రేల పూల గుండె ఘోష..

        సమ్మెట ఉమాదేవి

 

అమ్మ కథలు తరువాత నేను వెలువరిస్తున్న ఈ రేలపూలు నా రెండవ కధల సంపుటి. దాదాపు ఇందులోని కథాంశాలన్నీ యధార్థాలే. ఇందులోని కమ్లి.. చాంది.. అమ్రు.. కేస్లా..సాల్కీ.. చేర్యా.. తావుర్యా.. దివిలి.. జాలా ఇలా అందరూ వేరెే పేర్లతో నాకు ఏదో ఒక సమయంలో తటస్థపడిన వారే..

చిన్ననాట నాన్న ఉద్యోగరీత్యా..  నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లో కొన్ని ప్రాంతాలలో నివాసమున్నాం.  ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా అడవుల్లో ప్రధమ స్థానంలో వున్న ఖమ్మంజిల్లాలోని చాలా మండలాలు తిరిగాను. నా ఉద్యోగ జీవితం నాకు ఎన్నో అనుభవాలను, అనుభూతులనూ ఇచ్చింది. పిల్లలను వదిలి బడివున్న ప్రాంతంలో వుండడంవల్ల.. బడిపిల్ల్లలు నా పిల్లలు అయ్యారు. వంటరిగా మైళ్ళ కొద్దీ నడిచిన వేళ.. ప్రకృతి నా నేస్తమయ్యింది. ఆకులో ఆకునై అని పాడుకుంటూ సాగిన నా ప్రయాణంలో.. నేను ఎదుర్కున్న ఆటు పోట్లు ఎన్నో.. నేను చూసిన బతుకు పాట్లు ఎన్నెన్నో..

ప్రస్థుతం నేను పని చేస్తున్న టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు, ఆ పరిసర ప్రాంతాలు చాలా అభివృద్ది చెందినవిగానే పరిగణించవచ్చు. కాని మారు మూల ప్రాంతాల్లో  గిరిజనులు నివాసముంటున్న తండా ప్రాంతాల్లో.. అర కొర సౌకర్యాల నడుమ చాలీ చాలీ చాలని ఆదాయంతో కాలం వెళ్ళదీసే వెతల బతుకులను ప్రత్యక్షంగా చూసాను. వాటినన్నింటినీ అక్షరబద్ధం చేయాలనుకున్న నా ప్రయత్నం ఇంత కాలానికి నెరవేరింది.

లాక్షణీకులు చేప్పే ప్రమాణాలలో నా కథలు వుండవచ్చు.. వుండక పోవచ్చు.. ఈ సంపుటిలో తండావాసుల సంస్కృతీ సంప్రదాయాలు, జీవనవిధానం అన్నీ కాచి వడబోసాను అని చెప్పడం లేదు. నా అనుభవంలోకి వచ్చిన సంఘటనలను, నన్ను కదిలించి, నా మనసును తొలిచేసి, నన్ను నన్నుగా నిలువనీయని అంశాలను, నాకు అనువైన పద్దతిలో కథలుగా మలుచుకున్నాను.  ఈ క్రమంలో అవి డాక్యుమెంటరీ రూపాన్ని సంతరించుకున్నవని ఎవరైనా అభిప్రాయ పడితే.. నేను బాధపడను. తండా వాసుల గాధలన్నీఏదో ఒక రూపాన అందరికీ చేరాలన్నదే నా ఉద్దేశ్యం.

uma

కారా మాస్టారితో…సమ్మెట ఉమాదేవి

 

నీవు ఎవరి గురించి రాస్తున్నావో వారు ఆ కథలు చదవరు. ఇంక ఎందుకు నీవు ఈ కథలు రాయడం..? ఇంత ఖర్చు పెట్టుకుని ఈ పుస్తకం వేయడం అన్న వారూ చాలా మంది వున్నారు. సమకాలీన పరిస్థితులను అక్షరబద్దం చేసి నిక్షిప్తపరచడం రచయిత విద్యుక్త ధర్మం. నేనూ, నాలాంటి వారెందలో అనునిత్యం విన్న.. కన్న.. అనుభూతించిన విషయాలను మిగతా ప్రపంచానికి తెలియాలంటే.. అవి కథలుగా మలచబడాలి అనుకున్నాను. మనం ఎవరి గురించి రాస్తున్నామో వాళ్ళు ఇవి చదవక పోవచ్చు.. కానీ ఈ సమాజంలో సాటి పౌరులుగా వున్న వారి గురించి తెలుసుకోవాల్సిన, పట్టించుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా వున్నదని నేను నమ్ముతున్నాను.

అలాగని తండావాసుల రాజకీయ, సామాజిక జీవనాల్లో అకస్మాత్తుగా వచ్చిన పెను మార్పుల గురించో.. రావలిసిన విప్లవాల గురించో నేను రాయలేదు. నాది కేవలం ఉపరితల పరిశీలన అయివుండవచ్చు. అందుకే దీని పేరు అగ్నిపూలనో.. మోదుగ  పూలనో కాకుండా రేలపూలని పెట్టుకున్నాను. ప్రకృతిలో అత్యంత అందమైన పూలు.. రేలపూలు. ఇంగ్లీష్‌లో గోల్డెన్‌ షవర్‌, కాసియా ఫిస్టుల్లా అంటారు. వన దేవతకు కాసులపేరు వేస్తున్నట్లు రహదారిన.. పూలజల్లులు చల్లుతున్నట్లు వున్న ఈ రేలపూలు అడవికే అంకితమై పోతున్నాయి. జనం వాటిని పెంచి పోషించాలని, వాటిని కాపాడుకోవాలని నా తాపత్రయం.

ఈ కధలు.. మీలో తండావాసుల గురించిన ఆలోచనలకు తావిస్తే..మీ  మనసు పొరలను కాస్త కదిలించగలిగితే ..  మీ మదిని ఒకింత అలరించితే…నా ప్రయత్నం ఫలించినట్టే..

(ఈ నెల 25 న హైదరాబాద్ లో “రేలపూలు” ఆవిష్కరణ)

 

మీ మాటలు

 1. ఆర్.దమయంతి. says:

  చాలా సంతోషం ఉమా.
  ఈ శుభ సందర్భంగా నీకు నా హ్రదయ పూర్వక అభినందనలు.
  ఆశీస్సులతో..
  -అక్క.

 2. బి వి లక్ష్మీ నారాయణ says:

  సామాజిక స్పృహ కల్గిన మంచి రచయిత్రిగా గుర్తిపు పొంది….ఆర్ద్రత ప్రధాన రసంతో కథలు అల్లే ఉమాదేవి గారి రెండో కథల సంపుటి వెలువరించడం హర్షణీయం..అభినందనలు శుభాకాంక్షలు

 3. మీరు చెపుతున్న ముత్యాలం పాడు లో 77 నుండి కొంత కాలం మా అన్నగారు గ్రేడ్ 1 తెలుగు పండిట్ గా అని చేసారు నేను ఆ వూళ్ళో చాల రోజులున్నాను ”పొడ పాటి నారాయణ గారనే” మాస్టారు అప్పట్లో వుండేవారు ఈ తరానికి తెలుసో లేదో మరి

మీ మాటలు

*