ఇప్పుడు కావాల్సింది శ్రీశ్రీ వచనం!

అఫ్సర్ 

 

1980.

అప్పుడు కాలేజీ అంటే వొక ఉద్యమం. రోజూ సాయంత్రాలు ఖమ్మంలోని రిఖాబ్ బజార్ స్కూలు ముందో వెనకో కూర్చొని, లోకం మీద ఆగ్రహాన్ని ప్రకటిస్తున్న రోజులు. పట్టలేని ఆగ్రహాన్ని చల్లార్చుకోలేక పక్కనే వున్న కాప్రి హోటెల్లో ఇరాని చాయ్ పంచుకొని “మన సోషలిజం ఇంతవరకేనా? ప్చ్…” అని ఆ పూటకి చప్పరించేసుకొని, రంగు డబ్బాలు తీసుకుని ఖమ్మం గోడల్ని ఎరుపెక్కించిన రాత్రులు. “నీ రాత స్ట్రోక్స్ శ్రీ శ్రీలా వున్నాయి” అని వొకరికొకళ్ళం కితాబులు ఇచ్చి పుచ్చుకునే అమాయక కాలం. కాని, ఇంకా శ్రీ శ్రీ కవిత్వం పూర్తిగా చదవలేదు అప్పటికి.

అలాంటి వొకానొక సాయంత్రం చీకటి వైపు పరుగు తీస్తుండగా…

అది చరమ రాత్రి అయితే బాగుణ్ణు అనిపించిన రాత్రి అది. ఆ రాత్రి శ్రీ శ్రీని కలిశాను. ఆయన వొక నిజం నిషాలో, నేను మరో రకం నిషాలో వున్నాం. ఆలోచన అలలు మాటల రూపంలో కొన్ని సార్లు అందంగా పెనవేసుకుంటున్నాయి.

ఆ రాత్రి మా ఇద్దరినీ కలిపినవాడు జేంస్ జాయిస్. అది కూడా నిజమే! పిచ్చి పట్టినట్టు జాయిస్ రచనలు చదువుతూన్న ఆ సమయంలో నా దగ్గిర వొక అమూల్యమయిన పుస్తకం వుండేది. దాని పేరు ” పిక్టొరియల్ గైడ్ టు యులిసిస్”. పుస్తకం ఎంత అందంగా వుండేదంటే,ఇంటికి తీస్కువెళ్ళి మరీ చాలా మందికి ఆ పుస్తకం చూపించేవాణ్ణి. అది నేను హైదరాబాద్ ఆబిడ్స్ లో వొక ఆదివారం రోడ్డు పక్క ఆ రోజుల్లో నాలుగు వందలు పెట్టి కొన్న పుస్తకం.

మాటల మధ్యలో ఆ పుస్తకం సంగతి చెప్పాక, శ్రీ శ్రీ గబుక్కున లేచి,గబ గబా చొక్కా వేసేసుకొని “ఇప్పుడే ఈ క్షణమే ఆ పుస్తకం చూడాలి” అంటూ నన్ను బయటికి లాక్కు వచ్చాడు.
“మీరు ఇక్కడే వుండండి. నేను తీసుకొస్తా.” అన్నాన్నేను.
“ఇక్కడ వున్నట్టే , రా!” అని హుకుం జారీ చెయ్యగానే నేను నా డొక్కు సైకిలు(చలం గారి భాషలో ముసలి గుర్రం) మీద రెక్కలు కట్టుకుని యెగిరిపోతున్నట్టుగా, రివ్వున దూసుకుపొయి, ఆ పుస్తకం తెచ్చి శ్రీ శ్రీకి చూపించడం మొదలెట్టాను. విద్యార్థి రాజకీయాల వల్ల, చదువు వెనక్కి పట్టి, ఇంట్లో అసమ్మతి పవనాల్ని యెదుర్కొంటున్న వొక ఇంటర్మీడియట్ కుర్రాడి అసంత్రుప్త బతుకులో అదొక అపూర్వ క్షణం. చాలా రోజుల శ్రమ, చాలా కన్నీళ్ళు ఆ పుస్తకం సంపాదించడం వెనక వున్నాయి. వొక్క క్షణంలో అవన్నీ యెగిరిపోయాయి.

ఆ పుస్తకంలో జాయిస్ “యులిసిస్”లో వర్ణించిన వూళ్ళూ, భవనాలూ, వాటి చరిత్రా వున్నాయి. ఆ నలుపూ తెలుపూ బొమ్మలు చాలా కాలం నా కలల్లోకి వచ్చి వెళ్ళిపొయేవి. ఒక రచయిత నిజం నించీ ఊహలోకీ, కల నించి తన ఇరుగుపొరుగులోకీ ఎలా ప్రయాణిస్తాడో బొమ్మ గీసినట్టుగా చూపించే పుస్తకం అది.

ఆ చిత్రాల్ని చూస్తూ, తన వృద్ధాప్యంముసురుకున్న వేళ్ళతో ఆప్యాయంగా తాకుతూ ఆ పుస్తకం తను చదివిన అనుభవాల్ని, అసలు తన వచనంలోకి చాలా భాషల చాలా మంది రచయితలు పరకాయ ప్రవేశం చేయడాన్ని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ రాత్రి శ్రీ శ్రీతో కలిసి వుండకపోతే, శ్రీ శ్రీ అంటే చాలా మందికి మల్లెనే నా ఆలోచన కూడా ‘మహాప్రస్థానం’ దాకానో, ‘మరో ప్రస్థానం’ దాకానో ఆగిపొయ్యేది. ఆ రెండు విస్తృతమయిన ప్రపంచాలని కాసేపు పక్కన పెట్టి, వచనంలో శ్రీ శ్రీ ఆవిష్కరించిన తనదయిన ప్రపంచాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం ఈ వ్యాసం.
*
శ్రీ శ్రీ అనే సంతకంలో వున్న ప్రత్యేకత ఏమిటంటే, అది ఎప్పుడూ వొక కొత్త గాలిని వెంటబెట్టుకొని వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం “ఆధునికత” అనుకున్నా, ఇంకో పేరుతో పిలిచినా, ఏదో వొక కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించడం దాని తక్షణ లక్షణం. ఈ కొత్తదనం వస్తువులోనూ, రూపంలోనూ కనిపిస్తుంది. వస్తుపరంగా శ్రీ శ్రీ ఎప్పుడూ రాజీ పడలేదని ఇప్పుడు నేను విడిగా చెప్పకరలేదు, కాని, ఆ వస్తు నవీనత ఎలాంటి రూపాల్లో అతని వచనంలో వ్యక్తమయ్యిందో ఇప్పటికీ ఒక సంక్లిష్టమయిన విషయమే. ఒకే దృక్పథాన్ని అంటి పెట్టుకున్న అనేక వస్తువుల భిన్న రూపాల కలయిక శ్రీ శ్రీ వచనం.
వచనంలో శ్రీ శ్రీ – అటు సొంత రచనలూ, ఇటు అనువాదాలూ చేశాడు. అవి రెండూ వొక యెత్తు అయితే, ఉత్తరాల రూపంలోనో, వివిధ వ్యాసాల రూపంలోనో, ప్రసంగాల రూపంలోనో శ్రీ శ్రీ విస్తారమయిన/ సారవంతమయిన వచన సేద్యం చేశాడు. ఆ ప్రతి వచన రచనా విడిగా కూలంకషంగా చర్చించదగిందే. కాని, అది ఒక పెద్ద పరిశోధనా గ్రంధమే అవుతుంది. కాబట్టి, ఆయా వచన రచనలు వడపోసిన వొక సారాంశాన్ని మాత్రమే ఇక్కడ చూద్దాం.
శ్రీ శ్రీ కవిత్వం కానీ, వచనం కానీ వొకే వొక అంతస్సూత్రాన్ని అంటి పెట్టుకుని వుంటాయి. అది శ్రీ శ్రీ భవిష్యత్ వాదం: అంటే, రేపటిని ఈ క్షణాన దర్శించగలిగిన ముందు కాలపు చూపు. శ్రీ శ్రీ కవిత్వం రాస్తున్న కాలానికి అతను మార్క్సిజం చదివాడా లేదా అన్న ప్రశ్న ఇప్పటికీ వుంది. కానీ, మార్క్సిజాన్ని ఒక పుస్తక రూపంలోనో, సిద్ధాంత రూపంలోనో చదవడానికి ముందే శ్రీ శ్రీ చుట్టూ ఒక పారిశ్రామిక వాడ వుంది. కార్మిక సమూహం అతనికి ఇరు వైపులా కాకపోయినా కనీసం వొక వైపు అయినా వుంది. ఆ స్థానిక ప్రపంచంలో శ్రీ శ్రీ లీనం అయి వున్నాడనడానికి అతని జీవన కథనాల్లో చాలా దాఖలాలు చూడ వచ్చు. అది శ్రీ శ్రీ చూస్తున్న వర్తమానం. కాని, అక్కడితోనే నిలిచిపోతే అది శ్రీ శ్రీ వ్యక్తిత్వం కాదు.
స్థానికత, వర్తమానం గీసిన బరిని దాటుకుని వెళ్ళే చూపు శ్రీ శ్రీది. ఒక వలస రాజ్యం సృష్టించిన నగరం విశాఖ. అక్కడి పరిశ్రమలూ, జన జీవనం, కళా సాంస్కృతిక రంగాల మీద ఆ వలస పాలన నీడలు కనిపిస్తాయి. శ్రీ శ్రీకి వాటి స్పృహ కూడా వుంది. కాని, వాటిని దాటి వెళ్ళే వలసానంతర వాదం శ్రీ శ్రీది. ఈ ప్రయాణం మనకి శ్రీ శ్రీ వచనంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వచనంలో శ్రీ శ్రీ స్థానికతని బయటి లోకంతో ముడి పెట్టే అంతర్జాతీయ వాది. వర్తమానాన్ని విమర్సనాత్మకంగా చూసే భవిష్య వాది.
ఈ వ్యాసాన్ని నేను జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన అభిమానంతో మొదలు పెట్టాను. జేంస్ జాయిస్ పుస్తకం పట్ల శ్రీ శ్రీ చూపించిన ఆతృతని జాగ్రత్తగా గమనిస్తే, అందులో ఒక శ్రీ శ్రీ సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించిన వొక అంశ వుంది. అది తన పరిసరాలకీ, తన స్థానికతకీ ఎడంగా స్పందించడం! (బహుశా, కొత్త అంశాల పట్ల తెగని ఆకర్షణ కూడా వుంది). తన కాలానికి చెందని వొక ఆలోచనని అందుకోవాలన్న వొక ఉబలాటం వుంది. శ్రీ శ్రీ వచన రచనల్లో నేను ఆ లక్షణం చూశాను. అయితే, ఆ ఆలోచనని తన కాలంతో ముడి వేసి, ప్రయోగించడం శ్రీ శ్రీ దారి. శ్రీ శ్రీ తన వచనాన్ని వూహించే ముందు ఇలాంటి కొంత మంది రచయితలు తనని ఆవహించేంతగా ఆ పఠనంలో మునిగిపోయాడు. కాని, ఆ మునక తరవాత మళ్ళీ వొడ్డుకి చేరడం ఎలాగో తెలిసిన వాడు కనుక, అతని అంతర్జాతీయ దృష్టి మళ్ళీ స్థానికతలోకి క్షేమంగా చేరుకుంది.
శ్రీ శ్రీ వచనంలో అనువాదాలు ఎక్కువే.అవి వివిధ దేశాల వివిధ రచయితలవి. కాని, ఈ అనువాదాలన్నీ ఒక్క సారిగా చదివితే, ఆ విడి విడి లోకాల్ని శ్రీశ్రీ ఒకే సూత్రంతో కట్టే ప్రయత్నం చేసాడని మనకి అర్ధం అవుతుంది, విలియం సారోయన్ మొదలుకొని ఆంటాన్ చెఖోవ్ దాకా. అదే చేత్తో, అతను చిన్న కథల్నీ, నాటికల్నీ, వ్యాసాల్నీ, సంభాషణల్నీ కలిపాడు. అనువాద వచన రచనలు శ్రీ శ్రీలో ఎదుగుతున్న/ క్రమ పరిణామం చెందుతున్న ఒక నవీన పంథాని ఆవిష్కరిస్తాయి. ఈ పనిని రెండు రకాలుగా చేశాడు శ్రీ శ్రీ. ఒకటి: అనువాదాల్ని అందించడం; రెండు: ఆ అనువాదాల వచనాన్ని తన సొంత రచనల్లోకి ప్రయోగించి చూడడం. ఇవి రెండూ విడదీయలేని కోణాలు.

అనువాదంలో శ్రీ శ్రీ ఆయా రచయితల వచన రూపాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే, తన సొంత రచనల్లో ఆ రూపాలను స్థానిక సంస్కృతికి మార్చి, పరీక్షించి చూసుకున్నాడు. ఇలా చెయ్యడం ద్వారా కొత్త రూపాలు తెలుగు సాహిత్య సాంస్కృతిక వాతావరణంలోకి ఎలా తీసుకు రావచ్చో బేరీజు వేసుకున్నాడు. “చరమ రాత్రి” దీనికి బలమయిన ఉదాహరణ. అది ఎంత బలమయిన వుదాహరణ అంటే, శ్రీ శ్రీ సాధారణ కవిత్వంతో తృప్తి పడని వాళ్ళు కూడా ఆ రచనని వొప్పుకునేంతగా!

అలాగే,ఈ వ్యాసం మొదట్లో నేను సమకాలీన సాహిత్యంతో నా అసంతృప్తిని కూడా చెప్పాను, వొక పాఠకుడిగా! శ్రీ శ్రీ వచన రచన ద్వారా ఏం చెప్పాడన్న దానికి అందులో ఒక సమాధానం వుంది.
శ్రీ శ్రీ వచన రచనలో పాఠకుడు చాలా ముఖ్యమయిన కోణం. తన పాఠక వర్గాన్ని తానే సృష్టించుకున్నాడు శ్రీ శ్రీ. అది ఎలాంటి వర్గం అన్నది అతని కవిత్వంలో కన్నా బలంగా అతని వచనంలోనే కనిపిస్తుంది. అది – పూర్వ సాహిత్య రూపాలని ప్రశ్నించి, కొత్త జవాబులు వెతుక్కునే తరం- పాత భావాలని ధిక్కరించి ఆధునికతని అక్కున చేర్చుకునే వర్గం. ఈ పాఠక వర్గానికి కావల్సిన కొత్త అలవాట్లని నేర్పే అనువాదాలూ, ప్రయోగాత్మక వచనం కొంచెం కొంచెం రుచి చూపించి, అభిరుచిని పెంచిన లాబరేటరీ ఆ వచనం అంతా!
ఈ రోజు శ్రీ శ్రీకి మనం ఇవ్వదగిన కానుక – ఆ వచన పాఠాల్ని తిరగదోడడమే!

(పాత వ్యాసమే…పునర్ముద్రణ…అఫ్సర్ బ్లాగ్ నించి…http://afsartelugu.blogspot.com/2010/08/blog-post_05.html)

మీ మాటలు

 1. Thirupalu says:

  శ్రీ శ్రీ గురించి ఈ లాంటి రచనలు ఎన్ని చదివినా విసుగేయదు. మరీ శ్రీ శ్రీ భావాలు అంతో ఇంతో అక్కున చేర్చుకున్న తరం గురించిన పరిచయం – మరిచి పో గలమా ? ధన్య వాదాలు అఫ్సర్ సార్!

  • శ్రీ శ్రీ ని తలచుకోవడం ఎప్పుడూ వొక మెరుపు ఎరుపు కల. స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు

 2. Nisheedhi says:

  గత రెండ్రోజులుగా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో శ్రీ శ్రీ నే అలుముకుపోయినట్లు కనిపించిన ఏదో మిస్ అయిన ఫీలింగ్ .హమ్మయ్య అ మిస్ అయిన లింక్ ఇక్కడ ఈ అక్షరాల్లో దొరికినట్లు హాయిగా ఉంది . అక్షరాలు రాయటం వేరు ఆత్మీయంగా రాయటం వేరయిపోయిన కాలంలో ప్రతి అక్షరాన్నీ అత్మీయంగా అందించగలిగేది మీరు మాత్రమే అని మళ్ళీ ప్రూవ్ అయిపోయింది .థాంక్స్ సర్ .

 3. కల్లూరి భాస్కరం says:

  “శ్రీ శ్రీ అనే సంతకంలో వున్న ప్రత్యేకత ఏమిటంటే, అది ఎప్పుడూ వొక కొత్త గాలిని వెంటబెట్టుకొని వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం “ఆధునికత” అనుకున్నా, ఇంకో పేరుతో పిలిచినా, ఏదో వొక కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించడం దాని తక్షణ లక్షణం. ఈ కొత్తదనం వస్తువులోనూ, రూపంలోనూ కనిపిస్తుంది.”

  బాగుంది అఫ్సర్ గారూ…శ్రీశ్రీ వచనం గురించి ఎవరు రాసినా నాకు చాలా అపురూపంగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది. శ్రీశ్రీని ఒక విలక్షణ వచనరచయితగా గుర్తించలేదనీ, ఆయన శైలిని విశ్లేషించలేదనే అభిప్రాయం నాకు చాలాకాలంగా ఉంది. మీరు ఇప్పుడు ఆ ప్రయత్నం చేశారు. శ్రీశ్రీ వచనంపై చేరాగారు కూడా ఎక్కువ రాసినట్టు కనిపించదు. నా మటుకు నేను 1993 ఏప్రిల్ 12న “వచనంలోనూ ఆయన మరో ప్రపంచం” అని ఆంధ్రప్రభలో నా సాహిత్య కాలమ్ లో చిన్న వ్యాసం రాశాను. అందులో శ్రీశ్రీది జర్నలిస్టిక్ వచనం అనీ, అది ఒక కాలమిస్టు వచనానికి ఉండవలసిన ఆధునికతను ఆనాడే సంతరించుకుందనీ రాశాను. సరిగ్గా మొన్ననే ఒక యువపాత్రికేయుడు ఎటువంటివి చదవాలని అడిగినప్పుడు శ్రీశ్రీ వచనాన్ని చదవమని ప్రత్యేకించి చెప్పాను.

  మీకు అభినందనలు.

 4. balasudhakarmouli says:

  మీరు శ్రీశ్రీ తో పొందిన అనుభవాన్ని అదీ మళ్లీ పుస్తకం పరంగా ఆ అనుభవం ఏర్పడడం – చదువుతుంటే… అక్కడే నేనూ వున్నట్టు అనిపిస్తుంది.

 5. balasudhakarmouli says:

  అప్పటి సంగతులనూ ఫ్రెస్ గా చెబుతున్నారంటే… ఆ పుస్తకాల సారాంశం మీలో ఎంతగా సంలీనమయ్యిందో. ఒక పుస్తకాన్ని అంత ప్రేమగా చదవాలనే విషయం నాకు అర్థమౌతుంది.

 6. vijay kumar says:

  Sree Sree is well known story. But he is looking fresh in ur writing anDi. thanks for sharing.

 7. శ్రీ శ్రీ అనే పేరులోనే ఉంది ఒక గమ్మత్తైన మత్తు. శ్రీ శ్రీ కవితలు నేను హైస్కూలు రోజొల్లోనే బాగా చదివాను కానీ ఆయన వచనాన్ని పనిగట్టుకు చదివింది – డిగ్రీ లో ఉండగా నాకు కాలేజీ లో వచ్చిన ప్రైజు – శ్రీ శ్రీ వ్యాసక్రీడలు పుస్తకం వల్లనే. ఇప్పటికీ నాదగ్గర ఉంది అది, కొంత శిధిలమైనా సరే. తరువాత మరికొన్ని చదివాను. కన్యాశుల్కం మీద అతని భావాలు అబ్బురం గా ఉంటాయి, ఏకీభవించెలా చేస్తాయి. అఫ్సర్ గారూ, మంచి వ్యాసాన్ని ప్రచురించినందుకు ధన్యవాదాలు.

 8. Dr. Vijaya Babu,Koganti says:

  పునర్ముద్రణైనా ఇప్పుడే చదువుతున్నంత తాజాదనం. మీ శైలి లో ఉన్న మాజిక్ అఫ్సర్జీ.

  చాలా మంది కవులపై రచయితలపై వారు చదివిన గొప్ప రచనల తాలూకు ముద్రలు తేలిగ్గా గుర్తించగలం. కానీ మీరు చెప్పినట్లు శ్రీ శ్రీమాత్రమే తన స్థానికత ను తిరిగి చేరగల స్రష్ఠ.

  “శ్రీ శ్రీ తన వచనాన్ని వూహించే ముందు ఇలాంటి కొంత మంది రచయితలు తనని ఆవహించేంతగా ఆ పఠనంలో మునిగిపోయాడు. కాని, ఆ మునక తరవాత మళ్ళీ వొడ్డుకి చేరడం ఎలాగో తెలిసిన వాడు కనుక, అతని అంతర్జాతీయ దృష్టి మళ్ళీ స్థానికతలోకి క్షేమంగా చేరుకుంది.”

  వీకెండ్ లో మనసును ఆహ్లాద పరిచే మెదడును ఉత్తేజపరిచే వ్యాసం. స్ఫూర్తికి కృతజ్ఞతలు.

 9. సర్ , శ్రీ శ్రీ గారి వచనం గురించి ఏమీ తెలియనితనంలోంచి మీ వ్యాసం ఒక పచ్చని ఆసక్తిని మొలకెత్తించింది. ధన్యవాదాలు

 10. కర్లపాలెం హనుమంత రావు says:

  శ్రీశ్రీ కవిత్వాన్ని కాకుండా వచనాన్నిగురించి పునశ్చర్చ లేవదీయడం సందర్బోచితంగానే ఉంది అఫ్సర్ జీ! ఆ మహాకవిలోని, భవిష్యద్దర్శనం.. సదా నిలిచివుండే తాజాదనం, కొత్తదనంకోసం పసిపిల్లవాడుపడే ఆరాటంలాంటి.. లక్షణాలు కేవలం కవిత్వంలోనే కాదు.. ఆయన వచనంలోనూ.. ప్రత్యక్షరంలోనూ ప్రతిఫలిస్తుంటాయని మీరు అభిప్రాయపడటం నాకు బాగా నచ్చింది. శ్రీశ్రీ తనకాలంనాటి కవులనందరినీ బైపాస్ చేసి ముందువరసలోకి చొచ్చుకురావడంలో నాటి సాహిత్యవాతావరణానికితోడు.. రాజకీయవాతావరణమూ సహకరించిందని నేను నమ్ముతున్నాను. అంతమాత్రం చేత ఇది ఆ మహాదార్శనికుడిని కించపరచడం ఎంత మాత్రం కాదు. . అంత స్థాయి నాకు లేనూ లేదు.
  నా పదమూడో ఏట పరిచయం అయింది మహాప్రస్థానం నాకు. అప్పట్లో ఆ కవితల్లోని చాలా పదాలకు అర్థాలు తెలియవు… చదివే సమయంలో హృదిలో కలిగే ఓ ఆవేశపు భావోద్వేగపు విపరీతపు ఆకర్షణ! అర్థశతాబ్ది దాటినా మహాప్రస్థానం మళ్లీ మళ్లీ చదివినా చల్లారని అదే పొంగు. ఎందుకలా?!.. అని ఇప్పుడు కొంత విశ్లేషణాత్మకంగా ఆలోచించగలిగే వివేకమున్నా.. ఎందుకో.. శ్రీశ్రీ పద్యాలు చదువుతున్న సందర్బంలో మాత్రం నాకు ఏమాత్రం తార్కికంగా ఆలోచించబుద్ది కాదు. అమ్మఫొటోలోని అందాన్ని గురించి ఆలోచన వస్తుందా ఏ బిడ్డకైనా? ఫ్రాయిడ్ లాంటి మనోవిశ్లేషకులను సంప్రదిస్తే ఆ బీజదశ తాదాత్మ్యతకు ఏదో శాస్త్రీయమైన పేరు దొరుకుతందనుకోండి! ఇప్పుడా చర్చంతా ఇక్కడ అసందర్బమవుతుందికానీ.. ప్రస్తావన మాత్రం సందర్భోచితమే.. కవిగా నన్నంతగా లోబరుచుకున్న శ్రీశ్రీ.. వచన రచయితగా ఏమంత ప్రభావితం చేయలేదని చెప్పడానికే ఇంత చెప్పుకొచ్చింది! మీరు మీ వ్యాసంలో చెప్పినట్లు శ్రీశ్రీ వచన ఫిలాసఫీ( వర్తమానాన్ని భవిష్య్త్తుత్తుతో అనుసంధానించేందుకు పడే ఉబలాటం, అందని కొత్తదనాన్ని అందుకోవాలన్న పిల్లవాడి తరహా ఆరాటం, సదా ఒక అనుకూల దృక్పథాన్ని, ఆశాభావా న్నివ్యక్తీకరించడం, భాషాపరంగా ప్రయోగాలు చేయడం మరిచిపోరాదన్న స్పృహ కలిగివుండటం(అనువాదాల సమయాలలో సైతం ఆ భావం వదలకపోవడం) కచ్చితంగా ఈ తరమేంటి.. ఏ తరమైనా అనుసరించి ఆచరించి తీరవలసిన మౌలికమైన పాఠ్యాంశాలే! కాకపోతే ఆ లక్షణాలు మరింతగా వికాసం చెందిన వచనం ఇప్పటికే వచ్చిందని, వస్తున్నదని.. ముందు ముందు మరింత బలంగా రాబోంతోందని నేను నమ్ముతున్నాను అఫ్సరు గారూ! కె.శ్రీనివాస్(ఆంధ్రజ్యోతి) వంటి ఎందరో ఇటువంటి వచనం రాస్తున్న వారిలో ఉన్నారు. ఆ మాటకొస్తే.. ముఖప్రీతి అనుకోకపోతే.. మీరు కవిత్వం అని చెప్పే మీ కవిత్వంలోని వచనంకూడా బేలకాదనే నా అభిప్రాయం. ఇక ఇప్పటి మీ ఈ వ్యాసం చదివినప్పుడు మీకు మహాకవితో మీ యవ్వనం తొలిదశలో కలిగిన అపూర్వ పరిచయంమాత్రం విశేషంగా ఆకర్షించింది. శ్రీశ్రీ గురించి కొద్దిగా తెలుసు. ఆఫ్సర్ గురించి కొద్దిగా తెలుసు. అఫ్సర్జీకి తెలిసిన వ్యక్తిగత శ్రీశ్రీని గురించి ఇప్పుదే తెలుసుకున్నాను అఫ్సర్ జీ!. చాలా థ్రిల్లింగుగా ఫీలయ్యాను కూడా రాత్రంతా!. మంచి ఆలోచనాత్మకమైన .. వ్యక్తిగత స్థాయి వ్యాసం అందించినందుకు (పాతదే అయినా.. అన్నీ ఎప్పటికప్పుడు ఆసాంతం చదివే అవకాశం లేని నా బోటివారికి) మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోవు.

 11. Vilasagaram Ravinder says:

  నాకు తెలిసిన మొదటి కవి శ్రీశ్రీ. మీ వ్యాసం అద్భుతంగా ఉంది.

 12. P Mohan says:

  చాల బావుంది. శ్రీ శ్రీ ని తొలిసారి చదివిన జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

 13. శ్రీ శ్రీ ని కొత్తగా పరిచయం చేశారు. ఒక ఔత్సాహికుడికి , ఒక్కసారిగా ఒక మహాకవితో పరిచయమైన సన్నివేశాన్ని చదువుతుంటే ఆర్ట్ ఫిలిం చూస్తున్నట్టనిపించింది. అభినందనలు !

 14. Jayashree Naidu says:

  అఫ్సర్జీ
  మీ రచనలెప్పుడూ సాధారణత్వానికి అసాధారణత్వాన్ని జోడిస్తూవుంటాయి. మీ జీవితంలోంచి అనేక వ్యక్తుల పరిచయాల పుటలు తిరగేస్తూ వాటిని ప్రేమగా మాతో పంచుకుంటూ వుంటారు. ఆ శైలికి మొదటి నుంచీ చివరవరకూ మీవెంటే ప్రయాణిస్తాం. మరో సారి మీతో శ్రీ శ్రీ తో మీ జ్ఞాపకాలతో విశ్లేశణతో ప్రయాణం బాగుంది.

 15. నారాయణస్వామి says:

  చాలా మంచి వ్యాసం – మనందరం యెరిగిన శ్రీ శ్రీ ని కొత్తగా పరిచయం చేయడం బాగుంది – బాగా చదువుకున్న వారూ, చదివింది క్షుణ్నంగా అర్థమైన వాళ్ళూ విషయాన్ని తేలికగా యితరులకు విడమర్చి సులభమైన వచనంలో (సులభంగా కనిపించే) చెప్పగలరు. శ్రీ శ్రీ చేసిందదే! సులభంగా సూటిగా కనిపించే లోతైన వాక్యాలు!

 16. Delhi Subrahmanyam says:

  ఎంత గొప్పగా రాసారండీ అఫ్సర్ గారు . మీకు నా హార్దిక అభినందనలు. ముఖ్యంగా “శ్రీ శ్రీ కవిత్వం రాస్తున్న కాలానికి అతను మార్క్సిజం చదివాడా లేదా అన్న ప్రశ్న ఇప్పటికీ వుంది. కానీ, మార్క్సిజాన్ని ఒక పుస్తక రూపంలోనో, సిద్ధాంత రూపంలోనో చదవడానికి ముందే శ్రీ శ్రీ చుట్టూ ఒక పారిశ్రామిక వాడ వుంది. కార్మిక సమూహం అతనికి ఇరు వైపులా కాకపోయినా కనీసం వొక వైపు అయినా వుంది. ఆ స్థానిక ప్రపంచంలో శ్రీ శ్రీ లీనం అయి వున్నాడనడానికి అతని జీవన కథనాల్లో చాలా దాఖలాలు చూడ వచ్చు. అది శ్రీ శ్రీ చూస్తున్న వర్తమానం. కాని, అక్కడితోనే నిలిచిపోతే అది శ్రీ శ్రీ వ్యక్తిత్వం కాదు.” ఇది మంచి విశ్లేషణ. ఇలాంటి విశ్లేషణలు నిండుగా ఉన్న ఇంత మంచి వ్యాసం రాసిన అఫ్సర్ గారు, అనుకోకుండా 1979 లో శ్రీ శ్రీ గారిని ఢిల్లీ లో మా ఇంటికి తీసుకు రావడం ఆయనతో మిత్రుడు సి.వి.సుబ్బారావు (సు రా) తో కలిసి ఒక రాత్రంతా మాట్లాడడం అందులో అఫ్సర్ గారు చెప్పిన కబుర్లు శ్రీ శ్రీ గారి నోట వినడం ఒక మరవలేని అనుభూతి. ఇంకొకసారి అభినందనలు.

మీ మాటలు

*