పది అంకెల ఇంద్రధనస్సు 

రేఖా జ్యోతి 

నీకూ నాకూ మధ్య
చాన్నాళ్ళ విరామం తర్వాత ‘ మొదటి మాట ‘
కాస్త నెమ్మదిగానే మొదలవుతుంది

నిశ్శబ్ధం లో నుంచి శబ్దం ప్రభవించడం
స్పష్టంగా అవగతమవుతుంది

‘ వర్షం మొదలైందా ! ‘ అని చాచిన అరచేతిలో
బరువుగా ఒక చినుకు రాలుతుంది
పొడినేల తడిచిన పరిమళం
ఊపిరిని వెచ్చగా తాకుతుంది

అటునుంచి ఒక పలకరింపు
ఇటు నుంచి ఒక పులకరింపు
చినుకు చినుకూ కలిసి వర్షం పెద్దదవుతుంది
కురిసి కురిసి మమత ప్రవహిస్తుంది

అటుపక్కని కొన్ని పెద్ద పెద్ద తరంగాలు
ఇటువైపు తీరం మీద కట్టిన ఓటు పడవని
ప్రయాణం లోకి మళ్ళిస్తాయి

‘ నిన్న ఏమైందో తెలుసా! ‘
‘ మొన్న ఒక రోజు కూడా ఇలానే …!’
‘ పోయిన యేడు ఇదే రోజు గుర్తుందా …!’
ఒక్కో అడుగూ వెనక్కి వేసి వేసి ఆఖరుగా
చేతిలోని వెన్న చేజారిన చోట సంభాషణ ఆగుతుంది

ఒక్కసారిగా ఒకే జ్ఞాపకం
నాలుగు కళ్ళల్లో సుడులు తిరుగుతుంది

అటువైపు నిశ్శబ్ధం
ఇటువైపూ బలహీన పడిన తుఫాను
ఇప్పుడిక ఎటు తవ్వినా కన్నీరే పడుతుంది

కాసేపు నిశ్శబ్ధమే అటునీ ఇటునీ హత్తుకొని ఓదారుస్తుంది
‘ సరే మరి , ఉండనా !’
తెలుసు అడుగుతున్న ఆ వైపున ఏమవుతోందో!
ఇక ఇటువైపు బదులులో అక్షరమేదీ ఉండదు కాస్త ‘ శబ్దం’ తప్ప!

ఆరుబయట వర్షం వెలసిపోతుంది
ఆకాశం వెలవెలబోతుంది !!
ఎండా వానల ఆశలమీద మెరిసిన
పది అంకెల ఇంద్రధనస్సు మాయమవుతుంది !!

మీ మాటలు

  1. prasuna ravindran says:

    Abba bhale rasaru Rekha. Oka andamaina anubhuti

    • థాంక్యూ ప్రసూన గారు , కొన్ని జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాక కూడా ఇలా అక్షరాల్లో మిగిలిపోతాయి కదా !

  2. Mythili abbaraju says:

    ఏ వాక్యాన్ని ఎంచి చెప్పాలి…అయినా ప్రయత్నం…” అటువైపు నిశ్శబ్ధం
    ఇటువైపూ బలహీన పడిన తుఫాను
    ఇప్పుడిక ఎటు తవ్వినా కన్నీరే పడుతుంది ”….లాలిత్యానికి చిరునామా ఈ కవయిత్రి.

  3. _/\_ మీరు మెన్షన్ చేసాక కొన్ని పదాలు సహజంగానే ముందు కంటే అందంగా కనిపిస్తున్నాయి , థాంక్యూ సో మచ్ Mam

  4. Nisheedhi says:

    Loved it !very soothing

  5. చాలా బావుంది రేఖ గారు.

  6. paresh n doshi says:

    చాలా బాగుంది కవిత. యెందుకో పదే పదే గుల్జార్ గుర్తుకు వచ్చాడు.
    వర్షంలో తడిపారో, కన్నీటిలో తడిపారోగాని వెంటనే తేరుకోలేనితనం.

    కీపిటప్.

    • _/\_ నా చిన్న ప్రయత్నానికి మీ స్పందన పెద్ద బహుమానం ! చాలా కృతఙ్ఞతలు . ” వర్షంలో తడిపారో, కన్నీటిలో తడిపారోగాని వెంటనే తేరుకోలేనితనం. ” ఎంత అందమైన వాక్యం చెప్పారు సర్ !! TQ

  7. చక్కని పద చిత్రాలతో కవిత ఎంతో అందంగా ఉంది . అభినందనలు

  8. ధన్యవాదాలు భవానీ గారు !

  9. ఇంద్రధనుస్సు మాయమవుతుంది అని హృదయాన్ని కలుక్కుమనిపించారు. చాలా మంచి కవితండీ. అభినందనలు

    • ధన్యవాదాలు రాధ గారూ ! మీ చిన్నారి కధలకు పెద్ద అభిమానిని. మీరు చదవడం చాలా సంతోషం .

  10. Sameer says:

    చాలా కృతజ్ఞతలండి హృదయం బరువేక్కేలా మరల ఒకసారి “ఒక్కసారిగా ఒకే జ్ఞాపకం
    నాలుగు కళ్ళల్లో సుడులు తిరుగుతుంది” అంటూ చాలా బాగా రాసారండి. దీని వెనుక ఏమైనా జ్ఞాపకాలున్నాయా …..చాల మదించి రాసారండి….

    • అక్షరాలకు వెనుక జ్ఞాపకాలు, అనుభవాలు, ఊహలు , ఆశలు, ఆశయాలు , బాధ్యతలు … ఏదో ఒకటి ముడి వేసుకొని వుండడం సహజమే కదండీ !! :) ధన్యవాదాలు సమీర్ గారు

  11. ‘ నిన్న ఏమైందో తెలుసా! ‘
    ‘ మొన్న ఒక రోజు కూడా ఇలానే …!’
    ‘ పోయిన యేడు ఇదే రోజు గుర్తుందా …!’
    ఒక్కో అడుగూ వెనక్కి వేసి వేసి ఆఖరుగా
    చేతిలోని వెన్న చేజారిన చోట సంభాషణ ఆగుతుంది.

    ఇలాంటి భావాలు ఎలా పుడుతాయో!!

  12. Jayashree Naidu says:

    ఇప్పుడిక ఎటు తవ్వినా కన్నీరే పడుతుంది

    కాసేపు నిశ్శబ్ధమే అటునీ ఇటునీ హత్తుకొని ఓదారుస్తుంది

    చాలాచాలా బాగుంది అకవిత రేఖా జ్యోతీ
    మొదటి నుంచీ చివరి వరకూ పదే పదే చదివించారు…

  13. ‘ మీరొచ్చి వెళ్ళారు ఇటు ‘ , మీ కవిత్వంలోని ఓ అందమైన వాక్యం లాగా ! థాంక్ యూ సో మచ్ Mam

  14. వాసుదేవ్ says:

    పంచాంగాలు రాయటంకోసమని మంచుకురిసే వేళకి ఇంటిపైకప్పుపై ఉంచిన వెన్న గిన్నెకోసం పొద్దున్నేఆత్రంగ ఎదురుచూసినట్టు
    “ఒక్కో అడుగూ వెనక్కి వేసి వేసి ఆఖరుగా
    చేతిలోని వెన్న చేజారిన చోట సంభాషణ ఆగుతుంది” ఈ వాక్యం గుర్తోచ్చింది…చాలా సున్నితంగా ఉంది మీ శైలి.
    అభినందనలు జ్యోతిగారూ

Leave a Reply to Jayashree Naidu Cancel reply

*