చిగురించే… చేతివేళ్లు

  మొయిద శ్రీనివాసరావు

 

చింతనిప్పుల్లా మండే …
మా నాన్న కళ్ళలోకి
సూటిగా చూడలేని నేను
చెట్టు వేళ్ళు లాంటి

ఆయన చేతివేళ్లను

అదేపనిగా చూసేవాడిని

శ్రమని  పంచిన  వేళ్ళు
నన్ను నడిపించిన వేళ్ళు
ఊయలై ఊగించిన వేళ్ళు

ఆ వేళ్ళలోంచి… నిత్యం పని ప్రవహించేది
గిజిగాడి నిర్మాణ కౌశలం కనిపించేది
మానవ జీవన పరిణామక్రమం అగుపించేది

పల్లెలో… పిడికెడు మట్టిని
గుప్పెడు గింజలగా మలిచిన  ఆ వెళ్ళే
మిల్లులో… నారపోగులను
పంచదార గోనెలుగా మలిచాయి
చెమట చేతికి… ఆకలి నోటికి మద్య
దూరాన్ని కొలిచాయి

ఏ అవసరమో… అసహనపు పామై
బుర్రలో బుసలుకొట్టినప్పుడు
కాసింత ఖాళీ సమయాన్ని చుట్టగ చుట్టి
కాల్చేయగలిగిన ఆ చేతి వేళ్ళలో
ఓ రెండు మొండు వేళ్ళు కనిపించేవి

మా అమ్మ చిరుగుల చీరను

పైటగ చేసుకొని
గోడకు కొట్టిన పసుపు ముద్దలా

మా చెల్లి  చాపపై కూర్చున్నప్పుడు

యంత్రం నోటిలో పడి తెగిన … ఆ వేళ్ళే

అయిన వాళ్లకు నాలుగాకులేసి

చెల్లి నెత్తిన రెండక్షింతలేసి లేవదీసాయి

ఆ వేళ్ళే…
అక్షరమ్ముక్క

నాకు ఆసరా కావాలని
నా వేళ్ళ మద్య

నిత్యం కలం కదలాడేలా చేసాయి

ఎక్కడైనా…
వేళ్ళు నరికితే పచ్చని చెట్టు కూలుతుంది
సగం తెగిన మా నాన్న చేతి వేళ్ళపైనే
ఆశల పతాకమై  చిగురించాల్సిన
మా బతుకు చెట్టు  మొండిగా నిలిచింది
* * *

(నెల్లిమర్ల జ్యూట్ కార్మికులు తమ కుటుంబ అత్యవసర ఆర్దిక అవసరాలకై మిల్లు యంత్రంలో చేతివేళ్ళు పెట్టడాన్ని కన్నీళ్ళతో తలుచుకుంటూ…)

Moida

 

మీ మాటలు

 1. narsan b says:

  జీవితం కవిత్వం ఐనప్పుడు కన్నీళ్లు ఎర్రబడ్తై. నీ జీవనసారం అక్షరాలై నేటి కవిత్వాన్ని సంపన్నం చేయాలి

 2. ‘ .. నాన్న చేతి వేళ్ళకు, ఈ చేతి వేళ్ళ మధ్య కదలాడిన అక్షరాలకు ‘ నమస్సులు , so touchy :(

 3. srinivasarao says:

  Thank you narsan garu and rekhajyoti garu

 4. నిశీధి says:

  వేళ్ళు నరికితే పచ్చని చెట్టు కూలుతుంది
  సగం తెగిన మా నాన్న చేతి వేళ్ళపైనే
  ఆశల పతాకమై చిగురించాల్సిన
  మా బతుకు చెట్టు మొండిగా నిలిచింది << జీవం ఉన్న వాక్యాలు

 5. jagadeesh mallipuram says:

  మొయిద శ్రీని వాస్ కవిత్వం లో తడి వుంటుంది. అది చెమటే కావచ్చు… కన్నీళ్లే కావచ్చు. దాని లోతు మాత్రం సముద్రమంత. నిజానికి తెగిన వేళ్ల లోంచి మొండి చెట్టుని చూపించేడు కానీ …. ఆ వేళ్లు పట్టుకొని కవిత్వమై లేచిన వాడు కదా కవి. ఆ చేతి వేళ్లకి వందనం…. కవిత్వమా నీకూ వందనం.

  • srinivasarao says:

   జగదీశ్ గారు చివరి వాక్యంలో ‘మొండి’ అనే పదం కష్టాలకు ఎదిరొడ్డి నిల్చోవడం అనే అర్ధంలో వాడాను. మొండిఘటం అని అంటాం కదా అలా. మొదటి వాక్యాలలో మొండి అనేది సగం తెగిన అనే అర్ధంలో వాడాను.

 6. paresh n doshi says:

  కవిత చెయ్యాల్సిన పని హృదయాన్ని తాకడం, మెదడును మేల్కొలపటం అయితే మీ కవిత చేసిందదే. కీప్ ఇట్ అప్.

 7. srinivasarao says:

  Thank you niseedhi garu jagadeesh garu paresh garu

 8. వాసుదేవ్ says:

  “ఆ వేళ్ళే…
  అక్షరమ్ముక్క” వేళ్లలోని తడిని అక్షరాల్లోకి మార్చగలటం అంత సులభమేమీ కాదని మరోసారి మీ దైన శైలిలో మళ్ళీ ప్రవచించారు శ్రీనివాస్ గారు. అసలు సిసలు కవిత.

 9. srinivasarao says:

  Thank you vasudev garu

మీ మాటలు

*