వసంత ఋతువు అక్కడే కనబడింది! 

శివరామకృష్ణ

sivaramakrishna    ఎన్నో యేళ్ళనించీ వాయిదా పడుతున్న గురువాయూరు యాత్ర మా పిల్లల చొరవ వల్ల ఇటీవల సాధ్యపడింది.  ఎప్పుడో, నేను ఉద్యోగంలో చేరినప్పుడు కొన్నాళ్ళు మంగళూరులో పనిచేశాను. అప్పుడు కేరళ రాష్ట్రాన్నీ, పశ్చిమ కన్నడ ప్రదేశాన్నీ చక్కగా చూశాను. ఇదిగో మళ్ళీ ఇప్పుడు.

అసలు కేరళ అంటేనే నాకు పూనకం వస్తుంది. ఎందుకంటే అది దేవభూమి. God’s own country అంటారు కదా దీన్ని! పరశురాముడు ఈ సీమని సముద్రంలోంచి తన గండ్రగొడ్డలితో బయటికి లాగాడట.  చాలా కాలం అక్కడే ఉన్నాట్ట కూడా! దట్టమైన అరణ్యాలూ, చిన్న చిన్న నదులూ, ఆ నదులనే తలపిస్తూ సముద్రం వరకూ సాగే కాలువలూ, ఉప్పునీటి కయ్యలూ, మన కోనసీమ తలదన్నే విస్తారమైన కొబ్బరితోటలూ, ఎక్కడ చూసినా విరగకాచి ఉన్న పొడవైన పనస, మామిడి చెట్లూ (వాటి కాలం లో నన్నమాట), మండువేసవిలో కూడా చలిపుట్టించే కొండవసతులూ(hill resorts), అందమైన సాగరతీరం అన్నీ ఈ రాష్ట్రపు ప్రత్యేకతలు. ఇవేకాక, కొండవాలుల్లో పరచుకొని ఉన్న టీ తోటలూ, సుగంధద్రవ్యాల చెట్లూ కేరళ స్వంతం. గురువాయూరులోని శ్రీకృష్ణ దేవాలయం, తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి మందిరం, అయ్యప్ప వెలసిన శబరిమల, అనేక పెద్దపెద్ద చెర్చిలు, మశీదులూ ఉన్న ప్రదేశం కూడానూ కేరళ.

హైదరాబాదు నించి కొచ్చిన్‌ చేరి, అక్కడి నించి రోడ్డు మార్గం ద్వారా గురువాయూరు చేరాము. దారి పొడుగునా కన్నులవిందైన ప్రకృతి! పచ్చటి చెట్లూ, కొబ్బరితోటలూ, కాలువలూ మైమరపిస్తాయి.  రైల్లో ఐతే త్రిచూర్లో దిగి అక్కడినించి 30 కి. మీ. బస్సులోకాని, టాక్సీలో కాని వెళ్ళొచ్చు. గురువాయూరులో చిన్న రైల్వే స్టేషన్‌ కూడా ఉంది.

Sri Krishna the Lord of Guruvayoor (1)

ఇక్కడి దైవం నారాయణుడు. ఆయన్నే బాలకృష్ణుడుగా భావించి కొలుస్తారు. ఎందుకంటే దేవకీవసుదేవులకు శ్రీకృష్ణావతార సమయంలో నారాయణుడు దర్శనమిచ్చిన చతుర్భుజ స్వరూపం లోనే ఇక్కడి విగ్రహం ఉంటుంది. మూడడుగుల ఎత్తుకూడా ఉండదేమో ఆ మూర్తి. కానీ లోకోత్తరమైన ఆ సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేము. నాలుగుచేతుల ఆ నల్లనయ్యను వెనుకచేతులు కనబడకుండా పూలమాలలు అమర్చి, ఒక చేత వెన్నముద్ద, మరోచేత వేణువు పట్టిన బాలకృష్ణుడిగా అలంకరించి చూపిస్తారు సాధారణం గా! ఊదయాన్నే ఉష:కాలపూజా సమయం లో అసలు రూపాన్ని చూడవచ్చు. భక్తసులభుడనీ, సంతానప్రదాత అనీ ఆయనకు పేరుంది. ఆయన లీలలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి.  ఈ ఆలయం లో దర్శనానికి అందరికీ ఒకటే క్యూ! మన రాష్ట్రంలోలాగా వీఐపీలు, వీవీఐపీలూ అంటూ తేడాలు లేవు ఈ స్వామికి. అందరికీ ఉచితం గా కన్నులవిందైన దర్శనం దొరుకుతుంది. సాయంకాలం సూర్యాస్తమయం అవగానే ఆలయ ప్రాంగణం అంతా నూనె దీపాలతో దివ్యకాంతులతో వెలిగిపోతుంది.  ప్రమిదల్లో వెలిగే నూనె దీపాల కాంతికి ఒక అనంతత్వం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ అనంతత్వం లోనే ఏకాకృతిగా వెలిగే దైవత్వం గోచరిస్తుంది. అందుకేనేమో ‘ దీపం జ్యోతి: పరబ్రహ్మ ‘ అన్నారు.

 

గురువాయూరులో ఉండడానికి మంచి హోటెళ్ళు ఉన్నాయి, ఇవేగాక దేవస్థానం వారి సత్రాలు కూడా ఉన్నాయి.  మేము దిగిన హోటల్ కి ఎదురుగా కొన్ని ఇళ్ళున్నాయి. ముందుభాగమంతా చక్కటి గార్డెన్లు పెంచుకున్నారు. లోపలెక్కడో ఇళ్ళున్నాయి. పనస, మామిడి, అరటి, కొబ్బరి, పోక చెట్లూ, మధమధ్య పూలమొక్కలూ, ఉదయాన్నే ఆ చెట్లమీద నించి మేలుకొలుపు పాటల్లాంటి కోయిలమ్మల స్వరసమ్మేళనాలూను! మన ప్రాంతాల్లో కనపడకుండా పోయిన వసంతశోభ అంతా ఇక్కడ కనపడింది! ఆ ఇళ్ళ యజమానులు ఉన్నారో లేరో కాని, చెట్లనిండా గుత్తులు గుత్తులుగా మామిడికాయలూ, పనసపళ్ళూను! చిలకలు కొరికిన మామిడికాయలు-అప్పుడే పళ్ళుగా మారుతున్నవి-రాలిపడుతూనే ఉన్నాయి. అడగకుండానే అమృతఫలాలిచ్చే చెట్ల జన్మలు ఎంత  ధన్యమైనవి!

రెండురోజులు గురువాయూరులో గడిపి అక్కడినించి మున్నార్ బయలుదేరాం.  మున్నార్ చాలా అందమైన వేసవి విడిది.  మండువేసవిలో కూడా చాలా చల్లగా ఉండేప్రదేశం. తేయాకుతోటలకు ప్రసిధ్ధి. ఈ ప్రయాణం లోనే నాకు అనుకోకుండా దొరికిన భాగ్యం కాలడి సందర్శనం.  హైందవధర్మానికి జయకేతనాన్నెగురవేసిన  ఆదిశంకరుల జన్మస్థలం.  కొచ్చిన్‌ విమానాశ్రయానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం లోనే ఉంది కాలడి.  ఈ విషయం నాకు అంతవరకూ తెలియదు! కాలడిలో శృంగేరి శంకరమఠం వారు ఆదిశంకరులకూ, శారదామాతకూ ఆలయం నిర్మించారు.  ఆదిశంకరుల మాతృమూర్తి ఆర్యాంబగారి సమాధి కూడా అక్కడే చూడవచ్చు.  శంకరులు సన్యసించడానికి నిమిత్తమాత్రమైన మొసలి, ఆయన కాలిని పట్టుకున్న ప్రదేశాన్ని కూడా పూర్ణానది ఒడ్డున గుర్తించవచ్చు.  ఈ పూర్ణానదినే ఇప్పుడు పెరియార్ నది అని పిలుస్తున్నారు. ఈ నదిని కేరళ రాష్ట్రానికి ఆనందదాయిని అంటారు. దీనిపై ఎన్నో ప్రోజెక్టులు కట్టారు. పక్కనేఉన్న తమిళనాడుకీ కేరళకీ నడుమ ఈ ప్రోజెక్టులపైనే వివాదాలున్నాయి.

 

Munnar

కాలడి నించి మళ్ళీ బయలుదేరి దారిలోనున్న అందమైన ప్రకృతినిని తనివితీరా చూస్తూ, రోడ్డుకి ఆనుకొని ప్రతీ రెండు మూడు కిలోమీటర్లకీ ఒకటిగా ఉన్న గ్రామాలను దాటుకొని కొత్తమంగళం అనే చిన్న పట్టణాన్ని చేరాం. ఈ వూరి వింత అక్కడున్న ఫర్నిచరు దుకాణాలు. ఊరి పొడుగు సుమారు రెండు కిలోమీటరులుంటే, ఆ రెండు కిలోమీటర్లూ రోడ్డుకి రెండువైపులా ఈ దుకాణాలే! ఊరు మాత్రం ఈ రోడ్డు పొడుగంతే ఉంది. భలే కొత్తకొత్త డిజైన్లలో ఆని రకాల ఫర్నిచరు సామాన్లూ ఉన్నాయి. మా డ్రైవరు ప్రదీప్   కేరళ రాష్ట్రం అన్నిప్రాంతాలనించీ వచ్చి ఇక్కడ ఫర్నిచర్ కొనుక్కుంటారని చెప్పాడు.  చుట్టుపక్కలి అడవుల్లో దొరికే మంచి కలపతో వీటిని చేస్తారట. తరువాత ఆడిమలి అనేచోట మధ్యాహ్న భోజనాలు కానిచ్చి మున్నారుకు చేరువయ్యాం. ఆడిమలి దాటాకా రోడ్డుకి ఇరువైపులా స్పైస్ గార్డెన్‌లు కనబడ్డాయి. వాటిని చూడ్డానికి మనిషికి వంద రూపాయలు టిక్కెట్టు. మనం రోజూ వాడే సుగంధ ద్రవ్యాల  మొక్కలూ, చెట్లూ అన్నీ అక్కడున్నాయి. లవంగం, యాలకులు, జాజికాయ-జాపత్రి, దాల్చినచెక్క (దీని ఆకులే బిర్యానీలో వాడే ఆకులు) మొదలైనవన్నీ ఉన్నాయి. ఇంకా కాఫీ, రబ్బరు చెట్ల వంటివీ ఉన్నాయి. స్ట్రాబెర్రీలు, కోకో కూడా పండిస్తున్నారక్కడ.   మాకు వీటిని చూపించిన గైడు ఆశా మీనన్‌ అనే మళయాళీ అమ్మాయి గడగడా తెలుగు – మళయాళీయాసలో – మట్లాడేస్తుంటే ముచ్చటేసింది. గైడువృత్తికాబట్టి, అన్ని భాషలవారికీ అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి నేర్చుకున్నానంది.

ఇక అక్కడినించి బయలుదేరాకా ప్రకృతి సౌందర్యంవిశ్వరూపంచూపడంమొదలయింది. కొండలూ, వాటి లోయలూ, లోయల అడుగున మైదానాలూ, వాటిలో ఏవేవో చిన్న చిన్న గ్రామాలూ, అక్కడక్కడ సెలయేళ్ళూ, ఇవన్నీ చాలవన్నట్టు కొండవాలుల్లో టీ తోటలూ!  కొన్ని చోట్ల అసలు కొండే కనబడకుండా పచ్చటి టీ మొక్కలు వరసలు వరసలుగా పెంచారు-ఆకుపచ్చటి తివాచీలు పరిచినట్టు! మధ్య మధ్యలో పాపం పిల్లమొక్కలకి ఎండసోకకుండా మేమున్నాం అన్నట్టున్న వెండిగొడుల్లాంటి సిల్వర్ ఓక్ చెట్లు! ఈ సిల్వర్ ఓక్ లను రోడ్డు మీదనించి చూస్తూ ఉంటే కొండవాలుల్లో అంతా తెల్లటి పొగమేఘాలు కమ్ముకున్నాయా అన్నట్టున్నాయి. సిల్వర్ ఓక్ కలపతో ఫర్నిచర్ తయారు చేస్తారు.  ఒక చోట ఒక పుష్పవనం ఉంది. రకరకాల పూలమొక్కలు పెంచారు.  దాని అందం చూడవలసిందే!  వసంతవాటిక లంటే ఇవేకదా అనిపించింది. గులాబీలు, రంగురంగుల మందారాలూ, డైసీలూ, చామంతులూ , వయొలెట్లూ, ఐరిస్ జాతులూ అన్నీ ఉన్నాయి అక్కడ. Land lotus పేరు విన్నాను కాని ఇక్కడ చూసాను దాన్ని.

Land lotus

అక్కడినించి బయలుదేరి మున్నారు చేరాము.  హోటల్ రూము లో సామాన్లు పెట్టుకుని, రెఫ్రెష్ అయి, అక్కడికి సమీపం లో ఉన్న ఏనుగుల పార్కుకి వెళ్ళాము.  వంద రూపాయలిస్తే గజారోహణం చేయిస్తున్నారు.  ఇదివరలో మహానుభావులను గజారోహణ సన్మానం తో గౌరవించేవారు. ఇప్పుడు వందరూపాయలకే స్వీయసన్మానం చేసుకోవచ్చన్నమాట! అక్కడి పార్కులు వగైరాలు చూసుకొని చీకటిపడ్డాక రూముకి చేరాం.  చలి కొరికేస్తోంది.  రూములో ఏసీ ఉందేమో, ఆపేద్దామని చూస్తే కనబడలేదు. ఓహో, హిల్ స్టేషన్‌ కదా, ఇక్కడ అవి ఉండవని గుర్తుతెచ్చుకున్నాం.  కాలు కిందపెడితే జివ్వుమనేలా ఉంది. అందుకే రూమంతా తివాచీ పరచి ఉంది.

మరునాడు ఉదయమే లేచి చూసేసరికి కిటికీ అద్దాలన్నీ మంచుతో నిండిపోయిఉన్నాయి. మళ్ళీ బయలుదేరి టీతోటలన్నీ తిరిగి చూసాం.  మున్నార్ కి సమీపం లో ‘మట్టుపెట్టి’ డాము ఉంది.  మేము దాన్ని ‘మట్టుపట్టి’ అని అంటువుంటే మా డ్రైవరు మట్టుపెట్టి అనాలి, మళయాళం లో పట్టి అంటే కుక్క అన్నాడు.  మట్టుపెట్టి అంటే మా తెలుగులో అర్థం భయంకరంగా ఉంటుంది లేవయ్యా అన్నాను. పేరెలాఉన్నా, అది చాలా అందమైన ప్రదేశం. దానికి దగ్గరలోనే Echo Point అని ఒకటిఉంది. అక్కడి నది ఒడ్డున నిలబడి అరిచినా, చప్పట్లుకొట్టినా ఆ శబ్దం చుట్టూఉన్న కొండల్లో ప్రతిధ్వనించి మనకు వినబడుతుంది.  అరవడానికి ఐదు రూపాయలు టిక్కెట్టు కూడా ఉంది! ఆ నదిలో నౌకావిహారానికి కూడా ఏర్పాటు ఉంది-పెడల్ బోట్లున్నాయి. అక్కడి నించి బయలుదేరి కానన్‌దేవి హిల్స్ మీదుగా ప్రకృతిసౌందర్యాలను ఆస్వాదిస్తూ కొత్తమంగళం మీదుగా తిరిగి కాలడి వీధుల్లో ప్రయాణించి కొచ్చిన్‌ చేరుకున్నాము. అక్కడినించి మళ్ళీ హైదరాబాద్‌ షంషాబాదు!  చూసి, ఆస్వాదించిన సౌందర్యమంతా ఇంకా స్మృతిపథంలోనే విహరిస్తోంది.  ఈ అందాన్ని మించిన గురువాయూరు కృష్ణుడి అందం స్థిరంగా హృదయం లో నాటుకుపోయింది!

Silver oak

అసలు కేరళరాష్ట్రమంతా ప్రకృతిసౌందర్యాలకు ఆలవాలమే! కుమరకోమ్‌ (కుమరగొమ్‌ అంటారు స్థానికులు) లో నౌకాగృహాల్లో ఉప్పునీటికాలువల్లో (backwaters) విహారం, కొచ్చిన్‌ నగరంలో మరైన్‌డ్రైవ్‌, హార్బరు, బేకాల్‌, కోవలం, త్రిచూర్ సమీపం లోని చవక్కాడ్‌ బీచిలూ, తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి ఆలయం, శబరిమల అన్నీ అద్భుతమైనవే! అష్టముడి లో పడవల పోటీలు జగద్విఖ్యాతిమైనవి. ఇక్కడ చెప్పుకోదగ్గది ప్రజల మతసహనం. హిందువులూ, మహమ్మదీయులూ, క్రైస్తవులూ అందరూ సమపాళ్ళలోనే ఉన్నట్టుంది ఇక్కడ. ఎప్పుడూ ఎలాంటి మతకలహాలూ జరిగినట్టు వినలేదు.  మన ఆలయాలను మించిపోయేలా ఉన్నాయి ఇక్కడి చర్చిలు. ఇక్కడి చర్చిల్లో చాలావాటిలో మన ఆలయాల్లోలాగే ధ్వజస్థంభాలుండడం విచిత్రంగా తోచింది నాకు.

కష్టపడి పనిచెయ్యడం ఎలాగో తెలిసిన వారు కేరళీయులు. మనదేశంలోనే కాదు, ప్రపంచం లో ఏ మూల చూసినా కనీసం ఒక్కడైనా ఈ ప్రదేశానికి చెందిన వ్యక్తి ఉంటాడు.  నేను చూసిన దాన్నిబట్టి చెప్పాలంటే, ఇక్కడి ప్రజలు అత్యధికభాగం ధనసంపన్నులు. కుటుంబానికి ఒకరైనా విదేశాల్లో ఉండి సంపాదించేవారే! ఎక్కువమంది మధ్యప్రాచ్య దేశాల్లో (Gulf countries) ఉన్నారు.  అందుకే అక్కడి గ్రామాలూ పట్టణాలూ చక్కటి ఇళ్ళతోనూ, విశాలమైన రోడ్లతోనూ చూడముచ్చటగా ఉన్నాయి. విద్యావంతులు అత్యధికంగా ఉన్నరాష్ట్రం కాబట్టి సంపాదించిన ధనాన్ని తమ ఇళ్ళనూ, ఊళ్ళనూ, రాష్ట్రాన్నీ అభివృధ్ధిపథం లో నడుపుకోడానికి సక్రమ పధ్ధతిలో ఉపయోగించుకుంటున్నారు.

***

మీ మాటలు

  1. Mythili abbaraju says:

    ‘ కొండ వసతులు…భలే అన్నారండి …మళ్ళీ కేరళ వెళ్లి వచ్చాను చదువుకుని, ధన్యవాదాలు !

  2. కళ్ళకి కట్టినట్లు చక్కగా వర్ణించారు సర్. ధన్యవాదాలు

  3. ఆర్.దమయంతి. says:

    చాలా చాలా బావుంది సార్ మీ రచన.
    వైనాడ్ వెళ్ళినప్పుడు చూసాను కదా.. ఆ సౌందర్యానికి నేనూ బానిసైపోయాను.
    :-)
    అభినందనలతో..

  4. Simple and superb Sir :)

  5. సువర్చల చింతలచెరువు says:

    “సాయంకాలం సూర్యాస్తమయం అవగానే ఆలయ ప్రాంగణం అంతా నూనె దీపాలతో దివ్యకాంతులతో వెలిగిపోతుంది. ప్రమిదల్లో వెలిగే నూనె దీపాల కాంతికి ఒక అనంతత్వం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ అనంతత్వం లోనే ఏకాకృతిగా వెలిగే దైవత్వం గోచరిస్తుంది”…….
    నా మనసుకు కాంతినిచ్చిన భావాలు!!
    “అడగకుండానే అమృతఫలాలిచ్చే చెట్ల జన్మలు ఎంత ధన్యమైనవి!”……..
    చెట్ల జన్మలు కాదండీ..మన జన్మలు ధన్యమైనవి వాటికి తోటిప్రాణులుగా ఉండటంవల్ల!
    “ప్రకృతి సౌందర్యంవిశ్వరూపంచూపడంమొదలయింది.”…….
    నిజం! కనిపించని అనంత విశ్వం ఒకటైతే..కనిపించినా తెలియని అద్భుత విశ్వం ఎంతో ఉందిగా!
    “ఇదివరలో మహానుభావులను గజారోహణ సన్మానం తో గౌరవించేవారు. ఇప్పుడు వందరూపాయలకే స్వీయసన్మానం చేసుకోవచ్చన్నమాట!”…………
    మీ సెన్సాఫ్ హ్యూమర్ ఆహ్లాదం!
    “ఈ అందాన్ని మించిన గురువాయూరు కృష్ణుడి అందం స్థిరంగా హృదయం లో నాటుకుపోయింది!”……..
    ఇది సత్యం శివం సుందరం!
    ” ఇక్కడి చర్చిల్లో చాలావాటిలో మన ఆలయాల్లోలాగే ధ్వజస్థంభాలుండడం విచిత్రంగా తోచింది నాకు.”…….
    విచిత్రమేకాదు సర్వమానవ సౌభ్రాతృత్వం!!

  6. హైదరాబాద్ నుంచి కార్లో సకుటుంబంగా మున్నార్ వెళ్ళి, కొండ వసతిలో బస చేసి, గుండె నింపుకున్న అనుభూతులన్నీ గుర్తొచ్చాయి! లాండ్ లోటస్ ఫొటో చాలా బావుంది. ఎపుడూ చూడలేదు. ‘కొండవాలుల్లో అంతా తెల్లటి పొగమేఘాలు కమ్ముకున్నాయా అన్నట్టుంది’ సిల్వర్ ఓక్స్ గురించి రాసిన పోలిక చాలా బావుంది.

Leave a Reply to Mythili abbaraju Cancel reply

*