ఇది బంగారం కాదు, కాకి బంగారం!

వినోద్ అనంతోజు 

 

       vinod anantoju   ఒక ఫిల్మ్ మేకర్ గా నాకు మణిరత్నం మీద ఆయన సినిమాల మీద ఎంతో గౌరవం ఉంది. “నాయకుడు”, “రోజా”, “బొంబాయి” లాంటి సినిమాలు లెక్క లేనన్ని సార్లు చూసి, వాటిలోని ప్రతి చిన్న అంశాన్ని స్టడీ చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఆయనవి ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులని నిరాశ పరిచినప్పటికీ, నాకు మాత్రం అవన్నీ గొప్పగానే అనిపించాయి. చాలా కాలం తరవాత ఒక “ప్రేమకథా” చిత్రం (ఓకే బంగారం) తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ సినిమా మంచి ఆదరణ పొందడం, అందరూ “Maniratnam is Back” అని అంటూ ఉండడం చూసి చాలా సంతోషం కలిగింది. తీరా సినిమా చూశాక ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది. మణిరత్నం కి ఏమయ్యింది అసలూ?

సినిమా గురించి మాట్లాడుకునేముందు దాని కథ క్లుప్తంగా చూద్దాం. ఆది, తారా వయసులో ఉన్నారు. ఇద్దరికీ పెళ్లి మీద నమ్మకం లేదు. ఒకసారి ఒక రైల్వే స్టేషన్ లో ఒకరినొకరు యాదృచ్చికంగా చూస్తారు. అదే మొదటి సారి చూడటం. ఆది గణపతి వాళ్లింట్లో పేయింగ్ గెస్ట్ గా దిగుతాడు. గణపతి భార్యకి ఆల్జీమర్స్ వ్యాధి ఉంటుంది. గణపతి ఆవిడని చాలా ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు. కొన్నాళ్ళకి ఆది వాళ్ళ స్నేహితురాలి పెళ్లిలో తారా తారసపడుతుంది. పేర్లు తెలుసుకుంటారు, ఫోన్ నంబర్లు మార్చుకుంటారు. రెండు రోజుల తర్వాత ఇద్దరు కలిసి డేట్ కి వెళ్తారు. మూడో రోజు తారా ఏదో పని మీద అహ్మదాబాద్ వెళ్తుంటే ఆది కూడా వెళ్తాడు. నాలుగోరోజు రాత్రి ట్రైన్ మిస్ అవ్వడంతో ఒక రాత్రి ఒకే గదిలో ఇద్దరూ ఉండాల్సి వస్తుంది. తమని తాము నిగ్రహించుకోగలమో లేదో అని ఇద్దరికీ అనుమానమే. ఎలాగో ఆ రాత్రి ఒక పాట, పాట మధ్యలో కొన్ని కౌగిలింతలు, కొన్ని ముద్దులతో సరిపెడతారు.

తరవాత ఒకరోజుకో రెండ్రోజులకో ఆది “దుశ్శాసనుడిలా మారి తారా బట్టలు చింపేస్తా” అనడం, దానికి ఆ పిల్ల మురిసిపోవడం, తారా హాస్టల్ లోనే వాళ్ళిద్దరూ శారీరిక సంబంధం పెట్టుకోవడం జరిగిపోతాయి. అప్పటికి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు, కలిసి జీవించాలని కోరిక కూడా లేదు. కామ వాంఛ తప్ప. 6 నెలల తరవాత ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వేరే వేరే దేశాలు వెళ్లిపోవాలి. ఈ 6 నెలలు కలిసి గడుపుదాం (live–in) అని ఒప్పందానికి వస్తారు. ఓనర్ (గణపతి) ని ఒప్పించి ఆది ఉండే ఇంట్లోనే ఇద్దరూ ఉండటం మొదలు పెడతారు

ఇక ఇక్కడి నుంచి ఒక ఆరు నెలల పాటు వాళ్ళ “శారీరిక సహజీవనం” సుఖంగానే సాగుతుంది. విడిపోవడానికి ఇంకా పదిరోజులే ఉందనగా బాధలాంటిదేదో కలుగుతుంది. దాన్ని అధిగమించడానికి ఇంకా బలంగా “ఎంజాయ్” చేద్దాం అని డిసైడ్ అవుతారు. కాని ఆ పదిరోజులు చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతుంటారు. గణపతి జబ్బుతో ఉన్న తన భార్య పట్ల చూపించే ప్రేమని ఆది తారాలు గమనిస్తూ ఉంటారు. చివరికి ఒక రోజు గణపతి భార్య కనపడకుండా పోతుంది. ఆవిడని వెతికే సమయంలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అని గ్రహిస్తారు. ఆది తారాని పెళ్లి చేసుకుందాం అని అడుగుతాడు. తారా ఒప్పుకుంటుంది. పెళ్లి చేసుకుంటారు. ఇదీ కథ.

ఈ సినిమా చూసిన చాలా మంది అద్భుతం, మహాద్భుతం అని పొగడడం, కొత్త తరం ప్రేమలను/పెళ్లి సంబంధాలను మణిరత్నం redefine చేశాడని జేజేలు కొట్టడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. బహుశా చూసిన వాళ్ళు సంగీతానికి, సినిమాటోగ్రఫి ప్రతిభకి, నటీనటుల అందానికి ముగ్ధులయ్యుంటారు. ఇలాంటి ఎన్ని హంగులున్నా కథలోని లోపాలు ఎక్కడికి పోతాయి.

అసలు “ప్రేమ కథ” అని ఏ సినిమాని పిలుస్తారు? సినిమాలో ఎక్కడో ఒక చోట “I Love You” అనే పదం ఉంటే అది ప్రేమ కథ అయిపోతుందా? వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయిల కథ అయితే అది ప్రేమ కథ అయిపోతుందా? ఈ సినిమాలో రెండు ముఖ్య పాత్రల్లో ప్రేమ కంటే సెక్సు సంబంధం పెట్టుకోవాలనే వెంపర్లాటే ఎక్కువ కనపడుతుంది.

ఎన్ని అదనపు విషయాలున్నా ఈ సినిమా అంతా పెళ్లి అనే సంబంధం గురించీ, ఆడామగా కలిసుండాలంటే పెళ్లి అవసరమా అనే ప్రశ్న గురించీ ఎక్కువ చర్చిస్తుంది.

సినిమా మొదట్లోనే ఆది, తారాలు ఇద్దరూ పెళ్లి మీద అపనమ్మకం వ్యక్తం చేస్తారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, సినిమాలో ఏ పాత్రమయినా దర్శకుడి ఆలోచనలకి అనుగుణంగా, అతను నిరూపించదలుచుకున్న విషయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బలపరిచే విధంగానే ప్రవర్తిస్తాయి. ఆది, తారాలు పెళ్లిని వ్యతిరేకించడం కూడా అందుకే. దర్శకుడు పెళ్లి అవసరం లేదని నిరూపించడానికి వాళ్ళ చేత అలా చెప్పించి ఉండొచ్చు. లేదా వాళ్ళిద్దరి ఆలోచనలు తప్పు అని కథలో నిరూపించి పెళ్లిని బలపరచవచ్చు. ఏ పాత్ర ఏ రకం భావాలని వ్యక్తం చేసినా దర్శకుడు వాటిలో ఏ భావాలని సమర్థించాడు అనేదే ముఖ్యం.

పెళ్లిని వ్యతిరేకించిన ముఖ్య పాత్రలు, పెళ్ళి విధానానికి alternative గా ఏ విధానాన్ని ప్రతిపాదిస్తున్నాయి? కంటికి అందంగా కనిపించిన అమ్మాయిలతో అబ్బాయిలు, అబ్బాయిలతో అమ్మాయిలూ “ఇష్టపూర్వకంగా” తాత్కాలిక సెక్సు సంబంధాలు పెట్టుకోవడమే వీళ్ళ ప్రతిపాదన. ఇది సహజీవనం కాదు. ఇందులో ఎదుటి వ్యక్తి భావాలతో, అభిప్రాయాలతో, వ్యక్తిత్వంతో సంబంధం లేదు. కేవలం శరీరంతోనే సంబంధం. ప్రేమకసలు స్థానమే లేదు. ఆకర్షణ ఉంటే చాలు. ఎవరు ఎవరితోనైనా ఆకర్షణ ఉన్నన్ని రోజులో, లేక వేరే ఊర్లో పని పడేదాకో కలిసి పడుకోవచ్చు. ఆ తరవాత వేరే ఊరు వెళ్ళాక అక్కడ ఇంకొకరితోనో లేక అనేకమందితోనో సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇదే మనకి వాళ్ళు ప్రతిపాదిస్తున్న “శారీరిక సహజీవనాల” పధ్ధతి. దీనినే చాలా మంది ప్రేక్షకులు, విశ్లేషకులు “New-Age Relationships” కి ఈ సినిమా పునాది వేస్తోంది అని, పాత సంప్రదాయాలని బద్దలు కొడుతోందనీ అంటున్నారు.

                మొదట ఆలోచించవలసిన విషయం – పెళ్లి ఎందుకు? పెళ్ళిలో జరిగేది ఏమిటి? ఒకటి – అప్పటి దాక విడి విడి గా జీవిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ క్షణం నుంచి కలిసి ఒక కుటుంబంగా జీవించడం మొదలవుతుంది. రెండు – వాళ్ళిద్దరూ ఒక కుటుంబంగా అయ్యారు అని చేసే సాంఘిక ప్రకటన. పెళ్లి ఐదు రోజులు జరిగినా, ఒక గంటే జరిగినా దాని సారాంశంలో ఏ తేడా ఉండదు. అది ఏ మత ఆచారం ప్రకారం జరిగినదీ, లేక ఏ ఆచారమూ లేకుండా జరిగినదా అనేది అప్రధానం. ఆ ఇద్దరూ వ్యక్తులూ ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా ఎంచుకుని కలిసి ఉండడమే ప్రధానమైన విషయం. వాళ్ళిద్దరూ పెళ్లి అనే కార్యక్రమం లేకపోయినా, కలిసి జీవిస్తూ, కష్టసుఖాల్లో బాధ్యతల్లో భాగం పంచుకుంటూ ఉంటే అది పెళ్ళే. పెళ్లి అనే పదం “కలిసి ఉండటం అనే సాంఘిక సంబంధం” మొత్తాన్నీ వివరిస్తుంది. ప్రస్తుతం అమలు లో ఉన్న “పెళ్లి” వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. అది ఆడా మగల మధ్య అసమానతలు పెంచేదిగా ఉంది. పైగా వ్యక్తుల ఇష్టాయిష్టాల కంటే డబ్బు, ఆస్తి, కులం, మతాలే “పెళ్లి”లో ఎక్కువ పాత్ర పోషిస్తున్నాయి. నిజమే. ఈ కారణాల చేత పెళ్లిని వ్యతిరేకించవచ్చు. కాని ఆ వాదం ఈ సినిమాకి పొసగదు. ఎందుకంటే ఈ సినిమాలో ఆ లోపాలలో ఒక్కదాన్ని కూడా ముట్టుకోవడం జరగలేదు.

పైన చెప్పిన దాంట్లో, పెళ్లి అనే కార్యక్రమం లేకుండా కలిసి ఉండటం అంటే ఓకే బంగారం సినిమాలో చెప్పిన “శారీరిక సహజీవనం” అని అనుకోకూడదు. ఒక ఆడ మగా ఎటువంటి ప్రలొభాలూ (ఆస్తి, కులం, మతం…) లేకుండా, పూర్తి వివేచనతో, ఇష్టపూర్వకంగా ఒకరినొకరు జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం, వారితోనే కలిసి ఉండటం సరైన సంబంధం అవుతుంది. ఒకసారి ఎంచుకున్నాక కొంతకాలానికి ఎదుటి వ్యక్తి కలిసి ఉండటానికి వీలుపడనంతలా మారిపోతే, ఇబ్బంది కలిగిస్తుంటే ఆ వ్యక్తి నుంచి విడిపోయే హక్కు మొదటి వ్యక్తి కి ఎప్పుడూ ఉంటుంది. అంటే దీని అర్థం, తరవాత విడిపోయే స్వేచ్ఛ ఉంది కదా అని ఇప్పుడు ఏమీ ఆలోచించకుండా సంబంధం పెట్టుకోవడం కాదు. అది తిరుగుబోతుతనం అవుతుంది. ఓకే బంగారంలో ఆది తారాలు సరిగ్గా ఇదే రకానికి చెందుతారు.

ఇందులో వాళ్ళిద్దరూ ఆరు నెలలలో వేరే దేశాలకు వెళ్లిపోతారని తెలిసే ఈ ఆరు నెలలు తాత్కాలికంగా ఒకరితో ఒకరు పడుకుని సహజీవనం చేద్దాం అని నిర్ణయించుకుంటారు. మణిరత్నం మీద ఎంత మంచి దృష్టితో చూసినా ఈ సహజీవనంలో ప్రేమ ఎలా కనపడుతుంది?

bangar1

అసలు ఇంతకీ మణిరత్నం దేన్ని సమర్థించాడు.? కొందరు మణిరత్నం పెళ్లిని వ్యతిరేకించాడు అనీ, కొందరు పెళ్లినే సమర్థించాడు అనీ, ఇంకొందరు ‘సమర్థించలేదు వ్యతిరేకించలేదు. కేవలం ప్రస్తుత యువత పరిస్థితి ని ఉన్నది ఉన్నట్టు చూపించాడని’ అర్థాలు చెప్తున్నారు.

కేవలం ఉన్నది ఉన్నట్టు చూపించాడు అనేది అవాస్తవం. సినిమా నిడివిలో నూటికి ఎనభై శాతం ఆ ఇద్దరి కామ కలాపాలనీ, చిలిపి సంభాషణలనీ అందమైన కెమెరా యాంగిల్స్ తో, ఆకర్షణీయమైన సంగీతంతో ఆకాశానికి ఎత్తి చూపించాడు. ఆది తారాల మీద ప్రేక్షకులకి సదభిప్రాయం కలిగించే ప్రయత్నమే ఇది. ఇది సమర్థించడమే.

విచ్చలవిడి ప్రేమలని వ్యతిరేకించాడు, పెళ్లినే సమర్థించాడు అనడం కూడా సరైనది కాదు. ఎందుకంటే డైరెక్టర్ ఖచ్చితంగా ఆది, తారాల పక్షమే నిలబడ్డాడు కాబట్టి. వాళ్ళిద్దరి మధ్య జరిగే రొమాన్స్ ని చూపించడం లో ప్రదర్శించిన ఉత్సాహం వాళ్ళ ఆలోచనలని తప్పైనవి గా చూపించడం లో ప్రదర్శించలేదు. పైగా ఆది తారాలకి ఇబ్బంది కలిగే ఒక్క సన్నివేశం కూడా కథలో రాకుండా జాగ్రత్త పడ్డాడు.

“మేమిద్దరం మీ ఇంట్లో ఒకే గదిలో ఉంటాం” అని ఆది ఇంటి ఓనర్ గణపతి ని అడుగుతాడు. “పెళ్లి చేసుకున్నారా?” అని అడుగుతాడు గణపతి. “లేదంకుల్. మాకు పెళ్లి మీద నమ్మకం లేదు. కొన్ని నెలల్లో ఆది అమెరికా వెళ్ళిపోతాడు, నేను పారిస్ వెళ్ళిపోతాను. అంతవరకూ కలిసి ఉందాం అనుకుంటున్నాం.” అని చెప్తుంది తారా. గణపతి ససేమిరా కుదరదంటాడు. కొన్ని మంచి ప్రశ్నలు వేస్తాడు. వాటిలో వేటికీ సమాధానం చెప్పకుండా “అంకుల్ ఒకసారి బయటికి రండి, convince చేస్తాను” అని చెప్పి ఆది గణపతిని బయటికి తీసుకెళతాడు. ఇంతలో తారా మంచి పాట ఒకటి పాడటం, దానికి గణపతి ముగ్ధుడైపోవడం, వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోవడం జరుగుతాయి. గణపతి వేసిన ఏ ప్రశ్నకీ ఎవరూ సూటిగా సమాధానం చెప్పరు. అలా చెప్పించాల్సి వస్తే ఆది తారా పాత్రల పట్ల ప్రేక్షకులకి కలగాల్సిన ఇష్టం తగ్గుతుందని దర్శకుడు సీన్ ని సంగీతం వైపుకి divert చేసాడు. పైగా గణపతి మీద “Old Fashioned” అని ఒక సెటైర్ కూడా వేయించాడు దర్శకుడు.

ఇలాంటిదే ఇంకో సందర్భం. ఆది తారాలు ఒకే గదిలో ఉంటున్న సంగతి ఆది వాళ్ళ వదిన కనిపెట్టేస్తుంది. “ఇదేం పద్దతిగా లేదు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంటే చెప్పండి. నేను ముందుండి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను.” అని చెప్తుంది. దానికి తారా “పెళ్లి అనే సర్టిఫికేట్ ఉంటే ఇదంతా రైట్ అయిపోతుందా?” అని ఎదురు ప్రశ్న వేస్తుంది గానీ సరైన సమాధానం చెప్పదు. అప్పుడు వదిన “పోనీ మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా?” అని అడిగితే సమాధానం ఏం చెప్తుంది? “కలిసి ఉండటానికి ప్రేమ అవసరమా? సెక్స్ కావాలనే కోరిక సరిపోదా?” అని ఎదురు ప్రశ్న వేస్తుందా? ఎందుకంటే వాళ్ళిద్దరికీ మధ్య అప్పటికి ప్రేమ లేదు కదా. శారీరిక ఆకర్షణ తప్ప. ఆరు నేలలయ్యాక విడిపోవడానికే సిద్ధంగా ఉన్నారు కదా. తారాని ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో యిరికించకుండా సీన్ అక్కడితో కట్ చేసేశాడు దర్శకుడు.

ఇలాంటి సందర్భాలు అనేకం. నిజంగా విచ్చలవిడి సంబంధాలని మణిరత్నం వ్యతిరేకించాలి అనుకుని ఉంటే, ఆ సంబంధాల వల్ల కలిగే నష్టాలని కొన్నిటినైనా చూపించేవాడు. సినిమా మధ్యలో తారా ఆదిని గర్భనిర్ధారణ పరీక్ష కోసం అని అబద్దం చెప్పి ఒక గైనకాలజీ హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఆదిగాడు తెగ టెన్షన్ పడతాడు. అవును మరి, వాడు “తండ్రి” అనే బాధ్యతని స్వీకరించడానికి సిద్ధపడే ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడా? టెన్షన్ పడటం సహజమే మరి! దర్శకుడు దాన్ని ఒక హాస్య సన్నివేశం గా చూపించాడు. వ్యతిరేకించే ఉద్దేశం ఉంటే అక్కడ నిజంగానే ఆ అమ్మాయికి గర్భం వచ్చినట్టు చూపించి, అది తెలుసుకున్న ఆది గాడు చడీచప్పుడూ లేకుండా ఉడాయించినట్టు చూపించవచ్చు. అప్పుడు తారా అవతలి మనిషి వ్యక్తిత్వం తెలుసుకోకుండా, ప్రేమ కలగకుండా సెక్సు సంబంధం పెట్టుకుని తప్పు చేశాను అని పశ్చాత్తాప పడటం చూపించాలి. ఇలా కాకపొతే ఇంకోలాగా, ఇక్కడ కాకపొతే ఇంకో చోట, ఎక్కడో ఒక చోట వాళ్ళ ఆలోచనల లోని తప్పుని చూపించాలి. సినిమా మొత్తంలో ఒక్క చోట కూడా ఇలాంటి సందర్భం కనపడదు. దర్శకుడు కావాలని ఆది తారాలను రక్షిస్తూ వచ్చాడు.

“మరి చివరలో పెళ్లి చేసుకున్నట్టు చూపించాడు కదా?” అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడే దర్శకుడు తన కథ ని తనే అపహాస్యం చేసుకున్నాడు అనిపిస్తుంది. కథలో గణపతి జబ్బుతో ఉన్న తన భార్య ని ఎంతో ప్రేమతో బాధ్యతతో చూసుకుంటూ ఉంటాడు. పెళ్లి చేసుకున్న భార్యలని భర్తలందరూ అలాగే చూసుకుంటారు అని చెప్పడానికి లేదు. కానీ స్త్రీని ప్రేమించే మగవాడు అయితే ఖచ్చితంగా అంతే ఆప్యాయతతో చూసుకుంటాడు. కాబట్టి గణపతి చూపించే ఆ ఆదరణకి కారణం ఖచ్చితంగా ప్రేమే కానీ పెళ్లి అనే సంబంధం మాత్రమే కాదు. పెళ్లిని వ్యతిరేకించిన హీరో హీరోయిన్లు, గణపతి తన భార్య పట్ల చూపించే ప్రేమని చూసి పరివర్తన చెందడాన్ని చూపించాలి అనుకున్నాడు దర్శకుడు. ఆ పరివర్తన అవతలి వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించడం దిశగా సాగాలి గానీ, పెళ్లి వైపు కి కాదు. వాళ్ళు అప్పటిదాకా చెప్పిన సిద్ధాంతం ప్రకారమే కలిసి ఉండటానికి పెళ్లి అవసరం లేదు, ప్రేమ చాలు. ఆ ప్రేమ ఎలాగూ వాళ్ళిద్దరి మధ్య “సినిమా చివర”లో కలిగింది కాబట్టి ఇక పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వేరే దేశాలు వెళ్లి అక్కడ పని పూర్తి చేసుకుని, తిరిగి ఒకే దగ్గర కలిసి ఉండొచ్చు కదా, పెళ్లి లేకుండా? ఈ ప్రశ్నకి సినిమాలో ఎక్కడా సమాధానం లేదు. దర్శకుడికి ఈ ఆలోచన రాక వదిలేసి ఉండాలి. లేదా వచ్చినా సమాధానం చెప్పడం ఇష్టం లేక వదిలేసి ఉండాలి.

నాకు మాత్రం అది ఇలా అర్థమయ్యింది. క్లైమాక్స్ లో “నువ్ పారిస్ పో, ఎక్కడికైనా పో. నన్ను పెళ్లి చేసుకుని పో!” అని ఆది తారాని అడగుతాడు. నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి ఉంటే అలా అడగాల్సిన అవసరం ఉండదు. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా జీవితం నీతోనే పంచుకోవాలి అనుకుంటున్నాను. నువ్ పారిస్ నుంచి తిరిగి వచ్చేదాకా ఎదురు చూస్తాను. వెళ్లి చక్కగా చదువుకుని రా” అని కూడా చెప్పొచ్చు. కాని పెళ్లి చేసుకోమని అడగడం లో తమ ప్రేమ మీద అపనమ్మకమే కనపడింది నాకు. తారా పారిస్ లో ఉన్నన్ని రొజులూ, ఇక్కడ ఆదితో చేసినట్టే, అక్కడ తాత్కాలికంగా ఇంకొకడితో సహజీవనం చేస్తుందేమో అనే భయంతోనే ఆది అలా అడిగి ఉంటాడు అనిపించింది. ఇంత వికారంగా రాస్తున్నందుకు పాఠకులు నన్ను క్షమించాలి. ఆది తారాల పాత్రలని అంతే వికారంగా, ఆలోచనా రహితంగా, అత్మగౌరవం లేకుండా తయారు చేశాడు దర్శకుడు మరి.

ఇక్కడ నిరసించాల్సిన అసలు విషయం ఏమిటంటే, దర్శకుడు ఈ “శారీరిక సహజీవనాలని” ఎక్కడా విమర్శించలేదు సరికదా వీలైనప్పుడల్లా ప్రోత్సహించాడు. “ముందు అభిప్రాయాలతో, భావాలతో, వ్యక్తిత్వాలతో, ప్రేమతో సంబంధం లేకుండా ఎవరితో పడితే వారితో సంబంధం పెట్టుకోవడం. తరవాత అది ప్రేమగా టర్న్ అయితే పెళ్లి చేసుకోవడం…” ఇలా ఉంది దర్శకుల వారి తీరు. ఒకవేళ ఒక ఆరు నెలలు సహజీవనం నెరిపిన తరవాత ప్రేమ కలగకపోతే? “పోయేదేముంది. కావలిసినంత ఎంజాయ్మెంట్ దొరికిందిగా, ఇంకొకరిని వెతుక్కుంటాం” అని చెప్తారా? ఒకవేళ గర్భాలు వస్తే? “ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయ్యింది. అబార్షన్ చేయించుకుంటాం. సింపుల్ !” అని చెప్తారా? ఇంత దిక్కుమాలిన ఆలోచనలు మణిరత్నం నుంచి వస్తాయని ఎప్పుడూ ఉహించలేదు.

ఈ సినిమా ప్రేమకీ, సెక్స్ కోరికకీ తేడా మసకబరిచేది గా ఉంది. యుక్తవయసులో ఉండి ఏది ప్రేమో, ఏది మోహమో గ్రహించలేని స్థితిలో ఉన్న యువతీయువకుల మీద ఈ సినిమా చాలా చెడ్డ ప్రభావం చూపిస్తుంది. దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకడిగా చెప్పుకోబడే ఒక దర్శకుడికి తన కథ పట్ల, ప్రేక్షకుల పట్ల ఇంత కంటే చాలా నిబద్ధత అవసరం.

*

మీ మాటలు

 1. మీ విశ్లేషణ, చాలావివరంగా లోతుగా ఉంది.

 2. Dr. Vijaya Babu, Koganti says:

  “దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకడిగా చెప్పుకోబడే ఒక దర్శకుడికి తన కథ పట్ల, ప్రేక్షకుల పట్ల ఇంత కంటే చాలా నిబద్ధత అవసరం.” ఈ ఒక్క వాక్యం చాలు.
  ఇంత లోతుగా ఆలోచన చేయగలిగితే ప్రస్తుత తెలుగు సినిమా ఇలా అఘోరించ దేమో!

  వినోద్ గారూ, విశ్లేషణ చాలా బాగుంది.

 3. rachakonda srinivasu says:

  అస్ప్సస్టత మరింత ఎక్కువయ్యింది. సిద్దాంత బలహీనత . స్టొరీ ఫై పట్టుపొయింది. మీ విశ్లేషణ చుస్తే algemers మణిరత్నం కీ వచ్చినట్టుంది

 4. chaitanya says:

  మీకు విశ్లేషించటం తప్పిస్తే లేక విమర్శించటం తప్పిస్తే సినిమా తియ్యటం రాదు అనుకుంట ప్రెసెంట్ ట్రెండ్ అలానే వుంది దానికన్నా ఇంపార్టెంట్ ఏమిటంటే చివరకు ఎవరికీ వాళ్ళు వెళ్లి పోలేదు కదా అల చూపిస్తే అది తప్పు అవ్తుంది బయట చాల చోట్ల అల జరుగుతూ ఉండొచ్చు కానీ సినిమా తేసేవాళ్ళు బయట పరిస్థితులను చూపిస్తూ అలాకాకుండా ఎం చేస్తే బాగుంటుందో చూపిస్తే ఆ సినిమా కు ఒక అర్థం పరమార్థం వుంటుంది ఇక్కడ చేసింది అదే అది మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు ఒక్క సెక్స్ ఒకటే మీ కళ్ళకు కనపడుతుంద .అల చూస్తే అది మే తప్పు పక్కనవాళ్ళను అనే హక్కు మీకు లేదు

 5. buchi reddy gangula says:

  మంచి సినిమా —

  పెళ్ళికి ముందు సెక్స్ నేరం కాదు — కాబోదు
  స్త్రీ కి పతివ్రత తనం ఉండాలి — పురుషుని కి ఎన్ని రకాల అనుభవాలు ఉన్నా
  తప్పు లే దు
  why… double..standards….
  అమెరికా లో మనోల్ల మంగళ సూత్రాలు — లాకర్ల్ లో — సూట్ కేస్ ల లో
  నివసిస్తూ ఉంటాయి — కాదా

  యిప్పటి బాలయ్య — వెంకి — నాగార్జున సినిమాల కన్నా —???
  అవి సినిమాలా —
  బాలయ్య లెజెండ్ — సింహ ??? హీరో కోసం కథ — హీరో చెప్పిన హె రోయిన్ ఉండాలి
  producer… director… hero..చెప్పిన తిరుగా సినిమా తీయాలి —
  నాడు — నేడు — అదే తీరు — అదే పోకడ
  తాతలు మనవరాళ్ళ తో డాన్సు >>> అలా కనిపించడం లేదా ??

  చిరంజీవి 150— వ సినిమా పేజి త్రీ న్యూస్ ???? దేనికి — ఎందుకో
  డయలాగు డెలివరీ రా ని బాలయ్య — ఒక తెలుగు సంగాని కి chief..guest..????
  మల్లెమాల — కాట్రగడ్డ – గారల బుక్స్ చదువండి — వీళ్ళ గ్రీన్ రూం భాగోతం
  కనిపిస్తుంది
  stop..లుక్ ..think..ఆక్ట్ — నేటి వ్యవస్థ ని —- దాన్ని దృష్టి లో పెట్టుకొని
  మణిరత్నం గారు — excellent..director..
  నిత్యా మీనన్ — గొప్ప నటి
  నేటి సిని లోకం లో –ప్రకాష్ రాజ్ — నిత్యా మీనన్ — గొప్ప నటులు

  కోట్ల కొద్ది డబ్బు కర్చు తో —నేటి పెళ్లి ల ను చూడండి — ఎంత కర్చు ??

  40000 చీర — 25000 జాకెట్ — మా దొరల పెళ్ళిళ్ళు — ఎలా ఉంటాయో

  ఎంత కర్చు ఉంటుందో —-

  ——————-బుచ్చి రెడ్డి గంగుల

 6. డా. మూర్తి కనకాల says:

  పెళ్లి వ్యవస్థ గురించి ఓ సారి అనుకుందాం . ముఖ పరిచయం కూడా లేని ఒక అమ్మాయిని , అందం నచ్చి (అందం ఒకటే కాదు , బిసినెస్ డీల్ నచ్చే) రెండు కుటుంబాలు కలసి పెళ్లి చేసి , ఒక గదిలో (ఇక మీ ఇష్టం) పాడేసే ఘట్టం. నాకు పెళ్లి వ్యవస్థ , హిందూ ధర్మాలపైన నమ్మకం ఉంది . కానీ , మీరు చెప్పినట్టు మణిరత్నం తీసిన “ఓకే బంగారం” కేవలం సెక్స్ కోసం వెంపర్లాడే ఒక జంట కధ అన్నారు . దానికి నేను ఒప్పుకోను . పెళ్లి లో కూడా జరిగేది అదే .

  “మొదట” శారీరక సంభందం (చాలా వరకు) పెట్టుకున్న పిమ్మటే ఆ (పెద్దల పెళ్లి) జంటలు ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడం ప్రారంభించి , అది జీవితం అంతా కొనసాగిస్తారు . Live -in Relation అనే అంశం మనకి కొంచం కొత్తగా , ఒప్పుకోడానికి ఇబ్బంది గా నే ఉంటుంది. కానీ అందులో కూడా తగు లాభాలు నష్టాలు ఉన్నాయి (పెళ్లి లానే)

  సినిమా మొత్తం ఈ Live- in Relationship మీద తీయడం తో బావుసా మీరు అది తప్పు అని బలమైన నమ్మకం తో సినిమా చూసి ఉంటారు . అందుకే అది మీకు అస్సలు నచ్చుండదు అనుకుంటున్నా. ఇక మణిరత్నం “దిగజారుడు తనం” అన్నారు . ఈ మాటకు నేను అస్సలు ఒప్పుకోను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ క్లాసిక్ లవ్ టింజ్ మెయింటెయిన్ చేసే దర్శకులలో ప్రధముడు. సినిమా లో కొన్ని లోపాలు ఉన్న మాట వాస్తవం . అందరికి చేరకపోవచ్చు . కానీ నచ్చే వారు తప్పక ఉన్నారు . అండ్ , అది వారి తప్పో , సెక్స్ కోసం వెంపర్లాడే జనం కాదు. సినిమా ముగింపు (సరైన) లేని మాట వాస్తవం .

  అండ్ , ఫైనల్లి … నాకు సినిమా నచ్చింది. చాలా బాగా నచ్చింది. మని రత్నం ఇస్ బ్యాక్ అనే అంటాను.

  • KALYAN says:

   నేను మూర్తి గారి తో ఏకీభవిస్తున్నాను… వినోద్ గారు రంద్రాన్వేషణ లో పది సినిమా ని వేరే దృష్టి తో చూసినట్టున్నారు…
   1. సెక్స్ కోసమే వెంపర్లాడే జంట అయితే వేరే వారితో కలగని ఆ భావన వీరివురి మధ్యే ఎందుకు కలిగింది. ఒకరి పై ఒకరికి ఆకర్షణే ప్రేమ కి పెళ్ళికి పునాది.
   2. వారికి కావాల్సింది కేవలం సెక్స్ అయితే ఎంచక్కా హోటల్ లోనే కానిచ్చేవారుగా!!! పాత పాడుకుంటూ వేరే వేరు గా పడుకోవాల్సిన కర్మ ఏముంది.
   3. అసలు లీల తోమ్ప్సన్ కి ఆ వ్యాధి పెట్టడానికి కారణం ఏమిటి? ఆవిడ వ్యాది మనం మరచిపోతున్న మన విలువలకి సింబాలిక్ గా పెట్టడం జరిగింది. వ్యాది ముడురినపుడు “నేను నిన్ను కుడా మరిచిపోతాన గణపతి” అని అడిగినపుడు వీరివురిలో ఉన్న ప్రసన ఆవిడ దగ్గర అడిగించడం జరిగింది… చ్చివరిలో ఆవిడ కనపడకుండా పోయినపుడు వీళ్ళు వెత్తుకుంటూ వెళ్ళింది ఆవిడ కోసం కాదు వీళ్ళ ప్రేమకోసం… ఇంత అద్బుతమైన symbolism మీకు కనపడకపోవడం, అబినందించాలని అనిపించకపోవడం ఆశ్చర్యం.
   4. తారతో ఆది నన్ను పెళ్లి చేసుకుని పో అనడం తన ప్రేమపై నమ్మకం లేకపోవడం అన్నారు… ప్రేమించుకుంటున్న ప్రతివారు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు?” నమ్మకం లేకన?
   పెళ్లి ఒక ధైర్యాన్ని ఇస్తుంది నీకోసం నేనున్నాను అనే భవననిఉ… పారిస్ కి నీవు వేల్ల్లిన్న్న నేను ఉన్న అనే ధైర్యం అది అమెరికా కి నేను వెళ్ళినా నువ్వు నకున్నవని నమ్మకం… వీటి కోసమే మనం పెళ్లి అనే సంప్రదాయాన్ని సృష్టించమని చెప్పడమే ఈ చిత్రం ఉద్దేశం .
   నేను మనస్పూర్తిగా చెప్తున్నా… “మని రత్నం గారు IS BACK “

  • మూర్తి గారు … చాలా బాగా చెప్పారు. అవును …నేనూ అంటాను …మణిరత్నం ఇస్ బ్యాక్

 7. మీ విశ్లేషణ కూడ అందరిలా సమాజం నుండి తయారు కాబడ్డ ఒక “ప్రీ ఆక్యుమైండడ్” పీపుల్ లానే వున్నది.

 8. ari sitaramayya says:

  సరే.
  వాళ్ళు సెక్చుఅల్ ఆకర్షణ వల్ల మాత్రమే కలిసున్నారు.
  తర్వాత ప్రేమ కలిగితే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే ఎవరి దోవన వాళ్ళు పోతారు.
  ఇది దేని కంటే నీచమయిందండీ?
  ఎకరాలకోసం చేసుకునే పెళ్లి కంటేనా?
  సవర్లకోసం చేసుకునే పెళ్లి కంటేనా?
  లక్షల కోసం చేసుకునే పెళ్లి కంటేనా?
  అబ్బాయి పాపం హోటల్లో తినీటినీ సన్నబడ్డాడని చేసుకునే పెళ్లి కంటేనా?
  బట్టలుతికేవాళ్ళు లేరని చేసుకునే పెళ్లి కంటేనా?
  పిల్లలు పుట్టకపోతే ఆస్తంతా ఇంకెవరికో పోతుందని చేసుకునే పెళ్లి కంటేనా?
  దేనికంటే హీనమయిందండీ?

  హలో.

  హలో.

  పోనీలెండి. వయసులో ఉన్న వాళ్ళకు సెక్స్ మీద ఆకర్షణ ఉంటుంది. ముసలోళ్ళకి మనసంతా నీతులు చెప్పటం మీద ఉంటుంది. అది సహజమే.

 9. Rudradev says:

  వినోద్ గారు,
  నేను మొదట మీ ‘సూన్యమ్’ షార్ట్ ఫిలిమ్ చుసినపటి నుంచి నాకు చాల గురవం. ఇంకా ఈ సినిమా గురించి అయితే, సినిమా చూసినంత సెప్పు మీరు మీ ఆర్టికల్ లో అడిగిన అనేక ప్రస్నలూ నాకు కుడా కలిగాయి. తీర ధియేటర్ బయటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అండ్ జనాలు టాక్ నా వ్యూస్ కి డిఫరెంట్ గ ఉంది. అందరు mani is back అన్నారు, తరువాత నేను వారితో కన్విన్సు అయ్యి నా వ్యూస్ ని ఎవరితో దిస్చుస్స్ చేయలేదు. ఎందుకంటే ఇలానే ‘ఆరంజ్’ (ఈ సినిమా కుడా ఆల్మోస్ట్ ఇదే కోవ లోకి వస్తుంది అనుకుంటున ) సినిమా కి కుడా చాలా మందితో argue చేయల్సివచింది.

 10. abhilash says:

  Mee viluvalatho meru cinema theesthe adi kontha mandi ki navvu puttinchochu… alage ee cinema lo viluvalu meku ardham kakapoyi Undochu faniki karanam Kevalam mee avagaahana lopam… meru prasthavinchina saamoohika yekaantham ane oka dialogue tho mee paina abhimanam penchukunna kani ee review tho mee avagaahana drushti oka border lo aagipoindi ani ardham aindi… script ni mee point of view lo mee format lo aalochinchi kotti paresthunnare thappa sweekarinchafaniki prayathninchi chusthe ardham avthundi
  Prayathninchi chudandi lopalu vethikaru kani avi correct kadu meru edo frustration lo kurchuni rasinattu anipinchindi

 11. ఓకే బంగారం సినిమాని ఇంత తీక్షణంగా చూసింది మీరోక్కరేనేమో
  మని రత్నం తీసిన ఓకే బంగారం తో నేటి తరం పడిపోతుంది అంటే ఒప్పుకోవడం కష్టం అన్న

 12. నాగసత్య చంద్రం says:

  పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు . మీకు నచ్చక పోవడానికి చెప్పిన కారణాలు ఏవీ కూడా’ ఓకే ‘ను కాకి చేయవు . ఐనా మీరు ఫక్తు సాంప్రదాయ రొడ్డ కొట్టుడు వాదం నుండి మాట్లాడుతున్నారు. మీ విమర్శకు మీ వ్యాసం లోనే సమాధానాలు వున్నై చూసుకోండి . కొంపదీసి మీరు కేంద్ర పాలనా పార్టి తీవ్రవాదులు కాదు కదా . ఒకప్పటి తెలుగు కుటుంబ కథా చిత్రాలలోని విపరీత డ్రామా (ఈ మధ్య ‘త్రివిక్రమ’ మహశయుల కుటుంబ కతా చెత్త సినిమాల లాగే) , అనవసర సంభాషణలకు అలవాటుపడ్డ వారికి ఈ సినిమాలో వున్న ‘ధ్వని ‘(చెప్పాలనుకున్న అంశం ప్రతీకాత్మకంగా , ధ్వని పూరితం గా వుండడం గొప్ప కళ లక్షణం , తెలుగు లో కళాత్మకత అన్ని రంగాలలో లోపించడం గత రెండు మూడు దసాభ్దాలు గా ఒక పెద్ద లోటు ) అర్థం కాదు.

 13. durgaprasad devulapalli says:

  సినిమా ఒక వినోద సాధనం అంతే. “సంఘ సంస్కరణ” మాద్యం కాదు. “మౌనరాగం” కూడా కొత్తలో ఇలానే అపార్దాలకు దారి తీసింది. అందులో కూడా ప్రేమ, పెళ్లి గురించి మణిరత్నం నిర్వచనాలు ఇలానే ఉన్నట్టుగా అనిపిస్తాయి. అయినా నేటి భారతీయ సినిమాలో అంత చెప్పుకోదగ్గ విలువలే లేవు. ఇంకా మణిరత్నం అయితేనేం, శంకర్ అయితేనేం,హిందీఅయితేనేం ఇంకే భాష అయితేనేం. అందరూ ఒకే తీరు. 85% సినిమా అంతా కామ కేళీ వికారాలు మిగతా 15% లో మెసేజ్ లు. నీలి చిత్ర తార సన్నీలియోన్ ని మన వెండి తెర తారగా మనం వోప్పుకోవడమే నేటి మన సినిమా విలువల కి ఒక ఇమేజ్ ని ఇస్తోంది.

 14. akella raviprakash says:

  సినిమా స్టొరీ గురించి విశ్లేషణ బాగుంది కానీ ఐ వాంట్ తో ఆడ్ వన్ పాయింట్

  పిల్లలు పెళ్ళికి కి సాఫల్యాన్ని ఇస్తారు , వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళ నాన్న అమ్మ లీగల్ గ సమాజ పరంగా
  గుర్తింపు పొందిన పెళ్లి చేసుకుంటే కుటుంబం స్థిరంగా వుంటే మంచిది

  ఈ కిడ్స్ విషయం సినిమా పూర్తిగా విస్మరిచింది

 15. Sujatha says:

  మూర్తి కనకాల గారి అభిప్రాయమే నాదీనూ! “ఇది తప్పు”అనే అభిప్రాయంతో ఈ సినిమా చూస్తే చివరికి ఇదే రివ్యూ రావడం లో ఆశ్చర్యం లేదు

  సీతారామయ్య గారి ప్రశ్నలు అర్థవంతమైనవి.

  ప్రేమ లేదు ప్రేమ లేదు ప్రేమ లేదు అన్నారు.
  ఇంతకీ ప్రేమ ఉండి ఉంటే వాళ్ళు ఎలా ఉండి ఉండాలో చెప్పలేదు?

 16. Bharadwaj Godavarthi says:

  వినోద్ గారు, చాల మంచి విశ్లేషణ,

  కాని నా అభిప్రాయాన్ని కూడా మీతో పంచుకుందాం అనుకుంటున్నా.
  నేను చుసిన ఏ మణిరత్నం సినిమాలోనూ తను జనాలకు ఏదో చెప్పాలని ఎప్పుడు చూడలేదు,
  కేవలం తను రాసుకున్న పాత్రలని, వాటి స్వభావాలని, ఆ స్వభావలకు కారణం అయిన సందర్భాలను చూపించాడు మాత్రమే.

  ఒక ఆనంద్, సమరసుర్యం, సక్తివేలు, శేఖర్,గురు ఏ పాత్ర తీసుకున్న అవి అన్ని సందర్భానికి అనుకునంగా నడుచుకునేవే కాని మంచి, చెడులని, ఆలోచించుకొని నడుచుకునేవి కావు.

  ఇక ‘ఓకే బంగారం’ చిత్రానికి వస్తే పెళ్ళికి ముందు సెక్స్ తప్ప ఒప్ప, సహజీవనం గొప్ప, పెళ్లి గొప్ప, ముందు సెక్స్ కోసం తపించి ఆ తరువాత ప్రేమించుకున్న జంటని చూపించడానికి ఈ చిత్రం తీసాడు అని నేను అనుకోవట్లేదు

  తార, ఆది రెండు పాత్రలు గానే చూపించాలి అనుకున్నాడు దర్శకుడు,
  దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా భావించే ఒక దర్శకుడు ఈ సమాజంలో మమేకమైన రెండు పాత్రల గురించి కధ రాసుకోవడం తప్పు కాదు అనుకుంటున్నా.

  సహజీవినం తప్ప ఒప్ప అని తను చెప్పడానికి సినిమా తీయలేదు, పెళ్లి పైన కొన్ని సందర్భాల వాళ్ళ ఇద్దరి వ్యక్తులకి కలిగిన ద్వేషాన్ని, చూపిస్తూ ‘గణపతి, భావనిల’ పాత్రల ద్వార ఒకరి తోడు ఇంకొకరికి ఎంత అవసరమో చెప్పడానికి ప్రయత్నించాడు.

  మీరు చెప్పినట్టు ఈ మూవీ లో గొప్ప ప్రేమ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు, కాని యుక్త వయసు యువతీ యువకుల మనసు స్థితిని మాత్రం కచితంగా చూపించారు.

  “నీతో అలా “పాటలోని చరణాలు ఆ వెస్ట్రన్ సౌండ్స్న మధ్యన నలిగి పోయాయి కాని అవి గమనిస్తే మాత్రం ఆ దర్శకుడి అంతరార్ధం మనకి అర్ధం అవుతుంది

  సతమతమే
  సంబరమై
  వేల తెలియని
  ఈ క్షణమే అద్భుతమై
  ఎంత వరకని
  అంతు దొరకని
  వింత పరుగుతో
  కాలం

  ఇంకా లోతుగా వెళ్తే చిత్రం చివరి దశకు వచేసరికి ఆ సతమతానే దృశ్యం గా చూపించాడు దర్శకుడు..

  నిజమైన ప్రేమ అంటే శారీరక సంభంధం ముందు జరగాల, తరువాత జరగాల అని విశ్లేషించు కుంటూ కూర్చునేది కాదు ..

  తాము విడిపోతునప్పుడు వున్న కొన్ని రోజులు ఆనందం గా ఉందాం అనుకుంటారు, ప్రతి క్షణం అధ్బుతం గా గడుపుదాం అనుకుంటారు ,
  కాని ఆ క్షణం కరుగుతున్నపుడు చుట్టురా కోటి తారలు వున్న తార కన్ను మసకబారుతుంది???అది ప్రేమ కాదని ఆకర్షణ అని, ఓహో సెక్స్ తరువాత ప్రేమ పుట్టింది కాబట్టి అది గొప్పది ప్రేమ కాకుండా పోతుందా???

  ప్రేమకి నిర్వచనం దర్శకుడు గొప్పగానే ఇచ్చాడు అనుకుంటున్నా, శారిరిక కలయిక, తప్పుడు ఉద్దేశం పంపుతునాడు అనే ఒక అంశాని తీసేసి పతాక సన్నివేసం చుడండి…గొప్పగానే కనిపిస్తుంది.

 17. దేవరకొండ says:

  ప్రపంచీకృత ఆర్ధిక వ్యవస్థ వల్ల మారిపోతున్న సామాజిక విలువల నేపధ్యంలో ఇలాంటి కళారూపాల ఉత్పత్తి సహజం. ఆర్ధిక పరమైన అంశాలకు ఇంత గ్లామర్ వుండదు కనుక, పైగా ప్రమాదం (రాజ్యం నుండి) కనుక, మత పరమైన అంశాలకు మరింత ప్రమాదాలుంటాయి కనుక, వ్యక్తి సంబందాలైతే అటు గ్లామర్, ఇటు బోలెడు మసాలాకు అవకాశం. రాజ్యం ఏమీ అనదు. ఇల్లాంటి రివ్యూలు రాసుకోడమే తప్ప ఎవరూ ఏమీ ‘పీక’ లేరు. పైగా కళా పోషణ, డబ్బు, పేరుకి పేరు. సినిమాలకూ, సినిమా వాళ్లకు ఎలాంటి సామాజిక బాధ్యతనూ పెట్టడాన్ని తెలుగు గుండెలు తట్టుకోలేవు. వ్యక్తి ని సహజంగా ఆకర్షించే బాధ్యతా రాహిత్యం,ఏ విలువలకీ జవాబుదారీ కాని సామాజిక స్వేచ్చా, స్త్రీ పురుష సంబంధాల్లో ముఖ్యంగా పిల్లల మీదా తద్వారా సమాజం మీదా అవాంఛనీయ ప్రభావాన్ని చూపుతాయని పాశ్చాత్య సమాజాలు ఇప్పటికే నిరూపించాయి. స్త్రీ అంతిమంగా బాధలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ వున్న ఇలాంటి కొత్త పోకడలను సినిమా వంటి మాధ్యమం ఆకర్షణీయంగా చూపించే తరుణం ఈ దేశానికి ఇంకా రాలేదని నమ్మిన వారు వినోద్ గారి సమీక్షను సమర్ధిస్తున్నారు, ప్రస్తుత వివాహ వ్యవస్థలోని లోపాల ఆసరాతో ఓ కొత్త విధానానికి స్వాగతం పలికే వారు సినిమాని సమర్ధిస్తున్నారు. ప్రస్తుత వివాహ వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించడం వివేకమని నా అభిప్రాయం. కనుక సమీక్ష ఆ సినిమాని ఎండ గట్టడం మంచి స్పందనగా భావిస్తున్నాను.

  • నిజానికి పెళ్ళి అనేదే స్త్రీని పురుషుడిపై ఆధారపడి ఉండేలా ఉంచడానికి తయారైన ఒక వ్యవస్థ. పురుషుడు మయటపనులన్నీ చక్కబెట్టుకొని వస్తే స్త్రీ మాత్రం “అలసి సొలసి ఇల్లుచేరిన భర్తకి” సుఖాన్నిచ్చి రీఛార్జిచేసే ఒక ఉపకరణంగానే చూడబడుతోంది. అందుకే పెళ్ళవగానే స్త్రీలు ఉద్యోగాలకు రాజీనామాలివ్వడమూ అదీనూ. ఆఖరుకి ఆదర్శానికి ఆమడదూరంలో ఉంటారని మనమనుకొనే సినిమా రంగంలోకూడా స్త్రీలు పెళ్ళవ్వగానే కెరీర్‌కు వీడ్కోలు పలుకుతారు. ఇలాంటి పెళ్ళితో ముడివడిన భావజాలాన్ని, సాంప్రదాయవల్ల అలవడిన భావజాలపు బరువుని భుజాలపైనుండి దింపుకోకుండా మసలుకొంటే ఏమోగానీ సహజీవనం నా దృష్టిలో పెళ్ళికి ఒక మేలైన ప్రత్యామ్నాయం.

   భారతీయ మగాళ్ళు కేవలం సెక్స్‌కోసమే సహజీవన చేస్తున్నారు. వాళ్ళు మోజుతీరగానే అమ్మాయిలను వదిలేస్తారు. అప్పుడు ఆపిల్ల బ్రతుకేం కాను అంటారా? నిజంగా అలాగే జరుగుతుంటే అది మగాళ్ళ ఖర్మ. సహజీవనం చేయగల చొరవున్న అమ్మాయిలు తమను తాము support చేసుకోగల సమర్ధులు. వంటింటి, పడకటింటి కుందేళ్ళు కారు. భారతదేశంలో అందరూ కొద్దిబుధ్ధులతో ఉండటంలేదు. ఆ అమ్మాయిలకు సాంప్రదాయక్ మొగుళ్ళకన్నా “మంచి” మొగుళ్ళే దొరుకుతున్నారు.

 18. Srinivas Vasa says:

  Maniratnam sir.. Great director.. But, i think this movie needs some more love-in relationship.. our youngsters seeing only live – in part… Movies impact on youth some extent.. So, handle with care is important.. especially dealing.. like this type of movies.. Finally, vinodji review very good.. Movie also very good.. Thk you

 19. prabhu says:

  ఇందులో చాల ముఖ్యమైన విషయం ఏమంటే ఆది తార ఇద్దరికీ తాము తీసుకున్న వొప్పందం మీద అవగాహన లేదు. అది కి అన్న వదిన అంటే భయం. తారకి తల్లి మీదనుండే అయిష్టత వల్ల వచ్చిన రెబెల్. తప్ప ఇంకేమి లేదు. నిజానికి ఈ సినిమా పెళ్లి గురించి ఏ చర్చ చేయనేలేదు. కెరీర్ మీద ఆసక్తి. సెక్సువల్ ఆకర్షణ మధ్య వొక రాజిగా మొదలై చివరికి ప్రేమ పెళ్లి తో ముగిసిన కథ ఇది. ఇంత కన్నా మణిరత్నం అన్నంత గొప్ప మాత్రం ఏమి లేదు. – ప్రభు

 20. సాయి శ్రీనివాస్ says:

  వినోద్ గారు.. మీ అర్టికాల్ తో నేను 100% ఏకీభవిస్తున్నా. మన ప్రేక్షకుల తీరు ఎలా ఉంటుంది అంటే… హీరొయిన్ ని ” ఒసేయ్ నన్ను లవ్ చేయవే.. లేదంటే చంపేస్తా లేదా చస్తా ” అని హీరో అంటూ ఆమె వెంట పడుతూ విసిగిస్తే , వాడి మిద ఎలాంటి నెగటివ్ ఫీలింగ్ రాదు. అదే ప్రవర్తన, అవే మాటలు ఒక విలన్ అంటే వాడి మిద చాలా కోపం వస్తుంది. ఇక్కడ కూడా అంతే. హీరో హీరోయిన్స్ మద్య ప్రేమ లేదు, పెళ్లి చేస్కోవాలనే ఆలోచన లేదు, శారీరక సంబంధం మాత్రమే వారికి కావాలి. కాని ప్రేక్షకులకి (ఈ చిత్రాన్ని సమర్ధించే వారికీ) మాత్రం అది తప్పుగా అనిపించదు. అదే పని హీరో హీరోయిన్ కాకుండా వేరే పాత్రలు అలాంటి సంబంధం పెట్టుకున్నప్పుడు లేదా అలా బిహేవ్ చెసినప్పుడు చాలా తప్పుగా కనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే ఇదే సినిమా మారుతీ లాంటి దర్శకులు తక్కువ బడ్జట్ లో తీస్తే దాన్ని బూతు సినిమా గా అభివర్ణించే వాళ్ళు.
  సినిమా విషయం పక్కన పెడితే … ఇక్కడ చాలా మంది పెళ్లిని మన సంప్రదాయాలని అవహేళన చేస్తూ కామెంట్స్ రాసారు. లోపాలు కొన్ని ఉండొచ్చు, కాని మనదేశం వాటిని పాటిస్తుంది కాబట్టే మిగిలిన దేశాల కన్నా మనకు కుటుంబం,అమ్మ నాన్నలు, భార్యాభర్తలు, అన్నచెల్లెల్లు …ఇలా అనేక బంధాలు, విలువలు ఉన్నాయి. అవి చూసి విదేశీయులే మన దేశాన్ని గౌరవిస్తారు. కాని ఈ live-in రిలేషన్స్ లాంటి సంప్రదాయాల్లో లోపాలే అధికం. అది మన కన్నా విదేసీయులకే బాగా తెలుసు. అందుకే వాళ్ళు మన సంస్కృతిని గౌరవిస్తారు. ఇక్కడ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా….పెళ్లిని గౌరవించి కాపురం చేసిన వాళ్ళకే పుట్టాము, గౌరవమైన స్థానం లో ఉన్నాం అనే విషయం తెలుసు కోవాలి. కొంత మందికి పెళ్లి వల్ల నష్టం కలిగి ఉండొచ్చు. అంతమాత్రాన ఆ సంప్రదాయమే తప్పు అనడం తప్పు.

 21. Shanmukha Charya says:

  వినోద్ అనంతోజు గారు వారు రాసిన ఒకే బంగారం సినిమా విశ్లేషణ బావుంది ,, నాకు నచ్చింది,, మణి సర్ సినిమాలు ఎప్పుడు ఎల్లగా వున్నాయో ఇది అల్లాగే వుంది , మొదటి నుండి అయన మార్పేమీ లేకుండా చేస్తున్న సినిమాలే ఒకే బంగారం ,, మనం అలవాటు పడ్డ హడ విడి లేక పోవటం కూడా నచ్చదు ,,

మీ మాటలు

*