. అంటే నేరం చేసి, ఎక్కడికీ పారిపోకుండా బెయిల్ పై హాయిగా తిరగొచ్చన్నమాట(సల్మాన్ రేడో, రేపో, షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్తున్నాడు). దీనికి సమర్థనగా ఏవో లా పాయింట్లు ఉన్నాయనుకోండి. సల్మాన్ కారు నడిపాడని నిజం చెప్పి లోకనీతికి బలైన రవీంద్ర పాటిల్ గురించి ఈ కోర్టులు, న్యాయవాదులు పట్టించుకోరు. బ్రిటన్లో ఉన్న మరో సాక్షిని రప్పించే శక్తీ వీళ్లకు ‘లేదు’.

    మళ్లీ ఫుట్ పాత్ ల వద్దకు వద్దాం. అభిజిత్ తన నీచ కామెంట్లను సమర్థనగా ముంబై రోడ్లపై పడుకున్న వాళ్ల ఫొటోలు పెట్టాడు. కాస్త దూరంలో వాహనాలు వస్తున్నాయి. అంటే అవి ఫుట్ పాత్ పై పడుకున్న జనాలపై వెళ్తే తప్పు వాటిది కాదు, వాళ్లదే అని చెప్పడం. సరదా కోసం ఫుట్ పాత్ లపై కార్లు పోనిచ్చి జనాన్ని చంపే వారుంటారు కానీ, సరదా కోసం పుట్ పాత్ లపై పడుకునే వారుంటారా? మన చిరంజీవి కూడా సల్మాన్ కు వత్తాసుపలికినట్టున్నాడు. చిరంజీవి పుత్రరత్నం బంజారాహిల్స్ లో రోడ్డుపై తన కారుకు అడ్డమొచ్చాడని ఓ సామాన్యుడిపై జులుం చేశాడు. రోడ్లున్నది సినిమావాళ్ల కోసమనా వీళ్ల వాదనా?
    జనానికి ప్రభుత్వాలు ఇళ్లు కట్టివ్వలేదు కనుకే జనం పుట్ పాత్ లపై పడుకుంటున్నారని, చచ్చిపోతున్నారని సల్మాన్ అభిమానులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ మాట సల్మాన్ కోర్టులో చెప్పి ఉంటే చాలా బావుండేది. ప్రభుత్వం కట్టివ్వలేదు సరే, కోట్లు పోగుచేసే బాలీవుడ్ ఎందుకు కట్టివ్వలేదు(కనీసం ముంబైలో). అలా చేస్తే తమ హీరోలు ఎవర్నీ చంపకుండా అడ్డంగా దూసుకెళ్తారు కదా…
    సల్మాన్ సెలబ్రిటీ అయ్యాడు కనుకే కోర్టు శిక్షకు గురికావాల్సి వచ్చిందని, లేకపోతే కోట్లు పోసి తప్పించుకేవాడని మరికొందరి అడ్డగోలు వాదన. సల్మాన్ సామన్య మానవుడిగా ఉంటే, అతనికి ల్యాండ్ క్రూయిజ్ కారు ఉండేది కాదు. డబ్బుతో ఏదైనాసరే మేనేజ్ చేసుకునే వాడు, 13 ఏళ్లుగా బెయిల్ పై తిరిగేవాడు కాదు.
    మన సమాజం, న్యాయ వ్యవస్థలు .. ఎంత కుళ్లపోయాయో చెప్పడానికి సల్మాన్ కేసు చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంత కంఠశోష ఎందుకంటే, నిలవనీడ లేక, బిచ్చమెత్తుకుంటూ, బొమ్మలో, ఏవో అమ్ముకుంటూ, మోసాలు దగాలు చేయకుండా బతుకుతూ.. ఫుట్ పాత్ లపై కలత నిదురలు పోతున్న అభాగ్యుల బతుకులు… నిలువెల్లా మోసాలు, దగాలతో బలిసి కొట్టకుంటున్న నరరూప జంతువుల ఖరీదైన కార్ల కింద చితికిపోవద్దని… తోటి మానవులను కాపాడలేకపోతున్నా.. కనీసం వాళ్ల మానాన వాళ్లను బతకనిద్దామని..
    సల్మాన్ కేసులో నిజం చెప్పింనందుకు కానిస్టేబుల్ రవీంద్ర పాటిల్ బతుకు ఎలా ఛిద్రమైందో ఈ లింకులో చూడండి..

    http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/08052015/14

  9. buchi reddy gangula says:

    చెప్పాను గా sir— డబ్బు — డబ్బు — మహిమ

    రాజకీయాల్లో ఒనుమాలు తెలియన మెగాస్టార్ — మాజీ కేంద్ర మంత్రి ????జోక్ –
    అతడు ఏ పిచ్చి కూతలు అయినా కూస్తూ —-

    ———————–బుచ్చి రెడ్డి గంగుల

  10. దేవరకొండ says:

    నేను థియేటర్లో సినిమా చూసి దశాబ్దం పైన అయింది.. ఇలాంటి నేరగాళ్లతో, వాళ్లను సమర్థించే ఫాల్తుగాళ్లతో నిండి, పైగా పబ్లిక్కి నీతులు, బూతులు చూపించి దానికి వినోదమని పేరుపెట్టి వర్తకం చేసుకునే ఈ సినిమాను కనీసం బుద్ధి జీవులైనా బహిష్కరించలేమా? ఈ సందర్భంలో…ప్రాణాలు పోయిన, ఆవేదనతో నలిగిపోయిన వారికి సానుభూతిగానైనా? చేయలేమా? ఆలోచించండి!

  11. దేవరకొండ says:

    సల్మాన్ దుబాయ్ వెళ్ళడానికి కోర్టు అనుమతి – వార్త.

Leave a Reply to నిశీధి Cancel reply

*