పెళ్లి దడ

sani

 కోకిల, ఒక యువ వేశ్య

కృష్ణుడు, ఆమె ప్రేమికుడు

సత్తి, ఆమె సేవిక

sani

కోకిల:    సేనాపతి కూతురు సువర్ణముఖిని పెళ్ళాడబోతున్నావట కదా! అసలిప్పటికే అయిపోయిందేమో కూడానూ! నువ్వు చేసిన ప్రమాణాలూ, నీ కన్నీళ్ళూ, నీ ఒప్పుకోళ్ళూ అన్నీ గాలిలో కలిసిపోయాయి. నువ్వు కోకిలను మరిచిపోయావు. నిన్ను భర్తగా భావించి సంసారం చేసినందుకు నాకిప్పుడు ఎనిమిదో నెల. నీ ప్రేమకు గుర్తుగా నాకు మిగిలిందిదిగో, ఈ పెద్ద పొట్ట. తొందర్లో నేనొక పసిపిల్లను సాకాల్సి ఉంటుంది. నాలాంటి వేశ్యకు అదొక మంచి కాలక్షేపమే. నీ పుణ్యమాని మగపిల్లాడు పుడితే, వాడికి అశోకుడని పేరుపెట్టి, వాడిలో నిన్ను చూసుకుంటూ ఊరడిల్లుతాను. వాడు పెద్దయ్యాక నీ దగ్గరకొచ్చి తన తల్లిని అనాథను చేసినందుకు నిన్ను నిలదీయకపోడు.

నువ్వు  పెళ్ళాడాలనుకున్న పిల్ల పెద్ద అందగత్తేమీ కాదు. మొన్నీమధ్య సంత రోజు నేనామెను చూశాను. వాళ్ళమ్మతో కలిసొచ్చింది. అట్లాంటి అనాకారి పిల్ల కోసం నువ్వు నన్నొదులుకుంటా వనుకోలేదు. ఆమెని కాస్త దగ్గరగా చూడు. ఆమె ముఖాన్నీ, కళ్ళనూ పరిశీలనగా చూడు. అట్లాంటి చీకిరికళ్ళ పిల్లను చేసుకున్నందుకు తరవాత నువ్వే బాధ పడతావు. నిజం, ఆపిల్లవి చింతాకు కళ్ళు. పిల్లను కాదు, ఆమె తండ్రిని చూసినా చాలు. ఒక్కసారి అతని ముఖం పరిశీలనగా చూడు. ఇక పిల్ల ముఖం చూడక్కర్లేదు.

కృష్ణుడు:            బుద్ధిలేకుండా మాట్లాడకు కోకిలా! సేనాపతి కూతుళ్ళూ, పెళ్ళిళ్ళూ అంటూ నువ్వు వాగే చెత్త వాగుడు ఆపు! ఆ పెళ్లి కూతురుకి చీకి కళ్ళున్నాయో, బుర్రముక్కుందో అసలు అందంగానే ఉందో నాకేం తెలుసు? సేనాపతి అంటే బహుశా నీ ఉద్దేశ్యం ఆ వీరనాయుడనేగా? అతనికో అనాకారి కూతురుందని నాకెలా తెలుస్తుంది? కనీసం అతను మా నాన్న స్నేహితుడైనా కాదు. కాకపోగా మా నాన్నకీ అతనికీ కోర్టులో వివాదం కూడా నడుస్తోంది. అతను మా నాన్న దగ్గర లక్ష రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టాడు. ఆ బాకీ వసూలు కోసం మా నాన్న దావా వేశాడు. ఇప్పటి వరకూ ఆ సేనాపతి మా అప్పు తీర్చనేలేదు.

నేను పెళ్ళే చేసుకోవాలనుకుంటే మన నగర మేయరు రాజమోహనుడి కూతురునే చేసుకొనే వాణ్ని కదా? ఎందుకు వద్దంటాను? పైగా రాజమోహనుడు నాకు స్వయానా మేనమామ. అంత చక్కని పిల్లని కాదనుకొని ఈ సేనాపతి గాడి అనాకారి కూతుర్నా నేను చేసుకొనేది? ఇట్లాంటి చెత్త కబుర్లు ఎక్కడ దొరుకుతాయి నీకు? లేకపోతే అసూయ కొద్దీ నువ్వే ఇలాంటి మాటల్ని సృష్టిస్తున్నావా?

కోకిల:    ఐతే నువ్వు పెళ్లి చేసుకోవడం అంతా ఉత్తిదేనా?

కృష్ణుడు:            నీకేమన్నా పిచ్చా లేకపోతే రాత్రి తాగిందింకా దిగలేదా? అయినా రాత్రి మనమంత ఎక్కువేమీ తాగలేదు కదా!

కోకిల:    (తన సేవకురాలి వంక చూపిస్తూ) ఇదిగో, ఈ సత్తి ముండ ఇలాంటి కబుర్లు మోసుకొచ్చి నా బుర్ర పాడు చేస్తోంది. పొద్దున్న ఊలు సామాను కొనుక్కు రమ్మని దాన్ని బజారుకు పంపాను. అక్కడ దీనికి మంజరి కనబడి….. సత్తీ, అప్పుడేం జరిగిందో నువ్వే చెప్పు. నువ్విదంతా కల్పించి చెప్పలేదు కదా?

సత్తి:      అమ్మా, అబద్ధమాడితే, నా తల నూరు చెక్కలవ్వాల. నేనెప్పుడూ అబద్ధమాడను. నిన్న నేను కచేరీ చావడి దగ్గరకు పోయేసరికి మంజరి నన్నాపి, దొంగనవ్వు నవ్వుతూ “ఏమే సత్తీ, మీ అమ్మగారి ప్రియుడు ఆ సేనాపతి కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడట కదా?” అని అంది. నేను నమ్మకపోయేసరికి “కావాలంటే క్రిష్ణుడుండే వీధికి వెళ్లి చూడు. అతనింటికి కట్టిన తోరణాలు, అక్కడ మోగే సన్నాయి మేళం, పెళ్లి పాటలూ చూస్తే నీకే నిజం తెలుస్తుంది” అంది.

కోకిల:    మరి నువ్వెళ్ళి చూశావా?

సత్తి:      చూశానమ్మగారూ! అక్కడంతా మంజరి చెప్పినట్టే ఉంది.

కృష్ణుడు:            నాకిప్పుడర్థమైంది. ఆ మంజరి నిన్ను ఆట పట్టించిందే సత్తీ! నువ్వు సరిగ్గా చూసుకోకుండా వచ్చి కోకిల బుర్ర పాడు చేశావు. ఇద్దరూ కలిసి ఒట్టి పుణ్యానికి హైరానా పడ్డారు. ఆ పెళ్లి జరుగుతోంది మా ఇంట్లో కాదు. రాత్రి నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక మా అమ్మ ఏమందంటే, “నాయనా కృష్ణా! నీ స్నేహితుడు మన పక్కింటి రాయుడి గారబ్బాయి చంద్రుడు గాలి తిరుగుళ్ళు కట్టిపెట్టి ఒక మంచి పిల్లను చూసి బుద్ధిగా పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వింకా ఎంత కాలం అలా ఆ సిగ్గులేని వేశ్యల కొంపల చుట్టూ తిరుగుతావు?” అని అంది.

మా అమ్మ మాటల్ని నేను పట్టించుకోలేదు. ఈ ముసలోళ్ళకు ఏమీ తెలియదు, గొణగడం తప్ప. నేను వెళ్లి పడు కున్నాను. పొద్దున్నే లేచి ఇంట్లోంచి బయట పడ్డాను. అప్పటికేమీ హడావిడి లేదు. ఈ సత్తి చూసే టప్పటికి అదంతా ఏర్పాటై ఉంటుంది. ఇప్పటికీ నమ్మకం కుదరకపోతే, సత్తీ, మళ్ళీ ఒకసారి మా ఇంటి వేపు వెళ్లి జాగ్రత్తగా చూసిరా! ఊరికే బజార్లోకి చూడటం కాదు, తోరణాలు ఎవరి ఇంటి ముందున్నాయో చూడు.

కోకిల:    బతికించావు కృష్ణా! నే విన్నదే నిజమైతే, ఉరి పోసుకు చచ్చేదాన్ని.

కృష్ణుడు:            అలా ఎప్పటికీ జరగదు. నేనంత అవివేకిని కాదు. నేను నా ప్రియమైన కోకిలను మరిచిపోగలనా, అందులోనూ తన పొట్టలో నా బిడ్డ పెరుగుతున్నప్పుడు? ఇప్పటికిప్పుడు నీతో పడుకోవాలని ఉంది. పెరిగిన పొట్టతో నువ్వు మరింత అందంగా కన్పిస్తున్నావు. పడగ్గదిలోకి పోదాం పద.

కోకిల:    నేను నీదాన్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనందంగా అనుభవించు. కానీ, బరువు పడకుండా చెయ్యి.

*

 

మీ మాటలు

  1. కులాంతర వివాహాలు/వివాహితుల సమస్యలపై ఒక సంకలనం తీసుకువస్తున్నాం. కావున వ్యాసాలు, కవితలు, కథలు, పాటలు కులాంతర వివాహితుల సమస్యలు-పరిష్కారాలు, కులాంతర వివాహాలను ప్రోత్సాహించేందుకు మీ/మన రచనలు దోహదం చేసేందుకు ఉపయోగపడాలి. కులాంతర, మతాంతర వివాహాం చేసుకున్న వారి వివరాలు, పెండ్లిఫోటోలు పంపించవచ్చు. మీ వ్యాసాలు, కవితలు, కథలు, పాటలు సొంతగా వ్రాసినవై ఉండాలి, ఇప్పటికే ఎక్కడ ప్రింట్‌ అయి ఉండకూడదు, అలా హామీ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫోటో (కలర్‌) జాత చేయాలి. రచన చేసిన రచయిత పేరు, అడ్రస్‌, ఫోన్‌ (సెల్‌) నెంబర్‌, ఇమెయిల్‌ అడ్ర స్‌ వ్రాయాలి. వివరాలకు బి.గంగాధర్‌, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్ర కమిటి, 1-8-538/4, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020, ఫోన్ : +91 9490098902, ఇమెయిల్ : kvsstg@gmail.com, వెబ్ సైట్ : kvsstg.hpage.com/.
    ఇప్పుడే ని గుండె ఆగిపోతుందేమో… mee jaya prakash gunupudi

Leave a Reply to B.Gangadhar Cancel reply

*