నువ్వేనా ?

తిలక్ బొమ్మరాజు

ఓ క్షణం ఆగి చూడు
ఇక్కడేంటి ఇవి ?
నీ ఆనవాళ్ళేనా
ఇలా నువ్విప్పుడు ప్రకృతిలో మరణించడం కొత్తగా వుంది
రాత్రుళ్ళను కౌగిలించుకునే నీ ఆ చేతులేవి
యే మూలన పారేసుకున్నావు
చూడోసారి సరిగ్గా ఇక్కడే ఎక్కడో వదిలి ఉంటావు
ఇవన్నీ నీకేం కొత్త కాదుగా!
శవాల గుట్టలూ
దుమ్ము పట్టిన సమాధులూ
వాటి కింద నువ్వు
ఒక సుఖం అనుభవిస్తూ
మోసి తెగిన భుజాలు
ఇప్పుడు తెగుతూ మోస్తున్న నీ ఆలోచనలూ
ఆ పక్కగా గమనించావా ?
నీలాగే ఇంకో నువ్వు
ముందుకీ వెనక్కీ కళ్ళ చిహ్నాలు
ఇవి కూడా నువ్వేనా
ప్చ్ అసలేంటిది అచ్చు ఇలా ఎలా ఉన్నావు
దిగంబరుడిలా చీకట్లలో తచ్చాడే వెన్నెల బైరాగివి
ఇప్పుడేమిటిలా నిన్ను నువ్వు కోల్పోయావు
ఈ రాతి బండల కిందా
చెరువుగట్టు పక్కన ఉన్న నాచులోనూ
పచ్చగా మెరిసే నీ నవ్వు
స్వచ్ఛత నీదా?
నీ దేహానిదా?
వానపువ్వులను పేర్చుకోకలా
ముసురు ముగియగానే రాలిపోతాయి
మట్టి వాసనై మిగులుతాయి
నిన్న కాంచిన నువ్వు
నీలోని నువ్వు
బయట తడుస్తున్న సముద్రకెరటంలా
లోనుండి విసిరికొట్టే శూన్యంలా
ఇక్కడ యిసుకగూళ్ళు కడుతున్నాయి నీ మునివేళ్ళు
కన్నీళ్ళు  ఊరుతూనే వున్నాయి
నువ్వేనా మళ్ళా…
*
15-tilak

మీ మాటలు

  1. Sharada Sivapurapu says:

    చాలా బాగుంది తిలక్. మెచ్చుకొడానికి పదాలు వెతుక్కొవాల్సి వస్తోంది. ఒక emotion మొదటీ నుంచి చివరివరకు carry చేసిన తీరు బాగుంది.

  2. Nisheedhi says:

    మీ కవిత్వం నాకు బాగా తెలిసిపోయింది అనుకున్నప్పుడల్లా మళ్లీ ఏదో కొత్తదనం . పదాలు ముడుచుకుపోతూ అంతలోనే పువ్వులై విచ్చుకుంటూ ప్రతిసారి వింతే . కుడోస్

Leave a Reply to Sharada Sivapurapu Cancel reply

*