ఒక కురుక్షేత్ర సైనికుడి డైరీ

 సిద్ధార్థ గౌతమ్

Goutham

నా వయసు ఇరవై ఐదు. ఇది నా మొదటి యుధ్ధం. నేను పాండవ సైన్యం లో ఒకడిని. ఈ యుధ్ధం ముగిసాక బ్రతికి ఉంటానో లేదో తెలియదు. అందుకే ఇక బ్రతికిఉన్నన్నాళ్ళు రోజులో జరిగిన సంఘటనలు, విశేషాలు రాద్దామని నిర్ణయించుకున్నాను. ఇక్కడి వార్తలను నగరానికి మోసుకెళ్ళటానికి ఒక వేగు ఉన్నాడు. రాసిన పత్రాలుఅతనికిచ్చి నా భార్యకివ్వమని పంపుతాను. నాకొక నాలుగేళ్ళ కొడుకు. 

నిన్న ఉదయం చేరాము కురుక్షేత్రానికి. గుడారాలు వేసి, ఆయుధాలన్నీ లెక్క చూసుకుని, భద్రపరిచేసరికి సాయంత్రమయ్యింది. మా సైన్యాధిపతి మమ్మల్ని అంతా ఒకచోట నిలబెట్టి కొన్ని సూచనలు ఇచ్చాడు. మాకన్నా కౌరవ సైన్యం చాలా పెద్దది. నాకు భయం లేదు. మా వైపు కృష్ణుడున్నాడు.

అర్ధరాత్రి దాకా పాండవులు తమ గుడారం లో వ్యూహాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు తోచిన రెండు వ్యూహాలు మా సైన్యాధిపతికి చెప్పాను. ఆయన తనడాలు తో నా నెత్తిన ఒకటి మొట్టాడు.

కురుసైన్యం లో ఉన్న బంధువులనంతా చూసి అర్జునుడు చాలా బాధపడ్డాడు. వాళ్ళతో యుధ్ధం చేయనన్నాడు. నన్ను పిలిచి బట్టలు, ఆయుధాలు సర్దేయమన్నాడు.రథం లో ఉన్న కృష్ణపరమాత్ముడు కిందకి దిగారు. నన్ను అశ్వాలను చూస్తూ ఉండమని చెప్పి, అర్జునుడితో మాట్లాడారు. ఎన్నో మంచి మాటలు చెప్పారు. ధైర్యంగాఉండాలన్నారు. భయము, బాధ వీడమన్నారు. ఆ తరువాత ఏమి జరిగిందో ఏంటో, కొద్ది సేపు నాకు ఏమీ కనిపించలేదు, వినిపించలేదు. మూర్ఛపోయాననుకుంటా.తెలివి వచ్చేసరికి అర్జునుడు కృష్ణభగవానుడికి దండం పెడుతూ కనబడ్డాడు. మళ్ళీ యుధ్ధానికి సిధ్ధమయ్యారు.

నేను మా  గుడారానికి తిరిగివచ్చాక కృష్ణుడు చెప్పిన మంచి మాటల్లో గుర్తున్నవన్నీ రాసేసాను. గుడారం లో నాతో ఉన్న తోటి సైనికుడిని తనకి గుర్తున్నవిచెప్పమన్నాను. వాడు పాపం చివరి వరుసలో నిలబడటం వల్ల ఏమి వినబడలేదనుకుంటా. తనూ కాస్సేపు మూర్ఛపోయానని మాత్రం చెప్పాడు.

——

ఉదయం ఏమీ తినాలనిపించలేదు. పాలు తాగి బయలుదేరాను. సూర్యోదయానికి కొన్ని ఘడియల ముందు రణభూమికి చేరుకున్నాము.

రణభేరి మోగించటానికి ముందు ధర్మరాజుగారు తన ఆయుధాలన్నీ తీసి నేల మీద పెట్టారు. ఈయనకి కూడా అర్జునుడికి చెప్పిన మాటలు చెప్పాలేమో అని నేను కృష్ణుడివైపు చూసాను. ఆయన రథం మీదినుంచి దిగలేదు. ధర్మరాజు గారు కౌరవ సైన్యం వైపు నడుస్తూ వెళ్ళాడు. ఆయన ఎందుకిలా చేస్తున్నారో ఎవ్వరికీ అర్థమవ్వలేదు.బెదిరించటానికా? సంధి చేసుకోవటానికా? నేను కాస్త ముందుకెళ్ళి మా సైన్యాధికారి వీపు గోకాను.

“అయ్యా..ఇంతకీ యుధ్ధం ఉన్నట్టా లేనట్టా?” అనడిగాను. ఆయనతెలియదన్నట్టు తల అడ్డంగా ఊపి, వెళ్ళి నా స్థానం లో నన్ను నిలబడమన్నారు. ధర్మరాజు భీష్మ పితామహుడికి దండం పెట్టి, తనని ఆశీర్వదించమని ప్రార్థించాడు.భీష్మపితామహులు ఎంతో సంతోషించారు. పక్కనున్న ధుర్యోధనుడు “వద్దు..వద్దు” అని అరుస్తూ ఉంటే..రెండు చేతులతో చెవులు మూసుకుని..”విజయోస్తు” అనిధర్మరాజుని ఆశీర్వదించారు. ధుర్యోధనుడు గద పక్కన పెట్టి, తలపట్టుకు కూర్చున్నాడు. ధర్మరాజు తిరిగి మా వైపు వచ్చి తన ఆయుధాలు చేపట్టారు.

రాత్రంతా మత్తుగా పడుకున్న సూర్యభగవానుడు ఒళ్ళు విరుచుకుని మెల్లగా కళ్ళు తెరిచాడు. తన రాకకోసం ఎదురుచూస్తూ..చేతిలో కత్తులు, విల్లు లు పట్టుకుని యుధ్ధంచేయకుండా నిలబడి ఉన్న పాండవ, కౌరవ సైన్యాన్ని చూసి..గబగబా పైకి లేచాడు. యుధ్ధభేరి మోగింది.

మొదటి రోజు –

భీష్మ పితామహుడు ధర్మరాజుని ఆశీర్వదించినా, మొదటి రోజు మా సైన్యం లో చాలా మందిని చంపేసారు. నేను రోజంతా ఒక కురు సైనికుడితో పోరాడాను. నా చేతికి దెబ్బతగిలింది. నా కత్తి విరిగిపోయింది. నా కుడి పాదరక్ష చిరిగిపోయింది. సూర్యుడు అస్తమించగానే ఈ పూటకి యుధ్ధం ఆపేసాము.  విరాట రాజు పుత్రులిద్దరూ మొదటి రోజేపరమపదించారు. గుడారాలదగ్గరికెళ్ళి లెక్క చూసుకుంటే తేలింది – మొదటి రోజు మా వైపునున్న గొప్ప గొప్ప యోధులు ఎంతో మంది చనిపోయారు.

మాకుభయమేసింది. “అంతిమ విజయం మనదే..భయం వలదు.” అని కృష్ణభగవానుడు ధర్మరాజుతో అన్నారని ఒక సైనికుడు చెప్పాడు. హమ్మయ్య అనుకుని, వెళ్ళి స్నానంచేసి భోంచేసాను. బంగాళాదుంప కూర బాగుంది. పడుకునే ముందు మా సైనికాధికారి దగ్గరకెళ్ళి కొత్త కత్తి, పాదరక్షలు కావాలని చెప్పాను.

ఎందుకు కావాలో వివరంగారాసి ఇవ్వమన్నాడు. చేతికి ఒక పాత కత్తి ఇచ్చి..నాకు సరిపోయే పాదరక్షలు మూడు నుంచి ఐడు రోజుల్లోపు వస్తాయని చెప్పాడు. గాయపడిన ఒక సైనికుడి పాదరక్షలువాడుకొమ్మని చెప్పి నన్ను పంపించేసాడు. అలసిపోయాను. నిద్రొస్తోంది.

రెండవ రోజు –

రెండవ రోజు కాస్త ఆలస్యంగా లేచాను. స్నానం చేసి, ఏమీ తినకుండా రణరంగానికి పరిగెట్టాను. నా వైపు కోపంగా చూసాడు మా సైన్యాధిపతి. కౌరవులు చంపకపోతేఈయనే చంపేసేలా ఉన్నాడు. యుధ్ధభేరి మోగించేవాడు దాన్ని మోగించాడు. అది మోగింది. నేను ఎవరితో యుధ్ధం చేయాలా అని వెదుకుతున్న సమయంలో నాపక్కనుంచి కృష్ణభగవానుడు నడుపుతున్న రథం వాయువేగంతో ముందుకురికింది. అర్జునుడు భీష్మపితామహుడితో తలపడటానికి నిర్ణయించుకున్నట్టున్నాడు.వారిరువురి మధ్యనా హోరాహోరీగా యుధ్ధం జరిగింది. మరో వైపు ద్రోణాచార్యులు, ధృష్టద్యుమ్నుడు పోరాడుతున్నారు. నిన్న నాతో కత్తియుధ్ధం చేసిన వాడు నన్నువెదుక్కుంటూ వచ్చాడు. తుమ్ముతూ ఉన్నాడు. ఏమయ్యిందని అడిగాను. రాత్రి గుడారాల బయట పడుకోవటం వల్ల జలుబు చేసిందన్నాడు.

సూర్యాస్తమయం తరువాత నా దగ్గర ఉన్న ఔషధం ఇస్తానని చెప్పి, నా కత్తితో వాడి కత్తిని బలంగా కొట్టాను. ఇద్దరం యుధ్ధం మొదలుపెట్టాము. కాని మా కళ్ళు, మనసు పెద్ద వాళ్ళ మధ్యజరుగుతున్న పోరు మీదనే ఉన్నాయి. ద్రోణాచార్యుల వారు ధృష్టద్యుమ్నుడిని హతమారుస్తారేమో అనుకుంటున్న తరుణంలో భీమసేనుడు వచ్చి రక్షించాడు. అది చూసినదుర్యోధనుడు భీముడి మీద యుధ్ధం చేయమని కళింగులని పంపాడు. నాకు కోపమొచ్చింది.

నాతో పోరాడుతున్న కౌరవ సైనికుడితో “నువ్వు కాస్సేపలా కూర్చునివిశ్రాంతి తీసుకో. నేను వెళ్ళి కళింగులని తరిమి కొట్టి వస్తాను..” అని అటు కదిలాను. నాకు ఆ అవకాశం ఇవ్వలేదు భీమసేనుడు. తన మీదకి వచ్చిన కళింగులని మట్టికరిపించాడు. భీష్మ పితామహులు వచ్చి తన శక్తియుక్తులను ఉపయోగించి ఆ మిగిలిన కళింగులని కాపాడారు. భీముడి కి తోడుగా ఉన్న  సాత్యకి భీష్ముడి రథసారధినిచంపేసాడు. సారధి లేని అశ్వాలు భీష్ముడిని యుధ్ధ రంగం వెలుపలకి తీసుకెళ్ళాయి.

రెండవ రోజు ముగిసేసరికి కౌరవ సైన్యం లో చాలా మంది హతులయ్యారు. నాతోయుధ్ధం చేస్తున్నవాడు ఇంకా తుమ్ముతూనే ఉన్నాడు.

రాత్రి అందరూ పడుకున్న తరువాత ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళి ఔషధం ఇచ్చి వచ్చాను. అది ఎక్కువగా తాగితేనిద్ర వస్తుందని హెచ్చరించి వచ్చాను.

(సశేషం)  

మీ మాటలు

 1. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  ఈ ప్రయత్నం చాలా బాగుంది. పౌరాణిక కథను సామాన్యుడి దృష్టితో చూసే ప్రయత్నం కొత్తగా ఉంది.”నా కుడి పాదరక్ష చిరిగిపోయింది.మా సైనికాధికారి దగ్గరకెళ్ళి కొత్త కత్తి, పాదరక్షలు కావాలని చెప్పాను.గాయపడిన ఒక సైనికుడి పాదరక్షలువాడుకొమ్మని చెప్పి నన్ను పంపించేసాడు.” “నిన్న నాతో కత్తియుధ్ధం చేసిన వాడు నన్నువెదుక్కుంటూ వచ్చాడు. తుమ్ముతూ ఉన్నాడు. ఏమయ్యిందని అడిగాను. రాత్రి గుడారాల బయట పడుకోవటం వల్ల జలుబు చేసిందన్నాడు. సూర్యాస్తమయం తరువాత నా దగ్గర ఉన్న ఔషధం ఇస్తానని చెప్పి, నా కత్తితో వాడి కత్తిని బలంగా కొట్టాను. ఇద్దరం యుధ్ధం మొదలుపెట్టాము.” ఈ వాక్యాలు యుద్ధరంగం గురించి సహజమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

 2. దేవరకొండ says:

  ఇలాంటి వినూత్న రచనల్లో పట్టుకోవలసిన శిల్ప పరమైన విశేషాలకోసమ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా! చాలా ఆసక్తికరమైన ఆరంభం!

 3. Nice idea.
  But please do more research and get it reviewed by some folks before publishing then it it will attract both pandita and paamara.
  Bangala dumpa is recent addition to India in 16th century. Also the army must carry their own weapons unlike current army the government doesn’t give individual weapons. You bring your own knife. And they may not be wearing any chappal. Chappal and shoe are costly and limited to rich. BTW even now there are many who come to school without chappal even in hot summer.

 4. కుర్క్షేత్రం లో దినకర్ అనుభవాలు బాగున్నాయి . మరి మీవి ??

 5. rajeswari says:

  Sir,
  Bagundi,kottha idea.

 6. Venugopal Rao Gummadidala says:

  ప్రయత్నం చాలా బాగుంది. చాలా రచనలు పెద్ద పెద్ద యోధుల గురించి, వారి చేతలను వర్ణించేవే అయితే ఇది దానికి భిన్నంగా సామాన్య సైనికుని దృష్టిలో ఆ యుద్ధం ఎటువంటి ప్రకంపనాలని సృష్టించింది తెలిపేటట్లు గా వుంది.

 7. ప్రయత్నం చాలా బాగుంది. మహాభారత యుద్ధాన్ని ఒక సామాన్య సైనికుడి ద్రిస్టి కోణం నుంచి చెప్పటం బాగుంది.ఇంకా రీసెర్చ్ చేసి విపులంగా ఖచితమైన వివరాలు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను.

 8. SRMUSUNURI says:

  మంచి భావన. సైనికుడి దృక్కోణంలో యుద్ధ వర్ణన. అందులోను -రాత్రి అందరూ పడుకున్న తరువాత ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళి ఔషధం ఇచ్చి వచ్చాను. అది ఎక్కువగా తాగితేనిద్ర వస్తుందని హెచ్చరించి వచ్చాను. ఈ వాక్యంలో బాధ్యత నిర్వర్తిస్తున్న మానవతావాదిగా సైనికుడిని చూపడం బావుంది -తడుపరికై ఎదురు చూస్తూ

 9. కధ బాగుంది మిగతా కధ కొనసాగించండి…

 10. ఆర్.దమయంతి. says:

  :-)
  ఇంకా శ్రద్ధ వుంచండి. – సమాచార సేకరణ, పాత్రల స్వభావాల ప్రొజెక్షన్ పట్ల మరి మరి ద్రష్టి పెట్టండి.
  శైలి బావుంది కాబట్టి, నవల అయ్యాక, బెస్ట్ సెల్లర్ బుక్ ఇదే అవుతుంది. సందేహం లేదు.
  శుభాభినన్దనలతో..

 11. Srinivasa Chamarty says:

  “చాలా బాగుంది సార్… యుద్ధం మా పక్కింట్లోనో, ఎదురింట్లోనో జరిగినట్టు సహజత్వానికి దగ్గరగా ఉంది… కృష్ణుడు, ధర్మరాజు కూడా పాత్రలకు అతుక్కుపోయారు…మీ narration నన్ను కడుపుబ్బ నవ్వించింది”

మీ మాటలు

*