మాటల రంగు వేరు…చేతల రంగు వేరు..!

డా .నీరజ అమరవాది

      neeraja  నీలాకాశంలో నల్లటి మబ్బుల మధ్య నిండు చందమామని చూపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే , నలుపూ , తెలుపుల కలనేత ఎంత బాగుందో అనిపించింది .

          పంతులుగారు నల్లబల్లమీద ముత్యాలలాంటి అక్షరాలతో బోధిస్తుంటే అజ్ఞాన తిమిరాలు తొలగి , విజ్ఞాన కిరణాలు సోకినట్లనిపించింది .

        తెల్లటి కాగితం పై నల్లటి అక్షరాలతో పరీక్ష రాస్తున్నప్పుడు నలుపంటే  విజయం అనుకున్నాను .

గురజాడని చదువుకున్న తర్వాత   మంచి చెడులు రెండె జాతులు ఎంచి చూడగ అని తెలుసుకున్నాను .

     21 వ శతాబ్దంలో నాయకుల అభిలాషలు సాకారం అయి కులాతీత , మతాతీత , వర్ణరహిత అంతర్జాతీయ సమాజంలో నివసిస్తున్నందుకు గర్వపడ్డాను .

        జాతివివక్షలు ఆనాడే తొలగిపోయాయి . నల్లజాతీయులు , తెల్లజాతీయులతో సోదరులలాగా కలసిమెలసి జీవిస్తున్నారని శ్వేతసౌధం సాక్షిగా నమ్మాను . మానవత్వమే నిజమైన జాతి అనుకున్నాను .

        ఐక్యరాజ్యసమితి సైతం అక్షరాస్యత , పేదరిక నిర్మూలనతో పాటు జాతి వివక్ష , జాత్యహంకార భావజాలాన్ని తుదముట్టించేందుకు నడుం బిగించి ఎజెండాలు తయారుచేసింది .

            నిరాడంబరమైన జీవితం , ఉన్నతమైన ఆలోచనలే మనిషిని మనీషి గా చేసే లక్షణం అంటూ జాతిపితలు సెలవిచ్చారు . వారి అడుగుజాడలే శిరోధార్యంగా , గాంధీ జయంతులను జరుపుకుంటూ , అహింసా సిద్ధాంతాలను మననం చేసుకుంటూ , గాంధీ టోపీలను పెట్టుకుంటూ , గాంధీ జోడును , కర్రను  స్వచ్ఛతకు , స్వేచ్ఛకు చిహ్నాలుగా అంతర్జాతీయ సమాజం భావిస్తూ , గౌరవిస్తోంది .

            ఇన్ని భావనల మధ్య పెద్దన్న సమక్షంలో  ఒక నల్ల జాతీయుడిని , శ్వేతజాతి పోలీసులు కేవలం కళ్లల్లో కళ్లు పెట్టి చూసినందుకు , అమానుషంగా , సంకెళ్లు బిగించి రఫ్ రైడ్ లతో పాశవికంగా ఈడ్చుకెళ్లి , వెన్ను విరగ్గొట్టి , ప్రాణాలను హరించి , మృగరాజులా మీసం దువ్వుకున్నారు . అధికారులు వంతపాడారు .

     రక్షకభటుల దుస్తులతో పాటు అంతరంగం కూడా నల్లనిదే అని శ్వేతజాతి పోలీసులు తమ చర్యలతో చెప్పకనే చెప్పినట్లు చూపారు .

        చర్మపు రంగు ఆధారంగా , సాటి సోదరుని పై జాత్యహంకార బలుపును  ప్రదర్శించిన భక్షక భటులను అందరూ ఉలిక్కిపడి చూస్తున్నారు . తమ అస్తిత్వాన్ని ప్రశ్నించుకుంటున్నారు .

            మనిషి ప్రవర్తన , ఆలోచనా విధానం చర్మపురంగుతో ముడిపడి ఉంటుందేమో అని పరిశోధనలు చేయాల్సిన సమయం వచ్చింది .

             మాటలలో ఒక రంగును , చేతలలో మరొక రంగును చూపే నాయకులారా ! ఇది రంగుల ప్రపంచం అని మళ్లీ మళ్లీ నిరూపించబడింది .

                                      *

 

 

మీ మాటలు

  1. దేవరకొండ says:

    వివక్ష ఈ నాటిది కాదు. వర్ణ వివక్ష కూడా ఈ నాటిది కాదు. పెద్దన్న గారి బీరువాలో కూడా బీరువా పట్టనన్ని కంకాళాలున్నయి. అయితే ఇలాంటివి జరిగినప్పుడల్లా ఉలిక్కి పడటం ఒక్కటే కాకుండా ఇలా ఏదో స్థాయిలో ప్రతిఘటనని ప్రకటిస్తూ ఉంటె ఎప్పటికైనా ఈ దుస్థితి మారే అవకాశం ఉన్నదని ఆశించడం ఒక్కటే ఆశావాదం అవుతుంది. డా. నీరజ అమరవాది గార్కి ఇందుకు మానవజాతి కృతజ్ఞతలు తెలుపుతోంది.

మీ మాటలు

*