ఒక హెచ్చరికని జారీ చేసిన కథ…

  ఆర్.దమయంతి

 నిన్ననే చదివాను. ఒక స్త్రీ వైవాహిక విషాద గాధ.

పెళ్ళై, ఐదేళ్ళౌతున్నా, తనకీ, తన భర్తకీ మధ్య ఎలాటి శారీరక సంభంధమూ లేదని చెప్పింది. అంతే కాదు అతనొక గే   (స్వలింగ సంపర్కులు) అని తెలుసుకుని కుమిలిపోయానని, అయినా, ఆశ చంపుకోలేక మార్చుకునే ప్రయత్నం కూడా చేసానని..చివరికి వైఫల్యాన్ని భరించలేక మరణిస్తున్నానని …రాసి వెళ్ళిపోయింది. ఈ లోకం నించి శాశ్వతం గా శలవు తీసుకుని వెళ్ళిపోయింది.

ఆత్మహత్య ఎంత భయంకరమైన నరకమో. అయినా.. వెరవడం లేదు- స్త్రీలు. ఎందుకంటే అంత కన్నా మహానరకం ఇంట్లోనే అనుభవిస్తున్నప్పుడు, … మొగుడు యముడై పీక్కు తింటున్నప్పుడు ..చావొక లెక్కలో పని కాదనుకొనే గట్టి నిర్ణయానికొచ్చేస్తున్నారు.

బ్రతుకొక పీడ గా మారినప్పుడు, క్షణం..క్షణం  అభద్రతా భావాలు ప్రాణాలను నొక్కేస్తున్నప్పుడు ..ఒక్కసారిగా ఊపిరి ఆపేసుకు పోవడమే సరైన చర్య గా డిసైడైపోతున్నారు.

ఒక డాక్టర్..ఒక ఇంజినీర్, ఒక సైంటిస్ట్, ఒక పోలీస్ అధికారి, ఒక అయ్యేఎస్, ఒక లాయర్, ఒక ఫేషన్ డిజైనర్, ఒక టాప్ మోడల్..ఇలా – ఏ స్త్రీ ఆత్మహత్య కథ చూసినా – వెనక దాగిన మూల పురుషుడు ఒక్కడే. వాడు – సహచరుడో, లేదా తాళి కట్టిన సొంత మొగుడో! -అతని మూలం గానే చస్తోంది.

మా ఆడవాళ్ళే అంటారు, అంత చదువుకుని అదేం రోగం?, చావడం? అని గభాల్న అనేస్తారు . అఫ్ కోర్స్! ..ప్రేమ కొద్దీ!

కానీ, చదువు వల్ల మెదడు పెరుగుతుంది కానీ, హృదయాన్ని రాయి చేస్తుందా ఎక్కడైనా!

మోసపోయిన స్త్రీ హృదయ గాయాలకు మందింకా కనిపెట్టలేదు- ఈ ప్రపంచంలో! లేకపోతే ఇన్ని మరణాలెందుకు సంభవిస్తున్నాయీ?

స్త్రీకి ప్రేమించడమొకటే కదూ, తెలిసింది.  మోసగిస్తే, ఆ వంచకుణ్ణి  చంపేయాలని ఆలోచన కూడా రాదు.  తాను మరణించడమే సమంజసమనుకుంటోంది. ఎంత పిచ్చిది?! ఇంత అమాయకత్వమా?

ఎందుకనీ?- ఇంతకంటే మరో మార్గం లేదా? వుంటే, ఎక్కడా?

ఒక సారి పెళ్ళై కాపురానికెళ్ళిన ఆడదాని భవిష్యత్తంతా కట్టుకున్న వాడిచేతిలోకెళ్ళి పడుతోంది. ఒక వేళ ప్రేమ వివాహమే అయినా, పెళ్ళి తర్వాత అతనిలో ఎలాటి మార్పులు చోటు చేసుకుంటాయో, అవి ఎలాటి విపత్కరాలకు దారి తీస్తాయో  ఊహాతీతం. రేపు ఏమౌతుందో అంచనా వేయడం ఎవరి తరమూ కావడం లేదు.

సాయిపద్మ కథ చదివాను. కులాంతర వివాహం చేసుకున్న ఆమె జీవితం అత్తవారింట్లో ఎంత దుర్భర ప్రాయమైందనీ!..  తక్కువ కులపు స్త్రీ అని ఆమెని మాటలతో పొడిచి పొడిచి పెడ్తారు.  ఆమె ఎన్నో సార్లు గర్భస్రావాలు చేయించుకుంటుంది. భర్త శాసనంతో. గృహ హింసలలో ఇదొక విభిన్నమైన పార్శ్వాన్ని చూస్తాం.

Sketch290215932

మొన్ననే కదూ చూసాం టీవిలో. –  ఆడపిల్లను కన్నదనే నెపంతో ఆ ఇల్లాల్ని  ఇంట్లోకి రానీక, గెంటేసాడు ఆ మొగుడు. (అందుకు కారణం తనే అని తెలిసి కూడా..)  ఆమె ఎటుపోవాలో అర్ధం కాక,  అత్తవారింటిముందే  బిడ్డను వొళ్ళో పెట్టుకుని బైఠాయించేసింది.

కట్నం తక్కువైందనో, గర్భం దాల్చడం లేదనో, మగ పిల్లాణ్ణి కన్లేదనో, పక్కింటి వాడితోనో, పాలవాడితోనో మాట్లాడిందనో, సంపాదించడం లేదనో, తనని ‘సుఖపెట్టడం’ రావడం లేదనో..ఏదో ఒక మిష తో- అన్ని యుగాల్లోనూ.. స్త్రీని హిసిస్తునే వున్నాడు మగాడు. ప్రియుడో, సహచరుడో, మొగుడో..ఎవరైనా, స్థాయీ భేదాలే తప్ప, శాడిజం లో  అందరూ సమ ఉజ్జీలే. పెద్ద  తేడా ఏమీ వుండబోవడం లేదు.

హుష్!..రోసి పోతున్నారు స్త్రీలు. సొమ్మసిల్లిపోతున్నారు – ఇలాటి సంఘటనలకు.

చిన్న జీవితం. కోరి కోరి ఇంత పెద్ద నరకం కొని తెచ్చుకోవాలా? అసలు తనకు ఇలాటి పెళ్ళి అవసరమా? మొగుడితో  కలసి కాపురం అనే ముసుగు లో ఇంత తన్నులాట తప్పదా?

ఇలాటి జైలు జీవిత బారిన పడకుండా ఆకాశమే హద్దు గా సంతోషం గా బ్రతకలేదా? ఆంక్షా రహితమైన కాంక్షా పూరిత జీవనాన్ని సాగించడానికి ఎవరికో అభ్యంతరాలుంటే అందుకు తనెందుకు తలొంచాలి?

చలం ప్రశ్నే, మరొకసారి తిరిగి సూటిగా అడిగింది. కాదు నిలదీసింది. ఆమె పేరు – వారిజ.

స్త్రీ  ఎంత విద్యాధికురాలైనా, మరెంత ఆర్ధికంగా ఎదిగినా, హృదయాన్ని పెంచుకోలేని, పెంచుకోనీని ..డామినేషన్ జాతి తో వేగలేక వీగిపోతున్న స్త్రీల కన్నీళ్ళని  చదివిందో, లేక చవి చూసిందో!

అగ్నిలో దగ్ధమౌతున్నప్పటి ఆ అబలల ఆర్తనాదలు విని ఘోషించిందో, శొకించిందో..

వారిజ – తీసుకున్న ఈ నిర్ణయం నన్ను చాలా ఆలోచింపచేసింది .

వివాహ ప్రసక్తి కి సున్నా చుట్టి, ఆమె అమ్మ గా మారేందుకు సిధ్ధమైంది. ఒక పరిపూర్ణ స్త్రీ గా మారే దశ మాతృత్వం. పెళ్లి కి భయపడో, మొగుడికి తలొంచో తన ఉన్నత స్థానాన్ని ఎందుకు వదులుకోవాలనుకుందో ఏమో!… ఆమె పెళ్ళి కాని తల్లి కావాలనుకుంది. అయింది. దట్సాల్. ఆమె లైఫ్. ఆమె చాయిస్.

షాక్ అయ్యే వాళ్ళు  అవుతారు.

వాళ్ళు –

స్త్రీని ఇలా వాడుకుని అలా పారేసే వాళ్ళు, పెళ్ళాన్ని పూచిక పుల్ల లా తీసిపడేసే మగాళ్ళు, కించ పరిచడమే ధ్యేయంగా బ్రతికే భర్తలు, నేను లేకపోతే నీ బ్రతుకు అధ్వాన్నమైపోతుందంటూ ..తమని తాము ఆకాశానికెత్తుకునే ఉత్తుత్తి ధీరులు…’ఆ ఆఫ్ట్రాల్ ఆడది. ఎక్కడికి పోతుందీ? నా వల్ల గర్భం కూడా దాల్చాక అంటూ విర్రవీగే మా రాజులకి మహ చెడ్డ రోజులు వచ్చి పడే రోజులున్నాయంటూ ఒక హెచ్చరిక చేసిన ధీశాలి. కాదు. ఢీశాలి. – వారిజ.

మార్టిన్ అంటాడు. రచయితలు రెండు రకాల వారుంటారట. ఒకరు ఆర్కెటెక్ట్స్. మరొకరు గార్డెనర్స్ అని.

వసంత మొదటి కోవకు చెందిన వారనిపిస్తుంది నాకు.

ఇదే కథాంశంతో కూడిన కథ ఏ ఇతర భాషలోనూ వస్తే …చాలా కలాలు తెలుగులో తర్జుమా చేసి ఇంగ్లీష్ లో రెవ్యూలు రాద్దురేమో!…

సారంగ పత్రిక వారు సాహసించకపోతే, ఈ మెరుపునిక్కడ చూసె అవకాశం వుండేది కాదేమో.

రచయిత్రి  లక్ష్మీ వసంత .పి. రాసిన వారిజ కథ చదవంగానే నాకనిపించింది, ఈమె స్త్రీ ని స్త్రీ హృదయాన్ని విరివిగా చదివి, విస్తృత స్థాయిలో పరిశీలన చేస్తోందని..

నేటి తరం స్త్రీ తీసుకోవాలనుకుంటున్న ఒక కొత్త నిర్ణయానికి నాందిగా వారిజ సృష్టి జరిగిందనీ..ఈ ఆధునిక మహిళ  చేత ఒక ముందడుగు వేయించారనిపిస్తుంది. డైనమిక్ లేడీ!

మీరూ ఆమె బాటలో నడవండంటూ రచయిత్రి ఎవరికీ సందేశాలివ్వలేదు.

మగాళ్లంతా చెడ్డ వాళ్ళంటూ …ముద్ర వేయనూలేదు.

కానీ..ఆడది సాహసిస్తే..ఇంత పనీ చేయగలదు…బ్రతుకంతా మగ పోరు, మగని పీడ లేకుండా హాయిగా గడిపేయగలదూ..అదీ..తన సంతానంతో కలసి కాపురం పెట్టేయగలదు, జాగ్రత్త! అని ఒక హెచ్చరిక అయితే చేసింది.

కొన్ని గుండెలు దడ దడ లాడేలా..!

దటీజ్ వారిజ.

వారిజ 

వారెంట్ లేకుండా  మెదడ్ని అరెస్ట్ చేసిన పాత్ర.

అభినందనలు వసంత! అభినందనలు.

ఒక నూతన కథాంశం తో కూడిన రచనన ను పాఠకులకందించిన సారంగ పత్రికా సంపాదకులకు, సంపాదక వర్గానికి కూడా నా అభినందనలు తెలియచేసుకుంటూ..

damayanthi

*

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. ఆర్.దమయంతి. says:

  నా ఆర్టికల్ పబ్లిష్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఎడిటర్ గారు.
  శుభాభినందనలతో…

 2. దమయంతీ !

  ఎంత బాగా రాసారు ! నా మనసులో రూపు దిద్దుకున్న కథ వెనక ఎన్ని బలమైన కారణాలు ఉన్నాయో ,ఎవరైనా అడిగితే , నేను చెప్పలేను .ఎందుకంటే ఊహ తెలిసిన నాటి నుంచీ నా చుట్టూ జరుగుతున్న గృహ హింస , స్త్రీ అమయకంగా మగ వాడిని నమ్మి మోస పోవడమూ , ఎన్నో ఎన్నెన్నో చూస్తూ ఉన్నాను ..పురుష ద్వేషి న కాలేదు కానీ ,స్త్రీ పక్ష పాతిని మటుకు అయాను ..
  అలా అని నా జీవితం లో ఏనాడూ నేను ఏ వివక్ష ఎదురుకోలెదు ,నలుగురం ఆడపిల్లలం అయినా ,చిన్న ఉద్యోగం అయినా ,అందరినీ ఉన్నత చదువులు చదివించిన మా నాన్న గారి సంస్కారం అంత గొప్పది అని మాకు తెలియదు ,ఒక వయసు వరకూ ,అది సహజమైన విషయం లాగా తీసుకున్నాం .ఐతే చదువు కోసం ,కోరుకున్న వాడిని పెళ్ళి చేసుకోవడం కోసం . ఆడ పిల్లలు చేసే యుద్ధాలు చూసాను …చాలా భావాలు తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను
  చాలా ఎమోషనల్ అయిపోయాను ..దమయంతీ .ఎంత బాగా అర్ధం చేసుకున్నారో నన్ను ..
  ఉత్తగా థాంక్సులు లాంటి పదాలు ..చిన్న పోతాయి ..

  మీ స్నేహితురాలు ఎప్పటికీ

  వసంత లక్ష్మి .

  • ఆర్.దమయంతి. says:

   రైటర్ ఎంత వ్యధ చెంది రాసాడనేది అర్ధమౌతుంది నాకు..
   మనం ఫ్రెండ్స్ మే అయినా ఇక్కడ ఒక రచయిత్రి గానే చూసాను వసూ..
   :-)
   ధన్యవాదాలు..

 3. Sharada Sivapurapu says:

  దమయంతి గారూ మీ రెవ్యూ చాలా బాగుంది. నిజం చెప్పాలంటే నా మనసులో మాట చెప్పారు.

  వసంత లక్ష్మి గారూ ఈ కధ నేను చదివాను. కాని అప్పుడు మీరెవరో నాకు తెలియదు. కాని ఇప్పుడు మీరు నాకు తెలుసు. నిన్న మీతో పరిచయం స్నేహం కుదిరినందుకు సంతోషంగా ఉంది. వారిజ లాంటి వాళ్ళు మాతృస్వామ్యాన్ని తిరిగి స్థాపించగల ధైర్యం ఉన్నవాళ్ళు. అయినా మనం కోరుకునేది స్త్రీ పురుషుడి మీదో, పురుషుడు స్త్రీ మీదో ఆధిపత్యం చేసే సమాజం కాదనుకోండి. కుడోస్ టు యు .

  • ఆర్.దమయంతి. says:

   ధన్యవాదాలు శారద గారు.
   సమాజంలో స్త్రీలపై పెచ్చు మీరుతున్న అనేకానేక దాడులు, హింసలు గనక ఇలా నే కోన సాగితే..స్త్రీ పురుషునికి ఎంత దూరంగా జరగాలో అంత దూరం గానూ జరిగి వెళ్ళిపోతుంది.. ఆ భయం నాలోనూ వుంది. అదే జరిగితే..? అన్న ప్రశ్న కి బదులు ఈ కథ అని నా ఉద్దేశం.
   మరో సారి మీకు నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
   శుభాకాంక్షలతో..

 4. అవును శారద శివపురపు గారూ !

  ఇది ఆధిపత్య పోరు కాదు , మగ వానిని కాదని తల్లిని అయితే ?

  అన్న ఆలోచన తో మొదలయిందీ కథ ..ఎందుకు ? అని నేను కారణాలు రాయదలుచుకోలేదు ..ఆ ఆలోచన వస్తుంది కదా కొందరిలో అన్నా ..అన్నా ధైర్యం తో రాసాను ..నా వెనక ఒక్కరు ఉన్నా చాలు అనుకున్నాను ..ఇద్దరూ , ముగ్గ్గురూ అలా సంఖ్య పెరుగుతోంది ..చాలా సంతోషం

  వసంత లక్ష్మి .

 5. _______ చక్కని సంసారం , అనుకూలుడయిన భర్త , పిల్లలు గల స్త్రీ — అందగాడు , వాక్చాతుర్యంతో ఇతరులను
  ఆకట్టుకోగల తెలివిగలవాడు అయిన పరపురుషుడి వ్యామెహంలో పడి , సంసారాన్ని వదులుకోవడానికి సిధ్ధపడటం.

  _______ పెళ్ళి , తదనంతరం ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా ` సహ జీవనం ‘.

  _______ స్త్రీగా , తనకు మాత్రమే స్వంతమయిన , మాత్రుత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి , అందం ,
  అమాయకత్వం , తెలివితేటలుగల పురుషుడితో తాత్కాలిక లైంగిక సంబంధం.

  _______ తద్వారా పురుషాధిపత్యానికి అడ్డుకట్టవేసి , మాత్రు స్వామ్యాన్ని పునరుధ్ధరించడం.

  మంచి ఆలోచనలు . చక్కటి కథావస్తువులు.

  • manjari lakshmi says:

   ఈ బూర్జువా ఫెమినిస్ట్ రచయతలు చెప్పే చెత్త కథల గురించి రాసే వాళ్ళు ఒక్కరన్నా కనపడతారా, వాళ్ళను 2nd చేద్దాం అని ఎదురు చూస్తున్నాను. చెప్పినవి నాలుగు ముక్కలే అయినా చాలా బాగా రాసారు జయ ప్రకాష్ రాజు గారు. ఘర్షణ వదిలేసి, దొంగ ఎత్తుగడలతో, పలాయనవాదాలతో, పురుషలతో కలిసి ఉండటానికి వ్యతిరేకమని చెపుతూ, వాళ్లకు 6 నెలలకొకసారి లేదా 3 నెలలకొకసారి సహజీవనాల పేరుతొ ఆనందాలను గలిగిస్తూ, మగవాళ్ళను అన్ని బాధ్యతల నుంచి విముక్తి చేస్తున్న ఈ గొప్ప స్త్రీవాద రచయితలను చూస్తే మీకు కూడా ముచ్చట వేస్తోన్నట్లుంది. పైగా ఆ మాతృమూర్తి పిల్లవాణ్ని పెంచే బాధ్యత తల్లి మీద పడేసి(తల్లిని లాలి పాటలు నేర్చుకోమని హింటిచ్చింది కదా వారిజ) మళ్ళా మాతృత్వం పొందాలనుకుంటే టూర్ వేసుకొని బస్సు స్టాప్ ల దగ్గర నిలబడుతుందనుకుంటా మీరు చెప్పిన గుణాలున్నవాడికి వలెయ్యటం కోసం. చాలా బాగుంది.

   • ఆర్.దమయంతి. says:

    మంజరి గారూ!
    మన రమా సుందరి గారు చెప్పినట్టు…
    ఆమెని – పేగులు తెగేలా రేప్ చేసి, ఆ పిదప నగ్న దేహాన్ని కదిలే బస్సులోమ్చి రోడ్డు మీదకి విస్సిరి కొట్టినప్పుడు..
    అయ్యో అనాల్సిన వాళ్ళు..అనక పోగా..ఆమె ధరించిన దుస్తులు అలాంటివి అనే
    వ్యాఖ్యానాలు విన్న ప్పుడే – రాయి కాలేని వాళ్ళల్లో.. నేనూ వున్నాను.
    … ధన్యవాదాలు.

   • జయ ప్రకాశ రాజు గారూ !

    మీ స్పందన తెలియ చేసినందుకు ధన్యవాదాలు .

    మీరు వ్యంగ్యం గా అన్నారో , మెచ్చుకున్నారో నాకు అర్ధం కాలేదు అండీ .

    ఒంటరి తల్లి గా ఎందుకు బ్రతకాలని నిశ్చయించుకుందో నాకూ తెలియదు , తన చుట్టూ ఉన్న పరిస్థితులకి ఆమె అలా నిర్ణయం తీసుకుందేమో , సమాజం గీసిన గీతలు దాటి ,ముందుకు అడుగు వేయడానికీ ఎంతో స్థైర్యం కావాలి .. వారిజ నిర్ణయం ఒక మేలుకొలుపు ఏమో , ఆలోచిద్దాం ..

    వసంత లక్ష్మి .

  • ఆర్.దమయంతి. says:

   భలే కథా వస్తువులు సూచించారు, జయ ప్రకాశ రాజు గారు!
   లేకపోతె ఇవన్నీ అసలెక్కడ జరుగుతున్నాయనీ, మరీ విపరీతం కాకుంటే? కదండీ?
   ‘ఈయన నా తండ్రి’ అంటూ ఆ కుమారుడు ప్రకటిస్తే..రాజభవన్ దద్దరిల్లింది. డిల్లీ లో లొల్లి అయింది. అట్టుడికిన ఈ వార్త తో పండగ చేసుకున్నాయి కొన్ని డైలీస్.
   ఆ వార్తకి ఖండన కోడా జరిగింది. ఆ వెనకే – ఆయనెంతో నిజాయితీగా డి ఎన్ ఏ కి సిద్ధమైతే, ఆటను చెబుతొందంతా అబద్దమనే పుకారూ లేచింది.
   అంతా అయ్యాక శుభమ్ కార్డ్ లా ఆయన ఆమె పాపిటలో సిందూరం వుంచుతూ..ఈవిడ మా ఆవిడే, అతను నా కుమారుడే అని ఒప్పుకోవడం తో శుభం కార్డ్ పడింది. ఇదొక నవల కు సరిపడ ఇతివృత్తమ్.
   ఇమ్తకీ నేనేం చెప్పాలనుకున్నానంటే, ఎంతో ధైర్యంగా కొడుకుని పెంచి పెద్ద
   చేసిన ఆ స్త్రీ మూర్తి ని ఒక సారి జ్ఞాపకం చేసుకోవాలని…
   ఒక స్త్రీకి తల్లి కావాలనే కాంక్ష ఎంత బలమైనదంటే, తానూ కన్య గా వున్నప్పుడే బిడ్డని చూసుకోవాలని కోరుకున్న కుంతి ఒక్కరు చాలు ఉదాహరణకీ?
   ధన్యవాదాలండీ, మీ విలువైన అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్త పరచినందుకు.

  • జయ ప్రకాశ రాజు గారూ !

   మీ స్పందన తెలియ చేసినందుకు ధన్యవాదాలు .

   మీరు వ్యంగ్యం గా అన్నారో , మెచ్చుకున్నారో నాకు అర్ధం కాలేదు అండీ .

   ఒంటరి తల్లి గా ఎందుకు బ్రతకాలని నిశ్చయించుకుందో నాకూ తెలియదు , తన చుట్టూ ఉన్న పరిస్థితులకి ఆమె అలా నిర్ణయం తీసుకుందేమో , సమాజం గీసిన గీతలు దాటి ,ముందుకు అడుగు వేయడానికీ ఎంతో స్థైర్యం కావాలి .. వారిజ నిర్ణయం ఒక మేలుకొలుపు ఏమో , ఆలోచిద్దాం ..

   వసంత లక్ష్మి .

 6. అయ్యో ! ఇవి నేను సూచించిన కథావస్తువులు కావండీ ! మీలాటి రచయితలు వ్రాసిన కథలే ! అవన్నీ విప్లవాత్మక ఆలోచనలు అనిపించి అలా వ్రాశాను. నాకే అలాటి కథావస్తువులు దొరికి వుంటే నేను కూడా పాత తరం రచయితలలో ఒకడిగా వుండేవాడిని. కాని తెలుగువాళ్ళు అద్రుష్టవంతులు.
  కుంతి తాను కన్యగా వున్నపుడే బిడ్డను చూసుకోవాలనుకోలేదండీ ! తనకు మునీశ్వరుడిచ్చిన వరప్రభావంలో నిజమెంతో తెలుసుకోవాలనుకుంది. ఆమె వరప్రభావంతో [?] కర్ణుణ్ణి కన్నా , తనకుతానుగా పెంచలేకపోయింది , లోకానికి భయపడి. కాని బ్రతికినంతకాలం కర్ణుణ్ణి తలుచుకుంటూ , తనకు పెళ్ళయిన తర్వాత , భర్త అనుమతితో , దేవతల వరప్రభావంతో [?] కన్న పిల్లలతో పోల్చుకుంటూ బాధపడిందని , అస్త్రవిన్యాశ ప్రదర్శన సందర్భంలో కర్ణుణ్ణి హేళన చేసినపుడు బాధపడి తనను తాను నిందించుకుందని చదివాను. తను కూడ తండ్రిచాటు బిడ్డ అయినట్లయితే ఇన్ని అవమానాలు భరించాల్సి వచ్చేది కాదుగదా అనుకుని బాధపడింది కూడా. తరువాత కథ అందరకు తెలిసిందే ! ఇది అప్పటి సమాజపు కట్టుబాట్ల వల్ల అలా జరిగింది.
  ప్రస్తుతానికివస్తే , భార్యా పిల్లలు కలవాడిని ప్రేమించి , పిల్లవాడిని కని , అతను పెద్దవాడయిన తర్వాత సమాజానికి భయపడి , కనీసం తన కొడుకుగా ప్రకటిస్తే చాలనీ , తన ఆస్తులలో వాటా కోరననీ బ్రతిమలాడుకుంది. ఆ కొడుకు కూడా సమాజం తనను హీనంగా చూస్తుందని బాధపడ్డాడు. ఇవన్నీ మీడియాలో చదివాము , చూశాము. అలా చాటుగా ప్రేమించి , పిల్లాడిని కని , పెంచలేక మీడియాకు తన గోడు వెళ్ళబోసుకోమని ఎవరు చెప్పారు ? ధైర్యంగా తండ్రి గురించి మాట్లాడకుండా , తను కొడుకును పెంచుకోవచ్చుగా ?
  సమాజం మీరనుకున్న స్థాయికి చేరలేదు కనుక , మనుషుల ఆలోచనలలో మార్పు రాలేదు కనుక , భవిష్యత్తులో తన కొడుకు ఎదుర్కోబోయే అవమానాలకు భయపడింది కాబోలు ! కాదంటారా ?

  • ఆర్.దమయంతి. says:

   ‘అయ్యో ! ఇవి నేను సూచించిన కథావస్తువులు కావండీ ! మీలాటి రచయితలు వ్రాసిన కథలే ! అవన్నీ విప్లవాత్మక ఆలోచనలు అనిపించి అలా వ్రాశాను.’

   * విప్లవాత్మకమైన ఆలోచనలు అని మీరంటుంటే నవ్వొస్తోంది రాజు గారు. ( కాదని మీకూ తెలుసు కాబట్టి.)

   నాకే అలాటి కథావస్తువులు దొరికి వుంటే నేను కూడా పాత తరం రచయితలలో ఒకడిగా వుండేవాడిని. కాని తెలుగువాళ్ళు అద్రుష్టవంతులు.

   *పోనీ ఇప్పుడు కొత్త తరం తో పోటీ పడొచ్చు కదండీ. మన సారంగ పత్రిక వుంది, మిమ్మల్ని ప్రోత్సహించడానికి.
   :-)

   ‘కుంతి తాను కన్యగా వున్నపుడే బిడ్డను చూసుకోవాలనుకోలేదండీ ! తనకు మునీశ్వరుడిచ్చిన వరప్రభావంలో నిజమెంతో తెలుసుకోవాలనుకుంది. ఆమె వరప్రభావంతో [?] కర్ణుణ్ణి కన్నా , తనకుతానుగా పెంచలేకపోయింది , లోకానికి భయపడి.’
   * ఇదీ పాయింట్. ఆ దేవత తో పోల్చుకోవడం కాదు కానీండి..వారిజ కుంతిలా భయపడ దలచుకోలేదు. అదొక వరం గా భావించింది. ఐతే రైటర్ తాను చెప్పదలచుకున్న అంశాన్ని బలోపేతం చేయలేకపోయి వుండొచ్చు. కానీ పాయింట్ అదే.

   ‘.. కాని బ్రతికినంతకాలం కర్ణుణ్ణి తలుచుకుంటూ , తనకు పెళ్ళయిన తర్వాత , భర్త అనుమతితో , దేవతల వరప్రభావంతో [?] కన్న పిల్లలతో పోల్చుకుంటూ బాధపడిందని , అస్త్రవిన్యాశ ప్రదర్శన సందర్భంలో కర్ణుణ్ణి హేళన చేసినపుడు బాధపడి తనను తాను నిందించుకుందని చదివాను.’

   * నాకు తెలీక అడుగుతా, ఎన్నాళ్ళనీ ఇదే కథని తలచుకునీ తలచుకునీ..కుమిలి కుమిలీ పోవాలి స్త్రీలు? అది చూసి, ఎంత గా విర్రవీగాలి మగాళ్ళు?

   ‘తను కూడ తండ్రిచాటు బిడ్డ అయినట్లయితే ఇన్ని అవమానాలు భరించాల్సి వచ్చేది కాదుగదా అనుకుని బాధపడింది కూడా.’
   * అదే ఒళ్ళు మంట మన వారిజకి. తానలా బాధపడే ప్రసక్తి లేని తన దారిలో తాను వెళ్ళాలనుకుంటోందనుకుంటా…

   తరువాత కథ అందరకు తెలిసిందే ! ఇది అప్పటి సమాజపు కట్టుబాట్ల వల్ల అలా జరిగింది.
   * చాలా బాగా చెప్పారు రాజు గారు. అప్పటి సమాజం లో కట్టుబాట్లు అవి. ఈ కాలానికి అన్వయించుకో నఖర్లేదు..అని నేనంటాను.

   ప్రస్తుతానికివస్తే , … అలా చాటుగా ప్రేమించి , పిల్లాడిని కని , పెంచలేక మీడియాకు తన గోడు వెళ్ళబోసుకోమని ఎవరు చెప్పారు ? ధైర్యంగా తండ్రి గురించి మాట్లాడకుండా , తను కొడుకును పెంచుకోవచ్చుగా ?’

   * నేను చాలా చిన్నప్పుడు చూసిన ఒక సినిమా గుర్తొస్తోంది..మీరిలా అంటుంటే.
   ఒక రాజుతో ఆమె రోషం గా శపథం చేస్తుంది. ‘నీ వల్ల నేను గర్భం ధరించి, నీకు తెలీకుండా కని పెంచి పెద్ద చేసి నీ మీద తిరుగుబాటు చేయించకపోతే చూడు..నా పేరు మంగమ్మే కాదు..’ అంటూ..
   నా డైలాగులు అటు ఇటు అయి వుండొచ్చు. కానీ అర్ధ సారం మాత్రం ఇలానే వుంటుంది.
   అప్పట్లోనే ఆడవాళ్ళు..ఇంత రోషం గానూ ఇలానూ వున్నారని చెప్పడం కోసం మీకు గుర్తు చేస్తున్నానంటే.
   అది సినిమా అని మీరనొచ్చు.
   ఇదీ అంతే మరి. ఉత్తి కథేగా. :-)

   ‘సమాజం మీరనుకున్న స్థాయికి చేరలేదు కనుక , మనుషుల ఆలోచనలలో మార్పు రాలేదు కనుక , భవిష్యత్తులో తన కొడుకు ఎదుర్కోబోయే అవమానాలకు భయపడింది కాబోలు ! కాదంటారా ?

   * ఈ పై వాక్యాలు నిత్య సత్యమైనవి రాజు గారు. మార్పు రాలేదు. మనుషుల్లో రాలేదు.
   సమాజంలో ముఖ్యం గా మగవాళ్ళ కంటేనూ ఆడవాల్లె అధిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.
   నా పరిశీలనలో ఏం తేలుతోందంటే…స్త్రీకి ఇద్దరు శత్రువులున్నారు. ఒకరు మగాడు. మరొకరు అతన్ని సమర్ధించే స్త్రీలు. ఇది మాత్రం నిజం.

   జయ ప్రకాశ రాజు గారు!
   మీరు- మంచి మంచి వ్యాసాలు, అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు కూడా రాయగలరు. తప్పకుండా రాయండి.
   శుభాకాంక్షలతో..
   :-)

 7. manjari lakshmi says:

  దమయంతి గారు ఫ్యూడల్ వ్యక్తులను, ఫ్యూడల్ భావాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ విధమైన దొంగ ఎత్తుగడలతో, మోసాలతో బూర్జువా ఫెమినిస్టులు చెప్పే సహజీవనాలను సమర్ధించ కూడదు కదా! మీరు ఉదహరించిన రమాసుందరి గారే ఈ విషయంలో చెప్పిన కొటేషన్ను నేను కూడా ఇక్కడ ఇస్తున్నాను. చదవండి.
  ఇది సారంగలోనే వచ్చిన `mychoice’ అనే దాని మీద ఆమె రాసిన కామెంట్లో ఒక భాగం:
  ” మహిళా స్వేచ్చా, సాధికారిత పట్ల జనంలో, ముఖ్యంగా మహిళల్లో పెరుగుతున్న స్పృహ ఇప్పుడు వాళ్ళకు సరుకుగా మారింది. అయితే అది నిజమైన స్పృహను కలిగిస్తే మళ్ళీ ప్రమాదం. దాన్ని లైంగిక స్వేచ్ఛగా మారిస్తే అంత ప్రమాదం ఉండదు. సాహిత్యంలో కూడా ఈ ట్రెండ్స్ బాగా కనబడుతునాయి. మగవాళ్ళకు అనుకూలమైన స్త్రీల లైంగిక స్వేచ్చకధల్లో వస్తువు అవుతుంది. ఒక కధలో జీవితంలో మోసపోయిన ఒక స్త్రీ ఎలాంటి బంధాలు, బాధ్యతలు లేని శారీరిక సంబంధాలలో ఉండటానికి ఇష్టపడుతుంది. తెలిసీ తెలియక స్త్రీలు కూడా ఇలాంటి కధలు రాస్తున్నారు. గొప్ప ఫెమినిష్టిక్ కధలుగా ఇవి చలామణి అవుతున్నాయి. సాంప్రదాయవాదులు ఒక విధంగా వీటిని వ్యతిరేకిస్తారు. నిజమైన స్త్రీ స్వేచ్చ పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఇంకో రకంగా దీన్ని వ్యతిరేకిస్తారు. ఇద్దరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకటే అనే నిర్ధారణ సరైంది కాదు. ”
  అర్ధనగ్నంగా, శరీరాన్ని expose చేస్తూ బట్టలు వేసుకునేవాళ్లని నేను కూడా విమర్శిస్తాను. ఎందుకంటే అలా బట్టలు వేసుకునే దాని వెనక ఉన్న భావం స్రీలకు సిగ్గుచేటు విషయం. మనం అటువంటి సినిమా తారలను, ad తారలను ఎందుకు విమర్శిస్తున్నామో ఒక సారి గుర్తు చేసుకుంటే దాని వెనక ఉన్న భావం మీకు కూడా అర్ధం అవుతుంది. స్త్రీలు పురుషులను ఆనంద పెట్టె వాళ్ళుగానే, వాళ్ళ శరీరాలు అందుకోసమే ఉన్నాయి అనే భావాన్ని ఈ ఫ్యూడల్, బూర్జువా సమాజాలు అందరి మెదడులోకి ఎక్కించాయి. స్త్రీలు తమ ఆత్మగౌరవాన్ని చూపించుకోవాలంటే నిండుగా బట్టలు కట్టుకోవలసిందే. రంగనాయకమ్మగారు ఒకసారి గద్దర్ గార్ని పైన చొక్కా లేకుండా గొంగళి వేసుకు తిరుగుతున్నారని విమర్శించారు. ఆయన ఆ విమర్శలోని నిజాన్ని తెలుసుకొని అప్పటినించి చొక్కా కూడా వేసుకోవటం మొదలు పెట్టారు. కాబట్టి మొగైనా, ఆడైనా బయట తిరిగేటప్పుడు నిండుగా బట్టలు కట్టుకోవలసిందే. అదే సరైన పద్ధతి నా ప్రకారం. తరువాత మీ ఇష్టం. ఈ నీచమైన, దుర్మార్గమైన సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మనం సొంత ఆత్మ రక్షణ చేసుకుంటూనే, అందరితో కలిసి ఈ సమాజాన్ని మార్చుకోవటానికి, అన్ని విషయాలలో పురుషులతో సమానత్వం కోసం, పురుషాధిపత్యం పై పోరాటం చెయ్యాలి. అంతే కానీ నాకు తెలిసి ఈ దొంగదారులు వెతకటం సరైన పని కాదు.

  • ఆర్.దమయంతి. says:

   మంజరి గారు, మీరు చెబుతోంది వస్త్ర ధారణ గురించి.
   వారిజ గర్భ ధారణ గురించి తీసుకున్న నిర్ణయం దాని వెనక కథ వేరు. తనని తానూ రక్షిమ్చుకుంటూ, సమాజాన్ని మార్చుకుంటూ ముందు కు పోవాలి స్త్రీ.
   బావుంది. నాకూ ఇలా నే సమ్మతం.
   కానీ వారిజ తన అభిమతం మాత్రం ఇదీ అని చెప్పింది. అంతే.

 8. P.Jayaprakasa Raju. says:

  “ఈ నీచమైన, దుర్మార్గమైన సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మనం సొంత ఆత్మ రక్షణ చేసుకుంటూనే, అందరితో కలిసి ఈ సమాజాన్ని మార్చుకోవటానికి, అన్ని విషయాలలో పురుషులతో సమానత్వం కోసం, పురుషాధిపత్యం పై పోరాటం చెయ్యాలి. అంతే కానీ నాకు తెలిసి ఈ దొంగదారులు వెతకటం సరైన పని కాదు.”—– చాలా బాగా చెప్పారండి.

 9. ari sitaramayya says:

  ఈ కథ నాలో ఎలాంటి భావోద్రేకం కలిగించలేదు. వారిజ మీద నాకు సానుభూతి గానీ వ్యతిరేకత గానీ కలగలేదు. కానీ సులభంగా చదివించిన కథ. శివరావు పాత్రను రచయిత్రి చాలా సమర్థవంతంగా చిత్రించారు. వారిజ పాత్రలో జరుగుతున్న సంఘర్షణను కూడా పాఠకులకు అందజెయ్యగలిగినట్లయితే (వారి కామెంట్ చదివితే, అలాంటి ప్రయత్నం చెయ్యాల్సిన అవసరం లేదనుకున్నారు రచయిత్రి) ఇది మంచి కథ అయ్యేది.

  దమయంతి గారు రచయిత్రి భావాన్నీ కథనూ సంపూర్ణంగా అర్థంచేసుకుని పరిచయం రాశారు.

  ఈ కథా వస్తువు తెలుగులో అంతగా కనిపించకపోయినా, మర్ఫీ బ్రౌన్ అనే టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా అమెరికన్ సమాజంలో పెద్ద చర్చ రేపింది (1988-1998).

  • ఆర్.దమయంతి. says:

   ‘వారిజ పాత్రలో జరుగుతున్న సంఘర్షణను కూడా పాఠకులకు అందజెయ్యగలిగినట్లయితే (వారి కామెంట్ చదివితే, అలాంటి ప్రయత్నం చెయ్యాల్సిన అవసరం లేదనుకున్నారు రచయిత్రి) ఇది మంచి కథ అయ్యేది.’
   – నిజం చెప్పారు సీతారామయ్య గారు. కథ లో వారిజ నిర్ణయానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్టున్నారు రైటర్. వారిజ పట్ల మీకు వ్యతిరేకత లేదన్నందుకు ధన్యవాదాలు.

 10. Thirupalu says:

  ఈ కదా వస్తువు కొత్తదేమీ కాదు . నాకు కదా పేరు, రచయితా పేరు గుర్తు లేదు కానీ, పది హేనెల్ల క్రితం ఇలాంటి ఇతీ వృత్తం తో ఒక కధ వచ్చింది. అందు లోని కదా నాయకి ‘ తన చాయిస్ ‘ ఎన్ను కోవడం లో సెక్స్ ను రెండవ పక్షం చేసి, అన్నింటా అతి సమర్డు డైన ( శారీక నిర్మాణం లో, మేదో సంపదలో మేలిమి బంగార మైన ) పురుషున్ని ఎన్నుకొని, అతనితో సంసారం చేయకుమ్డానే ( స్పెర్ం డోనార్) మంచి సంతానాన్ని కనాలని ఆ లక్ష్యాన్ని సాదిస్తుంది. ఇవన్ని మగ వారి మీద ద్వేషం వాళ్ళ చేస్తున్నారనేది తేటతెల్లమే. అదే పెమినిజం అని వీరు తప్పుటడుగు వేస్తుంటారు. ఇవన్నీ వ్యక్తీ గత పాత్రలే, వ్యక్తి వాదాన్ని ప్రోత్సహిస్తున్నావే. సమాజానికి మార్గ ధర్శకమ్గా ఉమ్డ బోరు. సమాజంలో మనుషులన్న తరువాతా స్త్రీలైనా పురుషులైనా సహా జీవనమ్ చేస్తున్నదే సమాజం. ఈ వ్యవస్తలో ఉన్న అనేక లోపాలలో స్త్రీ పురుష సంభందాల లోపం ఒకటి. దాన్ని మాత్రం ప్రత్యేకించి చూడలేమ్. స్త్రీ పురుష సమ్భమ్దాలలో ఉన్న లోపాలని సంస్కరించు కోవటానికి కావలసిన పరిస్తితులను ఇద్దరూ జంటగా పోరాడి మాత్రమే ఏర్పరుచుకోగలరు. ఒకరు వేరొకరితో విడవడి పోయినపుడు అది ఎంత మాత్రం సాధ్య కాదు. ఇలాంటి కధలన్నీ పురు శుల్లో ఉన్న ఆహామకారాన్ని ఏ మాత్రం సంస్కరిమ్చగా పోగా వాళ్ళలో ఉన్న ఆత్మా న్యూనతా భావాన్ని ప్రోత్సాహించి మరింత పురుష ఆహామ్కారాన్ని ప్రోడి చేస్తుంది. స్త్రీ పురుషులను వర్గాలగా విభజించ లేము. ఆ పోరాటాలని పెమినిజానికి అన్వయించడం సరి కాదు. అందుకై స్త్రీల పోరాటాలను కొంచం చేయటం నా ఉద్దేశం కాదు.
  ఫెమినిజం వెర్రి తలలు వేస్తూ ఇలాంటి కదా లు వస్తుంటాయి. వీటి వల్ల స్త్రీ లకు మేలు జరగటం అటుంచి హాని జరగడమే ఎక్కువ. ఓల్గా గారి ‘ స్వేచ్చ’ నవలలోని కధానాయక అలోచనలు కొన్ని ఇక్కడ కనపడతాయి.
  వ్యాస రచయిత్రి ప్రస్తావించిన చాలా సమస్యలు సమాజం లోనె వెతుక్కోగలమ్.

 11. ఆర్.దమయంతి. says:

  సమాజంలో ఇలా జరగవచ్చు అని చెప్పే రైటర్స్ మాట్ల్నన్నిట్నీ …ఇలా తేలికగా కొట్టి పారేయలేమ్.పెళ్ళైన komdari స్త్రీలు అనుభవిస్తున్న నరకాలు చూస్తుంటే, వింటుంటే చాలా మందికి వివాహమంటేనే భయం పట్టుకుంటోమ్ది. మరి ఇలాటి దుస్థితుల్లో ఒక స్త్రీ ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితే కనక వస్తే..వివాహ వ్యవస్థ మాటేమిటీ? అది కల్పించాల్సిన రక్షణ ఏమిటన్నది ఆలోచించాలి. ప్రత్యక్షం గా కాకున్నా, పరోక్షం గా ఇలాటి హెచ్చరికనే ఇస్తుంది వారిజ.

మీ మాటలు

*