మణిరత్నం గారి మాంగల్య బలం!

జి ఎస్‌ రామ్మోహన్‌

మణిరత్నం సినిమాల్లో రైలు తరచుగా కనిపిస్తుంది. రైలు మోడర్నిటీకి చిహ్నం. నిజంగా అంతా అలా ఉంటే ఎంత బాగుణ్ణు అనిపించేట్టు ఉంటుంది ఆయన చూపించే నగర జీవితం. మణిరత్నం అంటేనే సోఫిస్టికేషన్‌. వయసు ఎంత పైబడుతున్నా నిరంతరం తన సినిమాలను యవ్వనంతో ఉంచడానికే ప్రయత్నిస్తారు. ఆయన సినిమాల నిండా ప్రేమ కనిపిస్తుంది. మాస్‌ మసాలా సినిమాల్లో మాదిరి విలనీ కనిపించదు. మనుషులంతా ఎంత మంచివాళ్లుగా ఉంటారో చెప్పలేం. ప్రేయసిని అందుకోవడానికి వేరే అమ్మాయి బైకును ఆపితే ఆ అమ్మాయి ఏమీ అనుకోకుండా లిఫ్ట్ ఇస్తుంది. పరిచయం లేని కుర్రాడు భుజం మీద చేయి వేసి కూర్చున్నా చెడుగా అనుకోదు. బ్యాంక్‌ ఉద్యోగంలో రిటైరయిన పెద్దమనిషి లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్న జంటకు ఇంట్లో ఆశ్రయమివ్వడానికి ఒప్పేసుకుంటారు. ఎప్పుడంటే అపుడు ఆఫీసునుంచి బయటకు వచ్చేసి హోటళ్లలో రెస్టారెంట్లలో ఆ జంట చెట్టాపట్టాలు వేసుకుని ఊసులాడుకోవడానికి వారిద్దరు పనిచేస్తున్న ఆఫీసులకు అభ్యంతరమే ఉండదు.

మణిరత్నం మంచి మనసుతో చేస్తున్న పనికి అందరూ సహకరిస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో ప్రేమికులకు ఆర్థిక కష్టాలు ఎప్పుడూ ఉండవు. కోట్లకు కోట్లు డబ్బు మూలుగుతున్నా దాన్ని కాదని కెరీర్‌ కోసం కష్టపడుతున్న బిడ్డ గురించి తల్లి కాస్ట్లీ బాధ తప్పితే ఒకె బంగారంలోనూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు. పాత్రలు, వాతావరణం మాత్రమే కాదు. సబ్జెక్ట్‌, ట్రీట్‌ మెంట్‌ అంతా పూర్తి క్లాస్‌.  ఏక్‌ దమ్‌ ఏ క్లాస్‌. మ..మ..మ్మాస్‌ కాదు. సి క్లాస్‌ సెంటర్స్‌ టార్గెటే కాదు. ఓకె బంగారం ఫక్తు మల్టీ ప్లెక్స్‌ సినిమా. కాకపోతే బి క్లాస్‌ ఎప్పుడూ ఏ క్లాస్‌ జీవనశైలిని ఆరాధనతోనూ, రేపో మాపో తాను అక్కడికి చేరాలనే ఆశతోనూ చూస్తూ  ఉంటుంది. కాబట్టి బి క్లాస్‌కు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదు. క్లాస్‌ యూత్‌ను ఆకట్టుకునే అంశాలన్నీ ఉన్నాయి. వీడియోగేమ్స్‌తో పాటు, సెక్స్‌ని అన్‌ అపాలజిటిక్‌ అంశంగా చూపడం వగైరాలు యూత్‌ని పట్టేస్తాయి. ప్రకాశ్‌రాజ్‌-లీలాశాంసన్‌ జంట, వారి అనుబంధం ఎడ్యుకేటెడ్‌ మిడిల్‌ ఏజ్‌వాళ్లని థియేటర్లకు లాగేస్తుంది. అన్నింటని మించి కేవలం నిత్యామీనన్‌ను చూడడం కోసమైనా థియేటర్‌కు వెళ్లొచ్చు. వెరసి ఇది హిట్టే. మణిరత్నానికి చాలా కాలం తర్వాత కమర్షియల్‌ విజయం లభించినట్టే.

samvedana logo copy(1)

కథ రెండు ట్రాకులుగా నడుస్తూ ఉంటుంది. కెరీర్‌కు కమిట్‌మెంట్లు ఆటంకం అని భావించే ఒక అమ్మాయి-అబ్బాయి పెళ్లి చేసుకోకూడని అనుకుంటారు. అయితే అదే సమయంలో వయసు ముద్దు ముచ్చట్లకు ఆటంకం  ఉండకూడదని కూడా అనుకుంటారు. ఇద్దరూ ఎవరి కెరీర్‌ కోసం వారు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈ లోపు ఉన్న ఆరునెలలు ఒకరిలో ఒకరిగా గడపాలని అనుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఆర్నెళ్లు జాలీగా లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉండాలని అనుకుంటారు. ఇదొక ట్రాక్‌. అల్జీమర్స్‌తో బాధపడే భార్య, బ్యాంక్‌ ఉద్యోగిగా రిటైరై ఇంట్లో వంటా వార్పూ చేస్తూ ఆమెకు  అన్నీ తానై చూసుకునే భర్త – ఈ జంటది మరో ట్రాక్‌.  వీరిద్దరి మధ్య ప్రేమానుబంధం, ఒకరికోసం ఒకరన్నట్టుగా జీవించడంలో ఉండే ఆ అనుబంధం ఆ యువజంట ఆలోచనలపై ఎలాంటి ప్రభావం చూపింది అనేది సినిమా సారాంశం. స్వేచ్ఛతో మొదలై బంధంతో ముగుస్తుంది ఈ సినిమా.

మామూలుగా కమర్షియల్ సినిమాలను చూసే దృష్టితోనే అయితే ఇందులో తప్పు పట్టాల్సింది పెద్దగా ఏమీ లేదు. మామూలు రీవ్యూయర్‌ భాషలో నాలుగు మాటలు మాట్లాడి ముగించుకోవచ్చు. మధ్యలో కాస్త బోర్‌ కొట్టించారు నాలుగైదు రీళ్లు ఎడిట్‌ చేసి ఉండొచ్చు కదా అనొచ్చు. కనీస పక్షం  రెండు పాటలను తీసేసి ఉండొచ్చు… చిన చిన కోరికలే..తప్ప మిగిలిన పాటలన్నీ వృధా. కదా అనొచ్చు. తెలుగు మసాలా సినిమాల్లో ప్రకాశ్‌ రాజ్‌ ఇరగదీశాడు అంటారు, ఇక్కడ అలాంటిదేమీ లేకుండా ఆయన పాత్రలో ఇమిడిపోయారు అనొచ్చు. ఆ మాటకొస్తే హీరో సహా అందరూ ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు అనొచ్చు.

05-1428213938-ok-bangaram-audio-launch-highlights

 

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బోర్‌ కొట్టిన సీన్లలో కూడా ఆ అమ్మాయి నిత్యా మీనన్‌ మెరుపు చూపులు రిలీఫ్‌గా పనిచేశాయి అనొచ్చు. క్రిస్టియానిటీని ఆధునికంగానూ, ఇస్లామిక్‌ ఆర్కిటెక్చర్‌ని గొప్పగా చూపించే పాజిటివ్‌ సింబాలిజమ్‌లో ఉన్న లిబరల్‌ ఎలిమెంట్‌ గురించి ప్రస్తావించుకోవచ్చు. ఇలాంటి మంచి చెడుల గురించి బోలెడు మాట్లాడుకోవచ్చు. కాకపోతే మణిరత్నం రెగ్యులర్‌ మసాలా మాల్‌ కాదు. కమర్షియల్‌కు ఎక్కువ, క్రాస్‌ఓవర్‌కు తక్కువ అనే విమర్శను కాసేపు పక్కనబెడదాం. తాను కోరుకున్న ఫీలింగ్‌ను సమర్థంగా జనంలోకి బట్వాడా చేయగల టెక్నీషియన్‌ అనైతే ఒప్పుకోక తప్పదు. ముఖ్యంగా ఇక వారంలో విడిపోతాం అనే మానసిక సంఘర్షణ ఆ యువజంటలో మొదలయినప్పటినుంచీ సినిమా నడిచే వేగం, అది కలిగించే స్పందన దర్శకుని విజయానికి సంకేతాలు. ఎఆర్‌ రహమాన్‌ తానేంటో ఇక్కడ చూపించారు.

ఓకె, బంగారం. కాకపోతే సినిమాలో వీరు చెప్పదల్చుకున్న విషయం ఏమిటి?

maniratnam-2b-1_1186981158

ఇద్దరూ సహజీవనం మొదలెట్టినపుడు సాగిన చర్చల్లో ఆ పెళ్లొకటి చేసుకుంటే ఆ తాడొకటి వేసుకుంటే అన్నీ చేసేసుకోవచ్చా..దాంతో లైసెన్స్‌ వస్తుందా, లేకపోతే రాదా అనే టోన్‌తో హీరోయిన్‌ మాట్లాడుతుంది. మరి సెక్స్‌కు వర్తించే సూత్రమే అనుబంధానికి కూడా వర్తిస్తుంది కదా! కాగితాల మీద పెళ్లి సంతకాలు చేసుకుంటేనే అనుబంధం నిలుస్తుందా, లేకపోతే ఉండదా. ఆ సంతకాలు లేకుండా కూడా వారు అనుబంధాన్ని కొనసాగించలేరా…ఒకరికొకరుగా ఉండలేరా! సేమ్‌ తర్కం ఇక్కడ ఎందుకు వాడలేకపోయారు? ఆ సంతకాలు లేకపోతే పారిస్‌ వెళ్లిన అమ్మాయి అక్కడ ఇతన్ని మర్చిపోతుందా, అమెరికా వెళ్లిన అబ్బాయి ఆ అమ్మాయిని మర్చిపోతాడా. పెళ్లి సంతకం అనుబంధాన్ని కాపాడే తాలిస్మాన్‌లాగా పనిచేస్తుందా! ఆ సంతకాలు లేకుండా కూడా ఆ వృద్ధదంపతుల్లాగే వారు అనుబంధాన్ని కాపాడుకోవచ్చుకదా! అనుబంధం అనేది మనుషుల అవసరాలు, పరిస్థితులు, స్వభావాల మీద కాకుండా పెళ్లి అనే తంతుమీద ఆధారపడుతుందా!

ఇంటిమసీ విషయంలో రాడికల్‌గా ప్రశ్న వేసిన మణిరత్నం అదే ప్రశ్న అనుబంధం విషయానికీ వర్తిస్తుందని ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకంత స్టేటస్‌ కోయిస్టుగా ఉండిపోయారు అనేది ప్రశ్న. దిల్‌ దే చుకే సనమ్‌, తాళ్‌ అంత నాటుగా ఇది లేకపోవచ్చు. అబ్బాయి నోటినుంచే పెళ్లి ప్రపోజల్‌ పెట్టించడంలోనూ కాస్తంత సోఫిస్టికేషన్‌ చూపించి ఉండొచ్చు. కానీ సోఫిస్టికేషన్‌లో తప్ప సారాంశంలో ఉన్న తేడా ఎంత? పిసి శ్రీరాం అద్భుతమైన ఫ్రేమ్స్‌, పాత్రలు, సంభాషణలు అన్నీ ఫ్రెష్‌గా ఉండి సినిమా ఒక దశలో పొగలు కక్కుతున్న తమిళ సాంబారులాగా ఉంటుంది. ముగింపు వచ్చేసరికి పాచిపోయిన సాంబారులాగా ముక్క వాసన వేస్తుంది.

*

 

 

 

 

మీ మాటలు

  1. lokesh v says:

    Nice review

  2. ” కాగితాల మీద పెళ్లి సంతకాలు చేసుకుంటేనే అనుబంధం నిలుస్తుందా, లేకపోతే ఉండదా. ఆ సంతకాలు లేకుండా కూడా వారు అనుబంధాన్ని కొనసాగించలేరా…ఒకరికొకరుగా ఉండలేరా! సేమ్‌ తర్కం ఇక్కడ ఎందుకు వాడలేకపోయారు?” –
    ఎందుకంటే …వాడాలని మణిరత్నానికి మనసులో ఉన్నా … అరవ, తెలుగు జనం హర్షించరని. ముగింపులో వాళ్ళకు పెళ్ళవగానే సనాతన వాదులంతా “హమ్మయ్య ” అని ఊపిరి పీల్చుకుంటారని – లేకపోతే చచ్చి ఊరుకుంటారని. పరోక్షంగా హత్యలు చేయడం మణిరత్నానికి ఇష్టం లేక .
    హే … రామ్మోహన్, నిన్ననే సినిమా చూసా. గీతాంజలి , రోజా , బొంబాయి … ల కంటే గొప్పగా … నీవన్నట్టు వయసు మీద పడుతున్నా కాలం తో పాటూ గొప్ప ప్రేమ కథ తీసారు మణిరత్నం . ఈ మధ్య కాలం లో నేను చూసిన (తెలుగు ) సినిమాలన్నీ దిక్కుమాలినవే . అరవ సాంబారయితే ఏమ్ … కమ్మగా ఉందబ్బా . ఆ సాంబారు లో వేసిన ముక్కలన్నీ కన్నడ , తమిళ మే. ఇక హీరో + హీరోయిన్లు కేరళ ముక్కలు ( తెలుగు ముక్క ఒక్కటి లేదు , పాటలు , డబ్బింగ్ తప్ప )
    అవునూ తమిళాయన సినిమా తీస్తే అరవ సాంబారు వాసన రాక , ఆంద్ర గోంగూర వాసన వచ్చిద్దా చెప్పు ?
    ఆ హీరో మమ్ముట్టి కొడుకంటగా … నాని డబ్బింగ్ భలే సరిపోయింది .
    గుండెలమీద (వొకటే లే ) చెయ్యేసి చెపుతున్నా … తెలుగు దర్శకులు ఒక ప్రేమ కథను ఇంట గొప్పగా ప్రెసెంట్ చేయలేరు గాక చెయ్యలేరు – గొరుసు

  3. Nisheedhi says:

    Loved it . very cool review

  4. మణిరత్నం says:

    అప్డేట్ అవ్వండి సారూ

  5. Buchi reddy gangula says:

    గుడ్ మూవీ //నిత్య మీనన్
    ప్రాణం సినమా. కు
    !!!!!’!!!!!!!!!!
    Buchi reddy

  6. కెక్యూబ్ వర్మ says:

    నేనింకా సినిమా చూడలేదు. చూడాలనిపించింది మీ రివ్యూ చదివాక. చివరి ఎండ్ ప్రపోజల్‌ సినిమా హిట్ కోసం చేసుండొచ్చు. ఎందుకంటే మన జనాలు అంత వేగంగా తాళి తెంపు కార్యాన్ని జీర్ణించుకోలేరని.

  7. B. KRISHNA KUMARI says:

    ఆకాశంలో, మబ్బుల్లో ఎంత సేపు విహరించినా నేల మీదకు రాక తప్పదు కదా రామ్మోహన్. నాకు తెలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్ కి మన దేశం లో చట్ట బద్ధత లేదు అనుకుంట. (అంటే నా ఉద్దేశం లో వాళ్ళు విడిపోతే, పిల్లల పోషణ భారం వగయిరా అడిగే హక్కు ఆ అమ్మాయికి ఉండదనుకుంట. అవివాహిత తల్లి గానే చూడబడుతుంది. వాళ్ళని కూడా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు ఏమో? చట్ట పరంగా వచ్చే చాలా సౌకర్యాలు రావు. కొండొకచో కష్ట పడాల్సి ఉంటుంది కూడా.) అందుకని, ‘ఆ పాపం నాకు ఎందుకు?’ అనుకున్నారో ఏమో, ఆ రిలేషన్ ని చట్ట పరిధి లోకి రిజిస్టర్ మ్యారేజ్ ద్వార (నేల మీదకి) తెచ్చేసి ఉండచ్చు. నాకు అయితే అంతే అనిపించింది. దాన్ని సూటిగా చెప్పటం కుదరలేదేమో? నీ ముక్కు ఏది అంటే తల చుట్టూరా తిప్పి చూపించినట్లు ఇంకో జంట ద్వార influence చేసారు అనిపించింది.

  8. పవన్ సంతోష్ says:

    అంతకంటే ఇంక భారం భరించలేక కావచ్చు. అప్పటికే చాలా విషయాల్ని చర్చించాడు. చాలానే చేశాడు. ఇంక అంతకన్నా అనవసరం. రెండో విషయం-నాకు అర్థమైనంతవరకూ మణిరత్నం సమాజంలో కొన్ని మూలకోణాల్ని ప్రతిబింబించడానికి ఇష్టపడతాడు. సఖి సినిమా నాటికి ఉన్న సమస్యను, అప్పటి స్థితిగతుల్లో జంట చేయగలిగినంతవరకూ చేసి చూపించాడు. ఇప్పుడున్న స్థితిగతుల్లో ఇదే జరుగుతూండివుండొచ్చు. నిజంగా చెప్పాల్సివస్తే అంత మెచ్యూర్డ్ జంట పెళ్ళి చేసుకుంటే మాత్రం ఏమి? అనిపించలేదా మీకు. ఆ వృద్ధ జంట విషయంలో పెళ్ళి ప్రేమకు ఓ కెటలిస్టుగా పనికివచ్చిందని వీళ్ళకి అనిపించిందేమో? ఏం కాకూడదా?

  9. chandrudu says:

    తెలుగులో వస్తున్న కుటుంబ కథా చిత్రాల లో వుండే విపరీతం లేకుండా గొప్ప ధ్వనితో కౌటుంబికతను గూర్చి మణి గారు తీసారు. నిత్య చాలా బా చేసింది . ప్రకాశరాజ్ భార్య పాత్ర వేసిన ఆవిడ చాల మంచి పెర్ఫార్మెన్సు ( అండర్ ప్లే )చేసారు .ఒక మంచి సినిమా. పాటలు బాగా అతికాయి. రెహ్మాన్ గురించి కొత్తేముంది ఆర్ ఆర్ కుడా బా చేసాడు .

  10. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇతర కమర్షియల్‌సినిమాలతో పోల్చి చూస్తే మంచి సినిమానే. కాకపోతే అతనే అంతకుముందు అంత రాడికల్‌గా ఒక ప్రశ్న వేయించి ఆ ప్రశ్న సమంజసమైనదే అనిపించి ఆ తర్వాత ఆ వృద్ధ దంపతుల ద్వారా ఇంకో వైపుకు డ్రైవ్‌ చేశాడు. సినిమాలో అతను ఉపయోగించిన లాజిక్‌ చివరి దాకా కొనసాగించలేకపోయాడు. ఆ స్థాయిలో అనుబంధం అవగాహన ఉన్న జంటకు ఆ సంతకాలు ఉన్నా లేకపోయినా తేడా ఏమీ ఉండకూడదు. కానీ జనామోదపు శుభం కార్డు వేయించాడు. కారణాలేవైనా కావచ్చు. రాజీ పడ్డాడు అనేది నా ఉద్దేశం. అంతే.

  11. ఒక విశృంఖలతని చాలాకాలం చూసి మొదట అరుంధతి తర్వాత వశిష్ఠుడు ఏర్పరచినది వివాహ వ్యవస్థ!దీన్ని కాదంటే ఒకప్పటి గుంపులో గోవిందా వాతావరణమె గతి – ఎందుకొచ్చిన గోల?వెనక్కి నడిచి మళ్ళీ అరుంధతికి ముందరి కాలనికి వెళ్ళి చేసేది ఏముంటుంది?మళ్ళీ అది బాగా లేదనుకుని ఇటే రావాలిగా!తాళి,కట్టుబాటు,సింబల్స్ లేకుండా వాళ్ళు చేసిన దేమిటి?దాంపత్యమూ సహజీవనమే కదా!సహజీవనం నుంచి దాంపత్యం లోకి ప్రయాణించారు వాళ్ళు – తప్పేముంది?

  12. ref1:అన్నింటని మించి కేవలం నిత్యామీనన్‌ను చూడడం కోసమైనా థియేటర్‌కు వెళ్లొచ్చు.
    *
    ref2:మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బోర్‌ కొట్టిన సీన్లలో కూడా ఆ అమ్మాయి నిత్యా మీనన్‌ మెరుపు చూపులు రిలీఫ్‌గా పనిచేశాయి అనొచ్చు.
    *
    పైన ఆరుగురిలో ఒకసారి వేసింది చాలక మళ్ళీ మణిరత్నం అక్కన బ్లో-అప్ వేశారు….?!

    *
    ఈ అమ్మాయి అరిచి గింజుకున్నా ఎక్స్పోజింగు చెయ్యను,ఖాళీగా ఉంటాను గానీ అసభ్యతకి చోటివ్వను అని మొండిగా చెప్పేసి ఒళ్ళు చూపించకండా ఉండటం వల్ల కాబోలు ఎంత పొగిడినా అదోరకంగా అనుకోరులే అని ఒక సేఫ్ జోన్ ఏర్పడిపోయినట్టుంది చాలామంది మగాళ్ళకి.కానీ నిత్యా మీనన్ నటన ద్వారా చూపించే అసభ్యత చాలా డేంజరస్!
    *
    ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఏమిటో చెప్పారు,నేను చూసిన ట్రైలర్స్ మరియూ పాటలు అన్నింటిలోనూ చేసిన గొప్ప నటన ఏమిటి?దుప్పటిలో హీరోకి అతి దగ్గిరగా ఉండి హస్కీగా మూలగడం,చెంపలు చెంపలకి రాస్తూ పరవశించి పఓయే ఇంటిమసీని అత్యంత వాస్తవికంగా ప్రదర్శించటం.తెర మీద చూపించకపోయినా వాళ్ళ సహజీవనం పూర్తయ్యేసరికి జరగాల్సినవి అన్నీ చాలాసార్లు జరిగిపోయే ఉంటాయని నేను బల్లగుద్ది చెప్పగలను!లడ్డులాంటి పిల్ల అంత దగ్గిరగా కదుల్తూ దుప్పట్లో దూరి హస్కీగా మూలుగుతుంటే అస్ఖలితంగా ఎవడు ఉండగలడు?మణిరత్నం వాళ్ళని పెళ్ళి పేరుతో కలిపాడు గాబట్టి సరిపోయింది,లేకుంటే?
    *
    ఈ ఒక్క సినిమాయే కాదు,మాలిని22లో అయితే నిజంగా నరేష్ అనే నటుడు నిత్యా మీనన్ అనే నటిని రేప్ చేస్తున్నాడేమో అనిపించేతంత సహజంగా ఉంది తన నటన – బాబోయ్!ఇంక నరేష్ పాత్ర మీద పగ తీర్చుకునే సీన్లలఓ అయితే ఆ కళ్ళు హర్రర్ మూవీ చూపించేశాయి:-(
    *
    సరే,అది రేపిస్టుల్ని భయపెట్టే ఎఫేక్టు అని సర్దుకుపోవచ్చు,ఈ మధ్యన రిలీజయిన సన్నాఫ్ సత్యమూర్తిలో ఈ అమ్మాయి చేసిన పాత్ర ఏంటి?అప్పటికే తను ఒక మగాదితో ఉడాయించాలనేటంతగా ప్రేమలో ఇరుక్కుని హీరోని “లడ్డూ కావాలా?” అని రెచ్చగొడుతూ బిగియార కౌగలించుకోవడం అనే విచ్చల్విడితనం కూడా సంసారపక్షంగా ఉండే ఈ నిత్యా మీనన్ చెయ్యడం వల్ల ఏమాత్రం ఎబ్బెట్టుగా కనిపించలేదు – బాహుబలిలోని హీరో హీరొయిన్ల మధ్యన జరిగిన రొమాన్సు కూడా రేప్ మాదిరి ఫీలయిన ఆధునిక మహిళలకి కూడా!!
    *
    ఓకే,సత్యమూర్తి సినిమా ధీం అంతా కొంచెం సీరియస్ తోనులో నడుస్తుంది గాబట్టి రిలీఫ్ కోసం దైరెక్టర్ చేసిన జిమ్మిక నుకుందామా?కానీ నాకెందుకో ఇక్కడ సంసారపక్షంగా కనిపిస్తూ పరాయి మొగాణ్ణి ఒక ఆడది గట్టిగా కావిలించుకుంటే కిక్కురుమనకుండా వూర్కుని శివ బాహుబలి తనకి నచ్చి పెళ్ళి చేసుందామనుకున్న అమ్మాయితో కొంచెం దురుసుగా ఉండటానికి రేప్ అని పేరుపెట్టి హడావిడి చెయ్యటం వెనక ఒక ప్లాన్/ఎజెండా ఉన్నట్టు అనుమాన్మగా ఉంది – ఏమంటారు?

మీ మాటలు

*