పొరపాటు  

sani

రత్నమాల: ఒక వేశ్య

రత్నాంగి: ఆమె స్నేహితురాలు వేశ్య

మనోహరుడు: రత్నమాలను ప్రేమిస్తున్న విటుడు

 sani

 

రత్నమాల:   మనోహర్, నీతో నేనెంత గౌరవంగా వ్యవహరించానో మరిచిపోయావు. నిన్నెప్పుడూ డబ్బడగలేదు. లోపల వేరే విటుడున్నాడని చెప్పి నిన్ను వాకిట్లో నిలబెట్టలేదు. మిగతా వేశ్యల్లాగా మీ నాన్నను మోసగించో, మీ అమ్మను మభ్యపెట్టో డబ్బు తెచ్చి నాకు బట్టలు కొనమని కానుకలివ్వమని వేధించలేదు. అసలలాంటి పని నా కిష్టముండదు. నీ కోసం ఎంత గొప్ప విటుల్ని వదులుకున్నానో నీకు తెలుసు. ఆ బంగార్రాజు, అతనిప్పుడో పెద్ద వ్యాపారి, మరి బ్రహ్మాచారి, అతనో పెద్ద కంసాలి, ఇక నీ స్వంత మిత్రుడు కైలాసం వాళ్ళ నాన్న కైలాసానికి పోవడంతో ఇప్పుడతనే పెత్తనగాడు. వీళ్ళందరినీ తోసిపుచ్చి నువ్వే నువ్వే ఎప్పటికీ నా మన్మధుడి వనుకున్నాను. నా కళ్ళు నీ మీదే పెట్టుకున్నాను. మనం మొదటిసారి కలిసిన రోజు తర్వాత మరో మనిషిని నా పడకటిల్లు చొరనివ్వలేదు.

ఇంతకీ నేను పిచ్చిదాన్ని. నీ కల్లబొల్లి మాటల్ని నమ్మాను. మా అమ్మ నాకు చివాట్లు పెడుతూనే ఉంది. నా స్నేహితులందరితో మొత్తుకుంటూనే ఉంది. నా తెలివే గడ్డి మేసింది. నువ్వంటే పడి చస్తున్నాను కాబట్టి, పూర్తిగా నీ దాన్ని కాబట్టి నీకు లోకువై పోయాను. అందుకే నువ్విప్పుడు నా కళ్ళ ముందే కుప్పాయి ఒళ్ళు నిమురుతావు, నా పక్కన పడుకొని ఆ సితారు వాయించే చంపకాన్ని పొగుడుతావు. నువ్వు నన్ను బాధిస్తున్నావు. నువ్వు చేసే పనులకు నాకు ఏడుపొస్తోంది. కోపమొస్తోంది. మొన్న నువ్వు రాగిణి తోనూ రంజని తోనూ కలిసి తాగావు. వేణువు వాయించే వర్ధని, నా శత్రువు పంకజం అప్పుడక్కడే ఉన్నారు. రాగిణికి నువ్వు ఐదు ముద్దులు పెట్టావు. నేనేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే దాన్ని ముద్దు పెట్టుకోవడం నీకు అవమానం, నాకు కాదు. కానీ, మధుమతికి నువ్వు పంపిన పాడు సంకేతాల మాటేమిటి? నువ్వు వైను ఒక గుక్క తాగి ఆ గ్లాసును దానికి పంపావు. మధుమతి ఆ గ్లాసు తీసుకోడానికిష్టపడకపోతే, మరెవ్వరికీ ఇవ్వొద్దని గ్లాసందించే పనమ్మాయికి రహస్యంగా చెప్పావు. ఎక్కడో కూర్చొని ఉన్న రంజని చూసేలా యాపిల్ కొరికి, ఆ పండును మధుమతి ఒళ్లో పడేలా విసిరావు. ఆ సిగ్గులేని ముండ ఆ పండును ముద్దాడి జాకెట్లో రెంటి మధ్యా దాచుకుంది.

ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నేనేమన్నా నీపట్ల నిర్లక్ష్యంగా ఉన్నానా? పోనీ వేరే ఎవరినన్నా దొంగచూపులు చూశానా?  నీకోసం కాదా నేను బతుకుతోంది? (ఏడ్చింది) నీకిది న్యాయం కాదు మనోహర్! నిన్ను ప్రేమించటమే నాదురదృష్టమన్నట్టుగా నన్ను హింస పెడుతున్నావు. పైన దేవుడున్నాడు. అంతా చూస్తూనే ఉన్నాడు. ఎందుకూ, తొందర్లోనే నేనే నుయ్యో గొయ్యో చూసుకుంటాను. అప్పుడు నువ్వే ఏడుస్తావు. పెద్ద ఘనకార్యం చేస్తున్నానని మురుసుకోకు.

ఎందుకలా కోపంగా చూస్తూ పళ్ళు నూరతావు? నువ్వేమన్నా తిట్టాలనుకుంటే తిట్టు. రత్నాంగి న్యాయం చెప్తుంది. ఏమంటావ్? (మనోహర్ బైటికి వెళ్ళాడు) ఏంటలా మాట్లాడకుండా వెళ్లిపోతావ్? చూడు రత్నాంగీ ఎంత బాధ పెడుతున్నాడో?

రత్నాంగి:      మూర్ఖుడా, దాని కన్నీళ్ళు నిన్ను కదిలించట్లేదు. నువ్వు మనిషివి కాదు, రాతిబండవి. (రత్నమాలతో) అసలిందులో నీ తప్పు కూడా ఉందిలేవే! నువ్వతన్ని పాడు చేశావు. అతనికివ్వాల్సిన గౌరవానికి మించి ఇచ్చావు. ఊరికే తెలివి తక్కువగా ప్రేమించే ఆడవాళ్లంటే మగాళ్ళకి లెక్కుండదు. ఏడవకు. నామాట విను. అతని ముఖం మీదే తలుపు వేసెయ్యి. రాత్రంతా నీ గుమ్మం బయట బజార్లో జాగారం చేస్తే అప్పుడతనికి నీ మీద మోజు వద్దన్నా పుట్టుకొస్తుంది.

రత్నమాల:   ఇదా నువ్వు చెప్పే సలహా? నేను నా మనోహరుడి పట్ల అంత కఠినంగా ఉండలేను.

మనోహర్:     (లోపలికొస్తూ) ఇదిగో, రత్నాంగీ, నేను నీ స్నేహితురాలి కోసం రాలేదు. దీని మొహం ఇక చూడ దలుచుకోలేదు. నేను నీతో మాట్లాడదామని వచ్చాను. నీకు నాగురించి దురభిప్రాయం ఉండ కూడదు. నేను చెడ్డవాడినని నువ్వనుకోవద్దు.

రత్నాంగి:      ఇప్పుడే అలాంటి మాటేదో అన్నాను.

మనోహర్:     అంటే రత్నమాల వేరే వాళ్ళతో పడుకున్నా నేను నోరుమూసుకొని చూస్తూ ఊరుకోవాలా? మొన్న ఇది ఒక కుర్రాడిని పక్కనేసుకొని పడుకోవడం నేను కళ్ళారా చూశాను.

రత్నాంగి:      మనోహర్, తనొక వేశ్య. మగనాలు కాదు. విటులతో పక్క పంచుకోవడం తన వృత్తి. ఐనా, ఊరికే అడుగు తున్నాను. రత్నమాల పక్కలో కొత్త వ్యక్తిని నువ్వు చూసిందెప్పుడు?

మనోహర్:     దాదాపు ఐదు రోజుల క్రిందట. అవును, ఖచ్చితంగా ఐదు రోజుల క్రిందట. ఇవాళ ఏడో తేదీ, నేను చూసింది రెండో తేదీ నాడు. నేనీ కన్యారత్నాన్ని వలచానని తెలిసి మా నాన్న నన్ను గదిలో పెట్టి తాళం వేశాడు. బయటికి పోకుండా కాపలా పెట్టాడు. నేనొక స్నేహితుడి సాయంతో కిటికీలోంచి సులువుగా బయట పడ్డాను. అదంతా చెప్పి నిన్ను విసిగించను. మొత్తానికి తప్పించుకున్నాను. ఇక్కడికొచ్చాను. తలుపు మూసి ఉంది. నేను వచ్చింది అర్థరాత్రి. తలుపు కొట్టకుండా నిశ్శబ్దంగా గడి పైకెత్తాను. అది నాకలవాటే. చప్పుడు చెయ్య కుండా లోపలికొచ్చాను. చీకట్లో గోడను పట్టుకు నడుస్తూ రత్నమాల పడక మంచం దగ్గరకు చేరాను.

రత్నమాల:   ఏమంటున్నాడు? నాకు గుండె బరువెక్కుతోంది.

మనోహర్:     సరే, ఆమె పక్క దగ్గరకు చేరగానే ఆ చీకట్లో మంచం మీద ఇద్దరు ప్రశాంతంగా ఊపిరి తీస్తున్నట్టు గమ నించాను. ముందు రత్నమాల పక్కనున్నది దాసీ రత్తమ్మనుకున్నాను. చేత్తో తడిమి చూద్దును గదా, అది వృద్ధ స్త్రీ ముఖం కాదు. తలా ముఖమూ నున్నగా క్షౌరం చేయించుకున్న పురుషుడి ముఖం. ఆ కుర్రాడు రత్నమాల కాళ్ళ మధ్యలో సౌకర్యంగా పడక వేసినట్టు కనిపించింది. అసలు రత్నమాలే వాణ్ని కావలించు కొని పడుకొని ఉంది. సమయానికి చేతిలో కత్తి ఉంటే ఆ ఆటని అప్పుడే ముగించేవాడిని. నవ్వుతావెందుకు? నేనన్న దాంట్లో అంత వెటకార మేముంది?

రత్నమాల:   ఇదా నీ మనసును అంతగా గాయ పరచిన విషయం? పిచ్చి మనోహరూ, అప్పుడు నా కౌగిలిలో ఉన్నది ఎవరనుకుంటున్నావ్? రత్నాంగి.

రత్నాంగి:      (సిగ్గుపడుతూ) రత్నమాలా, దయచేసి అదంతా అతనితో చెప్పకు.

రత్నమాల:   ఇంతవరకూ వచ్చాక చెప్పకపోతే ఎలా? మనోహర్, నువ్వు చూసింది రత్నాంగినే! ఆరాత్రి నాతో పడుకోమని తనని నేనే అడిగాను. నువ్వు లేక దిగులుపడి, ఒంటరిగా పడుకోలేకపోయాను.

మనోహర్:     నిజమే అయ్యుండచ్చు. రత్నాంగి గుండుతో ఉన్న యువకుడు కదా! మరి ఐదారు రోజుల్లోనే జుట్టు అంత పొడవున ఎలా పెరిగిందో!

రత్నమాల:   లేదు మనోహర్, రత్నాంగికి ఈ మధ్య జబ్బు చేసి జుట్టు రాలిపోతే, గుండు గీయించుకుంది. రత్నాంగీ, మనోహర్ కి నీ తలకట్టు చూపించు. (రత్నాంగి విగ్గు తీసింది) వీడే నిన్ను అసూయకు గురిచేసిన నవ యువకుడు.

మనోహర్:     మరి నాకు అసూయ ఉండదా రత్నమాలా? అందుకు నన్ను తప్పు పడుతున్నావా? నేనేం చేసేది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆవిడ గుండును తడిమాను.

రత్నమాల:   సరే, ఇప్పుడు నీ సందేహం తీరింది గదా! ఇప్పుడిక కోపం చూపించటం నా వంతు.

మనోహర్:     వద్దు రత్నమాలా, కోపగించుకోకు. మనం అలా బయటికెళ్ళి ఏమైనా తాగొద్దాం పద. రత్నాంగీ, నువ్వు కూడా మాతోరా! మద్యనైవేద్యంలో నువ్వు కూడా ఉంటే బాగుంటుంది.

రత్నమాల:   వస్తుందిలే పద! ఒసే రత్నాంగీ, నవయువకుడా, నీ మూలాన నేనెంత నరకం చూశానే!

రత్నాంగి:      ఇప్పుడంతా సమసిపోయింది గదా! ఇక నామీద కోపం పెట్టుకోకు. అన్నట్టు, నా విగ్గును గురించి ఎవ్వరికీ చెప్పకు.

*

 

 

 

మీ మాటలు

 1. విజయ్ గజం says:

  చాలా బాగుందీ..

  • పిన్నమనేని మృత్యుంజయరావు says:

   ధన్యవాదాలు విజయ్ గారూ!

 2. P Mohan says:

  తమాషాగా ఉంది. ఈ సంభాషణల మూలాలను కూడా చెబితే బావుంటుంది. రంధ్రాన్వేషణ అని అనుకోకపోతే ఒక మాట. ఈ కథలో మనోహర్ ‘..నేనీ కన్యారత్నాన్ని వలచానని తెలిసి మా నాన్న నన్ను గదిలో పెట్టి తాళం వేశాడు.’ అని అన్నాడు. రత్నమాల ఇంకా కన్యేనా? అలాగే వైను, గ్లాసు, జాకెట్, యాపిల్ వంటి పదాల్లెకపోతే బావుంటుందేమో ఆలోచించండి.

  • పిన్నమనేని మృత్యుంజయరావు says:

   ఈ సంభాషణ మూలాలు గురించి మొదట్లోనే రాశాను మోహన్ గారూ! మైమ్స్ ఆఫ్ ది కోర్త్జాన్స్ దీనికి మూలం. కన్యారత్నం గురించి చెప్పాలంటే “ఇలాంటి సానుల్ని నూరు మందిని మీకు కన్యాదానం జేతునే” అంటాడు గిరీశం. మీరు చెప్పిన పదాలు కథ నడకకు అడ్డు పడినట్లుగానీ, కథ అందాన్ని చేరుపుతున్నట్లు గానీ నేననుకోలేదు.

మీ మాటలు

*