రాజకీయమా.. నీకెన్ని రూపులో!

భువనచంద్ర

 

bhuvanachandra (5)“శివమూర్తిగారి పరిస్థితి బాగోలేదట.” ప్రొడక్షన్ బాయ్ నారాయణ మేనేజర్ కృష్ణమూర్తిగారితో అన్నాడు. పేరుకి బాయ్ అంటారుగానీ నారాయణకి ఏభై రెండేళ్లు. ‘మంచితనం’ తప్ప చదువు లేదు. ఏ పని వప్పగించినా పెర్‌ఫెక్టుగా చేస్తాడు. భాగాహారాలు, హెచ్చవేతలూ రావుగానీ ,కూడికలూ తీసివేతలూ ‘మనసు’ కాగితం మీదే ఒక్క తప్పు లేకుండా చెయ్యగలడు. అందుకే ఇండస్ట్రీలో నారాయణ అంటే అందరికీ గౌరవమే.

ఈ మధ్యే పాతనీరు కొట్టుకుపోయి కొత్తనీరు వచ్చింది. ఉచ్చనీచాలు మరచిన యువత ఎంటర్ అయింది. వాళ్లకి తెలిసింది కొద్ది…’తెలుసు’ అనుకున్నది హెచ్చు. దాంతో ఎవరన్నా వాళ్లకి లెక్కలేదు, గౌరవమూ లేదు.

“ఒరేయ్ నారాయణా.. కాఫీ తీసుకురారా..” అని పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రడైరెక్టరు నారాయణని పిలిస్తే ప్రొడక్షన్ కుర్రాళ్లంతా చర్రున లేచారు. వాళ్ల నోట్లోంచి మాట రాకముందే నారాయణ చల్లగా నవ్వి  “పిల్లల్లారా! ఆయన ఏరా అన్నాడని మీరు కోప్పడి అరిస్తే షూటింగ్ ఆగిపోద్ది. అవునా? యీ షూటింగ్ కూడా ఎవరిదీ? మన శివమూర్తిగారిది. శివమూర్తిగారు ఎవరూ? మనకే గాదు. కష్టాల్లో వుండే ఏ సినిమావోడికైనా దేవుడు. పిచ్చోళ్ళారా, చిన్నపిల్లలు గుండెమీద గుప్పిళ్ళతో కొడితే తండ్రి సంతోషిస్తాడుగానీ, ఏడుస్తాడట్రా?” అన్నాడు.

పొంగేపాలమీద నీళ్లు జల్లితే పాలు అణిగినట్టు అణిగారు కుర్రాళ్లు. అదీ నారాయణ వ్యక్తిత్వం.

శివమూర్తి నారాయణకి సాక్షాత్తు దేవుడే. అతను కొలిచే శివుడే. మూడేళ్లు పంట నష్టమై . బ్యాంకు వడ్డీలు పెరిగిపోయి కట్టలేక నారాయణ  పురుగులమందు తాగితే, ఆ పురుగుల మందూ ‘కల్తీ’ దవడం వల్ల తీవ్రమైన డయేరియాతో హాస్పిటల్లో పడుంటే ఆ వూరివాడూ, సినీ నిర్మాతా, ఫైనాన్షియరూ అయిన శివమూర్తి, నారాయణ హాస్పిటల్ ఖర్చులన్నీ తనే కట్టి, అతన్ని  బయటికి తీసుకొచ్చి, కుటుంబం నడపడానికి కొంత డబ్బిచ్చి, “ఒరే నారాయణా, మనిద్దరం చిన్ననాటి స్నేహితులం. నా అదృష్టం బావుండి కోటీశ్వరుడ్నయ్యాను. నీ దురదృష్టం నిన్ను వెంటాడి ఆత్మహత్యకి పురికొల్పింది. వద్దురా. ఇకనించీ నువ్వు నాతోటే వుంటావు.” అని నారాయణనీ, అతని చిన్న ‘ఫేమిలీ’నీ మద్రాసు తీసుకొచ్చి, అతనిదే అయిన ఓ పెద్ద ‘అవుట్ హౌస్’లో ఉంచాడు.ఆ కంపెనీలోనే ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉండే కృష్ణమూర్తిగారికి నారాయణను వప్పగించి, “కృష్ణమూర్తిగారూ, వీడు నా చిన్ననాటి స్నేహితుడు. కోట్లు కళ్ల ఎదుట ఉన్నా కక్కుర్తి పడని నిఖార్సైన మనిషి. నేలతల్లిని నమ్ముకున్న భూమి బిడ్డ. వీడ్ని మీ చేతుల్లో పెడుతున్నా.వీడికి చదువు లేదుగానీ, అంతులేని సిన్సియారిటీ వుంది.” జీతం ఎంతా? అనేది ఆలోచన వద్దు. వాడి బాధ్యత మొత్తం నాదే!” అని అన్నాడు.

అప్పటినించీ ఇప్పటిదాకా కృష్ణమూర్తిగారు నారాయణని సొంత తమ్ముడ్లా చూసుకున్నాడు. కారణం నారాయణ నిజాయితీ. ఇడ్లీ ప్లేటు 10 రూ, దోశ 15 రూ, పూరీ 20 రూ, ఇలా ఒరిజినల్ రేట్లు వుంటే, ప్రొడక్షన్ వాళ్ళు హోటల్ వాళ్లతో లాలూచీ పడి ఇడ్లీ ప్లేటు 20, దోశ 25, పూరీ 30 ఇలా రసీదులు, అంటే తప్పుడు రసీదులిచ్చి డబ్బు దోచేస్తారు. అందులోనూ భాగాలు పంచుకునేవాళ్లు వుంటారు. వీళ్లు ఇచ్చేవి తప్పుడు లెక్కలని వాళ్లకే తెలుసు. తప్పుడు లెక్కలు వుంటేనేగా తప్పుడు ఖాతాల్లో డబ్బులు ‘జమ’ అయ్యేదీ…!

నిర్మాతలకి తెలిసినా నోరెత్తరు. కారణం ఏమంటే,  ఫుడ్ డిపార్టుమెంటుతో ఏ మాత్రం గొడవపెట్టుకున్నా షూటింగ్ సజావుగా జరగదు. అందుకే చూసీ చూడనట్టు వదిలేస్తారు. ఎక్కడోగానీ, కృష్ణమూర్తీ, నారాయణలాంటివాళ్లు వుండరు. అవినీతికి వాళ్లు దూరంగా ఉండటమేగాక , అవినీతి కళ్లెదురుగుండా జరుగుతున్నా వాళ్లు నోరు మూసుకుని వుండలేరు. వాళ్లు జీతం తప్ప పైన ఒక్క పైసా కూడా ఎరక్కపోవచ్చు, కానీ అంతులేని గౌరవాన్ని ‘డిపార్ట్‌మెంట్’ నించి సంపాదించారు.

విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్టు,  నీతికి కట్టుబడేవాడు (సినిమాల్లో అప్పుడప్పుడూ ,అంటే ఎల్లప్పుడూ కాకపోయినా) గౌరవించబడతాడు. సినిమా ఫీల్డులో ఇప్పుడు జరుగుతున్నది శివమూర్తిగారి షూటింగే. కొన్ని వందల సినిమాలకి ‘భుజం’ అందించిన శివమూర్తిగారు, పదేళ్ల తరవాత అన్నిటికీ తెగించి తీస్తున్న సినిమా ఇది. మనుషుల్ని నమ్మి పని వొప్పగించడం మాత్రమే ఆయనకి తెలుసు గనక, మిగతా నిర్మాతలలాగా షూటింగ్ స్పాట్‌లో ఆయన వుండరు. ఓడలు బండ్లు అవుతాయంటారు. ఇప్పుడు జరిగింది అదే. చాలామంది దొంగలెక్కలు చూపించి ఎగ్గొట్టారు. మరి కొందరు వాళ్ల సినిమాల్ని వాళ్లే మధ్యలో ఆపేసి, అందినంతా తొక్కేసి, పై పై ఏడుపుల్తో ఆయన్ని చీట్ చేశారు. నోటికి మాటగా అప్పు తీసుకున్నవాళ్లు, ఆనాటి మాటని “నీటి మీద రాతగా మార్చి అసలుకే ఎసరు పెట్టారు. శివమూర్తిగారు కోర్టుకు వెళ్లొచ్చు. వీళ్లందర్నీ కోర్టులకీ  ఈడ్వనూ వచ్చు. కానీ వుపయోగం వుండదు. ఎందుకంటే ఇవాళ ‘వాళ్లంతా’ గొప్పవాళ్లు.

ఒకప్పుడు ఆయన ఆఫీసులో ‘బాయ్’గా పని చేసినవాడు ఇవాళ గో…ప్ప నిర్మాత. ఒకనాడు ఆయన కంటిచూపుకై క్యూలో నిలబడి ఆయన ఆశీస్సులతో దర్శకుడై అతి వినయంగా వున్నవాడు నేడు సూపర్‌హిట్ దర్శకుడు. కానీ, ఆయన ఎదురుపడటం వీళ్లకి నచ్చదు. కారణం ఆ హిమాలయం ముందు ఒకప్పుడు వీళ్లు గులకరాళ్లని వాళ్లకీ తెలుసు. సినిమా జీవితం కూడా సినిమా సెట్టింగులాంటిదే. ఒక ఫ్లోర్‌లో ఇవాళ మహారాజా పాలేస్ సెట్టింగ్ వేస్తే, మరోనాడు అదే ఫ్లోర్‌లో గుడిసెల సెట్టింగు వెయ్యాల్సి రావచ్చు. కట్టె పేళ్ళని చకచకా రాజమహల్ చేసినట్టే, గుడిసెల్నీ వేస్తారు.

శివమూర్తిగారి ‘సెట్టింగ్’ మారింది అంతే.. అందుకే పదేళ్ళ క్రితమే కృష్ణమూర్తిగారికీ, నారాయణకీ చెప్పేశారు. “మూర్తిగారూ, నేను ప్రొడక్షనూ, ఫైనాన్సింగూ అన్నీ మానేసే పరిస్థితిలో వున్నాను. నేను ఆ పని చెయ్యకముందే మీరు మరో కంపెనీలోకి మారిపోండి. నేను మూసేశాక వెడితే మిమ్మల్ని ఎవరూ తీసుకోరు. సెంటీ’మెంటల్’ ఫీల్డు కదా ఇదీ!” అని నవ్వారు. ఆ విషయం కృష్ణమూర్తిగారికి తెలుసు. ఇష్టం లేకపోయినా శివమూర్తిగారి బలవంతం వల్ల మారక తప్పలేదు. నారాయణ ‘ససేమిరా’ అంటే, శివమూర్తిగారు కేకలేసి పంపారు.

పదేళ్ళ తరవాత మళ్లీ శివమూర్తిగారే కృష్ణమూర్తికీ, నారాయణకీ కబురెట్టి “సినిమా తియ్యక తప్పని పరిస్తితి. సక్సెస్ అయితే కోలుకుంటా.. లేదా ఎటూ మునగాల్సిందే!” అన్నారు. పాతవాళ్లని, అంటే ఇప్పటి గ్రేట్స్‌ని సంప్రదిస్తే రకరకాల కారణాల్తో తప్పించుకున్నారు. ఒకరయితే “కృష్ణమూర్తిగారూ, శివమూర్తి డైరెక్టుగా నా ముందుకొచ్చి నన్నడిగితే కాదన్ను. కానీ ఆయన ఆ పని చేయ్యడుగా!” అని వంకరగా నవ్వాడు.

కృష్ణమూర్తికి నవ్వొచ్చింది. కారణం యీ మహాదర్శకుడే ఒకప్పుడు శివమూర్తి క్రీగంట చూపుకోసం పాటుబడి డైరెక్టరయింది. “అయ్యా మహాదర్శకుడుగారూ! శివమూర్తిగారు ఏనాడు ఎవర్నీ సంప్రదించరనీ, అప్పుడూ నన్నే డీల్ చెయ్యమనేవారనీ మీకు తెలుసు. సరే మీ ఇష్టం.. ఆయనతో మీ మాట చెప్పి చూస్తా…” అని వచ్చేశాడు. ‘కృతజ్ఞతకి కొన్ని చోట్ల చోటుండదు. చివరికి ఓ చిన్న సినిమా తీసి పెద్ద హిట్ చేసిన ‘నిరంజన్’ని డైరెక్టరుగా ఫిక్స్ చేశారు కృష్ణమూర్తి. అందరూ కొత్త నటీనటులే..

ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి. ‘ఉప్పు’ తిన్న కృతజ్ఞత టెక్నీషియన్లలో వుంటుంది. ఎందుకంటే , ఎన్ని సూపర్ హిట్స్ ఇచ్చినా వారి రెమ్యూనరేషన్ నటీనటులకీ, దర్శకులకీ పెరిగినట్టు పెరగదు  గనక. అందుకే శివమూర్తిగారి  సినిమా తీస్తున్నారనగానే, మాటల, పాటల రచయితలూ, కెమెరా, సౌండ్ డిపార్టువాళ్లూ, ప్రొడక్షన్ బాయిస్ అందరూ మహదానందంగా కృష్ణమూర్తిగారు ఆఫర్ చేసిన రెమ్యూనరేషన్‌కే ఒప్పుకున్నారు. కొందరైతే “కృష్ణమూర్తిగారూ, సినిమా పూర్తి కానివ్వండి. అడ్వాసులూ అవీ వొద్దు. హిట్టై శివమూర్తిగారు ఊబిలోనించి బయటపడితే చాలు!!” అని మనస్ఫూర్తిగా అన్నారు.

కృష్ణమూర్తిగారు యీ మాట శివమూర్తిగారికి ఫోన్ చెసి చెబితే ఆయన కళ్లనీళ్లు పెట్టుకుని “చాలు మూర్తిగారూ. అది చాలు. లోకంలో మనిషిని మనిషిని నమ్మొచ్చు అనడానికి” అన్నారు.

సినిమా మూడొంతులు పూర్తయింది. ఇక్కడుండే విచిత్రం ఏమంటే ఎవరి పని వాళ్లు చూసుకోవడం 30% అయితే పక్కోడి పని గమనించడం 70%. అంతేగాదు. మన సినిమా బాగా ఆడాలి.. పక్కోడి సినిమా పోయినా ఫరవాలేదు అనుకోవడం. ఒక పిక్చరు హిట్టయితే, “నా బొంద.. శుక్రవారం రిలీజూ.. కనక ఓపెనింగ్స్ ఉండటం మామూలే.. శనాదివారాలు హాలిడేసు, కనక చచ్చినట్టు ‘కలక్షన్సు’ ఉంటాయి. సోమవారం చూడు.. అప్పుడు చెప్పు.. అది హిట్టో.. ఫట్టో” అని చప్పరిస్తారు. పక్కోడి సినిమా ఫ్లాపైతే ..”అది ఫ్లాపవుద్దని నాకు ముందే తెల్సు. ఆడికి ముందే జెప్పా…’ఒరే… కాస్త జోరు తగ్గించుకో, బడ్జెట్టు అదుపులో పెట్టుకో’ అని.. వింటేగా..!” అని ముక్కూ మూతీ విరుస్తారు. ఇది సినీ నైజం.

మ్యూజిక్ డైరెక్టర్ మంచివాడు. అతనికి మొట్టమొదటి చాన్సు ఇచ్చింది శివమూర్తిగారే. అందుకే “శివమూర్తిగారూ, ఎడిట్ అయిన భాగాన్ని ఎప్పటికప్పుడు నాకు పంపేయండి. ఒకటికి పదిసార్లు చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా.. వీలయినప్పుడల్లా నా స్టూడియోలోనే కీబోర్డు, రిధిమ్ సెక్షనూ మిక్స్  చేస్తా.అందువల్ల ఖర్చూ శ్రమా రెండూ తగ్గుతాయి” అన్నాడు.

ఇక్కడో ప్లస్సు ఉంది. మైనస్సూ వుంది. వాయించిన ‘మ్యుజీషియన్స్’ ఎమోషన్స్‌ని దాచుకోలేరు.

ఎందుకంటే సంగీతం భగవంతుడి భాష. Music is the Language of God. ఆ భాష తెలిసినవారు అబద్ధాలు అంత తొందరగా ఆడలేరు.

ఏమాత్రం ‘సీను’ నచ్చినా అద్భుతం అని పొగిడేస్తారు. నచ్చకపోతే… ‘అదా’ అని చిన్నగా పెదవి విరుస్తారు.

పిక్చర్ ‘సత్తా’ ఏమిటో రీరికార్డింగ్‌లో తెలిసిపోతుంది. కొన్ని రీళ్లు అలా మిక్సయ్యేసరికి పిక్చర్‌కి ‘అద్భుతం’ అన్న టాగ్ ఇచ్చేశారు మ్యూజిషియన్స్. దాంతో పెద్దలకి కలవరం.

డాక్టరు కొడుకు డాక్టరైనప్పుడు యాక్టర్ కొడుకు యాక్టరెందుకు కాకూడదూ? ఖచ్చితంగా కావొచ్చు. కానీ, డాక్టర్ కొడుకు డాక్టరైనా అతని అదృష్టం ‘హస్తవాసి’ మీదే ఆధారపడి వుంటుంది.  యాక్టర్ కొడుక్కి అలా కాదు. ఫస్టు సినిమా ‘ఫేన్స్’ మోసేస్తే, రెండో సినిమాని నిర్మాత ‘మోయిస్తాడు’. ధర్డ్ సినిమా ‘మోయించాలంటే’ రాజకీయాలే గతి. (అప్పటికీ  సదరూ ‘నటకుమారుడు’ సత్తా నిరూపించుకోలేకపోతే)

రాబోయేది సంక్రాంతి సీజను. ఇద్దరు ‘నటకుమారు’ల సినిమాలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. పెద్ద పెద్ద, కొత్త కొత్త థియేటర్లన్నీ సదరు ‘నటకుమారు’ల కోసం ముందే బుక్ చేసేసి పెట్టేశారు.

శివమూర్తిగారి సినిమా నాలుగో ‘అంకం’లోకి అడుగుపెట్టకముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ‘మరో చరిత్ర’ని మించిన హిట్ అవుతుందని ఒకరూ.’మాయాబజార్’లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మరికొందరూ ‘టాక్’ని బయట పెట్టడంలో సదరు ‘నటతండ్రులు’ గబగబా సంయుక్తంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తమతమ ‘దర్శక ఐరావతా’ల తోటీ, నిర్మాత ‘దిక్పాలకు’లతోటీ మీటింగ్ పెట్టుకున్నారు.

‘ఎదుటి’వాడ్ని నిలబెట్టాలీ అనుకున్నప్పుడు ఎవడూ  తక్షణమే స్పందించడు. ‘ఎలా నిలబెట్టాలి’ అన్న ఆలోచనలు ఓ పట్టాన తేలవు. అదే ‘ఎదుటివాడ్ని పడగొట్టాలీ అన్నప్పుడు మాత్రం క్షణాల మీద అయిడియాలు పుట్టుకొస్తాయి. ఎంత ఫాస్టుగా అంటే అరగంటలో మీటింగ్ పూర్తి చేసేసుకుని, ఆరుగంటలపాటు ఆనందంగా మందుపార్టీ చేసుకునేంత.

రెండు రోజుల్లో రెండు ప్రెస్ మీట్లు జరిగాయి. ‘నిరంజన్’ని అన్‌లిమిటెడ్ బడ్జెట్‌తో డైరెక్టరుగా ఎనౌన్సు చేస్తూ….! అది ‘టాక్ ఆఫ్ ద టౌన్’ అయింది. కారణం దిగ్గజాల్లాంటి ఇద్దరు మహానటులు నిరంజన్‌ని తమ వారసులకి డైరెక్టరుగా పెట్టుకోవడమే..!

అప్పటిదాకా చిన్న సినిమాలు చేస్తున్న కెమేరామెన్‌ని ఓ నిర్మాతగారు ప్రత్యేకంగా పిలిపించి ‘డైరెక్టర్’ ఆఫర్ ఇచ్చారు. (నిర్మాత ఎవరో చెప్పక్కర్లేదుగా..)

నిరంజన్‌ని డైరెక్టరుగా పెట్టుకున్న నటదిగ్గజాలు ఓ కండీషన్ మాత్రం పెట్టారు. ఏమంటే వారిద్దరి చిత్రాలకీ సంక్రాంతి రోజునే లాంచనంగా షూటింగ్ ప్రారంభం చెయ్యాలని.

పరుగుపందెంలో పరిగెత్తేవాడెప్పుడూ పక్కచూపు చూడకూడదు. చూసిన క్షణం తెలియకుండానే వేగం తగ్గుతుంది. చెవులు రిక్కించవచ్చు తప్ప కళ్లు తిప్పకూడదు.

ఇప్పుడు జరిగింది అదే. ఇద్దరు మహానటుల వారసులతో ఒకేరోజు సినిమా ఓపెనింగ్ అనేసరికి నిరంజన్ బుర్రలో ఓ తూఫాను మొదలైంది. చేస్తున్న సినిమా మీద కాన్సంట్రేషన్ లెవెల్స్ తగ్గి, అర్జంటుగా అద్భుతమైన 2 సీన్లు రాసుకోవడం మీద కాన్సంట్రేషన్ పెరిగింది.

కెమేరామెన్ గాల్లో తేలుతున్నాడు. మంచి థియేటర్లు అన్నీ ముందే బుక్ చేసేయడంతో ‘చెత్త’వి మాత్రం మిగిలాయి. సంక్రాంతికి రావల్సిన పిక్చర్‌ని  ‘పోస్ట్‌పోన్’ చెయ్యక తప్పని పరిస్థితి. అప్పటిదాకా శివమూర్తిగారిమీది గౌరవంతో ముందుకొచ్చిన బయ్యర్లు సడన్‌గా వెనక్కు తగ్గటంతో డబ్బుకి కటకట. ‘టిఫెన్లు’ కూడా అప్పు మీద తేవాల్సిన పరిస్థితికి కంపెనీ దిగజారింది.’కనీస కృతజ్ఞత’  మీద నమ్మకం పెట్టుకున్న శివమూర్తిగారి గుండెకి హార్ట్ ఎటాక్ వచ్చింది.

“ఆయనది ఎప్పుడూ విశాల హృదయమే.. ఇప్పుడు ఆ విశాల హృదయానికి ‘అటాక్’ తోడయింది” అని ఓ దౌర్భాగ్య రచయిత వెకిలినవ్వు నవ్వుతూ చమత్కరించాడు కూడా. ఆ నికృష్టుడికి ‘రచయిత’ స్థానం ఇప్పించిందీ శివమూర్తిగారే. సదరు రచయితగారి దగ్గర పదిమంది ‘ఘోస్టు’లున్నారిప్పుడు. అందుకే ఆనోటి దూల.

కర్ణుడి చావుకి కోటి కారణాలంటారు. ఇప్పుడా సామెత ‘శివమూర్తి పిక్చరుకి శతగండాలు’గా మారింది. ఒక్కటి మాత్రం చెప్పుకోక తప్పదు.

కృష్ణమూర్తిగారు నటీనటుల్నీ, సాంకేతిక నిపుణుల్నీ, ఆఫీసువాళ్లనీ, ప్రొడక్షన్ బాయిస్‌నీ, కెమేరా వాళ్లని అందర్నీ పిలిపించి ఓ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరించినప్పుడు..

“అయ్యా… పిక్చరు ఆగకూడదు. మా టిఫిన్లూ, భోజనాలూ మేమే తెచ్చుకుంటాం. మా రవాణా ఖర్చు మేమే పెట్టుకుంటాం. మీరు మాకు ఇచ్చిన అడ్వాన్సు కూడా వెనక్కి ఇచ్చేస్తాం కానీ పిక్చరు మాత్రం ఆపకండి”

అని అందరూ ఎలుగెత్తి ఘోషించడం మాత్రం చలనచిత్ర పరిశ్రమలో (అది ఎక్కడైనా) ఏనాడూ జరగలేదు. అదో అద్భుతం !అంతే …!

సంక్రాంతి సినిమాల రష్ అయ్యాకే సినిమా విడుదల చేయ్యడానికి నిర్ణయించడమైంది.

 

_________________

 

“నారాయణా.. బయల్దేరు.. శివమూర్తిగారి పరిస్థితి నిజంగా బాగోలేదని సుశీలమ్మగారు ఫోన్ చేశారు” కళ్లు తుడుచుకుంటూ అన్నారు కృష్ణమూర్తి.

విజయవాడలోని ఓ సామన్యమైన హాస్పిటల్లో నిస్తేజంగా పడి వున్నారు శివమూర్తిగారు. ఒకప్పటి ఆయన ‘వైభవం’ తెలీని చీఫ్ డాక్టర్ ‘డబ్బులు’ కట్టగలరా లేరా అని అసహనంగా వున్నాడు. శివమూర్తిగారికి పిల్లలు లేరు.

“పిక్చరు అమ్మేసి అయినా అందరి బాకీలూ తీర్చండి మూర్తిగారూ. ఒక్క పైసా కూడా తగ్గించవద్దు. సుశీలకిక మీరే దారి చూపించాలి. ఒరే నారాయణా.. నువ్వేరా నాకు మిగిలినవాడివి. నేను వెళ్లిపోతే తలకొరివి పెట్టే బాధ్యత నీదే” అన్నారు శివమూర్తిగారు నారాయణ వంక చూసి.

చిత్రం ఏమంటే.. అవే ఆయన చివరి మాటలు. బ్రతికుండగా ‘అమ్మ’కి అన్నం పెట్టని మహానుభావులు చచ్చాక “ఊరి విందు” చేశారన్న సామెత ప్రకారం మహానటులిద్దరూ కడవలతో కన్నీళ్లు కార్చి శివమూర్తిగారు తమకెంత సహాయం చేశారో, వారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఏడ్చి ఏడ్చి చెబితే…

దిగ్దర్శకులు పొర్లిపొర్లి ఏడుస్తూ తమ ప్రగాఢ సంతాప సందేశాల్ని  తెలియజేస్తూ ‘శివమూర్తిగారు లేని లోటు’ సినిమా పరిశ్రమని కనీసం శతాబ్దం పాటు పీడిస్తుందని బల్లగుద్ది చెప్పారు.

రాత్రికి రాత్రే ఇద్దరు మహానటులూ కుమ్మక్కై శివమూర్తిగారి పిక్చర్‌ని అర్జంటుగా, అయిన ఖర్చులకి కొంత జత చేసి ఇచ్చి సుశీలమ్మగారి దగ్గర ‘హక్కులు’ కొనేశారు.

అందరి బాకీలూ తీర్చి ఆవిడ నిర్వికారంగా నిలబడితే…

“అమ్మా నాకు తోబుట్టువులు లేరు. నువ్వే నా తోబుట్టువువు. మా శ్వాస ఆడేంతకాలం నీకు కష్టం కలగనివ్వం” అని కృష్ణమూర్తిగారూ, నారాయణా తోడు నిలబడ్డారు.

పిక్చర్ రిలీజైంది. అదీ ‘నటకుమారుల’ కోసం సిద్ధం చేసిన సూపర్ డీలక్సు థియేటర్లలో.

పిక్చర్ సూపర్ డూపర్ హిట్. కోట్లు కురిశాయి. పది రోజులు ఆడితే ‘శభాష్’ అనుకునే రోజుల్లో రెండు వందల రోజులు , రోజుకి నాలుగు షోల వంతున ఆడింది.

చిత్రం ఏమంటే.. సినిమా అయ్యాక ‘నిరంజన్’ని పట్టించుకున్నవాడు లేడు. కెమేరామెన్ పరిస్థితీ అంతే.. ఇప్పుడా ఇద్దరూ తెలుగు పరిశ్రమకి గుమ్మడికాయ కొట్టేసి ‘భోజపురీ’ సినిమా తీసే ప్రయత్నంలో కొట్టుమిట్టాడుతున్నరని లేటెస్టు వార్త..

రాజకీయమా.. నీకెన్ని రూపులో!

*

మీ మాటలు

  1. buchireddy gangula says:

    అమెరికా అయినా అమలాపురం అయినా —రాజకీయాలు లేనిదెక్కడ సర్ ??
    నాలుగు కుటుంభాలు — ఏలుతున్న సిని పరిశ్రమ నేడు —రాష్ట్రం లో —
    మొన్నటి మా ఎన్నికలతో —-ఎంతటి ముసుగు రాజకీయాలు ఉన్నాయో —అన్ని
    బయిటికి వచ్చాయి —లక్ష రూపాయిల మెంబెర్స్ కు వోట్ విలువ ఏమిటో తెలియ ని
    దద్దమ్మలు —మూడో వందల కు పయిగా వోట్ వేయని వాళ్ళు ???
    అందరు చదువుకున్న వాళ్ళు ??? యిది మన ప్రజాసామ్యం

    ఎప్పటిలాగే మీ కథ గొప్పగా ఉంది సర్
    ———————————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

    • భువనచంద్ర says:

      బుచ్చి రెడ్డి గారూ మీరన్నది నిజం … కానీ ఇందులోనూ మంచీ మానవత్వం వున్నా వాళ్ళు వున్నారు ….బేసిక్ గా ఈ పరిశ్రమ కళ కి సంబంధించినది గనక సెన్సిటివ్ నెస్ ఎక్కువ ….వ్యాపారం గనక లాభాలూ నష్టాలూ మోసాలూ అన్నీ వుంటాయి ఒక్కటి మాత్రం నిజం సినిమా మనిషికి ”’అమరత్వాన్ని”’ఇస్తుంది …… ఈ విషయంలో సందేహం లేదు .నమస్సులతో

  2. Chimata Rajendra Prasad says:

    కటువైన నిజాల్ని కథల రూపంలో మలుస్తున్న మీకు అభినందనలు

    • భువనచంద్ర says:

      రాజేంద్ర ప్రసాద్ గారూ నమస్తే మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  3. భువనచంద్ర గారు,
    మీ శైలి చాలా బాగుంది. చాలా తక్కువ సమయంలో మీరు రాసినదానిని చదివేయవచ్చు. హింది ఫిల్మ్ ఇండస్ట్రి కూడా తెలుగుకు ఏ మాత్రం తీసిపోదు. అది కూడా కుటుంబ పరిశ్రమ. అమెరికా లో పెద్ద సంస్థ కు అధిపతి గా ఉన్న అతను, కొడుకు ఇష్టాన్ని కాదనలేక హింది సినేమాలో నటించటానికి ఇండియాకి పంపితే అక్కడివారు చేసే చేష్టలు, ప్రవర్తించిన తీరు ,డబ్బులు జౌరేసే విధానం చూసి అసలు వాళ్ళు చేసేది వ్యాపారమా? అడుగడుగునా కుళ్ళు, కుతంత్రం అటువంటి మోసాలు నేను ఎక్కడా చూడలేదు అని చీదరించుకొన్నాడు. వీటితో పోలిస్తే తమిళ పరిశ్రమ కొంత మెరుగేమో!

    • భువనచంద్ర says:

      శ్రీ రాం గారూ …ధన్యవాదాలు ….మీరన్నట్టు హిందీ లోనూ రాజకీయాలు వున్నాయి …ఇక్కడికంటే ఇంకా ఎక్కువగా ….ఎప్పటి కైనా స్వచ్చత నెలకొంటుందని ఆశిద్దాం ……నమస్సులతో భువనచంద్ర

  4. భువనచంద్ర says:

    బుచ్చిరెడ్డి గారూ నమస్తే …..మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ……

  5. భువనచంద్ర says:

    రాజేంద్ర ప్రసాద్ గారూ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  6. buchireddy gangula says:

    భువనచంద్ర గారు

    కథ రాయవలిసింది హృదయం తో — కలం తో కాదు
    —————————————శ్రీ పాద
    రాయాలంటే ప్రేమ ఉండాలి చాలా —లోకం మీద -మనషుల మీద
    —————————————-చిన వీరభద్రుడు

    మీ కథలు ఏవి చదివినా అలా తోస్తాయి —

    యిప్పటి సినిమాలు అమర త్వాన్ని యిస్తాయ సర్ —
    హీరో ను బట్టి కథ — 6 డబల్ మీనింగ్ సాంగ్స్ —ప్లస్ సెక్స్ ప్రొవొకె చేశే ఐటెం సాంగ్ ??
    హీరో లు — ఏజ్ బార్ అయి నోళ్ళు — యింకా గంతులు వేస్తుంటే ???
    నా ఫాన్స్ — నా ఫాన్స్ — అని చెప్పుకుంటూ —అన్ని రంగాల లో వేలు పెడుతూ — ఎక్కడ ఉంది సర్ honesty….values….sincerity…
    అంతా దాగుడు మూతలు
    సిని ఫీల్డ్ లో కూడా కుల – మత పట్టింపులు
    సినిమా వొళ్ళ పరిచయాలతో — వాళ్ళు చెప్పిన మాటలే సర్
    నాడు — నేడు — కంట్రోల్ రాజకీయాలు –అన్ని రంగాల లో
    అటు వారసత్వ family పాల న లు — లోకేష్ ?? Rahul ???
    మార్పు అవసరం

    —————బుచ్చి రెడ్డి గంగుల

  7. Bhuvanachandra says:

    బుచ్చిరెడ్డి గారూ నమస్తే . మీరన్నది నూటికి నూరుపాళ్ళూ నిజం .రాజకీయాలు ఎంత పెచ్చుపెరిగి పోయాయంటే మనిషిని మనిషి గా కాక ఒక”’ పావు ” గా పరిగణిస్తున్నారు .కళాత్మక వ్యాపారం లో కళ ఇంకిపోయి వ్యాపారం మాత్రమే మిగిలింది .నిర్మాతల పరిస్తితి ఘోరం .మౌన సాక్షులు గా మిగలడం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయ స్తితి . మీ కు ,మీరిచ్చే ప్రోత్సాహానికీ ధన్యవాదాలతో ,నమస్సులతో భువనచంద్ర

  8. rama sundari MSBPNV says:

    మీరు ఏ రంగాన్ని టచ్ చేసినా దానికి గొప్ప జీవం తెస్తున్నారు. మీ రచనా వైశిష్ట్యానికి విశ్లేషణ, నిజాయితీ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ‘సత్యం, ఇది సత్యం’, అనడం తప్ప మరేమీ అనలేము.

Leave a Reply to Bhuvanachandra Cancel reply

*