ఆమె కవిత

శ్రీకాంత్ కాంటేకర్

తను చెప్తూ ఉంటుంది
నా చెవిలో ఒక గౌర పెట్టి
మాటల ధారను గుండెలోకి ఒంపుతూ
ఈ గొంతు జీరబోతుంది
బరవెక్కుతుంది
తరతరాల మూలాల నుంచి
గట్టిగా బిగించిన గొలుసులు
పట్టి లాగుతున్నప్పుడు
ఆ యెదతడి నన్ను తాకుతూ ఉంటుంది
ఆమె ప్రతిస్పందనైన భాష కూడా పవిత్రమవుతుంది
విపరీతాలు, విరుద్ధాలు చవిచూస్తున్న ప్రకృతి కూడా
ఒకానొక ఉదయం పూట కొండ నుంచి జాలువారు
జలపాతంలోకి దూకి తేటగా గుండెగీతాన్నెదో
సంగీతంలోకి ఒంపుతున్నట్టు ఆమె కవిత్వ సందర్భమవుతుంది
ఆమెదంతా స్వచ్ఛమైన మార్మికత
కానీ, ఎవరికర్థమవుతుంది
తను పాడుతున్న పాటలో
ఏ రహస్య రాగధ్వనులు లేవని
ఏ ముసుగు లేని నీలిరంగు ఆకాశం పాట
తను కండ్ల నుంచి స్రవిస్తున్నదని..!
2
అయినా నేను ద్రవించను
సహానుభూతి చేత
కండ్లలో ఉబికిన కన్నీళ్ల చేత
దుఃఖ తదాత్మ్యంలో
తను చెప్తూ ఉంటే
నేను దారి తప్పిపోతాను
చరిత్ర పురాస్మృతుల్లోకి
తను వేసిన అడుగులు
నా గుండె ముండ్లపై కస్సున దిగుతాయి
ఆ రక్తం నా కండ్లలోంచి ఒలుకుతుంది
తన మాటల లోతుల లోయల్లో
ఈ ఆధారం అందక గత మూలాల్లోకి విసిరేయబడతాను
“నేనిక్కడ రాయిగా మారానని చెప్తావు
నేనిక్కడ ఈ గీత ఇవతలే
ఎవరి పరిహాసానికి కారణం కాదంటావు
నేనిక్కడ ఈ జూదానికి
నిండుకొలువులో సాక్షిని కాదంటావు”
నిన్ను తాకి ఆడది చేసిన
బండరాతి ముద్రలు ఇవేనని
దుఃఖంలో నదిగా చీలి
ఆ బండరాయి చుట్టూ ప్రవహిస్తావు
గుండెలపై దొర్లిన ద్రోహదృశ్యమేదో..!
నువ్ బడిపిల్లలా అమాయకంగా
ప్యాడు, పెన్ను పట్టుకొని
నిత్యం అగ్నిపరీక్ష సిద్ధమవుతూ కనిపిస్తావు
ఎముక ములుగులో పదిలంగా బిగించిన సంకెళ్లు
తెంపలేక నువ్ గిలగిల కొట్టుకుంటావ్
” ఆ ఊచల నుంచి బైటకురాలేక
నిస్సహాయ రక్తకన్నీటి దృశ్యమొక్కటి..”
నువ్ కవిత చదవడం అయిపోతుంది
నెత్తురంటిన చేతులతో నే కరచాలనం చేస్తాను అభినందనగా-
srikanth kantekar

మీ మాటలు

  1. కెక్యూబ్ వర్మ says:

    గుండె తడిని స్పృశిస్తు కరచాలనం చేసారు శ్రీకాంత్. కవిత శీర్షిక ‘నీలిరంగు ఆకాశం పాట’ అని వుంటే ఇంకా బాగుండేది అనిపించింది.

    • srikanth says:

      థాంక్యూ సో మచ్ కుమార్ వర్మగారూ..! మీ సూచన చాలా బాగుంది..

  2. బాగుంది మీ స్వచ్ఛమైన మార్మికత

  3. పసునూరి రవీందర్‌ says:

    శ్రీకాంత్‌ గారి కవిత చాలా బాగుంది…ముఖ్యంగా ముగింపు నాకు బాగా నచ్చింది.
    ఇలాంటి యువకవులను ప్రోత్సహిస్తున్న సారంగ సంపాదక వర్గానికి ధన్యవాదాలు…
    -పసునూరి రవీందర్‌

Leave a Reply to srikanth Cancel reply

*