ఒకపరి కొకపరి కొయ్యారమై..

అవినేని భాస్కర్ 

Avineni Bhaskarకొన్ని అనుభూతులు అనుభవించినకొద్ది ఆనందాన్నిస్తాయి. భార్య అలమేలుమంగని గుండెలపై పెట్టుకుని తిరుమల కొండపై నెలకొని ఉన్న వెంకన్న దర్శనం అలాంటిదే! మధురానుభూతిని కలిగించే దృశ్యం ఆ సౌందర్య మూర్తుల పొందు. ఎన్ని సార్లు చూసినా తనివి తీరనిది వారి ఒద్దిక. ప్రతిసారీ కొత్తగానూ, కిందటిసారికంటే దివ్యానుభవంగానూ అనిపిస్తుంది. వారి కీర్తినే జీవితకాలం పాడిన కవి అన్నమయ్యకి కొడుకుగా జన్మించిన పెదతిరుమలయ్యకి ఆ దర్శనం కొత్తకాదు. తేజోవంతమైన జేగదేకపతి-జలజముఖి అందాన్ని తన కీర్తనలో పెదతిరుమలయ్య ఎలా వర్ణిస్తున్నాడో వినండి.
అయ్యవారికెన్ని అలంకరణలు చేసినా అందాన్ని ఇచ్చేది మాత్రం ఆమెవల్లేనట! అదే ఈ కీర్తనలో దాగున్న భావం.

పల్లవి :

ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున గళలెల్లా మొలచినట్లుండె


చరణం ౧
జగదేకపతిమేన జల్లిన కర్పూరధూళి

జిగిగొని నలువంక జిందగాను

మొగి జంద్రముఖి నురమున నిలిపెగనక

పొగరువెన్నెల దీగబోసినట్లుండె


చరణం ౨
పొరి మెఱుగు జెక్కుల బూసిన తట్టుపుణుగు

కరగి యిరుదెసల గారగాను

కరిగమన విభుడు గనుక మోహమదము

తొరిగి సామజసిరి దొలికినట్లుండె


చరణం ౩
మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను

తఱచయిన సొమ్ములు ధరియించగా

మెఱుగుబోణి యలమేలుమంగయు దాను

మెఱుపుమేఘము గూడి మెఱసినట్లుండె

 


తాత్పర్యం

కళలన్నీ ముఖములో మొలకలెత్తినట్లు నిత్యం కొత్తకొత్త ఒయ్యారాలతో కనిపిస్తుందట పురుషోత్తముని ముఖం! (కారణమేమిటో చరణాల్లో వివరిస్తున్నారు పెదతిరుమలయ్య!)

అలంకరణకోసం దేవుడి ఒంటిపైన చల్లిన కర్పూరధూళీ కింద రాలుతుందట. ఆ తెల్లటి ధూళి వెలుతురు చిమ్ముతు నలువైపులా రాలుతు ఉందట. తెల్లటి ధూళి చిందితే వెలుతురు రావడం ఏంటా అంటారా? కారణం ఉంది. అమ్మవారు చంద్రముఖికదా? ఆమెను గుండెపైన అయ్యవారు పొదుముకున్నారుకదా? రాలే తెల్లటి కర్పూర ధూళి పొగరువెన్నెలలు కురిసినట్టు కనిపిస్తుందంటే అది ఆ చంద్రముఖి మహిమేనట!

భలేగా మెరిసిపోతున్న ఆయన బుగ్గలకు పూసిన మేలురకం పునుగు చెక్కిళ్ళనుండి కారుతుందట. రెండుపక్కలా కారుతువున్న ఆ పునుగు ఎలా ఉందంటే మదపుటేనుగు చెంపలపైన స్రవించే ద్రవంలా ఉందట. (మగ ఏనుగుకి మదమెక్కిన సమయాల్లో ఒంటిలో టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఎక్కువవ్వడంవల్ల కంటికీ చెవికీ మధ్యభాగంలో నీరు ఊరి స్రవిస్తుంది). మదపుటేనుగుతో పోల్చడం ఏంటి? అమ్మవారిని కరిగమన అని అంటాం కదా? అంటే ఏనుగువంటి ఒయ్యారమైన నడకగలది అని అర్థం. కాబట్టి స్వామివారిని కరిగమన విభుడు అన్నాడు కవి. దేవుడికి దేవిపైనున్న మోహాన్ని మదపుటేనుగు చంపలపైన ఒలికిపోతున్న ద్రవంతో పోల్చాడు కవి.

శ్రీవేంకటేశుడు బోలేడన్ని నగలు ఒంటిపైన ధరించుకుని, మెరిసిపోయే సొగుసుగల పద్మాసనితో(అలర్‌ మేల్‌ మంగై) కలిసి దర్శనమిచ్చే ఆ దృశ్యం ఎలా ఉందీ? మెఱుపు, మేఘము కలిసి మెఱినంత కాంతివంతంగా ఉందిట! (కారు మబ్బాయన రంగు, తళతళలాడే మెఱుపేమో ఆవిడ రంగు!)


ప్రతిపదార్థం :

ఒకపరి = ఒకసారి
ఒయ్యాం = అందం, సౌందర్యం

మేన = ఒంటిమీద
జల్లిన = చల్లిన
జిగికొని = వెలుగుతు, కాంతివంతమై
ఉరమున = గుండెలపైన, వక్షస్థలమున
పొగరు వెన్నెల = పూర్ణకాంతితో వెలుగుతున్న వెన్నెల, తట్టమైన వెన్నెల
దిగబోసినట్లు = కిందకి జారినట్టు, కురిసినట్టు

పొరిమెఱుగు =అత్యంతమెఱుగు
జెక్కుల/చెక్కుల = చెక్కిళ్ళు, బుగ్గలు
తట్టుపుణుగు = పునుగు (అలంకరణ పూసే వాసన ద్రవ్యం)
కరిగమన = ఏనుగులాంటి నడకగల
విభుడు = స్వామి, నాయకుడు

మదము = మదమెక్కిన ఏనుగుకళ్ళలో కారే నీరు
తొరిగి = కారు, స్రవించు
సామజసిరి = ఏనుగు
దొలికినట్లు = కారుతున్నట్టు

తఱచయిన = బోలెడన్ని
మెఱుగుబోణి = మెరిసేసొగసుగల యువతి

మీ మాటలు

  1. Lalitha P says:

    ‘పొగరు వెన్నెల’, ‘మెరుపూ మేఘము గూడి మెరసినట్టుండే’. చక్కటి ప్రయోగాల ఈ కీర్తనని మరోసారి కీర్తించారు. అభినందనలు. ఎవరు ఎన్నిసార్లు పాడినా ఇది ఎమ్మెస్ సుబ్బలక్ష్మికే పేటెంట్. గొప్ప ఉత్సవ సంరంభం ఉంటుంది ఆమె పాడిన ఈ కీర్తనలో.

  2. ధన్యవాదాలు లలిత గారు. ఎమ్ ఎస్ వర్షనే మొదట స్వరపరిచినదైయుంటుంది. తర్వాత నేదునూరివారు, బాలకృష్ణ ప్రసాద్ గారు, ఆ పైన రమేష్ నాయుడు గారు స్వరపరిచినా మీరన్నట్టు ఎమ్ ఎస్ వర్షనే పేటెంటెడ్ :-)

  3. చాలా బాగుంది మీ వివరణ. చదవటం చాలా ఆనందం వేసింది.

  4. DR.R.Suman Lata says:

    ముందు మీరు రాసిన వివరణ ,అటుపైనఎం .ఎస్..గాత్ర ధారణ రెండూ కలిసి ఎప్పటిలానే ఒకపరికొకపరి ఆనందమే ! రసానందం ,బ్రహ్మానంద సహొదరం ! సుమన్ లత

  5. నేను తరచు వినేపాట , బాల కృష్ణ ప్రసాద్ గారు పాడిందే ఇంతవరకు వింటున్నాను. ఎమెస్ గారు పాడినది వినడం ఇదే మొదటి సారి.

Leave a Reply to SriRam Cancel reply

*