కరెంటొచ్చె..! జనాలకి తీరిక సిక్కె..!

     సడ్లపల్లె చిదంబర రెడ్డి 

యనకటి  కాలంలో సేద్యాల్ని వాన దేవునిమింద బారమేసి సేస్తావుండ్రంట రైతులు. అదనుగా సినుకులు పడితే ఆనందము. ఏటిస్తే నీళ్ల నెదుక్కోని పొయ్యే వలస బతుకులంట.
 
    రాజులు తవ్విచ్చిండే సెరువుల కింద, ఏర్లు, వంకల తీరాల్లో యాతమెత్తి,గూడేసి,కపిలి(మోట)తో నీళ్లు తోడి కొందరు యవసాయం సేస్తా ఉండ్రంట.
 
    సేద్యాలు సేసేకి  బాయిలు తవ్వేది పజ్జెనిమిదో నూరేడు ఇరుమైలు ఒరుకు(18 వ శతాబ్దికి వెనకా ముందుదాకా) రైతులుకు తెలీదంట!!
 
   అపుడు గుళ్లూ గోపురాల దగ్గర నాలుగు మూల్లు సౌకంగా తవ్వి రాతి కట్టడం కట్టే  కోనేటి బావులు మాత్రమే తెలుసునంట. ఊర్లల్లో సేద బావులు గూడా నాలుగు మూళ్ల సౌకాలే!!
    కుంపిణీ వోని (ఆంగ్లేయుల కంపెనీ)కాలంలో రైతులకు పట్టాలిస్తూనే కొందరు బాయిలు తవ్వేది మొదలు పెట్రంట.  ఏటి గడ్డలో మెత్తగా ఉండే నేలని పదో పదకొండో అడుగులు తవ్వుతూనే దిక్కులేనన్ని నీళ్లు ఊర్తా ఉన్నంట. దానికి రాళ్లతో గోడ కడితే  నీళ్లూ మన్నూ కలిసిన(కొచ్చు) బురద, ముందరికి జరిగొచ్చి బాయిలన్నీ పూడుకు పోతా  ఉన్నంట.
   ఇట్లయ్యెల్లేదని ఎదురు పుల్లలు,లక్కిలి బర్రలు,పూలి కొమ్మలు నరుక్కొచ్చి తీళి తీగల్తో పెద్ద పెద్ద తడకలల్లి, బాయి తవ్వే కొద్దీ బూమి లోపలికి దించుతా వుండ్రంట. అపుడు మన్ను తడక ఎనకాలే నిల్సి, నీళ్లు మాత్రం బాయిలోనికి వొస్తా వున్నంట. వాట్ని “కొర్సు బాయిలు” అని పిలుస్తా వుండ్రంట!!
    ఒగసారి అరవ దేశం (మదరాసు రాష్ట్రం) నుంచి ఒగ ఇంజినీరు ఒచ్చినంట. ఆయప్ప సింత పలకల్ని గుండ్రంగా రింగుల మాదిరీ కోపిచ్చి,లోతుగా తీసిన బాయిలో అడుగున ఉంచేది, దాని మీద ఉలితో తొల్సిన రాళ్లను న్యారముగా (నీటుగా) కట్టేది, బురద మన్ను నూకినా కదలకున్నట్ల రాళ్లను పేర్సే ఇదానము రాళ్ల పని సేసే “వడ్డి” కులస్తులకు నేర్పినంట.
    అఫుడు అల్లో (అపుడు మా ఊరిదగ్గరున్నది పెన్నేరని చాలా మందికి తెలీదు.హళ్ల అంటే కన్నడంలో వంక అని అర్థం చాలా ఏళ్లవరకూ హల్ల అనే వ్యవహరించే వారు.) ఏడెనిమిది మట్లు (మట్టు=6 అడుగుల లోతు) బావులు తవ్వేది మొదలు పెట్రంట. రెండు మూడేండ్లు వానలు పడకుండా యగేసుకొంటే ఆ బాయిల మద్యలో పిల్ల గారండా (సిమెంటు రింగు లాంటిది.గారుతో చేసిన అండాకారం కలది) దించేది కూడా నేర్సిరి. బాయిల కన్నిటికీ అంతే  కొలతల్తో బార్లు తొలిసి కపిల బాన్లతో నీల్లు తోడి వానలు పడకున్నా గూడా సేద్యాలు సేసేది నేర్సిరంట.
     ఈ రకంగా సాగు బూమి యంత పెంచినా ఏంటేంటివో రోగాలొచ్చి పెట్టిన పంటంతా నాశన మయితా వున్నంట. అవుడు ఇంగిలీషోని రాజ్యమంట! ఆయప్పగారు పంటలకి మందులు సల్లమని రైతులకు పురమా యిస్తా వుండ్రంట. రైతులు వాళ్ల మాట ఇంటా వుండ్లేదంట. పంది రోగమని పైర్ల మింద పండులు కోసి రగతం సల్లేది,కొక్కెర రోగమని సేన్ల దగ్గర కోళ్లు కోసేది,ఎనుంపోతులు నరికేది సేస్తా వుండ్రంట.
 IMG_0008
    అపుడపుడే కొత్తగా సీమెరువులు(రసాయన ఎరువులు) ఒచ్చినంట. అవి మన్నులో ఏస్తే కరిగే దానికి రైతులు ఉప్పు అని పిలుస్తా వుండ్రంట. రైతులు బూములకు తోలే పశువులెరువులు,ఒండు మన్ను,పచ్చాకు జతకి రవ్వంత సేమెరువు సల్లండి పంటలు బాగా పండతాయని రెడ్డీ కరణాలు అందర్నీ పిల్సి బంగ పోతా వుండ్రంట. అయినా రైతుకు కిబ్బిబ్బీ (ఏమాత్రం)వాళ్ల మాట్లు ఇంటా వుండ్లేదంట!
     ఇట్ల అయ్యెల్లేదని కరణాలు రాతిరిపూట తలారోల్లని  పిల్సి సీమెరువులు,పురుగుల మందులూ ఇచ్చి– ఒగొగొ ఊర్లో ఒగొగు సేను గుర్తుపెట్టుకోని రహస్సింగా సల్లించేది మొదలు  పెట్రంట.
    సేమెరువులు మందులు తగిలిన పైర్లు ఏపుగా పెరిగి ఇరగ్గాసినంట. అది తెల్సి మిగతా జనాలుకూడా అవిట్ని వాడేది మొదలు పెట్రంట. దాంతో రెడ్డీ కరణాల జాతకాలు మారిపాయ నంట. యాలంటే గిరాకీ పెరిగి అవ్వి అంగాళ్లో సిక్కకుండా అయిపాయ నంట. రైతులు కొనల్లంటే రెడ్డీ కరణాల సంతకం కావల్లంట!!
   ఆ కాలంలో తిరుపతి యంగట్రాణస్వామి దర్శనం బిరీన అయితా ఉన్నంట గానీ,కరణం కంట్లో పడల్లంటే అయిదారు సార్లు అడుక్కు తినే వాళ్ల మాదిరీ రైతులు ఆయప్ప ఇంటిముందర పడిగాపులు కాయల్లంట. సేన్లో పండే కూరగాయలు,బెల్లము,నెయ్యి,టెంకాయలు,జున్నుపాలు… మోయ లేనన్ని మోసిస్తే గాని ఆయప్ప అర్జీ మింద సంతకం సేస్తా ఉండ్లేదంట.
    రెడ్డీ కరణాలు ఊర్లో కొస్తే సన్నాబన్నా జనాలు ఎర్సుకోని సస్తాఉండ్రంట. అపుడు యాడాదికి ఒగతూరి బూమి సిస్తు (రూకలు,కందాయము అనికూడా పిల్చేవారు)కట్టల్ల. గుత్త  రూకలు వసూలు సేసేది వాళ్లే.
      1960 ఇరుమైల్లో(వెనకా ముందు)నాకి ఆరేడు ఏండ్లు ఉండొచ్చు. రెడ్డీ కరణాలు ఊరంతా తిరిగి మా గుడిసి పక్కనుండే మా అప్పప్పా(చిన్నాయన) గుడిస్తా కొచ్చిరి. ఆయప్ప అయిదు రూపాయలు గుత్త రూకలు కట్లేదంట! దాని కోసరం జప్తు సేసి తలారాయప్ప  కుర్ర దూడని పట్టుకు పొయ్యి గుడి ముందర కట్టేశ.
     ఆపొద్దు మా నాయిన ఊర్లో ఉండ్లేదు. వానలు రాకుండా ఎగిచ్చుకోనుంటే ఇరాట పర్వం సదివేకి యావిదో ఊరికి పొయినట్లుండె. మా యవ్వ ఊరంతా దేబిరించినా అయిదు రూపాయల దుడ్లు పుట్టందం కాలేదు. కడాకి తాసిల్దారొస్తే ఆయప్ప కాళ్లు పట్టుకోని” ద్యావరా బంగారట్లా కుర్రదూడని పట్టుకు పోతే అది మేతా నీళ్లు లేక సస్తుంది. రెండు మూడు దినాలు గడువియ్యండి యాడో అప్పో సొప్పో సేసి కడతాము” అని అడుక్కోనె. అయినా ఆయప్ప సెవుల్లో ఏసుకో లేదు.
    ఇంగా ఎవురో కురవోళ్లు రెండ్రూపాయలు కట్టకుంటే ఇంటిని జప్తు సేసి ఇత్తడి తప్పేలా ఎత్తుకొచ్చిరి.
     సాయంత్ర మవుతూనే కుర్ర పెయ్యని ఇందూపురంలో వుండే బందుల దొడ్డికి తోల్రి. అపుడు మా యవ్వ “రాతిరంతా దాన్ని ఉపాసం సంపుతారు  మ్యాత ఎత్తుకుపొయ్యి ఏసి రారా “అని సిన్నాయన్ని పురమాయించె.
IMG_0021
    ఆయప్ప శానా అమాయికుడు, జతకి ఆని కాళ్లు సెప్పులు తెగి పొయ్యిండివి నడిసేకి శాతగాదు అని తెల్ల పదం పాడె.(నే చిన్నప్పుడు చాలా మందికి పదాల నిండా ఆనెలే.చెప్పులు కొనలేని చాలా మంది పాదాలకు పాత బట్టలు చుట్టుకొని నడిచేవారు. మా అమ్మకు, నాన్నకు,పెద్దన్నకు ఉండేవి. అది చర్మ రోగమో పరిశుభ్రతకు సంబందించినదో తెలియదు.ఇప్పుడు ఎక్కడా కనిపించదు).కడాకి మా సిన్నన్నయ్య రవీందర్రెడ్డి ఎండిండే రాగు తాళు మోపు మోసుకు పొయ్యి బందుల దొడ్డిలో కుర్రకు తినిపించి ఒచ్చె.
    రెడ్డీ కరణాలు 1982 దంకా పల్లుటూరి జనాల్ని పీతిరి పంతల మాదిరీ (రాబందుల్లాగా) పీక్కు తినిరి. అంత సేపటికి అపుల పాలై, సీమలో  సేద్యం సేసే బదులు అడుక్కితినేదే మేలని, మేము సేద్యం ఇడిసి పెడ్తిమి. ఇపుడు రైతుల్ని రాజ్యమే పీక్కు తింటావుందని గుస గుసలాడే వాసనొస్తావుంది!!
   సొతంతరం ఒచ్చిన పది పదకొండేండ్లకి, మా ఊరి పొలాలకి కరెంటొచ్చె!! అంతకు ముందు నీళ్లు తోడే కపిల బాన్లు, డీజలింజన్లని మూల కేసిరి. బాయిల దగ్గర రూములు కట్టించి కరెంటు మోటార్లు బిగిచ్చిరి.
    అయిదారు జతల ఎద్దులు,బీముని మాదిరీ వుండే మూడు జతల మగ మనిషులు పేగులు తెగి పొయ్యేతట్లు, పేడలో పులుగుమాదిరీ రాతిరీ పగలూ యంపిర్లాడినా రెండు కొడతల్ని నీళ్లు తడిపేకి అయితా వుండ్లేదు!! అట్లాది కరెంటు మోట్రు సుచ్చిని”టప్” న ఒత్తితే సాలు “జరో” అని ఇనుప్పైపుల్నిండా నీళ్లు పాతాళం నుండి ఎగజిమ్ముకోని ఒస్తావుండె.
    రైతుల ఆనందాన్ని కొల్సేకి మాటలు సాలవు. సాగు సేసే బూమిని పెంచి పారేసిరి. వేలాంతరం సన్న జీవాలు(గొర్రెలు,మేకలు),నూరారు ఊరి జీవాలు మేతకని ఇడిసిన బీడు బూములన్నీ మాయ మాయ.ఎద్దులకి పని తగ్గి పాయ. మనుషుల కష్టం తీరి పాయ.
    ఆడ మొదలాయనన్నా! అడవుల్ని అంతం సేసే ఆది కాలం!
    ఆడ మొదలాయనన్నా! పశువుల్ని కబేళా కెత్తే  కొత్త కాలం!
    ఆడ మొదలాయనన్నా! పని లేని జనాలు పట్నానికి తిరిగే కాలం!
    ఆడ మొదలాయనన్నా! ఓటలు తిండికి సినిమా బొమ్మలకి అలవాటు పడే  కాలం!
    ఆడ మొదలాయనన్నా! అప్పులు సేసి ఆస్తులమ్మే అద్దువాన్న కాలం!
    ఆడ మొదలాయనన్నా! ఆడబిడ్డల్తో కట్నం వొసూలు సేసే దుడ్ల కాలం!
    ఇంతకి ముందు పెడతా ఉండే ఆరుతడి పంట్లు రాగులు,జొన్నలు,సజ్జలు,కొర్రలు ఇడిసి పెట్టి సెరకు తోట్లు,మిరప సెట్లు,వొరి పైర్లు యేయ బట్రి.
   బూ మండలం తయారయ్యి యన్ని  యేల కోట్ల యేండ్లయ్యిందో !!??  ఆ పొద్దుట్నుంచి ఆ యమ్మ ఒంటి పొరల నిండా గంగమ్మ తల్లిని గుట్టుగా దాసుకో నుండె!! వానలు అయిదారేండ్లు పడకున్నా పై పైన మాత్రమే యండ పీరుపుకి బూని ఎండుకు పోతా వుండె. అట్లాది బాయిలకి బిగించిన కరెంటు పైపులు ఏనుగు తొండాల మాదిరీ నీళ్లని పీల్సి పారేశె. ఆకలి గొన్న పిల్లోడు పాల బుడ్డీని సిబికి సుక్కడు గూడా మిగలకుండా ఉత్తది సేసి నట్ల బూమితల్లిని నున్నగ పీల్సి పారేసిరి.
   దిక్కు లేనంత పంటలు పండిచ్చేది మొదలు పెట్రి. యంత జేసినా, ఇచ్చిన అప్పులకి ఒడ్డీలని, దళ్లాలని, రేట్లు పడిపొయ్యిండివని ఇందూపురం లోని యాపారస్తులు బతికి బాగు పడ్రేగాని రైతులకి కడాకి మిగిలింది అప్పులూ నొప్పులు  మత్రమే!!
   ఇదే కాలంలో అరవ దేశం కోయంబత్తూరు నుంచి యల్.జి.బాలక్రిష్ట్న అనే ఆయప్ప ఒచ్చె. మా ఊరికి మూడు నాలుగు మైళ్లదూరంలో నూరారెకరాల దిన్న (మెట్ట) బూమిని సూసు పాయ.
    ఉలవలు గూడా పండెల్లేదని ఇడిసిపెట్టిన బీడు బూములవి.గొర్రి మందలు, ఊరిజీవాలూ మేస్తావున్న పనికి రాని జమీన్లు. వాట్నంతా యకరా ఇరవై ముప్పై రూపాయలకే అరవాయప్ప కొనేసె. నూలు మిల్లు కట్టేది మొదలు పెట్టె.
   అపుడు రైతుల దగ్గర పని సేసేకి రెండణాలు(12 పైసాలు).కోయంబత్తూరాయప్ప పావలా( 25 పైసలు) ఇయ్య బట్టె. సుట్టూ పక్కల జనాలంతా మిల్లు కూలికే పోబట్రి.
   మిల్లు కట్టేకి ఇటికలు కావాల్సొచ్చె. ఏటి గట్టు రైతులు కొంద్రు సేద్యాలిడిసి ఒండు మన్నుతో ఇటిక బట్టీలు మొదలు పెట్రి. ఇటిక కాల్సేకి కట్టి కావల్ల గదా!! పెన్నమ్మ నది గట్లో నందన వనాల మాదిరీ వుండే కానుగ తోపుల్నంతా నున్నగా  నరికి పారేసిరి.
  గలగలా అని పార్తావుండే నీళ్లతో, పచ్చ పచ్చగా ఊగుతా వుండే అడవుల్తో నిండు ముత్తయిదువు మాదిరీ కళ కళా మెరుస్తావుండే పెన్నమ్మ— మొగుడు సస్తే తలకాయి కొరిగిచ్చుకోని కదలకుండా  మెదలకుండా మూల్లో కూలబడ్న ముండ మోపయిపాయ!!

మీ మాటలు

  1. Lalitha P says:

    చాలా బాగున్నాయి మీ ఊరి కతలు. “ఆయమ్మ ఒంటి పొరల నిండా గంగమ్మ తల్లిని గుట్టుగా దాసుకోనుండే”. “ఆడ మొదలాయనన్నా” అంటూ ఎంతో ఆర్ద్రంగా చెప్పారు. ఓ గొప్ప నవలకు తగిన విషయం ఉంది మీ అనుభవాల్లో. కొర్సు బాయిలు, ఇంకా బావుల తవ్వకాల గురించి వివరణ ఎంతో బాగుంది. అభినందనలు.

    రైతుకు సీమెరువుల్నీ పురుగు మందుల్ని అలవాటు చెయ్యటానికి రెడ్డి, కరణాలు రాత్రులు రహస్యంగా అవి చల్లించటంతో మొదలైన వర్తులం పూర్తయిన చోట ఉన్న ఇప్పటి రైతులు ఈ జ్ఞానాన్ని మర్చిపోవటానికి ఎంత కాలం పడుతుందో! కొత్త నడకలు నేర్పిన ప్రభుత్వాలు అవి తీసుకెళ్ళి పడేసిన ఊబిలోంచి రైతు ఎలా బైటపడాలో చెప్పటం లేదు.

  2. ఈవిశాయాలన్నీ నవలగా రాద్దామనే అనుకొన్నా అయినా చాలా పాత్రలను సృస్టించ లేక -ముఖ్యంగా నవల అన్నాక కల్పించ వలసి ఉంటుంది లేనిది కల్పించ లేక దాదాపు 100 సం. మార్పును క్లుప్తంగా చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను. మీ స్పందనకు ధన్యవాదాలు.

  3. Nisheedhi says:

    ఎప్పటిలానే ఎక్సెలెంట్ .అయితే ఈ సారి చాలా పదాలు అర్ధం కాలేదు సర్ .అయినా చదువుతుంటే ఆ లోకంలోకి వెళ్ళిపోయిన తృప్తి

  4. నిశీధి గరూ ధన్య వాదాలు.దాదాపు 100 సం.మార్పును క్లుప్తంగా చెప్పడమే కాకుండా పర భాషల మోజుల్లో పడి చేతులారా నాశనం చేస్తున్న ప్రాంతీయ ప్రజల భాషను మనపూర్వులు అపూర్వంగా మనకు అందించిన స్వర సంపదను మన వంతు బాధ్యతగా రికార్డు చేద్దామనే చిన్న ప్రయత్నం .దీనికి గానూ సారంగ మాగజైన్ వారికి కృతజ్ఞతలు చెప్పాలి.

  5. sudheer balla says:

    మీరు చెప్పిందంతా బాగుంది గానీ ఎనభై రెండు లో ఎందుకు మార్పు వచ్చింది , యన్టీ ఆర్ వల్లా , అది చెప్పవా రెడ్డీ , కులమా ……… కారణం

మీ మాటలు

*