నా మొదటి “సంఘ ప్రవేశం”

chitten raju

 

1961 సంవత్సరం..అంటే నేను ప్రీ యూనివర్సిటీ పరీక్ష పాస్ అయ్యాక మా అన్నయ్యలు ముగ్గురూ వ్యవసాయం, లాయరు, డాక్టరు వృత్తులు పంచుకున్నారు కాబట్టి నేను సహజంగానే ఇంజనీరింగ్ చదవాలని నిశ్చయం అయిపోయింది. అప్పుడే నా జీవితంలో మొదటి సారి “కులం దెబ్బ” కొట్టింది.  అంటే కేవలం అగ్ర కులం వాణ్ణి కాబట్టి తిన్న ఏకైక దెబ్బ. కానీ తంతే బూరెల గంపలో పడ్డట్టు దాని వలన నా మొట్టమొదటి  “సంఘ ప్రవేశం” కూడా జరిగింది. అంటే, అమ్మా, నాన్న గారూ, అన్నదమ్ములూ, అప్ప చెల్లెళ్ళల్ల పెరుగుతున్న ఆత్మీయ వాతావరణం నుంచి ఎవరూ తెలియని, సంబంధం లేని వ్యక్తుల మధ్య సంఘంలో ఒక్కడిగా జీవించడం, మన సమస్యలూ, ఆనందాలూ మనమే కొనితెచ్చుకోవడం, ఢక్కా మొక్కీలు తినడం, గాలి లో మేడలు కట్టుకోవడం వగైరా మొదలయిందన్న మాట.  

ఆ రోజుల్లో మన ప్రాంతాలలో విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం లో మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. అప్పటికే పరిపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడి రాజధాని అయిన హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నా స్థానిక ముల్కీ నిబంధనలు వగైరాలపై అవగాహన లేకా, ఇంకా మద్రాసుతోటే మానసికంగా ముడిపడి ఉండబట్టీ మహా అయితే అక్కడి గిండీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన ప్రాంతపు కాలేజ్ క్రిందనే లెక్క లోకి వచ్చేది. ఇక మద్రాసు, ఖరగ్ పూర్ ఐ.ఐ.టి. లు, బెంగళూరు ఐ.ఐ.ఎస్.సి. పేర్లు తల్చుకుని “అయ్యా బాబోయ్” అని భయపడడమే కానీ ఎంట్రెన్స్ పరీక్షల తతంగం మీద బొత్తిగా అవగాహన లేదు. అన్నింటికన్నా ముఖ్యం అయినది “మన కాకినాడలోనే ఇంజనీరింగ్ కాలేజ్ ఉండగా, అవన్నీ మనకెందుకూ, డబ్బు దండగ” అనేదే అందరి ఆలోచన..నాతో సహా. ఈ రోజుల్లోనూ, ఆ రోజుల్లోనూ కొందరి లాగా “ఇంట్లోంచి ఎప్పుడు బైట పడిపోదామా” అని ఎప్పుడూ అనుకో లేదు.  పైగా నేను పియుసి లో మా క్లాస్ ఫస్ట్, కాలేజ్ సెకండ్ రేంకు కాబట్టి సీటు రావడం గేరంటీ. ఆ రోజుల్లో ఆ రెండూ గవర్నమెంట్ కాలేజీలు కాబట్టి కాకినాడకీ, అనంత పురానికీ ఒకటే అప్లికేషన్ ఉన్నా, ఇక్కడి వారికి అక్కడ సీటు ఇచ్చే వారు కాదు. అయితే వైజాగ్ లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కి వేరే అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను కాకినాడ కాలేజ్ కి అప్లికేషన్ పెట్టాక, కేవలం ఎందుకైనా మంచిదని విశాఖపట్నం లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కి కూడా దరఖాస్తు పంపించాను ఆఖరి క్షణంలో. “ఎందుకు రా, వెధవ అప్లికేషన్ ఫీజు పది రూపాయలు దండగా. చేరేది ఎలాగా కాకినాడ లోనేగా” అన్నారు మా నాన్న గారు.

AU Logo

అదిగో, అక్కడే నన్ను “అగ్ర కులం దెబ్బ” కొట్టింది. కాకినాడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో  కులాల వారీ రిజర్వేషన్ పద్దతిలో నాకంటే అతి తక్కువ మార్కుల వచ్చిన వారికి సీటు వచ్చింది కానీ , మా అగ్ర కులం వారి అతి తక్కువ కోటా అర్జంటుగా దాటి పోయి నాకు కాకినాడలో సీటు రాలేదు.  కాకినాడ వాడిని కాబట్టి ఏదో వల్లకాడు రూలు ప్రకారం అనంతపురంలో నాకు సీటు ఇవ్వకూడదుట. నా అగ్ర కుల “ప్రభావం” నా జన్మలో మొదటి సారిగా, ఆ మాటకొస్తే ఆఖరి సారిగా నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. దానికీ, దేనికీ నిజమైన పోలిక ఎక్కడా లేదు కానీ ఆ తరువాత మళ్ళీ పదిహేనేళ్ళకి అమెరికాలో అడుగుపెట్టాక మాత్రమే అధికారికంగా ఏ విధమైన “రిజర్వేషన్లూ” లేకపోయినా అనధికారికంగా అమెరికా తెలుగు “సాంస్కృతిక” సంఘాలు ఏకకుల ప్రాధాన్యతని పాటిస్తూ కుల వ్యవస్థని నిరాటంకంగా అమలు పరిచే స్థాయికి “ఎదగడం” నేను గమనించాను. కానీ ఇక్కడ అనేక రాజకీయ, వ్యాపార తదితర కారణాలకి స్వకుల పక్షపాతం పాలు ఎక్కువే కానీ అన్య కుల వివక్ష దానికి కారణం అనుకోను. 

కాకినాడ పి.ఆర్. కాలేజ్ మొదటి రేంక్ విద్యార్థి అయిన నాకు అక్కడే ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ లో సీటు రాకపోవడంతో మా కుటుంబం షాక్ కి గురి అయ్యారు. ఇక మిగిలినదల్లా నేను యాదాలాపంగా పెట్టిన ఆంధ్రా యూనివర్సిటీ అప్లికేషన్. అదృష్టవశాత్తూ అక్కడ నుంచి ఇంటర్ వ్యూకి పిలుపు రాగానే ఊపిరి పీల్చుకుని వెంటనే అక్కడికి అన్నీ సద్దుకుని పరిగెట్టాను. నిజానికి అది ఇంటర్ వ్యూ కాదు, ఏకంగా ఎడ్మిషనే అని అక్కడికి వెళ్ళాక కానీ తెలియ లేదు. కాకినాడ లో సీటు రాక పోడానికీ, వైజాగ్ రావడానికీ కారణం నాకు ఇంగ్లీషులో మంచి మార్కులు రావడమే అని ఆ ఇంటర్ వ్యూలో అప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేసినది కృష్ణమాచార్యులు అనే ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారు. నా పూర్తి పేరు చూడగానే “నియాగప్పిండానివా? మరి మార్కులు బాగానే ఉన్నాయి కదా, కాకినాడలో సీటు ఎందుకు రాలేదూ?” అని అడిగారు. నేను ఆ మూడు ప్రశ్నలకీ ఏం చెప్పాలో తెలియక వెర్రి మొహం పెడితే ఆయన పక్కన ఉన్న మరో ప్రొఫెసర్ గారు “కాకినాడ లో మేథమేటిక్స్,  ఫిజిక్స్, లాజిక్ మార్కులు కలిపి చూస్తే మనం ఎందుకైనా మంచిది అని ఇంగ్లీషు కూడా కలిపి చూస్తాం. పైగా అక్కడ కోటా సిస్టం కదా. మనదేమో మెరిట్ సిస్టం” అని సగర్వంగా చెప్పి నా బదులు ఆయనే సమాధానాలు చెప్పాడు. “సరే అయితే వీడికి 5 th బ్లాక్ లో రూమ్ ఇద్దాం.” అని “ ఏరా, డబ్బు తెచ్చావా? ఆ ఆఫీసులో కట్టేసి, చలానా తీసుకుని హాస్టల్ లో చేరిపో” అని ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్ లో 5th బ్లాక్ లో గది ఇచ్చారు. మొదట్లో గదులు లేక ఐదో అంతస్తులో కామన్ హాల్ లో పది మంది తో కొన్నాళ్ళు ఉన్నా ఆ తరువాత 84 నెంబరు గది కేటాయించారు. ఆ కామన్ హాల్ లో నా రూమ్ మేట్ గుంటూరు శర్మ అనే ఆయన ఇప్పుడు డాలస్ లో ఉంటారు అని తెలుసు కానీ ఎప్పుడూ కలుసుకునే అవకాశం రాలేదు. ఈ మధ్య నేను పని కట్టుకుని నా గది చూసుకుందామని ఆ 5th బ్లాక్ కి వెళ్లితే గుమ్మం దగ్గర జవాను నన్ను లోపలికి వెళ్ళనియ్య లేదు. ఎందుకంటే అది ఇప్పుడు ఆడపిల్లల హాస్టల్  గా మార్చేశారుట. ఈ నాటి ఆ 5th బ్లాక్ ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను..ఇప్పటి ఆడ పిల్లలతో సహా!

AU Eng Block 5

అన్నట్టు ఆడ పిల్లలు అంటే నాకు ఖచ్చితంగా గుర్తుకు వచ్చేది ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కేంపస్ మొత్తంలో భూతద్దంతో వెతికి చూసినా ఆడ “వాసన” వేసేది కాదు…అప్పుడప్పుడు అప్పటికింకా బిల్డింగులు కడుతున్న ఆడ కూలీలు తప్ప. అందులో కాస్త పడుచు వాళ్ళని “కంచు లా ఉంది గురూ” అని విద్యార్థులు వ్యవహరించే వారు. కానీ, ఏమన్నా పిచ్చి , పిచ్చి వేషాలు వేస్తే ఆ కడుతున్న బిల్డింగ్ సిమెంట్ లో కలిపి పాతరేసేస్తారేమో అని హడిలి చచ్చిపోతూనే ఉండే వారు స్ట్యూడెంట్స్ అంతా. పగలు క్లాసులు అయిపోయాక పొలో మని ఎక్కడో సౌత్ కేంపస్ లో ఉన్న ఔట్ గేట్ దగ్గర “విద్యారమా” హోటల్ కో, లైబ్రరీ వేపుకో,  ఖచ్చితంగా “లవర్స్ కార్నర్” దగ్గర బస్సులు ఎక్కే అమ్మాయిలని చూడడానికో పరిగెత్తే వారు. అంత అవస్త పడినా ఆ రోజుల్లో మొత్తం యూనివర్సిటీ లో అమ్మాయిల సంఖ్య తక్కువే. నాకు ఇంకా జ్జాపకం ఉన్న బ్యూటీ క్వీన్స్ శైలజ, ఛాయా జానకి,  ప్రొఫెసర్ ముత్తురామన్ గారి అమ్మాయి (పేరు గుర్తు లేదు). అప్పుడు నాకు తెలియదు కానీ, వీళ్ళలో ఛాయా జానకి  సుప్రసిద్ద సాహిత్య వేత్త అబ్బూరి రామకృష్ణా రావు గారి అమ్మాయి, అంటే అబ్బూరి వరద రాజేశ్వర రావు గారి చెల్లెలు. గత ముఫై ఏళ్లగా మా హ్యూస్టన్ లోనే భర్త తిమ్మరాజు శివరాం తో నివసిస్తోంది. నాకు వాళ్లిద్దరూ, అమ్మాయి రుక్మిణి ఎంతో ఆత్మీయులు.

నాతో పాటు కాకినాడ నుంచి నా క్లాస్ మేట్స్ పేరి శాస్త్రి, లక్ష్మీ నారాయణ కూడా వైజాగ్ లోనే చేరారు. అక్కడ స్నేహితులైన వారిలో నాకు బాగా దగ్గర అయిన వారు నారాయణ మూర్తి, పోతయ్య మాత్రమే గుర్తున్నారు. అందులో నారాయణ మూర్తి అక్కడే లెక్చరర్ గా చేరి అకాల మరణం పొందాడని విన్నాను. మరొక క్లాస్ మేట్ డి. సీతారామయ్య 55 సంవత్సరాల తరువాత ఈ మధ్యనే మళ్ళీ ఇంటర్ నెట్ లో నన్ను గుర్తు పట్టి, పలకరించి మా పి.ఆర్. జూనియర్ కాలేజ్ భవన పునర్నిర్మాణానికి మూడు లక్షల రూపాయల విరాళం ఇచ్చాడు.  ఎంత సంతోషం వేస్తుందో ఆ సహృదయత తల్చుకున్నప్పుడల్లా.

సధర్మ సదన

ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో అడుగు పెట్టగానే కాకినాడ లాంటి “చదును” నేల నుంచి వచ్చిన నన్ను ప్రధానంగా ఆకర్షించినది ఎర్ర మట్టి కొండల మధ్య భవనాలు, “సధర్మ సదన”, “వివేక వర్ధని” లాంటి అధ్బుతమైన ఆ భవనాల పేర్లు. అప్పుడు వైస్ చాన్సెలర్ గారు ఎ.ఎల్. నారాయణ గారు. ఇంజనీరింగ్ కాలేజ్ మొదటి ప్రిన్సిపాల్ గారు దేవగుప్తాపు సీతాపతి రావు గారు. ఈయన టంగుటూరి సూర్య కుమారి కి దగ్గర బంధువులు. మా చిన్నన్నయ్యకి ఆ కుటుంబంతో మద్రాసులో చాలా  సాన్నిహిత్యం. అందు చేత నేను ముందు వైజాగ్ లో చేరినా సిలబస్, డిగ్రీ ఇచ్చేదీ ఆంధ్రా యూనివర్సిటీయే కాబట్టి  నన్ను కాకినాడ కి ట్రాన్స్ఫర్ చెయ్య మని మా చిన్నన్నయ్య వైజాగ్ వచ్చి ఆయన్ని అడిగాడు. ఆ రోజు నాకు ఇంకా జ్జాపకం. అసలే నూనూగు మీసాల వాడిని. జీవితంలో మొదటి సారిగా స్వంత ఊరు వదలి పెట్టి హాస్టల్ లో చేరి గట్టిగా వారం దాట లేదు. క్లాసులింకా మొదలెట్ట లేదు. అందులోనూ ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే భయం. ఒక పక్క సీనియర్స్ రాగింగ్. మరొక పక్క ప్రిన్సిపాల్ గారు అంటే దడ దడ. మద్రాసు రోజుల్లో బాగా తెలుసు కాబట్టి మా చిన్నన్నయ్యని ఆయన రాత్రి డిన్నర్ కి పిలిచారు.  నన్ను కూడా తీసుకెళ్ళి మా అన్నయ్య “మా రాజా మీ కాలేజ్ లో చేరాడు. వాణ్ణి కాకినాడ కి ట్రాన్స్ ఫర్ చెయ్య డానికి ఏం చెయ్యాలి?” అని అడిగాడు. దానికి ఆయన “కనీసం ఒక ఏడాది అయినా ఇక్కడ చదివితే కానీ కుదరదు. అది రూలు. వచ్చే ఏడు చూద్దాం. “ అనగానే వాళ్ళిద్దరూ నన్ను మర్చి పోయి వాళ్ళ కబుర్లలో పడిపోయారు. నేను చెమట్లు కక్కుకుంటూ కాలం గడిపేసి ఏడాది ఉండడానికి మానసికంగా తయారు అయిపోయాను.

సరిగ్గా నాలాటి కేసే మా వై.ఎస్.ఎన్. మూర్తి అనే కాకినాడ కుర్రాడిది. అయితే అతను బి.ఎస్.సి.కూడా పి.ఆర్. కాలేజ్ లోనే చదివాడు. కాకినాడ లో అప్పటికి అతను నాకు పరిచయం లేక పోయినా ఆ నాడు ఇద్దరం వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో క్లాస్ మేట్స్ గా పరిచయం అయి, ఏడాది తరువాత ఒకే సారి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ కి మరి పోయి, ఆ స్నేహం అంచెలంచెలు గా పెంచుకుంటూ, ఇప్పటికీ చాలా పనులు కలిసి చేస్తూ జీవిత కాల స్నేహం కొనసాగిస్తున్నాం. ఆతని స్నేహానికి, సహృదయానికీ, భార్య విజయ ఆత్మీయతకి విలువ కట్టడం నా వల్ల కాదు. కొడుకు లిద్దరూ అమెరికాలోనే ఉండడంతో దంపతులిద్దరూ అమెరికా వస్తూ, పోతూ ఉంటారు.

నేను ఆంద్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరినప్పుడు అది ఒక విధంగా సంధి కాలంలోనే ఉంది అని చెప్పాలి. అప్పటికి ఒక్క కెమికల్ టెక్నాలజీ బిల్డింగ్ ఒక్కటే పూర్తి అయింది. మిగిలిన వన్నీ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. హాస్టల్స్ అన్నీ మటుకు ముందే కట్టారు. యూనివర్సిటీ బస్సులు కాక వైజాగ్ ఊళ్ళో కి వెళ్ళడానికీ, అక్కడి నుంచి రాడానికీ ఒకే ఒక్క బస్…..అదే ప్రపంచ ప్రసిద్ది చెందిన నెంబర్ 10. ఈ బస్సులో ప్రేమాయణాల మీద చాలా కథలే వచ్చాయి. ఈ బస్సు మైన్ కేంపస్ ..అంటే సౌత్ కేంపస్ మీద నుంచి పెద వాల్తేరు లార్సన్ బే వేపు వెళ్ళేది.  ఇంజనీరింగ్ కేంపస్ వాళ్ళంతా ఊళ్ళో కి వెళ్ళాలంటే చచ్చినట్టు ఎర్ర మట్టి లో గంట సేపు నడుచుకుంటూ అక్కడ బస్సు ఎక్కాల్సిందే. నార్త్ కేంపస్ వేపు డైరీ ఫార్మ్ రోడ్ మీద ఒకే ఒక బస్సు ఉండేది. ఇక రెండు కేంపస్ ల కీ మధ్య రోడ్ దిగువ పిచ్చాసు పత్రి ఉండేది. అక్కడికి బస్సులు లేవు. ఉన్న ఏ బస్సూ కూడా రాత్రి 9 దాకానే.  ఎప్పుడైనా ఎల్లమ్మ తోట దగ్గర సినిమాకి వెళ్తే రాత్రి గవర్నర్ బంగాళా మీదుగా నడిచి వెనక్కి రావలసినదే….అవును…ఆ రోజుల్లో జగదాంబా సెంటర్ లేదు. ఈ రోజుల్లో ఎల్లమ్మ తోట లేదు. దేశం పురోగమించింది.

వైజాగ్ లో నా కేవలం ఏడాది చదువు ప్రహసనంలో ప్రధాన ఘట్టాలు  చాలానే ఉన్నాయి. విశేషం ఏమిటంటే అవన్నీ నా “సంఘ ప్రవేశానికి” సంబంధించినవే కానీ అసలు చదువు కి సంబంధించినవి కాదు. ఆ మాటకొస్తే సాహిత్య ప్రవేశానికి కూడా సంబంధించినవి కూడా కాకపోయినా ఖచ్చితంగా నాటకాలు, తెలుగు సంస్కృతి పట్ల నాకు మరింత అవగాహన కలిగించినవే. విద్యార్థి సంఘాల లో చేరకపోయినా పెద్ద సమ్మెలలో చురుగ్గా పాల్గొనడం కూడా నా జీవితంలో అదే మొదలు. అదే ఆఖరు.

ఈ వివరాలు వచ్చే సంచికలో…..

 

మీ మాటలు

  1. Satyanarayana Rapolu says:

    ఆర్యా! వైద్యశాల అనే పదానికి బదులు ఆసుపత్రి అనే పడికట్టు పదం విపరీతంగా ప్రచారంలోనికి వచ్చింది. రచయితలు, భాషా నిపుణులు కూడా గుడ్డిగా అనుకరిస్తున్నరు. ఆసుపత్రి అసలైన తెలుగు పదమైనట్లు భావిస్తున్నరు. బ్రిటిష్ పాలనలో క్రైస్తవ మిషనరీలు ప్రజలలోనికి చొచ్చుక పోయెటానికి ఇంగ్లిష్ పదాలను దేశీ పదాలవలె మార్పు చేసిండ్రు. అందులో హాస్పిటల్ ఒకటి! ఉత్తరాదిన ‘ఆస్పతాల్’ అని, దక్షిణాదిన ‘ఆసుపత్రి’ అని మార్పు చేసిండ్రు. మన భాషలో సరియైన పదాలు లేనప్పుడు, అన్యదేశ్యాలను స్వీకరించవచ్చు. కాని, దాస్య భావన ఇటువంటి పరిణామానికి దారి తీసింది. ఇందులో దేశీ పండితుల ప్రమేయం కూడా ఉన్నది. కాని, ఇప్పటికైనా దోషాన్ని సవరించుకోవాలె. స్వచ్ఛమైన పదం ‘వైద్యశాల’ ఉండగా ఈ విచిత్ర పద ప్రయోగంలో, స్వీకారంలో ఔచిత్యం ఎంత మాత్రం లేదు. అచ్చమైన పదం ‘వైద్యశాల’ మాత్రమే అమలులో ఉండే విధంగా భాషా వ్యవహర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసికోవాలె. హాస్పిటల్ నాలుక తిరుగని కఠిన పదమేమీ కాదు. కనుక, వికృత పదాన్ని వదలి, యధావిధిగా ‘హాస్పిటల్’ అనే లిప్యంతరీకరణ చేయవచ్చు. ప్రజలు పలుక గలిగిన ‘హాస్పిటల్’ను మార్చవలసిన అవసరం లేదు. వైద్యశాల, హాస్పిటల్, దవాఖాన సరియైన పదాలు! ప్రజలు మీద రుద్దబడిన అవకర పదం ఆసుపత్రి ని పరిహరించాలె. ‘వైద్యశాల’ మాత్రమే వ్యవహారంలో ఉండే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసికోవాలె.
    ~డా.రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి, వరంగల్ జిల్లా

  2. వంగూరి చిట్టెన్ రాజు says:

    బాగా చెప్పారు. ఇలాంటి ఉదాహరణలు కొన్ని వేలు ఉన్నాయి. ఈ వ్యాసం లో మీకు అసలు విషయం బదులు నేను ఈ మాట వాడడమే మీ స్పందనకి కారణం అయితే ఇక చెప్పేదేముంది. మీ ఉత్తరంలో కొన్ని పద ప్రయోగాలు కూడా నాకు తెలిసిన మాండలీకంలో వాడే పదాలు కాదు. అలా అని అవి తప్పు పదాలు కాదు. అలాంటిదే “ఆసుపత్రి”…అది కేవలం వాడుక పదం.

మీ మాటలు

*